పాండితీ ప్రకర్ష - రాజచంద్ర వుయ్యూరు

paanditee prakarsha

పూర్వం అవంతి దేశాన్ని అమర పాలుడు అనే రాజు పరిపాలించే వాడు. ఆయన పాలనలో అవంతి రాజ్యం సుభిక్షం గా ఉండేది. ఆయన స్వయంగా కవి, పండితుడు కావటం వలన ఆయన ఆస్థానంలో తరచుగా కవి పండిత గోష్టులు జరుగుతూ ఉండేవి. తానూ స్వయంగా కవి కావటం చేత తరచుగా అమరపాలుడు కూడా ఆ గోష్టులలో పాల్గొనేవాడు. అప్పుడప్పుడూ విదేశ పండితులు కూడా అమరపాలుడి సభలో పాల్గొని ఆయన ముందర తమ పాండిత్యాన్ని ప్రదర్శించి తగు రీతిన సన్మానాలు పొందేవారు. అమరపాలుడు వంటి పండిత రాజు చేత గౌరవించ బడటం అంటే చాలా గౌరవప్రదంగా భావించేవారు. అందుకే దేశ విదేశాల కవులు పండితులు తమ పాండితీ ప్రకర్షని అమర పాలుడి ముందు ప్రదర్శించి ఆయన మెప్పు పొందాలని తపించేవారు.

ఒక రోజు సభలో కవితా గోష్టి జరుగుతుండగా ఆస్థాన కవి శ్రీధరుడికి పొరుగు దేశం కనక పురి నుండి వచ్చిన ఇంద్రసేనుడు అనే పండితుడుకి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకున్నది. కవిత్వం అనేది సరళమైన భాషలో సామాన్యులకు సైతం అర్ధం అయేలా ఉంటేనే పది కాలాల పాటు మన గలుగుతుంది అని ఆస్థాన కవి శ్రీధరుడు వాదించాడు. ఇంద్రసేనుడు మాత్రం శ్రీధరుడి వాదనతో విభేదిస్తూ కవిత్వం కవికి ఉన్న పాండితీ ప్రకర్ష ని చాటేదిలా ఉండాలి తప్ప సామాన్యులకు అర్ధం ఆవవలసిన అగత్యం లేదు, అందులో వాడే పదాల అమరిక, ఛందస్సు, భావము, కవి హృదయం సాటి పండితులు అర్ధం చేసుకునే స్థాయి లో ఉండాలే తప్ప అంతకు తక్కువ స్థాయి లో ఉంటే అది అసలు కవిత్వమే కాదు అని వాదించాడు.

ఈ విషయం మీద మొత్తం సభ అంతా రెండు వర్గాలుగా చీలి పోయి కొందరు శ్రీధరుడిని సమర్ధించగా మరి కొందరు ఇంద్రసేనుడిని సమర్ధించారు. అంతిమంగా ఈ విషయం లో తుది తీర్పు మహారాజు అమర పాలుడు ఇస్తే అది తమందరకూ ఆమోద యోగ్యం అని అందరూ తీర్మానించి ఆ వాదనలలో ఏది సరి అయినది అనే దాన్ని నిర్ణయించ వలసిందిగా అమర పాలుడిని కోరారు. అమర పాలుడు సైతం ఆ రెండు వాదనలలో ఏది సరి ఐనది అనేదాన్ని తేల్చటం అంత సులభం కాదు అని గ్రహించి తన మంత్రి వీరేంద్ర పాలుడిని సలహా కోరాడు. వీరేంద్ర పాలుడు రాజు చెవిలో ఏదో చెప్పాక మహా రాజు ఈ రెండు వాదనలలో ఏది సరి అయినది అనే దాన్ని తేల్చటానికి ఒక నెల రోజుల సమయం కావాలి. ఆ తరువాత నా నిర్ణయం చెపుతాను అని సభా ముఖంగా ప్రకటించి నాటికి సభ చాలించాడు.


ఆ తరువాత అమరపాలుడు మంత్రి వీరేంద్రపాలుడి సలహా మేరకు రెండు గ్రంధాలను ఎంపిక చేసి ఆయన ఆస్థానం లో ఉన్న కొందరు పండితులను పిలిపించాడు. రాజు గారి ఆదేశం ప్రకారం ఆ రెండు గ్రంధాలను ఆ పండితులు తీసుకుని అవంతి రాజ్యంలో ని కొన్ని ఎంపిక చేసిన నగరాలలో పుర ప్రముఖుల, ప్రజల సమక్షంలో చదివి వినిపించాలి. ముందు మూడు రోజుల పాటు మొదటి గ్రంధాన్ని చదివి వినిపించాలి. ఆ తరువాత మరో మూడు రోజుల పాటు రెండో గ్రంధాన్ని చదివి వినిపించాలి. రెండు గ్రంధాలకు ఆయా పుర ప్రముఖల నుండి, ప్రజల నుండీ వచ్చే స్పందనను మరో పండితుల బృందం అజ్ఞాతంగా పరిశీలిస్తుంది. ఇలా అన్ని ముఖ్య నగరాలలో పర్యటించాక ఆ రెండు గ్రంధాలకు వచ్చిన ప్రజా స్పందనని మహారాజుకు విన్నవించాలి. మహా మంత్రి సలహా మేరకు ఆ రెండు గ్రంధాలకూ మరిన్ని ప్రతులను తయారు చేసారు. అలా ఆ రెండు గ్రంధాలను కొన్ని బృందాలకు ఇచ్చి వారిని అవంతి దేశపు నలు మూలలకు పంపించారు.

అలా బయలు దేరిన బృందాలు ముందుగా రామా పురం అనే నగరానికి చేరుకున్నాయి. ఆ నగర ముఖ్య కూడలి లో ఉన్న సభా మండపం లో ముందుగా మొదటి గ్రంధాన్ని చదివి వినిపించటం మొదలు పెట్టారు. అది ఒక అజ్ఞాత కవి రాసిన సంస్కృత భాషా గ్రంధం. అందులోని భాష చాలా కఠినమైనదే కాకుండా పండితులకు సైతం ఒక పట్టాన కొరుకుడు పడలేదు. మొదటి రోజు సభ నిండుగా జనం వచ్చారు. రెండవ రోజు కల్లా సగానికి పైగా సభా మందిరం ఖాళీగా కనిపించింది. ఇక మూడవ రోజుకల్లా వేళ్ళ మీద లెక్కింప తగ్గ జనం మాత్రమే వచ్చారు. వచ్చిన వారిలో సైతం సగానికి పైగా మధ్యలోనే బయటకు జారుకున్నారు. ఆ మరునాడు రెండో గ్రంధాన్ని చదివి వినిపించటం మొదలైంది. ఈ రెండో గ్రంధకర్త కూడా ఎవరో ఎవరికీ తెలియదు. మొదటి గ్రంధం ప్రభావం చేత ఈ గ్రంధం ఇంకెలా ఉంటుందో అనే శంకతో మొదటి రోజున చాలా తక్కువ మంది సభికులు మాత్రమే హాజరయ్యారు.

ఐతే వారందరి శంకలను పటా పంచలు చేస్తూ ఆ రెండవ గ్రంధం సరళమైన వ్యావహారిక భాషలో తేట తెలుగులో ఎంతో అధ్బుతంగా ఉన్నది. అనవసరమైన వర్ణనలు, పదాడంబరమూ లేకుండా పండిత పామరులకు సైతం ఇట్టే అర్ధం అయ్యేలా చక్కటి భాషలో సరళం గా ఆ గ్రంధ రచన సాగింది. మరునాడు ముందు రోజు కంటే రెట్టింపు మంది సభా ప్రాంగణం లోకి వచ్చారు. మూడో రోజుకు సభా ప్రాంగణంలో చోటు సరి పోక కొంత మంది నిలబడే ఆ గ్రంధ పఠనాన్ని విన్నారు.


అలా రాజు గారు పంపిన బృందాలు తమకు అప్పగించిన పనిని విజయ వంతంగా పూర్తి చేసుకొని రాజధానికి తిరిగి వచ్చాయి. ఆ బృందాలతో పాటుగా పంప బడిన పరిశీలక బృందాల వారూ తిరిగి వచ్చి రాజు గారికి నివేదిక అంద చేశారు. అన్ని నగరాలలో ప్రజా స్పందన ఒకేలా ఉన్నట్లు ఆ బృందాలు రాజుకు నివేదించాయి. మొదటి గ్రంధము పట్ల ఎవరో కొద్ది మంది పండితులు తప్ప మిగతా వారు ఎవ్వరూ కొంచెమైనా ఆసక్తి కనపరచ లేదని రాజు గారికి నివేదించారు. ఆ గ్రంధం లోని భాష సంస్కృత భాష, పైగా ఎంతో కఠినమైన పద బంధాలతో రాయటం వలన పండితులకు సైతం ఒక పట్టాన ఆ గ్రంధం కొరుకుడు పడలేదని విన్నవించారు. దీనికి పూర్తి విరుద్ధంగా రెండో గ్రంధం ప్రతి చోటా పూర్తి స్తాయిలో ప్రజాదరణ పొందినట్లు, పండిత పామరులు సైతం ఆ గ్రంధాన్ని పూర్తిగా విని ఆనందించినట్లు గా రాజుకు విన్నవించారు.

ఆ రోజుతో మహారాజు విధించిన నెల రోజుల గడువు ముగిసి మహారాజు తీర్పు చెప్పే రోజు. సభ క్రిక్కిరిసి పోయింది. ఆస్థానకవి శ్రీధరుడు, ఇంద్రసేనుడు సహా ఎందరో సభలో ఆశీనులయ్యారు. మహారాజు ముందుగా తాను రెండు గ్రంధాలను చదివి వినిపించేందుకు పంపిన బృందాల అనుభవాలను సభికులకు ఆ బృంద నాయకుల చేత చెప్పించాడు. వారందరి పరిశీలన లో తేలిన విషయం: మొదటి సంస్కృత గ్రంధానికన్నా తేట తెలుగు లో ఉన్న రెండో గ్రంధానికే ప్రజల ఆదరణ పూర్తి స్థాయి లో లభించినట్లు సభికులందరికీ తెలియ చేశారు.

అప్పుడు మహారాజు మాట్లాడుతూ సంస్కృతం లో ఉన్న మొదటి గ్రంధాన్ని మన దేశ ప్రజలు పూర్తి స్థాయి లో విని ఆనందించ లేక పోవటానికి ఆ రచయిత ఉపయోగించిన కఠినమైన పద ప్రయోగం, అనవసరపు వర్ణనలు, సులభగ్రాహ్యం కాని విధంగా సాగించిన రచన కారణాలు. ఇటువంటి రచనలు అందరినీ అలరించ లేవు. దీనికి విరుద్ధంగా వ్యావహారిక భాషలో సులభమైన పదాలతో రాసిన రెండో గ్రంధం దాదాపు అందరినీ అలరించినట్లు గా ఈ బృందాల పరిశీలనలో వెల్లడైంది. ఒక మంచి రచన అది కవిత్వం కానీయండి, గద్యం కానీయండి అందులో ఉపయోగించే భాష సరళంగా ఉండి సులభంగా అర్ధమయ్యేలా ఉంటేనే ఆ రచనని ప్రజలు ఆదరిస్తారు. కేవలం పదాడంబరం, క్లిష్టమైన భావ వ్యక్తీకరణ, అనవసర సమాస ప్రయోగాల వలన ప్రజాదరణ లభించదు అని మరోసారి నిరూపితమైంది. సామాన్య ప్రజలకు సైతం నచ్చే రచనలే నాలుగు కాలాలపాటు నిలుస్తాయి. దీనిని బట్టి మన ఆస్థాన పండితుడు శ్రీధరుడు చెప్పినదే సరి అయినది అని నిరూపితమైనట్లే అని చెప్పాడు మహారాజు అమరసింహుడు. చివరగా మీ అందరకూ మరో విశేషం చెప్పాలి -- నేను పంపించిన రెండు గ్రంధాలు రాసినది నేనే !!! మొదటి గ్రంధాన్ని నేను సంస్కృతం లో పూర్తిగా కఠిన మైన పదాలతో, భావం ఒక పట్టాన అర్ధం కాకుండా, కేవలం పదాడంబరానికి ప్రాముఖ్యత ఇస్తూ రాశాను. దీనికి పూర్తి విరుద్ధంగా శుద్ధ వ్యావహారిక భాషలో, ప్రజల నాలికల పైన నిత్యం ఆడే సులభమైన పదాలతో రెండో గ్రంధాన్ని వ్రాసాను. రెండింటిలో దేనికి ఎక్కువ ప్రజాదరణ వచ్చిందో ఇప్పుడు మనం కళ్ళారా చూసాము కదా అని ముగించాడు రాజు అమరసింహుడు. అవును ప్రభూ అంటూ సభికులందరూ తలలు ఊపారు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు