కమాను వీధి కథలు - రామదుర్గం మధుసూధనరావు

kamanu veedi kathalu
ఎప్పుడూ చదువు...అప్పుడప్పుడు ఆటలు..‘ఆటవిడుపు’ అంటే ఇదే కదా . అయితే మా కమాను పిలగాళ్లం సరిగ్గా దీనికి రివర్సు. మాకది బేకులేదు అన్నట్టుండేవాళ్లం. మా వరకు ఎప్పుడూ ఆటలు..కుదిరితే చదువు...ఇదీ మేం పెట్టుకున్న రూలు. ఈ రూలు పెద్దోళ్లకి తెలీదు కాబట్టి వాళ్లు మమ్మల్ని చావగొట్టేవాళ్లు. కమాను వీధిలోనే ఆడి ఆడే మా బతుకులు చాలా వరకు తెల్లారిపోయాయి. పలానా టెక్స్‌›్ట బుక్కు లేదనో...అరె నోట్సు కొత్తది కొనాలనో ఏనాడూ పొరపాటున కూడా అనుకున్న పాపాన పోలేదు. కానీ గోలీలు కొత్తవి పోగేయాలన్నా...బొగరీల మేకులు ఊడబెరకాలన్నా...గాలపటం తోకలంటించాలన్నా...ఎక్కడ్లేని కుసీ...ఉత్సాహం. నాకు తెలిసి మా ఒలంపిక్‌ ఆటలు ఇవే! వీధిలో పడి ఆడుకోలేనోడు...అడుక్కునేవాడి కంటే సుమారు అనేది మా సిద్ధాంతం. సదివేదేముంది...సారు చెప్పిండేది రొవంత ఇనుకుంటే సాలు...ఎవడైనా పాసైతాడు. నీకు సత్తా ఉంటే వీధిలో ఆడి సూపించాలా...అదీ కత! అంటూ మనసులోనే మా తిరుగుళ్లకు మేమే శబాష్‌లు కొట్టుకునేవాళ్లం. ప్రతి ఆటలో ఎవడో ఒకడు తోపుగాడిలా కాలరెగిరేసుకుని తిరిగేవాడు. మిగిలినోళ్లం వాడితో సమానంగా దేకలేక కుళ్లుకుని చచ్చేవాళ్లం. సాయంత్రం అయితే చాలు బ్యాగులు ఇంట్లో గోడలకి...మేం వీధుల్లోకి..! పోనీ ఏదో చీకటిపడి ఇంట్లో దీపం పెట్టేదాకా ఆడుకుంటారులే పాపం...ఆ తర్వాత ఎలాగూ వచ్చి చదువుకుంటారుగా అనుకునేకీ వీల్లేదు. ఎందుకంటే సాయంత్రం ఆటలో ఓడిపోయినోళ్లు గుంపుకట్టి కుళాయి కాడో...ఇంటి మిద్దెలపైనో...కమాను చెత్తొట్టి పక్కనో నిలబడి... ఎట్లా ఓడిపోయాం...మళ్లీ రేపెట్లా గెలిచినోడ్ని మట్టి కరిపించాలా అని చాలా అయిడియాలు వేసుకునేవాళ్లం.

గోలీకాయలాటే తీసుకుంటే...ఆడ నువ్వు ఎంతసేపు ఆడావన్నది కాదు...నీ దగ్గర ఎన్ని గోలీలున్నాయన్నదే అసలు లెక్క! ఈ సీజనే చాల విచిత్రంగా సురువయ్యేది. హావన్నపేట స్కూలు చౌరస్తా కాడ రెండు చిన్న అంగళ్లలో సీసీల్లో గోలీలు ప్రత్యక్షమయ్యేవి. మా గ్యాంగులో ఎవడో ఒకడు అయిదు లేదా పది పైసలు పెట్టి నాల్గు చిన్నగోలీలు తెచ్చుకునేవాడు. రంగురంగుల్లో ఊరిస్తున్నట్టుగా ఉండే ఆ గోలీలు చూసింది మొదలు ఇంక మనసు ఆగేది కాదు. ఇంట్లో సానా రాద్ధాంతం చేసి అమ్మను గోలాడించి ...గోడకు చేర్చినంత పని చేసి ఓ పది పైసలు దక్కించుకోగానే చౌరస్తా కాడికి ఉరికేదే! నిక్కరు జేబులో నాల్గు గోలీలు పడగానే మా సై్టలే వేరప్పా...అన్నట్టుండేవాళ్లం. కమాను వీధిలో సగం మోకాలిపై కూర్చోడం గోలీలను రైటీస్‌ కొడుతూ పక్కనోళ్లను కవ్వించడం. ఇంతలో మా జతకు నల్గురైదుగురు జట్టు కట్టగానే అసలు ఆట మొదలు. దాదాపు నెలపైగా సాగే ఈ గోలీలాట మొదటి వారం కొట్టి గెలుచుకునే ఆట ప్రారంభమయ్యేది.

వరసగా అయిదు గోలీలు పెట్టి...దూరం నుంచి చెరో గోలీ వేయాలి. ఎవడు వరస గోలీలకు దగ్గరగా వేస్తాడో వాడు ఫస్టు కొట్టాలి. ఆ తర్వాత సెకండ్‌...ఇదీ వరస. ఫస్టు వేసిన వాడు కొట్టలేక పోతే రెండోవాడికి ఛాన్సు వస్తుంది. అయితే ఎన్ని గోలీలన్నా కొట్టి గెలుచుకోవచ్చు. ఈ ఆటలో ఎక్కువ సార్లు నా జేబినే ఖాళీ అయ్యేది. చంద్రి అందరికన్నా ఫస్టు. వాడు గోలీల్ని చాలా న్యాక్‌గా కొట్టేవాడు. దెబ్బకు కనీసం రెండు తగిలి వరస నుంచి బైట పడేవి. ఈ ఆట చాలా చిన్నస్థాయి. ఆ తర్వాత పుద్ది అడేవాళ్లం. నేల పై చిన్న గుంతదీసి అందులో గోలీ వేసుకుని ఎదర ఉన్న వాటిని కొట్టుకోవడం. గుంతలో గోలీ వేస్తే తప్ప ఎదటి గోలీని కొట్టేకి లేదు. గుంతలో గోలీ పడలేదంటే ఇంక నరకమే! ఆ తర్వాత ‘బచ్చ’ ఆట అంటే ఇది గోలీ గోలీకి మధ్య కనీసం నాల్గువేళ్ల కన్నా దూరంలో ఉంటే చాలు ఎదటి గోలీని కొట్టొచ్చు. ఇక్కడ గోలీని కొట్టడంలో వేలు తిరిగి ఉండాలి. గోలీ పై నుంచి వేరేగోలీ వద్దకు చేరేలా కొట్టాలి. ఇలా వరసగా కొట్టుకుంటూ వెళ్లడమే పనితనం. ఈ ఆటలో ఎక్కడ్లేని గొడవలు...పంచాయతీలు. రెండు గోలీల మధ్య నాల్గు వేళ్లు పెట్టినపుడు అవి తాకితే ... ఇవతల వాడు పెడేల్మని కొట్టేవాడు. లేదంటే దగ్గరకు వచ్చిన వాడే కొట్టాలి. నాల్గువేళ్లు పెట్టినపుడు వెంట్రుకంత సందు ఉన్నా దగ్గరకు వచ్చినోడిదే చాన్సు. దీనికి పెద్దమనుషులుగా ఉండేవాళ్లు మట్టి తీసి వేళ్లు...గోలీ మధ్యలో పోసేవారు.

కిందికి పోతే సరేసరి...అట్టానే నిలుచుంటే వచ్చినోడి లెక్క తప్పినట్టే. ఈ వ్యవహారంలో వెంట్రుకంత సందున్నా...వచ్చినోడు ‘లే...నీవు...నీ అన్న, తమ్ముడు మీ గేరోళ్లందరూ రగ్గులేస్కుని పడుకోవచ్చలే...సూడ్రా సందు ఎ ంతుండాదో’ అంటూ నానా రచ్చ చేసేవారు. నేనంటారా...నా కత యాలలే! ఆడేదానికన్నా...గోలీలు కొత్తవి కొనేకి పడే తిప్పలే సానా! ఒక్కోడు ఒక్కో రీతి సతాయిస్తుండేవాళ్లు. ఓసారి ఒకడు అయిదుపైసలు పెట్టి పేద్ద గోలీ ఒకటే తెచ్చిండాడు. పట్టుకుంటే రాయిలా ఉండాది. యాలరా సామీ...ఇంత పెద్ద గోలీ ఇదేం ఏలితో ఆడేకి వస్తాదా...సస్తాదా అంటే వాడు లే...నీ కాడ లేదని నీకు వట్టేకిచ్చలే నాకు తెలీదా నీ కత అంటుంటే ...నేను పళ్లునూరుకునే వాణ్ని. రెండ్రోజులకే గోలీల్లో పెద్ద గోలీ కూడా వచ్చి చేరేది. ‘మూడు గోలీలాట’ చూసేకి చాలు ఈజీ అనిపించినా ఆడేకి సానా అంటే సానా కస్టం. గోడకానుకుని మూడు చోట్ల బాక్సులా గీయాలి.

ఆ గీతల మధ్య ఓ చిన్న గుంత ఉంటుంది. దీనికి పది పదహైదడుగుల దూరంలో నిలుసుని రెండు గోలీలు వేయాలి. వాటిలో ఒకటి గుంతలో పడిందనుకో...దాన్ని చేతిలో ఉన్న గోలీతో కొట్టి లేపాలి. గుంతలో పడకుంటే రెండు గోలీల్లో పక్కనోడు ఏది సెబితే దాన్ని గురిచూసి కొట్టాలి. కొడితే ఇన్ని గోలీలు అని పందెం ఉంటుంది. ఇందులో చంద్రిగాడు ఓ కన్ను మూసుకుని...బొటనవేలు...చూపుడు వేలుతో గోలీ పట్టుకుని ఇసిరితే గోలీ ఠంగ్‌ అంటూ లేయాల్సిందే! ఈ సామి వచ్చిండాడంటే ఆ రోజు మా జేబులు ఖాళే! ప్రతి రోజూ గోలీలు లెక్కేసుకోవడం. ప్రతి మూడురోజులకోసారి కొత్తవాటిని కొనడం ఈ గోలీలు నిక్కరు జేబులో టకటకా అని శబ్దం చేస్తుంటే పోజు కొడుతూ నడిచేవాళ్లు మా కమాను పిలగాళ్లు. అయితే ఈ చంద్రిగాడు రెండు జేబుల్లో గోలీలను గలగలాడించేవాడు. ఆడితో పోల్చుకోవడమే తలతిక్క పని...అలాంటోళ్లని చూసి పక్కవీధి వాళ్లతో...లే సూడండిరా మా సెంద్రిని ఎన్ని గోలీలుండాయో...’ అని సవాలు విసురుకోవాల్సిందంతే!!

బొగిరీలాటకి పైసలు ఖర్చు పెరిగేది. పావలా దాకా పెట్టుబడి పెట్టాలి. కమాను ఎనకాల సెట్టి అంగట్లో ఇనుప పుట్టలో బొగిరీలుండేవి. చిన్నవి, పెద్దవి , సానా పెద్దవి ఇలా రకరకాల సైజులో ఉండేవి. అయితే మేం మీడియంవి చూసి కొనేవాళ్లం. బొగిరీ కొనడం అంటే పెళ్లిచేసుకుని సంసారం సురు చేసినట్టే! పెళ్లయ్యాక పిల్లలు వాళ్ల చదువులూ ఖర్చు పెరిగినట్టే...ఈ బొగిరీ లెక్క అంతే...బలే సుడుగాడు ఆట. ఒక్క బొగిరి కొని హమ్మSయ్య అనుకునేకే ఈల్లేదు. బొగిరికి మేకు కొనాల్నా...చుట్టేకి జాటీ కొనాల్నా...సామీ ఏం సెబుతారులే మా తిప్పలు. జాటీ ఒకటే కొంటే సరిపోదు. దానికి ఓ చివర్న కోకోకోలా మూత తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలా. నేను మాత్రం ఇంట్లో పాత గుడ్డ పేలికను కట్టుకునేవాణ్ని. ఆ జాటీని చూసి ఎంత అవమానం సేసేవాల్లో! ఏం సేద్దాం అందరికీ కోకోకోలా మూత కావాలంటే యాడ కుదురుతాదీ...అని సరిపెట్టుకునేవాణ్ని.

ఆ సెట్టి బొగిరీ కొనేటపుడే...ఇద్గో ఇపుడే సెబుతున్నా...మేకు దించేటపుడు పగిలిపోయిండాది అంటే కొత్తది ఇచ్చేది లేదు. మీ ఇస్టం ఉంటే కొనండి...లేదంటే ముందుకు పోతూ ఉండండి అని చాలా కట్‌నీట్‌గా చెప్పేవాడు. అయితే ఈ మాయదారి బొగిరీలు నెత్తిపైన కలర్‌ చూడగానే మాకు మతి పోయేది. ఆయప్ప చెప్పింది వినిపించుకోకుండా ఏదో ఒకటి తెచ్చుకునేవాళ్లమా...గుండ్రాయి తీసుకుని మేకును దించేటపుడు ఎంతమంది దేవుళ్లను మొక్కుకునేవాళ్లమో! మేకు దించాక జాటీ తిప్పి ఆడిస్తే అది కాస్త కొక్కిరిబిక్కిరిగా తిరిగేది. ఇంక సూస్కోండప్పా అక్కడ్నుంచి రిపేరీ సురూ! ఆ మేకుని అటు కొంచెం ఇటు కొంచెం కొట్టి కొట్టి మెత్తగ చేసేవాళ్లం. యాడో ఓ తాడ అది కుదురుకుని గుమ్మంటూ తిరిగేది. దాన్ని సై్టలుగా జాటీతో చేతిలోకి వేసుకునేవాళ్లం. మేకును ఎన్నిసార్లు కొట్టేవాళ్లమో...అన్ని సార్లు తీసేవాళ్లం. దానికి మనకాడ హిక్కళ యాడుండాది? అందుకే ఓ అయిడియా వేసుకునేవాళ్లం. ఇంటి వాకిలి సందులో మేకు పెట్టి...వాకిలి మూసి గట్టిగా లాగేవాళ్లం. ఇట్టే మేకు వచ్చేసేది. బొగిరిని బంగారం కన్నా అపురూపంగా చూసుకునేవాళ్లమా...కానీ ఆటలో పెడితే రోజూ దానిపై మేకుల పోట్లే...ఆటలో ఓడిపోయి బొగిరీని కిందపెడితే...పక్కనోళ్లు రాక్షసుల్లా కొట్టేవాళ్లు. అడికీ ‘కొంచెం సూసుకొని కొట్టప్పా....’ అని గొణిగితే చాలు ఇంకా రెచ్చిపోవడమే! బొగిరీ ఆటల్లో ఏదైనా ఆడొచ్చుగానీ బుద్దున్నోడెవడూ బళ్లారిగుమ్మ మాత్రం ఆడొద్దు.

నాయనా దానికన్నా నరకం ఇంకోటుండదు. ఓసారి ఇట్టాటే రఘు...బుస్సి...చంద్రి మరికొందరు కల్సి బళ్లారిగుమ్మ ఆడదాం రమ్మన్నారు. వద్దు వద్దనుకుంటూనే ఆటకి దిగిండాను. నా తర్వాతే దరిద్రం కదా! జాటీ వేగంగా తిప్పి బొగిరీ ఆడించి చేతిలో వేసుకోవడంలో ఓడిపోయిండాను. ఇంక సూస్కో సామీ బెణకప్ప గుడి కాడ ఉండే గీత కాడికి నా బొగిరీని కొట్టుకుంటూ ఏసుకుని పోయిండారు. గీత దాటించేశారు. నాకు పై ప్రాణం పైనే పోయిండాది. ఇంక అయిపోయ...నా బొగిరీ పోయినట్టే అనుకుండాను. అందరూ ఎగురుతూ నా కాడ చేరిండారు. రాప్పా రా...ఏదీ నీ బొగిరీ తీయి అంటూ నా చేతిలోంది బలవంతంగా లాక్కొనిండారు. దాన్ని మట్టిలో పూడ్చి తలమాత్రమే కనిపించేలా ఉంచారు. ఒక్కోడు బొగిరి మేకుతో మూడు సార్లు కొట్టాలి. బొగిరి ఉంటే ఉన్నట్టు లేకుంటే పోయినట్టు, అందరూ కసిదీరా దాన్ని పొడిసిండారు. నాకు కండ్లల్లో నీల్లు వస్తుండాయి. లేయ్‌...నా కొడకల్లారా...ఈ బొగిరి బతికి బైట పడనీ మీ కత సూస్తా అనుకుండాను మనసులో...చివరికి చంద్రిగాడి వంతు వచ్చిండాది. వాడు హిందీ సినిమా విలన్‌ సెట్టప్పలా నవ్వుతూ తన బొగిరీ పట్టుకుని కూసినిండాడు. ఆ మేకు సూడగానే నాకు అనుమానం సురువయ్యిండాది. ఏం సేయాలా...ఈ బొగిరి ఆయస్సు ఎంత ఉంటే అంతే...అనుకుంటుంటే ఒకే దెబ్బ కొట్టిండాడు...అందరూ ఉయ్‌... ఉయ్‌...అంటూ విజల్లు ఊదుతుండారు. ఏముండాది నా బొగిరి సరిగ్గా రెండు ముక్కలై పడిపోయిండాది. కండ్లు తుడుసుకుంటూ ఇంటికి పరిగెత్తిండాను. లేయ్‌...రేపు కొత్తది తీసుకురా అందరూ అంటుంటే నా గుండె పగిలిపోయిండాది. చూసిండారా...బొగిరి ఆట అంటే మజాకా కాదు...ఆడ మా పేనాలు పోయేంత పరిస్థితి ఉంటాది.

మా ఊర్లో ఎండాకాలం చలికాలం లెక్కనే గాలికాలం కూడా సానాకాలం ఉంటాది. అప్పుడు సూడాల గాలి దెయ్యంలా తోస్తుంటాది. ఈ టయానికే మేము బిజీ అయిపోతుంటాం. ఎందుకంటే గాలిపటాలు ఎగరేయాలి కదా! గాలిపటం ఎగరేసేది కంటే దాన్ని తయారు సేసుకునేది దారం సిద్దం చేసుకునేదే రంప రామాయణంలా ఉంటాది. అదేందేగానీ నేను ఎప్పుడూ గాలిపటం కొనలేదు. నేనే కాదు మా కమాను పిలగాళ్లం ఎవ్రూ కొనేవాళ్లం కాదు. వాటిని తయారు చేసుకునేందుకే సిద్దంగా ఉండేవాళ్లం. గాలికాలం సురువయ్యిం డాదంటే...కమాను సుట్టుపక్కల గేరీల్లో పేపర్లు ఏసుకునే ఇండ్లముందు క్యూకట్టేవాళ్లం. వారిని రకరకాలుగా అడుక్కొని ఓ పేద్ద న్యూస్‌పేపరు తెచ్చుకుని ఇద్దరుముగ్గురు గాలిపటాలు తయారు సేసుకునేకి కూర్చునేవాళ్లం. ఈ విషయంలో చంద్రి వాళ్లన్న వీరభద్రి, రామన్నయ్యలాంటి పెద్దోల్ల సాయం సానా ఉండేది. ఈ పేపరు అతికించేందుకు అంటు దొరికేది సానా కస్టంగా ఉండేది. అందుకే ఇంట్లో అమ్మకు సెప్పకుండా అన్నం తెచ్చేవాణ్ని. అన్నంతో అతుకుపెట్టడం... అది ఊడిపోతుంటే మళ్లీ అన్నం తెచ్చుకోవడం ఇదో పెద్దతంతు. గాలిపటం తయారు అయితే అంతా పూర్తయినట్టు కాదు. సూత్రం కట్టాల. అదే ముఖ్యం. సూత్రం సరిగాలేని గాలిపటం ఉన్నా ఊడినా పెద్ద తేడా ఉండదు.

సూత్రం బట్టే అది ఎంత ఎత్తుకు ఎగరగలదో తెలిసేది. ఈ సూత్రం కమానులో చెంద్రి బలే కట్టేవాడు. వాడు చుట్టుపక్కల గేరిపిలగాళ్లకు ఈ విషయంలో పెద్దదిక్కు. వాడితో సూత్రం కట్టించుకోవాలంటే సానా కాకా పట్టాల్సి వచ్చేది. గాలిపటానికి సూత్రం కోసం వాడిచుట్టూ కుక్కపిల్లల్లా తిరిగేవాళ్లం. రెండ్రోజులు తిప్పించి తిప్పించి కట్టేవాడు. దాంతో ఒక ఘట్టం పూర్తయ్యేది. ఇంక అసలు కస్టం ఇప్పుడు సురు. తోక ఎంత పెద్ద తోక ఉండాలి? దానికో లెక్కాపత్రం లేదు. మా నోటు బుక్కుల్లో ఎన్ని పేజీలుంటే అంత పొడుగు తోక ఉండేది. అందుకే ప్రతి గాలికాలంలో మా నోటుబుక్కుల్లో ఒకటో రెండో కచ్చితంగా పోగొట్టుకుని పోయేవి. అయితే అవి గాలిపటం తోకరూపంలో ఉండేవన్న విషయం మాకుమాత్రమే తెలుసు అది వేరే విసయం.ఈ తోకలు అంటించేకి కూడా అన్నమే దిక్కు. ఈ పనీ పూర్తయ్యాక దారం కోసం వెదుకులాట! ఏం సామీ గాలిపటం ఎగరేస్తుండావా...రా తీస్కో దారం అని ఉద్దరగా ఎవడిస్తాడు? ఎలాగోలా మనమే సంపాయించుకోవాలా! పాపం నాన్న కిరాణా కొట్టునుంచి సరుకులు తెచ్చినప్పుడు వాడు పొట్లాలకు చుట్టిన దారాన్ని ఉండలా జాగ్రత్తగా దాచి ఉంచేవాడు. పనికి వస్తుందని. ఇది కూడా పనే కదా అని నమ్మిన నేను గుట్టుచప్పుడు కాకుండా ఆ ఉండని నిక్కరు జేబులో ఏసేసుకుని బైట పడేవాణ్ని. ఒక చిన్న కడ్డీకి దారం చుట్టుకుని అంతా సిద్ధం అయ్యాక...మిద్దెపైకి చేరుకునేవాళ్లం. పొగచట్టం పైకి ఎక్కి మెల్లగా గాలిపటం ఎగరేసేవాళ్లం. అది సరిగా ఎగిరేది సురుచేసేసరికి మాకు నీరసం వచ్చేది. చేతులు నొప్పి పుట్టే దాకా ఎగరేస్తుండేదే. వారంలో ఏ రెండ్రోజులో...మూడ్రోజులో గాలిపటం పైకి ఎగురుతూ కనిపించేది. కానీ పొగచట్టంపై నిలబడి గాలి బలంగా గాలిపటాన్ని లాగుతూ పైకి ఇడుస్తుంటే...మనసు కూడా గాలిపటంతోనే పైకి పోతుండేది. ఇట్టా ముందూ వెనక్కి జరుగుతూ పొగచట్టం పై నుంచి కిందపడిన సంఘటనలూ ఉండాయి. అదేం చిత్రమో...ఆ క్షణంలో దెబ్బతగిలినా ఏమాత్రం నొప్పి అనిపించేది కాదు. ఇంకా తమాషా ఏంటంటే..మా గాలిపటాలు పక్కనే ఉన్న కుంబార గేరిలోని చెట్టుకు తగిలి పడిపోతే ఎగిరిగంతులేసేవాళ్లం. అంటే అంతెత్తు ఎగిరింది కదా అని! ఈ గాలికాలం అంతా మేం మిద్దెలపైన ఎగరేస్తో....కమాను కట్టలపై కూర్చొని గాలిపటాల్ని తయారు చేస్తో కాలం గడిపేసేవాళ్లం.

నాకు ఇష్టం లేకపోయినా...మీకు చెప్పాల్సిన ఇంకో ఆట క్రికెట్టు. ఈ ఆట వచ్చినాంక...మా కమాను పిలగాళ్లం అందరం అన్ని ఆటలకీ దూరమైపోయిండాం. ఎప్పుడు సూసినా గోడకి బొగ్గుతో మూడు గీతలు గీసుకునేది చెక్కబ్యాటు పట్టుకుని ఆడేది. అప్పటి దాకా కమానులో కుదురుగా ఆడుకునే మేం...ఈ క్రికెట్టు పుణ్యమా అని పెద్దలతో బూతులు తిట్టించుకునే స్థాయికి ఎదిగాం. బాలు ఇళ్లల్లో పడితే చాలు రంకెలు వేసేవాళ్లు. బాలు పోయిందన్న బాధ...తిడుతున్నారన్న భయం ఒకేసారి వేసేది. టెన్నిస్‌ బాలు కొనే స్తోమత లేదు కాబల్టి సైకిలు ట్యూబుని రౌండుగా కత్తరించి ఓ పెద్ద గుండ్రని రాయికి పేపరో...బట్టో చుట్టి దానికి ఈ రబ్బర్లు వేసి బాలులా ఆడేవాళ్లం. ఈ క్రికెట్టు మమ్మల్ని కమాను స్టేడియం నుంచి మునిసిపల్‌ స్టేడియానికి ట్రాన్స్‌పర్‌ చేసేసింది. ఆదివారాలు బేట్లు పట్టుకుని తలపై టోపీలు పట్టుకుని చాలా బిజీగా మారిపోయిండాం. గవాస్కరు,గుండప్ప విశ్వనాథ్, కిర్మానీ వీళ్లకన్నా మేమే చాలా బిజీగా ఉండేవాళ్లం. ఎందుకంటే పాపం వాళ్లు ఆట మాత్రమే ఆడాల. మేం అలా కాదు కదా క్రికెట్టు ఆడాలా...బాలు తయారు చేసుకోవాలా...వాళ్ల బొమ్మలు కత్తరించుకుని స్కూలు సంచుల్లో నింపుకోవాలా! ఒకటి మాత్రం నిజం...కమానులో పిల్లలుగా మేం ఎంత హడావుడిగా...సందడిగా... ఉండేవాళ్లమంటే...స్కూలుకు వెళ్లే తీరిక లేనంత...ఇంకో మాటలో చెప్పాలంటే పరీక్షల్లో ఫెయిలై దారుణంగా మార్కులు తెచ్చుకునేంతగా!!

–––––––––

బొగిరి:బొంగరం, వట్టేకిచ్చ:కడుపు మంట, హిక్కళ:పటకార

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు