పిట్టపోరు పిట్టపోరు - పోడూరి వెంకటరమణ శర్మ

pitta poru pittaporu

ఆ మధ్య వార్తా పత్రికలన్నీ హోరెత్తి పోయాయి. కరీం అనే మాజీ నక్సలైట్ ని ఎన్ కౌం టర్ లో పోలీసులు హత మార్చినట్టు.

అప్పటి నుంచీ రోజూ వివిధ కధనాలు ఒక్కొక్కటే బయటికి వస్తున్నాయి. పోలీసుల, పొలిటీషియన్ల సహాయంతో ఎలా సెటిల్ మెంట్లు చేసి కోట్లకు కోట్లు ఎలా సంపాదించాడో.

కొంత మంది నిజాయతీ పరులయిన పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అదే డిపార్ట్ మెంట్ లోని వారి సహాయంతో ఆడవేషాలు కూడా వేసుకుని ఎలా తప్పించు కున్నాడో అన్నీ వివరంగా బయటికి వచ్ఛాయి.

చాలా మంది రాజకీయ వేత్తలకి, పోలీసు అధికారులకి అతనితో సంబంధాలు ఉన్నాయని బాహాటం గానే ప్రకటించారు.

అసలు ఎన్ కౌంటర్ ఎందుకు జరిగిందో కూడా బయటికి వచ్చింది. కరీంకి, అతని నేర సామ్రాజ్యం లో వస్తూన్న విజయ పరంపర, వసూలవుతున్న వందల కోట్లు అన్నీ కలిపి తనకి తిరుగు లేదన్న ఒక భావన బాగా తల కెక్కి చేసే నేరాల వలని బాగా విస్తృత పరిచి ప్రభుత్వం లో ఉన్న ఉన్నతాధికారుల్నీ, అధికారంలో ఉన్న రాజకీయ వేత్తల దగ్గర బంధువులనీ కూడా వదలకుండా వేధించడం మొదలుపెట్టాడు. అందరికీ తెలిసిన, మన చిన్న ప్పుడు చెప్పుకునే, చీమ కథలో లా " నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా ?" అన్నట్టు రాజకీయ వేత్తలు, అధికారులు కలిసి అతని కథ ముగిద్దామని నిర్ణయించుకున్నారు. అమలు చేయడానికి చాలా జాగ్ర త్తలు తీసుకోవాలిసి వచ్చింది. ఎందుకంటే రెండు మాట్లు ఉన్నతాధికారుల నుంచే మన వాడికి ఉప్పు అంది తప్పించుకు పోయి, తన చుట్టూ సెక్యూ రిటీ ని బాగా పటిష్టం చేసుకున్న్నాడు. చివరికి బాగా ఉన్నత స్థాయి లో ముగ్గురు నలుగురు మధ్యనే ఉంచుకుని, ప్లాన్ ని అమలు పరిచారు.

అయితే మొత్తం కథనాలన్నీ చదివితే సామాన్య ప్రజలకి ఎదురయ్యే ముఖ్యమయిన ప్రశ్న ఏమిటంటే. చాలా మంది రాజకీయ వేత్తలకీ, పోలీసు అధికారులకీ అతనితో సంబంధాలు ఉన్నాయని చెప్పిన పత్రికలు మాత్రం, ఏ పేర్లూ బయట పెట్ట లేదు. వాళ్లకి అవి తెలుసునని అందరికీ తెలుస్తూనే ఉంది. దీనిని బట్టి అందరూ గొంతెత్తి అరిచే పత్రికా స్వాతంత్య్రం భారత దేశంలో మాత్రం నేతి బీర కాయ లో నెయ్యి వంటిదేనేమో.

కరీమ్ తో సంబంధాలు ఉన్న రాజకీయ వేత్తల, పోలీసు ఆఫసర్ల పేర్లు బయటికి రాక పోవడం ఒక పెద్ద మిస్టరీ గా మారింది. దానిని బట్టి మొత్తం ఆపరేషన్ ఉద్దేశం వేరే ఎదో ఉందేమో నని చాలా మంది ఊహా గానాలు చేస్తున్నారు.

పైకి వచ్చిన కథనాలతో ప్రజలు ఆశ్చర్యంలోంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తుంటే, కరీం సహాయంతో అడ్డంగా సంపాదించిన అధికారులూ, రాజకీయ వేత్తలూ, ఇంకా హవాలా ద్వారా కానీ, ఇతర మార్గాల ద్వారా కానీ భద్ర పరుచు కోని కోట్ల రూపాయల్ని జాగ్రత్త పరుచు కోవడం లో మల్ల గుల్లాలు పడుతూ, అటు వంటి వాటి మీద సలహాలు చెప్పే కన్సల్టెంట్ల చుట్టూ తిరుగుతున్నారు.

రంగనాథ రావు, ప్రభుత్వం లో ఓక కీలక మయిన డిపార్టుమెంట్లో ముఖ్య అధికారి. అతనికి రాత్రి పొద్దు పోయిన తరువాత అందిన ఓ ఫోన్ కాల్ తో చాలా ఆందోళన పడుతున్నాడు.

రంగనాథ రావు ఉద్యోగం , విత్తనం కూడా చల్లకుండా నిత్యం పంట కోసుకోవడానికి వీలుండే పొలం లాంటిది. ఆ ఉద్యోగంలో ఎవరు చేరాలన్నా, సర్వీస్ కమిషన్ పరీక్షలో మొదటి పది ర్యాంకుల వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరయినా లక్షలు ఇచ్చి చేర వలసిందే. ఆయన మామ గారు కట్నం లో భాగంగా అటు వంటి ఉద్యోగం ఆయనకి సంపాదించి పెట్టారు. మొట్ట మొదటి అపాయింట్ మెంట్ ఒక్కటే కాదు, ఆ తరువాత మామ గారి(ధన)పలుకు బడితో ఏ ఊర్లో వేయించుకుంటే ఎక్కువ రాబడి ఉంటుందో అక్కడికి బదిలీలు మానేజ్ చేసి చాలా బాగా సంపాదించాడు. ఆయన సంపాదించినది చాలా ఎక్కువ అయినా, తెలివి తేటలుగా సంపాదించిన దానిని బయటకి ఎక్కువ ప్రదర్శించ కుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఆయన మీద పిటిషన్లూ అవీ వెళ్ళక పోవడానికి ఆయన తీసుకున్న ఇంకో జాగర్త సహాయ పడింది. బాగా ఉన్న వాళ్ళ దగ్గర గుంజినా, చిన్నా చితక వాళ్ళకి చాలా మందికి ఏమీ తీసుకో కుండా సహాయ పడేవాడు. అంత దురాశ లేకుండా సంపాదించినా, ఆయన దగ్గర చాలా డబ్బు పోగయింది. ఆ మధ్యన ప్రభుత్వం ప్ర కటించిన "మన్నింపు" పథకం లో కొన్ని కోట్లు టాక్స్ కట్టేసి ఆ డబ్బుని చాలా స్థిరాస్థులలో పెట్టాడు. అవికూడా ఇప్పుడు బాగా ధర పలుకుతూండడంతో అమ్మేసి కాష్ చేసుకున్నాడు. ఇప్పుడు హవాలా ద్వారా కొడుక్కి సింగపూర్ పంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. కొడుకు అమెరికా లో పెట్టే ఓ ఫ్యాక్టరీకి కావలసిన డబ్బును అక్కడ నుంచి మళ్లించుకోవ డానికి ప్లాన్. వందల కోట్ల లో ఉంది కాబట్టి, హవాలా కి అందివ్వడానికి కూడా ఒక అంబులెన్సును, మార్చురీ నుంచి ఒక శవాన్ని, దానికి సంబంధించిన డెత్ సర్టిఫికెట్ వగైరాలూ అన్నీ ఆరెంజ్ అయి పోయాయి.

కానీ అతనికి వచ్చిన ఫోన్ కాల్ లో వివరాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. అతను, కావలసినప్పుడల్లా డబ్బు సర్దు బాటు చేసి, మందు పార్టీలు అవీ బగ్గా ఇచ్చి నరహరి అనే రిపోర్టర్ ని కాన్ఫిడెన్స్ లో ఉంచుకున్నాడు. అతనే ఫోన్ చేశాడు క్రితం రాత్రి. చేర వేసిన వార్త ఏమిటంటే కరీం ఎన్ కౌంటర్ తరువాత వేసిన ప్రత్యేక బృందం అతని ఇళ్ల నుంచి చాలా పుస్తకాలూ డైరీలు స్వాధీన పరుచుకున్నారని, వాటిలో అతనికి సహాయ పడిన కొందరు అధికారుల పేర్లు ఉన్నాయని. అందులో రంగ నాధ రావు పేరు కూడా ఉందని సమాచారం. ఆ బృందం ఆ పేర్లు వెంఠనే బయట పెట్టక పోయినా ఆయా వ్యక్తుల మీద విచారణ జరిగే అవకాశం ఉందని భోగట్టా.

ప్రస్తుతం రంగనాధరావు ఆందోళన ఏమిటంటే, కరీం కి సహాయం చేయడం వలన వచ్చిన మొత్తం తక్కువ కాక పోయినా, తాను ఇంత కాలం కష్ట పడి(?) సంపాదించిన చాలా డబ్బు, కరీంతో వ్యవహారాలకు సంబంధం లేనిది, అంతా ఒక చోట చేర్చడమయ్యింది. అదీ కాకుండా కరీం కూడా కొంత డబ్బు పెద్ద మొత్తం లో తన దానితో హవాలా చేయ డానికి అతని దగ్గర దాచాడు. డబ్బు బయటికి పంపే దాకా ఏదయినా అయితే కొంప ములిగి నట్టే. అటు వంటి పరిస్థితి ఊహించ డానికే అతనికి భయం గా ఉంది.

ఎంత తొందరగా చేయాలనుకున్నా, అంత మొత్తాన్ని వేన్లో సర్దాలంటే అర్ధ రాత్రే జరగాలి కాబట్టి కనీసం రెండు రోజులు పట్ట వచ్చు. ఈ మధ్యలో ఏమీ జరగ కూడదని ఏడుకొండలవాడిని ప్రార్ధించాడు. అతను ప్రతి సంవత్సరం ఒక మాటు తిరుపతి వెళ్లి తన మొత్తం ఆదాయం లో పది శాతం హుండీ లో వేయడం మాత్రం మానడు, సంవత్సర ప్రీమియం లాగ

******

అప్పుడెప్పుడో జరిగిన కారు ప్రమాదాన్ని తన విక్టిమ్ ని బెదిరించడానికి కరీం ఎలా వాడుకున్నాడోనన్న కథనాన్ని పేపర్లో చదివి అప్పుడే పేపర్ టేబిల్ మీద పెట్టాడు రంగ నాథ రావు

ఆయన ఏమి బిజీ గా ఉన్నాడో కానీ వెంకటేశ్వర స్వామి కి రంగ నాథ రావు ప్రార్థన విన పడినట్టు లేదు. అప్పుడే మఫ్టీ లో ఉన్న ముగ్గురు ఆఫీసర్లు వచ్చారు రంగ నాథ రావు ఇంట్లోకి. వాళ్ళ బాడీ లాంగ్వేజి బట్టి వాళ్లెవరో గ్రహించడానికి అట్టే సేపు పట్ట లేదు. "కంగారు పడకు మామూలు గానే ఉండు" అని తనకి థానే ధైర్యం చెప్పుకుని

"ఎవరు సార్ ? ఎక్కడి నుంచి? "అని అడిగాడు అమాయకంగా ముఖం పెట్టి

వాళ్ళల్లో ఒకతను 'ఐడి' చూపించి " కొంచెం మాట్లాడుకుందాము" అన్నాడు. రంగ నాధ రావు చూపించిన కుర్చీల్లో కూర్చున్నారు ముగ్గురూ

" అలాగేనండి" అన్నాడు రంగ నాధ రావు సాధ్యమయినంత మటుకు మామూలు గా ఉండడానికి ప్రయత్నిస్తూ. ఆ ప్రయత్నంలోనే తాను కూడా ఓ కుర్చీలో కూర్చున్నాడు

ముగ్గురినీ ఓ మాటు చూసి నవ్వి " కాఫీనా? టీ నా? అన్నాడు లేచి ఇంట్లోకి వెళ్ళబోయి.

" అటువంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు లెండి కూర్చోండి " అన్నాడు 'ఐడి' చూపించిన వ్యక్తి. ఆయనే లీడర్ కాబోలు టీమ్ కి అనుకున్నాడు రంగ నాథ రావు మళ్ళీ కూర్చుంటూ

"కరీం మీకు ఎప్పటి నుంచి తెలుసు?" అడిగాడు ఒక ఆఫీసర్ "వ్యక్తిగతంగా పరిచయం లేదు. ఉద్యోగ పరంగా ఎప్పుడయినా కలిశాడేమో గుర్తు లేదు"

" కరీంకు మీరు ఎందుకు సెటిల్ మెంట్లు వ్యవహారాలలో సహాయం చేశారు ? ఎంత తీసుకున్నారు ?

ఎదురుగా టేబుల్ మీద ఉన్న పేపర్లో హెడ్ లైన్ కంట పడి రంగ నాధ రావుకి ఐడియా ఫ్లాష్ అయింది

" అతను నన్ను బెదిరించాడండి. ఫామిలీ మెంబెర్స్ ని చంపుతానన్నాడు" అన్నాడు దీనంగా మొహం పెట్టి

"ఇప్పుడే మీకు అతనితో పరిచయం లేదు అన్నారు? " క్రాస్ చేశాడు ఆఫీసర్

"అతని అనుచరుల ద్వారా బెదిరించాడు"

"అంటే మీరు అతని దగ్గర నుంచి ధన సహాయం పొంద లేదా ?"

"ఎం చెప్పాలో తెలియక తలా అడ్డంగా ఊపాడు"

వచ్చిన ముగ్గురిలో ఒకతను, ఎదో పుస్తకం తెరిచి, అందులో వేలు పెట్టి ప్రశ్నలు వేస్తున్న అధికారికి చూపించాడు

"మీకు చాలా డబ్బు చెల్లించినట్టు ఎంట్రీలు ఉన్నాయి" అన్నాడు నిలదీసి. మళ్లీ ఆయనే " అతని ద్వారా మొత్తం ఏ మాత్రం గడించారు?

రంగ నాధ రావు మాట్లాడలేదు ఆ ఆఫీసర్ లేచి గుమ్మం దాకా వెళ్లి ఎవరితోటో ఫోన్లో మాట్లాడి వచ్చాడు

ఆ ఆఫీసర్ ఈ మాటు "మీ ఇంటి ప్లాన్ తీసుకు రండి" అన్నాడు మళ్ళీ ఇంకొకళ్ళకి ఫోన్ చేస్తూ

రంగ నాధ రావు లోపలికి వెళ్ళగానే ఫోన్లో "టీం ని కౌంటింగ్ మెషీన్స్ తో పంపు" అన్నాడు మెల్లి గా.

రంగ నాధ రావు ఇంటి ప్లాన్ తెచ్చిన తరువాత, అతన్ని దూరంగా కూర్చోమని, మిగతా టీం మెంబర్స్ తో కలిసి ఆ ప్లాన్ ని స్టడీ చేశారు

ఈ లోపులో ఒక పది మంది టీం దిగడం మొత్తం ఇల్లంతా ప్లాన్ సహాయంతో శోధించడం మొదలెట్టారు.

రంగ నాధ రావు భార్య కంగారు పడుతోంటే ఆమెతో మాట్లాడ డానికి లోపలికి వెళ్ళాడు రంగ నాధ రావు. పని పూర్తయే దాకా బయటికి వెళ్ళ వద్దని చెప్పారు ఆఫసర్లు రంగ నాధ రావుకి.

సాయంత్రానికి ఇంట్లో దొరికిన కాష్ అంతా మొదటి ఫ్లోర్ లో హాలు, బెడ్ రూముల నిండా నిండి పోయింది. అంతా మూడు రూముల్లో సద్దారు. వచ్చిన అధికారుల్లో ముఖ్య అధికారి, కాష్ లెక్క పెట్టడానికి వచ్చిన పది మందినీ మూడు రూముల్లో సద్ది ఏ గదిలో లెక్కించిన మొత్తం ఆ గది నుంచి తనకి డైరెక్ట్ గా తెప్పించుకుని నోట్ చేసుకున్నాడు. కౌంటింగ్ అవగానే ఆ పది మందిని పంపేశారు.

రహస్య చాంబర్లన్నీ వెదికి పట్టుకున్నారు. గోల్డ్, డైమన్డ్స్ యొక్క విలువే చాలా ఉండేలా ఉంది

మర్నాడు తెల్లవారు ఝాము దాకా, కౌంటింగ్ జరిగింది. కాష్ మూడు వందల కోట్లు అని తేల్చి, మిగతా వాటితో పాటు అది కూడా ఒక రిజిస్టర్ లో రాసి రంగ నాధ రావు ని సంతకం పెట్టమన్నారు.

సంతకం పెట్టమన్నప్పుడు రంగ నాధ రావు కొంత ఆశ్చర్య పోయాడు. కేష్ మూడు వందల కోట్లు అని రాశారు. తన లెక్క ప్రకారం నాలుగు వందలు. అందులో మూడు వందలు కోట్లు కరీం తన దగ్గర దాచినది. కరీం చనిపోగానే అంతా ఇక తనదే అనే భావనలో ఉన్నాడు అంటే వీళ్ళకి అంతా దొరకలేదన్నమాట. వీళ్లు వెళ్లిన తరువాత చూసుకోవాలి అనుకున్నాడు లోలోపల కాస్త తేరుకుంటూ. బహుశా మాస్టర్ బెడ్రూమ్ బాత్రూం సీలింగ్ లో ఉన్న రహస్య ఛాంబర్ దొరికి ఉండదు అనుకున్నాడు.

అన్నీ అయిన తరువాత, మొత్తం వివరాలు ఆ ఆఫీసర్ ఎవరికో ఫోన్ లో వివరాలన్నీ చెప్పాడు.

కావలసిన సంతకాలు అన్నీ తీసుకుని వాళ్ళు వెళ్లి పోయారు..

వాళ్ళు వెళ్లి పోయిన వెంటనే, వీధి తలుపులు వేసి మాస్టర్ బెడ్రూమ్ కి పరుగెత్తాడు. అతని ఆశలు అడియాసలె అయ్యాయి. అక్కడ రహస్య ఛాంబర్ కూడా చిన్నాభిన్నమయి ఉంది.

వెంఠనే ఇల్లంతా మళ్ళీ పరుగు పరుగున కలియ తిరిగి అన్ని రహస్య ప్ర దేశాలూ వెదికి డ్రాయింగ్ రూములో కూలబడ్డాడు.

అప్పుడు అర్థం అయ్యింది అతనికి. మొత్తం నాలుగు వందలూ గోవిందా అని. అప్పుడు ఫ్లాష్ అయ్యింది అంటే మూడు వందలకే సంతకం ఏమిటి? మరి మిగతా వంద కోట్లు?

మొత్తం ఆపరేషన్ మీద అతను విన్న ఊహా గానాలు అతని మెదడులో మెరిశాయి..

అతని భార్య లబో దిబో మంటూ హాల్లోకి వచ్చింది. మొత్తం అంతా పోయినట్టేనా? అంది ఏడుస్తూ.

అంత అధైర్య పడకు. ఇంకా రాజకీయం చేతుల్లోనే ఉంది అనుకుంటున్నా. కొంచెం ఖర్చు అయినా బయట పడవచ్చునేమో అన్నాడు తనకు తానె ధైర్యం చెప్పుకుంటూ.

వెంఠనే అతను అధికార పార్టీలో ఉన్న ఒక దూరపు బంధువుకు ఫోన్ చేశాడు. సలహా అడుగుదామని. అన్నీ చెప్పకుండా కొంత విషయం చెప్పి సలహా అడిగాడు. ఆయన తనకి హోమ్ డిపార్ట్ మెంట్ లో ఒకతను బాగా తెలుసునని. కనుక్కుని చెబుతానని ఫోన్ పెట్టేశాడు

మరునాడు అతను ఫోన్ చేసి చెప్పింది ఏమిటంటే, అసలు ఇంకా కరీం కేసులో ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ లేదనీ, అది పూర్తి అయితే గాని ఏ యాక్షనూ, ఎవరి మీదా ప్రారంభించరని.

రంగ నాధ రావుకి కాళ్ళూ చేతులూ ఆడలేదు. వెంఠనే ఏ సి బి ఆఫీసుకి ఫోన్ చేసి అంత క్రితం రోజు ఐడి చూపించిన ఆఫీసర్ పేరు చెప్పి ఆయన కోసం అడిగాడు.

అటువంటి వారు ఎవరూ అక్కడ పని చేయడం లేదని చెప్పారు. ఒక్క మాటుగా కుదేలు అయి పోయాడు రంగ నాధ రావు. హార్ట్ అటాక్ వస్తుందేమో నని భయం కూడా వేసింది. ఆ రోజంతా నరకం లో ఉన్నట్టు గడిచింది

******

రంగ నాధ రావు కి మనసు పరి పరి విధాల పోయింది. ఎలా జరిగింది? ఎవరు చేశారు లేదా, చేయించారు?

అతను విశ్లేషించుకుంటే ఏసీబీ కాక పోతే రెండే రెండు వర్గాల ద్వారా జరిగి ఉండాలి అనిపించింది. మొదట అతని ఆలోచనలు జనతా బిల్డర్స్ మీదకి పోయింది. తన బిల్డింగ్ వాళ్ళే కట్టారు. దాని ఓనర్ తన భార్య వైపు దగ్గర బంధువు. నమ్మకస్తుడు. అతని సలహా పైనే రహస్య మాళిగలు కట్టే కంపెనీ బొంబాయ్ లో ఉందంటే, అతని ద్వారానే సంప్రదించడం జరిగింది. బొంబాయి కంపెనీ కూడా ప్రత్యేకం గా ఉత్తరాదిలోని వివిధ పట్టణాల నుంచి ఒక్కొక్కడినే రప్పించి వాళ్ల చేత రహస్య చాంబర్స్ కట్టించడం జరిగింది. తన లాగే చాలా మంది ఆ కంపెనీ ద్వారానే కట్టించుకున్నారు. కట్టించి పదేళ్లవుతున్నా, రహస్యాలు బయటికి వెళ్లి దోపిడీలు జరిగిన సందర్భాలు ఏమీ లేవు. కానీ వచ్చిన వాళ్లు ప్లాన్ తెప్పించుకుని పరిశీలించడం అనుమానానికి తావిచ్చినా రహస్య చాంబర్స్ ప్లాన్ లో చూపించ లేదు కాబట్టి ఆ అవకాశం లేదు. ప్లాన్ బట్టి ఊహించి చేసిన పనే కానీ వేరే కాదు.

అయితే మిగిలినది, తన దగ్గర డబ్బు దాచిన సంగతి తెలిసి, ఇంకా పట్టుబడకుండా తప్పించుకు పోయిన కరీం అనుచరులు ఎవరయినా చేసి ఉండవచ్చు. అదే కనక జరిగితే మొత్తం రాబట్టు కోవడం కష్టమేమో కానీ, ఒక వేళ వాళ్లని పోలీసులు పట్టుకుంటే మార్గాలు వెతకవచ్చేమో అనుకున్నాడు. అది దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక వేయాలి అని నిర్ణయించుకున్నాడు. వివిధ పట్టణాలలో ఉంచిన బ్యాంకు లాకర్ల దాకా వాళ్ళు వెళ్లని విషయం భార్యకి చెప్పి, ఆమెకి కొంచం ఊరట కలిగించాడు. అంత అధైర్య పడకు అని అంటూ ఆమె దృష్టి కాస్త మళ్లిద్దామని టీవీ ఆన్ చేశాడు.

నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలని ఉద్దేశించి మాట్లాడుతూ " ఈ అర్థ రాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు ఫలానా తేదీ లోగా బ్యాంకులలో జమ చేసి వివరణ ఇవ్వక పోతే చిత్తు కాగితాలే " అని ప్రకటిస్తున్నారు.

ఆత్రుతగా మొత్తం అంతా విన్నారు

అంత ఏడుపు లోనూ వాళ్ళిద్దరికీ నవ్వు వచ్చింది. కాగితాలు ఎవరి దగ్గర ఉంటె ఏమిటి!

*****

ఇంచు మించు అదే సమయానికి చిలుకూరుకు కొంచెం దూరం లో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో హర్ష వర్ధన్ తన ముగ్గురు మిత్రులతో మందు పార్టీ లో ఉన్నాడు. అతను కరీం ముఖ్య అనుచరులలో ఒకడు.

అతను రంగ నాధ రావు ఇంట్లో టీం లీడర్ గా వ్యవహరించిన కరుప్పన్ ని ఉద్దేశించి అన్నాడు. "మీరు సరిగ్గా కౌంట్ చేశారా ? నా అంచనా ప్రకారం నాలుగు వందలు కంటే ఎక్కువ ఉండాలే. కరీం దాచినదే మూడు వందలు కదా?" అన్నాడు వాళ్ళ కేసి మత్తుగా చూస్తూ.

"లేదు చాలా జాగ్రతగా కౌంట్ చేశాము. మొత్తం అంతే ఉంది. ఇంకా ఎక్కడైనా పెట్టాడేమో తెలియదు. అతను కూడా మాట్లాడకుండా సంతకం పెట్టాడు " అన్నాడు కరుప్పన్ మిగతా ఇద్దరికేసీ ఏమీ తడబడ కుండా చూస్తూ. తాను తొక్కి పట్టిన వంద కోట్లు గురించి ఆనందంగా మనసులో మెదలుతోంటే యధాలాపంగా టీవీ ఆన్ చేశాడు. రంగ నాధ రావు, భార్య విన్న ప్రధాన మంత్రి ప్రకటనని అప్పుడే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు.

హర్ష వర్ధన్, అతని అనుచరులు అదనంగా మందు ఏమీ తీసుకోకుండానే వాలి పోయారు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు