రవి కౌన్సిలర్ ఎలక్షన్ల నిలబడుతున్నాడంట...ఎవరు కల్సినా ఇదే మాట! అందరికీ ఇదో కమాను చుట్టు పక్కల ఎవరం కల్సినా ఇదే టాపిక్కే! ఇంక లాభం లేదని రవి తమ్ముడు రఘు గాడ్ని కలిసేకి వాళ్లింటి కెళ్లా. ఆడ ఆల్రెడీ ఓ మీటింగు పెట్టేసుకునిండారు. ఆ జనాన్ని సూడగానే నాకు ఇది సుళ్లు కాదని తెల్సి పోయిండాది. అయినా ఇంత దూరం వచ్చినాంక అడిగేస్తే పోతుంది కదా అనుకుని రఘుతో మాటలు కలిపిండాను. నేనింకా ఏమీ అడక్కుండా...వాడే రవి మునిసిపల్ ఎలక్షన్లలో పోటీ చేస్తుండాడు. ఇంక మనం అందరం రంగంలోకి దిగాలా అంటూ డిక్లేర్ చేసేసిండాడు. అప్పుడు సూడాలా...సానా సానా కుసీ అయ్యిండాది. అప్పటి దాకా కాలేజీ ఎలక్షన్లలో వాడికీ వీడికీ అడిగి నోడికీ...అడగ నోడికీ పాంప్లెట్లు రాసీ రాసీ ఉన్న చేతులు చుర చుర అంటుంటే...మరి పాంప్లెట్లు ఏపిస్తారు కదా అని అడిగాను. అరే తిక్కోడా...ఒక్క పాంప్లెట్లు ఏందిరా...మనిష్టం ఏమైనా రాసుకోవచ్చు...ఏంతైనా ప్రచారం చేయొచ్చు అని రవి కాడకి తోలుకు పోయిండాడు. ఆడ రవి చుట్టు పక్కల యూత్‌తో మాట్లాడేస్తుండాడు. నన్ను సూడగానే ‘రేయ్...వచ్చేసిండావా...నేనే పిలిపిద్దామనుకున్నా. బాగయ్యిండాదిలే. సూడప్పా మనమంతా కల్సి సేసుకుంటేనే పని అయితాది. కాలేజీ ఎలక్షన్ల లెక్క ఈజీ కాదు...సినుగుతాది తెల్సిండాదా’ అభిమానం...బెదిరింపు రెండూ మిక్స్ చేసి కొట్టిండాడు.
మాకైతే ఫుల్ కీ యిచ్చి యిడిసినట్టుండాది. అబ్బా మునిసిపల్ ఎలక్షన్లలో తిరగాడాల...మా సత్తా ఏందో సూపించాలా అని శపథం చేసుకునిండాము. రవి బీకాం చేసి ఆడిటర్ రామారావు ఆపీసులో కొలువు చేస్తుండాడు. తమ్ముళ్లు వేణు, రఘు చిన్నన్న ప్రభంజన్ అందరూ మాకు దోస్తులే! అందులో రఘు గాడు మా బ్యాచి మేటు. వాడంటే నాకు సానా ఇష్టం. అసలు వాడి పరిచయమే విచిత్రంగా అయింది. కమాను ఎనకాల వాళ్లిల్లు అని నాకు తెలీదు. ఓ రోజు మా మునిసిపల్ పెద్ద స్కూలులో సింగింగ్ కాంపిటీషన్ అయిండాది. అందులో ఈడు వచ్చి పాట పాడిండాడు. సన్నగా గొంతు తీసి పాడుతుంటే ...ఇట్టే పడి పోయాను. పైగా నాకు పాడటం రాదు కాబట్టి...నా దృష్టిలో వాడో పేద్ద సింగర్! నేనే వెళ్లి పరిచయం చేసుకునిండాను. కాలేజీ మెట్లెక్కినాంక ఇంకా క్లోజ్ అయండాము. నిజానికి రవి పోటీ చేయడం ఇంట్లో ఇస్టం లేదు. అందరూ ఎందుకొచ్చిన గొడవ...అయ్యేదా పొయ్యేదా...మనకేమైన పైసలు మూల్గుతుండాయా కర్చు చేసు కునేకి అని గయ్ మన్నారంట. అయినా రవి నేను నిల బడేదే! బ్రాహ్మణ యూత్ వాళ్లందరూ నిలబెట్టినాంక ఎట్టా వద్దనేది అనే సరికి ఎవ్రూ ఏం మాట్లాడ లేక పోయిండారు. వద్దనే వాళ్లు... పర్వాలేదనే వాళ్లు...ఏ నిలబడాల్సిందే అనే వాళ్లందరి మాటలు వింటూనే రవి పోటీకీ సై అంటూ ప్రకటించేసిండాడు.
పదమూడో వార్డుకి కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు రవి రెడీ అయిండాడన్న వార్త మా పిల గాళ్లను దాటుకుని పెద్దోళ్ల దాకా పాకింది. సానా మంది పెదవి విరిసి ఏంటో వీళ్లు ఇంత పెద్ద ఎలక్షన్లంటే మాటలా అని గుసగుస లాడు కునిండారు. మరి కొందరైతే అదేదో ఊరుకుండ లేక ఉబ్బసానికి మందు తీసుకున్నట్టు బాగయ్య వీళ్ల కత అంటూ రాగాలు తీస్తే ఇంకొందరు ఎలక్షన్లంటేనే బేజారు పని. ఈ రవి ఊర్లో వెళ్లే దయ్యాన్ని ఇంట్లోకి పిలుసుకుంటుండాడు. అవును ఇంట్లో పెద్దోళ్లయినా రొవంత బుద్ది మాట సెప్పొచ్చు కదా అన్నారు. అనే వాళ్లు...అనుకునే వాళ్లు అలా ఉంటుండ గానే ఓ రోజు వెంకట నరసప్ప గుడి లోన మీటింగు పెట్టుకునిండాము. ఎలక్షన్లలో రవిని నిల బెట్టాలి... అందు కోసం అందరం ఏం సేయాలా అనేదే అజెండా. నఖాతే శ్యామ్...దేశాయి క్రిష్ట మూర్తి, మరి కొందరి సారథ్యంలో మీటింగు నడిసిండాది. అందరూ వగ్గట్టుగా పోరాడితే రవి గెలిసేది గ్యారంటీ అని చెప్పుకునిండాము. నామినేషన్ ఎట్టా తయారు చేయాలో చర్చించుకున్నాంక మీటింగు ముగిసిండాది.
నామినేషన్ ఏసే దాకా సానా మంది ఆ ఏముండాదిలే పిల్ల కాయలు కదా ఏదో ఆవేశం...తగ్గగానే ఊర్కయి పోతారు అనుకున్నారు. కానీ అందరూ జోరుగా మెరవణి తీసి మునిసిపల్ ఆఫీసు కెళుతుంటే...సూస్తుంటే అనుకున్న పని చేసేటట్టుండారే...కానీ ఏమైతోదో చూద్దాం. చివరి నిమిషంలో తుస్ మన్నోళ్లని ఎందరిని సూడ్లేదు అని మా చెవులు ఇనుకునే లాగానే అనుకునిండారు. అయితే ఎవ్రూ తిరిగి మాటాడకుండా పన్లో పడి పోయిండారు. ఇంక ప్రతి రోజూ తిరుగుడే...మీటింగుల మీద మీటింగులే! కాలేజీ ఎలక్షన్లయితే క్యాండేటు అంతో ఇంతో కర్చు చేసేటోడు. కనీసం సెట్టి క్యాంటీన్లో ఆ నెల్రోజులు ఖాతా తెరిసి...ఎవడెంత తింటారో తినుకోండి అనేటోళ్లు. కానీ ఈడ రవి సానా నిక్కచ్చిగా ములాజ లేకుండా..సూడప్పా మాది పేదోళ్ల పార్టీ. ఏమో అందరూ బాగుంటాదంటే నిలుసుండాం. మీకు బేకైతే తిరగండి. అప్పుడప్పుడు ఉప్మాలు చేపిస్తాం. అంతే గానీ గొంతెమ్మ కోర్కెలంటే మా వల్ల కాదు ఇప్పుడే సెబుతుండాము...అనినాంక ఎవరైనే ఏం చేస్తాం? సచ్చినట్టు అట్టే కానీ సామీ ...నవ నీకే కాదు మాకూ ఉండాది.. గోక్కోవల్సిందే కదా అంటాం!
వెంకట నరసప్ప గుడి సత్రం మా ఆపీసు అయిండాది. ఓటరు లిస్టులు వచ్చి నాంక వాట్లో పేర్లు ..అడ్రసు చూసుకోవడం...ఎక్కడెక్కడ ఎన్నేసి ఓట్లుండాయి...ఎవరు సెబితే అవి పడతాయి అన్ని విషయాలు కూపీ లాగడం షరు చేసిండాం. అప్పటి దాకా ఎలక్షన్లంటే ఓస్ ఏముంది అనుకున్న మాకు దాని వాడీ వేడీ మెల్లగా అర్థమైంది. కాలేజీ దాదాపు బంద్ చేసి ఇదే పనిలో పడి పోయిండాం. గేరీలు ఎన్ని ఉండాయి...ఏయే కులాల వాండ్లు యాడ ఎక్కువుండారు...అదీ ఇదీ అని కాదులే అన్ని వివరాలు సేకరించేది...రాసుకునేది...మీటింగులు పెట్టుకుని మాట్లాడుకునేది. ఇదో పెద్ద యజ్ఞంలా మారి పోయిండాది. నేను వేణు రఘు పచ్చి, పల్లి, మఠమోళ్లు...పోస్టలోళ్లు అందరం ఈ పని మీందనే. రాత్రికి రాత్రే రహస్య మీటింగులు జరుగుతుండేవి. ఎవరెవరు బరిలో ఉంటారు...ఎవరు జారకునేకి రెడీ అయిండారో రోజుకో కత ప్రచారం లోకి వచ్చేది. ఈ వార్డు లోనే పెద్దాయన నీలి శాంతణ్ణ నామినేషన్ వేసిండాడు. ఆయప్ప సీనియరు. మొదట్లో రవి వేస్తున్నాడు అంటే ...ఆ ఏస్కోని అనుకున్నాడే గానీ...మా గ్యాంగు చూసినాంక ఇదేందో యవ్వారం సెడేతట్టుండాదని వారితో వీరితో చూచాయిగా కబురు పంపడం సురు చేసిండాదు. ‘రాజకీయాలు సేసుకునేకి ఇంకా సానా టైముండాదప్పా. పిల గాళ్లు కదా ఇప్పుడే ఈ తల నొప్పేల? వార్డు బాగుండాలంటే అందరూ కల్సి పోవాలా కదా. ఆలోచించుకోండి అని మధ్య వర్తులంటే...అవి కూడా బైట కొచ్చేసేవి. మాకు బలే జంబాని కొచ్చేది. అబ్బా మా శక్తి ఇంతుండాదా అనుకుని రెచ్చి పోయే వాళ్లం.
నామినేషన్లు...ఉపసంహరణ తంతు పూర్తయ్యే సరికి బరిలో నలుగురు మిగిలిండారు. వారిలో నీలి శాంతణ్ణ, రవి... వీళ్లే బలమైన ప్రత్యర్థులని అందరూ ప్రచారం లోకి పెట్టిండారు. రవికి ఏనుగు గుర్తు వచ్చే సరికి...మాక్కూడా ఏనుగెక్కి నంత సంబరమైంది. ఆడ నుంచి అసలు కత సురు అయిండాది. ఖర్చులూ పెరిగిండాయి. పాంప్లెట్లు కొట్టించేకి రెడీ కాగానే...నేను రాస్తానంటూ ముందుకురికిండాను. ఇంకా కిందా మీదా పడి పాంప్లెట్టు మేటరు సిద్ధం చేసిండాం. కొత్త వాళ్లకీ చాన్సు ఇవ్వండి...మేమేంటో చూపిస్తాం..! అని రక రాలుగా తయారు చేసినాము. మా ఉత్సాహాన్ని చూసి సానామంది రవి ఎలక్షన్లలో నిలిసిండేది ఓట్ల కోసమా...వీళ్ల రాత కోసమా అని ఎగతాళి చేసేవాళ్లు. రాత్రిళ్లు నిద్దర్లు వదిలేసుకుని...ఓ డబ్బాలో నీలి రంగు కలుపుకుని బ్రష్‌తో వీధి వీధిలో తిరిగే వాళ్లం. నాకైతే పండగే పండగ. శ్రీశ్రీ బుక్కులోనివి కొన్ని...నా పైత్యం కొంత కల గలిపి గోడలపై రాసింది రాసిందే!! ‘నవ తరం కావాలంటే...యువ తరం రావాలి...’ ‘యువతకు పట్టం కట్టండి...కొత్త చరిత్ర సృష్టించండి...’ ‘నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా రారండి...’ ఇంక రక రకాలుగా తెల్లగా గోడ కనిపించడం ఆలస్యం రాసేవాళ్లం. అరె ఇది ఓటు వేసేవాళ్లకు అర్థమవుతుందా లేదా అదంతా మాకు బేకు లేదప్పా. మేం మహా ప్రస్థానం చదువుకునిండాం...అదంతా గోడలపై దిగి పోవాల్సిందంతే. కాక పోతే చివర్లో మాత్రం ఏనుగు గుర్తుకే ఓటు...అని తప్పకుండా రాసే వాళ్లం. తెలుగు లోనే కాకుండా హిందీ లోనూ మా ప్రావీణ్యం వెలగ బట్టే వాళ్లం. ‘హర్ మొహల్లీమే నల్లా...నల్లామే పానీ...హాథీకీ నిశానీ...’ అని రాసి పక్కనే ఏనుగు బొమ్మ ఉన్న రేకు పెట్టి ఇంకు పూసే వాళ్లం.
ఈ ప్రచారంలో మా గుంపులో నాకు ఎక్కడ్లేని పేరు వచ్చేసిండాది. అరేయ్ వీడు బలే రాస్తున్నాడ్రా...తెలుగంటే వీడే రాయాలా...అంటుంటే నా వళ్లంతా మైకం కమ్ముకున్నట్టుండేది. ఇంక ఈ లోకంలో లేనట్టుగా పొద్దు గుంకులా అదే ధ్యాస. ఏం నినాదాలు రాయాలా... కొత్తగా ఏం చేయాలా అని సదా శివుడికి అదే ధ్యాస అన్నట్టుండేవాణ్ని. నా నినాదాల ముచ్చట ఇలా నడుస్తుం టే...అసలు కత జోరందుకుంది. రోజు రోజుకీ ప్రచార స్వరూపం మారి పోతుండాది. లోలోపలి రాజకీ యాలు... సమీకరణాలు...వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ మాకు అంతు చిక్కేది కాదసలు. అంతే కదా ఏదో కాలేజీల్లో ఎలక్షన్లలో పోరాడిండాము కానీ...ఇంత టెన్షన్ ఉంటుందనుకో లేదు. ఎలక్షన్లు ఇంక రెండు మూడ్రోజులుందనంగా అసలు రాజకీయాలకు తెర లేసింది. ఆ గేరిలో అంత పంచిండారంట...ఈ గేరిలోఇంత ఇచ్చిండారంట. ఓట్లు వేస్తే బోర్లు వేయిస్తామంటుండారని కొందరు...రక రకాలుగా ప్రలోభాలు పుట్టుకొచ్చిండాయి. మేమూ అడికాడికీ పోరాడుతునే ఉండాము. ఏదైతే అదైతాది తగ్గ కూడదంతే అనేటట్టు నిల్సుండాము. ఉన్నట్టుండి ఓరోజు నాన్న ఇంట్లో గొడవ సురు చేసుకునిండాడు. చదువుకోరా అని కాలేజీలోకి చేర్పిస్తే...ఈ ఎలక్షన్లేంటి? ఈ గొడవేంటి? ఏం వద్దు. రేపట్నుంచి అన్ని మూసుకుని ఇంట్లో ఉండు అంతే! అనే సరికి నాకు తల తిరిగి పోయిండాది. నా కతలో తలేసేకే ఇష్టం లేని నాన్న ఎందుకిట్ట మండి పడుతున్నాడో నాకు అసలే అర్థం కాలేదు. ఏం మాట్లాడకుండా ఊర్కే ఉండి పోయిండాను. ఆ తర్వాత నాకు అర్థమైంది... నీలి శాంతణ్ణ లాంటి పెద్ద మనిసి బరిలో ఉన్నప్పుడు ...ఈ పిల్లోళ్ల గొడవేంది...పైగా నేనేమో అందరి కంట్లో పడే లెక్కన తిరుగుతుండాను...అటూ పోయి ఇటు పోయి యాడ వ్యవహారం ఇంటి పైకి వస్తుందో అని ఆయన భయం ఆయనది. పైగా కమాను ఇళ్లు మఠానికి సంబంధించినవి. మఠం కమిటీలో ఆయన ఉండాడు. నాకు తెల్సి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి గొడవే ఏదో అయ్యే ఉంటుంది.
ఓటర్ల కిచ్చే చీటీలు తయారు చేసు కోవడం పెద్ద కస్టంగా మారిండాది. అందరం కూర్చొని స్లిప్పులు అదే పనిగా తయారు చేస్తుండాం. ఒక బూతు మసీదు వెనకాల ఉంటే... ఆ స్లిప్పుల పై మసీదు స్కూలు వెనకాల అని రాయాల...దానికి మా వాళ్లు మ.స్కూ.వె. అంటూ రాయడం సురు చేసిండారు. అక్కడికీ కొందరు ‘ఏమప్పా మీరంత మ.స్కూ.వె. అంటూ రాసుకుంటూ పోతే ఎవడికి అర్థమైతాది? ఓటర్లు రావాలా వద్దా? పని చేసేదేందో కాస్త నిమ్మళంగా మంచి చేయండి అంటూ క్లాసులు పీకే వాళ్లు. రేపు పోలింగ్ అనంగా...రాత్రికి రాత్రే మా ఏజెంట్ల మీటింగు పెట్టిండారు. దేశాయి క్రిష్ణమూర్తి ‘ఏజెంట్లు చానా కట్ నీట్‌గా ఉండాల. వాడేదో వడ ఇచ్చిండాడు..వీడేదో ఉప్మా పెట్టిండారని తినేయకండి. ఏమైనా కలిపిండారంటే ఇంక అంతే...వాంతులు బేదులు ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. తెల్సిండాదా అంటుంటే...మేమంతా కనీ కనిపించ కుండా నవ్వుకునే వాళ్లం.
ఎలక్షన్లు ముగిసిండాయి. హడావుడి తగ్గింది. మాలాంటి అమాయకులు తప్పించి రవి ఎలక్షన్లో గెలుస్తాడని...కౌన్సిలర్ అయి పోతాడని ఎవ్రూ కల గన లేదు. రాత్రికి రాత్రే మారిన పరిస్థితుల వల్లనో ...మరేంటో కానీ అనుకున్నట్టుగానే రవి కౌన్సిలర్ కాలేక పోయాడు. అయితే ఎవరూ అనుకోనట్టుగా రెండో స్థానంలో నిలిచాడు. చాలా మందికి ఇది జీర్ణం చేసుకో లేని విజయం. నలుగురు పోటీలో ఉంటే రెండో స్థానంలో ఉండటమే కాకుండా డిపాజిట్టు దక్కించుకున్నది కూడా రవే! ఈ ఎన్నికల వల్ల మాకు బోల్డెంత అనుభవం వచ్చింది...అంతేకాదు రవి కాస్త ఏనుగు రవి అయిండాడు!!