అనుసరణీయం - వై.ఎస్.ఆర్.లక్ష్మి

anusaraneeyam

ఉదయం 6గంటలకు ఫోను మోగడం తో బద్దకం గా పడుకున్న మాధవ రావుకు మెలుకువ వచ్చింది. ఈ టైము లో ఎవరబ్బా అనుకుంటూ శ్రీమతి వంటింట్లో ఉండటం తో తప్పక తనే లేచి ఫోన్ తీసాడు.అవతల ఆయన ప్రాణమిత్రుడు రామారావు అమెరికా నుంచి."ఏమిటిరా? ఇంత ప్రొద్దున్నే చేసావు.?" అని అడిగాడు.

"అవన్నీ నేను వచ్చాక చెబుతాను కాని ముందు మా ఇంట్లో అద్దెకున్నవారిని ఖాళీ చెయ్యమని చెప్పి, ఇల్లు శుభ్రం చేయించు.. మేము 1,2 నెలల్లో వచ్చేస్తాము" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

ఏమిటో ఇంత హఠాత్తుగా వస్తానంటున్నాడు అని ఆలోచిస్తూ కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ టిఫిను ముగించుకొని నాలుగిళ్ళ అవతల ఉన్న రామారావు ఇంటికి వెళ్ళాడు. ఆళ్ళతో పరిచయం ఉండటం తో విషయం చెప్పి ఆ మాట ఈ మాట మాట్లాడి ఇంటికి వచ్చి భోజనం చేసి నడుము వాల్చాడు. రామారావు గురించి ఆలోచించ సాగాడు.

+++++++++++++++++++

రామారావు పంచాయితీరాజ్ లో ఏఇ గా చేసి రిటైరు అయ్యి నాలుగేళ్ళు అవుతోంది.ట్రాన్స్ఫర్లతో అక్కడక్కడ తిరిగినా ఈ కాలనీలోనే ఉన్న సొంత ఇంట్లో స్థిరపడ్డాడు.రెండేళ్ళు బాగానే ఉన్నాడు.ఒకరోజు షడన్ గా వచ్చి పిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండమని గొడవ చేస్తున్నరు వెళుతున్నామురా అని చెప్పాడు.రామారావుకి ఇద్దరు కొడుకులు.పెద్దవాడు డిల్లీ లో ఉన్నతోద్యోగం లో ఉన్నాడు.చిన్నవాడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు.కోడ్ళ్ళు కూడ ఉద్యోగాలే .ఇద్దరికీ ఇద్దరేసి పిల్లలు.చిన్న కొడుకు రెండో పిల్లాడు డేకేర్ కు వెళుతున్నాడు కాని మిగిలిన ముగ్గురు స్కూల్కి వెళుతున్నారు.వారం పదిరోజుల్లోనే పెద్ద వస్తువులన్నీ అమ్మేసి మిగిలిన వాటిని ఒక గదిలో వేసి తాళం పెట్టి మాధవరావుకి ఇచ్చి వెళ్ళిపోయాడు.అలా వెళ్ళినవాడు ఇదిగో ఇప్పుడే ఇలా ఫోన్ చెయ్యడం.

అద్దెవాళ్ళు ఖాళీ చేయడం తో మాధవరావు వాళ్ళ పని అమ్మాయితో ఇల్లంతా శుభ్రం చేయించి సామాను సర్ధించి వచ్చాడు.చెప్పినట్లుగానే మరుసటి నెలలోనే రామారావు దంపతులు వచ్చారు.బడలిక తీర్చుకోవడం ,అన్నీ అమర్చుకోవడానికి వారం పదిరోజులు పట్టింది.కాస్త తీరిక దొరికాక మిత్రులిద్దరూ కాలనీలోని పార్కులో కూర్చున్నారు.పిచ్చాపాటి మాటలయ్యాక,"ఇప్పుడు చెప్పరా ఏమి జరిగిందో ?"అని అడిగాడు మాధవరావు.

"ఏమి చెప్పనురా?"అని దీర్ఘం గా ఒక ంట్టూర్పు విడిచాడు రామారావు.

"పిల్లల దగ్గరే ఉండిపోతామని వెళ్ళారుగా!ఎందుకు అర్ధాంతరంగా వచ్చేసారు."

"వృధ్ధాప్యం లో మా అమ్మానాన్న మా దగ్గరే ఉండటం నీకు తెలుసుగా"

"తెలుసు.అయితే?"

"వాళ్ళకు నేనొక్కడినే కొడుకుని.మా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నా మధ్యలో ఒక వారం వెళ్ళినా ఇక్కడే ఉండేవారు.నడవ గలిగిన రోజుల్లో దగ్గర్లోని గుడికి వెళ్ళేవారు.అక్కడ ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ ఉండేది.మా పిల్లలు కూడా ఖాళీ సమయాల్లో వారి దగ్గర చేరేవారు.కాశీమజిలీ కధలు,రామాయణ,మహాభారత ,పంచతంత్రము ఇవన్నీ నిద్ర పోయే వరకు చెప్పించుకునేవారు.మా బంధువులు కూడా చుట్టు పక్కల ఊళ్ళలో ఉండటం తో వచ్చి పోతూ ఉండేవారు.మీ చెల్లెలు కూడా వాళ్ళతో కబుర్లు చెప్పేది.ఒంటరితనం వాళ్ళను ఎప్పుడూ బాధించ లేదు.చివరి వరకు ఆనందం గా గడిపారు."

"ఇప్పుడు ఆ సొద అంతా ఎందుకురా?నువ్వెందుకు వచ్చావని నేను అడుగుతుంటే!"

"అక్కడకే వస్తున్నా! మేము పిల్లల దగ్గర ఉందామని వెళ్ళామా?పెద్దాడు ఢిల్లీ.పెద్ద నగరం.రెండోవాడు అమెరికా. కొడుకులు,కొడళ్ళు నలుగురూ ఉద్Yఓగాలు.చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది.మనవళ్ళు స్కూల్స్.చిన్న మనవడు కి రెండేళ్ళే!వాడిని ఇంట్లో ఉంచమన్నా అలవాటు తప్పుతుందని డే కేర్ కి పంపిస్తారు.ప్రొద్దున 7.30-8.00 గంటల మధ్య వెళితే సాయంకాలం వచ్చేటప్పటికి 6.00-6.30 అవుతుంది.రాగానే ఆరోజు డిన్నర్ మర్నాటికి రెడీ చేసుకోవడం ,ఉదయమే లేవాలని 9.00 గంటల కల్లా పడుకుంటారు.మాకేమో నిద్ర పట్టదు.టివి పెట్టుకుందామంటే వాళ్ళకి డిస్టర్బెన్స్. కొంచెం ముందు వస్తారు కాని వాళ్ళ హోం వర్క్ చేసుకోవడం,ఏ కొంచెం సమయమున్నా టాబ్లెట్ లలో గేంస్ ఆడుకోవడంతో సరిపోతుంది.శని,ఆదివారాల్లో పిల్లల్ని డాన్స్,సంగీతం,డ్రాయింగ్,కరాటే,స్విమ్మింగ్ అంటూ ఏవో క్లాసులకు తిప్పుతూనే ఉంటారు.పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు మాకు అర్ధం కాదు.రోజంతా నాలుగైదు పొడి మాటలు తప్ప మిగతా సమయమంతా మౌనవ్రతమే.చేయడానికి పనీ ఉండదు.వాళ్ళే పొద్దున్నే చేసుకొని బాక్సులు పట్టుకు వెళతారు.లేదంటే బయట తెచ్చుకు తింటారు.అవి మాకు పడవు.మీ చెల్లెలు చేసేవి వాళ్ళకు నచ్చవు.వాళ్ళు తీసుకొని వెళితే తప్ప ఎక్కడకీ వెళ్ళలేము.బంధువులు ఎవరూ కనిపించరు.ఇందులో వారిని తప్పు పట్టే పనిలేదు.ఇప్పటి పిల్లల పోకడ అలా ఉన్నది.అందరితో పోటీ పడాలనే తపనే వాళ్ళను అలా తయారు చేస్తోంది.ఇక అక్కడ ఇమడ లేమని వచేసామురా!"

"మంచి పని చేసారురా!మీ అమ్మానాన్నల అప్పటి పరిస్థితులు వేరు.ఈ బిజీ లైఫ్ వేరు.పదవీ విరమణ చేయగానే పిల్లల దగ్గరకు వెళ్ళి ఉండక్కరలేదు.ప్రశాంతం గా జీవించడానికి ఎన్ని దారులు లేవు.మన లాంటి ఎంతోమంది ఈ పార్కుకు వస్తూ ఉంటారు.దగ్గర్లొ గుఇదింగ్ ఉన్నది,లైబ్రరీ ఉన్నది.నువ్వు ఇప్పటి వరకు ఉన్న బిజీ తో ఖరచి పోయిన హాబీలను ఇప్పుడు నెరవేర్చుకో! మీ బంధువులు వచ్చి వెళుతుంటారు.అనుబంధాలకు,ఆత్మీయతలకు పిల్లలు పరిస్థుతుల వల్ల దూరం అవుతున్నారు.మనం చేజేతులా దూరం చేసుకోవడం ఎందుకు.ఎప్పుడొ ఒకసారి ఫోన్ లో హలో అనే కంటే కలసి మాట్లాడుకోవడం లోని ఆనందం నీకు నేను చెప్పక్కర లేదు.ఇక్కడ మీఅంతట మీరు ఎక్కడకైనా వెళ్ళి రాగలరు.ఏ మాత్రం ఓపికున్నా స్వతంత్రం గా జీవించడం లోని ఆనందం ఇంకొకరి మీద ఆధారపడినప్పుడు ఉండదు.అది పిల్లలైనా సరే!మరీ కదలలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొకరి మీద ఆధారపడక తప్పదు. నువ్వే ఆలోచించు."

"నిజమేరా నువ్వు చెప్పింది.నువ్వు ముందు చూపుతో చెప్పిన దానిని నేను అనుభవం తో కాని గ్రహించలేకపోయాను.ఇది మనలాంటి వారందరూ తెలుసుకోగలగాలి."

"పోనీలే ఇప్పటికన్నా తెలుసుకున్నావు.సంతోషం".

ఈద్దరూ ఎవరి ఇళ్ళకు వాళ్ళు బయలుదేరారు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు