అనిర్వచనీయం - అప్పరాజు నాగజ్యోతి

anirvachaneeyam

త్యాగరాయ గానసభలో మ్యూజిక్ కాంపిటీషన్స్ కి కూతురు మేఘనని తీసుకుని వెళ్ళారు ఆదిత్య, నీలిమ. సెవెంత్ క్లాస్ చదువుతున్న మేఘన మూడు సంవత్సరాల నుండి కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంటోంది. సన్నటి స్వరంతో ఆమె రాగాలాపన చేస్తుంటే ఎంతో వినసొంపుగా వుంటుంది.

“ ఈ పోటీలకి సిటీలోని అన్ని సంగీత సంస్థల నుండి పిల్లలు వస్తారు, పోటీ జనరంజకంగా వుంటుంది. మేఘన ని కూడా తీసుకుని రండి , స్టేజి మీద పాడడం మెల్లిగా అలవాటై తనకి స్టేజి ఫియర్ పోతుంది “ అని మేఘనకి సంగీతం నేర్పిస్తున్న కృష్ణాచారిగారు మరీ మరీ చెప్పడంతో ఆ సంగీతం పోటీలకి మేఘనని కూడా తీసుకుని వచ్చారు.

కృష్ణాచారిగారు చెప్పినట్లుగానే చాలా మ్యూజిక్ సంస్థల నుండీ పిల్లలు వచ్చారు, ఎంతో చక్కగా లయబద్ధంగా పాడారు. మేఘన కూడా బాగానే పాడింది. కానీ ఆమె స్టేజి ఎక్కడం యిదే మొదటిసారి కావడంతో రెండు మూడు సార్లు పాట మధ్యలో తడబడడం జరిగింది.
అందరిలోకీ చాలా బాగా పాడిన యిద్దరు చిన్నారులకి ఫస్ట్, సెకండ్ ప్రైజ్ లని ప్రకటించారు.

“ పోటికి రావడం మంచిదైంది కదూ ఆదిత్యా. యింత మంది పిల్లల పాటలు వినగలిగాము. బహుమతులని గెలుచుకున్న పిల్లలు చాలా శ్రావ్యంగా పాడారు కదూ. అప్పుడప్పుడూ మనం మేఘనని తీసుకుని యిలాంటి చోట్లకి వస్తుంటే తనకి కూడా స్టేజి మీద పాడడం అలవాటవుతుంది “ అంది నీలిమ.

“ ఔను నీలూ. చక్కటి సంగీతం వింటే మనసుకి ఎంతో హాయిగానూ, రిలాక్సింగ్ గానూ వుంటుంది. యింకాస్త ఎక్కువగా ప్రాక్టీసు చేస్తే మన మేఘన కి కూడా నెక్స్ట్ టైం ప్రైజ్ గ్యారెంటి “ అన్నాడు ఆదిత్య.

“ అసలు ఈ సారే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది డాడీ. నేను పాడుతున్నంతసేపూ ముందు వరసలో కూర్చున్న ఒక బామ్మగారు ఒకటే దగ్గుతుంటే, నేను చాలా డిస్టర్బ్ అయాను డాడీ . దాంతో శృతి తప్పింది “ అంది మేఘన.

“ ఫరవాలేదులేరా. యిదే ఫస్ట్ టైం కదా నువ్వు స్టేజి మీద పాడడం, అందుకే అలా జరిగింది “ అంటూ అనునయంగా చెప్పింది నీలిమ.

***

ఆ రోజు స్కూల్ నుండి యింటికి రాగానే బ్యాగు నుండి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని తీసి తల్లి చేతికిచ్చింది మేఘన. మేఘనకి వాళ్ళ సెక్షన్ లో ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది. మొత్తం నాల్గు సెక్షన్స్ మీద యిరవై ఆరో ర్యాంక్ వచ్చింది.

“ అదేమిటి మేఘా , ఈసారి యింత పెద్ద ర్యాంక్ వచ్చింది. సైన్సు లోనూ, కంప్యూటర్స్ లోనూ తక్కువ మార్కులు వచ్చాయి కదూ , అందుకే ర్యాంక్ బాగా డౌన్ అయింది. ఫైనల్ పరీక్షల లోపు నువ్వు ఆ రెండు సబ్జక్ట్స్ ని బాగా పికప్ చేయాలి “ అంది రిపోర్ట్ కార్డు ని చూసిన నీలిమ.
నీలిమ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తోంది . చదువు విషయంలో మేఘన మీద అనవసరపు ఒత్తిడిని ఎన్నడూ పెట్టదు. కూతురిని పొరపాటున కూడా ఎవ్వరితోనూ పోల్చడంగానీ , తక్కువ చేయడం గానీ చేయదు. అవసరం అనుకున్నప్పుడు “ యిలా చేస్తే బావుంటుంది “ అని సలహా మాత్రం యిస్తుందంతే.

“ అదేం లేదు మమ్మీ . నేను బాగానే వ్రాసాను. సైన్సు టీచర్ , కంప్యూటర్స్ టీచర్ కూడా మా స్కూల్ లో కొత్తగా జాయిన్ అయ్యారు. యిద్దరూ కూడా పరీక్ష పేపర్ల ని చాలా స్ట్రిక్ట్ గా కరెక్ట్ చేసారు. అందుకే తక్కువ మార్కులు వచ్చాయి “

కూతురి మాటలకి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని మరోసారి పరీక్షగా చూసింది నీలిమ. ఆ రిపోర్ట్ కార్డు లో ప్రతీ సబ్జెక్టులోనూ సెక్షన్ ఫస్ట్ మార్క్, నాలుగు సెక్షన్ల పై క్లాస్ ఫస్ట్ మార్క్ , యింకా విడిగా స్టూడెంట్ ర్యాంక్ కూడా యిస్తారు.

“ చూడు మేఘా , నీ సెక్షన్ లోనే సైన్సులోనూ, కంప్యూటర్స్ లోనూ నూటికి నూరు మార్క్ లు వచ్చిన వాళ్ళు ముగ్గురున్నారు. ఆ రెండు సబ్జక్ట్స్ లోనూ నీ సెక్షన్ లో నీ ర్యాంక్ పదికి పైనే వుంది. నువ్వు చెప్పినట్లుగా మీ టీచర్స్ స్ట్రిక్ట్ అనుకుంటే నీ పైన వున్న పదిమందికీ మంచి మార్కులు వచ్చేవి కావుగా. ఒక్క విషయం అర్థం చేసుకో మేఘా. పరీక్షలనేవి మనం చదువులో ఏ స్థాయి లో వున్నామనేది తెలియడం కోసం పెట్టినవి. అంటే పరీక్షలలో వచ్చిన మార్కు లని బట్టి మనం ఏ సబ్జెక్టు లో , ఏ చాప్టర్ లో వీక్ గా వున్నామనేదాన్ని అర్థం చేసుకుని , మరింత బాగా చదివి మనని మనం యింప్రూవ్ చేసుకోవడం కోసమే పరీక్షలున్నది . అంతే కానీ టీచర్ స్ట్రిక్ట్ అనీ, లేదా పేపర్ కష్టంగా వచ్చిందనీ వేరే వేటి మీదకో నెపాన్ని త్రోసేసేటందుకు కాదు “

“ పోమ్మా , నువ్వు మరీనూ, ప్రతీ దానికీ ఎక్కువగా ఆలోచిస్తావు “ అనేసి వెళ్ళిపోయింది మేఘన.

***

ఆ రోజు జిల్లాస్థాయిలో జరుగుతున్న బాడ్మింటన్ టోర్నమెంట్ లో ఆడించేందుకు కూతురిని తీసుకుని వెళ్ళాడు ఆదిత్య. ఒకప్పుడు ఆదిత్య స్టేట్ లెవెల్ బాడ్మింటన్ ఛాంపియన్ . యిప్పటికీ అతని ఆఫీస్ లో జరిగే మ్యాచ్ లో ఎప్పుడూ అతనిదే ఫస్ట్ ప్రైజ్. దగ్గరుండి కూతురికి కోచింగ్ యిస్తున్నాడు .

సాయంత్రం యింటికి వచ్చిన తరువాత నీలిమ కూతురిని అడిగింది “ టోర్నమెంట్లో బాగా ఆడావా మేఘా ? ప్రైజ్ ఎవరికి వచ్చింది?“
“బాడ్మింటన్ డబుల్స్ లో నా పార్టనర్ బాగా ఆడలేదమ్మా , అందుకే సెమీ ఫైనల్స్ లో ఓడిపోయాము “

“ పోనీలే, అప్పుడప్పుడూ యిలాంటివి జరుగుతూనే వుంటాయి . ఎక్కువగా ఫీల్ అవ్వకు. మరి సింగిల్స్ ఏమైంది ? “
“ డాడీ టోర్నమెంట్ కి ఆలస్యంగా తీసుకుని వెళ్ళారమ్మా. దాంతో నాకు టెన్షన్ ఎక్కువై సరిగా ఆడలేకపోయాను . అందుకే అదీ సెమీఫైనల్స్ లో పోయిందమ్మా “

“ పొతే పోయిందిలే మేఘా . ఈసారి యింకా బాగా ప్రాక్టీసు చేసి వెళ్ళు. ప్రస్తుతానికి స్టడీస్ మీద బాగా ఫోకస్ చేయి“ అంటూ కూతురిని ఓదార్చింది నీలిమ

ఆ రాత్రి డిన్నర్ చేసిన తరువాత బాగా అలిసిపోయిందేమో త్వరగా నిద్రపోయింది మేఘన. వంటిల్లు సర్దేసిన తరువాత బెడ్ రూమ్ లోకి వచ్చింది నీలిమ.

“ మన మేఘ బాడ్మింటన్ లో రాకెట్ గ్రిప్ ని కొద్దిగా మార్చుకుంటే సూపర్ గా షైన్ అవుతుంది నీలూ. ఈ వేళ టోర్నమెంట్ డబుల్స్ లో మేఘ తో బాటు ఆడినమ్మాయి చాలా బాగా ఆడింది”

“ మేఘ వేరేగా చెప్పిందే “ అనుకుంటూ మనసులోనే ఆశ్చర్యపోయింది నీలిమ . అంతలోనే గుర్తుకురాగా అడిగింది “ ఆదిత్యా , ఈ వేళ టోర్నమెంట్ కి ఆలస్యం గా వెళ్ళారటగా. మేఘన టెన్షన్ పడిందిట పాపం. “

“ అదేం లేదే. టైం కే వెళ్ళాము. మేం వెళ్లేటప్పటికి బాయ్స్ టోర్నమెంట్ మొదలయింది. మేం వెళ్ళిన పావుగంటకేమో మన మేఘా వాళ్ళ ఆట స్టార్ట్ అయింది “

ఆదిత్య యిచ్చిన సమాధానంతో ‘ తన తప్పు తాను తెలుసుకుని , సరిదిద్దుకునేందుకు బదులుగా ప్రతీదానికీ యిలా వేరే దేని మీదకో నెపాన్ని తోసేయడం కూతురికి అలవాటుగా మారింది ‘ అన్న విషయం నీలిమకి రూఢీగా అర్థమయింది.

***

ఆ రోజు స్కూల్ నుండి వస్తూనే “ అమ్మా మా కంప్యూటర్ టీచర్ చాలా బ్యాడ్. చూడు సి లాంగ్వేజ్ ప్రోగ్రాం లో ఒక్క స్టెప్ వ్రాయడం మరిచిపోతే పూర్తిగా అయిదు మార్కులనీ తీసేసింది “ అంది మేఘన.

“ ఏది చూపించు“ అని మేఘనని అడిగి తీసుకుని ఆ ప్రోగ్రాం ని చూసింది నీలిమ. నీలిమ ఎంసిఎ చదివింది కాబట్టి కంప్యూటర్ లో సి లాంగ్వేజ్ క్షుణ్ణంగా తెలుసు.

“ చూడు మేఘా, నువ్వు మరిచిపోయిన స్టెప్ ఏదో సింపుల్ స్టెప్ కాదు. ప్రోగ్రాం రన్ అవడానికి అతి ముఖ్యమైన లాజిక్ స్టెప్పు అది. అందుకే పూర్తిగా మార్కులని కట్ చేసింది మీ టీచర్. ఒక్క విషయం మేఘా. ఈ మధ్య ప్రతీ విషయంలోనూ నీ తప్పుని నువ్వు తెలుసుకుని నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకునేందుకు బదులుగా వేరే ఎవరి మీదకో నెపాన్ని త్రోసేసి తృప్తి పడుతున్నావు. నీ తల్లిదండ్రులైన మమ్మల్ని కూడా ఏదో ఒకటి చెప్పేసి మభ్య పెట్టాలని చూస్తున్నావు. అది మంచి పధ్ధతి కాదు. ఎందులోనైనా మనం ఫెయిల్ అయితే ‘ అలా ఎందుకు జరిగింది ? మరోసారి అలా జరగకుండా ఉండాలంటే మనమేం చేయాలి, ఎలా యింప్రూవ్ అవ్వాలి ‘ అనే దాన్ని గురించి ఆలోచించాలి . అంతేగానీ సింపుల్ గా కారణాన్ని దేని మీదకో నెట్టేస్తే యిక జీవితంలో మనం ఎదగడమంటూ జరగదు “ అని కూతురికి కాస్త గట్టిగానే చెప్పింది నీలిమ.
తల్లి మాటలకి ఆలోచలనలో పడిందేమో మరి ఏం మాట్లాడలేదు మేఘన. ఆ తరువాతా అడపాదడపా యిలాంటి సంభాషణలు, హితబోధలు కొన్నాళ్ళ పాటు జరిగాయి నీలిమకి, మేఘనకి మధ్యన.

***

యింటరు కి రావడంతో యిక బాడ్మింటన్, మ్యూజిక్ లాంటివన్నింటిని తగ్గించుకుని చదువు మీదే పూర్తిగా దృష్టిని పెట్టింది మేఘన. స్వతహాగా తెలివైన పిల్లే కావడంతో యింజనీరింగ్ ఎంట్రన్స్ లో మంచి ర్యాంక్ తెచ్చుకుని యింజనీరింగ్ కాలేజీ లో చేరింది.
యింజనీరింగ్ చివరి సంవత్సరంలో వుండగానే క్యాంపస్ యింటర్వ్యూ లు రావడం మొదలయ్యాయి. మొదటి రెండు కంపెనీ లు పెట్టిన రాత పరీక్షలో పాస్ అయినా కూడా యింటర్వ్యూలో సెలెక్ట్ అవకపోవడంతో బాగా డిసప్పాయింట్ అయింది మేఘన.

“ నా కంటే తక్కువ మార్కులు వచ్చిన మహతి , రవళి కూడా సెలెక్ట్ అయారమ్మా . యింటర్వ్యూ అంతా బోగస్ లా వుంది “ అని చిరాకు పడుతున్న కూతురిని సముదాయించింది నీలిమ.

“ ప్రైవేటు కంపెనీ లు మార్కులతోపాటు సాఫ్ట్ స్కిల్స్ ని కూడా చూస్తారు మేఘా. మీరు ఎలా మాట్లాడుతున్నారు, మీలో టీం స్పిరిట్ ఉందా , ఎంత పాజిటివ్ గా, ఎంత క్రియేటివ్ గా ఆలోచించగలరు , పబ్లిక్ స్పీకింగ్ అలవాటుందా యిలాంటివన్నీ గమనించేటందుకే వాళ్ళు మిమ్మల్ని పర్సనల్ యింటర్వూ చేసేది. అందుకని యిలాంటి సాఫ్ట్ స్కిల్స్ లో ట్రైనింగ్ ని తీసుకుని ఆ తరువాత యింటర్వ్యూ కి అటెండవు. నీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది “ అంటూ కూతురికి ధైర్యం చెప్పింది నీలిమ.

నీలిమ చెప్పినట్లుగానే యింటర్వ్యూ కి ఎలా ప్రిపేర్ అవాలనే దాని మీద ట్రైనింగ్ తీసుకున్న తరువాత క్యాంపస్ కి వచ్చిన ఒక పెద్ద కంపెనీ లో ఉద్యోగానికి సెలెక్ట్ అయింది మేఘన.

“ అమ్మా, నువ్వు నా చిన్నతనం నుండీ చెబుతున్నావు కదూ ‘ ఏ విషయం లోనైనా సరే ఫెయిల్ అయినప్పుడు , మనలో లోపం ఏమిటనేది తెలుసుకుని దాన్ని సరిదిద్దుకుని మనని మనం యింప్రూవ్ చేసుకుంటే ఆ తరువాత గెలుపు మనదే అవుతుంది ’ అని. యింత కాలానికి ప్రాక్టికల్ గా నాకా విషయం బోధపడింది. థాంక్స్ అమ్మా “ అంటున్న కూతురిని సంతోషంగా హృదయానికి హత్తుకుంది నీలిమ.

***
ఆ తరువాత మేఘన వడి వడిగా కార్పొరేట్ నిచ్చెన మెట్లనెక్కేసి పెద్ద పొజిషన్ లో స్థిరపడింది. తనతోపాటు అదే కంపెనీ లో చేస్తున్న తన సీనియర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది.

వాళ్లకి యిప్పుడు ఒక పాప, పేరు లాస్య. కూతురి పురిటికి సహాయానికని అమెరికాకి వెళ్లి ఆరు నెలలుండి వచ్చారు ఆదిత్య, నీలిమ దంపతులు.

***

మూడు నెలల క్రిందట ఉద్యోగం నుండీ రిటైర్ అయాడు ఆదిత్య. ఆ తరువాత రెండు నెలలకే నీలిమ కూడా వాలెంటరీ రిటైర్ మెంట్ తీసుకుంది.

“ అమ్మా , మీరిద్దరూ రిటైర్ అయిపోయి ఫ్రీ గా వున్నారు కదా. లాస్య పుట్టినప్పుడు తప్ప మళ్ళీ యింతవరకూ మీరు యిక్కడికి రానేలేదు. సరదాగా అమెరికా కి రండమ్మా “ అని కూతురు చెప్పడమే కాకుండా అల్లుడు కూడా బలవంతపెట్టడంతో ఆదిత్య, నీలిమ అమెరికా కి ప్రయాణమయ్యారు.

***

అమెరికా కి వెళ్ళిన వారం రోజుల వరకూ జెట్ లాగ్ తోనే సరిపోయింది నీలిమకి , ఆదిత్యకీ. ఆ తరువాత మనవరాలి వచ్చీరాని తెలుగు మాటలతో తెలీకుండానే నెల రోజులు గడిచిపోయాయి.

ఆ తరువాత లాస్య కి స్కూల్ తెరిచారు. మనవరాలు స్కూల్ కి వెళ్లిపోయేటప్పటికి రోజంతా బోర్ గా అనిపించింది యిద్దరికీనూ. అయితే యిద్దరికీ పుస్తక పఠనం బాగా అలవాటుండడంతో మనవరాలు స్కూల్ నుండి యింటికి తిరిగి వచ్చేవరకూ ఏదో ఒక పుస్తకం చదువుతూ కాలక్షేపం చేస్తున్నారు. శని, ఆది వారాలలో అందరూ కలిసి వెళ్లి అవీ యివీ దగ్గరి ప్రదేశాలని చూసి వస్తున్నారు.

***

ఆ రోజు లాస్య కి స్కూల్ లో రిపోర్ట్ కార్డు యిస్తారు. లాస్య తో పాటు మేఘన కూడా స్కూల్ కి వెళ్లి రిపోర్ట్ కార్డు ని తీసుకుని వచ్చింది. రిపోర్ట్ కార్డుని చూస్తూనే “ ఏమిటిది లాస్యా ? యింగ్లీష్ లాంగ్వేజ్ లో యింత తక్కువ మార్కులు వచ్చాయీసారి “ అని మేఘన అడుగుతుండగా సగంలోనే సమాధానం చెప్పింది లాస్య

“ మమ్మీ, మా యింగ్లీష్ టీచర్ కొత్తగా స్కూల్ లో జాయిన్ అయింది. ఆమె ఉచ్చారణ నాకు సరిగా అర్థం కావట్లేదు , అందుకే తక్కువ మార్కులు వచ్చాయి “

“ అదేంటి లాస్యా, మీ యింగ్లీష్ టీచర్ వెకేషన్ కి ముందే మీ స్కూల్ లో చేరిందిగా. వెకేషన్ కి ముందర జరిగిన యింగ్లీష్ లాంగ్వేజ్ పరీక్షలో నీకు మార్కులు బాగానే వచ్చాయి కదా. అప్పుడిలా టీచర్ ఉచ్చారణ అర్థమవట్లేదని నువ్వు అనలేదుగా “ అని నిలదీసిన మేఘనకి కూతురు లాస్య చెప్పిన సమాధానంతో మతి పోయినట్లయింది.“ అది కాదు మమ్మీ. మరి గ్రాండ్ పా , గ్రాండ్ మా వచ్చారు కదా మన యింటికి. మీ ముగ్గురూ కలిసి రోజూ గట్టి గట్టిగా మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటుంటే నాకు బాగా డిస్టర్బ్ అయి సరిగా చదవలేకపోయాను. అందుకని తక్కువ మార్కులు వచ్చాయి “వింటున్న నీలిమ ఫక్కున నవ్వేసింది.

“ మేఘా , నీ కూతురు అచ్చం నీ పోలికే. నీ నోట్లోంచి ఊడిపడి నీ గుణగుణాలనే పుణికి పుచ్చుకుంది. నీ లాగే చక్కగా ఎవరో ఒకరి మీదకి నెపాన్ని త్రోసేస్తోంది “

“ గట్టిగా అనకమ్మా . అది విందంటే యింక పర్మనెంట్ గా జీన్స్ మీద నెపాన్ని పెట్టేస్తుంది. ఈ విషయాన్ని నేను ఎప్పుడో గమనించాను. ఎన్నో సార్లు దానికి చెప్పి చూసాను, కానీ అది నా మాట వినట్లేదు. యింకాస్త గట్టిగా చెప్పబోతే ‘ పో మమ్మీ నీకేం తెలీదు ‘ అంటూ నన్ను తీసిపారేస్తోంది. ఎలాగోలా నువ్వే దానికి నచ్చజెప్పి ఈ అలవాటుని మాన్పించాలి అమ్మా “ అంది మేఘన బెంగగా.

“ పిచ్చి పిల్లా. ఈ మాత్రం దానికే అంత బెంగా . నేను చూసుకుంటాలే “ అంటూ హామీ యిచ్చింది నీలిమ.

***

ఆ రోజు ఆదివారం. లాస్య తన లాప్ టాప్ లో వీడియో గేమ్ ఆడుకుంటుంటే , నీలిమ మనవరాలి ప్రక్కనే కూర్చుని ఆ ఆటని గురించిన వివరాలని అడిగిందే తడవుగా ఎంతో ఉత్సాహంగా కి ఆట గురించి పూర్తిగా విడమరిచి చెప్పడమే కాకుండా దగ్గరుండి ఆమెతో రెండు మూడు గేమ్స్ ని కూడా ఆడించింది లాస్య.

ఆ తరువాత మెల్లిగా టాపిక్ ని తనకి కావలసినట్లుగా డైవర్ట్ చేసింది నీలిమ.

“ లాస్యా , నీకు ఎప్పుడైనా మార్కులు తక్కువొచ్చినా , లేదా ఏదైనా ఆటలో ఓడిపోయినా అలా జరగడానికి నువ్వు ఏ విధంగా బాధ్యురాలివో అనేదాన్ని గురించి ఆలోచించి నువ్వు చేసిన పొరపాట్లని సరి చేసుకుంటే జీవితంలో త్వరగా ఎదగగలుగుతావు. కానీ నువ్వు అలా చేయకుండా నెపం వెంటనే వేరే దేనిమీదకైనా తోసేసావంటే నీ అబివృద్ధికి నీవే అడ్డం పడుతున్నావని అర్థం కదూ“ మృదువుగా చెప్పింది నీలిమ.

“ నీకేం తెలీదు గ్రానీ . నువ్వు చెప్పేవన్నీ యిండియా లో ముసలాళ్ళు చెప్పేవి . యిక్కడ అమెరికన్ లైఫ్ స్టైల్ కి నువ్వు చెప్పేవేవి సూట్ అవ్వవు “

“ యివి యిండియా మాటలు కావు అమ్మడూ. సరే ఒక్క విషయం చెప్పు . నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నావుగా . స్టీఫెన్ కోవే పేరు విన్నావా ? “

“‘ ఎందుకు వినలేదు. అతను గొప్ప యింగ్లిష్ రచయిత. ఎన్నో మంచి బుక్స్ వ్రాసాడు “

“ గుడ్. అయితే అతను వ్రాసిన ‘ సెవెన్ హబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్’ అంటే ‘ అత్యంత ప్రతిభావంతులైన వారి ఏడు అలవాట్లు’ అన్న పుస్తకాన్ని చదివావా ఎప్పుడైనా “

“ మా స్కూల్ లైబ్రరీ లో ఆ పుస్తకాన్ని చూసాను , కానీ నేను చదవలేదు “

“అందులో స్టీఫెన్ కోవే చెప్పిన ఫస్ట్ స్టెప్ ఏమిటో తెలుసా ‘ నీ చర్యలకి నువ్వే బాధ్యత తీసుకో అంతే కానీ నెపం వేరే వ్యక్తులకి గానీ , పరిస్థితులకి గానీ ఆపాదించకు. అలా నీ చర్యలకి నీవే బాధ్యతని తీసుకోవడం వలన నిన్ను నీవు యింప్రూవ్ చేసుకుని నీ మీద నువ్వు పూర్తిగా కంట్రోల్ ని తెచ్చుకోవడం జరుగుతుంది ‘ అని చెప్పాడు స్టీఫెన్ కోవే . నా దగ్గర వుంది ఆ పుస్తకం. ఆ పుస్తకంలో ఆ చాప్టర్ ని పూర్తిగా చదివిన తరువాత మాట్లాడు “ అని నీలిమ కాస్త గట్టిగా చెప్పడంతో వెంటనే ఆ పుస్తకాన్ని నీలిమ దగ్గర నుండీ తీసుకుని పట్టుదలగా గంటలోనే ఆ చాప్టర్ మొత్తం చదివింది లాస్య.

చదవడం పూర్తి అయిన తరువాత సోఫా లో కూర్చున్న నీలిమ దగ్గరకి వచ్చింది లాస్య .

“ గ్రానీ , యూ ఆర్ కరెక్ట్ . కోవే చెప్పినవే నువ్వు చెప్పావు. బట్ నాకొక సందేహం . నువ్వంటే బాగా చదువుకున్నావు, ఇంగ్లీష్ బాగా వచ్చు కాబట్టి ఆ పుస్తకాలని చదివి వాటిలో వున్న చక్కటి విషయాలన్నింటిని నాకు విశదీకరించి చెబుతున్నావు. మరి ఇండియా లో వుండి చదవడం రాని తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలకి యిటువంటి మంచి విషయాలన్నీ ఎలా తెలుస్తాయి?“

“ లాస్యా, అమెరికాలాంటి దేశాలలో కుటుంబ వ్యవస్థ అంటూ లేదు కాబట్టి స్టీఫెన్ కోవే లాంటి వారు తమ మేధస్సునంతా ఉపయోగించి చక్కటి పుస్తకాల ద్వారా ప్రజలకి జ్ఞానాన్ని పంచారు. కానీ యిండియా లో బలమైన కుటుంబ వ్యవస్థ వుంది కాబట్టి పుస్తకాల అవసరం లేకుండానే యింట్లో వుండే పెద్దవాళ్ళు అంటే బామ్మలు, అమ్మమ్మలు , తాతల ద్వారా అన్ని విధాలైన జ్ఞానమూ ఒక తరం నుండీ మరో తరానికి చేరుతుంది. అయినా అన్ని పర్సనాలిటీ డెవలప్ మెంట్ పుస్తకాలకీ మూలమైన భగవద్గీత పుట్టిందే యిండియాలో. గీత ద్వారా ప్రపంచానికి కృష్ణుడు అందించిన జ్ఞానాన్ని యిండియా లో పిల్లలకి అక్కడి పెద్దవాళ్ళు కథల రూపంలో చెపుతారు. కాకపొతే యిప్పుడు యిండియా లో కూడా కుటుంబ వ్యవస్థ మెల్లి మెల్లిగా కుంటుపడుతోంది కాబట్టి ముందు ముందు అక్కడి వాళ్ళు కూడా మీ లాగే పుస్తకాల పైనే ఆధారపడవలసి వుంటుంది. ఏది ఏమైనా మేమంతా కూడా పెద్దలంటే ఎంతో గౌరవభావంతో మెలిగే వాళ్ళం, మా పెద్దవాళ్ళు చెప్పిన మాటలని బుద్ధిగా వినేవాళ్ళం, తూచా తప్పకుండా పాటించే వాళ్ళం. అంతేగానీ ‘ నీకేం తెలీదు పో అమ్మా ‘ అంటూ మా పెద్దలని తీసి పారేయలేదు ”

నీలిమ చెపుతున్నదంతా ఆసక్తి గా వింటున్న లాస్యకి ఆమె చివరలో చెప్పిన మాటలు చురుక్కున తగిలినట్లున్నాయి.
అక్కడే హాల్లోనే వుండి డైనింగ్ టేబుల్ ని శుభ్రం చేస్తూ ఈ సంభాషణంతా వింటున్న మేఘన దగ్గరకి వెళ్లి “ సారీ మమ్మీ, నా మంచి కోరి నువ్వు నన్ను సరిదిద్దాలని చూసిన ప్రతీసారి నీతో నేను రూడ్ గా మాట్లాడాను. నిన్ను నొప్పించాను. యింకెప్పుడూ అలా చేయను మమ్మీ “ అని అంటున్న కూతురిని ప్రేమగా దగ్గరకు తీసుకున్న మేఘనని చూస్తూ

“ పిల్లలు తమ తప్పు తాము తెలుసుకుని సరిదిద్దుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులకి కలిగే ఆనందం అనిర్వచనీయం “ అనుకుంది నీలిమ మనసులోనే తృప్తిగా.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు