పెద్దోళ్ళున్నారే… ! - పి బి రాజు

peddollunnaare

"ఈ పెద్దోళ్ళున్నారే ...మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు?"

"అరె! మేమూ పెద్దోళ్ళయ్యాం. మేజర్ల్లయ్యామని ఎప్పుడు తెలుసుకుంటారు. మా డిసెషన్ మేము తీసుకోలేమా? మా జీవితాల్ని మేము దిద్దుకోలేమా?"

"మేమిద్దరమూ ప్రేమించుకున్నాం. పెళ్ళిచేసుకుంటామంటే నమ్మరు. ఎన్నో అనుమానాలు. చివరికి ఒప్పుకోరు. సెంటిమెంట్ తో ఏడిపిస్తారు. మేము ఏమీ చిన్న పిల్లలం కాదు. మేజర్లం. మా జీవితాల్ని నిర్ణయించుకోవడానికి మాకు హక్కు లేదా? మేమిద్దరమూ ఒకర్నొకరు విడిచిలేనంతగా ప్రేమించుకున్నాం. ఆయన లేకుంటే నేను బ్రతకలేను. సారీ! మమ్మీ..మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని కాదన్నందుకు.."

"మేము కాదనడం లేదమ్మా? నీ వయసు పద్దెనిమిదే! పాలకు నీళ్ళకు తేడా తెలియని పాల వయస్సు. పెళ్ళికిది సమయం కాదు. వయసూ కాదు. మీ పెళ్ళి మేము దగ్గరుండి ఘనంగా చేయిస్తాం. మాకు కాస్త టైమివ్వండి."

"నో...మీపైన నాకు నమ్మకం లేదు. నా మనసు మార్చడానికి ట్రై చేస్తారు. మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తారు. …..ఎన్ని సినిమాలు చూడ్డం లేదు."

"లేదమ్మా! కావాలంటే రాసిస్తాము. తప్పకుండా మీ పెళ్ళి మా చేతుల మీదుగా చేయిస్తాం. మమ్మల్ని నమ్మమ్మా!"

"నో డాడీ! క్షమించండి. నేనిప్పుడు మేజర్ని. మీ కిష్టమున్నా; లేకున్నా మా పెళ్ళి ఈ రోజే; ఇప్పుడే జరిగితీరుతుంది."

"నీకిప్పుడు తెలియదే మా బాధేంటో? నీకూ ఓ కూతురు పుట్టి, అదీ ఇలా అంటే అప్పుడు తెలుస్తుందే మా బాధంటే ఏంటో?"

"అమ్మా! శాపనార్ధాలు వద్దు. ప్లీజ్. నేను డెసిషన్ తీసేసుకున్నా. నా నిర్ణయం మారదు."

"అంటే ...పద్దెనిమిదేళ్ళు పెంచి పెద్ద చేసిన మాకన్నా రెండేళ్ళ పరిచయమున్న ఆ అబ్బాయే ఎక్కువైపోయాడా?"

"అవును. అతనే ఎక్కువ. అతనే నా జీవితం. అతను లేకుంటే నేను లేను."

"ఈ వయసులో నీకర్థం కాదే"

"అమ్మా! నేను మేజర్ని. నా జీవితం నా ఇష్టం. మీ కిష్టమయితే దీవించండి. లేకుంటే..."

"లేకుంటే ....ఏంటే? అంత పెద్దదానివయిపోయావా?"

"మీతో మాకనవసరం. యస్.ఐ గారూ! మాకు ప్రొటెక్షన్ కావాలి. నా ఇష్ట ప్రకారమే ఈ పెళ్ళి జరుగుతోంది. మేమిద్దరమూ ప్రేమించుకున్నాం. పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాం."

మాట్లాడానికింకేం లేనట్లు యస్.ఐ తో అంది మయూరి స్థిరంగా.

మ్రాన్ పడి నిల్చుండిపోయారు ఆమె తల్లితండ్రులు. రెండు గంటలుగా...పోలీస్ స్టేషన్లో మీడియా సమక్షంలో కౌన్సిలింగ్ పేరిట జరుగుతున్న తతంగమిది. అక్కడ పోలీసులతో పాటు మీడియా, జనంతో క్రిక్కిరిసిపోయింది.

ఆ అమ్మాయి ఒక సెలిబ్రిటి. పేరు మయూరి. వయసు పద్దెనిమిదేళ్ళ ముప్పై రోజులు.

అదే వీధిలో డిగ్రీ ఐదేళ్ళుగా చదువుతున్న సంజయ్ ని ప్రేమించింది. వాళ్ళిద్దరూ గత రెండేళ్ళుగా గాఢంగా ప్రేమించుకుంటున్నట్లు మీడియాతో చెప్పింది. ఇప్పుడు మేజరయింది కాబట్టి పెళ్ళి నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో ఒప్పుకోరు కనుక స్వయం నిర్ణయం తీసుకున్నారు. తల్లితండ్రులకు తెలిసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే; ఈ కౌన్సిలింగ్ జరుగుతోంది. పోలీసులకు ఇదో తలనొప్పిగా తయారయింది. వయసు చిన్నదే అయినా మయూరి చాలా తెలివిగా మాట్లాడుతోంది. అభిమానులు విపరీతంగా ఉన్న ఒక సెలిబ్రిటి కనుక జనంలో అంత క్రేజ్.

"ఇద్దరికీ ఉద్యోగాలు లేవు. ఎదిరించి ఎలా బ్రతుకుదామనుకుంటున్నారు?" ఓ మీడియా మిత్రుడు అడిగాడు.

"నేనో డాన్సర్ని. సంపాదిస్తున్నాను. ఐదేళ్ళుగా పర్ఫార్మెన్సన్స్ ఇస్తున్నాను. ఆయన కూడా ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడు..."

"అదేనండీ మా బాధ! ఇప్పుడిప్పుడే కెరీర్ ప్రారంభమయింది. ఇంకా ఎదగాల్సింది ఎంతో ఉంది. మేమెన్నో కలలు కన్నాం. ఇప్పుడు పెళ్ళి చేసుకుంటే కెరీర్ దెబ్బ తింటుందనే మా బాధ. మా కలలన్నీ ఒక్క రోజులో ఇలా ...." తల్లి ఆవేదనతో కళ్ళు తుడుచుకుంది.

"నేను ఎదిగి చూపిస్తాను" తల్లిని కసురుకుంది మయూరి.

"రోజు రోజుకూ నిరుద్యోగం పెరిగిపోయి; ఉద్యోగాలు రాక నిరుద్యోగులు అవస్థపడుతున్నారు. ఆయనకి కనీసం డిగ్రీ కంప్లీట్ కాలేదు. మీరు ఇంటర్ రాస్తున్నారు. పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నవారికే ఉద్యోగాలు లేవు. ఏ ధైర్యంతో మీరీ నిర్ణయం తీసుకున్నారు?" మరో మీడియా మిత్రుడి ప్రశ్న.

"చూడండీ! వీలయితే ప్రేమికుల్ని ఆశీర్వదించండి. ఇలా పిరికి మందు పోయకండి. మా ఇద్దరికీ ధైర్యముంది. హాయిగా బ్రతుకుతామన్న నమ్మకముంది. మా అమానాన్నల లాగా మా గొంతు నొక్కకండి." అసహనంగా అంది మయూరి.

అవాక్కయారు మీడియా మిత్రులు. ఆ తర్వాత వాళ్ళ గొంతు పెగలలేదు.

"చూడమ్మా!" యస్.ఐ నోరు మెదిపాడు.

"సార్!"

"మీ వయసు చిన్నది. ఇలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే వయసు కాదు. మరోసారి ఆలోచించండి. మీ తల్లితండ్రులు కాదనడం లేదు. వారికి కొంత టైమిస్తే వారే ముందుండి పెళ్ళి జరిపిస్తామంటున్నారు. కొంచెం టైమిద్దాం."

"పదే పదే నా వయస్సును ప్రశ్నిస్తున్నారు. నా బర్త్ డే సర్టిఫికేట్ ఇచ్చాను. చట్టం ప్రకారం నేను మేజర్ని. నా నిర్ణయాలు నేను తీసుకోగల్ను."

"తొందరపాటు వద్దని మా సూచన"

"సూచనా లేక ఆర్డరా? మీరు కూడా వారితో కుమ్మక్కై ..."

"నో...నో. సూచన మాత్రమే."

"మీ సూచనకు కృతఙ్ఞతలు. అవతల ముహూర్తం టైం దాటి పోతోంది. మీరు చేస్తారా? లేక మా దారి చూసుకోమంటారా?..." చేసేదేం లేకపోయింది పోలీసులకు.

అక్కడున్న పెద్దలంతా "అయ్యో! చిన్న పిల్ల తొందరపాటు నిర్ణయం తీసుకుందే!" అని బాధ పడ్డారు. కానీ మయూరి స్థిరమయిన అభిప్రాయం విన్నాక ఏమీ చేయలేకపోయారు. చేసేదేమీ లేక ఆమె తల్లిదండ్రులూ వెళ్ళిపోయారు.జరగవలసిన తతంగమంతా పోలీస్ స్టేషన్ లోనే మీడియా ముందే జరిగిపోయింది. లైవ్ టెలికాస్ట్ చూసిన ఆమె అభిమానులు ఉలిక్కిపడి కళ్ళింతలు చేసుకుని టీ వీ లకు అతుక్కుపోయారు. ఎందుకో అందరి గుండెలు బరువెక్కాయి.

“మాయమాటలతో మా పిల్లను బుట్టలో వేసుకున్నాడు. అమాయకంగా వాడి మాయలో పడిపోయింది మా పిల్ల. దాని కేరీర్ నాశనం చేసుకుంది." అమ్మాయి తల్లిదండ్రుల వేదన.

"వగలాడి ఏ మందు పెట్టిందో మా పిల్లాడు మాకు కాకుండా పోయాడు. వెర్రిబాగులోడు ఎలా వేగుతాడో ఏమో..."వాపోయారు పిల్లాడి అమ్మానాన్నలు. ఎవరి పిల్లలు వారి అమ్మనాన్నలకు అమాయకులుగానే కనిపిస్తారు. కానీ వారికి తెలియని విషయమేమిటంటే; వారింకా చిన పిల్లలు కారు. అమాయకులేం కాదు.వారెప్పుడో మేజర్లయిపోయారు.

ఆ రాత్రి ప్రేమ జంట మిత్ర బృందానికి పార్టీ ఇస్తూ కోలాహలంగా వున్నారు.

ఆమె తల్లిదండ్రులు మాత్రం లైట్ కూడా వేసుకోకుండా చీకటి గదిలో తాము మయూరి చుట్టూ అల్లుకున్న గతాన్ని మరేసుకుంటున్నారు. పెళ్ళయి మూడేళ్ళకు లేకలేక పుట్టింది మయూరి.

"అరె! అది చూడు. కాళ్ళు; చేతులు ఎంత లయబద్ధంగా ఆడిస్తుందో! నా మనవరాలికి డ్యాన్స్ నేర్పించాలి. నాట్య మయూరి కావాలి. అందుకే మయూరి అని నామకరణం చేస్తున్నాను." మురిసిపోయింది నాన్నమ్మ.

అంతే కాదు బుల్లి బుల్లి నడకలలో నాట్య భంగిమలు వూహించుకొనేది. ఎన్నో కలలు కనేది. టీ వీ లలో పిల్లల డ్యాన్స్ లు చూసినప్పుడల్లా మనవరాలిని వూహించుకునేది. వాటిని మయూరి కూడా ఆసక్తిగా చూసేది. వాళ్ళను అనుకరించేది. అది చూసి నాన్నమ్మ పొంగిపోయేది. చేతులు తట్టి ఎంకరేజ్ చేసేది. ఆమె ఆనందం చూసి మయూరి మరింతగా రెచ్చిపోయేది.

అలా నాన్నమ్మ పెంపకంలో మయూరి మనసు డ్యాన్స్ వైపు ఆకర్షింపబడింది. వయస్సు పెరిగే కొద్దీ ఆ లేత వయసులోనే ఒక డ్యాసర్నవ్వాలన్న కోరిక బలంగా నాటుకుపోయింది. వాళ్ళ ముచ్చట చూసి తండ్రికి కూడా కూతురికి డ్యాన్స్ నేర్పించాలనిపించింది.

వెంటనే డ్యాన్స్ క్లాసులో చేర్పించేశాడు. పాప కూడా ఉత్సాహంగా క్లాసులకు పోవడం; శ్రద్దగా నేర్చుకోవడం చూసి మురిసిపోయారు దంపతులు. డ్యాన్స్ మాస్టర్ కూడా పాప శ్రద్దను చూసి "మంచి భవిష్యత్ ఉంద"ని పాపను తెగ మెచ్చుకునేవాడు.

కానీ కొంత కాలానికి తెలిసి వచ్చింది అది తనకు తలకు మించిన భారమని. కూతురి ఆనందం ముందు చిన్న చిన్న త్యాగాలు పెద్దగా కనిపించలేదు. రాను రాను చిన్న చిన్న త్యాగాలు మరింత పెద్ద త్యాగాలుగా ఎదిగాయి. తను చేస్తున్న ప్రైవేట్ ఫ్యాక్టరీ ఉద్యోగం ఎదుగుబొదుగు లేని జీతం.... మరింత ఒత్తిడి పెంచింది. తమ అవసరాలు చాలా వరకు తగ్గించుకుని పాపతోడిదే జీవితమని ఆమె అవసరాలు తీర్చేవారు. మరో సంతానం జోలికి పోలేదు. ఎవరెన్ని చెప్పినా కూతురైనా; కొడుకైనా పాపే అనుకున్నారు. కూతుర్లోనే కొడుకుని చూసుకున్నారు.

వాళ్ళ స్కూల్లోనే మొదటి ప్రదర్శన ఇచ్చింది. చూసిన వారంతా తెగ మెచ్చుకున్నారు. ఆమె టీచర్సయితే ఏకంగా ఆకాశానికెత్తేశారు. మయూరి వల్ల తమ స్కూలుకు మంచి పేరొస్తుందని సంబరపడ్డారు. పువ్వు పుట్టగనే పరిమళిస్తున్నట్లు చిన్న వయస్సులోనే నాట్యకళ అబ్బినట్లు; ఆమె భవిష్యత్ ఉజ్జ్వలంగా ఉంటుందని ఆశీర్వదించారు. అప్పుడు దంపతులిద్దరూ ధృఢంగా నిర్ణయించుకున్నారు - పాపను ఇందులో నిష్ణాతురాల్ని చేయాలని. ఎట్టి పరి స్థితుల్లోనూ వెనుకడుగు వేయకూడదని. తమ పాపను మంచి డ్యాన్సర్ గా చూడాలని కలలు కన్నారు. మంచి గురువును ఏర్పాటు చేశారు. తల్లి కూడా బట్టల షాప్ లో పనికి కుదిరింది. బట్టలు కుట్టడం నేర్చుకుంది. తన గారాల పట్టి ఆశయం కోసం శ్రమపడింది. చన్నీళ్ళకు వేన్నీళ్ళుగా భర్తకి తోడుగా నిలబడింది. క్రమంగా మయూరి ప్రదర్శనలు స్కూలు దాటి, వూరు దాటి జిల్లా స్థాయికి పెరిగాయి.ఎవరి నోట విన్నా ప్రశంసలే. ఒక టీ .వీ. ఛానెల్ వారు ఇంటర్వ్యూ చేసి టెలికాస్ట్ చేశారు. రాష్ట్రమంతా గొప్ప పేరొచ్చింది. పత్రికలు పతాక శీర్షికల్లో అభినందించాయి.

అమ్మ టీ వీ వాళ్ళతో బతిమిలాడి రెండు మూడు ప్రోగ్రాంస్ ఏర్పాటు చేయించింది.

తల్లిదండ్రుల పూజాఫలమో; తన అదృష్టమో మయూరి గ్రాఫ్ స్టడీగా ఊర్ధ్వముఖం పట్టింది. ఆమె ప్రతిభను గుర్తించి ఒకట్రెండు సినిమా నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఇక టీ వీ లలో వివిధ ప్రోగ్రాములు. రాష్ట్రమంతా లెక్కలేని ప్రదర్శనలు. కానీ ఇవి చూడడానికి నాన్నమ్మ లేకపోయింది. ఆమె చనిపోయి అప్పుడే ఏడాది దాటింది.

మయూరి - నిండా పదిహేనేళ్ళయినా లేని ఒక మారు మూల గ్రామీణ పిల్ల ఇప్పుడు సెలబ్రిటి. రాష్ట్రమంతా ఉర్రూతలూగించే ఒక నవ కెరటం. టీ.వి. రియాల్టీ షోలకు లెక్కే లేదు. రెండు మూడు యాడ్ షోలూ చేసింది.

ఎక్కడపోయినా ఆమె అభిమానులు. తగినట్లుగానే మయూరిలో వయసుకు మించిన పరిణతి కనిపించేది. ఎక్ట్రా ఆర్డినరీ పెర్ఫామెన్స్ ఇచ్చేది. మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తాపత్రయ పడేది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండేది. వినయం, వినమ్రత పెద్దలపైన గౌరవం ప్రదర్శించేది. అలాంటి పిల్ల...ఇపుడు వున్నట్టుండి... ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇలా మారిపోతుందని ఎవరూ వూహించలేదు.

తల్లి వెంటనే తిరిగేది. తల్లి తోడిదే లోకమనేది. తల్లి మాట వేద వాక్కే. అలాంటి కూతుర్ని కన్నందుకు ఆ తల్లి హృదయం పొంగి పోయేది. ప్రతి క్షణం కంటికి రెప్పలా వెన్నంటి వుండేది.

నిన్నటి దాకా తన వేలు విడువని పసిపాప ఇపుడు గుండెలపై తన్ని మరొకరి వేలు పట్టుకుంది. ఆ తల్లిదండ్రులు ఆ రాత్రంతా గుండెలవిసేలా ఏడ్చారు. ఆ తండ్రి గుండె ఎప్పుడో పగిలిపోయింది. మాట మూగబోయింది. కళ్ళలో నీరెండిపోయింది. కూతురి నిర్వాకాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఉదయం పదైనా తలుపులు తెరుచుకోకపోతే చుట్టుప్రక్కలవారు కిటికీ గుండా తొంగి చూసి బావురుమన్నారు. విగతజీవులై పడివున్న మయూరి తల్లిదండ్రులను చూసి. మయూరి లేని లోకంలో తమకు పనిలేదని తమ దారి చూసుకున్న వారిని చూసి ద్రవించని హృదయం లేదు. ఆమె తోడిదే లోకం, ఆమె తోడిదే బ్రతుకు అని ఎన్నో కలలు కన్న వారి కళ్ళు శాశ్వతంగా మూసుకుపోయాయి - ఇక కలలు కనే అవసరం లేనట్టు.

సరిగ్గా ఇరవై ఏళ్ళ తరవాత - పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఇద్దరు యువజంట నిల్చున్నారు.ఇన్స్ పెక్టర్ ఫోన్లో మాట్లాడుతున్నాడు.

"మేడం! మీ అమ్మాయి దొరికింది. ఇక్కడే ఉంది. త్వరగా రండి." ఫోన్ పెట్టేసి ఇన్స్ పెక్టర్ ఆ యువకుడి వైపు తిరిగి "ఏ రా! నీకెంత ధైర్యం ... ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి" చెంప చెళ్ళుమనిపించాడు.

"లేదు సార్!..." చెంప తడుముకుంటూ వణకిపోయాడు యువకుడు.

"నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు ఇన్స్ పెక్టర్ . నేనే నా ఇష్టంగానే...." అంటోంది యువతి.

ఇంతలో తుఫానులా దూసుకొచ్చింది మయూరి అక్కడికి. వస్తూనే 'ఎవడు వాడు నా కూతుర్ని కిడ్నాప్ చేసినవాడు. ఎంత ధైర్యం రా నీకు?" కాలర్ పట్టుకొని ఎడాపెడా వాయించేసింది.

"అమ్మా! అమ్మా! ఆపు." చేయి పట్టి ఆపింది కూతురు.

"ఏమిటే...?"

"నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. నా ఇష్టంగానే వచ్చేశాను."

"ఏం తక్కువ చేశానే. ఇంత పరువు తక్కువ పని చేశావు. అల్లారు ముద్దుగా పెంచానే. కంటికి రెప్పలా పెంచుకున్నానే. అడిగింది అడిగినట్లు ఇచ్చానే. మీ నాన్న మనల్ని ముంచేసి నడిరోడ్లో వదిలేసి తన దారి తను చూసుకుంటే...తండ్రిలేని లోటు రాకూడదని ప్రేమతో పెంచానే! అయ్యో! అయిపోయింది. అంతా అయిపోయింది." కుప్పకూలిపోయింది మయూరి.

అంతలోనే తేరుకుని, "సరే! అయిందేదో అయింది. పద పోదాం." అంది చేయి పట్టుకుని.

"ఎక్కడికి?" చేయి విదిల్చికొట్టింది.

"ఎక్కడికేమిటే...ఇంటికి... మన ఇంటికి.."

"నో! మమ్మీ! మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకుంటాం."

"కిడ్నాప్ చేసినోడితో పెళ్ళేమిటే?"

"కిడ్నాప్ లేదు. గిడ్నాప్ లేదు. నేను ఇష్టపడే వచ్చాను. నీ కంప్లైట్ వాపసు తీసుకో!"

"అదికాదమ్మా! నా మాట వినవే!"

"అమ్మా! నువ్వే నా మాట విను."

"ప్రేమ...పెళ్ళి వయసు కాదే నీది"

"నేను మేజర్ని. వయసు కాదంటావేమిటి? నాకు అన్నీ తెలుసు."

"అది కాదే..."

"ఈ పెద్దోళ్ళున్నారే...మమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు?" మొండిగా వాదిస్తున్న కూతురి వైపు నిస్సహాయంగా చూసింది మయూరి.

"అరె! మేము మేజర్లం. మా బతుకులు మేము బ్రతకటానికి కూడా మాకు స్వేచ్చ లేదా?..." మాటలు తూటాల్లా వస్తున్నాయి ఆమె నోటి వెంట. మాటలు రాక మ్రాన్ పడి నిలబడిపోయింది మయూరి. ఇరవై ఏండ్ల క్రితం సంఘటన కళ్ళముందు గిర్రున తిరిగింది. ఆనాడు ఇంతే మొండిగా తను - ఇప్పటి తన స్థానంలో తన తల్లిదండ్రులు.

"మా బాధ ఇప్పుడు నీకర్థం కాదే! నీకూ ఒక కూతురు పుట్టి ..." - ఆనాటి అమ్మ మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటున్నాయి. “ నా బాధలు నా కూతురు పడకూడదనుకున్నాను. ఎంతో జాగ్రత్తగా పెంచాననుకున్నాను. కానీ వయసు మాట వినదు. వేడి రక్తం ఎవరి మాటా విననివ్వదు.ఆనాడు తను వాళ్ళ మాటలు విని వుంటే తన బ్రతుకు ఇలా ఉండేది కాదు.” గొణిగింది మయూరి మనసు.

"చూస్తారేం ఇన్స్ పెక్టర్ గారూ! మేము మేజర్లం. ప్రేమించుకున్నాం. పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం. మాకు మా అమ్మనుంచి ప్రొటెక్షన్ కావాలి" ధృఢంగా అంటోంది కూతురు.

ఒక్కసారిగా గుండె బద్దలయి నేల మీద ఒరిగిపోయింది మయూరి - అచేతనంగా.

కాలచక్రంలో చిన్నోళ్ళు పెద్దోల్లవుతుంటారు. అనుభవం గడిస్తుంటారు. ఆ అనుభవాల్ని పిల్లలకి చెప్తుంటారు. కానీ వేడి వయసులో అవి వినిపించవు. కనిపించవు. బుర్రలోకి ఎక్కవు. వయసు పెరిగేకొద్దీ అనుభవంలోకి వస్తుంది. అనుభవాలు వారి పిల్లలకి చెబ్తుంటారు. ఇది బండి చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. జరుగుతూనే ఉంటుంది. ఇది ఇలా ...జరుగుతూనే ఉంటుంది.*

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు