సుబ్బారావు ఓ చిన్న గ్రామంలో వుంటుంటాడు. సరుకులు తెచ్చుకోవడానికి ప్రతీ ఆదివారం పట్నం కాలినడకన వెళ్ళొస్తుంటాడు. గ్రామానికి, పట్నానికీ మధ్య చిన్న అడవి వుంది.
అనుకోకుండా ఆ వారం చీకటి పడిపోయింది. అడవి మార్గం... ఎవరన్నా తోడు దొరికితే బాగుండునని చూస్తుండగా ఓ ఆసామి వెనకనుండి రావటం గమనించి ఆగాడు.
"హమ్మయ్య ఎవరైనా జత దొరికితే బాగుండునని చూస్తున్నాను. మీరొచ్చారు" అన్నాడు సుబ్బారావు.
"దేనికండీ... నేను రోజూ ఈదారిలోనే వెళ్తుంటాను. ఐనా మీకు జతదేనికి?" అడిగాడు ఆసామి.
"ఈ అడవిలో దెయ్యాలున్నాయని విన్నానండీ... నన్ను పీక్కుని తింటాయేమోనని..." నసిగాడు సుబ్బారావు.
"హవ్వ... దయ్యాలు పీక్కుని తింటాయా?" నవ్వాడు ఆసామి.
"అలా నవ్వకండి... నేను చెప్పేది నిజం! దయ్యాలు చాలా చెడ్డవి... మనుషుల్ని పీక్కుతింటాయి!"
"అలా ఏమీలేదు లెండి. కొన్ని మంచి దెయ్యాలుంటాయిగా..." వ్యంగ్యంగా అన్నాడు ఆసామి.
"నేనస్సలు ఒప్పుకోను" నిక్కచ్చిగా చెప్పాడు సుబ్బారావు.
"మీరొప్పుకుంటారు" అన్నాడు ఆసామి.
"ఎలా?" అడిగాడు సుబ్బారావు.
"మీ ఊరొచ్చింది. ఇప్పటిదాకా మీకు జతగా అడవి దాటించింది నేనే" అంటూ ఆసామి 'దెయ్యం' గా నిజస్వరూపం దాల్చాడు.
కెవ్వ్... మని సుబ్బారావు పలాయనం చిత్తగించాడు. (మంచి దెయ్యం కూడా ఉంటుంది అన్నమాట అనుకుంటూ...)