పాత ఆలోచనల కొత్త మనిషి. - గంగాధర్.వడ్లమన్నాటి

pata alochanala kotta manishi

హాపీ బర్తడే మధూ చెప్పింది అతని స్నేహితురాలు మౌనిక .పుట్టినరోజు శుభాకాంక్షలు మదూ .చెప్పాడు మరో స్నేహితుడు శేఖర్ ,మధుకి రంగు,రంగుల పూల బొకే ఒకటి చేతికందిస్తూ .

మధు ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ .ఈరోజు అతని పుట్టినరోజు కావడంతో, స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వచ్చి,ఇలా ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి మరీ శుభాకాంక్షలు చెప్తున్నారు.వారి విషెస్,ఆ హడావుడి తగ్గాక, మధు ఇచ్చిన అల్ఫాహార విందు కానిచ్చారు. ఆ తర్వాత మధు,తను లేటెస్టుగా డిజైన్ చేసిన ఓ మాడ్రన్ షర్టుని వారికి చూపించి ,ఎలా ఉంది ?అడిగాడు ఉత్సాహంగా.అందరూ దాని వంక ఓ క్షణం పాటు చూసి ,వావ్ ,చాలా బావుంది .ముఖ్యంగా ఆ షర్టు కాలర్ నల్లరంగులోనూ,చొక్కా నీలం రంగులోనూ, ఫుల్ హాండ్ చివర మళ్ళీ నల్ల రంగులోనూ ఉండటం వలన షర్టు అందం మరింత పెరిగింది.చెప్పాడు స్నేహితుడు హరి,కళ్ళప్పగించి మరీ ఆ చొక్కా వంక చెక్క బొమ్మలా చూస్తూ.

మరే, అయినా మన మధు ఫ్యాషన్ డిజైనింగులో రాకెట్టులా దూసుకుపోతున్నాడoటే ,అతని కత్తి లాంటి కొత్త ఐడియాలే కారణం.మధుది బుర్ర కాదు పాదరసం నిండిన తొర్ర. వీడు తలుచుకుంటే, సుబ్బయ్యని కూడా సూపర్బుగా తయారుచేయగలడు .కనుక ఈ సారి కూడా ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనింగ్ కాంటెస్టులో వీడె ఫైనల్ విన్నర్ ,చెప్పాడు మరో స్నేహితుడు గిరి, చాలా నమ్మకంగా.
అతని మాటలు విన్న మధు స్నేహితురాలు మౌనిక ,అతనికి కాస్తంత దగ్గరగా వచ్చి ,చెవిలో, ఎంత పెద్ద ఫ్యాషన్ డిసైనర్ అయితే మాత్రం ఏం లాభం గిరీ ?భార్యగా ఓ పల్లెటూరి అమ్మాయిని కట్టుకున్నాడు.పైగా ఆమెకి ఈ పాత్యాత్త దుస్తులంటే పడదు.అంచేత ఆమె మధుతో ఎక్కడికి వెళ్ళినా ,నేత చీరలూ ,రోత, పాత మాడెల్ డ్రెస్సులే వేస్తుందాయే. అందుకేనేమో ,ఆమెని మన మధుతో పాటు చూస్తే ,లాప్ టాప్ పక్కన పలకా, బలపాన్ని పెట్టినట్టూ, ఫ్రిజ్జి పక్కన మట్టి కుండని ఉంచినట్టూ ,ఏ.సి పక్కన విసన కర్రని తగిలించినట్టు అనిపిస్తుందంటే నమ్మండి నాకు .చెప్పిందామే పక .పకా నవ్వేస్తూ.

అయినా మౌనికా,మధు తలుచుకుంటే ఆమెకి కూడా మంచి మాడ్రన్ డ్రెస్సెస్ డిజైన్ చేయగలడు .కాకపోతే బలవంతంగా ఎందుకు ఆమెపై తన ఇష్టం రుద్దడం అనీ ,అలా ఆమెకి నచ్చిన సంప్రదాయమైన డ్రెస్సులు వేసుకునే అవకాశం ఇచ్చాడేమో .చెప్పాడు గిరి.
అది నిజమే కానీ చూసేవారికి అలా అనిపించక పోవచ్చు.మధు డిజైన్ చేసిన డ్రెస్సెస్ నచ్చకో ,లేక ఎబ్బెట్టుగా ఉంటాయనో ,మరేదైనా కారణం అయుండొచ్చని అనుకుంటారు.కానీ ,ఇలా ఇంత పాజిటివ్ గా ఎవరు ఆలోచిస్తారు ?మూతి విరిచిందామే.
వాళ్ళిద్దరి మాటలూ మధు చెవిన పడనే పడ్డాయి .చాటుగా ,మౌనంగా, క్రికెట్ ఎంపైర్లా చూస్తుండిపోయాడే తప్ప ఏం మాట్లాడలేదు .కారణం,మధు మనసులోని కోరిక కూడా అదే.మౌనిక మాటలు ఆ కోరికకి మరింత ఊతం ఇచ్చాయి. కొద్దిసేపటికి వాళ్ళంతా వెళ్ళిపోయారు.

తర్వాతి రోజు పొద్దునే లేచిన మధు ,కొన్ని వెస్ట్రన్ డ్రెస్సులని పైకి తీసి పెట్టి ఉంచాడు.తర్వాత కొద్ది సేపటికి ,గుడి నుండి వచ్చిన తన భార్య లలితకి వాటిని చూపిస్తూ ,ఇవి ఎలా ఉన్నాయి లలితా. అడిగాడు చిన్న నవ్వుతో.

బానే ఉన్నాయండి.కానీ మరీ ఇలా ఇంత బిగువుగా ,కురచగా ఉంటే,అమ్మాయిలు వీదుల్లోకి ఎలా వేసుకువెళ్తారండి పాపం.
అడిగిందామె ఆ బట్టలవంక అమాయకంగా చూస్తూ.

ఆమె మాటలకి మధు,పళ్ళు పట ,పటా కొరుకుతూ,నీకిదే తెల్సు పల్లెటూరి గబ్బిలాయి .నిన్ను నాతో పాటు ఎక్కడికన్నా తీసుకెళ్లాలంటే ,నాకు చాలా సిగ్గెస్తోందంటే నమ్ము.ఎప్పటినుండో పోరుతున్నా నీ శైలి మారలేదు .చెప్పాడు అసహనంగా.

భలే వారేనండీ!మీకేందుకండీ అంత సిగ్గు.నేను ఒళ్ళు కనబడకుండా సంప్రదాయమైన చక్కని బట్టలే వేసుకుంటున్నానుగా.అయినా నాకు నచ్చిన బట్టలు నేను వేసుకునే స్వేచ్చ కూడా నాకు లేదాoడీ అడిగిందామే అమాయకంగా .

గాడిద అండం. నేను పెద్ద ఫ్యాషన్ డిసైనర్ .అయినా మా అమ్మ మాట కాదనలేక ,నీకు బావనైన పాపానికి, నీలాంటి పాత కాలం మనిషి మెడలో తాళి కట్టాను.ఇదిగో ఇలా అనుభవిస్తున్నాను.అసలు నేను ఎలాంటి మోడ్రన్ డ్రెస్సెస్ డిజైన్ చేస్తానో తెల్సా .అలాంటిది ,నువ్వు నాతో బయటికి వచ్చేపుడు ఇలాంటి ముతక బట్టలు వేసుకుంటే నా తల కొట్టేసినట్టయిపోతోంది .అందుకే నువ్వు అరిచి గీ పెట్టినా ,ఈ సాయంత్రం మనం వెళ్లబోయే పెళ్లి రిసెప్షన్ కి నేను డిజైన్ చేసిన మాడ్రన్ డ్రెస్ వేసుకు తీరాలి.అంతే .లేదంటే నీ అంతే అని ఆమెతో నిర్లక్ష్యంగా అనేసి,కుర్చీలోంచి లేచాడు. ఎదురుగా బుక్ షెల్పులో చలం గారి “స్త్రీ” పుస్తకం కనబడింది. స్త్రీకి కూడా శరీరం ఉంది,దానికి వ్యాయామం ఇవ్వాలి.ఆమెకి మెదడు ఉంది,దానికి జ్ఞానం ఇవ్వాలి.ఆమెకి హృదయం ఉంది,దానికి అనుభవం ఇవ్వాలి.స్త్రీ పురుషులు నిజమైన స్నేహితులూ,దంపతులూ కావాలంటే ,ఇద్దరికీ సంపూర్ణ స్వేచ్చ ఉండాలి అనే చలం గారి పుస్తకంలోని మాటలు అతని చెవుల్లో వినిపించినట్టనిపించినా పెద్దగా పట్టించుకోలేదు మధు.

ఆ మాటలకామె ,మౌనంగా చూస్తూ,సరే మీ ఇష్టం.అంటూ అయిష్టంగానే బ్లాక్ టాప్ పై కురచ నీలం రంగు స్కర్టు వేసుకుని, హెయిర్ స్టయిల్, వగైరా కూడా మధు చెప్పినట్టే ఫాలో అయింది.కళ్ళకద్దుకుని తాళి,మెట్టెలు,తీసేసి, మధు చెప్పినవి వేసుకుంది.తర్వాత ఇద్దరూ రిసెప్షన్కి వెళ్లారు.అక్కడ మధుని పలకరించినవారు ,ముఖ్యంగా మగాళ్లు ,ఇంచుమించు అంతా,ఎవరీ అమ్మాయి.మీ డ్రస్ డిజైన్సు ప్రెసెంట్ చేసే కొత్త మోడలా అని అడిగారు,ఆమెని ఎగా ,దిగా,కాకెంగిలి చూపులు చూస్తూ.

ఆ మాటలకి మధు ,కాస్త అసహనంగా,కాదు .ఈమె నా వైఫ్ .చెప్పాడు మూతి బిగించి.

అలాగా?సొ బ్యూటిఫుల్ .అవును మరి,మీరు డిజైన్ చేసిన బట్టలు వేసుకుంది కనుకే ఆమెకి అంత అందం,బింకం,పొంకం వచ్చాయి. చెప్పాడు అక్కడ ఓ గుంపులో ఓ గోవిందు.ఆ వెంటనే ఇంకోడు వచ్చి ,ఛ ,ఛ, అదేం కాదు.ఆమె వేసుకుంది కనుకే ఆ డ్రెస్సుకి అంత అందం వచ్చింది.అంటూ తన జేబులోంచి మొబైల్ ఫోన్ తీసుకుని ,చక,చకా ఆమెని నాలుగు ఫోటోలు తీసేసి, నేనూ డిసైనర్నే.డ్రెస్సు నచ్చితే ఆగలేను ఇలా ఫోటో తీస్తాను.బైదవే ఈమెని మాడెల్గా ఎందుకు వాడకూడదు?మీ వైఫ్ చూడ్డానికి మోడల్ లానే ఉన్నారు .అలాగే ఈ ఫోటోల్ని నేను ఏదైనా యాడ్ పబ్లిసిటీకి వాడవచ్చా మధుగారు అడిగాడతను.

నో ........అని తన చేతులు కొంచెం ఇబ్బందిగా నలుపుకుని,ముఖాన్ని చిట్లించి ,చూడు మిష్టర్ ,కావాలంటే అలాంటి డ్రెస్సే మరోటి ఇస్తాను.మీ ఆవిడకి వేసి,ఫోటోస్ తీసి ,నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ వాడుకో.పో .కసిరేశాడతన్ని. ఇట్ ఈజ్ ఓకే .ప్లీజ్ డోంట్ మైండ్ అని చెప్పి ఆ ఫోటోస్ ని డిలీట్ చేసి.అక్కడ్నుండి మాయమైపోయాడతను.తర్వాత మధు లలితలిద్దరూ డిన్నర్ చేసి ఇల్లు చేరారు.
మరుసటి రోజు లలిత , అరె ఇక్కడే పెట్టానే .అంటూ ,సొరుగు,అరుగూ,బీరువా అని తేడా లేకుండా అన్నీ తెగ గాలించేస్తూ ,చాలా విచిత్రంగా ఉందే !ఇక్కడే జాగ్రత్తగా మడతేసి మరీ పెట్టానే .ఏమైపోయిందండీ ఆ మాడ్రన్ డ్రెస్సు .అంటూ ఆశ్చర్యంతో కొయ్యబారి ఆలోచిస్తోందామే.
అప్పటివరకూ ఆమె మాటలు వింటున్నా ,విననట్టుగా ఉన్న మధు,కొంచెం గొంతు సవరించుకుని,ఓహ్ ఆదా? నేనే వేరే మాడెల్కి ఇస్తానని చెప్పాను.అందుకే దానిని ఇందాకే తీసి ,నా రూములోని బీరువాలో పెట్టాను.చెప్పాడు, పేపర్ లోంచి తల బయట పెట్టి .

అవునా ? మరీ నాకో .అసలే ఆ డ్రెస్సుని సాయంత్రం ,మనం వెళ్ళే పెళ్ళికి వేసుకుందామనుకున్నానుగా మరి.ఇప్పుడెలా.అడిగిందామె, చిరు నిరుత్సాహంగా.

ఆ డ్రెస్సే వేసుకు రావాలా ఏంటి.మరో డ్రెస్సు వేసుకు వద్దువుగానిలే .చెప్పాడు నింపాదిగా. అంటే !అంత కంటే మాడ్రన్ గా ఉండే మరో డ్రెస్సుని నా కోసం డిజైన్ చేసి ఉంచారన్నమాట.అడిగిందామే ,తెగ గారం పోతూ ,బుంగమూతితో. ఏడిసినట్టుంది .నా మాటలకి అర్దం అది కాదు .నీకున్న డ్రెస్సులలోనుండి ఓ మంచి డ్రెస్సు తీసుకు వేసుకోమని .చెప్పాడు ముఖం చిట్లించి. నా డ్రెస్సులలోనుండా?వాటిని మీరెప్పుడూ ముతక బట్టలంటారుగా .పైగా వాటిని వేసుకుంటే మీ పరువు ,గట్రా...నసిగిందామె . పోనీ,పోతేపోనీ ,మంటగలిసిపోనీ ,ఏం పర్లేదు.కొంపకొల్లేరు కాదు .నువ్వు నీ ఇష్టం మార్చుకోవడం నాకిష్టం లేదు. కనుక ఇక నుండి నువ్వు ,నీకు నచ్చిన ఆ సంప్రదాయ బట్టలే వేసుకో.చెప్పాడు నేల చూపులు చూస్తూ.

మధు మాటల అంతరార్దం అర్దం చేసుకున్న లలితకి చాలా సంతోషం అనిపించింది.ఇష్టం లేకున్నా,మధు పోరుపడలేక , మోడ్రన్ బట్టలు వేసుకుని నచ్చినట్టు నటించినందుకు ప్రతిఫలo దక్కిందని సంతోషించింది. నాగరిక దుస్తులని గోల పెట్టిన పతిగారు,ఆ నాగరిక దుస్తుల్లో తన భార్యని పరాయి మగాళ్లు చూడటం మాత్రం తట్టుకోలేకపోయాడు .ఇక ఆ నారికత బట్టల నుండి ప్రవర్తనకి మారితే ఏమైపోతాడో! అనుకుందామె.పైగా,ఇంతకాలం నాగరికత తెల్సిన కొత్త మనిషి గా చలామణి అవుతున్న తన బర్త ఆలోచనలు ఇంత పాతగా ఉంటాయని తనెప్పుడు అనుకోలేదు.అలాగే ఇక నుండి తన వేషదారణని పల్లెటూరి గబ్బిలాయ్ ,పాత కాలం మనిషి ,ముతక బట్టలు వేసుకుంటావ్ లాంటి మాటలు అని దెప్పిపొడిచే అవకాశం మధుకి లేదు. అతని తిక్క కుదిరింది.అనుకోకుండానే ,ఆమె పెదాలపై ఓ చిరునవ్వు మెరిసింది.ఆ నవ్వుతోనే అనుకోకుండా మధు వైపు చూసిందామే.

మధు కూడా ఓ నవ్వు నవ్వి ,చలం గారి స్త్రీ పుస్తకo ఉన్న షెల్పు వైపు అడుగులు వేశాడు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు