జీవన్మృతులు - పోడూరి వెంకట రమణశర్మ

jeevanasmrutulu

గత నలభై ఎనిమిది గంటలలో జలజ జీవితం లో అత్యంత దుర్భరమయిన దినాలు. ఆమెకి జరిగినదంతా తలుచుకుంటూ ఉంటె తెరలు తెరలు గా దుఃఖం వస్తూనే ఉంది.

*****

ఆమె భర్త ప్రభుత్వం లో చాలా సీనియర్ ఆఫీసర్. ప్రస్తుతం ఒక ముఖ్యమయిన శాఖకు మంత్రిగా ఉన్న తమ కులస్థుడి వద్దే సెక్రెటరీ గా చేస్తున్నాడు. రెండు మూడు జిల్లాలలో అతను కలెక్టర్ గా పనిచేసినప్పుడు ఆమె మహారాణి లా గడిపింది. జిల్లాలో జరిగిన అనేక ముఖ్య సమావేశాలకు భర్త తో పాటు ఆమె ని కూడా పిలిచి, సన్మానించేవారు. ఏవయినా పోటీలు జరిగితే బహుమతులు అవీ ఈవిడ చేతే ఇప్పించేవారు. జిల్లా అధికారి గా పని చేసిన రోజులు ప్రతీ సివిల్ సర్వీసు అఫీసర్ కి చాలా ఆనందించే సమయం. యువకులుగా ఉన్నప్పుడే జిల్లా అధికారిగా నియమిస్తారు. మంచి ఆశయాలతో, అవినీతి లేకుండా ప్రజల సమస్యలు తీర్చి మంచి పేరుప్రఖ్యాతులు గడించడం మామూలే. కానీ అసలు కథ ఆ నియామకం కాలం గడిచిన తరువాత ప్రమోషన్ మీద డిపార్టుమెంటల్ హెడ్స్ గానూ, కొన్ని శాఖలకు అధిపతులగానూ నియమింప బడిన తరువాత ప్ర్రారంభ మవుతుంది .

జిల్లాలో ఉన్న వైభవం హెడ్ క్వ్వార్టర్స్ లో ఉండదు. అప్పుడు వాళ్ళు రాజకీయ నాయకుల కను సన్నలలో పనిచేయాలి. మంత్రి మారగానే, తన శాఖ లో ఉన్న సెక్రటరీలని మార్చేయడం తరచూ జరుగుతుంది. తనకి కావలసిన పనులు అడ్డు లేకుండా చేయించుకోవడానికి, సాధారణంగా ఆ మంత్రులు తమ కులస్తుణ్ణి తెచ్చుకుని వ్యవహారం నడుపుతారు. ఇది దృష్టి లో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం సర్వీసులలో సెలెక్ట్ చేసుకున్న తరువాత చాలా మటుకు ఆఫీసర్లని వారి స్వరాష్ట్రం లో కాకుండా ఇతర రాష్ట్రాలలో వేస్తారు. చాలా మంది ఇలాటి వారే ఉంటారు సెక్రెటరీలు గా. కానీ ప్రతి శాఖలోనూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ లే కాకుండా మిగతా వాళ్లు కూడా ఉంటారు. జాయింట్ సెక్రెటరీ, డెప్యూటీ సెక్రెటరీ లాటి వాళ్ళు రాష్టం సర్వీసులో రిక్రూట్ అయి ప్రమోషన్లమీద ఉన్నత పదవులకు వస్తారు. ఇలాటి వాళ్ళు ముఖ్యం గా రాజకీయ ప్రాబల్యం తో ఎదుగుతారు.

రాజకీయ వేత్తలు మారగానే వీళ్ళని కూడా, కుల, రాజకీయ ప్రాతిపదిక మీద మంత్రులు మార్చు కుంటూ ఉంటారు. మంత్రిగారి అడుగులకు మడుగులోత్తె ఆఫీసర్లు అందరూ స్వకులస్తులే అనుకోనక్కరలే. అవినీతి కి అలవాటు పడిన ఆఫీసర్ ఏ రాష్ట్రం వాడయినా కొందరు మంత్రులు చేర తీస్తారు. ఇలా సెక్రెటరీలని మార్చడం అవినీతి కోసమే అనుకోనక్కరలేదు. కొందరు మంత్రులు ప్రజాసేవ నిజాయితీ గా చేయ దలచుకున్నప్పుడు, మచ్చ లేని ఆఫీసర్లని తెచ్చుకుని నియమించుకుంటారు.


జలజ భర్త జిల్లాలో పనిచేసినప్పుడు మంచి పేరే తెచ్చుకున్నాడు. కానీ సెక్రెటరీ హోదా లో రాజధాని కి వచ్చిన తరువాత మడి కట్టుకోవడం మానేశాడు. స్వామి కార్యం తో పాటు, స్వకార్యం కూడా చేసుకుంటూ అడ్డంగా సంపాదించాడు. అలా సంపాదించేవాళ్ల జీవన శైలికీ , వాళ్ళకి ఉద్యోగపరంగా వచ్చే ఆదాయానికి సరిపడే జీవన శైలి కీ చాలా తేడా ఉటుంది. ఖరీదయిన , కార్లు, అపార్టుమెంట్లూ, ప్రీమియర్ క్లబ్స్ లో సభ్యత్వాలూ, నగలూ, ఒక స్థాయి దాటిన తరువాత బినామీ ఆస్తులు, దేశంలో అనేక చోట్ల లాకర్లూ - ఇలా ఊపిరి తీసుకోకుండా పరుగెడుతూనే ఉంటారు.

జలజ భర్త విషయంలో కూడా అదే జరిగింది. తమ కులానికి బలం ఉన్న పార్టీ అధికారం లోకి రాగానే, జలజ భర్తని ఓ ముఖ్య శాఖకు అధిపతిగా ఉన్న అదే కులానికి చెందిన మంత్రి తన దగ్గరికి, శాఖ మార్పించి తెచ్చుకున్నాడు. అదే కులానికి చెందిన ఇతర మంత్రులు, అవినీతికి దూరంగా కొంత మంచి పని చేయడానికి ప్రయత్నిస్తుంటే, ఈయన మాత్రం మళ్ళీ అవకాశం రాక పోవచ్చని, తాను మంత్రి అవడానికి ఖర్చుపెట్టిన డబ్బు, మళ్ళీ ఎన్నికలకి కావలసిన డబ్బు సమకూర్చుకోవడం కోసం ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. జలజ భర్త కూడా ఉడుకు రక్తం చల్లారిన తరువాత మిగతా సహా ఉద్యోగుల్ని చూసిబాగా సంపాదించాడు.

రెండు రోజుల క్రితం మామూలుగానే తెల్ల వారింది. జలజ వాళ్ళు ఉంటున్నది ఒక గేటెడ్ కమ్యూనిటీ కాంప్లెక్స్ లో విల్లా. కాంప్లెక్స్ లో అందరూ సీనియర్ ఆఫీసర్లూ, వ్యాపారవేత్తలూ విల్లాలు కొనుక్కున్నారు . ఉదయాన్నే సెక్యూరిటీ వాడు ఫోన్ చేశాడు. చాలా గవర్నమెంట్ వాహనాలు తమ విల్లా వైపు వస్తున్నాయని. జలజ హడావిడి గా భర్తని లేపింది. అంత క్రితం రోజే క్యాంపు నుంచి వచ్చి లేటు గా పడుకున్నాడు. అతను లేచి బట్టలు వేసుకోగానే బిల బిల మంటూ ఇన్కమ్ టాక్స్ వాళ్ళూ, అవినీతి శాఖ వాళ్లూ ఒకే మాటు విరుచుకు పడ్డారు. ఇల్లంతా తిరగదోడి, డబ్బూ, కాగితాలూ అన్నీ ఒక చోట చేర్చడం, జలజ భర్త ని ఏవో అడిగి సంతకాలు చేయించు కోవడం జరుగుతూ ఉండగా, టీవీ లో బ్రేకింగ్ న్యూస్లు, స్క్రోలింగ్ న్యూస్ లో ప్రారంభం అయ్యాయి. ఇంటిముందు కాంప్లెక్స్ లో జనం, పబ్లిక్ జనం మూగారు. మధ్యాహ్నానికి, కొన్ని ఆధారాలు చూపించి అరెస్ట్ చేసి తీసుకు పోయారు.

ఇంత గొడవలోనూ ఒక మాటు లోపలికి వచ్చి జలజ తో భర్త మెల్లగా మాట్లాడాడు. వీళ్ళకి దొరికింది చాలా తక్కువనీ, బినామీ పత్రాలూ అవీ వాళ్లకి దొరకనంతకాలం వర్రీ లేదనీ, ఏ లాకర్లు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియదనీ ధైర్యం చెప్పాడు. దీని లో తన మంత్రి మీద ఎదో రాజకీయ కుట్ర జరుగుతోందని, అతని గురించి వివరాలకోసం, కాగితాల కోసం. తన ఆఫీసు కూడా చెక్ చేస్తారనీ చెప్పాడు. కానీ సాయంత్రానికి అరెస్ట్ చేసి తీసుకు పోయారు. ఇన్నాళ్లు కూడ బెట్టినదంతా ఒక్క మాటు పోయిందని ఇద్దరూ మనసులో చాలా మధన పడ్డారు. అరెస్ట్ చేసి తీసుకు వెళ్లేముందు భార్య తో మాట్లాడడానికి సమయం తీసుకుని, తాను వెళ్లిన తరువాత ఏమి చేయాలో అన్నీ వివరం గా చెప్పాడు. ముందు అదే ఊళ్ళో ఉన్న ఆమె చెల్లెలినీ , భర్త నీ వచ్చి సాయంగా ఉండమని కోరామన్నాడు . గతంలో ఇలాగ రైడ్ లో పెట్టుబడి బయట పడిన ఆఫీసర్ల ఫోన్ నంబర్లు ఇచ్చి ఎలా బయట పడాలో కనుక్కోమన్నాడు. ఎంత ఖర్చు అవుతుందో కూడా వివరంగా కనుక్కోమన్నాడు. జలజ కూడా చదువుకున్నదే కాబట్టి ఆ సమాచారం సంపాయిస్తుందన్న ధైర్యం అతనికి ఉంది.


******

గత రెండు రోజులలోనూ భర్త చెప్పిన ఆఫీసర్ల ను కలుసుకుని, వాళ్ళు చెప్పిన అడ్వకేట్లను కలిసి చేయవలిసిన వన్నీ చేసింది. అడ్వొకేట్లు చెప్పినది ఏమిటంటే ఇది తప్పని సరిగా ఎవరో వెనుక ఉండి చేయించినదే అయి ఉంటుందన్నారు . ఆ వెనుక ఉన్నది ఏ స్థాయి వాళ్ళు అన్నదాని బట్టి ఖర్చుఉంటుందని తేల్చారు. ఎన్నాళ్ల లో బైలు దొరుకుందన్నది కూడా దాని బట్టి ఉంటుందని, ఖర్చు చేస్తే జరగనిది లేదనీ ధైర్యం చెప్పారు. మూడో రోజు మధ్యాహ్నం ఆమె చెల్లెలి భర్త కనుక్కుని వచ్చి చెప్పాడు. ఆ సాయంత్రం జలజ వెళ్లి ఆయనని జైలులో కలవ వచ్చని చెప్పాడు.

ఈ రెండు రోజులూ జైలులో ఎలా గడుపుతున్నాడో అన్న ఆలోచనలతో ఆమె చాలా బాధ పడింది. ఎప్పుడూ ఖరీదయిన ఆహారానికి అలవాటు పడిన అతను జైలు లో ఎలాంటి ఫుడ్ పెడతారో ఏమిటో అని చాలా బాధ పడింది. డబ్బుతో జరగనిది లేదని ఆమెకు తెలియదు. సాయంత్రం డ్రైవర్ ని రమ్మని, ఎక్కడికి వెళ్ళాలో ఏమిటో అన్నీ మరిది ని కనుక్కుని బయలుదేరింది. దారిలో పుల్లారెడ్డి షాప్ కనపడగానే డ్రైవర్ ని ఆపమని చెప్పి లోపలికి వెళ్ళింది. కొద్దిగా నయినా తన భర్త ఇష్ట పడే స్వీట్ తీసుకు వెళ్లాలనిపించింది ఆమెకి. మరీ పెద్ద గా పాకెట్ ఉంటె జైలులో అందరి దృష్టీ పడుతుందని ఒక రెండు వందల గ్రాములు పేక్ చేయమంది. వాళ్ళు మామూలుగా వాళ్ళ షాపు పేరు కనపడే పేక్ లో ఇచ్చారు. ఆ లేబుల్ జైలులో బయటికి కనపడటం ఆమెకి ఇష్టం లేక, కౌంటర్ లో ఉన్నవ్యక్తిని ఒక న్యూస్ పేపర్ ఇమ్మంది. అతను వెనక్కి తిరిగి అక్కడ రేక్ లోంచి ఓకే పాత పేపర్ తీసి ఇచ్చాడు. పైన దుమ్ము ఉందని లోపలి పేపర్ తీసుకుని స్వీట్ పేకెట్ చుట్టూ చుట్టి పట్టుకు వెళ్ళింది.

జైలులో ఆమె ఊహించిన దానికంటే చాలా బాగుంది. సినిమాలలో చూపించినట్టు గా లేదు. ఆమెని ఒక్కత్తినే కలవడానికి ఏర్పాటు జరిగింది. భర్త కూడా అంత డీలా పడిపోయి లేడు. ఆమె ద్వారా లాయర్లు చెప్పింది విన్న తరువాత, మళ్ళీ కొన్ని ఆదేశాలు ఇచ్చాడు. ఆమెకి. మంత్రి తో టచ్ లో ఉన్నాననీ, త్వరలో బయట పడి కేసు నిఎదుర్కొంటానని ధైర్యం చెప్పాడు. కాసేపు మాట్లాడుకున్న తరువాత జలజకి తాను తెచ్చిన స్వీట్ గుర్తుకు వచ్చి అతనికి ఇచ్చింది. ఏమిటి ఇది అంటూ పేపర్ తీసి లోపల స్వీట్ చూసి నవ్వి, "ఈ గొడవలో ఇది నీకు గుర్తు ఎక్కడుంది?" స్వీట్ నోట్లో వేసుకుని చేతిలో ఉన్న పేపర్ పక్కన పెడుతూ అన్నాడు. పేపర్ పక్కన పెడుతున్న క్షణం లో అతని దృష్టి ఆ పేపర్ లో వచ్చిన ఒక అవినీతి కేసు కథనం బొమ్మలతో కనపడగానే చేతిలోకి మళ్ళీ తీసుకుని పైకి చదివాడు. భార్య కూడా వింటుందని

అందులో కథనం ఒక చిన్న తరగతి ఇంజనీర్ గురించి. అవినీతి శాఖ వారు ఒక ఇరవయి వేలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడిన ఉదంతం. అతను అవమానం భరించలేక ఆ సాయంత్రమే ఆత్మా హత్య చేసుకున్నసంఘటన ఫోటోల తో సహా వేశారు. వ్యాస కర్త సంగ్రహించిన కొన్ని అభిప్రాయాలు కూడా అందులో ప్రచురించారు. చాలా మంది అతని మీద సానుభూతి తో గౌరవం గా మాట్లాడారు. కోట్లు తో పట్టుబడిన ఆఫీసర్లు, కాంట్రాక్టర్లూ, ప్రజలలోనూ, బంధువర్గం లోనూ ఇలా పట్టుబడినప్పుడు జరిగిన అవమానం పట్టించు కోకుండా, అక్రమం గా సంపాదించిన డబ్బుని సేవ్ చేసుకోవడంలోనూ, జడ్జీలకు కూడా లంచం ఇవ్వడానికి ప్రణాళికలు వేశే వాళ్లతో పోలిస్తే ఆ చనిపోయిన ఇంజినీరు చాలా ఉత్తమ మయిన వాడని సాబునుభూతి గా మాట్లాడారు. అంటే అవినీతి కేసులో పట్టుబడిన వాళ్ళు ఆత్మా హత్య చేసుకోవాలని మీ ఉద్దేశ్యమా? అని విలేకరి ప్రశ్నించిన దానికి వాళ్ళు ఆ ఉద్దేశ్యం కాదనీ, కానీ అలాచేయడం సమాజం లో పరువు ప్రతిష్టలకు ఇచ్చే ప్రాధాన్యత ని చూపుతుందనీ చెప్పి, సమాజం లో పరువు ప్రతిష్టలను ఏమాత్రం పట్టించుకోకుండా అలా అవమానం జరిగినా ఏ మాత్రం మారని వాళ్ళు కూడా ఉండడం ఆశ్చర్య మని చెప్పారు

అది చదవాదం పూర్తి అవగానే ఇద్దరూ ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఉండిపోయారు. అతని చేతిలో స్వీట్ కింద పడిపోయింది

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు