ప్రయత్నం - ఆదూరి హైమవతి

prayatnam

కామేశం , రామేశం స్నేహితులు.బాగా చదువుకుని బి.ఏ పాసయ్యారు.మధ్యతరగతి కుటుంబీకులు ఐనందున పైచదువులు చదువలేక ఉద్యోగంకోసం ప్రయత్నాలు మొదలెట్టారు.ఎన్ని ఇంతర్వూల కెళ్ళినా ఉద్యోగాలు దొరకలేదు. ఎం.ఏ , ఎం.సి.ఏ ఇంకా పెద్ద చదువులున్న వారికే ఉద్యోగాలు లేక ఊరికే ఉండగా తమకు కేవలం బి.ఏ తో ఏం ఉద్యోగo దొరుకు తుందో అర్ధంకాక,తిరిగి తిరిగి దేవాలయం అరుగు మీద కూర్చున్నారు ఇద్దరూ .

" ఏం దేవుడురా రామేశం?ఉన్న వారికే అన్నీ ఇస్తాడు, పైచదువులు చదువుదా మంటే డబ్బులేదు, చదివిన చదువుకు ఉద్యోంగం రాదు, దేవుడు కఠినుడురా!"అన్నాడు కామేశం దేవుడి మీద కోపంతో .

" ఔనురా ! మొక్కులు మొక్కే వారికే కోర్కెలు తీరుస్తాడు , మనలాంటి హుండీలో రూపాయైనా వేయలేని వారిని ఆయనెందుకు చూస్తాడురా? " అన్నాడురామేశం. ఎవరెవరు ఏ ఏ మొక్కులు మొక్కితే వారి కోర్కెలు ఎలా తీరాయని చెప్పా రో …ఇద్దరూ గుర్తు చేసుకుని చెప్పుకోసాగారు.

ఇంతలో సాయంకాలం కాగా పూజారి గుడి తలుపులు తీయను వచ్చి వారి మాటలన్నీ విన్నాడు.

" బాబూ ! మీ మాటలు విన్నాను. రెండు కప్పల కధ ఒకటి చెపుతా వినండి. --……….

' ఒక పల్లెలో ఒక రైతు ఇంట్లో పది పాడి ఆవులుండేవి, అవి పూష్కలంగా పాలిచ్చేవి.రైతు భార్య అమ్మినన్ని పాలు అమ్మి మిగిలిన పాలను కాచి పెద్ద బాన నిండా తోడుపెట్టి , ఆ పెరుగును మరునాడు చిలికి వెన్న దాచి , నెయ్యి చేసి అమ్మేది. ఆ పాలు , పెరుగు వాసనకు ,క్రిoదపడ్ద వెన్న తినను చీమలు ఆ ఇంట్లో చేరేవి. ఆ చీమలకోసం కప్పలు రాత్రిపూట ఇంట్లో దూరి దొరికి నన్ని చీమలను తిని విందు చేసుకుని వెళ్ళేవి.

ఒక రోజున రెండుకప్పలు ఆపెరుగు బాన వద్ద చీమలను తింటూ ఎగిరి పొరబాటున ఆపెరుగు బానలో పడిపోయాయి. అవి బయట పడే దారిలేక తమ దురదృష్టాన్ని తిట్టుకుంటూ, సహాయం చేయని దేవుని తిట్టుకుంటూ,గాలి ఆడక చనిపోయే స్థితికి రాగా,మొదటి కప్ప " మనం ఎగిరి బయట పడే ప్రయత్నం ఎందుకు చేయకూడదు?" అని ఎగర సాగింది.

రెండోకప్ప " ఇంత ఎత్తైన బాన నుండి ఈ చిక్కని పెరుగులో అడుగున ఉన్నమనం పైకెగరడం సాధ్యంకాదు వృధా ప్రయాస తప్ప, కరుణ లేని దేవుడు , మనల్ని ఇలా పడేసాడు." అంటూ దుఃఖిస్తూ ఏడ్చి ఏడ్చి మరణించింది.

మొదటి కప్ప చస్తే చస్తాను, ఎటూ చచ్చే దాన్ని నా ప్రయత్నo నేనెందుకు చేయకూడ దనుకుని ఆపెరుగు బానలో పై పైకి ఎగుర సాగింది.అలా ఎగరగా ఎగరగా ఆ పెరుగు ద్రవించి మజ్జిగగా మారగా, దానిలోని మీగడ వెన్న ముద్ద గామారింది. కప్పఆ పెద్దవెన్నముద్ద మీద కూర్చుని క్రిందికి దూకి ప్రాణం కాపాడుకుంది.

మన ప్రయత్నం చేయకుండానే దేవుని దూషించి పాపం మూట కట్టుకోడం తప్పుబాబూ! మీరు చదువు కున్నారు , తెలివి తేటలున్నాయి,శ్రమ చేయగల చావ ఉంది. మీరు ఆ కప్పకంటే ఉత్తములని నమ్ముతున్నాను.ఈ ఊర్లోని గుడుల్లో కొట్టేకొబ్బరికాయాల పీచు,డిప్పలు రోడ్లవెంట పడి వాతావరణ కాలుష్యం కలిగిస్తున్నాయి కదా! వాటిని ఉపయోగించి పని కొచ్చేవస్తువులు చేయించి అమ్మే ప్రయత్నం ఎందుకు చేయకూడదు?" అని చెప్పి పూజారి తన పని మీదవెళ్ళి పోయాడు.

రామేశం, కామేశం తెలివి తెచ్చుకుని ఆఊర్లోని కొబ్బరిపీచు, గుడుల్లోని కొబ్బరి డిప్పలు సేకరించి పట్నంలో అమ్మి , మెల్లిగా వాటితో డోర్ మ్యాట్స్, గోడలపై అలంకారవస్తువులు ,కొబ్బరి తీసిన డిప్పలతో డెకరేటివ్ పీసెస్ తయారుచేసే కుటీరపరిశ్రమ ప్రారంభించి,వ్యాపారం వృధ్ధి కాగా ఇంకా అనేక మందికి ఉపాధికల్పించి , వ్యాపారాభివృధ్ధిచేసుకుని , వివాహాలు చేసుకుని పిల్లాపాపలతో హాయిగా జీవించసాగారు..

ఎవర్ని వారు ఉధ్ధరించుకునే ప్రయత్నం చేయందే , తమ శక్తి యుక్తులను ఉపయోగించనిదే దేవుడైనా ఎలా సహకరిస్తాడు?

నీతి:- ఎవరి ప్రయత్నం వారు చేస్తే నే ఆపైన దేవుని సహాయం లభిస్తుంది.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు