దూరాలు - సత్తెనపల్లి ఆనంద్

dooraalu

ప్రొఫెసర్ దేవి ప్రసాద్ ప్రొద్దునే 6 గంటలకు నిద్ర లేచి వాకింగ్ కి బయల్దేరారు. ఆయన ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కాలనీ లో చక్కటి రోడ్లు ఒక చిన్న పార్క్ వుంది. కాలనీ వాసుల వాకింగ్ కి అది అనువైన కాలనీ. ప్రొఫెసర్ అందరికి హలో చెబుతూ నెమ్మదిగా పార్క్క దగ్గరికి చేరారు. వాకింగ్ అయిన తరువాత కాసేపు మిత్రులతో మాట్లాడటం ఆయన దిన చర్య.

ప్రొఫెసర్ పార్క్ లోని బెంచి మీద కూర్చొని ఎవరైనా వస్తారేమో అని ఎదురుచూస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగి సురేష్ అక్కడికి నవ్వుతూ చేరుకొన్నాడు. "గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ గారు, ఇంకా మనవాళ్ళు ఎవరు రాలేదా "

"ఇంకా ఎవరు రాలేదు , వస్తారులెండి నెమ్మదిగా "

"మీ వాడు వుద్యోగం ఎలా ఉందంటున్నాడు. కొత్త ఏరియా కదా. చదివింది ఇంజనీరింగ్, చేరింది టూరిజం కంపెనీ లో "

" ఏమో తెలీదు , వాడు అన్ని వాళ్ళ అమ్మకే చెబుతాడు. ఆఫీస్ కి అయితే రోజు వెళుతున్నాడు " అన్నారు నవ్వుతూ.
కొద్ది సేపు మాట్లాడుకున్నాక ఇద్దరు ఇళ్లకు బయల్దేరారు.

ప్రొఫెసర్ గారు ఇంటికి వచ్చేటప్పటికి 8 గంటలు కావస్తున్నది. కొడుకు మురళి ఆఫీస్ కి పోవటానికి తయారవుతున్నాడు. మురళి ఇంజనీరింగ్ పూర్తిచేసి తనకు ఇష్టమైన టూరిజం రంగంలో మూడేళ్ళ నుండి వుద్యోగం చేస్తున్నాడు. మురళి కి ఆధునికంగా జీవించటం, కొత్త ప్రదేశాలకు వెళ్ళటం అంటే మక్కువ. తనకు సొంతంగా ఏదైనా పర్యాటక వ్యాపారం ఉండాలని కలలు కంటున్నాడు. ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ , అనేక పర్యాటక ప్రాంతాలకి గ్రూప్ విజిటింగ్ ఏర్పాటు చేస్తుంటాడు, అందులో విదేశీ ప్రయాణాలు కూడా ఉంటాయి. ఈ ఉద్యోగంలో చాలా మందితో పరిచయాలు పెరిగాయి. అందులో తనకు ముఖ్యమైన వ్యక్తి ఎయిర్ బుకింగ్ లో పనిచేసే గీత.

అమ్మా ఆఫీస్ కి వెళుతున్నాను" అన్నాడు మురళి

"అలాగే, మరీ లేట్ చేయకుండా ఇంటికి వచ్చేయి" అమ్మ .

సోఫా లో కూర్చొని పేపర్ చదువుతున్న నాన్న వంక చూస్తూ బయటకి వచ్చాడు. ఇద్దరూ చాలా తక్కువుగా మాట్లాడుకొంటారు. ప్రొఫెసర్ పేపర్ చదవటం పూర్తి చేసి పైనున్న తన స్టడీ రూమ్ లోకి వెళ్లారు, అది ఆయన ప్రపంచం.

**********

దేవి ప్రసాద్ యూనివర్సిటీ లో ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ లో ప్రొఫెసర్ గా పనిచేసి అయిదు సంవత్సరాల క్రిందే రిటైర్ అయ్యారు. నలభై సంవత్సరాలుగా ఆయనకు వుద్యోగం కాక ఉన్న ఒకే ఒక హాబీ పోస్టల్ స్టాంపుల సేకరణ, ఫిలాటిలే. రిటైర్ అయిన తరువాత అదే ముఖ్య వ్యాపకం అయింది.

ప్రపంచం లోని స్టాంపుల సేకరణ ,దాని వెనుక వున్న చరిత్రా పరిజ్ఞానం , ఆయనకు వున్న ప్రత్యేకత. 1852 నుండి స్టాంపులు ప్రపంచం లోకి వచ్చాయి . దేశ భౌగోళిక చారిత్రాత్మక అనుసరించి స్టాంపులు సేకరణ జరిగేది, కోటలు, రైళ్లు, ఓడలు, పోస్ట్ ఆఫీస్ భవంతులు, రాజులు ,రాణులు,పక్షులు,జంతువులు,దేశ జెండాలు ,పర్యాటక భవనాలు, సైన్యానికి, నేవీ కి సంబంధించినవి, ఇంకా ఎన్నో రకాలు.

ప్రొఫెసర్ తన జీవన సమయాన్ని సమస్త ఆదాయాన్ని ఫిలాటిలే లోనే వెచ్చించారు . ఇండియా,అమెరికా,బ్రిటన్, జర్మన్, ఫ్రాన్స్ దేశాల్లోని స్టాంపుల సేకరణ క్లబ్బులో అంతర్జాతీయ సభ్యత్వం వుంది. ప్రపంచంలో కొన్ని వేలమంది ఈ వృత్తి లో ఉన్నా, పూర్తిగా అంతర్జాతీయ స్థాయికి చేరినవారు వందల్లోనే వుంటారు, అందులో ఒకరు ప్రొఫెసర్ దేవి ప్రసాద్.

ఆయన దగ్గర ఉన్నా స్టాంపుల కలెక్షన్ అమూల్యమైనవని క్లబ్ మెంబెర్స్ అందరికి తెలుసు. ఆయన కలెక్షన్ లో ముఖ్యమైనవి బ్రిటన్,అమెరికా,ఇండియా,చైనా లోని పురాతన రైళ్ల , కోటలు, పోస్ట్ ఆఫీస్ భవనాలు, దేశ జెండాలు. ఢిల్లీ,ముంబై,కలకత్తా ఇంకా ముఖ్యమైన నగరాల్లోని స్టాంపుల ప్రదర్శనకి తప్పక హాజరు అవుతూ, ఇంటర్నెట్ ద్వారా అంతర్జాతీయ క్లబ్ మెంబెర్స్ తో సంబంధాలు పెట్టుకొంటూ, స్టాంపుల కొనుగోలు, బదిలీలు చేస్తూ ఒక శిఖరానికి చేరాడు. ఆయన ఈ రంగంలో మహర్షి అనే చెప్పవచ్చు. చాల మంది దీన్ని మంచి వ్యాపారంగా మలుచుకొని లక్షలు సంపాదిస్తున్నారు. ప్రొఫెసర్ మాత్రం స్టాంపుల సేకరణని ఒక యజ్ఞంగా భావిస్తున్నారు. దాదాపుగా 2000 స్టాంపులు పోగైనాయి, వాటి విలువ ఆయనకు తెలుసు.

ప్రొఫెసర్ ఇంటర్నెట్ లో స్టాంప్ డీలర్లు దేశ విదేశీ క్లబ్ మెంబర్లతో చాటింగ్ ఇమెయిల్ మొదలైన పనులతో దిన చర్య మొదలు పెట్టారు. తన స్టాంప్ కలెక్షన్ కి సంబందించిన "ట్రెజర్ అఫ్ దేవి ప్రసాద్ " కాటలాగ్ వాల్యూం 5 ని ఇంటర్నేషనల్ వెబ్సైట్ లో అప్ లోడ్ చేసారు. దానిలో దేశ విదేశానికి సంభందించిన 415 చారిత్రాత్మక పురాతన విమానాల స్టాంపులు వున్నాయి. ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకి లేటెస్ట్ కలెక్షన్ కేటలాగ్ రూపంలో రిలీజ్ చేస్తారు. కంప్యూటర్ తో పని అయిన తరువాత తాళం వేసిన అల్ మారా తెరచి రెండు స్టాక్ బుక్స్ ని బయటకు తీశారు, స్టాంపులు భద్రపరచటానికి ఆల్బం సైజ్ లో వుండే ప్లాస్టిక్ కవర్ల బుక్. అందులో స్టాంపులు సురక్షితంగా ఎంతకాలమైనా ఉంటాయి కొద్దిపాటి జాగ్రత్తలతో. స్టాక్ బుక్స్ లోని కొన్ని స్టాంపులను భూతద్దంతో దేనికోసమో చూసి మళ్ళీ వాటిని అల్ మారా లో పెట్టి తాళం వేశారు. ఆ రెండు స్టాక్ బుక్స్ అయన జీవిత కాల కష్ట ఫలం .

*************

"గీతా వస్తున్నావా, దర్బార్ రెస్టారెంట్ లో వెయిటింగ్, అప్పుడే 8 అయింది " మురళి

"ఆటో లో వున్నాను. ఇంకో పది నిముషాల్లో వచ్చేస్తాను" గీత.

వారి పరిచయం ప్రణయంగా మారింది. రోజు ఆఫీస్ పని పూర్తి అవగానే ఎక్కడో అక్కడ కలుసుకొంటారు. మురళి గీతల అభిరుచులు ,ఆకాంక్షలు ఒక మాదిరిగానే ఉంటాయి, అంటే విదేశాలకు వెళ్ళటం, ఆధునికంగా జీవితాన్ని గడపటం, ఏదైనా తమ సొంత వ్యాపారంలో స్థిరపడటం.

"ఏమిటి వచ్చి చాల సేపయిందా, ఈ రోజు ఫుల్ రష్ గా వుంది" అంటూ ఎదురు చైర్ లో కూర్చుంది నవ్వుకుంటూ.

"నాకు ఈ రోజు పెద్ద పని లేదు, ఇంకా ఏమిటి న్యూస్ "

"ఏదైనా ఆర్డర్ చేద్దామా, డిన్నర్ అయితే లేట్ గా ఇంటికి చేరినా పరవాలేదు, ఒక పని అయిపోతుంది, రేపు సండే కూడా కదా"

"నో ప్రాబ్లెమ్, అలాగే చేద్దాం" అంటూ వెయిటర్ ని పిలిచి డిన్నర్ కి ఆర్డర్ ఇచ్చాడు మురళి

"రేపు సండే, ఏమిటి ప్లాన్, రేపన్నా చెబుతావా మన సంగతి మీ ఇంట్లో "నవ్వుతూ అంది

"తప్పుకుండా, ఏ రోజైన చెప్పాల్సిందిగా, అమ్మ సరేనంటుంది, నాన్న కూడా కాదనుడులే, అంత పట్టించుకోడు "

"నాకు టెన్షన్ గా వుంది, నేనైతే ఈ రోజే చెప్పేస్తాను, ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను "

"వర్రీ కాకు, అన్ని మనం అనుకున్నట్లుగానే జరుగుతాయి " అన్నాడు మురళి మృదువుగా గీత చెయ్యి నొక్కుతూ వారు కోరుకొన్నట్లుగానే, వివాహ చర్చలు సఫలంగా పూర్తి అయి కొద్దీ రోజుల్లోనే పెళ్లి కూడా అయిపొయింది. గీత మురళి ఇంటికి పర్మినెంట్ వచ్చేసింది, కాలం ఎప్పటిలాగానే ఆఫీస్ ఇల్లు తో గడిచిపోతుంది .

*********

"అమ్మ నాకు గీతకి మలేసియా టూరిజమ్ కంపెనీ లో ఆఫర్ వచ్చింది, మంచి జీతం, వెళ్దామనుకొంటున్నాము " అన్నాడు మురళి ఒక రోజు సాయంత్రం డిన్నర్ చేస్తూ.

"మలేషియానా, ఎందుకురా ఇక్కడే ఏదో చూసుకోక " అమ్మ

"ఏ కంపెనీ " నాన్న . "మలేషియా హెవెన్స్" అని సమాధానమిచ్చాడు

"ఏదైనా జాగ్రత్తగా ఆలోచించుకొని చేరండి" నాన్న

"వెళ్ళమని చెబుతున్నారా " అమ్మ. "అది వాళ్ళ ఇష్టం" నాన్న

"పర్మినెంటుగా కాదమ్మా, నాలుగు అయిదు సంవత్సరాలు ఉండి వచ్చేస్తాం" అన్నాడు మురళి నవ్వూతూ . " మలేషియా ఎంతో దూరం కాదు, సంవత్సరానికి ఒకసారి వారం పదిరోజులుండి పోవచ్చు" మురళి అమ్మని ఒప్పించే ప్రయత్నంలో వున్నాడు.

ఆ విధంగా ఒక అరగంట సంభాషణ జరిగిన తరువాత మురళి ఆమ్మ అయిష్టంగానే సరే అంది. మురళి నాన్నకి తెలుసు మురళికి ఒకసారి ఆలోచన వస్తే ఇక ఆగదని.

"ఇంతకీ ఎప్పుడని అనుకుంటున్నారు " అమ్మ

"ఇంకో నెల రోజులు పడుతుంది" మురళి

గీతకి సంభాషణ సఫలమైనందుకు సంతోషంగా ఉంది.

*********

మురళి గీత మలేషియా వెళ్లే రోజు రానే వచ్చింది. అయిన వారందరు వీడ్కోలు చెప్పటానికి మురళి ఇంటికి చేరుకొన్నారు, కౌలాలంపూర్ వయా ముంబై వెళుతున్నారు.

"ముంబై నుండి కౌలాలంపూర్ కి ఫ్లైట్ ఎన్నింటికిరా " మురళి అమ్మ

"రాత్రి 9 గంటలకి " మురళి

అందరి తోనూ కాసేపు మాట్లాడిన తరువాత అమ్మ నాన్నకి బాయ్ బాయ్ చెప్పి మురళి గీత ఎయిర్ పోర్ట్ కి బయల్దేరారు. గీత తల్లి తండ్రులు వారితో పటు ఎయిర్ పోర్ట్ కి వెళ్లారు.

***************

మురళి వెళ్లి రెండు నెలలు గడిచాయి. ప్రొఫెసర్ కంప్యూటర్ లో మెయిల్ చెక్ చేస్తూ రెండు రోజుల క్రితం లండన్ లో జరిగిన వరల్డ్ ఫిలాతెలిక్ ఎగ్జిబిషన్ వివరాలను చదువుతున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా లోని ఆనాటి రైళ్లు, ఓడలు ,పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్స్ ఇంకా ఎన్నో అరుదైన స్టాంపులు అందరిని ఆకర్షించాయిని, వాటి ఫోటోలు, కాటలాగులును కూడా లండన్ ఫిలాతెలీ డైజెస్ట్ వెబ్సైటు లో పెట్టారు. చూస్తున్నకొద్దీ ప్రొఫెసర్ ముఖంలో రంగులు మారుతూ గంభీరంగా తయారైనారు. వొంట్లో ఏదో నిస్సత్తువ చోటు చేసుకొంది, నెమ్మదిగా లేచి అలిమారా లో వున్నా స్టాక్ బుక్స్ ని తీసి టేబుల్ మీద పెట్టి చెక్ చేయటం మొదలు పెట్టారు. వెనుక కుర్చీలో కుప్ప కూలి పోయారు, మెదడు పని చేయటం లేదు, అంతా సూన్యంగా వుంది. అలా ఎంతసేపు కుర్చున్నారో ఆయనకే తెలీదు.

కొద్దిసేపటి తరువాత తేరుకొని పద్మా అని తన భార్యని గట్టిగా పిలిచారు. పద్మ తొందరగా పైనున్న ప్రొఫెసర్ రూంకి వచ్చింది.

"ఏమైందండీ అంత గట్గా పిలిచారు" అంది అయన వంక స్టాక్ బుక్స్ వంక చూస్తూ.

"ఏమని చెప్పను, ఇందులో దాదాపుగా 1000 స్టాంపులు మాయమయ్యాయి "

"అంటే అర్థం కాలేదు నాకు, ఎలా పోయాయి అంటారు"

"ఎవరో తీసికెళ్లారు" అన్నారు, దొంగిలించారు అంటం ఇష్టం లేక

"మనింట్లో ఎవరు తీస్తారండి" అంది ప్రొఫెసర్ వంక చూస్తూ. ప్రొఫెసర్ ఆమెను చూస్తూ ఇంకా అర్థం కాలేదా అన్నట్లుగా నవ్వారు.

" మురళా, అంత పని చేసాడంటారా"

"స్టాంపులని ఇంటర్నేషనల్ మార్కెట్ లో అమ్మేశాడు. తీసికెళ్ళిన స్టాంపులు కూడా అత్యంత విలువైనవి తేలికగా అమ్ముడు పోయేవి."
అంటే మురళి తన చేసే పనిని రొజూ చూస్తూ సబ్జెక్టు మీద అవగహన పెంచుకున్నాడు. స్టాంపుల మార్కెట్ డీలర్లు గురుంచి తెలుసుకొన్నాడు. న రూమ్ ఎదురుకుండానే మురళి బెడ్ రూమ్, తను పడుకోటానికి క్రిందకి వెళ్ళినప్పుడు మురళి తన స్టడీ రూంలో పనిచేసే వాడన్నమాట. జరిగిన పనులన్నీ ప్రొఫెసర్ కంటికి సినిమా రీల్ లాగా కదలాడింది.

“విలువైనవి అంటున్నారు, ఎంత ఉంటాయి "

"సుమారుగా 6 కోట్లు ఉంటుంది " అని నెమ్మదిగా అన్నారు ప్రొఫెసర్

"ఆ 6 కోట్లా, మీరెప్పుడు నాకీ విషయం చెప్పలేదు, నేను లక్షల్లో ఉండొచ్చు అనుకొన్నాను, అయినా అది మీ హాబీ అని పట్టించు కోలేదు " మురళి అమ్మ కంట తడి పెట్టింది.

మురళి ఎందుకిలా చేసాడు, అంత అవసరం ఏమొచ్చింది. తను మొదటనుండి డబ్బుల విషయంలో చాల కట్టడిగా ఉండటంవలన ఈ పరిస్థితి వచ్చిందా. మురళికి అధునాతనంగా జీవించాలని, విదేశాలలో తిరగాలని ఉంటుందని ప్రొఫెసర్ కి తెలుసు. మురళికి తనకి ఉన్న దూరమెంతో ప్రొఫెసర్ కి అర్ధమయ్యింది,

కానీ ఈ విధానం ఎన్నుకొంటాడని ఎప్పుడు అనుకోలేదు.

" అయిపోయిందేదో అయిపోయింది, ఎవరకి చెప్పకండి, వాడితో మాట్లాడండి"

"ఎక్కడని మాట్లాడను"

"కౌలాలంపూర్ లో కంపెనీ పేరు చెప్పాడుగా"

"నేను చెక్ చేశాను, అలంటి కంపనీనే లేదు, అసలు వాడు మలేషియా వెళ్లాడనుకోవటల్లేదు " ఆ విధంగా వారి సంభాషణ భావోద్వేగాల మధ్య జరుగుతోంది.

*******

ఇండియా నుండి సుమారు 4300 కిలో మీటర్ల దూరంలో చైనా అధీనంలో వున్న, ప్రపంచంలోనే అత్యధిక క్యాసినోస్ ,గ్యాంబ్లింగ్ వ్యాపారం, టూరిజం ముఖ్య ఆధారంగా గుర్తింపువున్న ప్రసిద్ధమైన దేశం మకావ్. అక్కడ ఒక రెస్టారంట్ లో మురళి, గీత తాము చేయబోయే ఇండియన్ రెస్టారెంట్ ,టూరిజం వ్యాపారం గురిన్చి మాట్లాడుకొంటున్నారు. విదేశాల్లో వ్యాపారం చేస్తూ ధనాన్ని ఆర్జించి స్థిర పడాలనే కలని సాకారం చేసుకొనే దిశలో అడుగులు వేస్తున్నారు.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు