"ఏమండోయ్!" అది మా ఆవిడ పిలుపు కాదు కెవ్వు కేక! ఏ బల్లో, బొద్దింకో, దాడి చేసే వుంటుంది లేదా ఏ స్టూలో ఎక్కుంటుంది కంటబడ్డ బూజు దులపడానికి! ఏం చేయాలి దేవుడా! కాలో చెయ్యో విరగలేదు కదా! గుండె గుబేలుమంటుంటే వసారాలో కూర్చుని నింపాదిగా చదువుతున్న పేపర్ ను గిరటేసి ఇంట్లోకి పరిగెత్తాను.
చూద్దునుకదా కొత్తగా కొనుక్కున్న సెల్ ఫోనును పరీక్షగా చూస్తోంది. ఫోనులోని అప్లికేషన్లు, ఫీచర్లన్నీ దాదాపు ఔపోసాన పట్టేసిందే!
"ఆ...! పడేసావా? అనుకున్నాను, సుతారంగా పట్టుకుని ఫోను మీద ఫోను చేస్తుంటే! అయినా నా ఫోనుంది, ల్యాండ్ లైనుందిగా అంటే అక్కతో, కొడుకుతో మాట్లాడుకోవాలి, పచారీ కొట్టునుంచి సూపర్ బజారు వరకు ఫోనుమీదే జరిగిపోతుంది పైగా కిట్టీ పార్టీ సభ్యులంతా రకరకాల ఫోన్లు తెస్తారని, వారందరికి ఎసెమ్మెస్సులు, ఎమ్మెమెస్సులు ఇచ్చుకోవాలని నీ చెవిని సెల్లుకోసం నా చెవినిల్లు కట్టుకుని పోరావు."
"నేచెప్పేదేదైనా వినేదుందా, మీ దండకమిలాగే పొడిగిస్తారా?" హుంకరించింది మా ఆవిడ.
"ఊ... సరేలే చెప్పు వింటానుకాని, ఏమైందేమిటి అలా బిగుసుకు పోయావు?" అన్నాను నవ్వుతూ చేతిలో వున్న సెల్ ఫోను నా ముఖం ముందు పెట్టింది.
అందులో కనపడిన మెసేజ్ చదివాను.
"ఓహో! మీ అక్క మేసేజిచ్చిందా? నీకొచ్చిన మొదటి మెసేజ్ ఇచ్చిన థ్రిల్లా ఇది! ఏమోనని హడలిపోయాను. మీ అక్కగారు బావగారితో కలిసి నడక యోగంలో ఉన్నారేమోలే!"
"అబ్బ! అర్థం కాదేమిటి మీకూ..." మా ఆవిడలో కనబడ్డ విసుగు ఆమె ముఖమంతా పరచుకుంది.
ఆ విసుగెందుకో నాకు నిజంగానే అర్థం కావడంలేదు.
ప్రేమ పెరిగి చెల్లాయి గుర్తొచ్చినప్పుడల్లా, ఫోను చేసి "బుజ్జి లేచిందా?" అని ఒకసారి, "బుజ్జి ఏం చేస్తోంది?" అని మరొకసారి నాకు ఫోన్ చేసి అడిగేది.
'బుజ్జీ! నీకు మీ అక్క ఫోను!' అంటూ నేను సరదాగా ఆటపట్టించేవాడిని.
"సరేలే మీకిదొక ఆటయిపోయింది, అందుకే నాకంటూ ఒక ఫోనుండాలి." అని ఫోనందుకుని వాళ్లక్కతో కబుర్లలో మునిగేది.
'మరి కొత్తఫోనులో మెసేజ్ నాకు చూపడంలో... అర్ధమయింది.'
"ఓ... గోంగూర పచ్చడి చేస్తున్నావనా? సరే, రమ్మని రిప్లయి కొట్టు! ఎక్కడ పని అక్కడ వదిలేసి వచ్చెయ్యదూ!" నవ్వాను.
"మా అక్కపై మీ జోకులాపి ఈ మెసేజ్ ఎవరిచ్చారో ముందు చూస్తారా?"
'ఇంకెవరు?' అప్పుడు చూసాను పంపినవారి పేరు! ఎవరో కాదు రాము! ఎదురింటి కుర్రాడు రాము!
'కుర్రాడు బుద్ధిమంతుడు, మంచి, మర్యాద తెలిసినవాడు. పెద్దలంటే గౌరవమున్న వాడు. ఇటునించి పిలిస్తే చాలు, అటునుంచి ఓ అని పలుకుతాడు. మా ఇరువురి ఫోన్ల లోనూ అతడి నంబరుకే ఎక్కువ సార్లు చేస్తున్నట్టు ఫోన్లు రికార్డు చేసి మరీ చూపిస్తుంటాయి.'
'మరి మా ఆవిడకు ఇలా మెసేజ్ ఎందుకిచ్చుంటాడబ్బా! బహుశా నేను మా ఆవిడను బుజ్జీ అని పిలవడం విని ఉంటాడు. అయినా ఇలా చిన్న పిల్లనడిగినట్టు అడిగాడంటే ఏదో జోక్ చేద్దామనే ఉంటుంది. నెల ఏప్రిల్ సరే, కాని ఒకటో తారీకు కాదే!'
'సరేలే, చిన్న కుర్రాడు, ఏదో సరదాకు మెసేజ్ చేసుంటాడులే అని మా ఆవిడకు నచ్చ చెప్పినా, నా మనసు మాత్రం ఎందుకిలా ఇచ్చాడు అని ఆలోచిస్తూనే ఉంది. రామును పిలుద్దామంటే వేసిన గుమ్మం వేసినట్లే ఉంది. ఫోను చేద్దామని ఫోనందుకున్నాను. కాని ఫోనులో ఏం మాట్లాడుతాము? పైగా నొచ్చుకుంటాడేమో అపార్ధం చేసుకున్నామని. అందుకే రాము వచ్చేదాక ఆగితే ఏం పోయిందనుకున్నాను.'
నింపాదిగా పేపర్ చదువుతుంటే రాము ఇంటి గుమ్మం చప్పుడయింది. చేతిలో సంచితో ఇటే వస్తున్నాడు.
"అంటీ లేరా?" లోపలికి చూస్తూ అడిగాడు, సంచి నుండి తీసిన వెడ్డింగ్ కార్డ్ నా చేతిలో పెడుతూ.
రాము వెడ్స్ దీప(బుజ్జి).
ఓ! నీ కాబోయే శ్రీమతి కూడా బుజ్జేనా! మీ ఆంటీ కూడా ఇంట్లో వాళ్లకు ఇప్పటికీ బుజ్జే!
రాము గొంతు విన్న మా ఆవిడ టీ, టీతో పాటు బిస్కట్లు పట్టుకొచ్చింది. నేనందించిన పెళ్లిపత్రిక ను ఆసక్తిగా చూస్తోంది.
"ఆంటీ! మీరు ఏం అనుకోనంటే ఒకమాట... ఆగాడు."
'ఏం చెప్తాడా?' అని కుతూహలంగా చూసా.
"ఆంటీ మీ నంబరు, రమ నంబరు చివరి నాలుగు సంఖ్యలు ఒకటే... అందుకే పొరపాటున తనకు వెళ్ళాల్సిన మెసేజ్ మీకు వచ్చేసింది. సారీ ఆంటీ!"
నాకు నవ్వాగలేదు. మా ఆవిడా మూతి బిగించి నవ్వుకుంటూనే ఏదో పనున్నట్టు హడావిడిగా ఇంట్లోకి వెళ్లడం బహుశా తనివిదీరా నవ్వుకోవాలనేమో!
మా నవ్వులు రాము ముఖంలో దిగులును తుంచి కాంతిని పెంచాయి.
"అంకుల్ మాపెళ్ళికి తప్పకుండా రావాలి. ఇంకా ఎందరికో ఇవ్వాలి పత్రికలు, తప్పకుండా రండి. మరి వెళ్ళొస్తానండి. ఆంటీకి కూడా చెప్పండి."
రాము అటువెళ్ళగానే, నేనింట్లో కడుగేసా,
'ఏం చేస్తున్నావు బుజ్జీ?' అంటూ!