vaadu - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

vaadu

ఇద్దరం ఫ్రెండ్సుమి. కంపెనీలో కొత్తగా జాయినయ్యాం. మేం బ్యాచులర్స్ కావడం వల్ల ఎవరూ ఇంటిని అద్దెకివ్వకపోవడం, రెంట్లు ఎక్కువగా ఉండడంతో, మేమూ సై అనకపోవడం వల్ల ఇల్లు దొరక్క ఎంతో ప్రయాసాయసపడి ఇదిగో ఈ ఇల్లు అద్దెకు సంపాదించాం. ఊరికి దూరం అయితేనేం, తక్కువ అద్దెకు దొరికింది. ఓనర్స్ ఎక్కడో సిటీలో ఉంటారు. ‘ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి చాలు. మీరిచ్చినప్పుడే రెంట్ తీసుకుంటాను.’ అని ఓనర్ అనడం మాకు అయాచిత వరం. విశాలమైన గదులతో, చుట్టూ కాపౌండ్ తో చిన్నపాటి భవనంలా ఉంటుంది. అద్దె కట్టినంత కాలం ఇది మాదే. ఆ ఆనందంతో ఉదయం ఇంట్లో దిగిన మేం, తోచినరీతిలో పాలు పొంగించుకుని కాఫీ తాగి కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.

సాయంత్రం రాత్రిగా మారుతోంది.

ల్యాప్ టాప్ లో ‘అవును’ సినిమా చూస్తున్నాం. భయం గొంగళీపురుగులా ఒళ్లంతాపాకుతోంది. "ఒరే రఘు..కాసేపు ఆపేద్దాం రా" అన్నాను.

"ఏంటి భయమా..ఇది సినిమా అని మర్చిపోతున్నావు. సినిమాలో లీనమవ్వచ్చు కానీ హరర్ సినిమాలో కాదు’అని నవ్వి ఏమనుకున్నాడో కానీ ల్యాప్ టాప్ షట్ డౌన్ చేశాడు.

ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం. మనసులోని బెరుకు పూర్తిగా పోలేదు.

ఏదో వాసన..కాలుతున్న వాసన..గుడ్డ కాలుతున్న వాసన..కమురు కంపు..ఎక్కడి నుంచో అర్థం కావడంలా..

మేం లేచి మూడు గదులూ చూశాం. ఊ హూ..

అప్పుడు చూశాం. బెడ్రుమ్ కు వెనక వైపు ఒక కిటికీ ఉంది. అది చాలా కాలం నుంచి తెరవనట్టుగా ఉంది. నిజానికి ముందు వైపున్న కిటికీలు తెరిస్తే ధారాళంగా గాలీ వెలుతురు వస్తుంది. అందుచేత ఇప్పటిదాకా ఎవరూ అది తెరవ లేదనుకుంటా.

మేమిద్దరం కొద్దిసేపు కుస్తీపట్టి దాన్ని తీసే ప్రయత్నం చేశాం.

’కిర్..క్రిర్..కీర్..‘అంటూ తెరుచుకుంది. అందులోంచి బయటకు చూసిన మాకు గుండె ఆగినంత పనైంది. కారణం అవతల వైపు శ్మశానం. పెద్ద పెద్ద మర్రిచెట్లు కాలుతున్న శవాలు. డబుక్కున కిటికీ వేసి కిందకూర్చున్నాం. స్టెత స్కోప్ లేకుండానే మా గుండె కొట్టుకునే వేగం తెలుస్తోంది.

తలుపు తీసుకుని బయటకొచ్చాం. మా ఇంటి చుట్టుపక్కల ఒక్క ఇల్లూ లేదు. దూరంగా స్త్రీట్ లైట్ మినుకు మినుకు మంటోంది. ఇద్దరం ఉన్నాం కాబట్టి సరిపొయింది. అదే ఒక్కరం ఉండుంటే ఈపాటికి ఔటే.

మళ్లీ తలుపేసి లోపలికెళ్లాం.

రఘు సూట్ కేస్ ఓపెన్ చేసి ఆంజనేయస్వామి బొమ్మ తీసి టీపాయ్ మీద పెట్టాడు. కాస్త ధైర్యం వచ్చింది(అనిపించింది).

ఇంత వండుకు తిని పడుకున్నాం. రాత్రంతా ఆ కిటికీలోంచి ఏవేవో అరుపులు.. కేకలూ..ఏడుపులూ...వినిపిస్తూనే ఉన్నాయి.

మరుసటిరోజు ఆఫీసుకు వెళ్లాం.

సాయంత్రం ఇంటికొస్తుంటే మనసులో ఏదో బెరుకు. పోనీ ఖాళీ చేసేద్దామంటే మూడు నెలల రెంట్ అడ్వాన్స్ గా ఇచ్చాం. మాబోటి గాళ్లకు అది పెద్ద మొత్తమే..పైగా మళ్లీ ఇప్పటికిప్పుడు ఇల్లంటే ఎక్కడ దొరుకుతుంది?

ఇంట్లోకెళ్లి స్నానం చేసి కాఫీ తాగి..అన్నం గిన్నె గ్యాస్ స్టౌ మీద పెట్టి రాజేంద్రప్రసాద్ కామెడీ సినిమా పెట్టుకుని చూస్తున్నాం. సినిమాలో లీనమై నవ్వుతున్నాం. అంతలో ‘టక్.టక్’ అని కిటికీ తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది.

ల్యాప్ టాప్ మ్యూట్ లో పెట్టి..కూర్చున్నాం..మళ్లీ చప్పుడు..ఒళ్లంతా చెమట్లు..మా గుండే చప్పుడు దాంతో పోటీ పడుతోంది..

"అయ్యా.."ఎవరిదో బొంగురు గొంతు కిటికీకి ఆవైపు నుంచి.

దెయ్యమే..అది దెయ్యమే..నోరు పిడచకట్టుకుపోతోంది.

"భయపడమాకండయ్యా..నేను కాటి కాపరి చొప్పన్నని..తలుపు తియ్యండి.."

మేము కాస్త ధైర్యం చేసి తలుపులు తీశాం.

నల్లగా నిగ నిగ లాడుతూ..తైల సంస్కారం లేని ఉంగరాల జుత్తుతో..భుజం పైన గొంగడితో..మెళ్లో నల్లని తాడుతో.."అయ్యా శవాన్ని తగలెయ్యాల అగ్గిపుల్లలు లేవు కాస్త ఇస్తారా"అన్నాడు.

"అసలే గుండాగి చస్తుంటే..వీడొకడు"అనుకుని అగ్గిపెట్టె ఇచ్చి తలుపులేశాం. కాటికాపరయితేనేం అవతల వైపు ఒక మనిషున్నాడనీ..అదీ శ్మశానంలో ఉన్నాడని తెలుసుకున్నాక గుండెకొట్టుకునే స్పీడు తగ్గుముఖం పట్టింది.

అప్పట్నుంచీ సమయం దొరికినప్పుడల్లా వాడితో మాట్లాడే వాళ్లం. ఎప్పుడన్నా ఏవన్నా ఇచ్చినా తీసుకునేవాడు కాదు.

ఒకసారి కంపెనీ నుంచి వస్తుంటే ఎవరో ’ఈరోజు అమావస్య’అనడం విన్నాం.

అయితే ఇంతకుముందంత భయం లేదు. కారణం చొప్పన్న.

రాత్రి రక రకాల చప్పుళ్లు..ఏవో మంత్రాలు..ఊళలూ వినిపించసాగాయి. అంటే క్షుద్రపూజలు కూడా ఈ స్మశానంలో చేస్తారన్నమాట..అసలు చొప్పన్న ఎలా అనుమతిస్తున్నాడో?..అసలు అతనెక్కడ ఉంటాడో..రాత్రంతా కిటికీని గీరడం..దబ దబ బాదడం వినిపించింది.

రెండు రోజుల తర్వాత ఆఫీసు పని మీద బైటకెళ్లి ఇంటికి పెందళాడే వస్తుంటే రఘు వచ్చేలోపు, వెనకవైపు శ్మశానానికి వెళ్లి చొప్పన్నను చూసి రావాలనిపించింది.

అనుకుందే తడవు అటువైపుగా అడుగులేశాను. శ్మశానానికి దారి నిర్మానుష్యంగా ఉంది. నేను నడుస్తున్నాను.

"ఆగు" అని గట్టిగా వినిపించి ఆగిపోయాను.

తలంతా జడలుకట్టుకుపోయి, ముఖమంతా ముడతలతో, చిరిగిన కాషాయ గుడ్డలతో ఒక సన్యాసిలాంటి వ్యక్తి అరుపది.

"ఒరే..నువ్వెక్కడికెళుతున్నావో తెలుసా? మృత్యుముఖంలోకి.. ఆ చొప్పన్న ఎవరో తెలుసా? ప్రేతాత్మ..నీతోపాటు ఉండేవాడి ఆత్మ. అది నిన్ను చంపేస్తుంది..వెళ్లిపోరా..వెళ్లిపో..అదృష్టవశాత్తు నేను చూసిన వాళ్లను రక్షిస్తున్నా..ఇప్పటి వరకూ ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడో వాడు" అన్నాడు.

"నువ్వు చెప్పేది నిజమైతే..అతనూ నాతోపాటు భయపడుతున్నాడు..ఆఁ..అన్నట్టు సూట్ కేస్ లోంచి ఆంజనేయస్వామి బొమ్మ కూడా తీశాడుగా" అన్నాను.

"అది నటనరా..వెర్రికుంకా..ఆ బొమ్మను పరిశీలనగా చూడు విషయం బోధపడుతుంది. అది ఆంజనేయస్వామిది కాదురా..అలా కనిపిస్తుందంతే.."అన్నాడు.

నేను భయంతో ఇంటివైపు ఎలా పరిగెత్తానో తెలీదు. లోపలికెళ్లి నా బట్టల పెట్టె తీసుకుని బయటకొస్తూ ఆంజనేయస్వామి విగ్రహం వంక చూశాను..అవున్నిజమే అది ఆంజనేయుడిదికాదు అలా కనిపించే మరేదో బొమ్మ. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు మొదలెట్టాను. ఇన్నాళ్లూ నేనున్నది ప్రేతాత్మతోటా? తల గిర్రున తిరుతోంది. "ఏరా..ఎక్కడికి బయల్దేరావు?" దారిలో ఎదురై అడిగాడు రఘు.

"ఆ..ఆ..మానాన్నకు బాగాలేదట ఊరెళుతున్నాను." అని ఎలాగో చెప్పి వేగంగా పరిగెత్తుకుంటూ రోడ్డుకెళ్లి ఆటో ఎక్కాను. ఆటో రేర్ మిర్రర్లో వెనకవన్నీ కనిపిస్తున్నాయి..ఒక్క వా..డు..త..ప్ప...

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు