రెండు దెబ్బలు...చలో బళ్లారీ..!: - రామదుర్గం మధుసూదన రావు

rendu debbalu
‘లాఠీ ఛా...ర్జ్‌....’ మైకులో గట్టిగా వినిపించగానే ...అప్పటిదాకా బొమ్మల్లా నిలుచుండిన పోలీసులు ఒక్కసారిగా ముందుకు ఉరికిండారు. రోడ్డు కవతల కాలేజీ ముందర నిలుచున్న మా వైపు దూసుకొచ్చిండారు. చేతిలో పొడగాటి లాఠీలు గాల్లో తిప్పుతూ...బూతులు తిడుతూ దొరికినోణ్ని దొరికినట్టు సావగొట్టేస్తుండారు. కత ఇంత దాకా వస్తుందని అనుకోని మేము బిత్తరపోయిండాము. పోలీసులు ఇట్టా కమ్మేసేసరికి మాకు ఊపిరాడలేదు. పోలీసుల కేకలు. మా పెడబొబ్బలతో చుట్టుపక్కల వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. అప్పటిదాకా కాలేజీ ముందర పెద్దగుంపుగా నిలిచి ‘పోలీస్‌ గోబ్యాక్‌...’అంటూ ఊరు పడిపోయేలా మేము అరుస్తుంటే...రోడ్డు అవతల సెట్టి క్యాంటీను కాడ పోలీసులు ఓ చేతిలో లాఠీ..ఇంకోచేతిలో బుట్టలాంటి డాలు పట్టుకుని మాటాడకుండా నిలుసుండారు. వాళ్లు ఊర్కే ఉండారని మనోళ్లు ఓ తెగ రెచ్చిపోతుండారు. ఇంతలో మా గుంపులోంచి కొన్ని రాళ్లు పోలీసులపై పడిండాయి.

మరి ఎవరికి ఈ బుద్ధి పుట్టిండాదో తెలియదు. అప్పటిదాకా కొయ్యబొమ్మలెక్క ఉన్న పోలీసోళ్లకి ఎప్పుడైతే రాళ్లు తగిలిండాయో...కోపం జుమ్మంటూ లేసిండాది. సీఐ చేతి మైకులో కోపంగా లాఠీచార్జికి ఆర్డరిచ్చింది తడవు ఇంక చూస్కో నాసామిరంగా... చాలా క ష్టమ్మీద మా అరుపులు కేకలు భరించిన వార్లో ఎంత కసి ఉండాదో మాకు తెలిసొచ్చేలా సావగొట్టడం సురు చేసిండారు. ఇంకేముంది...ప్రాణం దక్కితే చాలురా సామీ అంటూ ఉరికింది ఉరికిందే!! చాలా మంది ఊరిపైపునుండే ఎస్‌బీఐ కాలనీ వైపు పరిగెత్తుతున్నారు. ఆ గుంపులో ఉండి అప్పటిదాకా గొంతుచించుకున్న నేను నా ఫ్రెండ్స్‌ తలోదిక్కున పారిపోతుండాము. పోలీసులు...లాఠీలు...ఈ వ్యవహారం మొదటిసారిగా చూసిన నాకు కంపంపట్టిపోయిండాది. బుర్ర పనిచేయడం మానేసిండాది. ఎక్కడ పరిగెత్తుతున్నానో ఏమిటో నాకేమీ తెలియట్లేదు. కాలేజీలోకి పోతుండాను. ఎనకాల పోలీసులు లాఠీలు ఊపుతూ తరుముకొస్తుండారు. ఎదురుగా హాస్టలు కనిపించింది. బతికానురా దేవుడా అనుకుంటూ హాస్టల్లోకి పోయానా...ఆడే నా దురదృష్టం కాచుక్కూర్చుండాది. హాస్టల్‌ వెనక నుంచి నల్గురు పోలీసులు దూసుకొస్తున్నారు. నేను మెట్లెక్కుతుండగానే ఓ పోలీసు నా కుడిభుజానికి లాఠీతో పెడీల్మని కొట్టాడు. మొండిగా పైకెక్కుతుండాను. ఈలోగా ఎడం భుజానికి లాఠీతో ఇంకొక్కటిడిసాడు.
కిరోసిను పోసి అంటించినట్టు చుర్రుమంది...ఏమైతే అదే అయిండాది...ఈ రోజు నాకింక గ్రాచారం మూడిందనుకుంటూ పరిగెత్తుతునే ఉండాను. ఎదురుగా గోడ పక్కల రూములు...వెనకనుంచి పోలీసులు. నాకండ్లకి చీకట్లు కమ్ముకునిండాయి. ఇంక ఈ పోలీసోళ్లకి దొరికేసిట్టే అనుకునే సరికి ఎవడో ఒకడు రూము తలుపులు మెల్లగా తెరిసి గబుక్కున నా చేయి పట్టుకుని లోనికి లాగేసి...తలుపులేసేసిండాడు. ఇదంతా అరక్షణంలో జరిగిపోయిండాది. బైట పోలీసలు రేయ్‌ లమ్డీకే...తీయ్‌...తలుపు తీయ్‌ అంటూ బూట్లతో కొడుతునే ఉండారు. నేనింకా షాక్‌నుంచి తట్టుకోలేక రూములో ఊర్కే నిలుసుండిపోయాను. పదినిమిషాలు అయ్యాక...బైట అరుపులు ఆగిండాయి. రూములో ఒకడు మెల్లగా తలుపు తీసి అటూ ఇటూ చూసి ‘హమ్మయ్యా బతికిపోయిండాం...’ అంటుంటే వాడికి మనసులోనే చేతులెత్తి మొక్కి బైట పడ్డాను.
అసలు కాలేజీకాడికి పోలీసులు రావడానికి కారణం మా స్టూడెంట్ల రాజకీయాలే. స్టూడెంట్స్‌ యూనియన్‌ ఎలక్షన్లో ఛైర్మన్, సెక్రటరీ పోస్టులకి హోరాహోరీ పోటీ అయ్యేసరికి...తలోగుంపులో చేరిపోయిండాము. గోవిందు, గురుసిద్దప్ప, చిన్నగుండ, నేను ఇంకొందరు ఛైర్మన్‌ క్యాండిడేటు మల్లికార్జున కోసం ప్రచారం చేస్తుండాము. ఎట్టాగైనా మా వోడే గెలవాలని చానా జోరుగా ప్లాన్లు వేసుకోవడంతో ఛైర్మన్‌ సీటు మనదేనని తెలిసిపోయిండాది. అట్లాగే మల్లికార్జునే గెలిసిండాడు. ఇంక ఆ ఊపులో ఆడా ఈడా అనిండే మాటలు ఎవరెవరికో తగులుకునిండాయి. అంతటితో ఆగకుండా రాజకీయ మంటలు లేసిండాయి. కాలేజీల్లో గొడవలు పెరిగిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగిండారు. ఆడికాడికీ రెచ్చిపోతున్న మాకు పోలీసుల్ని చూడగానే మరింత కోపం వచ్చేసిండాది. అరే కాలేజీలోకి పోలీసులు ఎట్టా వస్తారని మా పాయింటు. వాళ్లు మాత్రం ఆరోజు సెట్టి క్యాంటీను కాడ కనిపెట్టుకుని నిల్చుండినాను. ఎప్పుడైతే మా అరుపులు జాస్తి అయినాయో...ఇంక లాఠీలకు పనిచెప్పిండారు. ఈ గలాటాలో నేను ఇరుక్కునిపోయిండాను. గ్రాచారం బాగుండి రెండు దెబ్బలకే తప్పించునిండాను. మొత్తం దొరికింటే ఇంక నా వళ్లు కిచిడే!!
అయితే అసలుకత ఈడ నుంచే సురువయ్యిండాది. లాఠీ దెబ్బలతో భుజాలు చుర్‌చుర్‌ అంటుంటే కాళ్లీడ్చుకుంటూ ఇంటికాడకొచ్చానా...నా కంటే ముందుగా ‘కమాను మధుని పోలీసులు చితక్కొట్టేసిండారంట...వాడు పోలీసోళ్ల చేతికి దొరికేసిండాడంట...’ ఈ సుద్దులతో కమాను గోలగోలగా ఉంది. నాకు తెలిసి ఇంకొందరు ‘చదువుకునేకి కాలేజీకి చేర్పిస్తే...అది తప్ప అన్నీ చేస్తుండారు. అతి చేస్తే ఇట్టాగే అయ్యేది. తిక్క కుదిరిందిలే...’ అనుకునే ఉంటారు. నన్ను చూడగానే ఎవరికి వాళ్లు తప్పుకునిండారు. ఇంట్లో వెళ్లగానే అమ్మ గయ్‌మంది. ఏమైందిరా నీకు. పోలీసోళ్లు కొట్టేసిండారంట...బుద్ధిగా కాలేజీకెళ్లరా అంటే ఈ తిరుగుళ్లు...ఈ రాద్ధాంతం ఏందిరా? అసలే మీ నాన్నకు గాబరా. ఇది తెలిస్తే మనిద్దరి కత ఉంటాదిలే...’ అంటుంటే ‘అబ్బా...ఇప్పుడేమైంది? కాలేజీలోగొడవయ్యిండాది. అందరిలాగానే నేనూ ఉన్నా...ఆ పోలీసోళ్లు అట్టా తరుముకొస్తారని నాకేమైనా తెలుసా ఏంది?’ ఎదురు ప్రశ్న వేసేసరికి అమ్మకు కోపం ఇంకా పెరిగిపోయిండాది. ‘అవునప్పా...మనకేం తెలిసేది లేదు. ఏదో ఒకటి చేస్కొని వస్తే తప్ప మనకి తోచదు. చుట్టుపక్కల గేరిలో ఇంతమంది కాలేజీకి పోతుండారు. ఆ పోలీసోళ్లు నిన్నే యాల కొట్టాల? అసలు మనం సరిగా ఉంటే కదా...’ అంటూ దీర్ఘాలు తీసేసరికి ‘నువ్వేమైనా అనుకో...’ అనేసి పోయి దుప్పటి లాక్కొని పడుకున్నాను. భుజాల నొప్పులు మెల్లగా పెరుగుతుండాయి. ఆ ఏమైతది మహా అంటే సాయంత్రం దాకే...తగ్గుతుందిలే అని నాకు నేనే సమాధానం చెప్పుకుని కునుకు తీసిండాను.
సాయంత్రం నాపేరు మరింత ప్రచారంలోకి వచ్చేసిండాది. ముఖం కడుక్కొని బైటికొచ్చాను. ఫ్రెండ్స్‌ కనిపిస్తే హలో అంటూ చేతులెత్తితే ఒక్కోటి టన్ను బరువులా అనిపించింది. భుజం కాడ కిర్రుకిర్రుమంటూ సౌండు. పోలీసుదెబ్బ అంటే ఇదన్నమాట. చూసేకేదీ కనిపించదు కానీ లోపలేం కావాలో అదంతా అయ్యింటాది. మనోళ్లందరి నోట్లో పొద్దున్న కాలేజీకాడ జరిగిన గొడవ సుద్దులే! చిన్నగుండ...తుంగా గుండ, గోవిందు, రంగణ్ణ,బుస్సి,చింతకుంట మధు అందరూ నాపై తెగజాలి చూపించేస్తుండారు. పోలీసుల లాఠీనుంచి ఎట్టా తప్పించుకునిండానో చెబుతుంటే మాంఛి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కతలా తెగా ఆసక్తితో విన్నారు. రోజూలాగే రైల్వేస్టేషన్‌ దాకా వెళ్లి కబుర్లు చెప్పుకుని ఇల్లు చేరుకున్నాను. ఇంట్లో వాతావరణం చాలా సీరియస్‌గా ఉంది. నాన్న గంభీరంగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఆయప్పని చూడగానే ఇవ్వాలా ఉండాది నా కత అనుకున్నాను.
ఇప్పుడింక ఏం చేసేకి లేదు. కాలేజీలో లాఠీదెబ్బలు తినిండేదే నిజం. ఊరంతా ఈ విషయం పాకిండేదీ నిజం...ఏమైతే అదే అయితాది. గ్రాచారం బాగా లేనప్పుడు నోర్మూసుకుని ఉండేదే సరి. మెల్లగా పిల్లిలా అడుగులేసుకుంటూ లోపలికెళ్లే సరికి నాన్న ‘ఏంరా...మేం మర్యాదగా ఉండాలా వద్దా చెప్పు’ అనేసరికి నాకు ఏం బదులివ్వాలో తెలీక తలవంచుకున్నాను. ‘చచ్చీచెడీ కాలేజీలో సీటు ఇప్పిస్తే...నువ్వు చేసే ఘనకార్యం ఇదీ. నువ్వంత మొనగాడివా...పోలీసోళ్లతో పెట్టుకుంటావా...ఇప్పుడు వాళ్లింటికి వస్తే ఎవ్రు మాట్లాడాలా...రమ్మను నీ ఫ్రెండ్సుని...’‘మనిషన్నాక కొంచెమైనా ఉండాలా...వీధిలో అందరూ మీ వాణ్ని పోలీసోళ్లు కొట్టిండారంటా అని అంటుంటే...నేనేం చెప్పాల్రా..’ ఒక్కమాటకూ బదులిచ్చే శక్తి నాకులేదు. నాన్న అన్నమాటల్లో ఏదీ అబద్ధం కాదు. నిజమే మరి. స్కూలు టీచరుగా కష్టపడి తెచ్చుకున్న పేరు ఇట్టా దెబ్బతింటుంటే కోపం రాకుండా ఎట్టా ఉంటుంది? నాకు తెల్సి నాన్న అంత సీరియస్‌అయిండేదెప్పుడూ లేదు.
‘రేయ్‌ బ్యాగులో బట్టలు పెట్టుకో...’ నాన్న ఆర్డరేయగానే..ఎందుకో నాకర్థం కాలేదు. నా నోట్లోంచి మళ్లీ మాట వచ్చేలోగా ‘ఈడనే ఉంటే ఏదో ఒకటి నెత్తిపైకి తెస్తావు. ఆ పోలీసోళ్లు నిన్ను వెదుక్కొంటూ ఇంటికాడికొస్తే మాకు లేనిపోని తిప్పలు. అదంతా పడలేం గానీ బళ్లారికి వెళ్లు.’ అంటుంటే ఇప్పటికిప్పుడు బళ్లారి అంటే ఎట్టా పోయేదనిపించింది. కానీ విషయం అంతా ఉల్టాపుల్టా అయ్యిండాది. ఇప్పుడేందైనా ఈయప్పతో ఎదురుపెట్టుకుంటే ఎత్తుకెళ్లి ఎంకణ్ణబావిలో ఏసినా ఏసేసాడు ఎందుకొచ్చిన గొడవ అనుకుని మెల్లగా బ్యాగులో బట్టలు సర్దుకునిండాను. నా విషయంలో ఎప్పటికప్పుడు సపోర్టు చేసే అమ్మకూడా ఈసారి నోరువిప్పితే ఒట్టు. ఏం మాట్లాడకుండా భోంచేసి రెడీ అయ్యిండాను. ‘ఇదిగో సరిగ్గా 8 గంటలకి బస్సుండాది. బస్టాండుకెళదాం పదా’ దగ్గరుండి నన్ను తీసుకెళ్లి బస్సులో కూలేశాడు. ఇందుకూ కారణం ఉంది. కొంచెం టైమిస్తే మళ్లీ నేను ఫ్రెండ్స్‌తో తలహరట కొట్టేందుకెళతానో అని ఆయన అనుమానం.
పోలీసులు కొట్టిన దెబ్బలకి కాదుగానీ...మళ్లీ ఏం కొంపపైకి తెస్తాడో అన్న గాబరాతోనే నాన్న నన్ను బళ్లారికి పంపేకి ప్లాను వేసిండాడు. ఆయనకి నాపై ఎంత అనుమానం అంటే బస్సు కదిలేదాకా ఆడనే నిల్చుని శ్రీనివాస భవన్‌ మలుపు తిరిగినాంక సైకిలెక్కినాడు. ఊర్లో ఏది తలపైకి తెచ్చుకున్నా ...వెంటనే బళ్లారి బస్సు ఎక్కించాలన్న గొప్ప రహస్యం నాన్నకు బోధపడిందీ అప్పుడే! బస్సు కదిలిన వెంటనే నాకు కండ్లు మూతపడిపోయిండాయి. బళ్లారిలో ఇంటికెళ్లగానే తాత అక్క ఎవరూ ఎందుకొచ్చినావని గానీ...ఏం తలపైకి తెచ్చుకునిండావని గానీ అడగనే లేదు. మా ఘనకార్యం ఆల్రెడీ నాన్న ఫోన్లో తాతకు చేరవేసిండాడని అర్థమైంది.
మరుసటి రోజు లేచాక చేతులు నొప్పి మామూలుగా కాదులే! అద్దంలో చూసుకుంటే భుజాలు ఎర్రగా వాతలు తేలి వాసిపోయిండాయి. అయినా పోలీసోళ్లు భలే న్యాక్‌గా కొట్టిండారే అనుకున్నా. లాఠీ ఇసిరితే గురి తప్పకుండా బలే పడిండాదే దెబ్బ అనిపించింది.
రెండు లాఠీ దెబ్బలు...బస్సులో బళ్లారి ప్రయాణం ...ఒకే రోజున జరిగిన ఈ సంఘటన నాకో చేదు అనుభవాన్ని...నాన్నకో తీవ్ర ఆగ్రహాన్ని...ఫ్రెండ్స్‌కందరికీ అనుకోడానికి, మనసారా నవ్వుకోడానికి ఓ అవకాశాన్ని ఏకకాలంలో ఇచ్చింది!!!

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు