కమాను వీధి కథలు - రామదుర్గం మధుసూధనరావు

kamanu veedhikathalu

“పెన్ను ఉండేది ఎందుకు?' ఎవరినైనా ఈ మాట అడిగితే ముఖంపైనే నవ్వుతారు. ఆ మాత్రం తెలిసేది లేదా రాసుకునేకి...అంటారు. అదే మాట నాలాంటోణ్ని అడిగితే ఏమాత్రం ముందూ వెనకా సూసుకోకుండా పొగొట్టుకునేకి అనేస్తారు. ఇనేకి ఇకారంగా ఉన్నా ...నా మటుకు ఇదే నిజం. ఎందుకంటే నా పరిస్థితి అలాంటిది. ఆ పుణ్యాత్ముడు శనేశ్వరసామికి నాపైన ఎంత ప్రేమో గానీ ఎకాఎకిన నా నెత్తిపై కూసొని ఎంత సావు తెచ్చిండాడంటే ...అది ఎంత చెప్పినా తక్కువే! కమాను గేరి చుట్టుపక్కలే కాదు...స్కూలులో ఎవడ్నైనా ...పెన్నులు పోగొట్టుకునే పిలగాడంట యాడుండాడు అని అడిగితే చటుక్కున నా పేరు చెబుతారు. అంత ఫేమస్ అయిపోయిండాను. ఓ వైపు పెన్నులు పోతుండాయనే బాధనా...మరోవైపు కనిపించిన ప్రతివోడూ లే..ఎట్లా పోతాయిరా అవి...అని గుచ్చి గుచ్చి అడుగుతుంటే వళ్లంతా కారం పూసినట్టు కంపరమొచ్చేది. నేనేమన్నా కువ్వాడానికి పోగొట్టుకుంటున్నానా? అవి ఎట్టా పోతాయో తెలిసి ఏడిస్తే...నేన్యాల పోగొట్టుకుంటాను సామీ? అంటూ గట్టిగా అరవాలనిపించేది. కానీ మన టైము...గాచారం బాగాలేదప్పా...నువ్వేమీ మాట్లాడొద్దు అంటూ మనసు తెగ కంట్రోలు చేసేది.

హావన్న పేట స్కూల్లో నాల్గు ముగిసేకి లేదు నాయన నన్ను ఎత్తుకుని పోయి హై స్కూల్లో ఏసేసిండాడు. వేణు,నగేషు, ఆచారి, రాము,భాస్కర్ రెడ్డి, సురేషు వీళ్లంతా అయిదు చదివి ఆరుకొచ్చిండారు. నేను జంపు చేసి వాళ్ల మధ్య కూసునిండాను. హావన్నపేట స్కూలు కంటే సానా పెద్ద స్కూలు...ఆడుకోడానికి పేద్ద గ్రౌండు. ఒక్కసారిగా నాకు స్వేచ్ఛ వచ్చినట్టయింది. ఇన్నాళ్లు కమానులోనే ఎగరాడిన నాకు స్కూలు ఓ పేద్ద ప్రపంచంలా అనిపించింది. రెక్కలు విప్పుకుని స్వేచ్ఛగా ఎగురొచ్చు అనుకున్నా. నా అదృష్టం బాగుండి ఇంటికాడ ఫ్రెండ్సు చాలా మంది ఆ స్కూల్లో చేరుకునిండారు. అంతా బాగానే ఉండేది. నేను వేణు కలిసి వెళ్లేవాళ్లం. అన్నింటికి మించి నాల్గో క్లాసు దాకా పెన్సిల్ తోనే రాసే మా జేబిలో ఆరు నుంచి పెన్ను వచ్చి చేరింది. అదో గొప్ప. బ్లేడుతో పెన్సిల్ చెక్కుకోవడాలు..వేళ్లు తెగిపోవడాలు...తప్పుగా రాసేసి రబ్బరు దొరక్క గోడకున్న సున్నం చూపుడు వేలికి అంటించుకుని దాన్ని బుక్కుపై రుద్దడం లాంటి పనులింక చేయనక్కర్లేదని అనిపించింది. నాన్న మొదటిసారి పాపం నా కోసం ఓ బుజ్జిపెన్ను తెచ్చాడు. అది చాలా ముద్దుగా ఉండేది. పెన్ను చేతికి వచ్చిన ముహూర్తం సరిగా లేదేమో...ఉదయం స్కూలుకి వెళ్లేముందు జేబిలో పెట్టాడా...సాయంత్రం ఇంటికొచ్చి చూసుకుంటే కనిపించలేదు. నాకర్థం కాలేదు. కొత్త పెన్ను...బుజ్జిముండ చూసేకి చాలా బాగుండేది. ఆ పెన్నుతో నా కతే మారిపోతుంది అనుకుంటే...అది కాస్త చేతులు మారింది. ఎవడో కాపు కాసి కొట్టేసిండాడు. ఈ విషయం నాన్నకు చెబితే అంతెత్తున ఎగురుతాడేమోనని చచ్చేంత భయం. కానీ చెప్పక తప్పని పరిస్థితి. ఎట్టాగో ధైర్యం కూడదీసుకుని పెన్ను పోయిందని చెప్పా. ఆయన ఏం మాట్లాడలేదు. కోపం వచ్చిండాదని అనుకోవాలి కదా! కానీ నేను అట్టా కాకుండా హమ్మయ్యా... నాన్నకు చెప్పేసినా ఇంక హాయిగా ఉండొచ్చు అనుకున్నా. మరుసటి రోజు వేణు స్కూలు కోసమని ఇంటికాడ వస్తే అమ్మ చెప్పింది....వీడి పెన్ను పోయిందని. పాపం వాడేమి చేస్తాడు. ఇంట్లో ఓ పాత పెన్ను ఉంటే దాంతో రాయడం మొదలెట్టా.

వారం అయ్యాక నాయన ఇంకో కొత్త పెన్ను తెచ్చిండాడు. ఈసారి నాకు నాల్గు బుద్ధి మాటలు చెప్పి...అట్టా పోగొట్టుకోగూడదు...తెలిసిందా అంటూ ఇచ్చాడు. అదేం ఖర్మో...రెండో రోజే ఆ పెన్నూ పోయింది. ఈసారి నాకు నిజంగా భయమేసింది. ఇదేందిరా సామీ ఇట్టా అయిపోతుండాది. మాటిమాటికీ పెన్లు పోతుంటే ఎవ్రు మాత్రం సయించుకుంటారు. ఇలాంటి ఉపద్రవాలు ఏం వచ్చినా అమ్మకు చెప్పేవాణ్ని. పాపం అమ్మ కూడా కంగారు పడింది. ఏందిరా ఎట్టా పోయింది అని. నాకేం తెలుసే? అంటూ ఎదురుతిరిగా. గుట్టుచప్పుడు కాకుండా కొత్త పెన్ను కొనేకి డబ్బులిచ్చిండాది. రేయ్...జాగ్రత్తరా నాయనా! ఎవుడో వాడు వానికేం పోయేకాలమో నీ ఎంట పడిండాడు...సచ్చినోడు నీ పెన్నులే కావల్సి వచ్చిందా వాడికీ అంటూ కనిపించని ఆ దొంగకి శాపనార్థాలు పెట్టింది. ఈ సారి పెన్ను కాపాడే బాధ్యత వేణుకి అప్పగించింది. మీరు నమ్మరు గానీ సరిగ్గా రెండంటే రెండే రోజులు...పెన్ను మాయమైంది. అప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది ఇంక నాకు శని తిక్కిడి మొదలైందని. పాపం వేణు కూడా బిక్కమొహం వేసుకుని ఏందిరా సామీ ఇట్టా పోతుండాయి. నిక్కరుకేమన్నా బొక్కలుండాయా? సూస్కో మరి అనిండాడు.

ఆ తర్వాత శనీశ్వరుడికి నాతో బోర్ కొట్టిందేమో కొద్ది రోజులు రజా ఇచ్చిండాడు. పాపం వేరేవాణ్ని పట్టుకునిండాడేమో? ఓ రెండు నెలలు బాగా సుకంగా గడిసిండాది. నా దగ్గర రెండు పెన్నులుండేవి. వాటితో రాసేదాని కన్నా రిపేరికే ఎక్కువ టైమయ్యేది. నాకే కాదు. మా ఫ్రెండ్స్ అందరికీ ఇది అలవాటే. మొదటిసారి చేతికి పెన్నులు వచ్చిండాయని కుసీ ఏమో గానీ ప్రతి ఒక్కడి దగ్గర పెన్నులు రిపేరీ చేసే తెలివితేటలుండేవి. ఆదివారం వచ్చిందంటే చాలు. పెన్నులు తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్లకన్నా సీరియస్ గా పెన్నులు రిపేరీ చేసేవాళ్లం. ఆ రోజు చెంబులో నీళ్లు పట్టుకుని కట్టపై కూచొని పెన్ను క్యాపు,నిబ్బు, దాని ఎనకాల ఉన్న ఫీడ్, స్ర్కూ తిప్పి కింద ఇంకు నింపే దాన్ని వేరు చేసి అన్నీ నీళ్లున్న చెంబులో వేసేవాళ్లం. ఆ తర్వాత కేపులో...ఇంకు నింపే గొట్టంలో నీళ్లు పోసేది...గిరగిరా తిప్పి మళ్లీ చెంబులో వేసేది. ఇట్టా ఓ గంట చేసినాంక...ఇంట్లో పాత్రలు తుడిచేందుకు అమ్మ తీసి పెట్టుకున్న పాత గుడ్డలో సగం సర్రున చించి...దాంతో తుడిచేవాళ్లం. గుడ్డని పోగుగా చేసి గొట్టంలో దూర్చి పైకీ కిందికీ సరసరా తిప్పేవాళ్లం. ఆ తర్వాత గొట్టానికి నిబ్బు,ఫీడు పెట్టే చిన్న గొట్టానికి ఉన్న స్ర్కూ త్రెడ్ ను కొబ్బరి నూనెతో అలా రాసేవాళ్లం. ఆ తర్వాతే నిబ్బు దాంట్లో పెట్టాలి. ఇది మొదటి ఘట్టం. ఆ తర్వాత బ్రిల్ ఇంకు సీసా తీసుకుని దాని మూత విప్పి ఆ మూతలో ఇంకు పోసి దాన్ని ఒడుపుగా గొట్టంలో నింపేవాళ్లం. అప్పుడు షర్టుపైనో...చేతికో ఇంకు కచ్చితంగా అంటుకునేది. కొందరు మాత్రం చాలా స్టైలుగా ఇంకు ఫిల్లర్లు వాడేవారు. ఇంక నిబ్బుని ఓ మానాన ఉండనిస్తే ఒట్టు. ఎప్పుడూ దాని కొసపైనే కన్ను. దాన్ని పైకీ కిందికీ వంచి రకరకాలుగా హింసపెట్టేవాళ్లం. ఇదంతా పూర్తయ్యేసరికి మద్దేనం అయ్యేది. పెన్ను పక్కన పెట్టి సోపుతో నురగ వచ్చేలా చేతులు గసగసా రుద్దుకుని కడుక్కొనేవాళ్లం. కానీ చూపుడు వేలు, బొటనవేలికి అంటిన ఇంకు చచ్చినా పోయేది కాదు. సోమవారం స్కూలుకు ఇంకు అంటించుకున్న చేతులతో పోతే గానీ మర్యాద దక్కేది కాదు. పొరపాటున ఇంకు లేదంటే...ఏమలే నిన్న పెన్ను కడుక్కోలేదా అని గాలి తీసేవాళ్లు.

ఓ రోజు సైన్సు క్లాసులో ...సార్ ఈడు ఏడుస్తుండాడు...' అంటూ వేణుగాడు జాన్సార్ తో చెప్పినాడు. నేను వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. పాపం సారుకు ఎక్కడ్లేని కంగారొచ్చేసిండాది. నాకాడ వచ్చి ఏమైందిరా పొట్టోడా...అట్టా ఏడుస్తుండావు' అనేసరికి ఇంకా రాగం పెంచేసిండాను. ఛత్... నోర్మూసుకో. మగోడై ఏడ్చేకి సిగ్గులేదా...ఎమయ్యిండాది చెప్పి ఆ తర్వాత ఏడ్చి చావు' అని ఏక్ దమ్ గదిరించేసరికి చప్పున నోర్మూసేసిండాను. అయితే ఎక్కిళ్లు యాడ పోతాయి. క్లాసంతా ఒక్కసారి గాబరా అయిపోయిండాది. అందరూ నాకాడే సూస్తుండారు. కొంతమందేమో...ఈడు మళ్లీ ఏదో సేస్కొనిండాడు...' అంటూ గుసగుసలాడుకుంటుండారు. పాపం ఇంతలో సారే నిదానంగా కుర్చీలో కూర్చొని...రేయ్ ఈడ రా..' అనగానే అంగా కొసతో కళ్లు తుడ్సుకుంటూ పైకి లేచి పోయాను. నన్ను దగ్గర తీసుకుని ఏమైండాదిరా..' అడిగితే నా పెన్ను పోయిండాది సార్...కొత్త పెన్ను పొద్దున్నే నాయన ఇచ్చిండాడు. ఇది పోయిందంటే నన్ను సంపేస్తాడు...' అంటూ మళ్లీ ఏడ్పు అందుకున్నాను. సారుకి బలే జాలేసింది. ఈ పిలగాడేంద పాపం శనికాటం కాకపోతే ఇట్టా పెన్నులు పోగొట్టుకుంటుండాడే అనుకున్నాడేమో పైకి మాత్రం ఎట్టా పోయిందిరా...రోజూ ఎట్టా పోతుందిరా?' అన్నాడు. నాకేం తెలుసు ఇదే మాట ఇంకో ఆయప్ప అడిగి ఉంటే అనేసేవాణ్ని. కానీ సారు...అదీ జాన్సారు. కోపం వస్తే ఎముక లు ఇరిగేలా కొడతాడు. జాన్సారు అంటేనే అందరికీ ఒకటీ...రెండూ అయిపోతుంటాయి. అట్టాంటిది ఆ రోజు ఏ కళన ఉన్నాడో దగ్గరికి తీసుకుని రేయ్ ఎవడ్రా ఈడి పెన్నులు కొట్టేస్తుండేది...వాడు దొరకాల ఉంటాది అట్టా ఇట్టా కాదు' అనైతే అన్నాడు కానీ ఎవుడో ఎట్టా దొరుకుతాడు? అంతా నా ఖర్మ. ఈ శనేశ్వరుడి రజాలు అయిపోయినట్టుండాయి. మళ్లీ నాకడ వచ్చేసిండాడు. ఇంక నే సచ్చినట్టే అనుకున్నా. చివరికి తన దగ్గర ఉన్న పెన్ను తీసి తీసుకోరా...ఏడ్వొద్దు తెలిసిందా' అంటూ కళ్లు తుడిచి పంపించాడు. క్లాసులో అందరూ నివ్వెరపోయారు. జాన్ సారు ఏంది వీడికి పెన్ను ఇచ్చేది ఏంది? అని. నాకు ఆ క్షణాన జాన్ సారు రణ్మండల ఆంజనేయసామి లెక్కన కనిపించాడు. ఇలాంటోళ్లు ఉండబట్టే నాలోంటోళ్లు ఉండగలుగుతున్నారనిపించింది. అయితే నాకన్నా నా దరిద్రం జెట్ స్పీడుతో పోతుంటే...న వ్వే అదృష్టం యాడ దక్కుతుంది? స్కూలు ముగిశాక కులాసాగా ఇంటికెళుతూ...జేబు చూసుకున్నానా...గుండె ఆగినంత పని అయ్యింది. సారు ఇచ్చిన పెన్ను కనిపించలేదు. ఒక్కసారిగా కడుపులో చేయివేసి దేవినట్టయింది. జీవితంపై విరక్తి పుట్టింది. సంచి అంతా తిరగేసి చూసుకునిండాను. కనిపించలేదు. మళ్లా స్కూలు కాడ పోయి గ్రౌండంతా బూతద్దం వేసి వెదికినట్టు వెదికాను పిచ్చాడిలా. స్కూలు వాచ్ మెన్ ని బతిమాలి లోపలికెళ్లి క్లాసంతా గాలించాను. కనిపిస్తే ఒట్టు. కండ్లల్లో నీళ్లు వస్తుంటే దిగాలుగా ఇంటికి చేరుకునిండాను. ఇంట్లో ఎవరితో ఏం చెప్పుకోవాలో తెలీకుండా ఊర్కే కూచుండి పోయాను. అక్కడికీ అమ్మకు డౌటు వచ్చింది. ఈడు ఒక్కతాన ఊర్కే ఉండే ప్రాణి కాదు...మరి ఎందుకిట్టా ఉన్నాడని. ఏరా జొరమొచ్చిండాదా అని అడిగింది. అమ్మా తల్లీ...నీ కో దండం నన్ను వదిలేయి...జొరం కాదు దరిద్రం వచ్చిండాది అని మనసులో అనుకున్నా...పైకి మాత్రం ఏం లేదు అన్నట్టు తలాడించాను.

మరుసటి రోజు ఈ వార్త గుప్పుమంది. ఇంక సూస్కో నాసామిరంగా...జాన్సారు పెన్ను కూడా ఈడు పోగొట్టిండాడంట అని అందరూ దండోరా చాటిండారు. పక్క క్లాసు పిలకాయలు అదేదో జాతరకొచ్చినట్టు వచ్చి నన్ను చూసి నవ్వుకుంటూ వెళుతుంటే...రేయ్ కొడకల్లారా...యాల అట్టా నవ్వుతుండారు...ఏం పోయే కాలమొచ్చిండాదిరా మీకు అంటూ గొంతు చించుకుని అరవాలనిపించింది. జాన్సారు క్లాసుకు రాగానే అందరూ లేచి నిల్సుండాము. నాకు లోలోపల ఒకటి రెండూ అయిపోతుం డాయి. కానీ మా పిలగాళ్లుండారే...ఆళ్లకి రొవంత కూడా జాలీ దయా లేదు. సారు ఇంకా కూసోనికి లేదు ఒకడు లేచి సార్ అనిండాడు. ఏందిరా అని చూస్తే ...వాడు పెదాలపై నవ్వు ఆపుకొంటూ వాడు మళ్లీ పెన్ను పోగొట్టుకునిండాడు సారు...నిన్న మీరిచ్చిండారే అదే' అన్నాడు. అప్పుడు ఆ సారు నన్ను చూసిండేది నా జన్మలో మర్చిపోలేను. రేయ్...నీ బతుకింతేరా...ఎవ్రూ బాగుసేయలేరు... నాశనం..పో' అన్నట్టు చూసిండాడు. నేను ఏమీ మాట్లాడలేదు. అసలు మాట్లాడేకి ఏముండాది నా గాచారం తప్ప! ఆయన ఇంక చేసేది లేక ఏరా నిజమా...సావు పో' అనేసి పాఠంలో మునిగిపోయిండాడు.

కొన్న పెన్నుల్ని జాగ్రత్తగా వాడుకునేవాళ్ల తీరు వేరు. మేం అలా కాదు. కొన్న రోజు నుంచే దాని రిపేరీ మొదలు. నా చేతుల్లో ఉనన్ని రకాల పెన్నులు మా ఫ్రెండ్సులో ఎవరి వద్ద ఉండేవి కావు. లావు పెన్లు...చిన్న పెన్లు రకరకాలుగా ఉండేవి. ఇంట్లో నా గూట్లో సీసా నిండా నిబ్బులే! ఒకటి తీసి ఇంకోటి వేసేవాణ్ని. కానీ అవి సరిగా రాసి ఏడిస్తేగా! కొన్ని నిబ్బులైతే రాస్తుండగానే పేపరు చినిగిపోయేది. కొన్ని మాత్రమే బాగా రాసేవి. ఇలా రాస్తే...రేయ్ నా పెన్ను చూడ్రా పిండి...పిండి లెక్కన రాస్తుండాది' అని తెగ మురిసిపోయేవాణ్ని. మరి కొన్ని పెన్నులు మా రిపేరీ దెబ్బకు కారిపోతుండేవి. వాటికి పేపరుతో బాండేజీ కట్టి మరీ కేపుకు తిప్పేవాళ్లం. పెన్ను షర్టు జేబులో పెట్టుకుంటే ఇంకు కారి అట్టకట్టి పోయేది. నిక్కరులో పెట్టుకుంటే అక్కడా ఇంకు కారి అట్టకట్టేది. ఇంకు నిక్కరు జేబుకే కాకుండా తొడకు కూడా అంటుకుని మరకగా కనిపించేది. ఏ షర్టు చూసినా...ఏ నిక్కరు జేబు చూసినా ఇంకు మరకలే మరకలు! ఆ నీలి మెరుపులు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతునే ఉంటాయి. మొదట్లో నాన్న మంచి మంచి కంపెనీ పెన్నులు కొనిస్తుండే వాడు. నా దరిద్రం చూశాక చివరికి పావలా పెన్ను కొనివ్వాలన్నా ఆలోచించేవాడు. మరి ఒకటి కాదు రెండు కాదు ఆరు నుంచి ఏడుకు వెళ్లే సరికి అంటే ఏడాదిలో దగ్గదగ్గర 35 నుంచి 40 పెన్నులు పోగొట్టానంటే ఎవరి గుండె మాత్రం చెరువు కాదు. ఈ వ్యవహారంలో తీవ్రంగా నలిగిపోయింది అమ్మే! ఆమెను బెదిరించో సాధించో...డబ్బు లాక్కొని గట్టు వాళ్లంగడి...గురునానక్ అంగడికెళ్లి పెన్నులు కొనేవాణ్ని. నేను అంగళ్లకు వెళ్లగానే వాళ్లు ఎంత ఆదరంగా పలకరించేవాళ్లో! ఏం సామీ పెన్ను కావాలా కొత్తవి వచ్చిండావి తీస్కో అనేవాళ్లు. మరి మనది మామూలు గిరాకీ కాదు కదా!

ఈ వ్యవహారం మొత్తమ్మీద బాగుపడింది ఇద్దరే ఇద్దరు. ఒకటి నా పెన్నులు ఎత్తేసినోడు... రెండు పెన్నులు అమ్మిన అంగళోళ్లు. ఇప్పటికీ ఫ్రెండ్సు కలిస్తే...రేయ్ ఏం మనిషివిరా నాయనా... అన్నేసి పెన్నులు ఎట్టా పోగొట్టుకున్నావో...నీకో దండం పెట్టాలి' అంటుంటారు పెన్నుల వాడకం అంతకంతకూ తగ్గి...కంప్యూటర్ కీబోర్డో..ఫోన్లలో టచ్ కీ పాడుకు బాగా అలవాటుపడిన నవతరానికి ఈ ఇంకు పెన్నుల కత వింతగా ఉండొచ్చు. పెన్ను కోసం ఇన్ని పాట్లా...అవసరమా అనుకోవచ్చు కూడా! అయితే అప్పట్లో మాకు పెన్నే పరబ్రహ్మ స్వరూపం. ఆరో క్లాసులో చేరాలంటే చాలామంది పిలగాళ్లు ఉబలాటపడటానికి ...ఇంక పెన్నులు వాడొచ్చు అన్న కారణం కూడా ప్రధానమైనదే! అలాంటి పెన్నులు పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అవన్నీ తలచుకుంటుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది కానీ...అప్పుడు ఎన్నిసార్లు ఏడ్చినామో! ఇన్ని తిప్పలు పడేది బదులు ఏకంగా మొలతాడుకో... మెడకో ఓ తాడు కట్టుకుని దానికి పెన్ను కట్టుకుంటే ఈ కష్టాలుండేవి కావు కదా అనిపించేది. కానీ వెంటనే థూ ఇదేం ఆలోచనా...ఖైదీలు మెడలో స్లేట్లు వేసుకున్నట్లు...పెన్ను కట్టుకుని మెడకేసుకుంటే ఎంత నామర్దా! దీనికన్నా పోగొట్టుకుని ఏడ్సుకునేదే సుకం కదా అనిపించేది. ఒకటి మాత్రం సత్యం. ఆ స్కూల్లో బాగా చదివో...బాగా ఆటలు ఆడో...బాగా బొమ్మలు వేసో...పాటలు పాడో...పేరు తెచ్చుకున్నోళ్లు సానామంది ఉండారు. కానీ నాలా పెన్నులు పోగొట్టుకుని పేరు తెచ్చుకునేవాళ్లు ఎవరుంటారు నేను తప్పా!!

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు