తాడిని తన్నేవాడు. - బాసు

tadini tannevadu

సుబ్బూ మళ్లా తప్పినట్లున్నాడు. బామ్మ కాంతమ్మ, వంటింట్లో గిన్నెలు పగిలిపోతాయేమో అన్నట్లు తెగ చప్పుడు చేస్తున్నాది.

కాలుకాలిన పిల్లిలా ఆఫీసు నుండి సుబ్బులు వచ్చేడు.

సంగతి అర్ధం కావడానికి ఓ గంట పట్టింది.

నిన్న చూసిన పెళ్లి వారికి సుబ్బులు నచ్చలేదని.

బామ్మ సణుగుడు.

ఏం చేయాలి?

ముసలిదాన్ని చూసి జాలేసింది. ఒక్కర్తీ పని చేసుకోలేకపోతున్నాది.

సుబ్బులు పరిస్తితి మరీ దారుణంగా తయారయింది.

రెండు మెతుకులు కతికి, బామ్మ పడుక్కోగానే బెడ్రూం అంతా జాగింగ్ ట్రాక్ మీద నడకలా నడవటం ప్రారంభిచేడు.

సుబ్బులు రాత్రంతా పడుక్కోలేదు, పెళ్లి చూపులు ఎందుకు ఫెయిలయ్యాయని.

* * *

ఆఫీసు గేటు దగ్గర దర్వాను సెల్యూట్ అందుకోవాలన్న ఇంగితం మర్చిపోయేడు సుబ్బారావ్.

అసలు పేరు సుబ్బారావే. తల్లీ-తండ్రీ కారు ప్రమాదంలో చనిపోతే, నాలుగేళ్లున్న అతన్ని అమ్మమ్మ పెంచి పెద్ద చేసింది. ఆవిడకీ ఎవరూ లేరు.

సుబ్బులు పుట్టక ముందే ఆవిడ భర్త కాలం చేశేడు.

బాధ తెలియకుండా పెంచిందామె.

తల్లీ-తండ్రీ పోయిన సుబ్బులు, రాత్రులు ఎక్కువగా ఏడుస్తుండేవాడు. కొద్ది రోజులయేసరికి కంటి వ్యాధి సోకింది.చిన్న చిన్నగా వున్న చత్వారం, వయసుతో పోటీపడి మరీ పెరిగిపోయింది.

సుబ్బులు ప్రస్తుత స్కోరు మైనస్ ఐదు. అదీ అసలు విషయం, అతని పెళ్లి చూపుల తిరస్కరణకి కారణం.

చదువుకున్నవాడైనందువల్ల, చత్వారం తగ్గించుకునే అన్ని చిట్కాలూ ప్రయోగించుకున్నాడు.

అబ్బే, రావడం దానిష్టం। పోవడం అంత తొందరగా పోతుందా?

సుబ్బులు శారీరకంగా బాగున్నా, కళ్లద్దాలు పెట్టుకోగానే

పొప్పట్ లాల్ - ఉల్టా ఛష్మా లా వుంటాడు.

దృష్టి లోపాలు, రకాలు, ఎలా వస్తాయి, ఏ ఏ విటమిన్లు తగ్గితే, ఏ రకమైన లోపమొస్తుంది? దానికి ఏంతినాలి? లాంటి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకున్నాడు.

అంతే కాదండోయ్, సూర్యరశ్మి వల్ల కూడా తగ్గుతుందంటే సూర్యోదయమప్పుడు అరగంటా, సూర్యాస్తమానంకి అరగంటా కేటాయించి ఎండలో కూర్చుంటాడు.

అయినా దృష్టిలోపం సుబ్బుల్ని క్షమించలేదు. కానీ అదృష్టం స్కోరు పెంచుకోలేదు. గత మూడేళ్లుగా మైనస్ ఐదే.

సుబ్బులు ఏంచేసినా, ఎంత చేసినా దృష్టి లోపం తగ్గలేదు.

* * *

"ఏమిటి విశేషాలు సారూ" అటెండరు అప్పలరాజు పిలుపుతో ఈలోకంలోకొచ్చేడు సుబ్బులు.

నీస్సత్తువ, నోరు విప్పి మాట్లాడితే కన్నీళ్లు వరదై పారుతాయన్నట్టుంది సుబ్బులు పరిస్ధితి. ఆఫ్టరాల్ ఓ పిల్ల రిజెక్ట్ చేయడమా. చేస్తే చేసింది పో.

తను ఎంతో ప్రేమగా చూసుకునే కళ్లద్దాలని వెటకారం చేస్తుందా.

సుబ్బులు పరిస్తితి మయసభలో భంగపడిన దుర్యోధనుడిలా తయారయ్యింది. వెటకారమాడితే ఆడింది పో. వాళ్ల బాబుకి బుద్ది వుండక్కర్లే.పిల్లని సరిగా పెంచొద్దూ. బుద్ది లేకపోతే పో. వార్తాహరుడుకైనా బుద్దివుండక్కర్లా, మా ముసలమ్మకి చెబుతాడా. చెప్పేడు పో. కోపమోచ్చి ఆవిడ నాలుగు గిన్నెలు లొత్తలు పెడుతుందా? లొత్తలు పెట్టింది పో. నాకెందుకు చెప్పవలె. చెప్పింది పో. నేనెందుకు బాధపడవలె.

అప్పల్రాజు వెలితో సుబ్బులు భుజాన్ని పొడిచేడు.

"సారూ, ఏమైంది? పరాకుగా వున్నారు" నెమ్మదిగా అప్పల్రాజు అడిగేడు. ఆఫీసులో అందరికీ తలలో నాలికలాంటి వాడు

అప్పల్రాజు చాకులాంటి కుర్రాడు. ఏ పనైనా ఇట్టే చక చకా చేస్తాడు. స్వంత పన్లు కూడా పురమాయిస్తారు విధేయుడని. వాడికి అందరి రహస్యాలూ తెలుసు, అయినా సంస్ధ రాజకీయాలకి దూరంగా వుంటాడని అందరూ చేరదీస్తారు. ఇరవై ఏళ్ల లోపే వుంటాయి, కుటుంబ బాధ్యతల వల్ల పని మీద శ్రధ్ద పెడతాడు.

సుబ్బులుని గురూగారని పిలుస్తాడు.

సుబ్బులు మెదడు వేడి తగ్గించుకునే ప్రయత్నంలో వున్నాడేమో, అప్పల్రాజుకి విషయం పూసగుచ్చినట్లు చెప్పేడు.

అప్పల్రాజు పగలబడి నవ్వుతూ "ఓస్ ఇంతేనా గురూగారు, ఈమాత్రానికే ఇంతగా బాధపడాలా? "

ఏం చెయ్యమంటావయ్యా? రోజూ మా ముసల్ది ప్రాణాలు తోడేస్తున్నాది.

"సాయంత్రం మాట్లాడుకుందాం సార్, ఎవరో పిలుస్తున్నారు" అంటూ గదిలోంచి అప్పల్రాజు బయటికెళ్లి పోయేడు.

సుబ్బులు గట్టిగా ఊపిరి వదిలి పనిలో నిమగ్నమయ్యేడు.

* * * *

ఇరానీ రెస్టారెంటులో చాయ్ తాగుతూ "సార్ కళ్లద్దాలు లేకుండా వుండలేరా? " అప్పల్రాజు ప్రశ్న.

"అలవాటై పోయింది, ఎప్పుడూ ప్రయత్నించలేదు" సుబ్బులు జవాబు.

"ఓ రెండు మూడు నెలలు ట్రైచేయండి." అప్పల్రాజు బిల్లివ్వడానికి జేబులో చెయ్యి పెడుతుంటే, సుబ్బులు వారించి బిల్లు చెల్లించేడు.

"రేపటి నుండీ సాధన చేయండి సార్." అంటూ అప్పల్రాజు సైకిలెక్కేడు సుబ్బుల్నొదిలి.

ఆఫీసుకి దగ్గర్లో మకాం కాబట్టీ సుబ్బులు రోడ్డు కొలత మొదలు పెట్టేడు ఇంటి వైపు.

అప్పల్రాజు సలహా మీద సుబ్బులు కళ్లద్దాలు లేకుండా వుండటానికి నిశ్చయించు కున్నాడు.

పగటి పూట ఇబ్బంది వుండేది కాదు. చిక్కల్లా చీకట్లోనే.

సాధన బాధాకరంగా వుండేది.చీకట్లో మూడు నాలుగుసార్లు రోడ్డు మీద పడిపోయేడు. ముణుకులు చెక్కుకుపోయేయి. పట్టువదలని విక్రమార్కుడిలా నెమ్మదిగా సుబ్బులుకి కళ్లద్దాలు లేకుండా వుండటం అలవాటయింది.

కొన్ని రోజులకి సుబ్బులుకి మరో సంబంధం వచ్చింది. బామ్మ సంబరపడింది. దేవుళ్లకి పూజల లంచం ఆశ పెట్టిందేమో? సుబ్బులు, ముందుగానే చూశేడేమో, నచ్చుకున్నాడు. బెట్టు చేయాల్సిన చోట బెట్టు చేసి పెళ్లి చూపులలోనే ఓకే చేశేశాడు.

అసలు విషయాన్ని దాచిపెట్టటం సుబ్బులికిష్టం లేదు.

అప్పల్రాజు శిష్యుడు మాత్రం గీతోపదేశం చేశేడు.

"నెమ్మదిగా పెళ్లయ్యిం తరవాత చెప్పండి గురూగారూ" అని.

సుబ్బులు ఆత్మసాక్షి ఒప్పుకోవటం లేదు. అదే అన్నాడు కూడా.

"మీరేం తప్పుచేయటం లేదు కదా సార్. పెళ్లయ్యిన మొదటి రాత్రి చెప్పండి. ఇదేం మోసం కాదుగా? "

అప్పల్రాజు అభయ హస్తం.

* * * *

దిగ్విజయంగా సుబ్బులు పెళ్లి జరిగింది.

మనస్సాక్షి గోల ఎక్కువయింది. ఇక లాభం లేదనుకుని ఆ రాత్రే చెప్పడానికి నిశ్చయించుకున్నాడు.

* * * *

పట్టు పరుపు. మనసుకి మత్తేక్కించే అత్తరు వాసన. వాసన మాత్రమే వచ్చే అగరుబత్తీ ధూపం. మల్లెల ఘుమ ఘుమలు. ఎదో లోకంలో విహరిస్తున్నట్టున్నాది, సుబ్బులుకి. ఒకటికి పది సార్లు జేబులో కళ్లద్దాల్ని తడుముకున్నాడు.

చిరు కాంతి. జారిపోతున్న గుండె. ఎగేయటం కష్టమవుతున్నాది సుబ్బులుకి.

క్షణమోక యుగంలా గడుస్తున్నాది.

సుబ్బులు నెమ్మదిగా కిటికీ వారగా వెళ్లి, కళ్లద్దాలు పెట్టుకున్నాడు.

నెమ్మదిగా అమ్మాయి గదిలోకొచ్చిన మువ్వల చప్పుడు.

తలుపు తెరిచి ఆడంగులు అమ్మాయిని గదిలోకి నెట్టేరు.

పక పకలు, వ్యంగ్యాలూ, తలుపుమూసి గడియ పెట్టిన చప్పుడు.

సుబ్బులు హృదయ స్పందన మారుతున్నాది. సెన్సోఫోనిక్, స్టీరియో సౌండ్ తో గుండె చప్పుడు వినిపిస్తున్నాది. భయంకరాతి భయంకరంగా.

తలతిప్పి చూడ్డానికి భయప్పడ్డాడు.

మువ్వల చప్పుడు శ్రావ్యంగా వినిపిస్తున్నాది.

నెమ్మదిగా వీణ తంత్రులు మీటినట్టు "నేనొచ్చేను" అందా అమ్మాయి.

ఎక్కువ బెట్టు చేస్తే బాగుండదనుకున్న సుబ్బులు, నెమ్మదిగా కళ్లద్దాలు ముక్కు చివరకి సున్నితంగా వేళ్లతో నడుతూ చూసేడు.

ఎవరీ అమ్మాయి? ప్రశ్నార్ధకం మొహం పెట్టి, ఆలోచనగా అనుమానంగా .

గుండ్రటి ముఖం.కోల కళ్లద్దాలూ.

"నేనేనండీ, పెళ్లికి ముందే చెబుదామనుకున్నా. కానీ కళ్లద్దాలున్నాయని చాలా సంబంధాలు తప్పిపోయేయి. మా అమ్మ చెప్పొద్దని, కట్టడి చేసింది......"

ఇంకా ఎం చెప్పిందో వినపడలేదు సుబ్బులుకి ఉరఫ్ సుబ్బారావుకి.

ఎవరో నెత్తిన కొట్టి, "తాడిని తన్నేవాడుంటే, తలదన్నే వాడుండడా సుబ్బూ" అన్నట్టు వినిపించింది స్పుృహ కోల్పోయేడు పాపం సుబ్బారావు.

కింద పడిపోకుండా పట్టుకుందా కళ్లద్దాల పెళ్లికూతురు.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు