టక్..టక్..
తలుపు తట్టిన శబ్దానికి పార్వతమ్మకు మెలకువ వచ్చింది.
"ఏవండీ.."
"ఊఁ"
"ఏవండీ.."
"చెప్పు పార్వతీ..ఏంటి?" నిద్ర నుంచి బయటకొస్తూ అన్నారు శివనాథంగారు.
"ఎవరో తలుపు కొట్టిన చప్పుడయిందండీ"
కళ్లజోడు పెట్టుకుని గోడగడియారం సమయం తెల్లవారు ఝామున మూడున్నర గంటలు చూపిస్తుండడం చూసి "ఈ సమయంలోనా?" అంటూ వెళ్లి తలుపు పక్కన ఉన్న కిటికీ రెక్క తీసి "ఎవరూ" అన్నారు.
"నేను నాన్నా వీరేంద్రను"
"నువ్వా? అదేంట్రా వస్తున్నట్టు చెప్పనయినా లేదు" అంటూ గబ గబ తలుపుతీసి, కోడల్ని, మనవడు, మనవరాలిని చూసి ఆశ్చర్యపోతూ
"పార్వతీ, ఇవాళ మనింటికి పండగ వచ్చిందే, అబ్బాయి, అమ్మాయి, పిల్లలూ వచ్చారు" అన్నారు ఆనందాన్ని మాటల్లో మూటగడుతూ..
కిటికీ లోంచి ‘నేను వీరేంద్రను’ అన్న మాట విన్నప్పుడే మంచం మీంచి లేస్తున్న పార్వతమ్మ, భర్త అన్న ‘అందరూ వచ్చారన్న’ మాట విని వడి వడిగా తలుపుదగ్గరకు వచ్చి"రండి..రండి" అని " తెల్లవారు ఝామున వచ్చారు
తెల్లారే దాకా పడుకోండి" అని లోపలికి దారితీసింది సంతోషంగా.
"మేము నానమ్మ మంచం మీద పడుకుంటాం" అని పిల్లలు వెళ్లి మంచం మీద పడుకున్నారు.
"వచ్చింది ఫ్లైట్ లోనే కదా..మేము బాగానే విశ్రాంతి తీసుకున్నాం అమ్మా.."అన్నాడు.
"పండగలకు, పబ్బాలకు, శుభకార్యాలకు ఎన్ని సార్లు ఫోన్లో రమ్మన్నా, పని ఒత్తిడితో రాలేననే నువ్వు, అమ్మాయినీ పిల్లల్ని తీసుకుని అనుకోకుండా.. హటాత్తుగా భలే వచ్చావురా.. మాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను" సంబరపడిపోతున్నారు ముసలి దంపతులు.
*****
రోజులు గిర గిర తిరుగుతున్నాయి.
వాళ్ల రాకతో ఇల్లు కళ కళ లాడిపోతోంది. పండగేం లేకపోయినా..దాదాపు అలాగే ఉంది.
తండ్రిని మోటరు బైక్ మీద ఎక్కించుకుని ఊరంతా తిప్పాడు. అమ్మా, నాన్నల్ని డాక్టర్ కు చూపించి, టెస్ట్ లు చేయించి, మందులు రాయించాడు.
కోడలు ఉమ అత్తగారిని కాలు కింద పెట్టనీయడం లేదు. వంటింటి పనంతా పనివాళ్లతో సమానంగా గిర గిర తిరుగుతూ చేసేస్తోంది.
ముసలి వాళ్లు మనవడు మనవరాలికి కథలు చెబుతూ, పొడుపు కథలు విప్పమని సవాలు చేస్తూ, శతకాలు వల్లెవేయిస్తూ హాయిగా గడిపేస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న ప్రాణం మళ్లీ వచ్చినంత ఆనందంగా ఉన్నారు. లోపల మాత్రం ఎప్పుడో ఒకప్పుడు ‘ఇహ మేము వెళ్లొస్తాం’ అన్న మాట వాళ్ల నుంచి వినాల్సివస్తుందన్న బెరుకు మనసును దొలిచేస్తోంది.రోజులు, వారాలు, నెలలుగా తిరుగుతున్నాయి.
వీరేంద్ర మాత్రం అప్పుడప్పుడూ ఫ్రెండ్స్ ను కలవడానికని పట్నం వెళ్లి వస్తున్నాడు.
*****
ఒకరోజు.
"నేనొచ్చి ఇంతకాలమైనా కదలడం లేదేమిటా? అని ఆశ్చర్యపోతున్నారు కదూ..చెబుతాను. నాకు ఊహ వచ్చినప్పుడోసారి నాన్న, నన్ను ఆ పెద్ద పెట్టె దగ్గరకి తీసుకెళ్లి, నేను చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు, వేసుకున్న బట్టలు, పిచ్చిగీతలు గీసిన పుస్తకాలు, వాడిన పెన్సిల్లు, పెన్నులు, అప్పటి చిన్ని సైజు చెప్పులూ, స్కూల్లో అందుకున్న బహుమతులు, టీచర్లు గుడ్ రాసిన నోట్ బుక్స్, స్టూడియోలో తీయించిన ఫోటోలు చూపించి "నువ్వు మాకు ఎంతో అపురూపం రా..నీకు సంబంధించిన ప్రతీది ఇందులో భద్రపరిచాం. నీ పుట్టుక దగ్గర్నుంచి ఎదగడం దాకా మాకెన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. ఎప్పుడన్నా వాటిని తీసి చూస్తుంటే మాకెంత సంతోషంగా ఉంటూందో’ అన్నావు అలౌకిక ఆనందంలో తేలిపోతూ.
అమ్మ ఒకసారి ఫోన్లో మట్లాడుతూ’ వీరూ, నువ్విక్కడ లేకపోవడం ఈ వయసులో మాకు పెద్ద లోటురా, ఇల్లంతటికీ మేమిద్దరమే! పెట్టెలోని నీకు సంబంధించిన వస్తువులను చూస్తూ కొంతలో కొంత తృప్తి పడుతున్నాంరా..కానీ నువ్వు మా ఎదురుగా ఉంటేనే మాకు సంతోషం" అంది. వింటున్న నా కళ్లు చెమర్చాయి.
పాతికేళ్లు న్యూజెర్సీలో ఉద్యోగ జీవితం గడిపాక..డబ్బు వెనక పరుగు ఇక ఆపెయ్యాలనిపించింది. మీ దగ్గరుంటే ఆ అనుభూతి వేరు. అది కోల్పోకూడదనిపించింది. జీవితంలో డబ్బు ఒక భాగం. కానీ డబ్బే జీవితం కాదు. మానవుడి జీవితం పెళ్లి, పిల్లలతో మొదలై మనవలతో గడిపేటప్పుడు ముగుస్తుంది. అదీ పరిపూర్ణ జీవితం అంటే. ఒక కొడుగ్గా అది మీకివ్వడం నా ధర్మం. నన్నింతవాడిని చేసిన మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేనుండగా వృద్ధాప్యం మీకు శాపం కాకూడదు. బతకడానికి కావలసింది సంపాదించాను. సుఖాలకు లొంగిపోతే బంధాలు మృగ్యమవుతాయి. నా పిల్లలు విదేశాల్లో ఉన్నారని చెప్పుకోవడం, నడి వయసులో సరైనదేమో కానీ వృద్ధాప్యంలో మాత్రం ‘పిల్లలు నా దగ్గరే ఉన్నారని’ గర్వంగా చెప్పుకోగలగాలి. సంపాదించిన డబ్బును సిటీలో ఇన్వెష్ట్ చేశాను. మీకు ఏ మెడికల్ రిక్వయిర్మెంట్ వచ్చినా, మరే అవసరం వచ్చినా జాగ్రత్తగా చూసుకోవడానికి కావలసిన డబ్బు ఉంది. ఇప్పుడు నే చెప్పినవన్నీ ఉమ తల్లిదండ్రుల విషయంలోనూ వర్తిస్తాయి. వాళ్లనీ ఉమా, నేను జాగ్రత్తగా చూసుకోవాలి. మనవళ్లతో వాళ్లూ ఆడుకోవాలి. తమ అనుభవాలను పిల్లలతో పంచుకోవాలి. నా పిల్లలు పరదేశంలో, అక్కడి సంస్కృతిలో పెరగాలని మేము కోరుకోవడంలేదు. ఇక్కడి మట్టితో, మనుషులతో, ముఖ్యంగా మీతో బంధం ఏర్పడాలి. ‘దేశమంటే మట్టి కాదు మనుషులోయ్’ అన్నాడో కవి దాని కొనసాగింపుగా ‘వాళ్లతో బంధాలోయ్’ అని ఉంటే బావుంటుంది. పిల్లలు రేపు పెరిగి పెద్దై, రెక్కలొచ్చి ఎగిరెళ్లిపోయినా మళ్లీ మాతృదేశం చెట్టుమీది గూళ్లకు వచ్చి చేరాలి. మాతోపాటు ఉండాలి. అదీ మా ప్రయత్నం. దానికి ఇప్పుడు విత్తనం నాటాము." అన్నాడు వీరేంద్ర.
కొడుకు చెట్టంతై మీకు నీడనిస్తానంటే ఏ తల్లిదండ్రులకైనా మనసు ఉప్పొంగిపోతుంది. ప్రస్తుతం అదే స్థితిలో ఉన్నారు వాళ్లు. ముందుగా శివనాథంగారు తేరుకుని, లేచెళ్లి కొడుకుని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఆ రెండు గుండేలూ కాసేపు స్పందనలతో సంభాషించుకున్నాయి. ఆ దృశ్యం చూసి పార్వతమ్మ చీర కొంగుతో కళ్లనీళ్లు తుడుచుకుంది.
*****
( పిల్లల మీద మమకారంతో, ప్రేమతో పెంచి పెద్దచేసి రెక్కలు తొడిగి వాళ్లకో అందమైన భవిష్యత్తుకోసం విదేశాలకు పంపితే, అక్కడే వేళ్లూనుకోకుండా వెనక్కి, తల్లిదండ్రుల దగ్గరకు వచ్చే పిల్లలకు ఈ కథ మనస్ఫూర్తిగా అర్పితం-రచయిత)