విధివిన్యాసాలు - మాలాకుమార్

vidhivinyasalu

చదువుతున్న పుస్తకం లో నుంచి తలెత్తి వేళ్ళు విరుచుకుంటూ ఉంటే ఎదురుగా లలిత విచారంగా కూర్చొని కనిపించింది వసుధకు. వసుధ లలిత చేతిని తట్టి ఏమిటీ సంగతి అనట్లు సైగ చేసింది. లలిత ఉలిక్కి పడి బయటకు వెళుదాం అన్నట్లు లేచింది. వసుధ తన పుస్తకాన్ని రాక్ లో పెట్టి లలిత ను అనుసరించింది.లెక్చర్ జాబ్ నుంచి రిటైర్ అయ్యాక ,ఇంట్లో పనంతా ముగిసాక మధ్యాహ్నం లైబ్రరీ లో గడపటం అలవాటు చేసుకుంది వసుధ. లలిత తో అక్కడే లైబ్రరీ లో స్నేహం కలిసింది. ఇద్దరికీ పుస్తకాలు చదవటం ఇష్టం. దానితో లైబ్రరీ లో చదవటం అయ్యాక , ఇంకో పుస్తకం ఇంటికోసం తీసుకొని , లైబ్రరీ ఆవరణలోని చెట్టు కింద కూర్చొని,కాసేపు పుస్తకాల గురించి చర్చించుకోవటం ఇద్దరికీ అలవాటు. చాలా అరుదుగా సొంత విషయాలు మాట్లాడుకుంటారు.ఇది గత కొద్ది కాలంగా సాగుతోంది.ఇద్దరూ పున్నాగ చెట్టుకింద , బెంచ్ మీద కూర్చున్నారు.అప్పుడప్పుడు చెట్టు మీద నుంచి పున్నాగపూలు రాలుతున్నాయి.వాటి సువాసన సన్నగా గాలిలో తేలి వస్తూ, చుట్టూ ఉన్న చెట్ల నుంచి గాలి వీస్తూ, పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి.కాసేపు ఇద్దరూ నిశబ్ధంగా కూర్చున్నారు.చివరకు,

"నన్ను కూడా గమనించ కుండా అలా మూడీ గా కూర్చున్నావు, ఏమిటి సంగతి?"అని అడిగింది వసుధ."నీకు తెలుసుగా వసూ, నాకు ఒక్కడే కొడుకని , వాడీ మధ్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పెద్ద కంపెనీలో మంచి సాలరీ తో చేరాడని,వాడి కి పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని." అని ఆగింది లలిత.

"ఊ తెలుసు ఏదైనా మంచి సంబంధం వచ్చిందా?" అడిగింది వసుధ.

"సంబంధాలకేమి బోల్డు వస్తున్నాయి.వాడే నా నెత్తిన నిప్పులు పోసాడు."కోపంగా జవాబిచ్చింది లలిత.

"ఏమిటీ ఎవరినైనా ప్రేమించాడా?ఈ మధ్య ఇది మామూలైపోయింది కదా దానికి విచారమెందుకు " అంది వసుధ.

"మామూలు ప్రేమైతే విచారమెందుకు?"చికాకుగా అంది లలిత.

"మరి కులాంతరమా ? ఖండాంతరమా ? ఖండాంతరం కూడా ఈ మధ్య ఎక్కువగానే జరుగుతున్నాయిగా." అంది వసుధ.

"అదైనా బాగానే వుండు. ఎలాగో అడ్జెస్ట్ అయ్యేవాళ్ళం. ఇద్దరు పిల్లలున్న విధవరాలును పెళ్ళి చేసుకుంటాడుట.వీడికేమైనా కాలొంకరా ? కన్నొంకరా? అందగాడు, పెద్ద ఉద్యోగస్తుడు.ఒక్కగానొక్క కొడుకు.ఆమెనే పెళ్ళి చేసుకుంటాడుట. లేకపోతే అసలు పెళ్ళే చేసుకోడుట. ఇదేమి పోయేకాలమో! ఆ పిల్ల ఎవరో బాగానే బుట్టలో వేసుకుంది."కసిగా కన్నీళ్ళతో అంది లలిత.

లలిత వైపు సాలోచనగా చూస్తూ " ఏమిటట, ఆ అమ్మాయిని ఉద్దరిస్తాడటనా ?"అడిగింది వసుధ.

"కాదుట , ప్రేమట. అదేమి ప్రేమో మరి ." కోపంగా అంది లలిత.

"ఓ" నిశబ్ధంగా ఆలోచనలో పడింది వసుధ.ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు.

"నేను చెప్పేది నమ్మలేకపోతున్నావా వసూ మాట్లాడటం లేదు."అడిగింది లలిత. దానికి జవాబివ్వకుండా, నేనొకటి చెపుతాను వింటావా లలితా అడిగింది వసుధ.

"ఊ చెప్పు ."అనాసక్తిగా అంది లలిత.

* * * * * * * *

"బామ్మగారూ"అని పిలుస్తూ లోపలికి వచ్చిన వసుధ కు వంట ఇంటి గడపమీద కూర్చున్న యువకుడు కనిపించాడు.కొద్దిగా నల్లగా మోటుగా ఉన్నాడు.లైట్ క్రీం కలర్ పైజామా, కుర్తావేసుకొని ఉన్నాడు.

అతను వసుధ పిలుపు కు తలేత్తి చూసాడు.చామనచాయ, కోల మొహం,పెద్ద కళ్ళు , చిలకాకుపచ్చకు ఎర్ర అంచున్న పరికీణీకి, చిలకాకుపచ్చ జాకెట్టూ,ఎర్రవోణీ వేసుకున్న ఓ అమ్మాయి , చేతిలో ఓ గిన్నె తో చిలకలా నిలబడి కనిపించింది. నిస్సంకోచం గా తనను నిలువెల్లా పరీక్షగా చూస్తున్న అతనిని చూసి కొద్దిగా బిడియంగా కదిలింది వసుధ.

ఇంతలో తులసికోట దగ్గర , పిడకలమీద పాలు పొంగిస్తూ మాఘపాదివారం పాట పాడుకుంటున్న విఘ్నేశ్వరమ్మ వసుధను చూసి"రామ్మా వసూ. వీడు నా మనవడు వివేక్.యుద్ద విమానాలను తోలుతాడని చెప్పానే వాడే వీడు"అంది.

"అబ్బ ఏమిటమ్మమ్మా, ఎడ్ల బండిని తోలుతానన్నట్లు చెపుతావు."కొద్దిగా కినుకగా అన్నాడు వివేక్. అతను అన్న విధానానికి పక్కున నవ్వింది వసు. విఘ్నేశ్వరమ్మ కూడా నవ్వి,"ఏదోలేరా, ఈ అమ్మాయి వసుధ.యం.ఏ చదువుతోంది. ఈ మధ్యనే మన పక్క వాటాలోకి వచ్చిన హెడ్మాస్టర్ గారి అమ్మాయి."అని పరిచయం చేసి,"మీఅమ్మ పాలు పొంగించటం అప్పుడే పూర్తి చేసిందా ప్రసాదం తెచ్చావు ."అని వసుధతో అంది.

"ఐందండి" అని ప్రసాదం గిన్నె అక్కడ పెట్టి వెళ్ళిపోయింది వసుధ.వసుధ వెళ్ళిన వైపే చూస్తున్న మనవడి తో "ఏం రా అమ్మాయి ఎలా ఉంది? మాట్లాడనా?"నవ్వుతూ అడిగింది విఘ్నేశ్వరమ్మ.

"అబ్బా అమ్మమ్మా ఎన్ని సార్లు చెప్పాను, నేను పెళ్ళి చేసుకోనని. నా ఉద్యోగానికి పెళ్ళి చేసుకొని ఇంకో అమ్మాయిని బలి ఇవ్వలేను."విసుగ్గా అన్నాడు వివేక్ కాని గొంతు కొంచం బలహీనం గానే ఉంది.

"ఏమైందిరా నీ ఉద్యోగానికి ? దేశానికి సేవచేస్తున్న వీర జవానువి.పల్లెటూరి అమ్మాయి ఐనా చదువుకుంటోంది. తెలివైంది. కాస్తో కూస్తో అందమైంది. మనకు తెలిసిన కుటుంబలోని అమ్మాయి. అడుగుతాను."అంది విఘ్నేశ్వరమ్మ.

"నా ఉద్యోగం సంగతి చెప్పు. తల్లి తండ్రులకూ, ఆ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే, అమ్మకూ నాన్నకూ మీకూ అందరికీ నచ్చుతే నాకు ఓకేనే."నవ్వుతూ అన్నాడు వివేక్.

ఈ మాటలన్నీ అటు వైపు గోడ పక్కన ఉన్న వసుధకు వినిపిస్తూనే ఉన్నాయి. ఓసారి వివేక్ రూపంను గుర్తు తెచ్చుకుంది. కొద్దిగా మోటుగా ఉన్నా బాగానే ఉన్నాడు.బహుషా బార్డర్ లో తిరుగుతూ ఉండటం వల్ల చలికి మోటు తేలి ఉంటాడు అనుకుంటూ ఉంటే బుగ్గల్లోకి వెచ్చని ఆవిరి వచ్చింది.

"అక్కా అక్కా "అరుచుకుంటూ వచ్చిన విహారి అరుపు తో ఈ లోకంలోకి వచ్చి,"ఏమిటిరా?" అని అడిగింది.

"అక్కా పొద్దున పక్కింటి మామ్మగారి మనవడు వచ్చాడు. అతను ఫైటర్ పైలెట్ తెలుసా? నేను ఇప్పుడే మాట్లాడి వస్తున్నాను. మిలిటరీ లో చేరాలంటే యన్. డి. యే అని ఉంటుందిట. అక్కడ సెలెక్ట్ అయ్యి , కోర్స్ చేస్తే డైరెక్ట్ గా మిలిటరీ ఆఫీసర్ అవ్వొచ్చుట. నాకా వివరాలన్నీ చెపుతానన్నారు. పరీక్ష వ్రాసేందుకు సహాయం చేస్తానన్నారు."ఆరాధనగా అన్నాడు విహారి.వాడి కి ఎప్పటి నుంచో మిలిటరీ లో చేరాలని ఆశ. వాడి కోరిక తీరే దారి కనిపించిందని సంబర పడిపోతున్నాడు.

వసుధ తల్లి తండ్రులు విశ్వేశ్వరరావు గారు, విశాలమ్మగారి తో విఘ్నేశ్వరమ్మ తన మనవడి సంగతి చెప్పింది.ముందుగా అతని ఉద్యోగం గురించి ఆలోచించారు వారు. కాని వసుధ "ప్రమాదం అన్నది ఎక్కడైనా జరగవచ్చు . యుద్దం లోనే జరగాలని లేదు. నాకు ఇష్టమే"అనటం తో వారి పెళ్ళి కి ఒప్పుకున్నారు.వివేక్ తల్లి తండ్రి వినోదారావు,విమలమ్మ ఇన్నాళ్ళకు మంచి అమ్మాయి తో కొడుకు పెళ్ళి కి ఒప్పుకోవటం తో తమ కోరిక తీరుతున్నందుకు ఉప్పొంగిపోయారు.అందరి ఆమోదం తో వివేక్, వసుధ ల పెళ్ళి వైభోగంగా జరిగిపోయింది.

ఇన్ని సంవత్సరాలుగా ఫీల్డ్ పోస్టింగ్ లో ఉండటము తో ఫామిలీ స్టేషన్ కు పోస్టింగ్ వచ్చి,కుటుంబాన్ని తీసుకెళ్ళేందుకు పర్మిషన్ వచ్చింది. ఇల్లు దొరికింది.వెంటనే వసుధను తీసుకెళ్ళాడు వివేక్. వసుధకు మిలిటరీ జీవితం కొత్తైనా వివేక్ సహాయం తో అక్కడ అలవాటుపడుతోంది. చుట్టు పక్కల ఆఫీసర్ ల భార్యల తో పరిచయం చేసుకుంది. ముఖ్యంగా వివేక్ చిన్ననాటి నుంచి స్నేహితుడు, ప్రస్తుతం సహోద్యోగి ఐన వాల్మీకి చాలా దగ్గరయ్యాడు. నువ్వు నాకంటే చిన్నదానివి, స్నేహితుడి భార్య వు నిన్ను అందరిలా మిసెస్ వివేక్ అనో,భాబీ అనో పిలవను, వసూ అనే పిలుస్తాను అని పరిచయమైన మొదటిరోజే చెప్పేసాడు.

"నువు పెళ్ళి చేసుకో నాకు తోడు వస్తుంది."అనేది వసు. వాల్మీకి నవ్వి ఊరుకునేవాడు. ఎక్కడికెళ్ళినా ముగ్గురూ కలిసే వెళ్ళే వాళ్ళు. ఆనందంగా సాగుతున్న వారి జీవిత నౌక లోకి బబ్లూ విపుల్ వచ్చి చేరాడు. బబ్లూ వచ్చిన ఏడాదిన్నరకే బబ్లీ విజిత వచ్చేసింది. బబ్లీ వచ్చిన ఆరునెలలకు , ఇక్కడకు వచ్చి మూడేళ్ళవుతోంది ఇహ పోస్టింగ్ రావచ్చు అనుకుంటూ ఉండగా బంగ్లాదేశ్ వార్ వచ్చింది.కాంప్ లో ఉన్నవారంతా యుద్దానికి వెళ్ళారు.అప్పుడే యన్.డి.యే లో కోర్స్ ముగించుకొని జాయింగ్ కోసం సెలవల్లో ఉన్న విహరి అక్క దగ్గరకు సహాయంగా వచ్చాడు.

అంతటా యుద్ద వాతావరణం కనిపిస్తోంది. కాంప్ లో అందరూ గంభీరంగా ఉన్నారు. అప్పుడప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎప్పుడే వార్త వినవలసి వస్తుందో నని అంతా గుండె గుప్పెట్లో పెట్టుకొని బిక్కు బిక్కు మంటున్నారు. అన్ని కుటుంబాల ఆడవాళ్ళు ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు.వంటరిగా ఉండలేని కొత్తగా పెళ్ళైన వాళ్ళు పుట్టింటి కి వెళ్ళిపోయారు.అంతటా నిశబ్ధంగా , అప్పుడపుడు పిల్లల కేకలతో ఉంటోంది కాంప్. అందరినీ పలకరిస్తూ, అందరి తో కలివిడిగా తిరుగుతోంది వసుధ.ఎవరికేమి కావాలో అడిగి తెలుసుకుంటోంది. ఏయిర్ మెన్ ల భార్యల దగ్గరకు వెళ్ళి వాళ్ళకు ధైర్యం చెపుతోంది.కాంప్ అంతా ఒక్కతై తిరుగుతూ అందరినీ కలుపుకుంటూ తన భయాన్ని మర్చిపోగలుగుతోంది.ధైర్యంగా ఉంటోంది.ఏ ఏయిర్ మెన్ ఐనా చనిపోయాడని వార్త వస్తే , అతని భార్య ను ఓదార్చి, వాళ్ళ వాళ్ళకు తెలిపి ,ఆమెను ఇంటికి పంపే ప్రయత్నం చేస్తున్నది.వసుధను చూసి మిగితా ఆఫీసర్ ల భార్యలు కూడా వాళ్ళ వాళ్ళ యూనిట్ జవాన్ల భార్యలకు అండగా నిలబడుతున్నారు.కాంప్ అంతా భయం భయంగా శ్మశాన నిశబ్ధం తో ఉంది. అందరూ ఎపుడే వార్త వినవలసి వస్తుందో అని భయపడుతున్నారు. ఇంతలో యుద్దం ముగిసింది అని వార్త వచ్చింది.అందరూ ఊపిరి పీల్చుకొని తమవారికోసం ఎదురు చూస్తున్నారు.

వివేక్ కోసం ఎదురు చూస్తున్న వసు నెత్తిన పిడుగు పడింది. వాల్మీకి విచారం గా వివేక్ యూనీఫాం తెచ్చి వసు చేతిలో పెట్టి నిలబడ్డాడు.ఒక్క క్షణం ఏమి జరిగిందో తెలీలేదు వసుకు. అర్ధం కాగానే యూనిఫాం చేతిలో పట్టుకొని గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.యూనీఫాం ను అరచేతుల్లోకి తీసుకొని అందులో మొహం దాచుకుంది. తను కాపురానికి వచ్చిన మొదటి రోజున యూనీఫాం వేసుకొని వచ్చి స్మార్ట్ గా సెల్యూట్ చేసిన వివేక్ కనిపించాడు.ధుఃఖం పొంగుకొచ్చింది.అలా ఎంతసేపు రోదిస్తూ ఉండిపోయిందో తెలీదు. బయట నుంచి విపుల్, విజితల ఏడుపు వినిపించింది.వాల్మీకి, విహారీ తలుపు కొడుతున్నారు.శోకదేవతలా ఉన్న తలుపు తీసిన వసును చూసి ఇద్దరూ బోరుమన్నారు.తమను తాము నిలవరించుకున్నారు.బబ్లూ, బబ్లీలను వసుకు అందించాడు విహారి. నీకు నేను సపోర్ట్ గా ఉంటాను అన్నట్లు అక్క పక్కన నిలబడ్డాడు.తమ్ముడి భుజం ఆసరాగా చేసుకొని నిలబడ్డది వసుధ.

కాలం ఎవరికోసమూ ఆగదు.ఎవరి సుఖ దుఃఖాల తో దానికి పనిలేదు.అలా సాగిపోతూనే ఉంటుంది.ఎంత తమ్ముడు ఆదరంగా చూసుకుంటున్నా ఎంత కాలమని వాడి మీద ఆధారపడాలి?ఓరోజు వాడికీ పెళ్ళవుతుంది, వాడి కుటుంబము నుఅమ్మానాన్నలను చూసుకోవాలి. ప్రస్తుతము పెళ్ళి కాలేదు కాబట్టి క్వాటర్ దొరకదు. బయట ఇల్లు తీసుకోవాలి అన్ని సమస్యలే! తనను తాను నిలవరించుకొని హైదరాబాద్ వచ్చేసింది. కాలేజ్ లో లెక్చరర్ గా చేరి అమ్మానాన్నలను దగ్గర పెట్టుకొంది వసుధ.

వాల్మీకీది షార్ట్ సర్వీస్ కమీషన్ కావటం వల్ల యుద్దం కాగానే మిలిట్రీ నుంచి రిటైరై హైదరాబాద్ వచ్చి వేరే ఉద్యోగం లో చేరాడు. ఇంక ఇంటిపట్టునే ఉంటున్నావు కదా పెళ్ళిచేసుకోమని సంబంధాలను తేసాగారు తల్లి తండ్రులు.ఎన్ని సంబంధాలు వచ్చినా తన మనసులో ఉన్న అమ్మాయిలా ఎవరూ కనిపించలేదు.అందుకని పెళ్ళిని వాయిదావేస్తూ వచ్చాడు. ప్రతి రోజూ సాయంకాలము, వాల్మీకి వసుధను చూసేందుకు వసుధ ఇంటికి వచ్చేవాడు. కాసేపు వసుధ తో కబుర్లు చెప్పి, వంట్లో బాగాలేని విశ్వేశ్వరయ్య గారితో కాసేపు గడిపి, పిల్లలతో కొద్దిసేపు ఆడుకొని వెళ్ళటం అలవాటు చేసుకున్నాడు.వసుధ వంటరిగా పరిస్తితులను ధైర్యం గా ఎదుర్కోవటము,యుద్ద సమయం లో కాంప్ లో చూపిన చొరవ,పెద్దలకు గౌరవమిచ్చి ఓపిక గా వారికి సేవచేయటము చూసిన వాల్మీకి కి వసుధను వివాహము చేసుకోవాలని కోరిక కలిగింది. తనకున్న తల్లితండ్రుల బాధ్యతకు వసుధ తోడ్పాటు దొరుకుతుందని నమ్మకం కలిగింది.తను వెతికే అమ్మాయి వసుధలా ఉండాలనుకుంటున్నాడు కాబట్టే ఇప్పటి వరకూ ఎవరూ నచ్చలేదు అనుకున్నాడు.ఓరోజు సమయము చూసి వసుధ తో తన కోరికను తెలిపాడు.

ఒక్కసారి చుర్రుమన్నట్లు చూసింది వసుధ. "నన్ను ఉద్దరిద్దామనుకుంటున్నారా? నాకు ఎవరి ఆసరా అవసరం లేదు."విసురుగా ఉంది. "కాదు వసు. నిన్ను ఉద్దరించటం కాదు. నీ ఓపిక, తెలివితేటలు నాకు నచ్చాయి. నువ్వు ధైర్యంగా పరిస్తితులను ఎదుర్కోవటం నచ్చింది. నీకు పెద్దలపట్ల ఉన్న గౌరవం నచ్చింది."అన్నాడు వాల్మీకి.

"అంటే ముందు నుంచీ మీకు ఈ ఐడియా ఉందా?"కొద్దిగా కోపంగా అడిగింది.

"అయ్యో లేదు. ముందు నుంచీ నువ్వు నాకు స్నేహితుడి భార్యవే.నేను నీ స్నేహితుడినే! నీకు తెలుసు కదా మా నాన్నకు పక్షవాతం. ఆయనను చూసుకోవాలి . మావదిన విసుర్లు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు.మా అన్నయ్య పట్టించుకోడు.నేను వాళ్ళను నాదగ్గరే ఉంచుకోవాలనుకుంటున్నాను. నీకు పెద్దల పట్ల ఉన్న గౌరవం, మీ నాన్నగారికి నువ్వు చేస్తున్న సేవ చూస్తుంటే మా అమ్మానాన్నలను కూడా చూసుకోగలవన్న ధైర్యం కలుగుతోంది.నన్నూ పెళ్ళి చేసుకోమని అమ్మా నాన్న అడుగుతున్నారు. కొంత మంది అమ్మాయిలను చూసారు.ఎవరూ నాకు కావలసినట్లుగా అనిపించలేదు. ఎవరో తెలీనివాళ్ళను చేసుకోవటం కన్నా , తెలిసిన దానివి , నా అబిరుచికి, నా మనసుకు నచ్చినదానివి అని నిన్ను ప్రపోజ్ చేస్తున్నాను. నువ్వూ ఆలోచించుకో. మీ పెద్దవాళ్ళను , విహారి ని అడుగు. తొందరేమీ లేదు.బలవంతమూలేదు. నేను ఎప్పటికీ నీ స్నేహితుడినే. టేక్ యువర్ ఓన్ టైం."అనునయం గా అన్నాడు."నేను వివేక్ ను మర్చిపోలేను. రోజూ తలుచుకుంటాను"అంది వసుధ.

"ఎవరు మర్చిపోమన్నారు, నీతో పాటు నేనూ తలుచుకుంటాను "అన్నాడు వాల్మీకి.

"నాకు ఇంక పిల్లలు పుట్టరు." అంది వసుధ.

"పరవాలేదు , బబ్లూ, బబ్లీనే నా పిల్లలు. నువ్వే ఆలోచించుకో నా తరుఫు నుంచి అంతా ఓకేనే."నవ్వుతూ అన్నాడు వాల్మీకి.
అంతటితో ఊరుకోలేదు వాల్మీకి, విహారి కి, విశ్వేశ్వరయ్య గారు, విశాలి గార్లకు కూడా తన నిర్ణయం చెప్పాడు. అందరికన్నా ముందు విఘ్నేశ్వరమ్మగారు మనవారాలిని ఒప్పుకోమని ఒత్తిడి చేసింది.అందరి బలవంతం తో కొంత, ఎదిగే పిల్లలకు తండ్రి అవసరమూ ఉందని కూడాను, కొంత ఇష్టం తోనూ పెళ్ళికి ఓప్పుకుంది వసుధ. ఆ తరువాతవాల్మీకి పెళ్ళి చేసుకున్నందుకు ఏ రోజూ చింతించలేదు.

పిల్లలకు వాల్మీకి అసలు తండ్రి కాడని ఎప్పుడూ ఊహలోకి కూడా రానియ్యలేదు వాల్మీకి. వసుధను, పిల్లలను అంత ప్రేమగా చూసుకున్నాడు.

ముగించింది వసుధ.

"అంటే ఇది నీ కథా ?"విస్మయంగా అడిగింది లలిత.

"అవును.డెభైలల్లోనే నా ఈ పెళ్ళి జరిగింది.పూర్తిగా సాంప్రదాయ కుటుంబమైన మావాళ్ళు సంతోషం గా ఒప్పుకున్నారు.ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్ధం లో నువ్వు అభ్యంతర పెడుతున్నావు.ఇద్దరికీ ఇష్టమైతే, సమస్యలు ఏమీ లేకపోతే ఒప్పుకోవచ్చు. ఆలోచించుకో."అంది వసుధ.

"ఒక సంగతి అడగవచ్చా?"మొహమాటంగా అడిగింది లలిత.

" నీ అనుమానం ఏమిటో అడుగు."అంది వసుధ.

"మీ పిల్లలకు తెలుసా ?"అడిగింది లలిత.

"తెలుసు. కొంచం వాళ్ళకు జ్ఞానం వచ్చాక ఓరోజు ఇద్దరినీ కూర్చోబెట్టుకొని అన్ని సంగతులూ చెప్పాడు వాల్మీకి .వివేక్ గురించి కూడా చెప్పాడు.ఇద్దరికీ దేశం కోసం ప్రాణాలర్పించిన తండ్రి వివేక్ అంటే చాలా ఆరాధన,గౌరవం.చిన్నప్పుడే తమను అక్కున చేర్చుకొని, తండ్రి లేని లోటు తెలీకుండా గారాబంగా పెంచిన డాడీ వాల్మీకీ అంటే అభిమానం.వివేక్ వర్ధంతి రోజున అందరం కలిసి శ్రద్ధాంజలి ఘటిస్తాము.ఆ రోజు పూర్తిగా వివేక్ తలపుల్లోనే ఉంటాము."అని చెప్పింది వసుధ

"తండ్రులిద్దరి ఆదర్శం తో విపుల్ కూడా ఫైటర్ పైలట్ గా చేరాడు. ఈ మధ్య కొద్ది సంవత్సరాలుగా మిలిట్రీ కొన్ని విభాగాలలో అమ్మాయిలను కూడా తీసుకుంటున్నారు కదా, విజిత కూడా ఈ.యం.ఈ విభాగం లో చేరింది." అని కొనసాగించింది.

ఇద్దరూ కొద్దిసేపు ఆలోచనల్లో ఉండిపోయారు. చిన్నగా చీకట్లు ముసురుకుంటున్నాయి.అంతటా నిశబ్ధం గా ఉంది.పక్షులు గూళ్ళకు చేరుకుంటున్నాయి.ఆలోచనల్లో నుంచి తేరుకొని కృతనిశ్చయం తో లేచింది లలిత.

" మా అబ్బాయి తో మాట్లాడి, అసలు వాడి ఆలోచన ఏమిటో, ఆ అమ్మాయిని ఎందుకు పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాడో వివరంగా తెలుసుకొని,వాడిది సదభిప్రాయమైతే ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను."అంది లలిత.

"శుభం " అంటూ లలిత చేతి మీద చిన్నగా తట్టుతూ లేచింది వసుధ.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు