మల్లేశ్వరంలో పనిచేసే మిరియాలు అనేవాడికి పాండ్రాకకు బదిలీ అయింది.
పాండ్రాక నాలుగు కిలోమీటర్ల దూరమే కావడం చేతనూ,మల్లేశ్వరంలో తాతలనాటి సొంతిల్లు ఉన్న కారణం చేతనూ అతను రోజూ పాండ్రాక వెళ్ళిరావడానికి నిశ్చయించుకున్నాడు.
మిరియాలు నిరుపేద.ఉద్యోగం వచ్చిన కొత్త.సొంత సైకిల్ కూడా లేనందువల్ల పాండ్రాక నడిచి వెళ్ళి రాసాగాడు.ఉదయాన్నే బయలుదేరడం, ఎండ పెరగకమునుపే కార్యాలయానికి చేరుకోవడం,మళ్ళీ సాయంత్రం రావడం...రోజులు ఇలా గడిచిపోతున్నాయి.
ఒక రోజు మిరియాలుకు బాగా నీరసంగా ఉన్నది.సగం దూరం వెళ్ళి ఇక నడవలేక దారి పక్కన ఒక వేపచెట్టు కింద కూలబడ్డాడు. "ఎవరైనా వాళ్ళ సైకిల్ ఆపి ఎక్కించుకుంటే బాగుండు.ఏంటో చాలా నీరసంగా ఉంది." అనుకున్నాడు తనలో తానే.ఆ చెట్టు మీద ఉన్న వనదేవతకు ఆ మాటలు విని జాలి కలిగింది.దీవించింది.
వెంటనే అటుగా వెళ్ళే సైకిలతను సైకిలాపి మిరియాలుని రమ్మని ఎక్కించుకుని వెళ్ళాడు.కోరినదే తడవుగా ఇలా జరగడం భలే తమాషాగా తోచింది మిరియాలుకి."ఇలా రోజూ ఎవరైనా సైకిలెక్కించుకుంటే ఎంత హాయిగా ఉంటుందో!" అనుకుంటూ సైకిలెక్కాడు.
వన దేవత దీవెన ఫలితంగా ప్రతిరోజూ ఎవరో ఒకరు సైకిలాపి మిరియాలుని ఎక్కమని అడగసాగారు.అతనికి ప్రాణానికి సుఖంగా ఉన్నప్పటికీ ఆశ్చర్యం చేత భార్యకు విషయం చెప్పాడు.
వెంటనే ఆమె "ఏడ్చినట్లుంది తెలివి.ఆ చెట్టు మీద దేవతో దెయ్యమో ఉండుంటుంది.ఆ అడిగేదేదో సొంత సైకిలడగక వాళ్ళనీ వీళ్ళనీ ఎక్కించుకోమనడం ఎందుకూ!" అన్నది.
మిరియాలు ఇదేదో బాగున్నదని మరునాడు ఆ వేపచెట్టు కింద నుంచుని సొంత సైకిల్ ఉంటే బాగుణ్ణన్నాడు.వెంటనే అతడి కళ్ళముందు తళతళలాడే కొత్త సైకిల్ ప్రత్యక్షమైంది.
కానీ రెండ్రోజులు గడవకముందే భార్య "కారు అడగండి.దర్జాగా తిరగొచ్చు.మా పుట్టింటికి వేసుకెళ్తే ఎంత గొప్ప!" అన్నది."కానీ పెట్రోలు పోయించే స్తోమత మనకెక్కడిదీ?" అన్నాడు మిరియాలు నీరసంగా.
కాసేపు ఆలోచించాక భార్య "ఓ పని చేయండి.నీళ్ళతో నడిచే కారు అడగండి.కారునే సృష్టించిన దేవత అది నీళ్ళతో నడిచేలా చేయలేదంటారా?" అన్నది.
మిరియాలు ఎగిరి గంతేశాడు.మర్నాడే వెళ్ళి నీళ్ళతో నడిచే కారు తెచ్చుకున్నాడు.ఇక పని ఉన్నా లేకపోయినా బజార్లు తిరగసాగాడు.
మిరియాలుకి అడపాదడపా అప్పులిచ్చే వడ్డీ వ్యాపారి ఈ వైభోగం చూసి ఆశ్చర్యపడ్డాడు.తన బాకీ వసూలు చేసుకుందామని బయలుదేరి వాళ్ళింటికి కి వస్తుండగా మాటలు వినబడసాగాయి.
"నీళ్ళతో నడిచే కారు ఇమ్మని కోరడం ఎంత మంచి ఆలోచనో చూశారా! మరి నన్ను మెచ్చుకోరేం?" అంటొంది మిరియాలు భార్య.
అప్పటిదాకా వడ్డీవ్యాపారి ఆ కారు నీళ్ళతో నడిచేదని ఎరగడు.వెంటనే తన బాకీ కింద ఆ కారుని జమ వేసుకుని కారుతాళాలు లాగేసుకున్నాడు.
మళ్ళీ వెళ్ళి చెట్టు కింద నుంచుని ఇంకో కారు కావాలన్నాడు మిరియాలు."అవసరం కోసం ఇస్తే విలాసాలకు పోయావు.అత్యాశాపరులకు నా సాయం ఉండదు" అనే మాటలు వినబడ్డాయి.
లబోదిబోమన్నాడు మిరియాలు."బుద్దొచ్చింది తల్లీ! ఇంకెప్పుడూ తాహతు మీరి నడుచుకోను.ఏదీ అయాచితంగా ఆశించను కూడా.కానీ ఈ ఒక్క కోరిక తీర్చు తల్లీ!ఆ కారును మాయం చెయ్."అన్నాడు మిరియాలు.
వ్యాపారి దగ్గర కారు మాయమైంది.వాడు మళ్ళీ బాకీ వసూలుకు వచ్చి కూర్చున్నాక కానీ తన పొరపాటు తెలిసి రాలేదు మిరియాలుకి. "అత్యాశ,అసూయ రెండూ అనర్ధదాయకాలే." అని అనుభవపూర్వకంగా గ్రహించాడు.