యువరానర్ ...! - పి.బి.రాజు

your honour

"యువరానర్? ఒంట్లో బాగలేక గత నెలలో హాస్పిటల్ కెళ్ళాను. వారు అన్ని టెస్ట్ లు చేసి నాకున్న రోగాల లిస్ట్ ఇచ్చి వెంటనే ఆపరేషన్ చేయకపోతే సచ్చిపోతావని వార్నింగిచ్చారు. యువరానర్!... వారిచ్చిన లిస్ట్ ఒకసారి చదువుతాను వినండి. కిడ్నీ తెబ్బతిందట. లివర్ పాడయిందట. గుండె వీక్ గా వుందట. ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందట. కడుపులో అల్సర్ వుందట. నరాలు దెబ్బ తిన్నాయట. ఇలాగే ఉంటే మెదడు తెబ్బతిని మతిమరుపు వచ్చేస్తుందట. ఇందులో ఏది ముదిరినా ప్రాణం పోవడం ఖాయమట. చూడండి యువరానర్ .ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ నాకే ఉన్నాయి. ఇందుకెవరు కారణం? ఎవరు … యువరానర్ ..?" ఆవేశంగా ప్రశ్నించాడు వీరేశం అలివేలు వైపు సూటిగా చూస్తూ .

"అదండీ! వరస...అయ్యో! నేనేమి చేసేది దేవుడోయ్! నెలరోజులుగా ఇలాగే తనలో తాను గొణుక్కుంటాడండి. అనవసరంగా నాపైన ఒంటి కాలిపై లేస్తాడండి... మీరే ఏదైనా చేసి నా కాపురాన్ని నిలబెట్టండి జడ్జి గారూ!" అలివేలు అమాయకంగా చేతులు జోడించింది.

"అక్కడే నాకు కాలేది? ఎంత అమాయకంగా నటిస్తుందో చూడండి. ఇక దీన్ని ఏమాత్రం భరించలేనండి. నాకు విడాకులి ప్పించేయండి మహా ప్రభో!" ప్రార్థించాడు వీరేశం.

"అలా కారణం లేకుండా విడాకులంటే కుదరదు. ఆమె చేసిన తప్పేంటో నిరూపించాలి. ఆ తప్పేంటో చెప్పండి?" జడ్జి గారు ప్రశ్నించారు. "అదేనండి నా ఖర్మ? నిరూపించాలంటే ఎలా నిరూపించాలి?"

"చూశారా? జడ్జి గారూ! నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు." మండిపడింది అలివేలు.

"అదేం కాదు"

"అయితే నీ భార్యపైన అభియోగం ఏమిటి?"

"......"

"అనుమానమా?"

"చీ..ఛీ..కళ్ళు పోతాయి. నా భార్య అపర పతివ్రత."

"మరి. నువ్వు చెప్పినట్లు నడుచుకోవడంలేదా?"

"ఛ...ఛ...నా మాటంటే వేదవాక్కండి."

"అయితే మరేంటి ప్రాబ్లెం...

"నా భార్య నన్ను చంపేయాలని చూస్తోంది."

"అదేంటి?" అదిరిపడ్డారు జడ్జి గారు .

"అదికూడా...సాక్ష్యాధారాలు లేకుండా ...సైలెంట్ గా!" మెల్లగా చెప్పాడు వీరేశం.

"అదెలా సాధ్యం...నిందితులు ఎంత తెలివి మీరినా ఎక్కడో ఒకచోట దొరికిపోతారు కదా?"

"అదే ఆమె క్రిమినల్ బ్రెయిన్ సార్! ఎవరికి అనుమానం రాకుండా ...స్లో పాయిజనిచ్చి కొంత కాలానికి మట్టుబెట్టేస్తుంది."

"కొంత వివరంగా చెప్పండి"

" మందో మాకో పెట్టికాదు. విషం కలిపి కాదు. కత్తుల్తోనో బాంబుల్తోనో కాదు. సైలెంట్ గా ఎవరికి ఎలాంటి అనుమానమూ రాకుండా తిండిపెట్టే చంపేస్తుంది"

"అదెలా...?"

"గంట గంటకు పాలో; జ్యూసో; బ్రెడ్డో; బిస్కట్టో ...అయ్యబాబోయ్ .. ఎలా చెప్పాలండీ! రోజుకి మూడు పూటలు కాదండి. బాబోయ్ …ఎనిమిది పూటలండి." గజగజ వణకిపోతూ చెప్పుకుపోతున్నాడు వీరేశం.

"అదేనండి. జడ్జిగారూ! అన్నం తింటే ఎవరైనా చచ్చిపోతారా? ఈ వింత ఎవరైనా విన్నారా? వింటే నవ్విపోరా? ...నిక్షేపం లాంటి నా మొగుడికి ఏదో అయింది. …. బాబోయ్. ఓరి దేవుడా! నేనేమి చేసేదిప్పుడు?" ఏడుపు లంకించుకుంది అలివేలు.

అదేనండి, ఆడవారికున్న సౌలభ్యం! మాటకు ముందు ఏడ్చి గగ్గోలు పెట్టేస్తారండి. మొగుడేదో చేసేశాడని సీన్ క్రియేట్ చేసేస్తారండి. బోలెడంత సానుభూతి పొందేస్తారండి. అసలు సమస్య మరుగున పడేస్తారండి."

” ఇంతకీ మీ అసలు సమస్య ఏమిటి?" జడ్జి అడిగారు సీరియస్ గా.

"అదేనండీ! తిండి సమస్య?"

"అంటే మీ భార్య మీకు తిండి పెట్టడం లేదా?"

"అయ్ బాబోయ్ ...మీకలా అర్థమయిందా?"

“డాక్టర్ ఏం చెప్పారో చెప్పండి!నేనెందుకు అంత శ్రద్ధ తీసుకోవలసి వచ్చిందో అదీ చెప్పండి?" అడిగింది అలివేలు.

"ఏమి చెప్పాడేంటి?" వెటకారంగా అన్నాడు వీరేశం.

" అలా రా! దారికి...ఇదిగో జడ్జి గారూ! ఆ మధ్య కళ్ళు తిరిగి పడిపోయాడండి. మరోసారి అలెర్జి వచ్చి చర్మ మంతా ఊడొచ్చేట్లు గోక్కున్నాడండి. ఇంకో సారి కడుపు నొప్పి వచ్చిందండి. మరో సారి తలనొప్పని పని ఎగ్గొట్టాడండి. కాళ్ళు పీకుతున్నాయి అంటాడండి. నరాలు లాగేస్తున్నాయి అంటాడండి. కడుపులో దేవినట్లుందంటాడండి. ఒకటి కాదండి. రోజుకొకటి. వినలేక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళానండి. డాక్టర్ గారికే ఈయనకి ఏ రోగమో అంతుబట్టలేదండి. చివరికి పోషకాహారం క్రమం తప్పకుండా ఇమ్మని ఒక లిస్ట్ ఇచ్చి ఆబ్సర్వేషన్లో పెట్టాడండి.

ఆ లిస్ట్ ప్రకారం - ఉదయం 6 గంటలికి ఒక గ్లాస్ పాలు; ఎనిమిదింటికి మూడు ఇడ్లీలు/ రెండు దోశెలు/బ్రెడ్ జాం;

పదకొడింటికి ఏదైనా పళ్ళ రసం;

ఒంటిగంటకు అన్నం/చఫాతి, రెండు కూరలు; పప్పు, ఆకు కూరలు; తాజా కూరగాయలతో; పెరుగు సాయంత్రం నాలుగు గంటలకి బిస్కట్స్/తాజా పళ్ళ రసం; కాఫీ/టీ రాత్రికి మళ్ళీ మధ్యాహ్నం లాగే. వారానికి రెండు సార్లు నాన్ వెజ్; ఎగ్స్; ఉప్పు; కారం; నూనె; మసాలా; కొవ్వు వస్తువులు తగ్గించాలి. యువరానర్! ఇది డాక్టర్ గారిచ్చిన మెను. భర్త ఆరోగ్యం భార్యకు ముఖ్యమవునా? కాదా? నేను డాక్టర్ చెప్పినట్లు తు.చ. తప్పకుండా ఫాలో అవుతున్నాను. ఎటు తిరిగి భర్తే కదా ప్రత్యక్ష దైవం ఇందులో నేను చేసిన తప్పేంటి?" అమాయకంగా అడిగింది అలివేలు.

"నోట్ దిస్ పాయింట్… యువరానర్! " వీరేశం పాయింట్ లేవదీశాడు.

"ఏ పాయింట్?" సందేహంగా అడిగారు జడ్జిగారు.

"చూశారా! మీరు కూడా బుట్టలో పడిపోయారు?"

అర్థంకాక బుర్రగోక్కున్నారు జడ్జిగారు.

"తన మాటల గారడీతో ఎంతవారినైనా ఇలా పడేస్తుందండి."

కోర్ట్ హాలులో ఘొల్లున నవ్వులు.

"ఆర్డర్...ఆర్డర్..." సుత్తితో బల్లపై కొడుతూ జడ్జి గారు హెచ్చరించారు. హాలులో నిశ్శబ్దం ఆవరించింది. "మీరేం చెప్పదల్చుకున్నారో సూటిగా చెప్పండి"ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జిగారు.

"జడ్జిగారూ! డాక్టర్ రాసిచ్చిన మెనుని కోర్ట్ లో సబ్మిట్ చేయమనండి."

జడ్జి అలివేలు వైపు చూశాడు, సబ్మిట్ చేయమన్నట్టు.

"ఇదేదో కుట్ర జరుగుతోంది. అయినా ఇదిగో తీసుకోండి." ఇచ్చేసింది అలివేలు.

జడ్జి గారు దాన్ని నిశితంగా పరీక్షించి "ఆమె చెప్పిందే ఇందులో ఉంది. మీకేమైనా సందేహమా?" అడిగాడు అతనివైపు చూసి.

"సందేహం ఏమీలేదు జడ్జి గారూ! డాక్టర్ మెను ఇచ్చారు. దాని ప్రకారం ఆమె ఇంతక్రితం కోర్ట్ లో చెప్పినట్లు తు.చ.తప్పకుండా పాటిస్తోంది. ఆ విషయం ఆమె కోర్ట్ లో ఒప్పుకొంది యువరానర్ ! ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఆల్సో. " అన్నాడు.

"ఓ కే నోటెడ్. వాట్ ఈజ్ యువర్ నెక్స్ట్ట్ పాయింట్?" విసుగ్గా అన్నారు జడ్జిగారు.

"నేను చెప్పలా... ఇలా నెల రోజులు నుంచి పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడండి! పిచ్చి ఏమైనా పట్టిందా అని అనుమానంగా వుందండి. లేకుంటే బంగారం లాంటి నా మొగుడు ఇలా అయిపోయాడేంటి చెప్మా!" బోలెడంత ఆశ్చర్యపోయింది అలివేలు.

"యువరానర్! శ్రీమతి అలివేలు గారు నాకు సర్వ్ చేసే ఆహారపదార్థాల్లో విరివిగా పాలు, గ్రుడ్లు, పెరుగు; పప్పులు, ఆకుకూరలు; కూరగాయలు, పండ్లు, బ్రెడ్, జాం; ఐస్ క్రీంస్, నూనెలు ఇస్తున్నట్లు ఆమె ఒప్పుకుంది. కదా… జడ్జిగారూ! "

"అవును. అందులో పాయింటేంటి?"

"చూశారా! నేరాన్ని తనే ఒప్పుకుంది. ఆమెకెంత తెలివున్నా; నా తెలివి ముందు బలాదూర్!" ఎదుటి వ్యక్తిని ట్ర్యాప్ చేసి నిజాన్ని రాబట్టేశానని సంబరపడ్డాడు వీరేశం.

"ఇవంతా విషపూరితాలు … ఆహారంలో హాలాహలం. యువరానర్ !"

"ఏంటీ?" ఉలిక్కిపడ్డారు జడ్జిగారు.

"అవునండి. నేను నిజమే చెబుతున్నాను. వీటన్నిటిలో విషపూరితమయిన రసాయనాలు మిక్స్ చేయబడ్డాయి. ఇవి తింటే స్లో ఫాయిజన్ లా క్రమేణా ఆరోగ్యం దెబ్బతిని క్షీణించి ఎవరికి అనుమానం రాకుండా జీవుడు చచ్చి వూరుకుంటాడు. మనమేమో ఆయుస్సు తీరి చచ్చాడనుకుంటాం. అమ్మో… అమ్మో! ఎంత మోసం...ఎంత మోసం. ఇది నేను కనిపెట్టి బయట పెట్టాను కాబట్టి సరిపోయింది కానీ ...లేకుంటే నా ప్రాణాలు ఏమయ్యేవి? " విస్తుపోయాడు వీరేశం.

" ఆమె తినే పదార్థాల్లో విషం కలిపి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తోందంటావా?" అడిగారు జడ్జిగారు.

"చిత్తం మహాప్రభో!"

"ఏంటమ్మా! దీనికి నీ సమాధానమేమిటి?"

"అయ్ బాబోయ్! చూశారా… చూశారా? ఎంతెంత అభాండాలు వేసేస్తున్నారో? సొంత మొగుడికి ఎవరైనా విషం పెడ్తారా? మీరే చెప్పండి. నాణ్యమయిన తిండి పెట్టాలని నేనెంత శ్రద్ధ తీసుకుంటానో చెప్పమంటారా?"

"చెప్పండి."

"నేనే స్వయంగా షాప్ కి ఎళ్తానండి. దగ్గరుండి బ్రాండెడ్ కంపెనీ ల సరుకులే కొంటానండి. ధర ఎక్కువైనా పాకెట్ ల లో ఉన్నవే కొంటానండి. ఎక్ష్ పైర్ డేట్ చూసి మరీ కొంటాను. షాపు వాళ్ళు మోసం చేయలేరండి. పండ్లు; కూరగాయలయితే ఫ్రెష్ గా ఉన్నవే కొంటాను." అలివేలు చెప్పుకుపోతోంది.

"ఏంటయ్యా! ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్న ఇల్లాలి పైన నిందలేస్తావా?"

"తొందరపడకండి. ఆమె చెప్పేవన్నీ అబద్దాలే."

"నిజమేమిటో చెప్పు"

" అలా అన్నారు బాగుంది. చూడండి. ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుని సరుకులు కొంటోందంటోంది కదా! అయితే బ్రెడ్ లో పొటాషియం బ్రోమేట్ ఎలా వస్తుంది? అయ్యా! ఈ పొటాషియం బ్రోమేట్ వల్ల క్యాన్సర్, థైరాయిడ్; కిడ్ని ప్రాబ్లెంస్ వస్తాయి యువరానర్ ! ఆమె చెప్పే తాజా పండ్లలో కార్బైడ్ ఎలా వస్తుంది? దీని వల్ల నరాలు, జీర్ణ వ్యవస్థ; కాలేయం దెబ్బ తింటాయి. ఇక న్యూడిల్స్ లో సీసం వుంటోంది. కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు అవశేషాలు; ఐస్ క్రీం లో వాషింగ్ పౌడర్… ఇవంతా ఎలా కల్తీ అయ్యాయి. ఎలా? ….ఎలా?...” ఆవేశంతో వూగిపోతూ ప్రశ్నించాడు వీరేశం.

"ఇవంతా మీకెలా తెలుసు? ఆధారాలున్నాయా?" జడ్జ్ గారి ప్రశ్న.

"ఉన్నాయి యువరానర్! ఇవి చదవండి. నిత్యం పేపర్లు కోడై కూస్తున్నాయి. రోజుకో కథనం టీ వీ ల్లో వస్తున్నాయి. అయినా మనలో కదలికల్లేవు. చర్యల్లేవు" అంటూ కొన్ని కాగితాలు; సి డీ లు సమర్పించాడు.

జడ్జ్ గారు వాటిని పరిశీలించి వీరేశం వైపు చూశారు.

“అంతే కాదు యువరానర్! వంటనూనెల్లో కల్తీ; ఉప్పులో కల్తీ; పప్పులో కల్తీ; బియ్యం లో కల్తీ; కూరగాయల్లో ...చివరికి పాలల్లో; గుడ్డ్లల్లో ... ఆఖరికి యువరానర్! ఆఖరికి ….. వీళ్ళ కక్కుర్తి ఎంతగా దిగజారిందంటే... పాల ఉత్పత్తి పెంచడానికి పశువులకు ఇంజెక్షన్స్ యిస్తారు. త్వరగా బరువు పెరగడానికి కోళ్ళకు ఇంజెక్షన్స్ యిస్తారు. ఎక్కువ గుడ్లు పెట్టడానికి ఇంజెక్షన్స్ యిస్తారు....ఇవంతా కృత్రిమంగా. అంతా... అంతా అనారోగ్య హేతువులే. “

"ఇందులో ఆమె తప్పేముంది. బజార్లో దొరికేవేగా తెస్తోంది. పైగా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది కదా! ఏ ఇల్లాలయినా ఇంతకన్నా ఏమి చేయగలదు." జడ్జి ప్రశ్నించారు.

"అదే నేనంటున్నాను. యువరానర్ ! ఏ ఇల్లాలయినా ఇంతకంటే చేయగలిగిందేమీ లేదు. కనుక నా భార్య ఏ తప్పు చేయలేదు. ఏ ఇల్లాలయినా బజార్లో దొరికేవే కొంటారు. అవే వండుతారు. అవే తింటారు. కానీ ఇన్ని అనర్థాలకు తప్పెవరిది యువరానర్!" ప్రశ్నించాడు వీరేశం.

జడ్జి గారి భ్రుకుటి ముడివడింది. ఆసక్తిగా అతడేమంటున్నాడో వింటున్నాడు.

“యువరానర్ ! ఒకడు హత్య చేస్తే వాడొక్కడే శిక్ష అనుభవిస్తాడు. ఇంకెవడైనా నేరం చేస్తే వాడొక్కడే అనుభవిస్తాడు. కానీ ఈ కల్తీ ఆహార పదార్థాల వల్ల యావత్ జాతి శిక్ష అనుభవిస్తోంది. రోజు రోజుకీ ధరలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు కరువొచ్చినా, సునామీ వచ్చినా మార్కెట్ మాయజాల సునామితో నిత్యావసర వస్తువులకు కరువొస్తుంది. జనాలకి చుక్కలు చూపిస్తారు. అంతేసి ధరలు పోసినా నాణ్యమయిన ఆహారపదార్థాలు అందడంలేదంటే ఎవరిది పాపం? డబ్బులిచ్చి రోగాలు కొనుక్కోవడమంటే ఎవరిదీ పాపం? కోటి విద్యలు కూటి కోసమే. ఆ కూడే విష రసాయానాల పాలయి ఒక్కొక్క అంగాన్ని నిశ్శబ్దంగా బలి తీసుకుంటుంటే మనం నిర్లిప్తంగా చూస్తూ వుందామా? ఆరోగ్యం కోసం అన్నం తింటాం. ఆ అన్నమే కలుషితమయి కాలకూట విషంగా మారితే ...? మనకి తెలియకుండానే అన్నం తింటున్నామని విషం మింగుతున్నాం. మనకు తెలియకుండానే ఒక్కొక్క కల్తీకి ఒక్కొక్క అవయవాన్ని బలి చేస్తున్నాం. క్రమేణా దేహాన్ని రోగాల పుట్ట చేస్తున్నాం ఇలాగే కొనసాగితే వచ్చే తరం పుట్టుకుతోనే పేషంట్లయ్యే ప్రమాదం ఉంది. దీనికి కారణం వ్యాపారస్తులందామా? లంచాలకు మరిగిన అధికారులందామా? పట్టించుకోని ప్రభుత్వమందామా?”

కోర్ట్ హాలంతా నిశ్శబ్దంగా వింటోంది. ఆవేశాన్ని ఆపుకుంటూ మళ్ళీ కొనసాగించాడు వీరేశం.

"క్షమించండి జడ్జి గారూ! ఒక ముఖ్యమైన విషయాన్ని కోర్ట్ దృష్టికి తీసుకురావడానికే మా ప్రయత్నం. తత్ ద్వారా యావత్ దేశాన్ని మేలుకొలపాలని మా ఆరాటం. పొంచివున్న ప్రమాదాన్ని గుర్తించి సంబంధించిన వారికి ఆదేశాలిస్తారని మా విన్నపం. సంపాదన ముఖ్యమే కానీ… కక్కుర్తి కూడదు. కొన్ని కొన్ని విషయాల్లో దానికి మించిన సామాజిక బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది…. ప్రత్యేకించి వ్యాపారస్తులకు ప్రజల ఆరోగ్యం విషయంలో! సామాన్య మానవుడు అందరినీ నమ్ముతాడు. వ్యాపారస్తున్ని నమ్ముతాడు. డాక్టర్ని నమ్ముతాడు. పాలవాన్ని నమ్ముతాడు. కూరవాన్ని నమ్ముతాడు. చివరికి కసాయివాన్ని కూడా నమ్ముతాడు. ధరలెంత చెప్పినా నమ్ముతాడు కాయకష్టం చేసి చెమటోడ్చి సంపాదించిందంతా వాళ్ళ చేతుల్లో పెడతాడు. కానీ వాళ్ళేమి చేస్తున్నారు? ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా మార్చేస్తున్నారు. విలువకు తగిన నాణ్యమయిన వస్తువులు కానీ; సేవలు కానీ అందివ్వడం లేదు. అన్నింటిలోనూ అవినీతి...కల్తీ. చివరికివి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేస్తున్నాయి. వాళ్ళ జీవితాల్తో చెడుగుడు ఆడేస్తున్నాయి. ప్రజలు నిస్సహాయంగా అవే వాడేస్తున్నారు. తమకు తెలియకుండానే కల్తీల బారిన పడి; కాలక్రమేణా అంతులేని రోగాలకు బలయి పోతున్నారు. వ్యాపారుల కక్కుర్తి … అత్యాశలతో అసలు మార్కెట్ లో కల్తీ లేని సరుకంటూ దొరకడం లేదు. చివరికి పెద్ద పెద్ద కంపెనీలే అక్రమాలకు పాల్పడుతున్నాయి. కల్తీని అరికట్టవలసిన యంత్రాంగం లంచాల మత్తులో జోగుతోంది. అక్కడక్కడా కేసులు పెట్టినా తాత్కాలికమే! శాశ్వత పరిష్కారానికి మీరేమయినా చేయగలరేమోనని… చిన్న ఆశ? అన్ని వ్యవస్థలు కుప్పకూలినప్పుడు; మత్తులో జోగుతున్నప్పుడు నాలాంటి సామాన్య మానవుడు న్యాయవ్యవస్థ వైపు చూడడం పరిపాటయిపోయింది యువరానర్? తప్పయితే క్షమించండి. ఒప్పయితే ఏదో ఒకటి చేయండి యువరానర్!.... ఏదో ఒకటి చేయండి యువరానర్!” అరుస్తూ కుప్పకూలిపోయాడు వీరేశం.

ఒక సగటు మానవుని ప్రతినిధిగా ప్రశ్నిస్తున్న వీరేశం ఆవేశానికి ముగ్దుడయ్యారు జడ్జ్ గారు. అతడిచ్చిన సాక్ష్యాలలోని నిజాలకి ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పొడిచింది. ఆ నిజాల్ని జీర్ణించుకోవడానికి ఆయనికి కొంత టైం పట్టింది. భవిష్యత్ పై భయమేసింది. యావత్ జాతిపై ఆందోళన కలిగింది.

సాలోచనగా తల పంకించి ఆలోచనలో పడ్డారు జడ్జిగారు.

"చెప్పండి యువరానర్...చెప్పండి?" అరుస్తూనే ఉన్నాడు వీరేశం.

* * *

"ఏమండి! ఏమయింది?" కుదిపి లేపింది భర్తను అలివేలు.

" ఆ …" ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు వీరేశం.

"ఏంటీ? యువరానర్... యువరానర్… అంటూ ఏవేవో గొణుక్కుంటున్నారు. కలేమయినా కన్నారా?" అడిగింది.

"ఇదంతా కలా..." అని మనసులోనే నిట్టూర్చి; కలను ఒకసారి గుర్తుచేసుకున్నాడు వీరేశం.

"తెల్లారడానికి ఇంకా చాలా టైముంది. ఆలోచనలు మాని ప్రశాంతంగా పడుకోండి" అని దుప్పటి సరిగ్గా కప్పింది అలివేలు.

"ఎప్పటికైనా తెల్లవారుతుంది అలివేలూ! చీకటి విడిపోతుంది. అంతవరకు వెయిట్ చేయకతప్పదు… తప్పదు" అనుకుంటూ అటు తిరిగి పడుకున్నాడు వీరేశం.*

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు