అంతులేని కధ! - పార్నంది వేంకట రామ శర్మ,

antulenikatha

“రండి అర్జునరావుగారు! రండి!! ఏమిటిలా వచ్చారు? ఏదైనాపనా మాఆఫీస్ లో?” అనడిగాడు ఆ ఆఫీస్ సూపరింటెండెంట్, తన పక్కనున్న డస్ట్ బిన్లోకి నోట్లో పాన్ ఉమ్మి, తన గారపళ్ళు బయటపడేలా నవ్వుతూ.

“అవునండీ! మా ఇంటిప్లాన్ ఎప్రూవల్ ఎంతవరకొచ్చిందో తెలుసుకుందామనీ” అన్నాడు అర్జునరావు.

“మీ ఇంటిప్లానా! చెప్పలేదేం సార్ ఇంతవరకూ! దీనికి మీరేరావాలా? మీ స్టాఫ్ నెవర్నైనా పంపినాపోయేదిగా? ఎప్పుడుపెట్టారూ? నేనో పదిహేన్రోజులూర్లోలేను మరి.“ అని అంటూనే, ‘ఏయ్! రమణా! సార్ ఇంటి ప్లాన్ ఫైల్ ఇలా పట్రా!’ అని పురమాయించాడు అటెండెంట్ కి. ఆ ఫైల్ వచ్చేలోగా కాఫీ ఆర్డర్ చేసి తెప్పించాడు అర్జునరావు కి.

ఆ మున్సిపల్ఆఫీస్ లో అంతమర్యాద పొందుతున్న అర్జునరావు ఇంకో ప్రభుత్వాఫీసులో బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉన్న ఆఫీసర్. మున్సిపల్ ఆఫీస్ వారు ఆయన ఆఫీస్ కి ఏవో కొన్ని పన్లు మీద రాకపోకలు సాగిస్తుంటారు. అందుకని వారిమధ్య ఉన్న ‘సత్సంబంధాలు’ ఈరోజు అర్జునరావు అంతమర్యాద పొందడానికి కారణం.

అర్జునరావు ఫైల్ చూసి. “మీ పనికదా సార్. అందుకే త్వరగా చేసిపెట్టారు మావాళ్లు. సార్ సంతకానికి రెడీగా ఉంది. మీరు రేపోసారి ఫోన్ చేసి రండి. అప్రూవల్ లెటర్ తీస్కెళ్దురుగాని” అని నవ్వి “మనలో మాట.. మీరు నాకు బాగా క్లోజ్ సార్. అందువల్ల మీదగ్గర్నుండి నేనేం ఆశించనుగానీ, మా మిగతావాళ్ళకి మీతో అంత టచ్ లేదుగా సార్. అంచేత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవో వాళ్ళకుంటాయి. హి! హ్హి!! తమకి తెలియంది కాదు. మామూలుగా మా రేట్ అని కాదుగానీ, ఏదో తమకి తోచినంత రేపొచ్చినప్పుడు ఎరేంజ్ చేస్తే, లెటర్ రెడీచేయించి ఉంచుతాను. పట్టుకుపోదురుగానీ” అని మళ్ళీ తన గారపళ్ళు బయటపెట్టాడు ఆ సూపరింటెండెంట్, మేమెవ్వర్నీ వదలంసుమా అన్నట్టు.

“ఒకే! ష్యూర్. రేపటికి రెడీ చేసుంచాలి మరి.” అన్నాడు దర్పంగా అర్జునరావు.

“ఎంతమాట సార్. ఇది నాపనే అనుకుంటాను. రేపు ఈటైమ్ కి మీరొచ్చి మీ పేపర్స్ తీస్కోవడమే!” అన్నాడు మళ్ళీ గార పళ్లతో. “నీ పనే అయితే మళ్ళీ మామూలెందుకురా నీకు! నీ స్టాఫ్ పేరు చెప్పి, నీవాటా నువ్వు నొక్కేయవా ఏం!? పెద్ద! నాకు ఏమీ తెలియనట్టు“ అననుకుంటూ అతనికి షేక్ హాండిచ్చి బయల్దేరాడు అర్జునరావు.

*********

అర్జునరావు కూడా బాగా “సంపాదించే సీటులోనే ఉన్నాడు. తెల్లారిలేస్తే ఎన్నో పనులమీద జనం ఆ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు. కావాల్సినపనికి అప్లికేషన్ పెట్టినదగ్గరనుండీ, పనిపూర్తయి తీసుకున్న కాగితాలమీద ఆఫీస్ ప్యూన్ ఆఫీస్ సీల్ వేసేవరకు అందరికీ ఏరోజుకారోజు దక్షిణలు సమర్పించుకోందే ఏపనీ జరగదు అక్కడ. సాయంత్రం వాటాల కార్యక్రమంలో తనవంతుఎంతో లెక్కకట్టీ మరీ తీసుకుంటాడు అర్జునరావు. అందుకే అతన్ని పరోక్షంగా “ఆర్జనరావు” అని పిలుస్తారు. ఒకట్రెండు సార్లు ఏసీబీ వాళ్ళ దృష్టి ఇతని మీద పడబోతోందని, అతనేర్పాటు చేసుకున్న నెట్ వర్క్ ద్వారా ఉప్పందడంతో, ముందుజాగ్రత్తగా తన సీట్ నుండి ఇంకో సాధారణసీట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుని, మళ్ళీ సద్దుమణిగాక ఇంకో ఆర్జన సీటుకి మారడం అతనికి ‘డబ్బుతోపెట్టిన విద్య’. ఎందుకంటే ప్రభుత్వాఫీసుల్లో ఏపనైనా ‘డబ్బుతోకొడితే’ టక్కున అయిపోతుంది. ఎవరికైనా కావాల్సిన చోటికి ట్రాన్స్ ఫర్ కావాలన్నా, వచ్చిన ట్రాన్స్ ఫర్ ఆపేసుకోవాలన్నా, ప్రమోషన్ల పైరవీకి...ఇలాదేనికైనా ఇంతరేటు అని నిర్ణయమై ఉంటుంది. ఆ చిట్కాని తన ఆఫీస్ లో స్టాఫ్ బదిలీల విషయంలో కూడా ఉపయోగిస్తాడు అర్జునరావు. అప్పుడప్పుడు ఎవరో ఒక క్లర్క్ ని పిలిచి, ‘నీ అవసరం ఫలానాచోట ఉందోయ్. నిన్నక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నా’ అనంటాడు. ఆ క్లర్క్ లబోదిబోమని గోలపెట్టి, పిల్లల చదువులు డిస్టర్బవుతాయనో, మంచానపడ్డ తల్లో, తండ్రో ఉన్నారు, వాళ్ళని కదపలేననో కాళ్లావేళ్ళాపడతాడు. చివరికి తన పియే ద్వారా రాయబారం నడిపి అతని అక్కడే కనికరించి ఉంచడానికి ఇంత అని తీసుకుంటాడు.
మొన్న మున్సిపల్ ఆఫీస్ లో సూపరింటెండెంట్ ‘నాకేంవద్దు గానీ మిగతా వారికివ్వండి’ అన్నతీరులోనే, తనకి బాగా పరిచయస్తులు, బంధువులైనా సరే తన ఆఫీస్ కి ఏదన్నా పనిమీద వస్తే, ‘నాకేం వద్దు గానీ మా వెధవలూరుకోరు అందుకని వాళ్ళ కోసం మా అటెండెంట్ చేతిలో ఎంతోకొంత పెట్టి పొండి, మరీ ఎక్కువేం వద్దు సుమా!’ అని సలహా ఇచ్చి, ఆ వచ్చినదాన్ని కూడా లాభంలో నష్టం అనుకుంటూ, తన వంతు కూడా తీస్కోందే వదలని తత్వం అర్జునరావుది.

************

అయితే యధా బాసు తధా స్టాఫ్ అన్నట్టు బాసే అలాఉంటే మనకేం అని ఆ ఆఫీస్ లో స్టాఫ్ కూడా బాగా సంపాదనకి అలవాటుపడి, కీలకమైన సీట్లలో ఉన్నవారు చివరికి తమకొలీగ్స్ కూడా వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ లోన్లు, మెడికల్ బిల్స్, ఏవైనా అరియర్స్, చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటివి సెటిల్ చేసేటప్పుడు, పేమెంట్ చేసేటప్పుడు ఇంత పెర్సెంటేజ్ అని సమర్పించుకుంటేనే గానీ పని చెయ్యని స్థితికి చేరుకున్నారు. అందువల్ల ఆయా సీట్లకి డిమాండ్ ఉండేది. యూనియన్లతో ఒప్పందంవల్ల అలా డబ్బులొచ్చే సీట్లని మూడేళ్ళకోసారి రొటేషన్ పెట్టి, అందరూ ఆ “ఫలాలని” అనుభవించసాగారు. ఇందులో మళ్ళీ ఆ సీట్ కి వచ్చినవాడు, రాగానే ప్రత్యేక కృతజ్ఞత క్రింద అర్జునరావుకి “ఫలసాగు” అందించాల్సిందే. ‘పులి పిల్లల్ని పెట్టిన వెంటనే తన పిల్లల్ని తానే తినేస్తుందంటారు!’ అనేదెంతవరకు నిజమోగానీ, ఇక్కడ అర్జునరావు, అతని స్టాఫ్ సాధారణజనం నుంచి వసూలుచేసేదే కాకుండా, పులి చందాన తమసాటి ఉద్యోగులనుండీ కూడా తినగలిగినంత తినడానికి అలవాటు పడిపోయారు.

‘అవినీతిని అంతం చేసేస్తాం! చేస్తున్నాం!! చేసేసాం!!!’ అని ప్రభుత్వం వీలు దొరికినప్పుడల్లా ఘోష పెడుతున్నా.. రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ వాడే “చట్టం తనపని తాను చేసుకుపోతుందనే” ఊతపదంలా, “కానూన్ కే హాథ్ బహుత్ లంబే” అన్న హిందీ సినిమాల్లో డైలాగ్ లా, ఉగ్రవాదులు తమపని, దొంగలు తమపని, లంచగొండ్లు తమపని తమ తమ షెడ్యూళ్ళ ప్రకారం సుదీర్ఘ కాలాల పాటు చేసుకుపోతూనే ఉన్నారు.

పేపర్లలో “అనిశా వలలో ఫలానాఅధికారి! కోట్లాదిఆస్తులస్వాధీనం” అని వార్తలు వచ్చినప్పుడల్లా, ఉగ్రవాదదాడుల్లో ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ లు జరిగితే దేశమంతా రెడ్అలర్ట్ ప్రకటించి నాల్రోజుల తర్వాత సాధారణ జన జీవనం సాగినట్టు, అర్జునరావు అతని స్టాఫ్ కూడా కొన్నాళ్ళు జాగ్రత్తగాఉండి, సిన్సియర్ గా పనిచేసేసి, ఆపై మళ్ళీ తమ జూలు విదిల్చేవారు. అసలు పదిసార్లు “అవినీతి పనులు, అవినీతి పనులు” అని అంటూంటే, వినగా వినగా ఆ మాట “అవి ‘నీతిపనులు’ “ అనేలాగా వినిపిస్తుంది. అలాగే అర్జునరావు హయాం లో ఆ ఆఫీస్ లో అవి ‘నీతి పనులు’ నిరాటంకంగా సాగిపోతూనే ఉన్నాయి.

**********

అలా ఆర్జనరావుగా పేరుపొంది, సంవృద్ధిగా ఆర్జించుకున్న అర్జునరావు ఏ గొడవాలేకుండా రిటైర్మెంట్ కి దగ్గరకొచ్చేశాడు. రిటైర్మెంట్ కి వారంరోజుల ముందునుండీ ఆయన ఆఫీస్ లో సెక్షన్లవారీగా “పదవీ విరమణ ఘనసన్మానాలు”జరిగాయతనికి. అతని సపోర్ట్ తో బాగాసొమ్ముచేసుకున్నవారు భారీఎత్తున కానుకలతో ముంచెత్తారతన్ని. ఆ రోజే అతని రిటైర్మెంట్. లోకల్ పేపర్లలో అతని పదవీ విరమణ శుభాకాంక్షల ప్రకటనలతో ముంచెత్తారు. ఉదయంనుండీ అతని ఛాంబర్ పూలదండలు, బొకెలు, స్వీట్స్ పేకెట్స్, అనేక బహుమానాల్తో నిండిపోయింది. మధ్యాహ్నం ఓ స్టార్ హోటల్ లో భారీఎత్తున పదవీవిరమణ సన్మానసభ, అందరికీ లంచ్ ఏర్పాటు చేసారు స్టాఫ్ అంతా కల్సి, సెక్షన్ వారీ గా విడివిడిగా అంతకు ముందు సన్మానించినాగానీ.

కొసమెరుపుగా, ఆరోజు సాయంకాలం నాలుగున్నరకి వచ్చిన ఫాక్స్ మెసేజీ అర్జునరావుని కుప్పకూలిపోయేలా చేసింది. “అది అతను ఓమూడేళ్లక్రితం జరిపిన ఒక టెండర్ లావాదేవీల్లో జరిగిన అవకతకలపై అతన్ని బాధ్యుణ్ణి చేస్తూ, సస్పెన్షన్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి వచ్చిన ఉత్తర్వు.” అసలా అభియోగం వచ్చిన నాటినుండీ దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటూ, ఎవరెవరికి ఏమేం ముట్టజెప్పాలో ముట్టజెప్తూ దాన్ని ఎక్కడికక్కడ నొక్కిపెడుతూ వచ్చాడు. చివరిరోజుల్లో దాని ఊసు ఎక్కడాలేకపోయేసరికి ఇంకఫర్లేదు, ఇంకో వారంరోజుల్లో రిటైరైపోతున్నాగా అనుకున్నాడు.

సీతాదేవిని అపహరిస్తే రావణుడికి వెంటనే ఏంజరగలేదు! ద్రౌపదీ వస్త్రాపహరణం గావించిన కౌరవులకీ వెంటనే ఏమీ జరగలేదు. ఆతర్వాత జరిగినయుద్ధాల్లో తగినశిక్షనుభవించారు వారు. అలాగ్గా, సర్వీస్ లో ఉన్నంతకాలం బాగా దోచుకున్న అర్జునరావు, ఉద్యోగం చివరిరోజునాడు, వేడుకగా ధూమ్..ధాం అంటూ అట్టహాసంగా ఉద్యోగుల అభినందనలమధ్య ఇల్లు చేరాల్సినవాడు, అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకుపోబడ్డాడు.

పూర్వం ‘కురుక్షేత్రం’ నాటకంలో ఒకటోకృష్ణుడి స్థానంలో రెండోకృష్ణుడు వచ్చినట్టు, అర్జునరావు స్థానంలో ఇంకో అర్జునరావు ప్రతిరూపంలాంటి అధికారి మర్నాడు ఛార్జితీసుకున్నాడు. అలా ఛార్జి తీసుకుంటూనే, ఆ ఛాంబర్ని పరీక్షగా చూసి, “ఈ ఛాంబర్ వాస్తు సరిగాలేదయ్యా! అందుకే అర్జునరావు అలా దొరికిపోయాడు. వెంటనే మన సివిల్ ఇంజినీర్ని పిలిపించండి, కొన్ని మార్పులు చేయాలీ చాంబర్లో” అని హుకుం జారీ చేశాడు, తన పియేకి.

“మళ్ళీ కధ మొదలు, ఇప్పుడీ వాస్తుపేరుతో బోణీచేస్తున్నాడు ఈయనవంతు మింగుడుకి”, అననుకుంటూ పియే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు, సివిల్ ఇంజనీర్ని రమ్మని చెప్పడానికి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు