అలిగిన ప్రకృతి కన్య ధరించిన నల్లని వస్త్రంలా వ్యాపించి వుంది చీకటి..
ముసురుతున్న జ్ఞాపకాల అలల్ని..
“ఓగిరాల .. ఓగిరాల”
హైదరాబాద్ నుండి మచిలీ పట్నం వెళుతున్నవోల్వో “బస్సు కండక్టర్ “ కేకలు చెల్లాచెదురు చేసేసాయి . వుయ్యూరులో దిగాలనుకున్న నేను అప్రయత్నంగా బస్సు దిగేసాను. చుట్టూ చూసాను. నా మనసును ఆవరించుకున్నట్లే.. చుట్టూ చీకటి.
మసక వెలుతురులో రోడ్ ప్రక్కనున్న వృక్షాలు జడలు విరబోసుకున్న దెయ్య్యాల్లా వికృతంగా..కనిపించాయి.. ఓ చెట్టు మొదట్లోనిద్రపోతున్న కుక్క లేచి మొరగాలనుకుని మనసు మార్చుకున్నట్లు..బద్ధకంగా ముడుచుకొని నిద్రకు ఉపక్రమించింది.
ఏం చేయాలో యెక్కడికి వెళ్ళాలో అర్ధం కాని..పరిస్థితి. దూరంగా ..ఎవరో వేసుకుంటున్న చలిమంట తాలుకు యెర్రని మంటలాగే వుంది నా మనసు. వుయ్యూరు లో దిగాలనుకున్న నేను అక్కడ ఎందుకు దిగానో ?
అర్ధం కాలేదు. అదీ ఓ క్షణమే ..
అయినా..యిప్పుడు చేయ గలిగింది..ఏమీ లేదు.
పాలెం వెళ్ళాల్సిందే.
నా కలల శిధిల సమాధిని ఒక సారి దర్సించాలిసిందే..
దిగజారి పోయిన నా వ్యక్తిత్యం నాకే వింతగా వుంది.
జన్మలో” తన” ముఖం చూడగూడదనుకున్నాను .
ఆమె జ్ఞాపకాల శకలాలను సంపూర్ణంగా..సమాధి చెసేసానను కున్నాను.
అంటే.. ఆమె మీద ప్రేమ నాలో యింకా సజీవంగా వున్నట్లా?
“ఆమె”.. ప్రేమాజీ ! అని నేను ముద్దుగా పిల్చుకున్న..అమ్మాజీ.
ఎన్ని ఆశల ..హర్మ్యాలు కట్టించింది నాతో?
ఐదు సంవత్సరాల స్నేహ పర్వం పరిమళించి ప్రేమ పర్వంగా మారి నా జివితాన్నిలా కాటేస్తుందని..కలలో కూడా.. వూహించలేక పోయాను.
టెన్త్ క్లాస్ నుండి డిగ్రీ దాకా యెంత అందమైన రోజులు?
యెంత చిలిపిదనం..యెంత స్వచ్ఛత?
పాలేనికీ వల్లురుకీ మధ్య దూరం రెండు మైళ్ళు. తనకి సైకిల్ వుంది. నాకు సైకిల్ వున్నా నడకే ఇష్టంగా ఉండేది. పచ్చని పంట పొలాల మధ్య పరిచిన తివాసీలా ఉండేది దారి . అడుగు పెడితే యెంతో హాయిగా తరిగి పోయేది .
కాల గమనమే తెలిసేది కాదు. రెండు ఊర్ల మధ్యా..అమ్మగారి చెరువు..విరిసిన కలువ పూలతొ కమనీయంగా వుండేది.
ఒకప్పుడు జటప్రోలు రాజా వారి..అంతపుర కాంతలూ జలకాలాడే వారట.
చెరువు మధ్య చెక్కు చెదరని శిలా మండపం.
తూర్పు దిక్కున అందంగాతీర్చిదిద్దిన పాలరాతి మెట్లు.
మరో ప్రక్క కళాత్మకంగా నిర్మించిన రాజ వంశీయుల సమాధులు.
వాటిని కాపాడుతూ నిర్మించిన సుందరమైన మంటపాలు ..చారిత్రిక ఆధారలన్నట్లు ఠీవిగా దర్సనమిచ్చేవి. చెరువు కట్ట యెక్కగానే నిలువెత్తు కోట కనిపించేది.
కోట ప్రక్కనే మా కాలేజీ భవనం.
బియే సెకండ్ ఇయర్లోనే..ఆమె నాటిందో ప్రేమాంకురాన్ని నా గుండెల్లో.
అప్పటి వరకు ఆటపాటలతో అమాయకంగా పయనించిన మా స్నేహ నౌకకో గమ్యం .. తీరం కనిపించింది.
‘ఆ రోజు “
నడుచు కుంటూ వెళుతున్న నాకు వెనుక నుండి సైకిల్ బెల్ వినిపించింది.వెను తిరిగి చూసాను.
“అమ్మాజీ”
ఉదయాన్నే తలంటుకున్నట్లుంది.
పున్నమి చంద్రుని చుట్టూ కమ్ముకుంటున్న మేఘాల్లా ఆమె ముఖాన్ని కమ్మేస్తున్న కురులు..ఎర్ర రంగు బోర్డర్ వున్నచిలక పచ్చ పావడా.. తెల్లని పాల రంగు జాకెట్ మీద హంసలా ఎగురుతున్న తెల్లని ఓణి.. పొడవాటి రెండు జడలను అందంగా బంధించిన బ్లూ కలర్ బేండ్స్ ..ఆ రంగుల కలయిక చూస్తూనే
“అమ్మాజీ..భరత మాతాజీ !”
అనేశాను.
సైకిల్ దిగి
“అదేంటి రవి బాబూ!..అందమైన అమ్మాయిని.. అమాంతం మాతను చేసేశావ్..?”
నవ్వుతూ అన్నా..నన్నెక్కడ అపార్ధం చేసుకుందో నని..భయపడి పోయి..
“సారీ .. సారీ అమ్మాజీ!నీ డ్రెస్ చూసి..”
అపాలజీ చెప్తుంటే
“ఓ అదా? మార్నింగ్ అద్దంలో చూసుకున్నప్పుడు నాకూ అలానే అనిపించింది.ఇంకెప్పుడు ఈ కాంబినేషన్ ..”
“నోనో..ఈ డ్రెస్ లో పచ్చని పొలాల మధ్య రెపరెప లాడుతున్న..జాతీయ పతాకంలా ..భరతమాత లా వున్నావ్.”
“అంతేనా?”
అందంగా నవ్వేసింది.
“అది సరే గాని రవిబాబూ! నేను వెనుక కూర్చుంటాను..నువ్వు సైకిల్ సారధివైపోకూడదూ?”
“అమ్మో!”
సాయంత్రానికల్లా..ఈ విషయం మనూర్లో..షాట్ బైషాట్ టాంటాం అయిపోతుంది.. వద్దు.. అమ్మాజీ.”
నా గొంతు నాకే అదోలా అనిపించింది.
“భయమా?”
భయమని కాదు ..ప్లీజ్ నువ్వు వెళ్ళి పో.
అందమైన ఆడపిల్ల ఆఫర్ ఇస్తుంటే....
వద్దు వద్దు నువ్వు వెళ్ళిపో.
నాలో కంగారు మొదలైంది.
పదో తరగతి లో కుడా నీ సైకిల్ మీదే వచ్చే దాన్ని..మరి యింతలో?
అదా ? అప్పుడంటే ఈ అమ్మాయి కుమారి కాదు కదా?
“ఓహో..తమరు ఆ రూట్లో వచ్చారా..ఇవ్వాళ అదే ..చెప్పలేను కానీ..పొత్తి కడుపులో నెప్పింకా తగ్గలేదు.అందులో యెదురు గాలి ..సైకిల్ తొక్కాలంటే ? అందుకే. “
“ఇవ్వాళ మనోళ్ళంతా కాలేజీ కి డుమ్మా.నా ఫ్రెండ్ నిర్మల కూడా..డుమ్మానే.యెవరూ చూడరులే..
ఇక తప్పదనే నిర్ణయానికి వచ్చేసాను. అంతలో తనే వచ్చి నా బుక్స్ తీసుకొని ..వెనుక క్యారేజీ మీద సెటిలై పోయింది.
“అమ్మాజీ !బీ కేర్ ఫుల్..రోడ్ నిండా గుంతలే..”
నెమ్మదిగా కదిలింది సైకిల్..గుండె మాత్రం వీర స్పీడ్ లో అదురుతున్న ఫీలింగ్. వెనుక ఏదో తాకీ తాకని నూతన స్పర్శ. గొంతు తడారి పోతుంటే..మనసుకు కళ్ళెం వేయ బోతుండగా..జరిగి పోయింది..
గోతిలో పడిన ముందు చక్రం అమాంతం గాల్లోకి లేచి పోయింది.ఫలితం యిద్దరం పంట కాలవలో..ఆమె క్రింద.. ఆమెపైన నేను.గుండె గోతుకలోకి వచ్చేసింది.ఆమె పూర్తిగా తడిసిపోయింది .చేయి అందించి నిలబెట్టాను.
వర్షం లో తడిసిన మూడు రంగుల జండాలా ..ముచ్చటగా వుంది.
ఏం చేయాలో అర్ధం కాలేదు.గుండె నిండా గాభరా..భయంగా చూస్తుంటే..
“ఏయ్ రవీ !కావాలనే పడేసావ్ కదూ?”
మాటల్లో తొంగి చూసిన ..సీరియస్ నెస్ కు అదిరిపోయాను.
“నీమీద ఒట్టు..ముందున్న గొయ్యి కనిపించ లేదు..”
“అందమైన అమ్మాయి వెనకుంటే..ముందున్న గొయ్యి కూడా కనిపించ దన్నమాట?”
“సారీ.. సారీ.. సో సారీ..ఇపుడేం చేద్దాం?”
“చేసిందంతా చేసి నన్ను అడుగుతావే? సారీ అంటే సరిపోతుందా?”
“పోనీ నేను మీ ఇంటి కెళ్ళిమీ మదర్ నడిగి..పొడి బట్టలు..”
“మా ఇంటికెళ్ళి ..మీ అమ్మాయి తడిసిన బట్టల్లో ఖహురహో శిల్పంలా వుంది..మీరు పొడి బట్టలిస్తే..అవి తీసేసి ఇవి కట్టి ..”
పెదాలు బిగించి నవ్వుతోంది.తడబడిపోయాను.
“ ఏంటి? బెల్లం కొట్టిన రాయిలా? వెనుక ఏదో పాకుతోంది చూడు..జలగేమో ?”
వెనక్కి తిరిగి నిలబడింది..చూస్తే..జలగే..చెపితే భయపడుతుందని..
“జలగకాదులే ..చేపపిల్ల..”
అంటూ యెడం చేత్తోఆమె భుజం పట్టుకొని కుడిచేత్తో..ఆమె జాకెట్ కూ పావడాకు మద్య నున్న ప్రాంతంలో గట్టిగా పట్టుకున్న జలగను లాగేయబోయాను. యెంత గట్టిగా పట్టేసిందో..ఒకపట్టాన వూడి రాలేదు. తడి చేతుల మూలంగా..జారిపోతోంది.నాకు కంగారెక్కువై పోయింది. ఆమె కుడి జడ ప్రక్క నా పెదాలు ఎప్పుడు చోటు చేసుకున్నాయో స్పృహే లేదు.
“రవిబాబూ!ఐ లవ్ యు..” ఏదో తెలియని మైకం.. ఆరాటం . ఆమె నాకు అభిముఖంగా ఎప్పుడు తిరిగిందో..ఎప్పుడు నా పెదాలు ఆమె అధరాలనులను బంధించాయో?!
క్షణాలు.. నిమిషాలుగా..రూపుదిద్దుకున్నాయి.
సిగ్గుల మొగ్గలా తను..రగులుతున్న కొలిమిలా నేను .
“నా మాటలు వినిపించాయా..? ఐ లవ్ యూ రవిబాబూ?”
“ఐ.. టూ” అనబోయి ఆగిపోయాను ..గొంతులో ఏదో అడ్డు పడిన ఫీలింగ్ .చెల్లా చెదురైన పుస్తకాలను సర్దుకొని నెమ్మదిగా స్నానాల రేవు దగ్గరున్నమంటపం ప్రక్కకు చేరిపోయాం.
“రవీ! నేనంటే నీకు ఇష్టం లేదా?”
ఏం చేప్పాలో నాకు అర్ధం కాలేదు.
ఇంత అందమైన అమ్మాయి కరుణతో వరాలిస్తానంటే కాలదన్నుకుంటానా..కానీ..
అప్పటి వరకు పట్టి పీడించిన సంకోచం పటా పంచలమై పోయింది . “ఐ లవ్ యు అమ్మాజీ..సారీ ప్రేమాజీ.!”
ఆ మాట వింటూనే నా పెదవుల మీద తన పెదవులతో తీయని ముద్ర వేసింది.
“ఎలాగైనా..ఈ కలను నిజం చేసుకుంటాను..”
ఆమెను పొదివి పట్టుకొని చెవిలో గుసగుస లాడాను.
“నాకైతే ఎలాంటి అనుమానం లేదు.టెంత్ నుండీ నువ్వంటే నాకు యిష్టం .బెంగాలీ బాబులా తమరు సీరియస్ టైపు కదా?
అందుకే నా ప్రేమను నాలోనే దాచుకున్నాను. నిర్మల నడుగు నీ గురించి నేను షేర్ చేసుకున్న నా మనో భావాల్ని డైరీ లా చెప్పేస్తుంది. మన కులాలు ఒకటే కదా ? అంతస్తులు అడ్డు పడతాయనుకోను. డిగ్రీ కంప్లీట్ చేసి ఏ హైదరాబాదో చెక్కేసి..ఉద్యోగాలు చేసుకుంటూ పెద్దలకు చెప్పి ..”
పెళ్ళి ప్రసక్తి రాగానే సిగ్గుల మొగ్గై..ఆగిపోయింది.
“మరి అప్పటి దాకా మన విషయం..మనలోనే దాచుకుందాం.”
నా మాటలకు తను
“ఒక్క నిర్మలకు తప్ప.అది నా బెస్ట్ ఫ్రెండ్.ఎవరికీ చెప్పదది.”
యెన్ని సార్లు ముద్దులు పెట్టుకున్నా..దాహం తీరడం లేదు.
“అమ్మాజీ !నీ పెదాల సాక్షిగా..ప్రమాణం చేస్తున్నాను..నువ్వే నా భార్యవి. “ గట్టిగా హత్తుకుంటున్ననన్ను..వారిస్తూ..
అబ్బాయి గారు ఆవేశంలో ఉన్నట్లున్నారు.ఏదైనా పెళ్ళి తర్వాతే.
నా చెవి కొరికి టాటా చెప్పేసింది. మేం అనుకున్నట్లు మా ప్రేమ విషయం మా లోనే దాగిపోలేదు. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఓ వేసవి రోజున దుమారం మొదలై పోయింది.
కబురు చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
అమ్మాజీ హిస్టీరియా వచ్చినట్లు..ప్రవర్తించింది.
“నీ మొఖానికి నన్ను ప్రేమించే ధైర్యమొచ్చిందా?అసలు నువ్వో మనిషివేనా? ఏమాత్రం అభిమానమున్నా.. తిరిగి నాకు కనిపించకు. కనిపించావా ? నీ ముందే బందర్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను. గెటౌట్ అండ్ గెట్ లాస్ట్.”ఏం జరిగిందో అర్ధం కానీ నేను శిలా ప్రతిమ నయ్యాను.
అమ్మాజీ అమ్మా నాన్నలతో బాటు ఊరు ఊరంతా నన్ను అవమానించి నట్లు చూస్తుంటే తట్టుకోలేక ఆ రాత్రికి రాత్రే వూరు వదిలేశాను. “ఆ రోజే ఒట్టు పెట్టు కున్నాను.చచ్చినా జీవితంలో ఆ ఊరినికానీ..అమ్మాజీ ముఖాన్నికానీ చూడకూడదని.”
******
ఆలోచనల మధ్య అక్కడికి ఎప్పుడు వచ్చానో ..అలవాటైన పాదాలు అమ్మాజీ స్టడీ రూం ముందుకొచ్చి ఆగిపోయాయి.
తలుపు తెరిచే వుంది.లోపలి నుండి సన్నగా ఏడుపు.అమ్మాజీ కంఠాన్ని పోల్చుకున్నాను.నిర్మల సముదాయిస్తోన్ది.
“నిమ్మీ! రవిబాబును నేను యెంతగా అవమానించానో నీకు తెలియదు.అతనీ ఊర్లోనే ఉండుంటే మా అన్నయ్య తనను ఈ పాటికి చంపేసి ఉండే వాడు.తన క్షేమం కోసమే అంతగా అవమానించాను.అనరాని మాటలన్నాను .నేనెంత పాపాత్మురాలినో..”
దుఖం తో అమ్మాజీ కంఠం మూగ పోయింది.
“నువ్వూరుకోవే..నేను రవికి లెటర్ రాస్తాను...తన అడ్రస్..”
“ఆపని మాత్రం చేయకు..ఈ జన్మలోనా పాపిష్టి ముఖాన్ని రవి చూడకూడదు.”
అప్పుడు చూసాను తన ముఖాన్ని.
అందమైన తన ముఖం సగం కాలిపోయి..వికృతంగా..
యెక్కడో డైనమైట్..పేలిన శబ్దం..యెక్కడో కాదు నా గుండెల్లోనే.ఆమె దుస్థితికి కారణం నేను. ప్రేమను అర్ధం చేసుకోలేని నేను ఓ అల్పజీవిని .పిరికిపందని .
“నువ్వసలు కుంపటి మీద యెలా పడ్డా వే..నా మీద ఒట్టు..కధలు మాని యిప్పుడైనా నిజం చెప్పవే!”
నేను రవిని అవమానించి పంపినా..మా దున్నపోతు అన్నయ్య రోజూ రవిని అసహ్యంగా తిడుతూ..నన్ను రెచ్చ గొడుతూ
వుంటే ..నేనూ తిరగబడ్డాను .. “ఎస్.. రవే ..నా భర్త..తనతో కాపురం కూడా ..చేసాను ..దమ్ముంటే నన్ను చంపరా పశువా! ..అన్నాను. ఏం ?నా రవిని వాడు తిడుతుంటే భరించాలా ? “
“వాడు నీ అందం చూసేగా ప్రేమించింది.అదే లేకపోతే ..?
తిడుతూ ..బలవంతంగా నా ముఖాన్ని కుంపటిలో ..”
అమ్మాజీ ..అని దిక్కులు పిక్కటిల్లేలా అరవాలనుకున్నాను ..అంతకంటే వేగంగా పోయి ఆమెను నా అక్కున చేర్చుకున్నాను .కాలిపోయిన ఆమె ముఖం మీద లాలనగా నా పెదాలు .ఆమె కన్నీటిని నా పెదాలతో తుడిచేసాను .
నిర్మల ఏదో చేప్పబోతుంటే నమస్కరించి .. అమ్మాజీ చేయి పట్టుకొని పొలాలకు అడ్డంగా .. తెల్లవారకముందే గమ్యం చేర్చే బస్సు పట్టుకోవాలని పరుగులు తీసాను.