మోడిఫికేషన్ - సుంకర వి. హనుమంత రావు

modification

ఆరోజు..నవంబర్ పద్దెనిమిది..రెండువేల పదహారు..నల్ల కుబేరుల..తద్దిన దినం. “ సమయం రాత్రి ఎనిమిది. నెలల తరబడి జీతాలు రాకపోయినా..దేశం మొత్తం ఆర్ధికమాంద్యంతో అల్లాడి పోయినా..లంచాల రొచ్చులో..ముష్టెత్తుకుంటూ విలాస జీవితాన్ని గడిపేయగల యుడీసీ జానకిరాం.. త్రీ బెడ్ రూం ఫ్లాటది . పెళపెళలాడే లంచాల డబ్బుతో సిగ్గూశరంలేని తళతళలాడే ముఖంతో రోజూ ఇంట్లోకి అడుగు పెట్టే..భర్త ..సర్జికల్ స్ట్రోకుతో చావు దెబ్బ తిన్న పాకీస్తాన్ లా పెద్ద నోట్ల రద్దుతో.. పీక్కు పోయిన ముఖంతో జీవచ్చవంలా వచ్చినా గమనించని అర్ధాంగి..ధనలక్ష్మి

“ఏమండీ ఇవ్వాళో వింత జరిగి పోయింది.. అది విన్నారంటే త్రిల్లయి పోతారు. అదేంటో అడగరే..? ప్రతి రోజూ ఇంట్రావర్టని..ముంగని ఆడిపోసుకుంటారే..మన బాబీగాడు యివ్వాళేం చేశాడో తెలుసా? స్కూలునుంచి రాగానే యాంకరై పోయాడు. వాడి యాంకరింగ్ ముందు..యిటు సుమ అటు ప్రదీప్ కూడా బలాదూరంటే నమ్మండి.స్కూల్నుంచి వస్తూనే సెల్ మైకులా చేత్తో పట్టుకొని..దాదాపు వంద ప్రశ్నలడిగి సమాధానాలు రికార్డు చేసుకున్నాడు. వాడడిగిన ప్రశ్నలన్నీమీ గురించీ.. మీ సంపాదన .. మన ఖర్చుల గురించే. రేపు స్కూల్లో లెటర్ రైటింగులో ఏదో అసైన్ మెంటు సబ్మిట్ చేయాలట.”

నాన్ స్టాపుగ చెప్పుకు పోతున్న భార్య వంక అభావంగా చూసిన జానకిరాంకి అందులో ఒక్క ముక్కా అర్థం కాక పోయినా మీ సంపాదన మన ఖర్చుల గురించే నన్న మాట బుర్రలోకి ఎక్కి పోయింది. తల విదిలించి తడబడి పోయాడు.

“ఆ ..ఏమన్నావ్.. ?నా సంపాదనా ఖర్చుల గురించా ? ..ఇంతకూ మన బాబీ ఎక్కడా?” “వాడు ఏడుగంటలకే భోంచేసి..ఏదో లెటర్ రాసుకోవాలని చెప్పి తన బెడ్ రూంలో దూరి పోయాడు. మన శాన్విని కూడా రావద్దని వార్నింగిచ్చాడు. ఔనూ.. మీరేంటి అలావున్నారు..కాఫీ యిమ్మంటారా..ప్రషప్పయి..డిన్నర్ చేస్తారా?

“ఏం లేదు గానీ .. ఎందుకో ఆకలిగా లేదు..భోజనం చేయను..ఓ గ్లాసు మజ్జిగ చాలు.”

“పోనీ కొంచెం ఉప్మా చెయ్యమంటారా.?

“వద్దు ధనా..బటర్మిల్క్ చాలు.” సోఫాలో కూలబడి పోయాడు. కొడుకు చేసిన ఘనకార్యాన్నే నెమరేసుకుంటూ..మరో లోకంలో విహరిస్తున్న ధనలక్ష్మి..కిచెన్ లోకి జంపై పోయిందే తప్ప భర్తలో ముఖంలో తొంగి చూస్తున్న చావు కళను గమనించలేక పోయింది.

******

సమయం పన్నెండైంది. పది రోజుల నరక యాతన..పరాకాష్టకు చేరిపోయిందన్నట్లు..కునుకుకు కూడా దూరమైన కళ్లు రెండూ పేలిపోతాయన్న ఫీలింగ్ తో బాటు ..డబ్ డబ్ ల గుండెలను చేత్తో అదుముకుంటూ..నల్ల పిల్లిలా లేచి.. మూడో బెడ్ రూం లోకి అడుగు పెట్టాడు. తన మనసు లాగే అంధకారం వ్యాపించి పోయి అర్ధ రాత్రి భయోత్పాతాన్ని రేకెత్తించే స్మశాన వాటికలా కనిపించింది. తడుముకుంటూ లైట్ ఆన్ చేశాడు. తన అవినీతికి అంతిమస్ధానం లంచాల మనీకి రహస్య స్ధావరం..జెయింట్ కాట్ ఆహ్వానం పలికింది.తలుపు మూసి సీక్రెట్ కోడ్ నెంబరును కాట్ లో కలిసి పోయనట్లున్న లాకర్ కు ఫీడ్ చేశాడు. ఎలాంటి శబ్దమూ లేకుండా బెడ్ పార్టంతా ఓపెనై పోయంది. క్రిక్కిరిసి పోయిన..శవాల్లా కనిపించాయి ఫ్రాణాలు కోల్పోయిన వెయ్యి రూపాయల నోట్లు. దాదాపు పది కోట్ల పైమాటే. ఏడ్చేయాలనిపించింది. ఇంకా నేనెందుక బ్రతికున్నానా..అన్న స్మశాన వైరాగ్యం..కమ్మేసింది..కారు మబ్బులా. ఇంత కాలం ఇంతమంది ఉసురు పోలుకుని..ఇలాంటి నీచమైన బ్రతుకు బ్రతికి..చివరకు సాధించింది ఇంతేనా అనిపించింది...క్షణంసేపు. మురిగి పోయిన శవాల్లా ఆ పెద్ద నోట్లు..శవ పేటికలా ఆ కాట్ తట్టుకోలేక బావురుమన్నాడు జానకిరాం. పది రోజుల తన మానసిక వేదనకు ఏడుపే దిక్కని ఫీలయ్యాడు. ఆదే ఆఖరి స్పర్స ఆన్నట్లు కరన్సీని తడిమి చూసుకున్నాడు. కట్టలు తెంచుకున్న దుఖాన్ని ఆపుకోలేక విలవిల లాడిపోయాడు. తన ముందు లంచాలివ్వలేక ఏడ్చేసిన ఎందరో అభాగ్యుల..ముఖాలు అపహాస్యం చేస్తున్నట్లు.. వెక్కిరిస్తున్నట్లు విలయ తాండవం చేస్తుంటే..శవ పేటిక క్లోజ్ చేసి కాట్ మీద ఒరిగి పోయి కళ్లు మూసుకున్నాడు.

దాదాపు గంట సమయం గడిచి పోయింది. ఏదో నిర్ణయానికొచ్చినట్లు లేచి లైటు ఆఫ్ చేసి లాక్ చేసి తన బెడ్ రూం వైపు కదులుతుంటే బాబీ రూం వెలుగుతున్న లైటు చూసి ఆశ్చర్య పోయాడు. బెడ్ లైటున్నా నిద్ర పోని బాబీ మనస్తత్వం ఫ్లాషై కొడుకు రూం లోకి తొంగి చూశాడు.

ఓ మంచం మీద బాబీ..మరో కాట్ మీద కూతురు శాన్వీ గాఢ నిద్ర లో..కనిపించారు. భాబీ రీడింగ్ టేబుల్ మీద బుక్ క్రింద..రెపరెప లాడుతున్న పేపర్ జానకిరాం దృష్టి నాకర్షించింది. వణికే చేతులతో పేపర్ తీసుకుని చదివాడు. ఆఖరి వాక్యం పూర్తిచేయకుండానే గుండె కలుక్కుమంది. లైటార్పి తన బెడ్ రూంలోకి వచ్చేశాడు. అప్పటికే లేచి కూర్చున్న ధనలక్ష్మి భర్త వాలకాన్ని చూస్తూనే గాబరాగా లేచొచ్చి ..

“ఏమైంది.? .ఎక్కడికెళ్లారు.? .చేతిలో ఆ పేపరేంటి..? మంచినీళ్లు ఇక్కడే వున్నాయి..మరి” అంటూ ఆతృతగ అడుగుతున్న భార్యను అదోలా చూస్తూ తన చేతిలోని పేపర్ మౌనంగా అందించాడు. అదురుతున్న గుండెల్ని అదుపులో పెట్టుకుంటూ చదవడం మొదలు పెట్టింది. పేరా పూర్తవుతూనే అది కొడుకు తండ్రికి రాసిన ప్రేమ లేఖ కాదని అర్ధమై పోయింది. స్కూలు అసైన్ మెంటు కూడా కాదని కన్ ఫం అయిపోయింది . అక్షరాలవెంట..అయోమయంగా పరుగులు పెట్టింది.

“డియర్ డాడీ.! నన్ను ఎక్స్ క్యూజ్ చేయండి. నా మైండ్ ను బ్రేక్ చేస్తున్న మేటర్ మీతో షేర్ చేసుకోవాలని ఈ లెటర్ రాస్తున్నా. మార్నింగ్ స్కూల్ బస్..దిగుతుండగానే మా బస్ డ్రైవర్ సాదిక్ వచ్చి నా స్కూల్ మేట్స్ అందరి ముందు..రాకేష్ బాబూ!..మాదీ నాన్న మీ డాడీ డిపార్ట్ మెంటులోనే డ్రైవర్ గా రిటైర్ అయ్యిండు. ఆయన్కీ పెన్షన్ గాట్యుటీ ఇంకా సెటిల్ కాలేదు. మీదీ డాడీ గార్ని అడిగితే పైసల్ తెమ్మన్నారంట. మాదీ గరీబు పేమిలీ. మేము లంచాలు యిచ్చుకో లేం. మీదీ డాడీకి చెప్పున్రి బాబూ..మాదీ డాడీ పెన్ సన్ అచ్చినంక నేనే తెచ్చి తమకు యిస్తాను .

జరిగింది వెరీ స్మాల్..బట్ లంచ్ బ్రేక్కల్లా రియల్ పిక్చర్ స్టార్టై పోయింది...నన్ను చూసిన నా కలీగ్సంతా ..లంజాకో.. అంటుంటే.. అర్ధం కాలేదు. తర్వాత వెలిగాయ లైట్లు..డాడీ..దాని ఫుల్ ఫాం..లంచగొండి జానకరాం కొడుకని. లాస్ట్ మంత్ ఇలాంటి సిట్యుయేషన్ లోనే ఐమీన్ వాళ్ల డాడీని ఎసిబీ ట్రాప్ చేసి ..అరెస్ట చేశారని మా స్కూల్ స్టూడెంటు స్కూల్ బస్ లోంచి దూకి సూయ్ సైడ్ చేసుకున్నాడు. నాతో బాటు శాన్వీ వుండడంతో..నేనీ పని చేయలేక పోయాను . ఐ స్వేరిట్. ఇదే విషయం రేపు స్కూల్లో వైల్డ్ ఫైరై పోతుంది. స్టాఫ్ మెంబర్స్ తోబాటు..అటెండర్స్ క్కూడా నేను లోకువై పోతాను ..రాకేష ప్లేస్ లో మీ చెత్త నేమ్ తో బాటు నా నేమ్ కూడా..ఫౌండేషన్ స్టోన్ లా పర్మినెంటై పోతుంది. హౌకెనై కంటిన్యూ ఇన్ ద సేమ్ స్కూల్.?

మీకూ నాకే కాదు..తరతరాలకు ఆ మచ్చ అలాగే కంటిన్యూ అవుతుంది. సాయంత్రం మమ్మీచెప్పింది..మీ సంపాదనంతా మాకోసమేనని . మాచదువులు కోసమేనని ఈ లంచాలు ..ఈ నికృష్ట ఎర్నింగ్స్ మేము కోరుకున్నామా డాడీ? .మా బస్ డ్రైవర్ డాడీ లాంటి పూర్ పీపుల్స్ ని టార్చర్ చేసి సంపాదిస్తే మనం డెవలప్పయి పోతామా? మేము పోష్ లొకాలిటీలో ఫ్లాటు.. కార్పొరేట్ స్కూల్స్ లో సీటు.. అడిగామా డాడీ.? కార్లూ మల్టీ ప్లెక్సుల్లో మూవీస్ అడిగామా.? మీరు మీతోబాటు ఇద్దరు బాబాయిలు ఏ కార్పొరేట్ స్కూల్లో చదివారు? మొన్న హాలిడేసులో తాతయ్య గారి ఊరెళ్లినప్పుడు..మీరు చదివిన గవర్నమెంట్ స్కూల్ చూశాను. బిగ్ ప్లేసు.. ఫెంటాస్టిక్ ప్లే గ్రౌండ్.ఆల్ ఆర్ ట్రెయిండ్ టీచర్స్. నేనూ చెల్లీ ఆ స్కూల్లోనే స్టడీ చేస్తాం. మేం ఊరెళ్లిపోతే మిగిలేది మీరూ మమ్మీ..త్రీ బెడరూం ఫ్లాటు అవసరమా? లంచాలు తీసుకోకుండా..లైఫ్ లీడ్ చేయ లేరా? .మీరెంత మనీ బ్రైబ్ గా ఎర్న్ చేశారో నాకు తెలీదు. మీ లాంటి కరప్ట్స్..దేశాన్ని లూటీ చేసిన దొంగలేగా మోడీ అంకుల్ బ్లాక్ మనీని టార్గెట్ చేస్తూ చేసిన సర్జికల్ స్ట్రైక్ కు ప్రాణాలు పోయినట్లు షౌట్ చేస్తోంది? మీ దగ్గరా యిలాంటి డర్టీ కరెన్సీ వుంటే..గవర్నమెంటుకు సరండర్ చేయండి.లంచాలు లేకుండా జాబ్ చేయలేకపోతే తాతయ్య గారి వూరొచ్చి వ్యవసాయంచేయండి. రేపు మార్నింగే నేనూ శాన్వీ బస్ లో తాత గారి విలేజ్ కి వెళ్లి పోతున్నాం. రేపు స్కూల్లో శాన్విని” లంజాకూ “అని బనాయిస్తే అది డెఫినెట్ గా సూయ్ సైడ్ కమిట్ చేసుకుంటుంది.

బై డాడీ..ఫైనల్ గా మై హంబుల్ రిక్వెస్ట్..మేం బయటి కెళ్లే లోగా ..మీ ముఖం మాకు చూపించకండి..గుడ్ నైట్ అండ్ గుడ్ బై డాడీ.”

******

కట్టలు తెంచుకున్న కన్నీటిని కట్టడి చేయలేని ధనలక్ష్మి కొంగుతో కన్నీరు ఒత్తుకుంటూ జనకిరాం ను అల్లుకుపోయింది. “లక్ష్మీ! ..చూశావా? మన బాబీ ఏంరాశాడో ..నా ముఖం చూపించొద్దన్నాడు. ఈ అవమానం కంటే చచ్చిపోవడమే మంచిదని పిస్తోంది. నిజమే నేను గడ్డి తినే సంపాదించాను.లంచగొండి నయ్యాను.ఇదంతా చేసింది నేను కట్టుకు పోవడానికా..కాదుగదా..వాడేం రాశాడో చూశావుగా?” ఏడుపుతో మాటలు రాక భార్యను చుట్టుకు పోయాడు..లంచగొండి జానకిరాం.

“అయిందేదో అయిపోయింది. టెన్షన్ కాకండి.బాబీ మిమ్మల్ని ముఖం చూపించొద్దని రాసినా వాడే ఏంచేయాలో రాశాడు. అదే చేయండి.”

“మరీ పిచ్చిదానిలా మాట్లాడకు..ఫది కోట్లంటే మాటలుకాదు..” లంచావతారం మళ్లీ ఆక్రమించేశాడు..జానకిరాంని .. కుక్క బుద్దిలా .“మరీ పిచ్చి పట్టినట్లు..మాట్లాడకండి.నిజం చెప్పాలంటే బాబీ చెప్పిందే కరక్ట్. నేను కూడా ఇప్పటి వరకు మీతో బాటు తిన్నది ఇంత నీచమైన ..లంచాల రక్తపు కూడని తెలుసుకోలేక పోయాను. లగ్జరీలమోజులో.. ఆడంబరాల అతిశయంతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తించాను..పిల్లల్ని పెంచాను. బాబీ కొట్టిన చెప్పు దెబ్బతో నా తప్పేంటో తెలుసు కున్నాను.నాకు నా పిల్లలుకావాలి..మీరు సంపాదించిన లంచాలు..కోట్లాది పాపపు సొమ్ము..మీరే కట్టుకు పొండి .నేను కూడా బాబీ శాన్వీలతో..బయలుదేరి పోతున్నాను.బాబీ చెప్పిన మాటే నేనూ చెపుతున్నాను..
గుడ్ బై.

హఠాత్తుగా భర్తను నెట్టేసి లేచిన ధనలక్ష్మి పిల్లల బెడ్ రూంలోకెళ్లి డోర్ లాక్ చేసేసుకుంది. స్మశానంలో శవాల్ని దహనం చేసే కాటికాపరి లాగా..ఆ గదిలో మిగిలి పోయాడు..లంచాల జానకిరాం. ఆలి పోయింది..ఆస్తిపోయింది..బిడ్డలు..దూరమై పోయారు. ఆస్తిని వెల్లడించి..డిపార్ట్ మెంటుకు దొరికి పోతే ? పేరూ..పేరుతో బాటు ప్రమోషన్ నాశనం. శవం చుట్టూ మూగుతున్న రాబందుల్లా ఆలోచనలు చుట్టుముడుతుంటే.. చితి మీద కట్టెలా..కాలి పోతున్న బాధ కమ్మేస్తుంటే పెద్దనోట్ల రద్దు మీద కసితో కాలి పోయాడే తప్ప కనీసం బార్యా పుత్రుల సలహాను.. స్వీకరిస్తే బ్రతుకు బాగుపడుతుందేమో నన్న..ఇంగిత జ్ఞానాన్నికూడా ..విస్మరించాడు. “లంచగొండి జానకిరాం.”

“పుట్టుకతో వచ్చిన బుద్దులు ..పుల్లలతో గాని పోవేమో ?”

మరిన్ని కథలు

Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి