నుదిటిపై నుండి చినుకుల్లా రాలుతోంది చెమట. శ్వాస వేగాన్ని పుంజుకుంటోంది. భయంతో బెదురు బెదురుగా పరుగెత్తుకొచ్చాడు. ‘‘అమ్మా..! అ....మ్మా..!’’ గుడిసె ముందు నిల్చొని కేకలేస్తున్నాడు పదేళ్ళ సూర్యం.
చుక్కమ్మకు రెండు రోజుగా జ్వరం. మూసిన కన్ను తెరవటం లేదు. కొడుకు ఏమంటున్నాడో కూడా సరిగా అర్థం చేసుకునే స్థితిలో లేదు. మొత్తానికేదో జరగరానిదే జరిగిందని గ్రహించింది. మెల్లగా లేచి కూర్చుంది. ‘‘యేందిరా! సూర్యం! యేమైంది?’’ బలహీనపడ్డ స్వరానికి చేతి సైగను జోడించింది. తల్లికి దగ్గరగా వచ్చాడు. ‘‘అమ్మా! బర్రె పోయిందే...?’’
‘‘యేం...ట్రా...? బర్రె పోయిందా...?’’ చుక్కమ్మకు గుండె ఆగినంత పనైంది.
‘‘అవునే..! ఊళ్ళో వాళ్ళ బర్రెలు బీట్లోకి రావడం చూసి, గడ్డిమేస్తున్న మన బర్రె బెదిరింది. తెగిపోయిన తాడు పట్టుకొని చాలా సేపు లాగాను. ముళ్ల కంపల్లోంచి చాలా దూరం ననీడ్చుకెళ్ళింది. దాన్నాపటం నా వల్ల కాలేదమ్మా’’ సూర్యం కళ్ళల్లో నీళ్ళు ఎగిసాయి. మందార పువ్వు లాంటి సూర్యం ముఖంపై మొలిచిన రక్తపు చుక్కలను చూస్తూ ‘‘యెంత పని జరిగిందిరా సూరి..’’ అంటూ కొడుకును గుండెకు హత్తుకొంది.
మూడు పదు వయసు దాటకుండానే ఇద్దరు పిల్లలు. కామెర్ల కాటుకు కట్టుకున్నోడు బలయ్యాడు. మరుసటి ఏడాది వైరల్ జ్వరం చిన్న పిల్లాడిని తీసుకుపోయింది. మగతోడు లేని కుటుంబంలో తనకున్న ఒకే ఒక్క ఆధారం బర్రె. పొద్దంతా దాన్ని మేపుకురావడం, పాలు పిండటం ఆమెకు దినచర్యగా మారింది. పదిండ్లకు పాలు పోస్తూ... సూర్యాన్ని చదివిస్తూ... ధైర్యంగా బతుకెళ్ళదీస్తుంది. చుక్కమ్మకు జ్వరం రావటం మూలానా బర్రెను మేపే బాధ్యత సూర్యం మోయక తప్పలేదు. ఫలితం బర్రె అడవి వైపు పారిపోయింది.
శక్తినంతా కూడదీసుకొని మళ్ళొకసారి ఆర్‌ఎంపి దగ్గరకు వెళ్ళింది. ఇంజక్షన్ చేయించుకుంది. ఈ సారి మందు పని చేసినట్లుంది. సాయంత్రానికి జ్వరం నుంచి కాస్త తేరుకుంది చుక్కమ్మ.
* * *
రేయనక, పగలనక నాలుగు రోజులు అడవంతా గాలించింది. చేలన్నీ చుట్టొచ్చింది. చుట్టుప్రక్కల గ్రామాల్లోనూ ఆరా తీసింది. బర్రె జాడ దొరకలేదు. నిరాశతో గుడిసె ముందు కూలబడింది. బంగారం లాంటి బర్రెను తలుచుకుంటూ పెద్దగా ఏడ్వసాగింది.
‘‘వూర్కొవే! చుక్కమ్మా! వూరుకో! నువ్వు మాలాగున్నా మాతో పాటు కూలి పనికి తీసుకపోదుము. ఒక కాలు వంకరదాయే? పొద్దంతా వంగి పని చేయటం నీ వల్ల కాదు. ఏం బతుకో ఏమో? ఎన్నడన్నా సుఖపడ్డది లేదాయే! మొగుడుబాయే! కొడుకుబాయే! యిన్నాళ్ళూ తోడున్న బర్రెబాయే! నీకన్నీ సీతమ్మోరి సెరలే! నువ్వేం బాధపడకు. కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికొస్తాయే? నీదెట్లాగో బస్టాండ్ పక్క ఇల్లే కాబట్టి ఛాయ్ దుకాణం నడుస్తది. నువ్వు కూర్చొని పని చేసుకోవచ్చు’’ తోచిన సలహాలిస్తూ ఇరుగు పొరుగు వారు ఓదార్చారు.
వాళ్ళ సలహా చుక్కమ్మకు ఒక దారి చూపినట్లు అన్పించింది. వెంటనే దానిని ఆచరణలో పెట్టింది. గుడిసె ముందు నాలుగు గుంజు పాతింది. మగబీరను పైకప్పుగా పేర్చింది. మూడేపులా కందికట్టెతో తడికు అల్లింది. పక్షి గూడంత అందంగా చిన్న హోటల్‌ను తయారు చేసింది. చూస్తుండగానే వ్యాపారం సజావుగా సాగటం మొదలైంది.
* * *
రయ్‌మంటూ దూసుకొచ్చి హోటల్ ముందాగిందో తెల్ల కారు. నలుగురు దిగారు. ఇస్త్రీ నగని త్లెనిబట్టు, బూట్లు, కళ్ళజోడ్లతో అచ్చం సినిమా హీరోల్లా వున్నారు. ‘‘ఏం చుక్కమ్మ! బావున్నావా!’’ అంటూ పాకలోని బల్లపై కూర్చున్నారు. చుక్కమ్మ, సూర్యం ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టారు.
‘‘గుర్తు పట్టలేదా? ఈ వూరోల్లమే! రావు గారిని’’ అంటూ కళ్ళజోడు తీసాడు పొడువాటి వ్యక్తి. అసలు పేరు సూర్యనారాయణ. వూరంతా రావుగారనే పిుస్తారు.
‘‘ఓ మీరా బాబు? సూటు, బూటు చూసి గుర్తు పట్టలేదు. టిఫిన్ తింటారా? చాయ్ తాగుతారా?’’
‘‘టిఫిన్ వద్దులే. టీలే ఇవ్వు’’
క్షణాల్లో గ్యాస్ ముట్టించి, టీ తయారు చేసింది. ‘‘టీ చాలా బాగుంది!’’ అంటూ వంద రూపాయ కాగితం చేతిలో పెట్టాడు రావు గారు. చిల్లర ఇవ్వబోతే ‘‘ఫర్వాలేదులే వుంచు!’’ అన్నాడు.
‘‘చుక్కమ్మా! నీ బర్రె పోయిందంటగా? నీకెన్ని కష్టాలు. ఈ పాక మాత్రం ఎన్ని రోజులుంటది. గట్టిగా గాలిస్తే కూలిపోతుంది. పాపం! ఒంటరి ఆడదానివి. మళ్ళీ ఇబ్బంది పడతావు. నీకో సాయం చేయానే ఇక్కడకి వచ్చాం. ప్రభుత్వం నుండి లోన్ ఇప్పిస్తాం. చక్కగా గోడ కట్టుకొని పైన రేకులు వేసుకున్నావంటే హోటల్ సూపర్‌గా వుంటుంది. ఏమంటావు?’’
‘‘మంచి చేస్తానని వస్తే ఎవరు మాత్రం వద్దంటారయ్యా? లోన్ రావాంటే నేనే సేయాలో చెప్పండి?’’ చుక్కమ్మ ఊహల్లో కొత్తగా మారబోతున్న హోటల్ రూపుదిద్దుకుంటుంది.
‘‘నువ్వేం చేయొద్దు. ఒక సంతకం పడేస్తే అంతా మేం చూసుకుంటాం. టౌన్‌కు పోయి బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి లోన్ ఇప్పిస్తాం’’ అంటూ కాగితాలపై చుక్కమ్మతో వేలిముద్రలు వేయించుకున్నాడు రావుగారు.
* * *
వారం గడిచింది. డుగ్..డుగ్.డుగ్..మంటూ ప్రొక్లైన్ వచ్చింది. దానెనుక రావు గారి బృందం దిగింది. హోటల్, గుడిసె కూల్చేయమంటూ ఆజ్ఞాపించాడు రావు గారు.
‘‘యిదేం అన్యాయం?’’ అయోమయంగా అడిగింది చుక్కమ్మ.
‘‘ఈ స్థలం మాది. మాకు అమ్మినట్లు రుజువు ఈ రిజిస్ట్రేషన్ పేపర్లు. వాటిపై నీ వేలిముద్రలు కూడా ఉన్నాయి. డబ్బు కూడా ఇచ్చాం కదా! ఏమీ ఎరగనట్లే అడ్డుపడుతున్నావే? జరుగు జరుగం’’టూ ప్రొక్లైన్‌కు అడ్డొచ్చిన చుక్కమ్మను పక్కకు నెట్టేసాడు రావు గారు. రావు గారి అసలు స్వరూపం చూసే సరికి చుక్కమ్మలో రౌద్రం రగిలింది. బలహీనుడి అడుగు ముందుకు పడనంత కాలం, ఇలాంటి వాళ్ళ ఆటలు సాగుతాయి అనుకుంది. ‘రేయ్... నా కొ...ల్లారా! ఎవడబ్బ సొత్తురా ఈ జాగా? కష్టమొకడిది, సుఖమొకడికా? ఆడదాన్నని కూడా చూడరా? మా పేదోళ్ళను బతకనీయరారా? దమ్మున్నోడు ముందుకు రండిరా!’’ పాకకు పాతిన గుంజల్లో ఒక దాన్ని, ఊడబీకి శివంగిలా లేచింది. దొరికిన వాడిని దొరికినట్టే బాదటం మొదలెట్టింది. ఉగ్రరూపం దాల్చిన చుక్కమ్మను తట్టుకోలేక కుయ్యో మొర్రోమంది రావు గారి బృందం.
ఊరంతా పోగయ్యేసరికి తల కొట్టేసినట్లైంది. ‘‘బుద్ది గడ్డి తిని ఈ పని చేయాలని చూసాం. మమ్మల్ని క్షమించు చుక్కమ్మ’’ పశ్చాత్తాపంతో కుమిలిపోసాగాడు రావు గారు.
చుక్కమ్మలో రగిలిన చైతన్యం ఊరంతటికి వెలుగులు నింపింది. యిన్నాళ్ళూ రావు గారి బృందం ఆగడాకు బలై కూడా ప్రాణభయంతో నోరు మెదపని వారు సైతం ‘‘మంచి పని చేశావంటూ’’ చుక్కమ్మను అభినందించసాగారు. జరిగింది మంచికో, చెడుకో గానీ వెంటనే ఈ స్థలం సూర్యం పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాలనే నిర్ణయానికొచ్చింది చుక్కమ్మ.