భైరిపురంలో వీరయ్య పేరు మోసిన షావుకారు. అతను కిరాణా వ్యాపారం చేసేవాడు. ఆ వూళ్ళో చెప్పుకోదగ్గ ధనికుల్లో ఒకడతను.
వీరయ్య పరమ పిచినారి. అతను ఎంగిలి చేత్తో కాకిని కూడా అదిలించేవాడు కాడు. బంధువులు ఎవరైనా వస్తే, వారి కోసం ఏదైనా ఖర్చు పెట్టవలసివస్తుందేమోనని గిలగిలలాడిపోయేవాడు.
ఓరోజు సాయంత్రం కూరగాయలు కొనడానికి వీరయ్య బజారుకు వెళ్ళాడు. రామయ్య మంచి కూరగాయల్ని అమ్ముతాడని ఆ వూళ్ళో ప్రతీతి. అతడు మంచివాడు, నిజాయితీపరుడు కూడా.
వీరయ్య సరాసరి రామయ్య దగ్గరికి వెళ్ళాడు. రామయ్య కూరగాయల బుట్టల్ని ముందు పెట్టుకుని కూర్చున్నాడు. వాటిలో వంకాయలు, బెండకాయలు, కాకరకాయలు మొదలైనవి ఉన్నాయి.
వీరయ్య వంకాయల్ని కొనడానికి అరగంటసేపు గీచిగీచి బేరమాడాడు. తరువాత మంచివి ఎంచుకోడానికి మరో అరగంట పట్టింది.
వంకాయలు సంచిలో వేసుకొని ప్రక్కనే వున్న వ్యక్తులతో మాట్లాడసాగాడు వీరయ్య.
పావుగంట గడిచింది. వీరయ్య ఇంకా డబ్బులివ్వలేదేమా - అని చూస్తున్నాడు రామయ్య.
వీరయ్య వెళ్ళిపోడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. అంతలో "బాబూ తమరింకా డబ్బులివ్వలేదు, జ్ఞాపకముందా?" ప్రశ్నించాడు రామయ్య.
"అదేమిటి రామయ్యా? నేను రెండురూపాయల నోటు నీకివ్వలేదూ? మరచిపోయి ఉంటావు, గుర్తు తెచ్చుకో" అన్నాడు వీరయ్య ఆశ్చర్యం నటిస్తూ.
"అది కాదు బాబూ...!" రామయ్య ఏదో అనబోయాడు.
"రామయ్యా బాగా గుర్తు తెచ్చుకో, ఒక్క రెండు రూపాయలకి గతిలేనివాణ్ని కాను నేను. కావాలంటే మరో రెండు రూపయలిస్తాను, తీసుకో" అన్నాడు వీరయ్య ఆవేశంగా.
"వద్దులే బాబూ నేనే మర్చిపోయి ఉంటా.. నాకు కొంత మతిమరుపు వుంది, మీరు వెళ్ళిరండి బాబూ!" అన్నాడు రామయ్య.
వీరయ్య సంతోషంగా ఇంటిదారి పట్టాడు. "గంటన్నరసేపు నిలబడితేనేం, ఇవాల్టికి రెండురూపాయలు మిగిలాయి!" అనుకుంటూ ఇంటికెళ్ళి కూరగాయల సంచిని మేకుకి తగిలించాడు.
ఆనందంతో చేతులు మెటికులు విరుచుకున్నాడు. అంతే! వీరయ్య గుండె ఝల్లుమంది. చేతికి ఉండవలసిన వజ్రాల వుంగరం లేదు. "సుమారు రెండువేలరూపాయల విలువచేసే ఉంగరమది.! ఎక్కడ జారిపోయిందో ఏమో.!" గుండెలు బాదుకుంటూ , జుట్టు పీక్కుంటూ పిచ్చిగా ఏడవసాగాడు అతను.
అంతలో తలుపు తెరుచుకొని రామయ్య లోనికి వచ్చాడు.
"బాబూ, నా వంకాయల బుట్ట అడుగున ఈ వజ్రపు ఉంగరముంది. మీరు వంకాయలు ఏరుతున్నప్పుడు జారిపడిపోయిందేమోనని తెచ్చాను. చూడండి."
వీరయ్య ఉంగరాన్ని తీసుకున్నాడు. అతని కన్నులు తడి అయ్యాయి.
"రామయ్యా నన్ను క్షమించు, వంకాయలు తీసుకుని ఇవ్వాల్సిన డబ్బులు ఎగనామం పెట్టి నీకు నష్టం చేకూర్చిన నాకు ఉపకారం చేసావు. నీ నిజాయితీ నా కళ్ళు తెరిపించింది. నీ రుణం ఎలా వుంచుకోగలను? " అంటూ ఇంట్లోకి వెళ్ళి పెట్టెలోని నూరు రూపాయలు తీసికొని వచ్చి రామయ్యకు బహుమతిగా ఇచ్చాడు.
అటు పిమ్మట రామయ్య నిజాయితీ వల్ల ప్రభావితుడైన వీరయ్య తన పిసినారితనాన్ని వదులుకొని మంచివాడుగా, నిజాయితీపరునిగా ఎంతో పేరు తెచ్చుకొన్నాడు.