“అరే..! పిచ్చి డాక్టరూ..! ముచ్చటగా మూడు ఇన్నింగ్స్ పూర్తయి పోయాయి. మాతాజీ మనసేమైనా మారిందా మళ్లీ అదే పాటా..?”
“అనుకున్నాన్రా బాబూ..కనీసం యివ్వాళ పిచ్చి డాక్టరన్నావ్..రేపు డాక్టర్ పిచ్చోడంటావని భయంగా వుందిరా. మీ అమ్మ గారు చెప్పేదంతా శ్రద్దగా వింటారు. ఆహా! అనుకునేంతలో ఆటం బాంబు పేలుస్తారు.”
“అరే అబ్బాయ్ ! నా అరవయ్యో ఏట పుష్కర ఘాటులో మునిగి పోతున్న నన్ను రక్షించిన కొండదొర ..అమ్మా! మీ జీవిత చక్రం సానా గొప్పది.మరో పద్నాలుగు సంవత్సరాలు చీకూ చింతా లేని బతుకు తమది.ఇది నా మాట కాదు తల్లీ..అంబ పలికిన మాట..ఆ జగదంబ పలుకిది. మరో ఆరు నెలల్లో..ఆ గడువూ తీరిపోతుంది. డబ్బై నాలుగు సంవత్సరాలు ఆనందంగా గడిపేసి హాయిగా వెళ్లి పోతాను. అయినా యింకా బ్రతికి ఏం సాధించమంటావ్.? మా వాడితో చెప్పు..ఈ జన్మ కింతే రాసి పెట్టుందని. నీ సమయాన్ని వృధా చేసుకోకు.ఇక మళ్లీ ఈ జన్మలో నీ హాస్పటల్ గడప తొక్కను గాక తొక్కను. “ అక్షరం పొల్లు పోకుండా..చెప్పడం ఇది మూడోసారి.
“సారీరా హర్షా..! ఇవన్నీ నీకూ నాకూ చెపితే వినే వాళ్లం..కానీ ఊరు ఊరంతా..ఇదే టాక్. ఇరుగూ పొరుగూ.. దూరం దగ్గరతేడా లేకుండా బంధుమితృలందరికీ కని పిస్తే పాపం అన్నట్లు కక్కేస్తూ వుంటుంది. చివరకు స్కూలు స్కూలంతా” డెబ్బైనాలుగేళ్ల మామ్మ గారి మనమ” లంటూ బనా యిస్తుంటే పిల్లల్ని స్కూలుకు పంపించడానికి తలప్రాణం తోక కొస్తోంది.అమ్మ ఆరోగ్యంతో బాటు యివి కూడా పెద్ద సమస్యలై పోయాయిరా..అందుకే నిన్నిలా...”
“అదేంట్రా ? విఆర్..క్లోజ్ ఫ్రెండ్స్..నీ కోసం నేనేమీ చెయ్యకూడదా? టేకిటీజీ.”
నన్ను వాడలా కన్సోల్ చేస్తుంటే కళ్లు రెండూ నీళ్లతో నిండి పోయాయి. సైకియాట్రిస్ట్ శ్రీ హర్ష అంటే సిటీలో పేరు మోసిన డాక్టర్.తన అపాయింట్ మెంట్ దొరకాలంటే నెల రోజులముందే పేరు రిజిష్టర్ చేయించు కోవాలి.
“అరే రాజా !.అమ్మ నీకే కాదు..నాకూ అమ్మే..తన సమస్య సైకలాజికల్..కాదనిపిస్తోందిరా. మూడు సిట్టింగ్స్ తో నాకు.. అర్ధమైనంతవరకు..ఇదేదో బలంగా నాటుకు పోయిన మూఢ నమ్మకమనిపిస్తోంది. నమ్మకాలని మార్చగలం కానీ మూఢనమ్మకాల్ని మార్చలేం. ఒకప్పుడు అంటరాని తనం నమ్మకం.బాల్యవిహాలు చేయాలన్నది ..వితంతువివాహం తప్పు అన్నవి కూడా నమ్మకాలే. మరి ఈనాడు..ఆ నమ్మకాలు నిజాలు కావని అర్దంచేసుకున్నారు. మన చిన్నప్పుడు” స్కైలాబ్ “కరీంనగర్ జిల్లాలో పడుతుందని..జిల్లా జిల్ల నాశనమైపోతుందని మూఢంగా నమ్మేసిన ఎడ్యుకేటెడ్ అనెడ్యుకేటెడ్ కూడా అయినకాడికి ఆస్తుల్ని అమ్మేసు కొని ప్రక్క జిల్లాలకు వలస పోయారట. అలాగే ఇప్పటికి కూడా ఎవరూ చూడని దెయ్యాలున్నాయని భయపడుతూ బ్రతి కే వాళ్లు కోకొల్లలు.ఆనాడు తన ప్రాణలు కాపాడింది..కోయదొరేనన్న విశ్వాసం కావచ్చు..అతను చెప్పి నట్లే ఈ పద్నాలుగేళ్ల జీవితం ప్రశాంతంగా గడిచిపోయిందన్ననమ్మకంకావచ్చు.. అతని మాటలు ఆమె మనసులో ముద్రించుకు పోయాయి. అతను చెప్పిన గడువు సమీపిస్తున్న కొలదీ భయం డెవలప్పై.. ఆ మూఢనమ్మకమే పాస్మో ఫోబియాగా... రూపుదాల్చి వుంటుంది . ఫాస్మోఫోబియా లో ఓ” సిమ్టమే..” కనిపించిన ప్రతి వారికీ తన కథ చెప్పడం. అనవసరంగా భయపడి పోవడం. ఆ భయాన్ని దూరం చేసుకోడానికి వారి సానుభూతిని పొందడానికే ఇలా తన నమ్మకాన్ని..దృఢంగా నేరేట్ చేయడం. ఇప్పుడర్ధమైంది.. కొండదొర .. యస్ కొండదొరే ఈ సమస్యకు సొల్యూషన్. అందుకే మనం కూడా ఆమె దారిలోనే. నడుద్దాం.వైజాగ్ లో నా ఫ్రెండు సత్యారావున్నాడు. వాడు ఎప్పుడు కలిసినా కోయదొరల..కహానీలు సరదాగా చెప్తుంటాడు. వాడితో మాట్లాడి నేను ప్లాను చేస్తాను. ఈ విషయం పొరపాటున కూడా లీకవ కూడదు.నీ బెటర్ హాఫ్ తో కూడా షేర్ చేసుకోకు. బి నార్మల్ అండ్ కూల్.”
*** *** ***
దేవీ ! పర్వతరాజ పుత్రీ..శైలజా రాణీ ..శ్రీహర్ష వర్ధనుడు..సకుటుంబ సపరివార సమేతుండై ఈ నాటి మధ్యాహ్నసమయానికి మన మీద లంచ్ యాత్ర..చేయబోతున్నాడని..వాట్స్ యాప్ వేగుల సమాచారం..ఎదుర్కొనుటకు సరిపడా వంటింటి ఆయుధములున్నవా లేక ఔట్ సోర్సింగును అన్వేషించమందువా..?
“ రాజాధిరాజా..రాజ మార్తాండా ! అవన్నియూ మా పరిధి లోనివి. వాటిని మాకొదిలి పెట్టి డ్రాయింగ్ రూమును అందముగా అలంకరించవలసినదిగా..మా ఆజ్ఞ.”
*** *** ***
లంచయిపోయింది.అందరం హాల్లోచేరి..ఇద్దరు చంద్రుల కహానీలు..ఏకైక నరేంద్రువారి సర్జికల్ స్ట్రైకులగురించి చర్చించుకుంటుండగా బయట ఆడుకుంటున్న మా పిల్లలు హఠాత్తుగా వచ్చి
“డాడీ ! ఎవరో కోయదొరంట..అన్నపూర్మమ్మ గ్రానీ గురించి అడుగుతున్నారు.”
“కోయదొరా..? ఇక్కడ అలాంటి పేరున్న గ్రానీ లెవరూ లేరని చెప్పండి. ఒక కోయదొర దెబ్బకే..” విసుక్కుంటన్న నన్ను అమ్మ వారించింది.
“రాజా ! కొండ దొరలగురించి..చులకనగా మాట్లాడకు.వాళ్ల వాక్కులో జగదంబ కొలువుంటుంది. పిల్లలూ మీరెళ్లి ఆడుకోండి..నేను మాట్లాడుతాను.”
బయటికెళ్లిన అమ్మ ఓ కోయదొరను తీసుకుని..వచ్చింది. నడి వయసు మళ్లిన హీరో కొండదొర మేకప్ లో వచ్చినట్లు..వున్నాడు.
“దొరలకూ దొరసానులకూ దండాలు..అన్నపూరణమ్మ తల్లీ.! .ఎండ పడి వచ్చాను ..తమరి చేతులతో మజ్జిగ యిప్పించుతల్లీ.. జరిగిందీ. . జరగబోయేదీ..విశదంగా చెబుతాను.అమ్మమీద ఆన తల్లీ..”
అమ్మ యిచ్చిన మజ్జిగ త్రాగి..ఆ కోయదొర..
“దయగల తల్లివి..నూరేళ్లు ఆయురారోగ్యములతో..సుఖముగా వుంటావు తల్లీ.”
“నాకు అంత బ్రతుకు లేదు దొరా!..పద్నాలుగేళ్ల క్రిందటే విజయవాడ పుష్కరాల్లో ఓ కొండదొర చెప్పారు..నా వయసు డెబ్బై నాలుగని.మరో ఆరునెలల్లో..ఆ గడువూ తీరి పోతుంది.”
“తప్పదు తల్లీ.. ! కొండదొర వాక్కు అంబ వాక్కు. కానైతే నాటి గ్రహ స్తితిని బట్టి ఆ దొర పలికుంటాడు. ఈ పద్నాలుగేల్లలో..గ్రహాల గతులు మారాయి.ఎండాకాలంలో వానలు పడుతున్నాయి..వానా కాలంలో వానలు కురవడంలేదు..వడ గాలులు వీస్తున్నాయి..అలాగే తమరి గ్రహ స్తితులు కూడా..మారే వుంటాయి. బెంగొద్దు తల్లీ..అంబ మీద నమ్మకముంటే ఆ జగదంబ తల్లే తమరి వయసు కాలాన్ని..కల్ల ముందు చూపిస్తుంది.మనసు లో వున్న శంక పోతుంది తల్లీ. “
అమ్మ నావంక చూసిన చూపులో నువ్వేమంటావురా..రాజా? ..అన్న సందేహం కనిపించింది.
“అమ్మా! నీ యిష్టం..ఆ నాడూ కోయదొర మాటలే నమ్మావు..ఈ నాడూ కోయదొరే. చెప్పు దొరా !”
హర్ష వంక చూస్తూ..ఆలోచనలో పడ్డాను. వాడి ముఖం తెలుగు హీరో ఫేస్ లావుంది.
“అమ్మా.! .తమరు స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టు కోవాలి. నాకు పసుపూ..కుంకాలతో బాటు..కొచెం తెల్ల ముగ్గు యివ్వండి.”
అయిదే ఐదు నిమిషాల్లో అంతా ఏర్పాటు చేసేసింది శైలజ. అమ్మ స్నానం చేసి తెల్లని పట్టు చీరలో ప్రత్యక్ష మై పోయింది.ముగ్గుతో వేసిన గుండ్రని డిజైన్ మధ్య తన సంచి లోంచి భద్రంగా ఒక గడియారం లాంటి చక్రాన్ని తీసి పెట్టి అమ్మతో పూజచేయించాడు కొండ దొర.
“అయ్యా ! ఇది..జీవిత చక్రం. గమనించండి .ఇందులో గడియారం లాగే ఫది నుంచి వంద వరకు అంకెలున్నాయి. మధ్యలో ఒక ముల్లు వుంది .దానిని మీరు తిప్పినా నేను తిప్పినా తిరుగు తూనే వుంటుంది. దీని పై బాగాన అంబ విగ్రహ ముంది. ఆ తల్లిని నిష్టగా ఎవరు పూజ చేస్తారో వారు చేతితో తాకితేనే..సరైన సంక్య దగ్గర ఆగి పోతుంది. దొరా తమరు వచ్చి ఆ ముల్లు తిప్పండి.”
నా వంక చూసిన కోయదొర మాటను కాదనలేక చక్రం ముందు కూర్చొని తిప్పాను.దానిలో వున్న ముల్లు నిర్విరామంగా తిరుగుతూనే వుండి పోయింది.తర్వాత హర్షతో తిప్పించాడు. నా భార్య శైలజతో బాటు హర్ష వైఫ్ హర్షిత కూడా ట్రై చేసింది. సేమ్ రిజల్ట్.
“అమ్మా! ఇప్పుడు మీ వంతు. అంబను ధ్యానించుకోండి.మీ కుల దైవాన్ని స్మరించుకోండి.కుడి చేతి వేలితో ఆ ముల్లు తిప్పండి.మీ వయసు కాలాన్ని మీరే వీక్షించండి.”
అమ్మ వచ్చి చక్రం మీదున్న అంబ విగ్రహాన్ని చేతులతో తాకి ..పది అంకె దగ్గరకున్న ముల్లును అతి భక్తి శ్రద్దలతో తిప్పింది. ఆ ముల్లుగుండ్రంగా తిరిగి తొంబై - వంద సంఖ్యల మధ్య స్థిరంగా ఆగిపోయింది. అమ్మ ముఖంలో ఓ వెలుగు తొంగి చూసింది. మా అందరి ముఖాల్లో ఆశ్చర్యం తో బాటు ఆనందం.
.“అమ్మా ! తమరి వయసు తొంబై పై మాటేనని అంబ చెపుతోంది. మీ గ్రహాల గతి అపూర్వం తల్లీ. మీ సందేహాన్ని సమూలనంగా తొలగించుకొండి.మరో రెండు సార్లు ఆ ముల్లును అమ్మను స్మరించుకుంటూ తిప్పండి.” అమ్మ మరో రండుసార్లు తిప్పింది. నో ఛేంజ్. అదే ప్లేసులో మంత్రం వేసినట్లు ఆగి పోయింది.
“ఒక్క నిమేషమునందే జయము భయము నయము విస్మయము కదురా..” అన్నట్లు హాలు హాలంతా సస్పెన్సతో ఘనీభవించి పోయింది. అమ్మ ముఖంలో అనిర్వచనీయమైన ఆనందం. ఫ్రక్కకు తిరిగి కోయదొర పాదాలకు నమస్కరించింది.
“అమ్మా ! అపచారం..అపచారం..తమరు పెద్దవారు..నాకు నమస్కరించ కూడదు.ఇందులో నా ప్రమేయం ఇసుకంత లేదు తల్లీ. అంతా ఆ జగదంబ కరుణ. మీ శేష జీవితాన్ని ఆ తల్లి దయతో హాయిగా గడిపేయండి.నేను తిరిగి మీ జన్మదినానికి..వస్తాను. ఆనాడు కోయదొర నోటితో పలికిన అంబ మాటలు మరిచిపొండి. ఈ నాడు జగదంబ తల్లే స్వయంగా చూపించిన మహిమను స్మరించుకొండి. సెలవు దొరా..సెలవు తల్లులూ..”
మేమంతా ఈ లోకంలోకొచ్చే సరికే వెళ్లి పోయాడు కోయదొర.
*** *** ***
ఆ రోజు మా అమ్మ జన్మ దినం.ఒకవిధంగా చెప్పాలంటే చాలా ఘనంగానే చేస్తున్నట్లే లెక్క.చిరునవ్వుతో వస్తున్న కోయదొరే మాకు స్పషల్ గెస్ట్. చీకూ చింతా లేని అమ్మ వెలిగి పోతున్న ముఖంతో..స్వాగతం పలికింది. లెక్కపెట్టుకుంటున్న మరణ ఘడియల్ని మరిచిపోయి..మరో కొత్త జన్మెత్తినట్లు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న మాతృ మూర్తిని చూస్తున్న ప్రతి క్షణం..గుర్తొచ్చేది కొండదొరే. అతని రుణం ఎలా తీర్చుకోవాలోనన్నఆలోచన రాని క్షణాలు ఈ ఆరునెలల కాలంలో అరుదనే చెప్పాలి. దానికి తోడు “హౌ? ద మిరకిల్ హేజ్ హేపెండ్..” అన్న జిజ్ఞాస.ఈ నాటితో తీరి పోతుందన్న” హోప్” తో నేనూ హర్షా దొరతో రహస్యంగా సమావేశ మయ్యాం. మా అనుమానాన్ని విన్న దొర..
“దొరా ! యిదో చిన్న కనికట్టు.మంత్రాలు లేవు తంత్రాలు లేవు..చిన్న ట్రిక్కు దొరా.! మీ బాసలో చెప్పాలంటే సైన్స్అన్నమాట. “ చిరునవ్వుతో చేప్పాడు. నాకేం అర్ధంకాలేదు. హర్ష ను చూశాను అయోమయంగా. వాడి పరిస్థితీ అలాగే వుందని పించి ..దొరని డైరెక్ట్ గా అడిగేశాను..కాస్త వివరంగా చెప్పమని.
“దొరా.!.ఆ చక్రాన్ని ..ఇత్తడితో చేయించా. ముల్లును బరువైన ఇనుముతో..తయారు చేయించి బేరింగ్ మీద పెట్టించా. ఇదిగో చూడండి దొరా నా కుడి చేతి బొటన వేలికున్నఉంగరానికి అయస్కాంతం పెట్టించా. మీరుతిప్పినప్పుడు నా బొటనవేలు చక్రంమీద వుండదు దొరా. పూజ చేసిన మనిషి తిప్పి నప్పుడే ఏ అంకె చూపించాలంటే ఆ అంకె దగ్గర నా బొటన వేలు వుంటుంది దొరా. పూజ పేరుతో పసుపూ కుంకుములతో నిండి పో యిన నా చేతి వేల్లను ఏం జరగబోతోందోనన్నఆతృతతో ఎవరు గమనించరు దొరా. “ వినగానే ఇంతేనా అని అనిపించినా..దొర సమయస్ఫూర్తికి..పాదాభివందనం..చేసినా తక్కువే అనిపించింది.
మా యిద్దరి ఫేమిలీలతో ఫొటో తీయించి..అమ్మతో పదివేల నూటపదహార్లు దక్షిణ యిప్పించాను.
** *** ***
వైజాగ్ సూర్యా రావు పంపించిన కోయదొర ప్రస్థావన లేకుండా కథ నడిపించిన శ్రీహర్ష..’సైకియాట్రిస్టనే “నిజాన్ని విస్మరించిన నా మట్టి బుర్రను ఎలా షార్ప్ చేసుకోవాలో అర్ధంగాక.. గిరిజ లీవ్ గ్రాంట్ చేస్తే కొంతకాలం కోయదొర దగ్గర శిష్యరికం చేయాలనే కఠోర నిర్ణయాని కొచ్చేశాను. ఈ రాత్రికే అపర్ణ కు పెట్టబోయే లీవ్ అప్లికేషన్ ..”ఇంజూరియస్ టు హెడ్డైతే..” మట్టి బుర్రే బెటరేమో ..ఏమో ?..ముందు కోయదొర నడిగి చూడాలి.