సిసలు నిజాయితీ - గంగాధర్.వడ్లమన్నాటి .

sisalu nijayitee

రామాపురం నుండి రంగాపురం వెళ్లడానికి గాను, పెద్ధ జట్కాబండి ఎక్కింది రమణి.ఎప్పుడూ పక్కఊరు దాకా పోవడానికి గాను జట్కాబండి ఎక్కుతుందామే .ఆ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ,చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్లాలన్నా ,రావాలన్నా ,ఇలా గుర్రపు జట్కాలూ ,తోపుడు రిక్షాల పైనే ఆధారపడాలి ఆ ఊళ్ళ జనం.అలాగని ఒక్కరే జట్కా మాట్లాడుకుని పొరుగూరు పోవాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది .కనుక ఇలా అందరినీ చేరవేసే జట్కాలనే నమ్ముకుంటారు.ఈ రోజు కూడా అలాగే,తన పని ముగించుకుని,ఇంటికి వెళ్లడానికి గాను జట్కాబండి ఎక్కిందామే.అందులో ఓ నలుగురు వరుకు కూర్చుని ఉన్నారు .అయితే వారిలో కనబడ్డ ఓ అమ్మాయిని కాస్త పరిశీలనగా చూసిన రమణి ,కాస్త గుర్తుచేసుకుంటున్నట్టు ఓ క్షణం ఆలచనలో పడి ,తర్వాత గుర్తుకు వచ్చినట్టు మరుక్షణం తేరుకుని, నువ్వు సిలకమ్మ కదూ! అడిగిందామే కాస్త సందేహిస్తూనే .

అవును .నేనే . గబుక్కున గుర్తుపట్టలేకపోయాను.నువ్వు రమణి కదూ .ఎలగున్నావ్.ఇంతకీ ఎక్కడిదాకా ఎల్తన్నావ్ .అడిగిందామే చిన్న చిరునావ్వుతో .

నేను బానే ఉన్నాను.రంగాపురం దాకా వెళ్తున్నాను.పని ముగించుకుని.మరి నువ్వు?

నేను రాజపాలెం దాకా ఎల్తన్నా .చెప్పింది సిలకమ్మ .

మంచిది.ఏది ఏమైనా నిన్నూ, నీ నిజాయితీనీ మాత్రం తప్పక మెచ్చుకోవాలి సిలకమ్మా. అయినా ఈ రోజుల్లో కూడా నీ అంత నిజాయితీగా ఎవరుంటారూ! చెప్పింది రమణి ,ఆమె వంక మెచ్చుకోలుగా చూస్తూ.

అది సరే కానీ ,నా నిజాయితీ గురించి నీకేట్టా తెలిసిందీ?.అడిగింది చిలకమ్మ చిన్న నవ్వుతో కాస్త ఆశ్చర్యంగా.

ఆదా !నేను మొన్నటిదాకా పనిమనిషిగా పని సేసిన శ్రీపురం బంగ్లా యజమానురాలుగారు సెప్పగా ఇన్నాన్లే. నువ్వు చాలా నమ్మకంగా పని సేసేదానివనీ ,ఆవిడ పిల్లల ఆలనా,పాలనా చక్కగా సూసేదానివనీ ,ముఖ్యంగా, ఓ సారి ఆవిడ పరాగ్గా పది తులాల బంగారు హారాన్ని ఆ బంగ్లాలో ఎక్కడో పారేసుకుంటే ,మరుసటి రోజు నువ్వు ఇల్లు తడిగుడ్డ పెట్టేప్పుడు ,దొరికిందని తిరిగి ఇచ్చేశావట కదా .నువ్వు సేలా గొప్ప మనిషివీ ,అదీ,ఇదీ అని నీ గురించి తెగ సెప్పింది .హూ ...అని ఓ నిట్టూర్పు విడిచి, నీకున్న అలాంటి నిజాయితీ నాకు లేకనే ,ఓ పెద్ద బంగారు గొలుసు తీసేసి, చాలా తిట్లూ ,పోలీసులతో దెబ్బలూ తిన్నాను.కానీ మా యజమానురాలు దేవత .ఆ బంగారు నగ దొరికిందని అబద్దం సెప్పి ,వాళ్ళ పెనివిటి ఇచ్చిన ఫిర్యాదుని వాపసు తీసుకుంది.అప్పుడే నీ గురించి నా దగ్గర ఉదహరించింది.అందుకే సెప్పాను నువ్వు గొప్ప మనిషి అనీ .చెప్పింది రమణి ఆమె వంక మెచ్చుకోలుగా చూస్తూ.

నీ చాదస్తం కాపోతే నే గొప్ప మనిషినెంటీ ?అసలు నాకు దొరికిన ఆ హారం ,మొదటి రోజే దొరికింది .కాపోతే మా ఆయన బంగారు నగలు తయారు చేసేవాడు కదా ,అందుకే ఆ దొరికిన హారం లాంటిది మరోటి చేసి ఇవ్వడానికి గాను ఒక రోజు సమయం పట్టింది .అది మాత్రమే కాదు .నేను పని చేసిన ఇళ్ళలో వారి పిల్లల్ని బాగా మచ్చిక చేసుకుని వారి బంగారు గొలుసులూ,దిద్దులూ ,వారి ఉంగరాలూ ,ఇలా ఏదైనా బంగారం కాజేసి ,మరుసటిరోజు ఇల్లు చిమ్మెటప్పుడో ,తడి గుడ్డ పెట్టేప్పుడో ,ఇల్లు సర్దేప్పుడో దొరికిందని

మరుసటి రోజుకల్లా బంగారం పూతగల అచ్చం అలాంటి గిల్టు నగే మా ఆయనతో మరోటి తయారు చేయించి తెచ్చి వారి చేతుల్లో పెట్టేసేదాన్ని, దాంతో వారి మెప్పుతో పాటు అదనంగా మరో మాంచి బహుమతో ,మరికొంత దబ్బో చేజిక్కించుకునేదాన్ని .అలాగే ఎవరికీ అనుమానం రాకముందే ,కొద్ది రోజుల్లోనే అక్కడ పని మానేసి , నా పేరు మార్చుకుని వేరే ఊరు వెళ్లిపోయేదాన్ని.అదీ నా అసలు,సిసలు నిజాయితీ అని కాస్త చిన్నస్వరంతో చెప్పి, కానీ ఏం లాభం ,దొంగ సొమ్ము దొంగ సోమ్మే .ఆ సొమ్ముతో పాటు మా సొమ్ము కూడా మా ఇంట్లో దొంగలు పడి దోచుకు పోయారు మరి.అందుకే ఇప్పుడు సిసలు నిజాయితీనే నమ్మి బతుకుతున్నాను రమణీ.చెప్పిందామే.కాస్త బరువుగా.

అవునా? ఆ శ్రీపురం బంగ్లాలో కాజేసి మళ్ళీ నకిలీ చేయించి ఇచ్చిన నగల్లో ఈ హారం కూడా ఉందేమో కాస్త సూడు.అడిగింది రమణి,చిలకమ్మకి ఓ పెద్ద హారాన్ని తన చిక్కం లోంచి తీసి ఆతృతగా చూపిస్తూ.

దాని వంక ఓ క్షణం తీక్షనంగా చూసిన చిలకమ్మ ,అవును ఇదే శ్రీపురం బంగ్లాలో నే కాజేసిన వాటిలో పెద్ద నగ .నాకు బాగా గుర్తు అని ఆమె చెప్పడంతో , రమణి కూడా ఓ క్షణం ఆ హారం వంక అలానే కొయ్యాలా చూస్తూ ,అంటే ఓ గిల్టు నగ కోసం ,బంగ్లాలో మంచి జీతం ,తిండీ పెట్టే పని పోగొట్టుకుని, పోలీసులతో తన్నులు ,తిట్లూ తిన్నాక, ఆఖరికి అన్నీ భరించాక ,పోనిలే కనీసం ఈ బంగారు నగ అయినా మిగిలిందీ ,అమ్ముకుంటే జీవితంలో గొప్పగా బతకొచ్చు అనుకుంటే ,అదీ గిల్టు నగా. నా దురాశకి తగిన శాస్తే జరిగింది.సిలకమ్మ సెప్పిందే నిజం.దొంగ సొమ్ము దొంగ సోమ్మే.నిలవదు.సిసలు నిజాయితీనే మనకి శ్రీరామ రక్ష కాబోలు, ఆలోచిస్తూ వెనగ్గా వాలిపోయింది .గుర్రం సకిలించింది , సత్యం అనుకుంది.మనసు తేలిక పడింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు