మకర చీకట్లు - పోడూరి వెంకటరమణ శర్మ

makara cheekatlu

ఆదివారం ఫిబ్రవరి 24 ప్రొద్దుట అరుణ నిద్ర లేవగానే ఆ వేళ తన కొలీగ్ రమ్య మ్యారేజ్ రెసెప్షన్ కి వెళ్ళాలన్న సంగతి గుర్తుకు వచ్చింది. తాను తయారయిన తరువాత కూతురిని, భర్తని లేపుదామని, స్నానం చేసి బట్టలు కట్టుకుని, ఏ నగలు పెట్టుకోవాలో నిర్ణయించడం కోసం స్టీల్ బీరువాలో లాకర్ తెరిచింది.అందులో నగలు పెట్టెలు మూడూ కనపడక పోవడంతో ఒక్క మాటు ఆమెకి ఏమీ అర్థంకాలేదు. తాను బ్యాంకు లాకర్ లో తిరిగి పెట్టినట్టు గుర్తు లేదు. జనవరి 18న కూతురు పుట్టిన రోజు సందర్భంగా కత్రియా హోటల్ లో ఫంక్షన్ పెట్టారు. ఆ రోజు పెట్టుకోవడానికి బ్యాంకు లాకర్ నుంచి తెచ్చిన నగలు మళ్ళీ బ్యాంకులో పెట్టలేదు. ఎప్పటికప్పుడు బ్యాంకులో పెట్టేద్దామనుకుంటూనే అశ్రద్ధ చేసింది. బహుశా కళ్యాణ్ ఏమైనా పట్టుకెళ్లి పెట్టాడేమోనని గబ గబా వెళ్లిభర్తని లేపి అడిగింది. "ఏమిటి పొద్దున్నేగొడవ?" అంటూ లేస్తూ అతను ఏమిటనిఅడిగాడు విషయం అర్థం కాక. "బీరువా లాకర్ లో నగలు పెట్టెలు లేవు నువ్వుఏమయినా బ్యాంకు లో పెట్టావా ?" అంది ఆతృతగా. ఆమెకి మనసులో భయంగానే ఉంది. ఎందుకంటే అతను ఎప్పుడూ బ్యాంకు లాకర్ ఆపరేట్ చేయడు.

" సరిగ్గా చూశావా? నేను బ్యాంకులో పెట్టడమేమిటి?" అంటూ లేచి వచ్చాడు బీరువా దగ్గరికి.

ఇద్దరూ కలిసి మొత్తం బీరువా మధ్య అరలో ఉన్న లాకర్, బీరువాలో మిగతా ఆరలూ లో ఉన్నఅన్ని వస్తువులూ ఇవతలికి తీసి చూశారు. చిన్న వస్తువులు ఏమీ కాదు కదా. ఆమె నగలు పెట్టిన మూడు బాక్స్ లు ఉండాలి. ఒక్కటీ లేదు.

ఏడుపుకు తక్కువగా ఉంది ఆమె పరిస్థితి. పుట్టిన రోజు ఫంక్షన్ నుంచి వచ్చిన తరువాత బ్యాంకు లో పెడదామని అనుకుంటూనే అశ్రద్ధ చేసింది. అదే విషయం కళ్యాణ్ కి చెప్పింది.

" ఆశ్చర్యం గా ఉందే! మరి ఏమయినట్టు? ఇద్దరి మనసులూ పరిపరి విధాలా పోతూ ఉంటె ఆలోచనలో పడ్డారు

**************

అరుణ, సాయిరాంల వివాహమయి పది సంవత్సరాల పైన అయింది. ఇద్దరూ సాఫ్ట్ వెర్ ఉద్యోగులు. ఒక కూతురు పుట్టిన తరువాత మళ్ళీ పిల్లలు పుట్ట లేదు . వాళ్ళ సంసారంలో పొరపచ్చాలు ఏమీ లేకపోయినా, ఆర్ధిక వ్యవహారాలలో మాత్రం ఇద్దరూ భిన్న ధృవాలు. సంపాదించిన డబ్బును ఎక్కువ రిస్క్ తీసుకోకుండా దాచుకోవాలని అరుణ అభిప్రాయం. సాయిరాం మటుకు, సంపాదించిన డబ్బును తెలివితేటలతో వృద్ధి చేసుకోవాలనీ అతని అభిప్రాయం. వీటి దృష్ట్యా జరిగినదేమిటంటే అరుణ తను పొదుపు చేసిన మొత్తాన్ని బంగారంలో పెడితే, సాయరాం స్టాక్ మార్కెట్ లో పెట్టాడు. అతనికి కంపెనీల పని తీరు స్టడీ చేయడం చదువుకున్నప్పటి నుంచీ అలవాటు. దాని దృష్ట్యా అతను రిస్క్ తీసుకోకుండా బాగానే సంపాదించాడు. అరుణ మటుకు ఆమె పొదుపు చేసినదంతా బంగారం లో వివిధ వస్తువుల రూపంలో కొనిపెట్టుకుంది. ఎప్పుడయినా పెళ్ళిళ్ళకి, వాటికి బయటకు తీసినా, తన నగలన్నీఎప్పుడూ బ్యాంకు లాకర్ లోనే పెడుతుంది. ఈ మాటు తీసినపుడే ఎదో ఒకటి అడ్డం వచ్చి తీసినవి మళ్ళీ లాకర్ లో పెట్టడానికి. జాప్యం జరిగింది. డైమండ్ నేక్లేసులు, మిగతా పెద్ద ఆభరణాలు అన్నీ కలిపి పదిహేను ఇరవై లక్షలు విలువ ఉంటుంది

*******

ఆలోచనల లోంచి తేరుకుని కళ్యాణ్ అన్నాడు. ఎదో జరిగింది. నగలు మన చేతులు దాటి పోయాయి. అది ఎలా జరిగిందో చాలా ఆశ్చర్యంగా ఉంది.

ఒక ఫ్లోర్ కి రెండు ఫ్లాట్స్ చొప్పున నాలుగు అంతస్తుల భవనం లో ఉంది వాళ్ళ ఫ్లాట్ కళ్యాణ్ ఫ్లాట్ నాలగవ అంతస్తు లో ఉంది. వాళ్ళ ఫ్లాట్ కి ఎదురుగా ఉన్న రెండో ఫ్లాట్ లో ఉన్న దివాకర్, అతని భార్య రజని బ్యాంకు ఉద్యోగస్తులు. అరుణ, కళ్యాణ్ ల మాదిరే వాళ్ళు పూర్తిగా ఇంట్లో ఉండేది ఆదివారాలు మాత్రమే. కళ్యాణ్ మనసు లో అనేక రకాల ఆలోచనలు వచ్చాయి. మొదటి అతని ఆలోచన పనిమనిషి రంగమ్మ మీదకి పోయింది. ఆమే ఒక్కత్తే వాళ్ళ ఇంట్లో అన్ని గదుల్లోకి వెళ్లి పని చేస్తూ ఉంటుంది. అయిదేళ్ల నుంచీ పని చేస్తోంది. ఎప్పుడయినా డబ్బు కానీ, విలువయిన వస్తువులు కానీ ఇల్లు ఊడిచే సమయంలో ఆమె చూస్తే వాటిని ఆమె ఎప్పుడూ అరుణకు ఇవ్వడం కద్దు. భర్త అకాల మరణంతో ఇద్దరు పిల్లలిని కష్టపడి చదివించుకుంటోంది. మిగతా వాళ్లు ఎవరూ- అంటే పాలు పొసే రాజమ్మ, సెక్యూరిటీ వాళ్ళు ఎవరూ లోపలికి రావడం ఉండదు. ఇద్దరికీ, అన్నినగలూ రంగమ్మ కాజేసిందని అనుకోవడానికి మనసు రావడం లేదు. ఇద్దరికీ, నగలు ఏమయిపోయాయన్న విషయం అంతు పట్టకుండా పోయింది.

ఒక గంట తరువాత కళ్యాణ్ అన్నాడు. "మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే మంచిది" వాళ్ళు పట్టుకోదలుచుకుంటే అయిదు నిమిషాలలో పట్టేస్తారు అన్నాడు.

"మామూలుగా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు శ్రధ్ధ వహిస్తారని నాకు అనిపించటం లేదు. ఏదయినా గట్టి రికమెండేషన్ లేకుండా వాళ్ళు పట్టించుకోరు" అంది ఆలోచిస్తూ అరుణ. ఆమెకి తన క్లాస్ మేట్ సుగుణ గుర్తుకు వచ్చింది. సుగుణ వాళ్ళ నాన్నగారు చాలా సీనియర్ పోలీసు అధికారి. చాలా నిజాయతీ ఆఫీసర్ అని పేరు. ఇద్దరూ కలిసి వెంఠనే సుగుణ కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లి కలిశారు. వివరాలు చెప్పి సహాయం చేయమని అడిగారు. వెంఠనే సుగుణ వాళ్ళ ఇద్దర్నీ తీసుకుని ఆమె తండ్రి అర్జున్ రావు గారి దగ్గరికి తీసుకు వెళ్ళింది . ఆయన మొత్తం అంతా విని చెప్పినదేమిటంటే అరుణ వాళ్ళని వెంఠనే వాళ్ళ ఇల్లు ఏకే నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఉంది కాబట్టి ముందు అక్కడికి వెళ్లి రిపోర్ట్ ఇమ్మన్నారు. ఆ స్టేషన్ కి ఫోన్ చేసి అక్కడ సీఐ తో మాట్లాడారు.

మామూలుగా కాకుండా వేరే ఒక స్పెషల్ ఆఫీసర్ ని కేసుకు అప్పగిస్తానని ధైర్యం చెప్పి పంపించారు ఆయన.

******

కశ్యప్, ఐపీఎస్ ద్వారా సెలెక్ట్ అయిన పోలీసు ఆఫీసర్. జఠిలమయిన కేసులు భేదించడంలో అతనికి పోలీసు శాఖ లో మంచి పేరుంది . అతనికి అర్జున రావు గారంటే వ్యక్తిగతంగా చాలా గౌరవం. అందుకే ఆయన దగ్గరనుంచి మెసేజ్ రాగానే వెళ్లి కలిశాడు. ఆయన వివరాలు చెప్పి, సీఐ లెవెల్ లో ఛేదించలేక పోతే, కశ్యప్ ని వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేట్ చేసి వస్తువులని రాబట్ట మన్నారు. కశ్యప్ వెంఠనే రంగం లోకి దిగి ఏకే నగర్ సీఐ ని ప్రాధమిక విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వ్వమని ఆదేశించాడు. అతనికి స్టేషన్ లెవెల్ లో ఉన్న అధికారుల మీద నమ్మకం ఉంది. సాధారణంగా వాళ్లకున్న అనుభవంతో, మరీ జటిలమయితే తప్ప రెండు మూడు రోజులలో చేదించడం జరుగుతుంది. అందుచేత వాళ్ళ ప్రయత్నాలు చూసి అవసరమయితే తాను రంగం లోకి దిగుతానని అర్జున రావు గారికి చెప్పాడు.

రెండు రోజుల తరువాత కశ్యప్ కి సీఐ మురళి ఫోన్ చేసి చెప్పిన వివరాలు అంత ప్రోత్సాహకరం గా లేవు. వాళ్ళు సేకరించిన సమాచారం బట్టి, బయట నుంచి ఎవరూ బ్రేక్ చేసి లోపలి వచ్చిన దొంగతనం కాదు కాబట్టి అనుమానితుల్ని లిస్ట్ చేసుకుని వాళ్ళు విచారణ జరిపారు. పని మనిషి రంగమ్మ, పాలు పొసే రాజమ్మ, సెక్యూరిటీ వాళ్ళు, చేసినట్టు సూచనలు ఏమీ లేవు. పక్క ఫ్లాట్ లో ఉన్న దివాకర్, అతని భార్య రజనీ లను కూడా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు చేసే అవసరం కానీ, అవకాశం కానీ కనపడలేదు. వాళ్ళు మామూలు బ్యాంకు ఉద్యోగులలాగే గౌరవ ప్రదమయిన వాళ్ళ లాగే తేలుతోంది. ఆఖరికి కళ్యాణ్ గురించి కూడా కొంచెం రహస్య విచారణ జరపడం జరిగింది. అతనికేమయిన వివాహేతర సంబంధాలు ఏమన్నాఉన్నాయా? ఉంటె బహుశా అందు నిమిత్తం నగలు మళ్లించడం ఏమయినా జరిగిందా అని విచారించారు. కానీ అతను చాలా పెద్ద మనిషనీ, వాళ్ళిద్దరిదీ అన్యోన్య దాంపత్యమే కానీ అనుమానించదగ్గదేమీ లేదనీ తెలిసింది. మొత్తానికి తేలిందేమిటంటే సీఐ మురళిస్థాయిలో ఫలితాలేమీ రాబట్టలేక పోయారు. మొత్తం అంతా ఇంకా మిస్టరీ గానే ఉంది. అదే విషయం అర్జునరావు గారికి చెప్పి, తాను వెళ్లి పెర్సనల్ గా విచారణ చేపడతానని కశ్యప్ చెప్పాడు. ఆలస్యం చేయవద్దని, నగలు చేతులు మారితే తిరిగి రాబట్టడం కష్టమవుతుందని అర్జున రావు గారు మళ్ళీ నొక్కి చెప్పారు.

ఆ సాయంత్రమే కశ్యప్ కళ్యాణ్ కి ఫోన్ చేసి ఇద్దరినీ ఇంటి దగ్గర ఉండమని, వాళ్ళ ఫ్లాట్ కి వెళ్ళాడు. అరుణ ఎక్కడ నగలు పెట్టిందో ఆ స్టీలు బీరువా, దాని ఒక అర లో ఉన్న సేఫ్ పరిశీలించాడు. ఆ రెండింటి తాళం చెవులు మామూలుగా ఎక్కడ పెడుతున్నది కనుక్కున్నాడు. బీరువాది, లోపల సేఫ్ దీ రెండు చెవులూ కూడా ఒకరింగ్ కి పెట్టి అవి అలమైరా పైన ఉన్న పేపర్ కింద పెట్టడం జరుగుతోందని అరుణవివరించింది. ఇంటి మెయిన్ గుమ్మం లాక్ పరిశీలించాడు. అదీ గాడ్రెజ్ లాక్కాదు కానీ, ఆ లాక్ గట్టి గానే ఉంది. దాని చెవులు ఇద్దరి దగ్గరా చెరి ఒకటి ఉంటాయనీ, కానీ ఇంటిలో రాగానే తలుపు తెరిచి పక్క గోడకి ఉన్న బోర్డుకి తగిలిస్తామనీ చెప్పారు. ఎవరి మీదయినా వాళ్లకి అనుమానముందా అని కశ్యప్ గుచ్చి గుచ్చి అడిగాడు. అది వరకు సీఐ మురళి విచారణలో చెప్పినట్టే వాళ్లకి ఎవరి మీదా అనుమానం లేదని చెప్పారు.

" మీరు ఎప్పుడు ఆఖర్న చూశారు నగలిని?" అరుణ కేసి చూసి అడిగాడు

" జనవరి 18న మా అమ్మాయి పుట్టిన రోజూకి తీసి, మళ్ళీ అదే రోజు బీరువాలో సేఫ్ లో పెట్టాననీ చెప్పింది" అరుణ. మళ్ళీ ఎదో గుర్తుకు వచ్చి మూడో రోజు అంటే జనవరి 20 న మెళ్ళో ఒక గొలుసు ఉండిపోతే దానిని కూడా నగల పెట్టె లోపెట్టడానికి సేఫ్ తెరిచాననీ అప్పుడు అన్నీ ఉన్నాయనీ చెప్పింది. అంటే ఆఖరి సారి చూసింది జనవరి 20 న. ఆ తరువాత బీరువా తెరిచినా సేఫ్ తెరవ లేదనీ చెప్పింది

" జనవరి 20 తరువాత ఎవరయినా బంధువులు మీ ఇంటికి వచ్చారా? వస్తే వెంఠనే వెళ్లి పోయారా? కొన్నాళ్ళు ఉన్నారా?" అడిగాడు కశ్యప్

"మా మరిది రాజా ఒక రోజు వచ్చి, అదే రోజు వెళ్లి పోయాడు"

"అది ఏ రోజో గుర్తు ఉందా?" అన్నడు కశ్యప్ కళ్యాణ్ కేసి చూసి

కళ్యాణ్ కొంచెం చిరాగ్గా " వాడు రిపబ్లిక్ డే నాడు నరసాపూర్ లో వచ్చి అదే రోజు మధ్యాహ్నం ఫ్లయిట్ కి ఢిల్లీ వెళ్లి పోయాడు. మరునాడు ఆఫీసు కి అందుకోవాలని. వాడిని మీరు అనుమానించక్కర లేదు " అన్నాడు కశ్యప్ తో కొంచెం నిష్టూరంగా.

" అనుమానించడం లేదు. అతని పేరు, పనిచేసే ఆఫీసు ఇవ్వండి. అతన్ని ఏమీ ప్రశ్నించం రికార్డ్ కోసం కావాలి" అన్నాడు కశ్యప్. కళ్యాణ్ వివరాలు రాసి ఇచ్చాడు

" అతను కాకుండా ఇంకెవరయినా వచ్చారా?" అన్నాడు కశ్యప్ మళ్ళీ అరుణ కేసి చూసి

" మా పిన తల్లి గారి అబ్బాయి కారుణ్య వచ్చి రెండు రోజులు ఉండి వెళ్ళాడు. వాడు రాజమండ్రి నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చి మళ్ళీ వెళ్లి పోయాడు. బ్యాంకులో సెలెక్ట్ అయ్యాడు. మళ్ళీ చేరడానికి వస్తాడు" అంది అరుణ

" అతని వివరాలు కూడా ఇవ్వండి" అన్నాడు. అంత క్రితమే రాజా విషయం లో చెప్పాడు కాబట్టి ఇంకేమీ ప్రశ్నించకుండా వివరాలు రాసి ఇచ్చింది అరుణ.

కశ్యప్ ఫ్లాట్ అంతా తిరిగి చూశాడు. ఫ్లాట్ కి రెండు వైపుల మాత్రమే బాల్కనీ లు ఉన్నాయి. కింది నుంచి ఎవరయినా బాల్కనీ ద్వారా లోపలి వచ్చే అవకాశం పరీక్షించాడు . నాలగవ అంతస్తు కాబట్టి, డ్రైనేజ్ పైపులు పట్టుకుని పైకి ఎక్కాలి తప్ప వేరే మార్గం లేదు.

" మీకు ఏమీ అంతు చిక్కనట్టు లేనట్టుందే?" అన్నాడు కళ్యాణ్ నిరుత్సాహంగా

" కొంచెం మిస్టరీ గా నే ఉంది. కానీ ఎవరో వచ్చి తీసుకు వెళ్లి ఉండాలి కదా? లేక పోతే ఎలా మాయమవుతాయి?. మీరు అధైర్య పడకండి. మీ వస్తువులు మీకు చేర్చేబాధ్యత నాది" అన్నాడు కశ్యప్ వెళ్ళడానికి లేస్తూ

అతన్నిసాగనంపడానికి గుమ్మం దాకా వచ్చారు ఇద్దరూ. అప్పుడే దివాకర్, రజని వాళ్ళ ఫ్లాట్ తలుపు తెరుచుకుని ఎంటర్ అవుతున్నారు. వీళ్ళని చూసి ఆగారు."ఇంకా ఏమీ దొరక లేదా అండీ ?" అన్నాడు దివాకర్ . కళ్యాణ్ కేసి చూసి. "ఇదిగోవీరే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు" అన్నాడు కళ్యాణ్, కశ్యప్ ని పరిచయం చేస్తూ

" మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాను" అని దివాకర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు కశ్యప్.

*****

ఆఫిస్ కి రాగానే ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఫ్రెండ్ కార్తీక్ కి ఫోన్ చేసి కళ్యాణ్ తమ్ముడు రాజా గురించీ, అరుణ కజిన్ కారుణ్య గురించీ వివరాలు ఇచ్చి పరోక్షం గా సమాచారం సేకరించామన్నాడు.. ఏదయినా అనుమానాస్పద విషయం ఉంటె పాస్ ఆన్ చేయమన్నాడు. కార్తీక్ తో మాట్లాడిన తరువాత అతను మొత్తం కేసు రివ్యూ చేసుకుంటే అతనికి ఏమీ అంటూ పట్టలేదు, బయటి నుంచి ఎవరూ బ్రేక్ చేసుకురాలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళు కానీ, పని మనిషి కానీ చేసే అవకాశం కనపడటల్లేదు. ఎదో ఒక దారి ఉండాలి అని కొంచెం తీక్షణం గా ఆలోచిస్తోస్తూ ఉండి పోయాడు

మళ్ళీ ఫ్లాట్ కి వెళ్లి పరిశీలించాలి అనుకున్నాడు.

********

కశ్యప్, మరునాడు స్సాయంత్రం కళ్యాణ్ కి ఫోన్ చేసి ఆరు గంటలకు వస్తున్నట్టుచెప్పాడు. అప్పటికి ఇంటికి చేరుకోవడానికి ప్రామిస్ చేశాడు కళ్యాణ్.

కశ్యప్ అక్కడికి చేరుకున్న రెండు నిముషాలకి కళ్యాణ్ వచ్చాడు. తలుపులు తీసి కశ్యప్ ని లోపలికి ఆహ్వానించాడు. కశ్యప్ లోపలికి వచ్చి సేఫ్ ఉన్న బీరువా దగ్గరికి వెళ్లి పరిశీలించి వెనక్కి తిరిగేటప్పటికీ, అప్పుడే వచ్చిన దివాకర్ తలుపులు తీసుకుని వాళ్ళ ఫ్లాట్ లో ప్రవేశించడం, కళ్యాణ్ వాళ్ళగుమ్మం లోంచి కనపడింది. వాళ్ళ ఫ్లాట్ లో గుమ్మం ఎదురుగా సోఫా కనపడటం తో ఆలోచిస్తూ అటు నడిచాడు. కశ్యప్ ని చూసి లోపలికి ఆహ్వానించాడు దివాకర్. గుమ్మానికి ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చున్నాడు కశ్యప్. అక్కడి నుంచి చూస్తే కళ్యాణ్ వాళ్ళ ఫ్లాట్ లోని బీరువా కనపడటం గమనించాడు. ఇదేమయినా సూచిస్తోందా పరిశీలించాలి అని మనసు లో నోట్ చేసుకున్నాడు.
. ఇంతలో రజని వచ్చి పలకరింపు గా నవ్వి లోపలి వెళ్లి కాఫీ తెచ్చింది. దివాకర్ కూడా కూడా వచ్చి కూర్చున్న తరువాత " మీ ఇంటికి చుట్టాలు ఎవరయినా వస్తూ ఉంటారా?" అని అడిగాడు కాఫి తీసుకుంటూ

" ఆయన తరఫున వచ్చే వాళ్ళు చాల తక్కువేనండి. అప్పుడప్పుడు కోర్టు పని మీద మా మేనమామ వస్తూ ఉంటాడు మా ఊరి నుంచి. వచ్చినా ఒకటి రెండు రోజుల కంటే ఉండడు. కానీ ఆయన ఈ మధ్య అనారోగ్య కారణంగా మూడు నెలలయింది వచ్చి.

" ఈ మధ్య అంటే క్రిందటి నెలలో కానీ, ఈ నెలలో కానీ ఎవరయినా వచ్చారా?" అన్నాడు కశ్యప్. అలా ఎందుకు అడుగుతున్నాడో వాళ్ళు గ్రహించారు

ఆ మధ్యన మా పిన తల్లి గారి భర్త, మా బాబాయి బంగారయ్య వచ్చారండి. కానీ వచ్చి ఒక పూట మాత్రమే ఉన్నారు, భీమవరం లో ఉన్న మా బ్యాంకు బ్రాంచ్ లో ట్రాక్టర్ లోను ఇప్పించమని అడగడానికి వచ్చారు. నేను ఫోను లో మాట్లాడి వాళ్లకి చెబుతాను అంటే, ఆ వేళ భోం చేసి వెళ్ళి పోయారు " వివరించింది రజని

" ఏ తేదీన వచ్చారో చెప్పగలరా?" అన్నాడు కశ్యప్

"సంక్రాతి పండగలు వెళ్లిన తరువాత అనుకుంటా. ఏ తేదీ అంటే? అని కొంచెం ఆలోచించి జనవరి 19 న అనుకుంటా. ఎందుకంటే ప్రతి నెలా మేము మార్గదర్శి చిట్ పేమెంట్ ఆ రోజు చేస్తాము. ఆ వేళ మా బాబాయి ఉండగా ఏజెంట్ మూర్తి గారు వచ్చి చెక్కు పట్టుకు వెళ్లారు" అంది రజని

" సరే మంచిదండి. థాంక్స్ ఫర్ ది కాఫీ" అని లేచి కశ్యప్ వాళ్ళ ఫ్లాట్ లో ప్రవేశించాడు. అప్పటికి అరుణ కూడా వచ్చింది.

మీరు ఆఖరున చూసింది జనవరి 20న కదా ? అందులో సందేహం లేదు కదా? అన్నాడు ఎదో మనసులో కంపేర్ చేసుకుంటూ

" ఏమీ సందేహం లేదు 20న చూశాను" అండి అరుణ

కశ్యప్ లేచి "మీ బీరువా తాళాలు అంటే మెయిన్ బీరువా తాళం, లోపల సేఫ్ తాళం నాకుఒక మాటు ఇవ్వండి. మీ మెయిన్ డోర్ తాళాలు రెండూ కూడా ఇవ్వండి. రేపు ప్రొద్దుటే మా జవాన్ తెచ్చి మీకు ఇచ్చేస్తాడు. మీకు ఇబ్బంది లేకుండా"అన్నాడు

ఎందుకో అర్థం కాక పోయినా, అన్ని తాళాలూ ఒక కవర్ లో పెట్టి ఇచ్చాడు కళ్యాణ్. .

వాళ్ళిద్దరికీ మళ్ళీ ధైర్యం చెప్పి వచ్చేశాడు కశ్యప్.

**********

ఒక పది హేను రోజులు గడిచిన తరువాత అరుణ, సుగుణ కి ఫోన్ చేసి, కశ్యప్ రావడం వివరాలు సేకరించడం మొదలైన విషయాలు అన్నీ చెప్పింది. పదిహేను రోజులయిందనీ ఇంకా ఆయన దగ్గర్నుంచి వార్త ఏమీ లేదనీ చెప్పింది. ఒక గంట తరువాత సుగుణ ఫోన్ చేసి, డాడీ తో మాట్లాడానని, కశ్యప్ అదే పనిలో ఉన్నాడనీ, ప్రస్తుతం ఊళ్ళోలేడనీ చెప్పింది.

మరో పది రోజుల తరువాత కశ్యప్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నగలు దొరికాయని అర్జెంటు గా బయలు దేరి భీమవరం రమ్మని. వచ్చేటప్పుడు దివాకర్, రజనీలను కూడా తీసుకు రమ్మని చెప్పాడు. దివాకర్ తోఅప్పటికే మాట్లాడానని చెప్పడంతో వాళ్ళు కూడా వస్తారని చెప్పాడు.కశ్యప్ ఇచ్చిన డైరెక్షన్స్ బట్టి భీమవరానికి దగ్గరలో ఉన్న వీరవాసరం లో బంగారయ్య గారి ఇల్లు చేరుకున్నారు నలుగురూ. ముందు హాలులో బంగారయ్య గారు, ఇంకో పెద్దమనిషి కూర్చున్నారు. పక్కన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ కూర్చున్నారు. అక్కడే ఉన్న కశ్యప్ వీళ్లు రాగానే లోపలికి నడవమన్నాడు .లోపల పెద్ద గది లో రజనీ వాళ్ళ పిన్ని అనసూయమ్మ గారు మెల్లిగారోదిస్తున్నారు. ఏమయిందో అర్థం కాక రజని పిన్ని దగ్గరికి వెళ్లి ఆమెని ఓదార్చడానికి ప్రయత్నించింది, విషయం ఏమిటో తెలియక పోయినా.
కశ్యప్, లోపలి వచ్చిఅరుణ, కళ్యాణ్ లను దృష్టి లో పెట్టుకుని చెప్పడం మొదలు పెట్టాడు.

బంగారయ్య గారు వీరవాసరంలో మంచి పేరున్న మోతుబరి. పిల్లలు లేరు. గత రెండు మూడుసంవత్సరాలుగా సంక్రాతి పండగలకు ఆ ప్రాంతాలలో ఆడే కోడిపందాలలో ఓడిపోవడంవల్ల తన పేరా ఉన్న భూమిని కొంత అమ్మేసు కోవడం, కొంత తనఖాల పాలు చేయడంజరిగింది. ఆయన పేరున ఇంకా ఆస్తి లేకపోవడంతో, అనసూయమ్మ గారికి పసుపు కుంకుమ కింద వచ్చిన భూమి, ఆమె పేరున ఉన్నది, కూడా తనఖా పెట్ట దానికి ఆమెని ఒత్తిడిచేయడం జరిగింది. ఆమె అందుకు ఒప్పుకోక పోవడంతో ఆయన చిక్కులలో పడ్డారు .మొన్న జరిగిన పోటీలలో ఆయన మాణిక్యం అనే కోడిపందాలు నడిపే వ్యక్తికి భారీ గారుణ పడ్డారు. అతని ఒత్తిడి ఎక్కువ అవడంతో పరిచయస్తుల దగ్గర ప్రయత్నిద్దామని హైదరాబాద్ వచ్చారు.

అందు కోసమే దివాకర్, రజనీల ఇంటికిజనవరి 19న వచ్చారు. ట్రాక్టర్ లోన్ సంగతి అక్కడకక్కడ తోచినది చెప్పినది మాత్రమే. ఇంతలో మార్గదర్సి ఏజెంట్ రావడంతో, బాగా బతికిన మనిషి కాబట్టి అతని ఎదురుగాటి డబ్బు అడగడానికి సందేహించారు. కానీ మాణిక్యం ఆయనను భయ పెట్టిన తీరుమనసులో మెదలుతూంటే ఎదురుగుండా ఫ్లాట్ పై ఆయన దృష్టి మళ్లింది. అప్పుడేఎందుకో అరుణ ఆల్ మైరా తెరిచి, మళ్ళీ మూసి తాళం చెవులు అల్ మైరా పైన ఉన్నపేపర్ కింద పెట్టడం చూశారు. ఒక అయిదు నిమిషాలకి, కళ్యాణ్ , అరుణ వాళ్ళపాపని స్కూల్ కు పంపడానికి బిల్డింగ్ కింద దాకా వెళ్ళడానికి ముగ్గురూబయటికి వచ్చి తలుపు దగ్గరగా వేసి లిఫ్ట్ వైపు వెళ్లడం ఆయన చూశారు. ఆయనకీఎదో ఆలోచన వచ్చి హాలులోనే ఉన్నదివాకర్ వాళ్ళ బాత్ రూమ్ లోకి వెళ్లి, సబ్బుని ఒకదాన్ని తడిపి జేబులో వేసుకుని బయటికి వచ్చారు." ఇప్పుడే వస్తానుఅమ్మాయి" అని చెప్పి బయటికి వచ్చి కళ్యణ్ ఫ్లాట్ లో ప్రవేశించి, బీరువా పైనఉన్న తాళాలకి, గుమ్మం పక్కన తగిలించి ఉన్న ఇంటి తాళానికి సబ్బుకు రెండువైపులా ముద్ర తీసుకుని మళ్ళీ తాళాలు అక్కడ పెట్టేసి బయటికి వచ్చారు. అంత పెద్ద మనిషి అలా ఎందుకు చేశారంటే ఆయన సమాధానం,

మాణి క్యం ఆయనకీ ఆయన భార్యకీ కూడా ప్రాణ భయం పెట్టడంతో ఆయనకి తెగింపు వచ్చి అలా చేశానని చెప్పారు. ఆ తరువాత నాలుగు రోజులకి సబ్బు ముద్రల సహాయంతో తాళాలు తయారుచేసుకుని, రెండు కుటుంబాలూ అఫీస్ టైం లో ఇంట్లో ఉండరు కనుక పని పూర్తి చేసుకువచ్చారు.జనవరి 19న ఆయన దివాకర్ ఇంటికిరావడం, జనవరి 20న అరుణ నగలిని చూశానని ఖచ్చితం చెప్పడంతో, ముందు నాకు ఆయనమీద అనుమానం రాలేదు. కానీ మీ దగ్గర తాళాలు తీసుకున్న తరువాత కెమికల్ అనాలిసిస్ లో సబ్బు ముద్రలు తీసుకుని ఉండవచ్చని ధ్రువీకరణ జరగడంతో, అనుమాన నివృత్తి కోసం టీం ని పంపించి విచారిస్తే ఆయన గురించి సేకరించిన వివరాలు సరిపోవడం తో ఆయన్ని, ఆయన ద్వారా మాణిక్యాన్ని ప్రశ్నించడంతో అన్నీ బయటపడ్డాయి. నగలు మాణిక్యం దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నాము. బంగారయ్య గారు, బీరువాలో డబ్బు యేమన్నా దొరుకుతుందేమోనని ప్రయత్నించారు కానీ, నగలు అక్కడ ఉన్న సంగతి ఆయనకి ముందుగా తెలియదు అని చెప్పి ముగించాడు కశ్యప్

రజని, కళ్యాణ్ నీ అరుణ నీ బ్రతిమాలింది. మీ నగలు ఎలాగు దొరికాయి కాబట్టి, మా పిన్ని ముఖం చూసయినా బాబాయిని బయట పడేయమని.

కళ్యాణ్, అరుణా కశ్యప్ వైపు చూశారు సలహా కోసం. "మీరు కేసు వెనక్కి తీసుకుంటే ఆలోచించ వచ్చేమో. అర్జున రావు గారితో మాట్లాడి కానీ ఏ సంగతీ చెప్పలేను. మాణిక్యం చేసినది రెండు చట్టాల పరిధిలో నేరం కాబట్టి అతన్ని బుక్ చేయాలి"అన్నాడు కశ్యప్ .

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు