పెంపకం - దినవహి సత్యవతి

pempakam

రుక్మిణీదేవి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా చేసి ఈ మధ్యనే పదవి విరమణ చేశారు. ఆవిడకు ఇద్దరు కుమార్తెలు . వివాహానంతరం ఇద్దరు ఆడపిల్లలు భర్తలతో విదేశాలలో స్థిరపడ్డారు. తమవద్దకు వచ్చి ఉండమని కూతుర్లు ఎంత బ్రతిమిలాడినా ‘ఒంట్లో శక్తి ఉన్నన్నాళ్ళు స్వతంత్రంగా ఉండటమే నాకు ఇష్టం’ అని చెప్పి వాళ్ళ అభ్యర్థనను సున్నితంగా త్రోసిపుచ్చారు ఆవిడ.

“మీ అమ్మాయిలు ఎంత బుద్ధిమంతులండి రుక్మిణిగారూ, మీరెంతో అదృష్టవంతులు” అని అందరూ పొగుడుతుంటే ఆవిడకి తన పెంపకం పైన ఎంతో గర్వంగా అనిపిస్తుంటుంది.

కూతుర్లు కుటుంబాలతో సహా పుట్టింటికి వచ్చి నెలరోజులయింది. రుక్మిణిదేవికి ఇద్దరు మనుమరాళ్ళు. తన దగ్గర ఉన్నన్ని రోజులు వాళ్ళని ఎంతో గారం చేస్తారు రుక్మిణీదేవి. పిల్లలు అల్లరిచేస్తుంటే సముదాయించలేక కూతుర్లు అవస్థ పడుతుంటే ‘నా పిల్లలు ఎప్పుడు ఇంత అల్లరి చేయలేదు . చెప్పిన మాట వినేవారు. ఇదేం చోద్యమో?ఈ కాలం వాళ్ళకి పిల్లల్ని పెంచడమే చేతకాదు’ అని అభిప్రాయపడతారే తప్ప అది అతి గారం చేయడం వల్ల అని మాత్రం అనుకోరు . ఇదంతా చూసిన మీదట ఆవిడకు తన పెంపకం పైన నమ్మకం మరింత బలపడింది. మనుమరాళ్ళ ముద్దు ముద్దు కబుర్లు వింటూ నెలరోజుల సమయం తెలియకుండానే గడిచిపోయింది ఆవిడకు.

రుక్మిణీదేవిది అద్దెకివ్వడానికి అన్ని సౌకర్యాలు ఉండేలా కట్టించిన మూడువాటాలు ఉన్న పెద్ద ఇల్లు. అందులో ఒక వాటాలో ఆవిడ ఉంటున్నారు. మిగిలిన రెండు వాటాలలో ఒక దానిలో రాజేష్ భావన దంపతులు తమ పదమూడేళ్ళ కూతురు మల్లికతో , ఇంకో భాగంలో గౌరి మహేష్ దంపతులు తమ ఆరు సంవత్సరాల కొడుకు రోహిత్ తో అద్దెకు ఉంటున్నారు. రుక్మిణీదేవి ఇంటికి అద్దెకున్న వాళ్ళ ఇళ్ళకి మధ్యలో ఒక గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో ఆవిడ ఎంత వద్దనుకున్నా వాళ్ళ సంభాషణలు, వాదనలు, పిల్లల పేచీలు ఇత్యాదివన్నీ చెవిని పడుతూనే ఉంటాయి.......

సమయం కుదిరినప్పుడు రుక్మిణీదేవి వద్ద కూర్చుని కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటుంది భావన. ఇద్దరు ఆడపిల్లలను బుద్ధిగా పెంచిన అనుభవం ఉండడంతో పిల్లల పెంపకం విషయంలో ఆవిడ ఇచ్చే సలహాలు భావనకి ఎంతో ఉపయోగిస్తుంటాయి.

ఒక రోజు అలాగే రుక్మిణీదేవి వద్దకువచ్చి కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడటం అయిన తరువాత పదమూడేళ్ళ తన కూతురు మల్లిక ఈ మధ్యన ఎక్కువగా విసుక్కోవడం పెడసరంగా సమాధానం చెప్పడం గురించి ప్రస్తావిస్తూ “మల్లికతో ఎలా మసలుకోవాలో తెలియడంలేదు పిన్నిగారూ!” అంటూ వాపోయింది భావన.

భావన ప్రస్తావించిన సంభాషణ యాథాలాపంగా చెవినపడి ఉండటంతో ఆమె ఆందోళనను అర్థం చేసుకున్నారు ఆవిడ.

“ఊరుకో భావనా! యుక్త వయసులో ఆడపిల్లలలో అనేకమైన శారీరిక మానసిక పరిణామాలు సంభవిస్తుంటాయి. ఆ కారణాన వారికే తెలియని చికాకులకి లోనవుతూ అది ఎవరిపై చూపాలో తెలియక తల్లిపైన చూపడం జరుగుతుంది. నువ్వే కొంచం సహనం వహించాలి . అది కొంత కష్టమే అయినప్పటికి అసాధ్యం మాత్రం కాదు. ఈ విషయంలో నీకు నీ భర్త రాజేష్ సహకారం ఎంతో అవసరం” అన్నారు.

ఆవిడ మాటలకి ఆలోచనలో పడిన భావన ‘అవును నేను రాజేష్ కలిసి నొప్పింపక తానొవ్వక అనే పద్ధతిలో మెలగాలి మల్లికతో’ అనుకుని “థ్యాంక్స్ పిన్నిగారూ అలాగే చేస్తాను” అని వెళ్లిపోయింది.......................

మహేష్ గౌరీలకు రోహిత్ ఒక్కడే సంతానం. భర్త వాడిని అతి గారం చేయడం గౌరికి అంతగా ఇష్టం ఉండదు. ఈ విషయమై వారిమధ్య అభిప్రాయ భేదాలు వస్తుంటాయికుడా. ఈ సంగతి గ్రహించిన రోహిత్ కూడా తెలివిగా ఏదైనా కావలిస్తే తండ్రిని అడిగి కొనిపించుకుంటాడు......

ఆ రోజు ఆదివారం. భర్త మహేష్ సెలవు రోజున కూడా అత్యవసరమైన పని ఉందంటూ ఆఫీసుకి వెళ్లిపోవడంతో ఇంట్లో పనులన్నీ నెమ్మదిగా సాగుతున్నాయి. ఉదయం ఫలహారాల కార్యక్రమం తరువాత నెమ్మదిగా వంట మొదలు పెట్టింది గౌరి.

పదకొండుగంటలయిందో లేదో “అమ్మా ఆకలేస్తోంది అన్నం పెట్టమ్మా!” అంటూ వచ్చాడు రోహిత్ వంటింట్లోకి.

“ఇప్పుడేగా ఆ చిప్స్ తిన్నావు? అయినా ఇంకా వంట కూడా అవలేదు. ఈ లోగా వెళ్ళి హోంవర్క్ చేసుకుని రా అప్పుడు పెడతాను” అని తల్లి అనడంతో ఆమె అంటే ఉన్న సహజమైన భయం కొద్ది ఎదురాడకపోయినా కాళ్ళు నేలకేసి తాడించి తన అసహనం అంతా చూపిస్తూ వెళ్లిపోయాడు రోహిత్ అక్కడినించి .

విసురుగా వెళుతున్న కొడుకుని చూసి ‘‘దూర్వాస మహామునిలాగా వీడికి ముక్కుమీదే కోపం . అడిగింది వెంటనే అందక పోతే అంతే ఇంక! వీడు ఇలాగే ఉంటే మున్ముందు కష్టమే’ అనుకుంటూ వంట పూర్తి చేయడంలో మునిగిపోయింది గౌరి .

కంచాలలో భోజనం వడ్డించి “రోహిత్ అన్నం తిందువుగాని రా” అని పిలిచింది గౌరి .

“ఇవాళ బంగాళదుంప కూర చేయలేదా? ఈ కూర నాకొద్దు నేను తినను.” అంటూ కంచం ముందు కూర్చూంటూనే పేచీ మొదలు పెట్టాడు రోహిత్ .

“అన్నీ నీకిష్టమైనవే చేసినా బంగాళదుంప చేయలేదా అంటే ఎలా? పేచీ పెట్టాకుండా అన్నం తిను రోహిత్” అంది.

“ఊహూ! నాకు బంగాళాదుంప కూర కావాలి అంతే , ఇప్పుడే చేసిపెట్టు” పేచీతో పాటు కంఠం కూడా పెంచి అరవసాగాడు.

“ఎప్పుడూ ఒకటే కూర అంటే ఎలా? అన్ని కూరలు తినడం అలవాటు చేసుకోవాలి . ఆఖరు సారిగా చెప్తున్నాను . పిచ్చి పిచ్చి పేచీలు పెడితే దెబ్బలు తింటావు ఇంక” కోపంగా తల్లి గదిమేటప్పటికి రోహిత్ కంఠస్వరం స్థాయి ఠక్కున తగ్గిపోయింది . వాడికి తెలుసు అమ్మ ఎప్పుడు కోప్పడదు కానీ కోప్పడిందంటే మాత్రం అన్నంత పని చేస్తుందని.

ఉదయం తల్లి మందలించిందనే ఉక్రోషంతో పేచీ మొదలుపెట్టాడే కాని అమ్మ చేసిన గుత్తి వంకాయ కూర , మామిడికాయ పప్పు, టమాటా చారు అన్నీ వాడికిష్టమైనవే. కానీ అన్నిటి కంటే బంగాళాదుంప వేపుడంటే ఎక్కువిష్టం . రోజు రెండుసార్లు అదొక్కటే పెట్టినా తింటాడు రోహిత్ . అందుకే పేచీ ఆపేసినా నసుగుతూనే భోజనం కానించాడు....

ఈ సంభాషణ అంతా పక్కింట్లో రుక్మిణీదేవి చెవిన పడుతూనే ఉంది . గౌరి కొడుకుని అలా కోప్పడటం అసలు నచ్చలేదు ఆవిడకి. మగపిల్లలు లేకపోవటంతో రోహిత్ ని ఎంతో ముద్దు చేస్తారు ఆవిడకూడా. వాడు కూడా “అమ్మమ్మా!” అంటూ ఆవిడ దగ్గర గారాలు పోతుంటాడు.

ఆ సాయంత్రం గౌరితో కూర్చుని కబుర్లు చెపుతున్నప్పుడు యాథాలాపంగా “ఎందుకమ్మా ఉదయం రోహిత్ ని అంతగా కోప్పడ్డావు?” అన్నారు.

”ఓహో! అయితే అంతా ఈవిడ చెవినపడిందన్న మాట” అనుకుని “అవును పిన్నిగారూ లేకపోతే వాడు ఆ పేచీ ఆపేలా అనిపించలేదు”

“అయినా కానీ పాపం వాడు మాత్రం ఏమడిగాడు? రెండు బంగాళాదుంపలు ఎంతలో వేగుతాయి, చేసిపెడితే పోయేదిగా?”

“అదికాదు పిన్నిగారూ అన్నీ వాడికిష్టమైనవే చేసినప్పుడు కూడా అది లేదు, ఇది కావాలి అని పేచిపెట్టడం తప్పుకదా? అయినా ఎందులోనైనా వాడికి ఎంచుకునే అవకాశం ఇవ్వగలను కానీ భోజనం దగ్గర మాత్రం ఇవ్వలేను. అన్ని కూరలు తినడం ఇప్పటినుండే అలవాటవ్వాలి, అలాగే ఏది చేసిపెట్టినా తినాలి. ప్రత్యేకంగా వాడికిష్టమని కారం తక్కువగా వేసి రుచికరంగా చేస్తాను అయినా కూడా పేచీ పెడితే ఎలా? రేపు పై చదువుల కోసం ఎక్కడికైనా వెళ్ళి ఉండాల్సి వచ్చినప్పుడు అక్కడ వాడికి కావలసినది దొరకనప్పుడు కావలసినది దొరకక, ఉన్నది తినలేక చిరుతిళ్ళకి అలవాటుపడి ఆరోగ్యం పాడుచేసుకుంటాడు. అది ఇంకా ప్రమాదం కదా? అందుకే ఇప్పుడు నేను కొంచం కోప్పడినా మున్ముందు వాడి మంచికే చేశానని తప్పక గ్రహించుకుంటాడు. ఆ నమ్మకం నాకుంది” అని “ఇద్దరికీ టీ కలిపి తెస్తానుండండి” లేచి వెళ్ళింది గౌరి .

ఆమె వెళ్ళిన వైపే చూస్తూ “అవును గౌరి పలుకులలో ఎంతో నిజం ఉంది. కాలంమారుతున్నా కొన్ని విలువలు మారకూడదు. ఇన్నాళ్ళూ అందరికీ పెంపకం గురించి సలహాలిస్తూ వచ్చిన నేను ఇవాళ ఒక చక్కటి విషయం తెలుసుకున్నాను. పిల్లల పెంపకంలో కొన్ని కొత్త పద్ధతులు అనుసరించవలసి వస్తున్నా.... ఆహారపు అలవాట్లు, శుభ్రతకి , క్రమశిక్షణకి సంబంధించిన అలవాట్లు మాత్రం చిన్నతనం నుంచే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కఠినంగా వ్యవహరించడం తప్పనిసరి అవుతుంది మరి. అదే ఈనాడు కొడుకుపట్ల గౌరి అమలుపరిచింది. నిజంగా ఆమె ఆలోచన ఎంతో అనుసరణీయం. ఈ విషయం భావనకి, నా కూతుర్లకి కూడా చెప్పాలి” అనుకుని గౌరి టీ తెచ్చేలోగా ఉదయం తను చేసిన మినపసున్ని గౌరికి పెడదామని లేచి వంటింట్లోకి వెళ్లారు రుక్మిణీదేవి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు