జాము రాత్రి గడిచినా వాలుకుర్చీ లో కూర్చొని తదేకంగా ఆలోచనలో పడ్డాడు పురుషోత్తం
భార్య పోయాక ఒంటరి బతుకైపోయింది
పేరుకు కొడుకు,కోడలు,పిల్లల్తో ఉన్నా ఎవరితోవ వారిదే కొడుకుకోడలు ఆఫీసుకి పొతే పిల్లలేమో స్కూళ్ళకి తను మాత్రం ఒంటరిగా...
వారాంతపు సెలవు రోజుల్లో పిల్లల్తో కొడుకు,కోడలు ఎటైనా వెళ్తే వాలు కుర్చీలో ఒంటరిగా తను...
ఈ ఒంటరి తనాన్ని భరించలేక తానూ భార్యతో పాటు పోయుంటే బాగుండేదని చాలాసార్లు అనుకున్నాడు .
కానీ మన చేతుల్లో లేదుగా అని ఎన్నో సార్లు సమర్ధించుకున్నాడు...
ఉదయం జరిగిన సంగతే మనసులో మరీ మరీ తిరుగాడుతోంది.
ఈ వీకెండ్ కిట్టీ పార్టీ మనింట్లో...
అసలే పిల్లల్తో చేసుకోలేక చస్తూంటే ఈ ముసిలి ఘటం ఒకటి నా పీకలమీదికి....
ఎలాగైనా నేను చెప్పిన పని గుర్తుంచుకొని చెయ్యండి..
సరేలే ఆలోచిద్దాం అన్నాడు రవి .
ఆలోచించడం కాదు ఎలాగైనా ఆ ఫారాలూ అవీ తెచ్చి మీ నాన్నని ఆశ్రమం లో చేర్చండి అంది అది విన్న మొదలూ పురుషోత్తం ఆలోచనలకి అంతులేక పోయింది .
....
తెల్లారగానే తన పనులన్నీ ముగుంచుకుని కొడుకుకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు
రెడీయా నాన్నా ..! పదా బోల్డెన్ని పనులున్నాయి ...!అంటూ కారుకేసి పరుగు లాంటి నడకతో బయల్దేరాడు రవి .
వెనకనే భారంగా కదిలాడు పురుషోత్తం.....
....
కారు కస్తూరిబా శరణాలయం ముందాగింది .
కిటికీలోంచీ చుట్టూ చూసి కారు దిగాడు.
నువ్విక్కడేవుండు నాన్నా..! నేనిప్పుడే వస్తా అంటూ రవి లోనికెళ్లాడు. చేసేదిలేక అరుగుమీద కూర్చొని అటూ,ఇటూ గమనించాడు ,
ఎదో పాత జ్ఞాపకాలు....
అటుగా వెళ్తున్న రంగమ్మ పురుషోత్తంని చూసి....
" గుర్తున్నానా....? బాబుగారూ " అంటూ పలకరించింది.
" ఆ..లేకేం .. " అంటూ రంగమ్మతో పిచ్చా,పాటి మాటల్లో పడిపోయాడు పురుషోత్తం.
ఫారాలు అవీ నింపి ఓ అరగంట తర్వాత చేరుకున్న రవి తండ్రి ఆయాతో కులాసాగా మాట్లాడుతుంటే తనపని అయిపోయినట్టు ఫీలయ్యి " పద నాన్నా తొందరగా " అంటూ లోనికి దారి తీసి అక్కడున్న మేనేజర్ కి అప్పగించి అమ్మయ్యా..! అనుకోని వెనుదిరిగాడు రవి. వస్తుంటే ఎందుకో రంగమ్మ గుర్తొచ్చింది రవికి.
అమ్మ పోయినదగ్గరినుంచీ ఎవరితోనూ మాట్లాడని నాన్న ఇంతసేపు రంగమ్మతో ఎం మాట్లాడాడో అనుకుంటూ అదే ప్రశ్నగా రంగమ్మని అడిగాడు " యేమ్మా....! ఆయనేదో పరిచయస్తుడిలా అంతసేపు మాట్లాడవు....ఏమంటాడేమిటి? "
" నా మీదేమైనా చెప్పాడా ఆ ముసిలోడు ? " అన్నాడు రవి .
రంగమ్మ సమాధానంతో దిమ్మ తిరిగినట్లయింది రవికి
" లేదు బాబూ...! ఓ ముప్పయేళ్ళయ్యిందనుకుంటా ఆయన్ని చూసి ఓ రోజు నీలాగే వచ్చాడు. ఎవరైనా ఓ రెండు,మూడేళ్ళ మగ పిల్లవాడు కావాలి పెంచుకోడానికి , అని తనకి పిల్లలులేరని ఆవిడ ఊరికే గొడవ పెడ్తుంటే భరించలేక వచ్చానని అన్నాడు , పెంచుకోడానికి ఓ మగ పిల్లాడ్ని తీసుకెళ్తూ నాకో ఐదొందలు ఇచ్చిన ధర్మాత్ముడు , పెంచుకున్న బిడ్డ యేమయినాడో మరి ఇన్నాళ్ళకి యిలా యిక్కడ కనిపించాడు , పగోళ్లకి కూడా యిలాంటి పరిస్థితి రాకూడదు బాబూ " అంది .
విన్న రవికి పోగొట్టుకున్నదేంటో అర్ధమైంది... యిక్కడ పెరగ వలసిన తనకి అన్నీ యిచ్చిన మహానుభావుడికి తనిచ్చిన కానుక యిదా ? అనుకుంటూ కారు వైపు నడిచేడు .
ఎక్కడో మైకులో వస్తున్న ' ఇంతేరా యీ జీవతం తిరిగే రంగుల రాట్నము ' అనే పాట వినిపించే అవకాశం లేదు ఎసి కారులో వున్న రవికి .