అనుబంధం - కొమ్ముల వెంకట సూర్యనారాయణ

anubhandham

“మురళీ! అన్నయ్యను ఒకసారి చూసి రావచ్చు కదా! ఈ మధ్య చాలా అనారోగ్యం చేసింది కదా!” అమ్మ ఒకటే గొడవ

“చూస్తున్నావుగా, నేనేమైనా ఖాళీగా ఉంటున్నానా, ఎప్పుడో ప్రొద్దున్ననగా వెళ్ళి మళ్ళీ రాత్రి పొద్దు పోయి వస్తున్నాను. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమంటే ఇలాగే ఉంటుందని తెలుసు కదా !” గట్టిగా అన్నాను

“ ఆ! ఒకప్పుడు ఉంది మరి ఖాళి. ఏదో సమయంలో వీలు చేసుకొని వెళ్ళి చూసి వచ్చేసేదానికి” తిరిగి బదులిచ్చింది

“ఇపుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని, నే వెళ్ళి చూడక పోతే; నాకు ఒంట్లో బాగో లేనపుడు అన్నయ్య వచ్చి ఏమైనా చూసి వెళ్ళాడా!” మనసులోని అక్కసును వ్రెళ్ళగక్కాను.

“ఆ! వాడప్పుడు ఏ ఇబ్బందుల్లో ఉన్నాడో ఏమో!” అమ్మ సమర్ధింపు

“నీ కెప్పుడూ అన్నయ్య ను వెనకేసుకురావడం అలవాటే కదా! పోనీ నీకు ఒంట్లో బాగోలేనపుడు అయినా మొక్కుబడిగా వచ్చి ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోయాడు కదా, అదీ నీకు గుర్తు లేదేమో” దెప్పి పొడిచాను.

“సరే! సరే ఇంక ఈ దెప్పిపొడవడం ఆపి వీలైతే ఒకసారి వెళ్ళి చూసిరా” అని చెప్పింది

“సరే, చూస్తానులే” అని చెప్పి అక్కడితో ఆ సంభాషణను ముగించా.

***********

నాన్న అన్నదమ్ములు ముగ్గురు, పెదనాన్న, నాన్న, చిన్నాన్న. నాన్న వాళ్ళది మారు మూల పల్లెటూరు. నాన్న ఉద్యోగరీత్యా ఈ పట్టణంలో స్థిర పడి పోయారు. పెద నాన్న, చిన్నాన్నలు, వారి పిల్లలు ఆ ఊరి లోనే ఉంటారు.

నాన్న, అన్నదమ్ములు చాలా ఆప్యాయంగా ఉండేవారు. అందుకే అక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా అందరూ హాజరై ఎంతో సంతోషంతో గడిపే వారు. మా మధ్య ఆప్యాయతలు,అనురాగాలు వెల్లివిరిసేవి. కార్యక్రమాలు జరిగినన్ని రోజులు మంచి కోలాహాలంగా సమయం గడిచిపోయేది.

************

మేమైతే ఇద్దరమే అన్నదమ్ములం. అన్నయ్య ఈ ఊరిలోనే మరొక చోట ఉంటున్నాడు. ఎందుకో తెలియదు గాని నాన్న, అన్నయ్య నా పట్ల ముభావంగానే ఉండే వారు. నా చదువంతా అమ్మానాన్నలకు దూరంగా హాస్టల్ లోనే సాగింది. అన్నయ్యకు నాన్న ఉండగానే పెళ్ళయింది. నా పెళ్ళి, నాన్న చనిపోయిన తరువాత అన్నయ్య చేతుల మీదుగానే జరిగింది. అమ్మ నా వద్దకు, అన్నయ్య వద్దకు వస్తూ, వెళుతూ ఉంటుంది. పట్టణ వాతావరణంలో పెరగడమో లేదా అమ్మానాన్నలకు దూరంగా హాస్టల్ లో పెరగడమో లేదా నాన్న, అన్నయ్యలు నా పట్ల ముభావంగా ఉండటమో తెలియదు కానీ అన్నయ్యతో నా అనుబంధం అంతంత మాత్రమే. అదిగో దానిలో భాగమే పై సంభాషణ.

*********************

ఒక రోజు వీలు చూసుకొని ఒక గంట అనుమతి తీసుకొని అన్నయ్యను చూడటానికి వాళ్ళింటికి వెళ్ళా. అన్నయ్య బాగా నీర్సంగా ఉన్నాడు. నన్ను చూసి నాకంటే ముందుగానే ” ఎలా ఉన్నావురా మురళీ? అమ్మ, జ్యోతి, పిల్లలు ఎలా ఉన్నారురా?” అని అడిగాడు అతి కష్టంగా .
“అంతా బానే ఉన్నారు. నువ్వెలాగున్నావు? ఆడిగా.

“ఆ! పర్వాలేదు. కాస్త నీర్సంగా ఉంది అని బదులిచ్చి తిరిగి ఏదో చెప్పబోతుంటే నేనే ఏమీ పట్టించుకోకుండా బయలుదేరి వచ్చేసా !

*********************

“మురళీ! ఊరి నుండి మీ పెద నాన్న వచ్చారు , అమ్మ తలుపు తీస్తూ పిలిచింది.”

“రా! పెదనాన్న, ఎలా ఉన్నారు? పెద్దమ్మ, చిన్నాన్న, చిన్నమ్మ, అన్నయ్యలు, తమ్ముళ్ళూ, చెల్లెమ్మ అంతా కులాసాయేనా” అడిగాను

“అంతా కులాసాయేరా! మరి మీరంతా ఎలా ఉన్నారు” తిరిగి అడిగారు పెదనాన్న

“మేమంతా కులాసాయే, ఇంతకీ మన ఊరి విశేషాలేంటి?” అడిగా పెదనాన్నని.

“మీ తమ్ముడి పెళ్ళి రా!, అదే చిన్నాన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళి, తప్పని సరిగా మీరంతా పెళ్ళికి రావాలి. మీ అన్నయ్య దగ్గరకు కూడా వెళ్ళి వస్తున్నాను. చాలా నీరసంగా ఉన్నాడు. పెళ్ళికి రమ్మన్నాను. ఏమాత్రం ఆరోగ్యం సహకరించినా తప్పనిసరిగా వస్తానన్నాడు. అందుకే చెప్తున్నా మీరైనా తప్పనిసరిగా రావాలి”

“ఓహో! అయితే నాకు తప్పదన్నమాట “ మనసులోనే అనుకొన్నాను.

“ ఇక బయలుదేరతాను” అన్నారు పెద నాన్న భోజనం చేసిన వెంటనే.

“ ఈ రోజుకి ఉండి వెళ్ళవచ్చు కదా పెదనాన్నా!”

“లేదు! లేదు!, చిన్నాన్న ఒక్కడూ అన్ని పనులు చూసుకోవడం కష్టమవుతుంది, వెళ్ళాలి” అని బయలుదేరారు.

*********************

పెళ్ళికి నేను, జ్యోతి మాత్రమే బయలుదేరాం. అమ్మ, అన్నయ్యకు ఒంట్లో బాగోలేదు కదా వాడి దగ్గరకు వెళ్తానంది. పిల్లలకు పరీక్షల సమయం కావడంతో వాళ్ళని ఇంటిలోనే ఉంచాల్సివచ్చింది. పెదనాన్న, చిన్నాన్న వాళ్ళది ఇప్పటికి ఉమ్మడి కుటుంబమే. మేము వెళ్ళేసరికి పెళ్ళి యిల్లు పెళ్ళి పందిరితో బంధువులతో కళకళలాడుతూ ఉంది. పెదనాన్న, చిన్నాన్న మమ్మల్ని చూసి ఎదురొచ్చి మరీ ఇంటి లోపలికి తోడ్కొని తీసుకెళ్ళారు.

“ఏరా! అమ్మని, పిల్లలని తీసుకు రాలేదే!” పెద నాన్న ఆరా తీసారు.

“ విషయాన్ని వివరించా, అర్ధంచేసుకొని సరే ! సరే మీరైనా వచ్చారు సంతోషం” అన్నారు.

“ అన్నయ్య ఎలా ఉన్నాడురా! “ చిన్నాన్న అడిగారు

“ ఆ! పరవా లేదు” ముక్త సరిగా సమాధానమిచ్చా. పెదనాన్న, చిన్నాన్నల మధ్య అనుబంధం, వాళ్ళ పిల్లలు ఒకళ్ళనొకళ్ళు ఆప్యాయంగా పలకరించుకొనే తీరు చూసి నిజంగా చాలా ఆనందమేసింది. ఒక ప్రక్క అన్నయ్యతో నా అనుబంధం గుర్తుకు వచ్చి చాలా బాధగా అనిపించింది. చిన్నాన్న వాళ్ళ అమ్మాయిని పెద నాన్న వాళ్ళ కోడళ్ళు ఆట పట్టించడం, తను వెళ్ళి గారంగా పెదనాన్నకు ఫిర్యాదు చేయడం, పెద నాన్న వచ్చి కోడళ్ళను అనునయంగానే “అదెవరనుకొంటున్నారు, మా ఇంటి ఆడపడచు, దాన్ని ఏడిపిస్తారా!” అని గదమాయించినట్టు నటించడం చూసి ఎంతో ముచ్చటేసింది. అంతే కాదు పెద నాన్న పిల్లలు నా కూడా కూడా తిరుగుతూ తమ్ముడూ, తమ్ముడూ అని పలకరిస్తూ క్షణం కూడా విడిచి పెట్టకుండా ఉండటం, అలాగే చిన్నాన్న పిల్లలు అన్నయ్యా, అన్నయ్యా అంటూ ఒకటే హంగామా చేస్తుంటే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాను. పెళ్ళికి పెళ్ళి కూతురు యింటికి వెళ్ళడానికి సిద్దమవుతున్నాము. ఇంతలో “ఒరేయ్! మురళీ, ఇలా రా,” అని ఒక ప్రక్కకు తీసుకెళ్ళారు పెద నాన్న.

*********************

“ఒరేయ్! మీ అన్నయ్యకు చాలా సీరియస్ గా ఉందట, ఇపుడే కబురొచ్చింది. ఇంకా ఎవరితోను అన లేదు. అందుకే నువ్వు వెంటనే బయలు దేరి వెళ్ళు, మిగతా విషయాలు నేను చూసుకొంటాను” అన్నారు.

పెద నాన్నతో సరే అన్నాను గాని, ఇంత వరకు ఉండి పెళ్ళి చూడకుండా అన్నయ్య దగ్గరకు వెళ్ళడమేంటీ అనుకొని పెద నాన్న చూడకుండా పెళ్ళికి వెళ్ళా.

************************

పెళ్ళిలో నన్ను చూసి పెద నాన్న ఆగ్రహోదగ్రుడై ప్రక్కకు పిలిచి “ఒరేయ్! వెధవా! అసలు నీకు కనీస ఇంగిత జ్ఞానం ఉందా! అన్నయ్య అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే ఇక్కడ నీకు పెళ్ళి కావాల్సివచ్చిందా, అసలు మీ అన్నయ్య గురించి నీకు ఏం తెలుసురా, నిన్నేదో ఆప్యాయంగా చూడటం లేదనుకొంటున్నావు కానీ అసలు అన్నయ్య అలా ప్రవర్తించటానికి కారణమేంటో నీకు తెలుసా! చెప్తా విను” అని చెప్పటం ప్రారంభించారు.

**************************

మీ అన్నయ్య తర్వాత, నీకు ముందు మీ అమ్మా నాన్నలకు ఒక బాబు పుట్టాడు. వాడంటే మీ అన్నయకు పంచ ప్రాణాలు. వాడ్ని విడిచి పెట్టి ఒక్క క్షణమైనా ఉండే వాడు కాదు. వాడిని ఎంతో గారాబంగా చూసుకొనేవాడు. వాడి మీద ఈగనైనా వాలనిచ్చేవాడు కాదు. మీ అమ్మానాన్నలు కూడా మీ అన్నయ్య, మీ చిన్నన్నయ్యలను అంతే గారాబంగా చూసుకొనే వారు. విధి వక్రించి వాడికి అయిదేళ్ళ వయసులో పెద్ద జబ్బు చేసి చనిపోయాడు. మీ అన్నయ్యకు అదో పెద్ద షాక్, ఆ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఆ తర్వాతే నువ్వు పుట్టావు. నువ్వెక్కడ వాడిలాగే దూరమైపోతావనే భయంతో నిన్ను మీ నాన్న, మీ అన్నయ్య దూరంగా ఉంచి పెంచారు. అంతేగానీ నీ మీద ప్రేమ లేక కాదు, నువ్వంటే ఇష్టం లేక కాదు. అందుకే ఒకే ఊరిలో ఉంటూ వేరే చోట అన్నయ్య అద్దెకుండటానికి కారణం కూడా అదే. నీకు ఒంట్లో బాగుండక పోతే నిన్ను చూడటానికి ఇంటికి రాలేదని మాత్రమే తెలుసు కానీ, నీకు రక్తం ఎక్కించాల్సి వస్తే ఆ రక్తం యిచ్చింది నీ అన్న! అది కూడా నీకు తెలియనివ్వద్దొన్నాడు.

అంతెందుకు మీ అబ్బాయికి ఎంసెట్ లో ఎక్కువ ర్యాంక్ వస్తే మేనేజ్ మెంట్ సీట్ కి ప్రయత్నించావు గుర్తుందా! వాళ్ళకీ నీకూ సీట్ విషయంలో ఏబై వేల తేడా వల్ల నువ్వు వద్దని చెప్పి వచ్చేస్తే తర్వాత వాళ్ళు నువ్వు ఇస్తానన్న మొత్తానికే ఒప్పుకొంటున్నట్టు కబురు చేస్తే జాయిన్ చేసావు గుర్తు వచ్చిందా! ఇంతకూ జరిగినదేమిటో నీకు తెలుసా! మీ అన్నయ్య ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆ ఏభై వేలు తను కట్టి వాళ్ళని ఆ విధంగా చెప్పమంటేనే మీ అబ్బాయికి ఆ సీటు వచ్చింది. అలాగే నీ కూతురు పెళ్ళి సమయానికి పనికి వచ్చేలా నీకు కూతురు పుట్టినపుడే నీ కూతురు పేర లక్ష రూపాయలు ఫిక్సెడ్ డిపాజిట్ చేసాడు అది నీకు తెలుసా! నీ మీద, నీ పిల్లల మీద నీ అన్నయ్యకున్న ప్రేమకు పరాకాష్ట ఏంటో తెలుసా! వాళ్ళకు పిల్లలు పుడితే ఎక్కడ నీ మీద, నీ పిల్లల మీద ప్రేమ తగ్గి పోతుందేమోనని వాళ్ళు కుటుంబ నియంత్రణ చేసుకొన్న పుణ్య దంపతులురా! నాకు తెలిసినవి ఈ కొన్నే, ఇంకా తెలియనవి ఇంకా ఎన్నో! ఇంకా పెద నాన్న ఏవో చెపుతున్నారు, కానీ నాకేవీ వినిపించుట లేదు, నా కళ్ళ వెంబడి ధారాపాతంగా కన్నీళ్ళు వర్షిస్తున్నాయి. ఎంత దారుణంగా అన్నయ్యను అపార్ధం చేసుకొన్నాను. అన్నయ్యా! నన్ను క్షమించవా! నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా బతకాలి అని మనసులోనే ఆ భగవంతుని ప్రార్ధించా! ఇక ఒక క్షణం ఆలస్యం చేయకుండా సరా సరి అన్నయ్య ఉన్న హాస్పిటల్ కి చేరుకొన్నా.

************************

భగవంతుడు నా మొర ఆలకించాడు. అన్నయ్య కొద్ది కాలంలోనే కోలుకొన్నాడు. ఆ యిల్లును ఖాళీ చేయించి అన్నయ్య, వదినను, అమ్మతో సహా శాశ్వతంగా నా యింటికి అదే మా యింటికి తీసుకొచ్చేసా. ఇపుడు మా కుటుంబం అనుబంధాలతో అల్లుకొన్న హరివిల్లు.

*****

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు