"హేయ్ రేవంత్ !ఏంటి ఇక్కడ ?" ప్రధాన సంపాదకుని కాబిన్ లోకి అడుగిడగానే అక్కడ కూర్చుని ఉన్నాతన్ని చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు జయకర్.
సమాధానం చెప్పకుండా మొహం తిప్పుకున్న వాడిని వదిలి బాస్ వైపు చూసాడు. ఆయన కోపంగా లాప్ టాప్ ను తిప్పి, "ఈ క్లిప్పింగ్ ఎందుకు టెలికాస్ట్ చెయ్యలేదు?" అన్నాడు.
స్క్రీన్ వైపు తీక్షణంగా చూస్తున్నాడు జయకర్. ఎక్కడో చిక్కుకుపోయిన ఆవు, దూడా వరద ఉధృతికి తెగినగట్టు మీంచి ఒకదాని తరువాత ఒకటి మెల్లగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ముందు గట్టు మీద తరవాత నీటి ప్రవాహంలో మునిగిపోయే వరకు మొత్తం పదినిమిషాల ఫుటేజి. మొన్న టి తుఫాను అప్పుడు కవరేజికి వెళ్లిన రేవంత్ చిత్రీకరించి పంపించిన వీడియో అది. వార్తా ఛానల్ ఫీచర్స్ ఎడిటర్ గా ఏది ప్రసారం చెయ్యాలో నిర్ణయించే అధికారం జయకర్ కు ఉంది. తాను తీసిన దానిని చూపించలేదని ఫిర్యాదు చెయ్యడానికి రేవంత్ అక్కడకు వచ్చాడని అప్పుడతనికి అర్ధం అయ్యింది.
"చెప్పండి జయకర్ ! వై డిడ్ నాట్ యూ ఎయిర్ థిస్ ?" కాస్త గట్టిగానే అడిగాడు ప్రధాన సంపాదకుడు ఈ సారి. "కమాన్ గివ్ మీ వన్ డామ్ గుడ్ రీసన్ ఫర్ నాట్ అప్లోడింగ్. ఏమి చేస్తుంటావయ్యా నువ్వు? అసలు చూసావా ఈక్లిప్పింగ్? చెప్పూ ... " నీళ్లు నములుతూ ఏదో చెప్పబోయాడు, ఇంత లోనే "ఇప్పుడు రేవంత్ రిజైన్ చేసి వెళ్లిపోతానంటున్నాడు. ఏమి చేయమంటావు?" అన్నాడు.
"అదీ...... అలా ఎందుకు ...... " అంటూ ఏదో చెప్పబోయాడు జయకర్.
" ఏంటీ ? ఇది ఆ టైములో జనాల్లోకి వెళ్ళితే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేదో తెలుసా? మన బులెటిన్ల కిేటింగ్ పెరిగేది కదా ?ఎందుకు తీసెసావు?"
"నేను ఫేసుబుక్ లో పెడితే 700 లైకులు వచ్చాయి సార్. మా ఫ్రెండ్స్ అందరూ వ్వాట్ సాప్ గ్రూప్స్ లో షేర్చేశారు. రేపు మన బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళ సమ్మిట్ లో తప్పకుండా బహుమతి నాకే వస్తది సార్. అది మన చానలుకి పేరు తీసుకొస్తది కదా ? నేను ఎంతో కష్టపడి తీస్తే మీరు అసలు వెయ్యకుంటే ఎట్లా సార్? నాకు పేరెలా వస్తాది ? అందుకే ఎళ్లిపోతా" అప్పటి వరకూ మౌనంగా ఉన్నా రేవంత్ నోరు విప్పాడు.
"చెప్పు - అతనికి ఏం సమాధానం చెప్తావో చెప్పు" అన్నాడు ప్ర. సం . నోరు ఎత్తలేదు జయకర్. కాసేపు చూసి , "రేవంత్... నువ్వు వెళ్లనవసరం లేదు. నీకు స్పెషల్ ఇంక్రిమెంట్ కోసం యాజమాన్యానికి సిఫారసు చేస్తాను. నువ్వు రాజీనామా వెనక్కి తీసుకో" అని
"జయకర్.... అచ్ గదుల్లో కూర్చొని రోజంతా ఆలోచించి ఆనాటి విశేషాల గురించి మీరు ఎంతో గొప్పగా చెప్పవచ్చు కానీ స్వయంగా ఫీల్డ్ లోకి వెళ్లి ఆ క్షణం అక్కడి పరిస్థితిని యధాతధంగా అందించడం ఎంత కష్టమో మీకు తెలియదు. అందుకనే ఇలాటి ఫోటో జర్నలిస్టులు పడే ఇబ్బందులు మీకు తెలియవు. ఇంకెప్పుడూ ఇలాటిది జరగనివ్వకండి. వెంటనే మొన్నటి తుఫానులో జరిగిన విధ్వంసం అని ఒక అరగంట ప్రోగ్రాం తయారుచేసి ఈ క్లిప్పింగును మార్చి మార్చి రోజంతా ప్రసారం చెయ్యండి. దీనిని జనాల్లోకి తీసుకెళ్లడం మీ భాద్యత. ఇక వెళ్ళండి." అన్నాడు ప్ర. సం. సంతోషంగా రేవంత్, నిర్వేదంతో జయకర్ బయటకు నడిచారు.
* * *
ఆఫీసు బయట ఉన్నా టీ కొట్టు ముందు టేబుల్ మీద కూర్చుని పక్కవాళ్లతో ఏదో చెప్తున్న రేవంత్ - నీరసంగా బయటకొచ్చిన జయకర్ ను అస్సలు పట్టించుకోలేదు. వాళ్ళని దాటుకు వెళ్లి టీ తీసుకొన్న జయకర్ ఎదురుగా ఉన్న ఇంకో టేబుల్ మీద కూర్చుని ఒక్క గుక్క వేసి చేతిలోని కప్పును రేవంత్ వైపుకు విసిరాడు. ఓరకంట అతన్ని గమనిస్తుండటం మూలానో ఏమో, పక్కకి ఒరిగి తప్పించుకున్న రేవంత్, ఒక్క ఉదుటన లేచి మీద కొచ్చాడు. పక్క వాళ్ళు అతన్ని జబ్బ పట్టి ఆపారు.
"నీతో కొంచెం మాటలాడాలని అలా చేసాను సోదరా . నేను చెప్పేది విను" అంటూ అతని రెండు భుజాల మీదా చేతులేసి కూర్చో పెట్టి, తానూ పక్కనే కూర్చున్నాడు జయకర్.
"ఇప్పుడు నేను కప్పు విసరంగానే నువ్వు పక్కకు ఒరిగావు చూడు దానినే రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ప్రతిస్పందన అంటారన్న మాట. వెంటనే లేచి నా మీది కొచ్చావు చూడు అది ప్రతిచర్య - ఇవి మనిషి లక్షణాలు. కానీ
నిస్సహాయంగా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న మూగ జీవాల్ని నీ కెమెరాలో బంధిచడం ఉందే అది అమానవీయం. మనిషిగా ముందు నువ్వు స్పందించాలి ఆపై అక్కడ జరుగుతున్న నష్టాన్ని నిలువరించే ప్రయత్నం ప్రతిచర్యగా చేపట్టాలి" అర్ధం కాక చూస్తున్న రేవంత్ ను చూస్తూ, " అంటే గట్టు తెగి మెల్లగా నీళ్ళ ల్లోకి జారిపోతున్న జీవాల్ని చూసి ముందు నువ్వు అయ్యో అనాలి. ఆ తరువాత నీ చుట్టు పక్కల వాటిని కాపాడగలిగేందుకు ఉన్న అవకాశాల కోసం చూడాలి. నీకు ఈత వస్తే ప్రవాహంలోకి దూకి ఆ పశువుల్ని ఒడ్డుకు లాగే ప్రయత్నం చెయ్యాలి. అంతే కానీ నీ కంటికి ముందు కెమెరా అడ్డు పెట్టుకొని, ఆసరా కోసం ముందుకు చాచాల్సిన చేతుల్ని లెన్స్ తిప్పుతూ రకరకాల యాంగిల్స్ లో అగుపడినంత వరకూ వాటి మరణయాతన చిత్రీకరించడం కోసం ఉపయోగించడం హేయం" నిష్కర్షగా మాటలాడుతున్న జయకర్ ను చూసి తలదించుకున్నాడు రేవంత్.
ఇందాక తాను విసిరిన కప్పులోంచి చిమ్మి మీద పడిన టీ చుక్కల్ని తుడుచుకుంటున్న వాడిని అనునయంగా చూస్తూ, "నేను యూనివర్సిటీ నుంచి బయట కొచ్చాక ఢిల్లీలో ఒక జాతీయ పత్రికలో జాయిన్ అయ్యాను. అక్కడి కోట్లా మైదానంలో ప్రతి ఆదివారం క్రికెట్ ఆడేవాళ్ళం. అప్పట్లో పాకిస్తాన్ దేశ క్రికెట్ జట్టు భారత పర్యటనను వ్యతిరేకిస్తూ కొందరు ఓ రోజు అర్ధరాత్రి పిచ్ నితవ్వడం మొదలెట్టారు. మా పాత్రికేయులకి సమాచారం అందితే కెమెరాలు తీసుకొని వెళ్లాం. అందరూ దూరం నుంచి ఆదృశ్యాల్ని ఫోటో తీస్తుంటే, ఎప్పుడూ అక్కడ ఆడుకొనే నేను చూస్తూ ఉండలేక అడ్డం వెళ్ళాను. వాళ్ళు నన్ను కూడా కొట్టినా ఉద్యోగం కూడా తీయించి వేశారు. తరవాత మా ప్రొఫెసర్ దయవళ్ళ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ లో భారత ప్రతినిధిగా పని చేసాను. ఆ ఏడాది ఉత్తమ స్టిల్ ఫొటోగ్రాఫ్ అవార్డు కోసం హాంగ్ కాంగ్ నుంచి అనుకుంటా ఒక ఫోటో వచ్చింది. అక్కడి ఫ్లైఓవర్ మీది నుంచీ పడిపోతున్నా బస్సు ఫోటో అది. భయంతో హాహాకారాలు చేస్తున్నా ప్రయాణికులు, గాల్లో ఉన్న బస్సు ఇది చిత్రం. అది ఆ ఏడాది ప్రపంచ ఉత్తమ ఛాయాచిత్రంగా బహుమతికి ఎన్నుకోబడింది. దానిని వ్యతిరేకిస్తూ ఆ సంస్థకు రాజీనామా చేసి వచ్చేసాను. ఆపదలో ఉన్న సాటి మనిషిని చూసిన వాడికి ఏమి చెయ్యాలా అనిపించాలి గాని, ఏ అంగెల్లో ఫోటో తియ్యాలా అనే ఆలోచన రాకూడదు అనేది నా వాదన. ఆ మధ్య లాతూర్ భూ కంపంలో శిధిలాల మధ్య చిక్కుకొన్నా ఒక చిన్నారి విగత శరీరాన్ని తీసి పంపారు మన వాళ్ళు - నేను వెయ్యలేదు. అన్ని పత్రికల్లో వచ్చింది మన దానిలో లేదని సంపాదకుడు గొడవ చేశాడు. ప్రాణాలు కోల్పోయి, కనుగుడ్లు కుక్కలు పీక్కు తినేసిన
ఆ బుజ్జాయికి చేతనైతే సమాధి కట్టించమన్నాను. ఇదిగో కొత్తగా పెట్టిన మన ఛానల్కి వేసేసారు నన్ను. ఇలా నాకు ఎదురైన సంక్లిష్ట సందర్భంలో మనిషిగా రియాక్ట్ అయ్యానే కానీ ఎవరిమీదా ద్వేషమో, దురభిప్రాయమో కాదు. మొన్న నువ్వు పంపిన వీడియో విషయంలో కూడా అంతే. నీలోని ఆ మనిషితనాన్ని మేల్కొల్పమని చెపుదాం అనుకొన్నా - ఈ లోగానే నువ్వు కంప్లైంట్ చేసేసావు " అని అనునయంగా భుజం తట్టాడు.
"నిజమే అన్నా! నీటిలో కొట్టుకు పోతూ ఆ ఆవు చుసిన చూపు నాకింకా గుర్తువుంది. ఏదో అందరూ మెచ్చుకుంటారని ఆశ పడ్డానుగానీ...." అంటూ ఆగిపోయాడు రేవంత్.
"చూడు తమ్ముడు, అక్కడ మన ఆఫీసు గేటు ముందు ఉన్నా చ్చ్ కెమెరా ఇందాక ఇక్కడ జరిగినదానిని రికార్డ్ చేసే ఉంటది. కానీ అది ఏమైనా చెయ్యగలిగిందా ? లేదే. నేను గ్లాసు విసరంగానే నీకు అటు పక్కన కూర్చున్నాతడు నిన్ను పక్కకు తోసాడు, ఇటు పక్కన కూర్చున్నవాడు చెయ్యి అడ్డు పెట్టాడు. అదీ ప్రచలనము. ఆ ఆవు స్థానంలో మనిషిని ఉహించుకో, తోటి మనిషిగా ఆ ప్రమాదం నుంచి రక్షించడానికి నువ్వేదో చేస్తావని నీ మీద గంపెడు ఆశ పెట్టుకొని, కొట్టుకు పోతూ సహాయం కోసం ఎంత అరిచేవాడో కదా? నువ్వు మాత్రం వీడియో బాగా రావాలని నీ కెమెరా లెన్సు తిప్పుతుంటే నిన్ను ఎంత నిందించే వాడో ఆలోచించు, నిన్ను అలాటి ఆత్మాక్షోభ నుంచీ రక్షించాలనే ఇలా చేసాను" సాలోచనగా తల ఆడిస్తున్నాడు రేవంత్.
" ఇప్పుడు ఏంతో ఎత్తుకు ఎగిరే డ్రోన్లు, ఏంతో దూరంలోని దృశ్యాన్ని చక్కగా చూపించగలిగే లెన్స్ కెమెరాలు అందుబాటులో కొచ్చాయి కానీ అవి కేవలం అక్కడి ప్రమాదాన్ని మాత్రమే చూపిస్తాయి ఇంకేమీ చెయ్యలేవు - మరి మనిషిగా నిన్ను నువ్వు వాటినుంచీ వేరుచేసుకొని నిలబడాలంటే వెంటనే ప్రతిస్పందించాలి. నువ్వేదో చేసేస్తావని కాదుగానీ, యాంత్రికంగా నిలిచిపోకుండా - మనిషిగా అప్పటికప్పుడు అదాటున నీలో చలనం కనపడాలి. అదీ చైతన్యశీలత. నేనొక్కడినే ఏమి చేస్తాను, రికార్డు చేస్తే లోకానికి తెలియ చెప్పగలను లాంటి ఊకదంపుడు మాటలు కాదు ఏదో ఒకటి చెయ్యాలి అని నీలో కదలిక కనపడాలి. చెయ్యి ముందుకు చాచాలి, అడుగు ముందుకు పడాలి"
"అర్ధం అయ్యింది అన్నా! " అన్నాడు స్థిరంగా రేవంత్.
"మొన్న చౌరస్తాలో లారీ గుద్ది మరణించిన మన గుమాస్తాకు జరిగిన ప్రమాదాన్ని అక్కడి హైమాస్ట్ లైటుకు ఉన్నా సీసీ కెమెరా చాలా క్లియర్గా రికార్డు చేసింది. దానిని మనం ఒక్క సారి చూపిస్తే స్థానిక టీవీ ఛానల్ వాళ్ళు రోజంతా పదే పదే వేశారు. ఆ కుటుంబం దాన్ని చూసి ఎంత బాధ పడ్డారో తెల్సా? వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, మావాడు ఒక్కసారిగా పోయాడు, మీరు మమల్ని పదే పదే చంపుతున్నారు అని గొడవ చేస్తే అప్పుడు ఆపారు. ఇవన్నీ నీకు చెప్పి నీలోని మనిషిని మేల్కొల్పాలనుకొన్నా అంతే" అని చెప్పి ముందుకు నడిచిన జయకర్తో జత కలిసాడు రేవంత్..