రామాచారి గారు ఆయన భార్య అనసూయమ్మ గార్లది చాలా అన్యోన్య మయిన దాంపత్యం. వారి అన్యోన్యత చాల పరీక్షలకి నిలిచింది. అందులో ముఖ్య మయినది రామాచారి గారు రిటైర్ అయిన వెంఠనే జరిగింది.
రిటైర్మెంట్ కి ముందు, పెరిగి పోయిన సెలవుని వాడుకునే నిమిత్తం వాళ్లిద్దరూ చాలా పుణ్య క్షేత్రాలు తిరిగి రావడానికి నిర్ణయించుకు న్నారు. వాళ్ళ ఒక్కగా నొక్క కూతురు పెళ్లయి భర్త తో సింగపూర్ లో ఉంటోంది. ఆయనకి వేరే బాధ్యతలు ఏమీ లేవు. ఆయన ఉద్యోగ రీత్యా మూడు సంవత్సరాల కోసారి బదిలీలతో ఎక్కడా స్థిరనివాసం ఏర్పడక ఒక ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ ఇంకా ఏర్పరచు కోలేదు. ఇప్పుడు రిటైర్ అయింతరువాత దాని గురించి ఆలోచించాలి. యాత్రలు ముగించి వచ్చిన తరువాత దానిగురించి ఆలోచిద్దామనుకున్నారు.
ఆయన చిన్నప్పటినుంచీ, తాత తండ్రుల నుంచీ వస్తున్న వైష్ణవ సంప్రదాయ ఆరాధనని క్రమం తప్పకుండా చేస్తున్నా, రిటైర్మెంటు కి ముందు కొన్ని సంవత్సరాల నుంచీ రామకృష్ణ పరమ హంస, వివేకానందులని చదివిన తరువాత ఆయనలో కొన్ని ప్రశ్నలు ఉదయించి వాటికి జవాబుకోసం ఆద్యాత్మికం గా వెతుకుతున్నారు.
యాత్రల లో భాగంగా తిరుపతి, మిగతా దక్షిణాది వైష్ణవ క్షేత్రాలు ముగించుకుని వాళ్లిద్దరూ అరుణాచలం చేరుకున్నారు. తెలుగు వాళ్లంతా తిరువణ్ణామలై పట్టణాన్ని అక్కడవున్న అరుణాచలం కొండ ఆధారంగా అరుణాచలమని పిలుస్తారు. అక్కడ ముఖ్యమైనవి మూడే. అరుణాచలేశ్వరుని ఆలయం, రమణమహర్షి ఆశ్రమం, అరుణాచలం కొండ. అక్కడ ఎవరూ అరుణాచలాన్ని కొండా గా భావించరు. శివుడే ఆ రూపంలో ఉన్నాడని నమ్మకం. ఇరవయి నాలుగు ఎకరాలలో ఉన్న ఆలయాన్నీ, పధ్నాలుగు కిలోమీటర్లు ఆవరించిన అరుణాచలాన్ని చూసుకుని వాళ్లిద్దరూ రమణాశ్రమం లో నాలుగు రోజులు గడపడానికి అనుమతి పొందారు
భార్యా భర్తలిఇద్దరికీ ఆశ్రమ ప్రశాంత వాతావరణం చాలా బాగా నచ్చింది అప్పటి వరకూ రామాచారి గారికి రమణ మహర్షి పేరు ఆధ్యాత్మిక ప్రపంచం లో ఎందుకు అంత ప్రాచుర్యం పొందిందో తెలియదు.
పరమహంస రచనల పరిచయంతో సుద్ద వైష్ణవం కొంత సడలినా అద్వయితం మీద ఆయనకీ పెద్దగా అవగాహన కలగ లేదు. ఆశ్రమం లో పూజలూ వగయిరాలు అనసూయమ్మ గారికి బాగా నచ్చినా, రామాచారి గారు మహర్షి రచనల తో పరిచయం చేసుకున్నారు. కొద్దీ పాటి అవగాహన తో మహర్షి చూపిన మార్గం ఆయనని చాలా ఆశ్చర్య పరిచింది.
మిగతా సిద్ధాంతాలు 'నమ్మకం' మీద ఆధారపడితే, అద్వయితంలో ఎవరూ ఎవరినీ గుడ్డిగా మూఢంగా నమ్మకుండా ఎవరికీ వారే పరమాత్మ తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడం జరుగుతుంది . ఆది శంకరాచార్య ఎప్పుడో పన్నెండు వందల సంవత్సరాల క్రితం, ఉపనిషత్తుల్లో ని క్షిప్తమయిన అద్వైత సిదాంతాన్ని పైకెత్తి, అప్పటికి బహళ ప్రాచుర్యంలో ఉన్న బౌద్ధం తో సహా అనేక అవైదిక సిధ్దాన్తాలని, కర్మ కాండ ఆధారంగా ఉన్నకొన్ని వైదిక సిధ్దాన్తాలని వాదించి ఓడించి విజయ ఢంకా మోగించారు. ఆ యన బోధించిన వేదాంత సారం అంతా ఒక్క ముక్క లో చెప్పాలంటే " బ్రహ్మ సత్యం జగత్ మిధ్య, జీవుడే పరమాత్మ" అని. కానీ ఆ తరువాత ఆ యన స్థాపించిన పీఠాలు ఈ అద్వయిత సిధ్ధాంతాన్ని సామాన్యుడి కి చేరువ చేయ లేక పోయాయి. ఇన్ని వందల సంవత్సరాల తరువాత ఆ తత్వ సారాన్ని సామాన్యులు అవగాహన చేసుకునే లాగ రమణ మహర్షి స్వానుభవ పూర్వకం గా సామాన్యులకి అందించారు.
రామాచారి గారికి అర్థం అయ్యింది ఏమిటంటే ఈ కనిపించే చరాచర ప్రపంచం పరబ్రహ్మ స్వరూపంగా సత్యం జగత్తు గా మిధ్య అని. వ్యవహారం లో ఎలా ప్రవర్తించినా చుట్టూ ఉన్న మనుషులనే కాదు, వృక్ష ,జంతు జలాన్ని కూడా పరమాత్మ గా భావించాలి. ప్రతి వ్యక్తీ తన స్వస్వరూపాన్ని తెలుసు కోవడం ద్వారా ప్రపంచాన్ని పరమాత్మగా భావించే జ్ఞానం ఎలా సాధించాలో చెప్పిన మహర్షి మార్గం ఆయనకీ బాగా నచ్చింది. అరుణాచలం చుట్టూ ఉన్న ప్రశాంత వాతావరణం ఆయనకి నచ్చి, ఆయన రిటైర్మెంట్ తరువాత ఎక్కడ ఉండాలి అన్న సమస్యకి జవాబు దొరికేలా చేసింది.
మహర్షి బోధనల లో గొప్పదనాన్ని రామాచారిగారు అనసూయమ్మ గారికి చెప్పినా, ఆవిడ తాను ఆరాధించే అమ్మవారిని వదలి ఇంకో మార్గం లోకి వెళ్ళదానికి సుముఖుత చూపలేదు. అద్వయితం ఆమెని ఆకర్షించక పోయినా, తన అమ్మవారి ఆరాధన, పూజలు ఎక్కడయినా చేసుకోవచ్చు కాబట్టి అరుణాచల నివాసానికి అయిష్టం గా నయినా ఒప్పుకుంది. రామాచారిగారు కూడా ఆవిడకి చెప్పినదేమిటంటే మహర్షి విగ్రహ పూజకి వ్యతిరేకి కాదని, అది కూడా కొంతకాలానికి జ్ఞాన మార్గానికి అర్హతనిస్తుందని, ఎవరికీ ఏది ఇష్ట మయితే అదే కొనసాగించమని చెప్పేవారన్నారు.
రామాచారిగారు అనుకున్నట్టుగానే రిటైర్ అవగానే అరుణాచలం లో నివాసమేర్పాటు చేసుకోవడం జరిగిపోయింది. కూతురు వనజ కూడా ఎలాగు ఇండియా లో లేదు కాబట్టి అంతగా అభ్యన్తరం చెప్పలేదు. ఇండియాకి వస్తే అరుణాచలమే వచ్చి పోతానంది
రమణాశ్రమానికి దగ్గరలో ఒక స్థలం కొనుక్కుని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు రామాచారిగారు. బాదంచెట్లూ, మామిడి, పనస మొక్కలూ పూలమొక్కలూ పెంచి ఆహ్లాదకరమయిన వాతావరణం ఏర్పరచుకున్నారు.
పూజగదిలో అమ్మవారి విగ్రహం ఏర్పరచుకుని, అనసూయమ్మగారు తన అమ్మవారి ఆరాధన నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ఆవిడ ఎక్కడ ఉన్నా పూలు సేకరించి అమ్మవారికి పూజించి, తరువాత అలంకరణ కూడా చేయడం అలవాటు. గతంలో దీనికి అవాంతరం కలగ లేదు కానీ అరుణాఅచలం వచ్చిన తరువాత, పూలు చెట్లనుంచి కోయడం, పూజకి వాడడం మొదలయినవి రామాచారి గారికి ఇష్టంలేదని ఆవిడ గ్రహించింది. పూలు మనుషుల అలంకరణ కి కాక పోయినా, అమ్మవారి అలంకరణకు అభ్యన్తరం ఏమిటని ఆమె అభిప్రాయం. ఆమెని నిషేధించక పోయినా, రామాచారిగారు, మహర్షి అభిప్రాయం నర్మ గర్భంగా చెప్పడంతో ఆమె కూడా అయిష్టంగానే అనుసరించేది. ఓకమాటు రామాచారిగారు పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం కూడా చదివి వినిపించారు ఆవిడకి పూలను కోయడమే కాదు, చెట్ల ఆకులను కూడా అనవసరంగా తెంచడం మహర్షి ఇష్టపడేవారు కాదు. అవి ఉన్నచోటే పరమాత్మకు అలంకరణ అయి ఉన్నాయి అని భావించడం ఉత్తమమ యిన పూజ అని చెప్పేవారు . చెట్ల ఆకులు తెంచడం ఎంత తీవ్రంగా మహర్షి పరిగణించేవారో గతం లో జరిగిన ఒక చిన్న సంఘటన అనసూయమ్మ గారికి చెప్పారాయన. మహర్షి ఉండగా, ఆయన కూర్చునే హాలు లోకి వచ్చి ఒకామె, అంతక్రితం రోజే తాను లక్ష పత్రీ పూజ పూర్తి చేశానని కొంచెం గర్వం గా ప్రకటించింది. మహర్షి ఒక్క క్షణం ఊరుకుని, "అంతకన్నా ఒక లక్ష్మమాట్లు నిన్ను నువ్వు గిల్లుకుంటే బాగుండేదేమో" అని నిష్టూరంగా అన్నారట ఆ పత్రి కోసేటప్పుడు ఆ చెట్లకు కలిగిన అసౌకర్యాన్ని సూచిస్తూ.
ఇద్దరూ రోజూ గిరిప్రదక్షిణ రోడ్డు లో వాఁకింగ్ కి వెళ్లేవారు నేర అన్నామలై అనే చోటు దాక వెళ్లి తిరిగి వచ్చేవారు. "నేర" అంటే నేరుగా అని తెలుగు లో అర్థం. తమిళ ఉగాది నాడు సూర్యకిరణాలు నేరుగా అక్కడ శివలింగం మీద పడతాయని ఆ స్థలాన్ని నేర అన్నామలై అంటారు. అక్కడ పక్క పక్కాగా శివుడి ది , అమ్మవారిదీ గుడులు ఉన్నాయి. అక్కడ అమ్మవారి విగ్రహం చాలా అందంగా ఉంటుంది. రోజూ నగలతో చాలా శ్రద్ధగా అలంకరిస్తారు. అక్కడి దాకా నడిచి వెళ్లి రోజూ అక్కడ కాసేపు గడిపి రావడం వాళ్ళ దిన చర్య అయిపొయింది. అక్కడికి వచ్చినవారు చాలా మంది బయట మల్లెపూలు కొని అమ్మవారికి సమర్పించడం అనసూయమ్మగారు చూశారు. ఆవిడతో పాటు ఆలయంలోకి వచ్చి అమ్మవారి అలంకరణ ని చూసి రామాచారిగారు కూడా ఆనందించినా అలా పూలు అమ్మవారికి సమర్పించడానికి ఆయన ఇనీషియేటివ్ ఎప్పుడూ తీసుకోక పోవడంతో ఆవిడ ఊరుకునేవారు. అమ్మవారిని విగ్రహంలో చూసి ఆనందించడం మంచిదే కానీ, అమ్మవారు విగ్రహంలో మాత్రమే ఉందనుకోవడం మంచిది కాదు అంటూ ఉండేవారు రామాచారి గారు ఆమెతో. వాళ్ళు రోజూ అమ్మవారి గుడి దగ్గరకు రాగానే ఒక పదేళ్ల చిన్న పిల్ల పూవులు కొనమని బ్రతిమాలుతూ ఉండేది. రామాచారిగారు పూలు కొన డా నికి ఆసక్తి చూపేవారు కాదు. డబ్బు ఆదా విషయం కాదు కానీ, ఇహంలోనూ, పరం లోనూ ఆయన కోరుకునేది ఏమీ లేక ఆయన అమ్మ వారికి పూలు సమర్పించే విషయం లో నిర్లిప్తంగా ఉండి పోయేవారు.
ఎప్పటిలాగే ఆ రోజు వాకింగ్ చేసుకుంటూ . నేర అన్నామలై గుడులు రాగానే అమ్మవారి గుడిదగ్గర ఇద్దరూ ఆగారు.
ఆశ్చర్యం లో కెల్లా ఆశ్చర్యం రామాచారి గారు ఒక యాభై రూపాయలకి మల్లెపూల దండ కొని అనసూయమ్మగారికి ఇచ్చి అమ్మవారి అలంకరణకు ఇవ్వమని ఇచ్చి ఆవిణ్ణి లోపలికి అనుసరించారు. ఎప్పటిలాగే అమ్మవారు అలంకరణతో వెలిగిపోతోంది. అనసూయమ్మగారు ఆనందంగా పురోహితుడికిచ్చి ఆయన అలంకరిస్తే చూసింది. బయటికి వస్తూ అన్నారు రామాచారిగారు" అమ్మవారి ముఖం లో ఇవాళ ప్రత్యేకమయిన వెలుగు చూశావా ? అన్నారు నవ్వుతూ " అవునండీ ఇవాళ ఎందుకో ఒక ప్రత్యేకమయిన కళ చూశాను అమ్మవారిలో" అంది చాలా ఆనందంగా
తాను అన్న" అమ్మవారి ముఖంలో వెలుగు" అన్నది ఎప్పుడూ కొనకుండా వెళ్ళిపోతూ ఇవాళ యాభై రూపాయల దండ కొన్నప్పుడు పూలు అమ్మే చిన్న అమ్మాయి ముఖంలో చూసినదని ఆయన వివరించ లేదు