కమాను కట్టల కహానీ..!: - రామదుర్గం మధుసూధనరావు

kamanu veedi kathalu

కబుర్లు...కట్టలు...ఈ రెండూ లేకుంటే కమానుకు కళ లేనట్టే! అసలు ఇవి లేవంటే కమాను గురించి చెప్పుకోడానికి...మాట్లాడుకోడా

నికి ఏమీ ఉండదు! అటు చింతకుంట ఓణి...ఇటు కుంబార గేరీ మధ్యన కమాను ఠీవిగా...రాజసంతో వెలిగిపోతుండేది. అటూ ఇటూ రెండు గేరీలున్నా...కమాను పేరు చెప్పగానే ఓ అదే కదా వరసగా ఇళ్లు...కట్టలు ఉంటాయే...అంటూ చప్పున గుర్తు చేసుకునే వారి సంఖ్య పెరిగి పోతుండటంతో మా కమాను అందరీ నోటమాట అయింది. కమానులోని వాళ్లకు రెండే పనులు ప్రధానంగా ఉండేవి. ఒకటి ఇంటి పని...రెండు నోటి పని. అంటే సుద్దులు చెప్పుకోవడం. పొద్దెక్కింది మొదలు రాత్రయ్యే దాకా సుద్దులు చెప్పుకోనిదే మాకు గొంతులో ముద్ద దిగేది కాదు. అలాగని చుట్టుపక్కల గేరోళ్ల విషయాల జోలికి వెళ్లేవాళ్లం కాదు. అసలు ఆ అవసరమే వచ్చేది కాదు. పద్మూడిండ్లు... ఆ ఇండ్ల వ్యవహారాలు...వారి బంధువుల కబుర్లు ఇవి సాలు బతికినంతకాలం సెప్పుకోడానికి...మాట్లాడుకోడానికి మాకు వేరేవోళ్ల యిసయమే బేకులేదప్పా! అనేట్టుండేవాళ్లం. అందుకే పక్క గేరోళ్లు అప్పుడప్పుడు వచ్చి మా కమానులో సుద్దులు...మీటింగులు పెట్టుకునే వారు తప్పా...కబుర్ల కోసం కమాను దాటే కరవు మా కెప్పుడూ రాలేదు!!
ఇంధ్ర« ధనస్సులా ...బోర్లేసిన నెలవంకలా... కమాను ముఖద్వారం. మధ్యలో నిలబడి చూస్తే అటూ ఇటూ సింహాసనాల్లా పరచుకున్న కట్టలు. ఎదురుగా బుజ్జిగణపతి గుడి. ఉదయం ఆరుగంటలకే కమానులో సందడి హడావుడి సురు అయ్యేది. మహానందయ్య సారు ట్యూషను సానా జోరు. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల దాకా మళ్లీ సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది దాకా విపరీతంగా స్టూడెంట్లుండేవారు. ఇంట్లో ఓ పది మంది...రెండు కట్టలపైన మరో పది మందితో కిటకిటలాడేది. సారు అటు ఇటూ తిరుగుతూ పాఠాలు చెప్పేవారు. సారు కొడుకు బుస్సి నాకు దోస్తు. నాకంటే పెద్ద క్లాసు సదువుతున్నా...కబుర్లు చెప్పుకునే వాళ్లం. బుస్సి వాళ్లమ్మ విశాలాక్షమ్మక్క అమ్మకు జిగ్రీదోస్తు. రోజుకు కనీసం అయిదారు సార్లు కూచుని మాట్లాడుకుంటే తప్ప వారికి పొద్దు గడిచేదే కాదు. ఒక్కో ఇంటి ముందు కట్టకు ఒక్కో లక్షణం ఉండేది. బుస్సివాళ్ల కట్టేమో పొద్దున్న స్టూడెంట్లా...రాత్రి మటుకు సారు ఇంట్లోకే కూసోబెట్టుకునేవాడు. ఆ పక్కనే అచ్చణ్ణ కక్క వాళ్లిల్లు. అచ్చణ్ణ కక్క నాన్న కాశీపతి తాత ఇరుగు పొరుగు కట్టపైన కూర్చొని లోకాభిరామాయణం మాట్లాడేవాడు. రోజూ టంచనుగా బంధువుల ఇళ్లకు వెళ్లి క్షేమసమాచారాలు తెలుసుకోవడంలో ఆయనకు పోటీ ఎవరూ ఉండేవారు కాదు. అందరి బంధువయా... అనేలా ఉండేవాడు. మునిసిపల్‌ హైస్కూలు టీచరుగా రిటైర్‌ అయిన కాశీపతి తాత అంటే మా బంధువులే కాదు...చుట్టుపక్కల వీధుల్లోనూ ప్రసిద్దే. ఏ విషయాన్నైనా చక్కగా వివరించేవారు. సుప్రసిద్ధ హిందీ సినిమా నటి వహీదా రహమాన్‌ కాశీపతి తాత స్టూడెంటేనని ఓ మాట వినిపిస్తుండేది. ఆ తర్వాతి కాలంలో ఆర్ట్స్‌ కాలేజీ తెలుగు లెక్చరర్‌ మర్రేగౌడ సార్‌ చేరుకున్నారు. సార్‌ కొడుకులు రాజశేఖర...శ్రీనాథ మా స్నేహితులు. మూడో ఇల్లే మాది. నాన్న ట్యూషన్లు ఇంట్లోనే చెప్పేవాడు. నేను ఉదయం.. సాయంత్రం కట్టపై చాపనో...జమకానానో వేసుకుని సంచి ముందుబెట్టుకుని చదువు వెలగబెట్టేవాణ్ని. నాన్న రేయ్‌ ఇంట్లో కూర్చోవచ్చు కదా...అంటున్నా నేను కట్టపై కూర్చోనేకే ఇష్టపడేవాణ్ని. కారణం...చదువు తప్ప అన్నీ చేయవచ్చని. వచ్చీపోయేవారిని చూస్తూ...కట్టలపై అమ్మలక్కల మాటలు వినేకి అష్టకష్టాలు పడుతూ... ఫ్రెండ్స్‌ ఎవరైనా అటు వస్తారా అని మొహం వాచిపోయేలా ఎదురు చూస్తూ.... అప్పుడప్పుడు పుస్తకాలకేసి చూస్తూ...చాలా కతర్నాక్‌తా తల వాడి టైంపాస్‌ చేసేస్తుండేవాణ్ని. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే...మా కమాను పిలగాళ్లం రోజులో కనీసం ఓ రెండుసార్లయినా కమాను కట్టలపై గెంతుతూ ఈ వైపు నుంచి ఆ వైపుకు వెళుతుండే వాళ్లం. ఇంట్లో వాళ్లు...రేయ్‌...ఎవర్రా ఎగురుతుండేది అని అరిచేలోపు అందనంత దూరం వెళ్లేవాళ్లం.
మా ఇల్లు తర్వాత వనజమ్మవ్వ ఇల్లు. కమానుకు ఇంత పేరు రావడానికి మూల కారణం వనజమ్మే! కమాను వనజమ్మ గొంతు విప్పితే కంచులా ఖంగ్‌ అనేది. భర్త పోయాక ...సంప్రదాయం అనుసరించి మడి రూపంలో ఉన్నా...మాటల్లో అందరినీ ఆప్యాయంగా తడిమే ఓ మంత్రశక్తి ఉండేది. వనజమ్మవ్వ ఉదయం ఏడు నుంచి ఎనిమిది దాకా...సాయంత్రం అయిదు నుంచి ఎనిమిది దాకా కట్టపైనే కూర్చొని కాలాపహరణం చేసేది. ఎదురుగా శరభణ్ణ వాళ్లిల్లు. శరభణ్ణ చాలా కోపం...దురుసు మనిషని...ఆవేశం వస్తే రంకెలు వేసేవాడని కమానులో అందరికీ తెలుసు. పార్వతమ్మక్కకు ఆయప్పతో పెద్ద కస్టమే వచ్చేది. ఎప్పుడు ప్రేమతో పండ్లు తెస్తాడో...ఎప్పుడు కోపంతో పండ్లూడకొడతాడో తెలీదన్నట్టుగా ఉండేది వ్యవహారం. ఈ సంగతి వనజమ్మవ్వకి బాగా తెలుసు. అందుకే పార్వతమ్మక్క బైట అంగళి కసవు నూకేకి పరక పట్టుకొస్తేసాలు...ఎమమ్మా పార్వతమ్మ పని సురు చేసిండావా...ఏంటి సంగతులు...అంటూ మెల్లగా ఆరా తీసేది. పార్వతమ్మక్క వ్యంగ్యంగా...ఈడ నీ కొడుకు కత సానా అవుతుండాది...తట్టుకోలేకపోతుండాను అనేది. ‘అవును మల్ల...ఆయప్ప సాక్షాత్తు శివుడు...సిట్టు ఎంత సేపుంటుంది...నెత్తిపై నీల్లు పోస్తే సాలు ఇట్టే చప్పున చల్లారిపోతాడు అంటూఅంతే సాణిగా మాటలు కలిపేది. పిల్లోళ్లు ఏడ్చి మారాం చేస్తుంటే...ఈడ పంపియ్‌...అంతా సక్కగా చేసేస్తాను అంటూ పిల్లల్ని బెదిరించేది. ఇంత హడావుడి చేస్తూ చుట్టుపక్కల వారిని మాటలతో ముంచెత్తే వనజమ్మవ్వ ముందు ఇప్పటి రేడియో జాకీలు ... బలాదూరు అనే చెప్పాలి. ఊరంతా నోటి మాటలతో తీపి పంచే వనజమ్మవ్వ ఇంట్లో కోడలితో మాత్రం మాటల యుద్ధమే చేసేది. నాగమ్మక్క మెల్లగా మాట్లాడేదే కానీ అంతకంకంతకు ఏం తక్కువ కాకుండా దట్టించేది. ‘ఏంటే...అప్పట్నుంచి సూస్తుండాను మాటలు సానా జోరుగా ఇడుస్తుండావు...నీ తెలివి నా దగ్గర కాదు’ అని వనజమ్మ అనేది తడువు...‘నేనేమన్నా అత్తయ్యా...’ అంటూ నాగమ్మక్క రాగాలు తీసేది. ‘నువ్వేం చేసావో...చేస్తున్నావో అన్నీ నాకు తెలుసే...వాడు రానీ చెబుతా నీ కత’ అంటూ తూటాలు వదిలేది. ఒక్కోసారి కోపం పెరిగి...‘వాడు నాకు కొడుకు తర్వాతే నీకు మొగుడు...తెలుసుకో’ అంటూ సవాళ్లు విసిరేది. ‘నేను కాదన్నానా అత్తయ్యా...’ నాగమ్మక్క అంటుంటే వనజమ్మవ్వకు కోపం నెత్తికెక్కేది..‘సానా జాణలే నువ్వు ఇంక సాలు గానీ...’ అని కస్సుమనేది. ఇంత యుద్దం నడిచాక ఎవరైనా ఇంక అత్తాకోడళ్ల మధ్య ప్రళయమే అనుకుంటామా...ఇంత జరిగి పదినిమిషాలైన కాకముందే నాగమ్మక్క ...వనజమ్మవ్వ వద్దకు వచ్చి ‘కాస్త కాళ్లివ్వండి దండం పెట్టుకోవాలి...’ అంటూ అమాయకంగా నిలుచునేది. ‘ఆ..ఆ...దీనికేం తక్కువ లేదు’ అంటూనే వనజమ్మవ్వ కాలు కింద పెట్టి మొక్కించుకునేది. ఈ దృశ్యం ప్రతిరోజూ కనిపించేది. ఈ అత్తాకోడళ్లు మా కమాను సెలిబ్రిటీలు. చుట్టుపక్కలా కమాను అనగానే వీరి పేర్లే మొదట చెప్పేవారు. వనజమ్మవ్వ కొడుకు మూర్తికి మొక్కాలి. సానా ఓపిక. ఇంక అరిస్తే తప్ప లాభం లేదన్నప్పుడు ‘కాస్త ఇద్దరూ ఊరుకుంటారా లేదా...’ అంటూ హూంకరించేవాడు.
ఆ తర్వాత బసమ్మవ్వ...గౌరమ్మల కట్టలు అవి కాస్త ప్రశాంతంగా ఉండేవి. పెద్ద సందడి కనిపించేది కాదు. గౌరమ్మక్క ఇల్లు పక్కనే చెంద్రి వాళ్లిల్లు...అక్కడితో ఓ వరస ముగిసేది. మళ్లీ సదానందయ్య సారు ఇంటితో మరో వరస మొదలు. మహానందయ్య సారు తమ్ముడు సదానందయ్య. ఇల్లు కాస్త లోపల ఉండటంతో కనిపించేది కాదు. సారు ఇంట్లోనూ ట్యూషన్‌ పిల్లల సందడి సానా ఉండేది. ఆ పక్కనే కోమలమ్మక్క వాళిల్లు ఆ కట్ట కాస్త పెద్దదే అయినా ఆడ కూసొని కబుర్లు చెప్పేవాళ్ల సంఖ్య తక్కువ. ఆ పక్కనే పెదానాన్న వాళ్లిల్లు. విచిత్రంగా ఆక్కడ్నుంచి మళ్లీ సందడి పెరిగేది. రఘు...రామన్నయ్య...శీనన్నయ్యలు కట్టలపై కూర్చొని కబుర్లు చెప్పేవాళ్లు. నేను కాస్త పెద్దయ్యాక అక్కడే ఎక్కువ సేపు కూర్చొనేవాణ్ని. పెదనాన్న కట్టపై కూర్చొని ఏదో చదువుతుండేవారు. మా ఇంటి ఎదురుగా శరభణ్ణ వాళ్లున్నా... ఆతర్వాత పక్కింటికి మారారు. పెదనాన్న...శరభణ్న కమానులో వీళ్లిద్దరి ఇంటి ముందు మాత్రమే కట్టలపై తడక పైకప్పుగా కనిపించేది. ఎండకాలం...వర్షాకాలంలోనూ హాయిగా కట్టలపై కూర్చొనేవారు.
కమాను కట్టల గుణగణాలు సమయానుగుణంగా మారిపోయేవి. అచ్చణ్ణ కక్క...నాన్న తదితరులు మాట్లాడేటపుడు సమాచార వేదికలుగా కనిపించేవి. అయితే ఇది చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. ఉదయం పది తర్వాత చాలా కట్టలు దోబీఘాట్లులా మారేవి. విశాలాక్షమ్మక్క...సీతమ్మ పిన్ని...అమ్మ...నాగమ్మక్క...ఎదర పార్వతమ్మక్క అందరూ ప్లాస్టిక్‌ టబ్‌లో నీళ్లు...బకెట్టు బండెడు బట్టలు టప...టప..అంటూ ఉతికేవాళ్లు. ఈ ఉతుకుడు మధ్య మాటలు ఎలాగూ ఉండేవి. మధ్యాహ్నం రెండు గంటలప్పుడు వడియాలు...బియ్యం నూకలు...ఎండు మిరపలు...ఆరబెట్టుకునే దృశ్యాలు కనిపించేవి. సాయంత్రం ఆరు గంటల నుంచి ఇక సత్సంగా కార్యక్రమాలు సురు. వనజమ్మవ్వ ఇంటి కట్టలపై ఒకసారి హాస్యవల్లరి...ఓ సారి ఆధ్యాత్మిక ప్రవచనాల అనుగ్రహ భాషణ...ఓ సారి పక్కా సంసారిక సంగతుల ఇలా రేడియోలో వివిధభారతి...కదంబ కార్యక్రమాలను తలదన్నే మాటల షోలు నడిచేవి. రాత్రి తొమ్మిది నుంచి పది దాకా విశాలాక్షమ్మక్క...అమ్మ...పార్వతమ్మ తదితరుల గుంపు ఓ వైపు...కోమలమ్మ ...బసమ్మ...గౌరమ్మల గుంపు మరోవైపు గుసగుసల కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించేవారు. ఓ సారి అసెంబ్లీని తలపించే రీతిగా...మరోసారి తీర్పులు వెల్లడించే న్యాయస్థానాల స్థాయిలో కట్టలు అద్భుతంగా వెలిగిపోయేవి. కట్టలు తెగిన ఉత్సాహంతో మాటల ప్రవాహం నిరంతరం సాగే కమాను కట్టలు చైతన్యానికి ప్రతీకలుగా నిలిచేవి.
ఎండాకాలం వచ్చిందంటే కమాను వాళ్లంతా కట్టలపైనే పడుకునే వారు. నేను నాన్న ఓ కట్టపై...మధ్యలో గుమ్మం ముందు అమ్మ చిన్న చెల్లి ..ఆవల కట్టపై అక్కా పెద్దచెల్లి...పడకునేవాళ్లం. వేసవిలో రాత్రి ఎంత టైమయినా మాటల ముచ్చట్లు ఓపట్టాన తేలేవే కాదు. వనజమ్మవ్వ పొడుపు మాటలు...నవ్వించే కబుర్లతో వేసంగి రాత్రి మాటల మల్లెపూల చెండులా కమాను అంతటా గుప్పుమంటూ గుబాళించేది. నాన్న లేపు పక్క సందులో జంకానా వేసుకుని పడుకునే వాణ్ని. తెల్లారాక నాన్న లేపు తీసి లోపల పెట్టినా అలాగే నిద్రలో జోగేవాణ్ని. కొన్నిసార్లు పొద్దున్నే లేచి చూస్తే నాపక్కన దర్జాగా కుక్క పడుకుని కనిపించేది...భయంతో గట్టిగా అరిస్తే అది పారిపోయేది. అయితే ఈ ఘటన తరచూ జరుగుతుండటంతో అరవడం మానేసి...కసిదీరా కాలితో తన్నడం మొదలెట్టాను. అది కుయ్‌..కుయ్‌...అని తోక జాడించి పరిగెత్తేది. ఒక్కోసారి ఉదయానే నా పక్కన కుక్కను చూసిన కొందరు ‘ఏరా జమకానా నీకా కుక్కకా...’ అంటూ నవ్వేవారు. ఈ అవమానం చాలదన్నట్టు ఓసారి నీలివార్త కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఎలా పుట్టిందో...ఎవరు పుట్టించారో తెలీదు గానీ ..రాత్రి ఆకాశంలో ఓ స్త్రీ తెల్లచీర కట్టుకుని అలా నడచి వెళుతుంటుందని...ఆవిడ వెనక కొంగు మైలు దూరమంత పొడుగుంటుందని...ఆమె జుట్టు విరబోసుకుని నడుస్తుంటే...నక్కల కూతలు వినిపిస్తుంటాయని...ఈ సీను చూసినోళ్లకి ఇంక సావు దగ్గరపడినట్టే అని. రాత్రి కట్టపై పడుకోగానే పైన ఆకాశం భయపెట్టేది. చిన్న తెల్లని మేఘం కనిపించిన భయంతో వణికి చచ్చేవాణ్ని. అర్ధరాత్రి మెలకువ వచ్చినా బలవంతంగా కళ్లుమూసుకుని నిద్రపోవాల్సి వచ్చేది. మరి ఎంత వరకు సరో తెలీదుగానీ...నీలి చెడితే ఇలాంటి వదంతులు పుకార్లు పుట్టిస్తారని అమ్మావాళ్లు అనేవాళ్లు!
కమాను కట్టలతో మా అనుబంధం అంతింతా కాదు. ఆ అరుగులు మా జ్ఞాపకాలకు మెరుగులు దిద్దాయి. మా ఏడ్పు...మా నవ్వు...మా అమాయకత్వం...పెద్దల మాటకారితనం..ఇంట్లోపల...బైటా గొడవలు..గుసగుసల వ్యూహాలు అన్నింటికీ ఈ కట్టలు మూగసాక్ష్యాలు. ఈ కట్టలే లేకపోతే ఇంత అనుభవం...అనుభూతి దక్కేది కాదేమో. కమాను వటారం వాళ్లని వగ్గట్టుగా ఉంచింది కట్టలే అని చెప్పొచ్చు! రాత్రి వేళల్లో నిర్భయంగా కమాను ఆడవాళ్లు కట్టలపై కూర్చొని కబుర్లుచెబుతుంటే...నాన్న మరికొందరు స్నేహితులు రాత్రి వేళల్లో కబుర్లు చెప్పుకోడానికి కమానుకు కాస్త దూరంలో చౌరస్తా వద్ద ఉన్న మెడికల్‌ షాపు కట్టను వేదికగా మార్చుకున్నారు. దీనికి ‘జనార్దన కట్ట’ అని పేరుకూడా పెట్టుకున్నారు. రోజూ వర్షం వచ్చినా గొడుగు వేసుకుని అయినా జనార్దన కట్టకు వెళ్లేవారు. నలుగురు కల్సి కబర్లు చెబుతుంటే చాలు లాఠీలు అదలించడమే అలవాటుగా మారిన పోలీసులు కూడా చాలా సందర్భాల్లో కట్టలపై కబుర్లు చెబుతున్న వీరిని...‘సార్‌ ఇవాళ్టికి ఇంక ముగించండి ...ఇళ్లకెళ్లండి..’అనేవారట!
ఇప్పుడు కమానులో కట్టలు మాయమై పోయాయి. రాజసం ఉట్టపడేలా పరచుకున్న వీధీ బక్కచిక్కి పోయింది. అనుకుంటే బాధ...అనుకోకపోతే మనోవ్యథ...మా అస్తిత్వానికి...మా ఆనవాళ్లకి చిరునామాలుగా నిలిచిన కమాను కట్టలు నామమాత్రంగా కూడా కనిపించడం లేదు. వాటిని ఆక్రమించి రూములు కట్టేసుకున్నారు. ఒకటో అరో ఉన్నా...అవీ బోసిగానే ఉంటున్నాయి. కబుర్లు చెప్పే ఓపికా...తీరికా ఉన్న ఆ తరం వెళ్లిపోయాక ...మేం ఉండి మాత్రం ఏం లాభం అనుకున్నాయేమో...కట్టలు మాయమై పోయాయి. పదివేల జన్మలకు సరిపడా అనుభూతుల్ని పోగుచేసుకోడానికి అవకాశమిచ్చిన కట్టలకు కోటి కోటి దండాలు!!
.
––––––
వటారం–కాలనీ, వగ్గట్టు–కలిసికట్టు, కట్ట–అరుగు, సిట్టు–కోపం

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు