కమాను వీది కథలు - రామదుర్గం మధుసూధనరావు

kamanu veedhikathalu

“రెండా వక్కాట్లా రెండూ...రెండ్రెండ్ల నాల్గూ...రెండమూళ్లారు..' కమాను కట్టమీద కూర్చొని ముందూ వెనకా ఊగుతూ గాఠిగా ఎక్కాలు వల్లవేస్తున్నాను. ఎక్కాలు చదవడం కన్నా...ముందూ వెనకా ఊగడం చూసి అటు వెళుతున్నఓ పెద్దాయన ఏరా చదువుతున్నావా...డాన్సు చేస్తున్నావా...' అంటుంటే చిరాగ్గా ఆయన దిక్కు చూశా. ఒక్కసారి ఆశ్చర్యమేసింది. ఆయన్ని చూసి కాదు...ఆ ఎనకాలే రఘుని చూసి. వాడు స్టాండు వేసి ఉన్న సైకిలు ముందు కూర్చొని ఏదో చేస్తున్నాడు. ఎప్పుడూ సైకిలే ముట్టేవాడు కాదు కదా! ఉన్నట్టుండి ఏం చేస్తున్నా డబ్బా అని ఆలోచిస్తుంటే...గొంతు అదంతకదే చిన్నదైపోయింది. లోపల్నుంచి అమ్మ రేయ్...ఆపినావేందిరా..' అనగానే మళ్లీ రెండొకాట్ల రెండూ అంటూ గొంతుచించుకుని అరవడం మొదలెట్టా. ఓ పదినిమిషాలు అటూ ఇటూ ఊగుతూ నానా తిప్పలు పడి, ఇరవై ఒకటో ఎక్కం దాకా చదివి సంచి పడేసి రఘు ఇంటికాడ చూసినా. వాడు ఓ చేత్తో తుండుగుడ్డ పట్టుకుని ఎనకచక్రం రిమ్ కు ఆనించి...మరో చేత్తో పెడల్ తిప్పాడు. చక్రం సర్రున తిరిగింది. ఇట్లా అయిదారుసార్లు చేసి లేచాడు. సైకిల్ మడ్ గార్డు, హాండిల్ ముందున్న బారు అన్నింటినీ గుడ్డేసి గసగసా తుడిసిండాడు. ఆ తర్వాత స్టాండు తీసి దర్జాగా తోసుకుంటూ మా ఇంటిమీదుగా వెళ్లాడు. వాడు అట్టానే వెళ్లి ఉంటే నాకేం అయ్యేది కాదు. బేకుబేకనే సైకిల్ బెల్ టింగ్ అంటూ కొట్టి...వంకరగా నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్లాడు. నాకు ఒక్కసారిగా వళ్లు బగబగా మండిండాది. ఈడ్యాల నన్ను చూసి నవ్వుతూ పోయిండాడు...ఏంటి కత అంటూ ఆలోచనలో పడిపోయా! మరుసటి రోజూ అదే టయానికి మళ్లీ సైకిలు ముందు తుండుగుడ్డతో రఘుగాడు. సైకిలు తోసుకుంటూ నాకాడ రాగానే టింగ్ అంటూ బెల్ కొట్టిండాడు. లే...సైకిల్ తోస్తే తోసిండావు గానీ...నా కాడ వచ్చి వచ్చి బెల్లు యాల కొడుతుండావురా...' అని అడుగుదామనుకుని ఆగిపోయిండాను. వీణ్ని ఇట్టా కాదు ఎలాగైనా దెబ్బకు దెబ్బతీయాలని బుర్రలో అయిడియా వేసుకున్నాను.

ఆ రోజు సాయంత్రం అయిదుగంటలు...ఇంటి ముందు సైకిలు...సైకిలు ముందు నేను. రఘు సైకిలు ముందు వచ్చే టయానికి ఓ అయిదు నిమిషాలు ముందే తయారై కూసునిండాను. తుండుగుడ్డతో సైకిలు తుడుస్తుం డానా...వాడు వచ్చి నన్ను చూసి అట్టానే నిలుచుండిపోయాడు. అప్పుడు చూడాల వాడి ముఖం. కొద్దిసేపు తర్వాత నేను సైకిలు స్టాండుతీసి తోసుకుంటూ వాడి ముందు వెళ్లాను. అక్కడ నిదానించి టింగ్ అంటూ బెల్ కొట్టి వాడికాడ చూసినాను. వాడు అబ్బో...నీవు కూడానా' అన్నట్టు కనుబొమలు ఎగురవేశాడు. అయితే ఇలా సైకిలు తుడవడానికి...తోసుకుపోవడానికి నేను పడ్డ కష్టం అంతాఇంతా కాదు. రఘు పెద్దసైకిలు కాడ కూచొనింది చూసినప్టి నుంచి నాకు మనసులో మనసులేదు. అమ్మ దగ్గరెళ్లి నేన సైకిలు తుడుస్తాను అని పట్టుబట్టాను. ఎందుకిలా సతాయిస్తున్నాడు...సైకిలేంటి? తుడవడమేంటి? ఆమెకు అస్సలు అర్థం కాలేదు. నీవెందుకురా తుడవడం...అంటుంటే నేనాగలేకపోయాను. నేను తుడుస్తా...అంతే ...ఎలాగైనా నాన్నకు చెప్పు అని పోరుతుంటే అమ్మ తట్టుకోలే...వాడు సైకిలు తుడుస్తానని గొడవ చేస్తున్నాడని చెప్పింది. గొడవా...ఎందుకు తుడవమను' నాన్న పచ్చజెండా ఊపేసరికి నా ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఆ రోజు రాత్రి జాగ్రత్తగా సైకిలు తుడిచే గుడ్డ రెడీ చేసుకున్నాను. కట్ట పక్కన సైకిలు నిలిపితే దాన్ని ఎలా స్టాండు తీయాలి...వాకిలి ముందెలా తీసుకురావాలి... మళ్లీ స్టాండు ఎలా వేయాలో మనసులోనే లక్షసార్లు ప్రాక్టీసు చేసుకున్నాను. మరుసటి రోజు స్కూలుకు వెళ్లానే గానీ సాయంత్రం ఎప్పుడెప్పడు అవుతుందా అని ఒకటే ఆత్రం. అయిదు కాగానే సైకిలు ముందు వాలిపోయాను. రఘు ఇంటి ముందు బెల్ కొట్టేదాకా ఆగితే ఒట్టు. ఈ డ్రామా పది పదహైదు రోజుల దాకా సాగింది.

సైకిలు వ్యవహారానికి సంబంధించి రఘుతో నాకు చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఒకటి తర్వాత ఒకటి అదీ పెద్ద సైకిలుతోనే. నా బతుకంతా వాడిని ఫాలో కావడంతోనే తెల్లారిపోయింది. వాడు సైకిలు తుడిచే పని మొదలెట్టాడని నేనూ సై అన్నానా...వాడు ఉన్నట్టుండి ఓ రోజు హాఫ్ పెడల్ తొక్కుతూ కనిపించాడు. నేను డంగై పోయాను. ఇదేం కర్మ వచ్చిందిరా నాయనా నేన్యాడ తొక్కి చచ్చేది అనిపించింది. అసలు అలా తొక్కాలంటే ఉన్నట్టుండి అయ్యేకి లేదు. వాడూ నేనూ దాదాపు ఒకటే హైటు. కనీసం సైకిలంత ఎత్తు కూడా లేని వీడు ఇలా తొక్కుతుండాడంటే యాడనో సైలెంటుగా నేర్చుకుంటుండాని అర్థమైంది. యాడ తొక్కిండాడో తెలుసుకునేకి చాలా కష్టం పడాల్సి వచ్చింది. చివరికి వాడు హావన్నపేట స్కూలు పక్కన జారుబండలా ఉండే రోడ్డు ఎక్కి తొక్కిండాడని సమాచారం వచ్చిండాది. ఇంక అప్పట్నుంచి నాకు మళ్లీ నిద్ర లేకుండా అయ్యింది. ఈ హాఫ్ పెడల్ తొక్కేది ఎట్టారా సామీ అని బలే బెంగయ్యిండాది. కుడిచేత్తో సీటు పట్టుకుని, ఎడం చేత్తో హ్యాండిల్ పట్టుకుని టక..టక..అంటూ హాఫ్ పెడల్ తొక్కాలి. ఇలా తొక్కాలి అంటే ఎవరుమాత్రం సైకిలు ఇస్తారు?

అసలే నాన్నకు హంబరు సైకిలంటే ప్రాణం. తులం బంగారం కన్నా...హంబరు సైకిలు రేటే ఎక్కువ. దాన్ని ఎవరు ముట్టుకున్నా ఇట్టే కనిపెట్టేసేవాడు. నాకిప్పటికీ ఆశ్చర్యం. అంతలా ఎలా తెలుసుకోవచ్చని. చివరికి బెల్ సౌండు తేడా వచ్చినా ఏరా ...బెల్ ముట్టుకున్నావా' అనేవారు. ఇలాంటి పరిస్థితిలో నాన్నకు తెలీకుండా సైకిలు నేర్చుకోవాలంటే మామూలు విషయం కాదు. అమ్మకూడా చచ్చినా ఒప్పుకోదు. ఏం చేయాలి? సాయంత్రం నాన్న ఇంటిముందు నిలిపితే...తుడిచి తోసేవాణ్ని కదా...ఇంకాస్త ముందుకెళితే సరి అనుకున్నా. ఓ రోజు అలాగే సైకిలు ను మలుపు తిప్పి కమాను దాటించాను. రోడ్డుపై సైకిలు తోసుకెళుతుంటే ఎంత ఆనందమో! హావనపేట స్కూలు జారుబండ రోడ్డు కాడ నానా తిప్పలు పడి సైకిలెక్కాను.

అది అటూఇటూ ఊగుతూ కొంతదూరం వెళ్లాక పక్కన ఉన్న గోడకు కొట్టుకోవడంతో సైకిలుతోపాటు కిందపడిపోయా. మోకాలిచిప్ప, మోచేయి రెండూ బాగా గీరుకుపోయి మంటెత్తింది. ఓ పక్క నొప్పి...అయినా సైకిలుకు ఏమైందో అని భయంతో దాన్ని ఎత్తి చూశాను. అదృష్టం బాగుండి దానికేం కాలేదు. హమ్మయ్యా...రణ్మండల ఆంజనేయసామి నా పక్కన ఉండాడనుకునిండాను. మళ్లీ మెలమెల్లగా దాన్ని తోసుకుంటూ వెళ్లి ఇంటిముందు పెట్టి దొంగపిల్లిలా గప్ చుప్ గా లోపలికెళ్లిపోయాను. ఇంక ఆరోజు మొదలు...ప్రతి దినం అదే పని. గట్టిగా వారంలో హాఫ్ పెడిల్ తొక్కడం వచ్చేసింది.ఇంకేముంది ఓ రోజు దర్జాగా కమానులో హాఫ్ పెడిల్ టక...టక అంటూ తొక్కుతూ రఘుగాడి మొహం చూశాను. వాడు మళ్లీ అబ్బో అన్నట్టుగానే చూసిండాడు. కానీ నాకు లోలోపల మాత్రం మళ్లీ వీడింకేం చేస్తాడో అని పీకుతునే ఉంది. ఇలా రఘుని చూసుకుంటూనే పెద్ద సైకిల్ హాప్ తొక్కడం నేర్చేసుకున్నా. కానీ ఈలోగా వాడు సీటెక్కేశాడు అది వేరే సంగతి అనుకోండి.

ఓ రోజు కమాను పిలగాళ్లందరం కలిసి మునిసిపల్ స్కూలు గ్రౌండుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాం. ఆ స్కూలు కాడ చిన్న సైకిళ్లు అద్దెకిస్తారని తెలిసింది. గంటకు పావల...అరగంటకు పదహైదు పైసలు. అమ్మను బతిమాలి.. పావలా జతచేసుకుని అందరితో గ్రౌండుకెళ్లా. చిన్నసైకిలుపై కూర్చొని తొక్కుతుంటే...మగధ సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తిలా ఒక్కసారిగా గుండె ఉప్పొంగింది. ఆ రోజు గ్రౌండులో ఎన్నిసార్లు గిరగిరా సైకిలు తిప్పిండానో లెక్కనేలేదు. అప్పుడే నాకూ ఓ సైకిలుంటే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. వేసవిలో ఒంటిపూట బడలు...అప్పుడింక మా పంట పండినట్టే! కమాను, చుట్టుపక్కల పిలగాళ్లం చాలా మంది పెద్ద సైకిలుసీటు పైకి ఎక్కి తొక్కేందుకు విశ్వప్రయత్నాలు చేసేవాళ్లం. కాళ్లు అందకపోతే అటూ ఇటూ ఒరిగిపోయి పెడలు అందుకునే వాళ్లం. సైకిలు ఎక్కడానికి, మళ్లీ దిగడానికి అనుకూలంగా రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్నపాటి గోడను గుర్తించుకున్నాం. అక్కడ దాకా హాప్ పెడల్ తొక్కి గోడ రాగానే కాలు దానిపై పెట్టి ఎక్కేవాళ్లం. మళ్లీ రౌండుతిరిగి ఆ గోడ కాడే వచ్చి దిగేవాళ్లం. అయితే ఈ వ్యవహారంలో సైకిలు చక్రం కాస్త బెండు అయ్యింది. నాన్న కనిపెట్టి...సైకిలు ముట్టుకుంటే కాళ్లు విరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. అన్నం లేకున్నా...పీల్చడానికి గాలి లేకున్నా బతికేయొచ్చు. కానీ సైకిలు తొక్కకుండా ఉండాలంటే ఎలా అన్నంతగా సైకిల్ పిచ్చి ముదిరిపోయింది. అందుకే దొంగచాటున సైకిలుతీసుకెళ్లడం మొదలెట్టా. అదే నా కొంపముంచింది.

ఓ సారి సైకిలు పంచరు అయింది. ఇంక చూస్కో నా తిప్పలు అంతింత కాదు. ఎట్టాగో అట్టా హావనపేట స్కూలెదురుగా ఉన్న సైకిలు పంచరు షాపు కాడ తోసుకెళ్లాను. ఆ సాయిబు క్యా...' పానర్ తో సైకిలు కొడుతూ అడిగాడు. క్యా ఏందిరా నాయనా ...నా కత క్లోజ్ అవుతుండాది అనుకుని ...ఎందుకన్నా...టైరు లోపలికెళ్లింది అని అడిగా అమాయకంగా. పంచర్...చారాణా అవుతుంది' అన్నాడు. ఈడ్చి కొడితే పైసా లేదు...ఎక్కడ్నుంచి తేవాలి? పోనీ అమ్మతో గొడవపెట్టుకుని తెచ్చుకుందామా అంటే నాన్న ఇంట్లో ఉన్నాడు అది కుదిరేపని కాదు. ఈ సాయిబునే అడుక్కొందామని డిసైడయ్యా. వాడు దాదాపు అరగంట బతిమాలించుకున్నాక...రేపట్నోగా పైసలివ్వకుంటే ఇంటికి మా పిలగాణ్ని పంపిస్తానని బెదిరించి పని మొదలెట్టాడు. ఉద్దర బేరం కదా ...

నాకూ పనులు పురమాయించేస్తున్నాడు. మాసిన పైజామా...బనియన్..గడ్డం చూసిన ఎవరికైనా నిలువెత్తు నిర్లక్ష్యం ఇలానే ఉంటుందేమో అన్నట్టుంటాడు మా సాయిబు. అయితే పనిలో మాత్రం ఏవన్. అందుకే ఆయప్ప షాపు కాడ ఎప్పుడూ కనీసం నాల్గైదు సైకిళ్లు పంచర్ కేసుతో ఎదురుచూస్తుంటాయి. సాయిబు తెలివితేటలు గురించి రాస్తే కనీసం రెండొందల పేజీల నోట్ బుక్ అంతవుతుంది. ఆయప్ప వచ్చే గిరాకీని బట్టి స్పందించేవాడు. కాస్త కంటికి నదురుగా ఉన్నోడు సైకిలుకు గాలి కొట్టించుకుందామని వస్తే...మొదట గాలికొట్టేవాడు. ఆ తర్వాత స్టాండు వేసి పెడల్ తో గిర్రున తిప్పి...ఏంది సార్...సౌండు జర మిస్టెక్ ఉండాది. చైను లూజు అయినట్టుండాది...చక్రం కూడా బెండు కనిపిస్తుండాది ఈపూటకి ఈడే ఇడిసిపోండి సార్...మొత్తం ఫిట్ చేస్తా అనేవాడు. ఆ గిరాకీ లేదులే అర్జంట్ పని ఉంది బజారుకెళ్లాలి అంటే మీ ఇష్టం సాబ్...ఇలానే వదిలేస్తే పెద్ద రిపేరే వస్తది అప్పుడు కర్చు పెరుగుతాది...

చారాణాకు పోయేదానికి ఆఠాణా దాకా ఆగాలా...అంటుంటే సదరు గిరాకీ తనకు తెలీకుండానే సైకిలు అప్పగించి నటరాజా సర్వీసును నమ్ముకుంటూ అడుగులేస్తూ వెళ్లిపోయేవాడు. అదీ మా సాయిబు తెలివీ అంటే! అరె బాబూ అది తెచ్చి పెట్టు ఈడ జరా...అంటూ నీళ్లున్న తుప్పు పట్టిన బోగోణీ సైకిలు వద్దకు తీసుకురమ్మనేసరికి తేరుకుని తెచ్చి పెట్టాను. ట్యూబుకు గాలికొట్టి నీళ్లలో ముంచి ఎక్కడ బుడగలు వస్తాయో అక్కడ అగ్గిపుల్ల గుచ్చడం మొదలెట్టాడు. ఒకటి తేలింది. రెండోది కూడా ఉందని వాడూ...లేదని నేను. చూపుడు వేలిపై ఉమ్మి పెట్టి దాన్ని ట్యూబుపై రాశాడు. నా అదృష్టం బాగుండి బుడగ రాలేదు.

దీంతో సాయిబూ తగ్గక తప్పలేదు. ఆ తర్వాత అష్ట వంకర్లు తిరిగిన ఓ పేస్టుట్యూబు తీసి దాని నేలపై ఉంచి పానర్ తో గట్టిగా నొక్కాడు...ఎర్రటి పేస్టు బైటికి వచ్చింది. దాన్ని ట్యూబుకు రాసి బిళ్ల అంటించాడు. గాలి కొట్టు అంటూ పంపు చేతికిస్తే ఉఫ్...ఉఫ్ అంటూ పొట్టకు ఆనిచ్చి ఎగిరెగిరి కొట్టసాగాను. సాయిబు అరె...బస్ అని పని పూర్తి చేశాడు. ఈ తతంగం అయ్యేసరికి సాయంత్రం ఆరు అయింది. మెల్లగా తోసుకుంటూ వెళ్లి కట్టముందు పెట్టి ఎప్పట్లాగే లోపలికెళ్లాను. నాన్న బైటకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. హమ్మయ్యా బతికానురా దేవుడా అనుకుంటూ గోడకానుకుని కూలబడ్డాను.

చిన్న సైకిలు కావాలన్న పిచ్చి నానాటికీ ముదిరిపోయింది. నాన్న ఎలాగూ కొనివ్వడన్న విషయం తెలుసు. ఇంక నాకు మిగిలింది తాతయ్య , మావయ్య. ఓ సారి బంధువుల పెళ్లికి గుంతకల్లు వెళ్లాం. తాతయ్య,మావయ్య వచ్చారు. ఎందుకో తెలీదు అక్కడ చిన్న సైకిలు కావాలని గొడవపెట్టుకున్నాను. ఊరు కాని ఊరు సాధ్యపడుతుందా లేదా అన్న తెలివిడి ఉండి చస్తేగా. మావయ్య తప్పకుండా కొనిపిస్తాడని పిచ్చి ఆశ. ఇంక నా ఏడ్పు చూడలేక ఆయన ఓ షాపుకు తీసుకెళ్లాడు. రంగురంగుల చిన్న సైకిళ్లు. వాటిని చూడగానే రెచ్చిపోయాను. ఆయన నీకు ఏది కావాలో సెలెక్టు చేసుకోరా...అనగానే ఓ పది సైకిళ్లు ఎక్కి దిగాను. చివరికి ఓ రంగు బాగుంది అన్నా.

ఒరేయ్ జాగ్రత్తగా చూసుకోరా...మళ్లీ వేరే రంగు వచ్చిందని గొడవపడొద్దు అంటుంటే..ఓర్నాయనో ఇంక నాకు సైకిలు వచ్చేసిందని ఎగిరి గంతులేశాను. అంతా అయ్యాక మావయ్య పదా వెళదాం అన్నాడు. మరి సైకిలో అని అమాయకంగా అడిగితే...సెలెక్టు చేసుకున్నావుగా...ఊర్లో దిగగానే ఉంటుందిలే సరేనా అంటూ సముదాయించి లాక్కొచ్చేశాడు. ఆ తర్వాత చాలా రోజులకు గానీ నాకు అర్థం కాలేదు...నా ఏడ్పు ఆపేందుకే ఈ పని చేశాడని. కానీ విశేషమేంటంటే ...అరే సైకిలు దక్కలేదని దిగులు పెట్టుకోలేదు. పైగా ఆ విషయమే మర్చిపోయా. మళ్లీఆ సాయిబు చిన్న సైకిలు...దొంగచాటుగా నాన్న సైకిలు...ఇలాగే కాలం గడచిపోయింది.

మా జీవితాల్లో సైకిలు ఎంత చైతన్యవం తమైన పాత్ర పోషించిందో తలచుకుంటేనే మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. అప్పట్లో మా సగం వ్యాపకం అంతా సైకిళ్లు బాడుగకిచ్చే అంగళ్ల దగ్గరో...పంచరు వేసే షాపుల వద్దో గడిచిపోయేది. చైను లూజు అయ్యిందనో...రిమ్ బెండు తీయాలనో...హ్యాండిల్ సరిగా తిరగట్లేదనో...ఏదో ఒక రిపేరీ చేయించుకుంటూనే ఉండేవాళ్లం. నావరకు సైకిలు నేర్చుకున్నానంటే దానికి రఘే ప్రధాన కారణం. సైకిలు వస్తే చాలు బస్సు,ట్రాక్టరు కూడా నడపొచ్చురా అనేవాడు.

నేను సైకిలు నేర్చుకునే ప్రతిదశలోనూ వాడే ముందుండే వాడు. సైకిలు చూసినపుడల్లా వాడు కనీసం అరక్షణమైనా గుర్తొస్తాడు. కానీ ఈ ముచ్చట్లు పంచుకునేందుకు వాడు మాత్రం లేడు. అన్నింట్లోనూ ముందుండేవాడు చివరికి మమ్మల్ని వదలీ ముందే వెళ్లిపోయాడు. ఇలా అనుకున్న ప్రతిసారీ ఎందుకో చెప్పలేనంత బాధ గుండెలో గూడుకడుతుంటుంది!!

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు