అల్ప బుద్ధి - గంగాధర్.వడ్లమన్నాటి .

alpabuddhi

అప్పటి వరకూ అత్తగారి పెత్తనం డైలీ సీరియల్ చూస్తూ జాంకాయలు మేస్తున్న లక్ష్మమ్మగారు ,హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్టు ,అవునూ, రోజూ ఈ టైముకి నేను పాలు తాగుతానని తెల్సి కూడా ఇంకా ఈనా కోడలుపిల్ల నాకు పాలు తేలేదేంటి ,అవున్లే ,కొత్తలోనే కోడళ్ళు,తర్వాతేగా కొడవళ్ళుగా మారతారు, అనుకుంటూ కళ్ళు పెద్దగా చేసి ,నోరు పెద్దగా తెరిచి ,ఒసేవ్ లలితా ,ఎక్కడ చచ్చావ్ ?ఈ సమయానికి పాలు తాగుతానని తెల్సి కూడా ఇంకా తెచ్చి ఏడవలేదేమే ,అరిచిందామె.

ఆమె మాటలు విన్న లలిత, ఓ మారు ఉలిక్కిపడి ,తన బెడ్రూం లోంచి హాల్లోకి వచ్చి ,ఈ రోజూ నుండి మీరే కలుపుకు తాగండత్తయ్యా.నేను చదువుకోవాలి. కరస్పోండెన్స్ కోర్సు ద్వారా చేస్తున్న పి‌.జి పరీక్షలు దగ్గరకొచ్చాయి.చెప్పిందామె.

ఆ, ఆ .అత్త అంటే ఎంత అలక్ష్యం.ఎంత నిర్లక్ష్యం.పెళ్ళై మూడు సంవత్సరాలైనా ఇంకా తల్లివి కాలేకపోయావ్ కానీ ,నీకు ఇంత పొగరు ,అంత వగరూనూ.దెప్పి పొడిచిందామె.

ఆపండి.ఆ అరిగిపోయిన పాత ,రోత ,మోత రికార్డ్ .నేను తల్లిని కావాలంటే ఎప్పుడో అయ్యేదాన్నేమో. మీకు కోడల్ని కాకుండా వేరే అత్తకి కోడలిని అయ్యుంటే.

అవ్వ,అవ్వ ఎంత మాటన్నావే ముదనష్టప్పీనుగా.గైమంది లక్ష్మమ్మ.

అవును అత్తయ్య .నిన్న డాక్టర్ గారిని కలిసినప్పుడు ,లోపం మీ అబ్బాయిలోనైనా ఉండొచ్చని చెప్పారు మరి. చెప్పింది లలిత .
ఓహో .ఆదా నీ నిర్లక్ష్యానికి కారణం.ఈ రోజూ నా కొడుకు మీ ఇద్దరి ఫెర్టిలిటీ పరీక్షల ఫైనల్ రేపోర్ట్స్ తెస్తాడు.నీ నోటికి తాళం వేస్తాడు.లోపం నీలోనే ఉందని రిపోర్ట్స్ కూడా నిరూపిస్తాయి.అప్పుడు చూడు, నా కొడుకుని నొప్పించైనా, ఎవరితో చెప్పించైనా రెండో పెళ్ళికి ఒప్పించేస్తాను .నీ అంతు చూస్తాను.చెప్పిందామె యమ కసిగా.

అలాగా !ఒక వేళ మీ అబ్బాయిలో లోపం ఉన్నా, నేను రెండో పెళ్లి చేసుకోనులెండి.అయినా ఎలాగూ మీ అబ్బాయి వచ్చే టైమ్ కూడా అయింది.సినిమా చూడబోతూ రివ్యూ చదవడం ఎందుకు. కొంచెం ఓపిక పట్టండి.చెప్పిందామె,అత్తగారి వంక ఎర్రగా చూస్తూ.ఆమె అలా అంటుండగానే ఆఫీసు నుండి మధు వచ్చినట్టుగా బైక్ సౌండ్ వినిపించడంతో ,అత్తా కోడళ్ళిద్దరూ చిత్రంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.అంతలోనే మధు ,కాస్తంత నీరసంగా ,నెమ్మెదిగా లోపలికి నడిచి వచ్చాడు.అతనలా వచ్చి సోఫాలో కూలబడీ,బడగానే ,వచ్చావురా నాయినా.చూడరా, నీ పెళ్ళాం చాలా ముదురు మాటలు మాట్లాడుతోంది.నేను పాలు తెచ్చి ఇమ్మన్న పాపానికి నన్ను హేళన చేస్తూ నానా మాటలు మాట్లాడింది.కానీ ఏం చేయను ,నీ మొహం చూసి అన్నీ ఓపికగా భరిస్తున్నాను.అని చీర కొంగుతో ముక్కు చీదుకుని, ఓ క్షణం తరువాత ,అవున్నాయనా ,ఇంతకీ చేయించిన పరీక్షల్లో ఏం తేలిందిరా.అడిగిందామే కొండంత ఆశక్తిని కళ్ళలో నింపుకుని.
త్వరగా చెప్పేయెండి. పాపం ఇందాకటినుండి వేచి చూస్తున్నారు.లేదంటే ఆతృతతో ఆవిడ సుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. చెప్పింది లలిత వ్యoగ్యంగా.

వారి ఇద్దరి మాటలు విన్న మధు, పని లేకపోతే సరి.ఇదేమన్నా గుర్రపు పందెమా అంత ఆశక్తి చూపడానికి.ఇల్లు కాలి ఒకడేడిస్తే ,ఆ మంటలో వేడినీళ్లు కాచుకోనివ్వలేదని మరొకడేడ్చాడట.అలా ఉంది మీ వరస. అని ఓ నిట్టూర్పు విడిచి,ఇక రిపోర్ట్స్ విషయానికొస్తే, సంతానం కలగక పోవడానికి గల లోపం నాలోనే ఉంది అని రిపోర్ట్స్ కన్ఫర్మ్ చేశాయి . చెప్పాడు మరో నిట్టూర్పు విడిచి.మరుక్షణం తేరుకుని ,కొద్ది నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్య తీరిపోయి,నేను తoడ్రయ్యే అవకాశం ఉందని చెప్పారు.చెప్పాడు మరింత నీరస పడిపోతూ .
కొడుకు మాటలు విన్న లక్ష్మమ్మకి కాళ్ళ కింద భూమి క్రుంగినట్టనిపించింది. మనసులో ఓ మూల దాగిన బాధ ఒళ్ళంతా వ్యాపించినట్టైంది. ఆ క్షణం లో కోడలి వైపు చూడ్డానికి కూడా ఆమెకి ధైర్యం రాలేదు. ఇన్నాళ్లూ ఆమెని గొడ్డుమోతు లాంటి ఎన్నో మాటలు అని బాధపెట్టాను.అత్త అనే అహంతో విర్రవీగాను.కానీ ఇప్పుడు జరిగింది వేరు.అందుకే కాబోలు , దేవుడు నా అల్ప బుద్ధిని ఈరకంగా మరమత్తు చేశాడు, అని లోలోనే అనుకుని, ఏం కాదులేరా.ఈ రోజుల్లో చాలా అడ్వాన్సెడ్ మెడిసిన్ ఉంది.చెప్పిందామె, కొడుకు బుజo పై చేయి వేసి, తరువాత లోనికి నడుస్తూ.

లక్ష్మమ్మ గారి ముఖం ట్యూబు లైట్ కాంతి నుండి బెడ్ లైట్ కాంతికి పడిపోయి, డీలా పడిపోవడం లలితకి ఓ పక్క పిచ్చి ఆనందాన్ని కల్గించినా ,మరో పక్క ,ఛ ఆవిడ నోరు పాడు చేసుకుందని నేను కూడా అలానే అల్ప బుద్ది తో నోరు పారేసుకోకుండా, వయసుకైనా మర్యాద ఇవ్వాల్సిందేమొ.అనుకుంది లోలోన .తర్వాత మధు వైపు చూసింది. అతను కొంచెం డల్ గా,కళ తప్పిన ముఖంతో కనిపించడం ఆమెకి ఎదోలా అనిపించింది. దాంతో ఆమె,అతని పక్కన కూర్చుని ,పోనీలెండి.బాధపడకండి.చెప్పిందామె ఓదార్పుగా .

బాధ దీని కోసం మాత్రమే కాదు.నా బాధంతా డబ్బు పోయినందుకే.చెప్పాడు మరింత దిగాలుగా. పోనీలెండి. జీవితాలే పోతున్నాయి .అలాంటిది మెడికల్ టెస్టులకి అయిన డబ్బు ఓ పెద్ద విషయమా చెప్పండి.పోతే పోయింది .పోనివ్వండి డబ్బు.దాని కోసం అంతలా బాధపడకండి.ప్లీజ్ .గడ్డం పట్టుకుంది బ్రతిమాలుతున్నట్టుగా.

ఆమె మాటలు విన్న మధు, ఆమె వంకే ధీర్ఘంగా చూస్తూ ,మనసులో ,పిచ్చి శ్రీమతీ ,నేను బాధపడుతోంది మెడికల్ టెస్టులకి అయిన లక్ష గురించి కాదు. నా వల్లే నెల తప్పానని నాటకం ఆడి,బ్లాక్ మైల్ చేసి ,డబ్బిస్తే ,జీవితంలో ఇక మళ్ళీ కనిపించనని ,ఓ వారం క్రితం నా దగ్గర నాలుగు లక్షలు నొక్కేసిన మా ఆఫీసు డాటా ఎంట్రీ ఆపరేటర్ ఆ సురేకావల్లి గురించి.అయినా ఇది కూడా నా మంచికే జరిగింది.నా అల్ప బుద్ధికి తగిన శాస్తి జరిగింది.కొత్త అనుభవాల కోసం చెత్త దారులు తొక్కడం ఎప్పటికైనా చేటు అని తెలిసొచ్చింది.నేను ఒక రకంగా అదృష్టవంతుడ్ని.నాకు డబ్బులే పోయాయి.జీవితంలో మళ్ళీ సంపాదించుకోవచ్చు.అదే జీవితాలు పోయే పరిస్థితి వస్తే,ఎన్నటికీ తిరిగి సంపాదించుకోలేo.కనుక ఇక నుండి నా భార్యే నాకన్నీ అనుకుంటూ ,పశ్చ్యాత్తాపo నిండిన కళ్ళతో, ఆమెని దగ్గరకి తీసుకున్నాడు.
అసలు విషయం తెలియని లలిత, తనలో తాను,ఛ ,ఛ ,పాపిస్టి లోపం.నాలో ఉన్నా బావుణ్ణు. మనసులో ఆయనెంత బాధపడుతున్నారో పాపం,అని చెమర్చిన కళ్ళతో అతనికి మరింత చేరువైంది.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు