వాత్సల్యం - పోడూరి వెంకటరమణ శర్మ

vatsalyam

మూర్తి రాజు గారు వాళ్ళ ఇంటి ముందు వరండా లాంటి సిటౌట్ లో కూర్చుని చుట్టూ చెట్టూ చేమలతో నిండిన ప్రశాంత పరిసరాల్ని చూస్తూ ఉన్నా, ఆయనకి మనసులో చికాకు గానే ఉంది. చూసిన పేపర్ నే మళ్ళీ ఓమాటు తిరగేసి పక్కన పడేశారు.
వెనకాల హాలు లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ మ్రోగినా ఆయన లేచి వెళ్లి ఎత్తడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పటి ఇండియా టైం బట్టి కొడుకు రాజా కెనడా నుంచి చేసే ప్రశ్నే లేదు.

వంట ఇంట్లోంచి హడావిడి గా ఆయన భార్య శారదాంబ గారు వచ్చి ఫోన్ ఎత్తారు. . ఏదో రాంగ్ నెంబర్. మళ్ళీ వంట ఇంట్లోకి వెడుతూ " ఆ కార్డులెస్ కొనడం ఈ జన్మకు ఏమయినా జరిగే పనేనా? అని ఆయనకి వినపడేలా సణుగు కుంటూ వెళ్లారు.

కుర్చీలోంచి లేచి లోపలికి వచ్చి ఉయ్యాలా బల్ల మీద కూర్చుంటూ "కాఫీ ఇస్తావా అని వంట ఇంట్లోకి చూస్తూ అన్నారు" గట్టిగా.
ప్రొద్దుట ఏడింటింకి ఒక మాటు తాగినా, పదకొండు గంటలకి మళ్ళీ ఓ కప్పు కాఫీ తాగడం ఆయనకీ అలవాటు.

కాఫీ గ్లాసు తో వచ్చి ఆయనకి ఇచ్చి, తాను కూడా తెచ్చుకున్న గ్లాసు తో వచ్చి కూర్చున్నారు శారదాంబ గారు.
రాజా ఏ మయినా మెయిల్స్ గానీ పెట్టాడేమో చూడక పోయారా? అంది ఆవిడ. రాజా మెయిల్ పెట్టి ఉంటే, ఇంత సేపు చెప్పకుండా ఉండరని తెలిసినా.

ఆయన ఉయ్యాల మెల్లగా ఊపుతూ " నీ పిచ్చి గాని వాడికి మన మెక్కడ గుర్తు ఉంటాము? వాడి ఉద్యోగం, స్నేహితులే వాడి లోకం
ఏదో కల్యాణి మంచి పిల్ల కాబట్టి ఆప్పుడప్పుడు, ఆ అమ్మాయి అయినా మెసేజ్ లూ ఫోటో లూ అవీ పెడుతోంది" అన్నారు .
రామదాసు గురువుగారు అన్నట్టు ' భాగవతం చదువుకోండి. కొంచెం దృష్టి మళ్లుతుంది" అని లేచి గ్లాసులు తీసుకుని ఆవిడ వంటింట్లోకి నడిచింది.

ఉయ్యాల దిగి భాగవతం తెరిచి అందులో మునిగిపోయారు మూర్తి రాజు గారు .

***********

మూర్తి రాజు గారికి ఒక్కడే కొడుకు. రాజారావు అని ఆయన తండ్రి పేరే పెట్టుకున్నా చిన్నప్పటినుంచీ 'రాజా' అని పిలవడం అలవాటు
చిన్నప్పటి నుంచీ కొడుకుతో అటాచ్ మెంట్ ఎక్కువ. అందరి తండ్రులకీ కొడుకుల మీద అలా ఉండడం సహజమే కానీ ఇక్కడ ఒక కారణం ఉంది. రాజా చినప్పుడు మొదటి ఆరు సంవత్సరాలు అనేక రకాల అనారోగ్యంతో బాధ పడుతూ ఉండే వాడు. ఇంగ్లీష్ మందులు అతనికి పని చేయకపోతే, ఎక్కడెక్కడో తిరిగి ఆయుర్వేదం, మూలికల వైద్యుల దగ్గరికి వాడిని తీసుకు వెళ్లి చాలా ఓపికగా వాడికి వైద్యం చేయించే వారు. బాలారిష్టాలు అన్నీ దాటి వాడు చదువులో పడిన తరువాత ఆయన ఊపిరి పీల్చుకున్నారు. శారదాంబ గారి మనస్తత్వం వేరు, ఆయన మనస్తత్వం వేరు. ఆవిడ దేని గురించీ పెద్దగా ఆలోచించదు. ఆయన అలా కాదు. ఆలోచనలు ఎక్కువ. మిగతా వ్యాపకాలు ఏమీ ఎక్కువ లేకపోతే ఎప్పుడు కొడుకు గురించే ఆయన ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు . పదహారు సంవత్సరాలు దాటిన తరువాత వాడిని స్నేహితుడి లాగే చూసే వారు. ఇద్దరూ కలిసి సినిమాలకి, షికార్లకి వెడుతూ ఉండేవారు.

రాజా. చదువులో ఎటువంటి కష్టాలు లేకుండా బిట్స్ పిలానీ లో బీటెక్ , అమెరికా లో ఎంఎస్ పూర్తి చేసి, ఆయన రిటైర్ మెంట్ అయిన సంవత్సరమే కెనడా లో ఒక మంచి కంపెనీ లో చేరాడు. రాజా కెనడా వెళ్లిన సంవత్సరమే ఆయన రిటైర్ అయ్యారు. ఆయన సర్వీసు ఎక్కువ భాగం ఉస్మానియా లో రీడర్ గా గడిచింది

రిటైర్ అవగానే ఆయన అమీర్ పేట లో ఉన్న ఫ్లాట్ లో సెటిల్ అయ్యారు.

ఆ తరువాత రెండు సంవత్సరాలకి తన స్నేహితుడి కుమార్తె కళ్యాణి తో వివాహం జరిపించారు . పెళ్ళికి ముందు దాకా ఎక్కడ ఉన్నా రాజా రోజు విడిచి రోజు ఫోన్ చేస్తూ తల్లి తండ్రులతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. పెళ్లి అయిన తరువాత, ఆ తరువాత కూతురు పుట్టిన తరువాత అతను కాంటాక్ట్ చేయడం బాగా తగ్గి పోయింది. . అప్పుడే మొదలయింది మూర్తి రాజు గారికి కొడుకు మీద బెంగ. ఆయన ఆలోచనలు ఎప్పుడూ కొడుకు చుట్టూ తిరుగుతూ ఉండేవి.

ఒక రోజున ఏదో పని మీద ఆయన కోఠి వెళ్లి తిరిగి బస్సు లో వస్తూ ఉంటె అనుకోకుండా అతని చిన్న నాటి మిత్రుడు వెంకటరామయ్య కలిస్తే ఇంటికి ఆహ్వా నించాడు. ఆ వేళ తాను 'రామాదాసు గురువు' గారి దగ్గరికి వెడుతున్నానని ఇంకో మాటు వస్తానని చెప్పాడు వెంకటరామయ్య.

బస్సు లు మారడానికి లక్డికాపూల్ దగ్గర దిగారు ఇద్దరూ. కాఫీ తాగి వెడదామని ద్వారకాలోకి వెళ్లారు. కాఫీకి ఆర్డర్ చేసి కబుర్లలో పడ్డారు.
వెంకట రామయ్య, మూర్తి రాజు గారు ఇద్దరూ చిన్నప్పుడు హై స్కూల్ లో క్లాస్ మేట్స్. మూర్తి రాజు ఎక్కువ టైం వెంకట రామయ్య ఇంట్లోనే గడిపేవాడు. వెంకటరామయ్య ఇంటికి ఎవరెవరో సాధువులు, స్వాముల వార్లు తరచూ వచ్చేవారు.వాడి తల్లి తండ్రులతో బాటు వెంకట రామయ్య కూడా సాధువుల్ని వదల లేదన్నమాట అనుకున్నారు మూర్తి రాజు గారు కుటుంబ విశేషాలు చెప్పుకుని మిగతా మిత్రుల గురించి మాట్లాడుకుంటూ ఉండగా వెంకటరామయ్య గారికి రెండు మాట్లు ఆయన కొడుకు ఢిల్లీ నుంచి ఫోన్ చేశాడు. వాళ్ళు ఫోన్లో మాట్లాడిన దానిని బట్టి ఆయన గ్రహించింది ఏమిటంటే, వెంకటమయ్య గారిని కొడుకు బస్సుల్లో తిరగవద్దనీ, ఆటో గానీ టాక్సీ గానీ తప్ప ఎక్క వద్దనీ మరీ మరీ చెప్పడం గ్రహించారు మూర్తి రాజు గారు. మీరంటే చాలా పట్టించుకుంటున్నాడే మీవాడు అన్నాడు మూర్తి రాజు గారు. అవునయ్యా వాడు రోజూ ఇంటికి ఫోన్ చేసి ఏదో టైము లో మాట్లాడుతూ ఉంటాడు. నేను బయటికి వెళ్లానని వాళ్ళ అమ్మ చెబితే సెల్ కి చేస్తాడు. ఈ సెల్ వాడే కొని ఇచ్చాడు. ఖాళీగా ఉన్నప్పుడు ఆటో ఎందుకని బస్సు ఎక్కితే, ఫోన్ లో చప్పుడు బట్టి గ్రహించి బస్సు ఎందుకు ఎక్కారని కోప్పడుతూ ఉంటాడు. వేంకటరామయ్య గారు ఆ విషయాలు చెబుతుంటే తన కొడుకు రాజా గుర్తుకు వచ్చి కొంచెం మనసు చివుక్కుమంది. ఆయన కొడుకు ఇండియా లో ఉన్నాడు కాబట్టి వీలవుతుందేమో అనుకుని మనసు సరి పెట్టుకున్నారు.
వెంకటరామయ్య గారి ఇంకో ఇద్దరు మిత్రులు ఆయనకీ ఫోన్ చేసి ద్వారకా లో ఉన్నారని తెలిసి అక్కడికి వచ్చారు. వాళ్ళ కారులో 'రామదాసు గురువు' గారి దగ్గరికి వాళ్ళు బయలుదేరుతొంటే సడన్ గ ఎందుకో మూర్తి రాజు గారికి కూడా ''రామదాసు గురువు' ని చూడాలనిపించి తానూ వస్తానని చెప్పి వాళ్ళతో పాటు కారు ఎక్కారు.

" రామదాసు గురువు' గారి గురించి ఇద్దరూ లక్డీకా పూల్ వద్ద బస్సు దిగి అక్కడ వెయిట్ చేస్తున్న ఇంకో ఇద్దరు వేంకటరామయ్య గారి మిత్రులతో కలిసి కారు లో బయలు దేరారు.

దారిలో మూర్తి రాజు గారు వేసిన ప్రశ్నలకి వెంకట రామయ్యగారు ఇచ్చిన జవాబుల సారాంశ మేమిటంటే. రామదాసు గారు ఒక పెద్ద కంపెనీకి చైర్మన్ గా ఉండేవారు. వారు అనుకోకుండా ఒక మాటు ఒక సాధువుని ఢిల్లీ లో కలిస్తే, ఆ సాధువు తాను పిలిపు ఇచ్చినప్పుడు రిషీకేష్ రమ్మని చెప్పి వెళ్ళిపోయాడట. ఆ తరువాత ఒక మాటు కల లో కనపడి రిషీకేష్ లో ఫలానా చోటికి రమ్మని ఆదేశ మిస్తే రామ దాసు గారు అక్కడికి వెళ్లడం ఆయనను కలవడం జరిగింది. ఆయన ఏమి చెప్పాడో తెలియదు, ఈయన వెనక్కి వచ్చి ఆస్తులన్నీ ఒక ట్రస్ట్ కి ఇచ్చి మిత్రులని మానేజ్ చేయమని వెనక్కి వెళ్ళిపోయాడట. అక్కడే ఎనిమిది సంవత్సరాలు ఉండి ఆ సాధువు దగ్గరే శాస్త్రాధ్యయనం చేసి గురువు సహాయం తో ఆధ్యాత్మిక ఉన్నతి సాధించారు. గురువు ఆదేశం మేరకు ఆధ్యాత్మిక సాధకులకు సహాయం కోసం చిలుకూరు అవతల ఆయన ట్రస్ట్ వారు కొన్న భూమిలో ఉన్న గృహ సముదాయం లో ఒక దానిలో ఉంటున్నారు. పబ్లిసిటీ అదీ ఏమీ ఉండదు. సాధకులు ఎవరయినా ఆయన దగ్గర సందేహాలు తీర్చుకుని సాధన కొనసాగించ వచ్చు. వెంకటరామయ్య గారు ప్రతి ఆదివారం అక్కడికి వెళ్లడం కొద్ధి సంవత్సరాలుగా జరుగుతోంది.

పచ్చటి వృక్షాల మద్య ఉన్న గృహ సముదాయం చాలా బాగా నచ్చింది మూర్తి రాజు గారికి. అందులో ఒక దాంట్లో రాందాసు గారు పెద్ద కాంపౌండ్ ఉన్న ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఆ ఇంటి హాలు లో ఐదారుగురు వ్యక్తులు ఒక తివాసీ మీద కూర్చున్నారు. వాళ్లకి ఎదురుగా ఒక పెద్ద కుర్చీలో ఒక స్పురద్రూపి అయినా వ్యక్తి కూర్చున్నారు. ఆయనే రాందాసు గురువుగార ని మూర్తి రాజుగారు గ్రహించారు. ఆయన ప్రత్యేకమయిన వేషం ఏమీ లేకుండా ఒక తెల్లటి లుంగీ దాని మీద ఒక తెల్లటి పొడవాటి కాటన్ జుబ్బా ధరించి కూర్చున్నారు. ఆరడుగుల పొడుగు ఉంటారేమేమో అనిపించింది. ఇల్లంతా చూస్తే మోడరన్ గానే ఉంది. హాలుకు ఒక్క పక్క గా టీవీ దాన్ని ముందర కొన్ని కుర్చీలు ఉన్నాయి. మూర్తి రాజు గారు మిగతా వాళ్ళ తో బాటు ఆయనకీ ఎదురుగా కూర్చున్నారు. రామదాసు గారు మూర్తి రాజు గారి కేసి చూసి పలకరింపుగా నవ్వేరు. ఆయన కళ్ళల్లో చూసిన ఆర్ద్రత , నవ్వులో ఆప్యాయత మూర్తి రాజు గారిని ముగ్ధుణ్ణి చేసింది. ఏ మాత్రం పరిచయం లేక పోయినా ఎవరో ఆత్మా బంధువుని కలిసిన భావన ఆయనకీ కలిగింది.

మిగతా వాళ్ళు ఏవేవో ప్రశ్నలు వేస్తె అన్నిటికీ సమాధానాలు చెప్పి అవసరమయిన చోట తగిన సలహాలు ఇచ్చారు గురువుగారు. రెండు గంటలయిన తరువాత ఒకతను వచ్చి సంజ్ఞ చేస్తే గురువు గారు లేచి పక్కనున్న పొడవు పాటి వసారా లోకి నడిచారు అందర్నీ రమ్మని చెయ్యి చూపుతూ. అక్కడ నీట్ గా స్నాక్స్ ఆరెంజ్ చేసి ఉన్నాయి. ఆ పక్కనే కాఫీ టీలు కూడా పెట్టారు. స్నాక్స్ తీ సుకోవడం అయిన తరువాత వెంకట రామయ్య గారు మూర్తి రాజు గారిని పరిచయం చేశారు. మామూలు విషయాలు అడిగిన తరువాత, సమస్యలు ఏమన్నా ఉన్నాయా అని అడిగితే, ఏవీ లేవని చెప్ప్పినప్పుడు ఆధ్యాత్మికంగా ఏదయినా సాధన చేస్తున్నారా అని అడిగారు మూర్తి రాజు గారిని. ప్రత్యేకం గా ఏమీ చేయటల్లేదు అని చెబితే రోజూ భాగవతం చదవమని, వీలయినప్పుడల్లా ఇష్ట దైవానికి పూజ చేయమని సలహా ఇచ్చారు. పూజ చేయడం కుదరనప్పుడు మానసికంగా పూజ చెయ్య మన్నారు. ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు తన దగ్గరికి రమ్మన్నారు.
ఆ తరువాత ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రాందాస్ గురువుగారి దగ్గరికి వెళ్లడం జరుగుతూనే ఉంది. వాస్తవానికి ఆయన ఆదివారం కోసం ఎదురుచూసే వారు. గురువు గారి దగ్గర ఉన్న కాల మంతా చాలా ఆనందంగా గడిచేది. ఆయన సలహాప్రాకారం మానసిక పూజ చేయడం, భాగవతం చదవడం ప్రారంభించారు. ఇప్పుడు ఆయనకీ ఒకటే సమస్య. పూజ చేస్తున్నపుడూ, భాగవతం చదువుతున్నప్పుడూ కొడుకు మీద ఆలోచనలు పోవడం, వాడు ఫోన్ చేయడం తగ్గించడం అదీ గుర్తుకు వచ్చి కొంచెం ఇబ్బంది గా ఉండేది. ఒకటి రెండు మాట్లు గురువు గారి దగ్గర సమస్య చెబితే ఆయన అన్నారు.

మీ అబ్బాయి ఫోన్ చెయ్యకపోవడం తప్ప అతని గురించి ఇంకే విషయం మిమ్మల్ని కలత పెడుతోంది? చిన్నప్పుడు నా మీద చాలా ఆధార పడేవాడు. స్కూల్ లో ఏ సమస్య లొచ్చినా నాతో చెప్పుకుని పరిష్కారం అడిగేవాడు.

సమస్యలంటే?

స్కూల్ లో ఉన్నప్పుడు ఇతర విద్యార్థుల నుంచి పోటీ ని ఎదుర్కోవడం, వక్తృత్వ పోటీలలో సలహాలు, టీచర్లు అనవసరం గా అవమానించడం వంటివి. అదే వరస కాలేజ్ లోనో, యూనివర్సిటీ లోనూ కూడా కంటిన్యూ అయింది. ఉద్యోగంలో చేరిన కొత్తలో కూడా తరుచు మాట్లాడి విషయాలు చెబుతూ ఉండేవాడు

మీరు ఎం చేసే వారు ?

తగిన సలహాలు ఇస్తే వాటిని అమలు చేసి వాడు ఇప్పుడు అతనికి ప్రస్తుత పరిస్థితుల్లో మీ సలహాలు అవసరం లేదేమో?
అవసరం లేకపోయినా, తన ఆఫీసు లో కెరీర్ విషయాలు కానీ, నా ఆర్ధిక అవసరాలు గురించి కానీ కనీసం ప్రస్తావించక పోతే అదేదో బాధగా ఉంటుంది.

ఆయన మాటలు విని గురువు గారు సానుభూతి గానే స్పందించి ఒకటి చెప్పారు.

" ఇప్పటి అతని జీవన సరళి మీకు తెలియదు కదా? మీతో ఎక్కువ మాట్లాడ పోవడానికి తగిన కారణాలు ఉన్నాయేమో? మీరు మానసిక పూజ శ్రద్దగా చేస్తూ, రోజూ కొద్దీ సేపు నేను చెప్పిన విధం గా ధ్యానం చేయండి .. ఇవన్నీ చేస్తే ఆ ఆలోచనలు ఎక్కువ బాధించవు" అని చెప్పారు.

అయినా పెద్ద ఫలితం లేకపోయింది మూర్తి రాజు గారికి గురువు గారి దగ్గరికి వెళ్లడం ప్రారంభించిన ఆరు నెలలకి రాజా ఆఫీసు పని మీద ఇండియా వచ్చాడు. కళ్యాణి, మనవరాలు రెండు రోజులు ఉండి వైజాగ్ పు ట్టింటికి వెళ్లారు . రాజా ఆఫీసు పని అయిన తరువాత ఇంకో నాలుగు రోజులు సెలవు పెట్టి తల్లితండ్రులతో గడిపాడు. అతను ఉన్నన్ని రోజులో చాలా బాగా గడిచింది. ఇంకో రెన్డు రోజులకి తిరిగి వెడతాడనగా మూర్తి రాజు గారు కొడుకుని గురువు గారి దగ్గరికి తీసుకు వెళ్ళాడు. రాజాకి కూడా గురువు గారు చాలా బాగా నచ్చారు. ఆ ప్రదేశం బాగా నచ్చింది. మూర్తి రాజు గారు మిగతా మిత్రులతో హెర్బల్ గార్డెన్ చూడడానికి వెడితే రాజా, రామదాసు గురువు గారి తో సంభాషిస్తూ ఉంది పోయాడు.

రాజా ఉన్న అన్ని రోజులూ చాలా బాగా గడిచింది. సమయం చూసి శారదాంబ గారు రాజా తో చెప్పింది " నాన్నగారు నీ ఫోన్ కోసం చూస్తూ ఉంటారు. కల్యాణి చేస్తున్నా నువ్వు కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండమని" రాజా అలాగే అని నవ్వి ఊరుకున్నాడు. కల్యాణి కొన్నాళ్ళు వైజాగ్ లో ఉండి వస్తానంటే రాజా ఒక్కడూ వెళ్ళిపోయాడు. ఆ తరువాత కల్యాణి మానవరాలుతో వచ్చి రెండు రోజులు ఉండి సిడ్నీ వెళ్ళిపోయింది.

వాళ్ళు వెళ్లిపోయింతరువాత మళ్ళీ మామూలే. రాజా సరే, ఉద్యోగం లో చేరడంతో కల్యాణి దగ్గరనుంచి కూడా ఫోన్లు తగ్గిపోయాయి.
వారం వారం గురువు గారి దగ్గరికి వెడుతూనే ఉన్నారు మూర్తి రాజు గారు. అలా ఒక మాటు వెళ్లి నప్పుడు గురువు గారు ఒక సలహా ఇచ్చారు. ట్రస్ట్ ఇళ్లల్లో ఒకటి ఖాళీ గా ఉందని, అమీర్ పేట ఫ్లాట్ అద్దెకు ఇచ్చేసి తనకి దగ్గరగా వచ్చేయమని. ఇక్కడ అద్దె నామ మాత్రమే. అద్దె కంటే గురువు గారి దగ్గరికి వచ్చి దగ్గ రగా ఉండే అవకాశానికి మూర్తి రాజు గారు చాలా ఆనంద పడ్డారు. బయటి నుంచి వచ్చే వాళ్లతో ఫార్మల్ గా సత్సంగం ప్రతి ఆదివారారం జరిగినా, ట్రస్ట్ భవనాల కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళు ప్రొద్దున, సాయంత్రం ఒక గంట గురువుగారి సమక్షం లో గడపడం కద్దు. అలా కలిసినపుడు వ్యక్తిగత సమస్యలనుంచి, లోతయిన ఆధ్యాత్మిక విషయాల మీద ఏ ప్రశ్నలయిన గురువుగారిని అడిగి సమాధానాలు పొందుతూ ఉంటారు. కావలసిన వాళ్లకి వ్యక్తిగతమ్ గా కలిసే అవకాశం కూడా కల్పిస్తారు. అలా కలిసినప్పుడే మూర్తి రాజు గారు తన కొడుకు విషయం మాట్లాడుతూ ఉంటారు. ఆయన కి ఆద్యాత్మికం గా ఇంకా సందేహాలు ఉత్పన్నం కాలేదు. ఎంతసేపూ ఆలోచనలు కొడుకు చుట్టూనే.

*********

సత్సంగం టైం అవడంతో భాగవతాన్ని పక్కన పెట్టి లేచారు మూర్తిరాజుగారు. ఒక గంట సేపు జరిగే ఆ సత్సంగాన్ని ఆయన ఎప్పుడూ వదులు కోరు.

మూర్తి రాజు గారి ఇంటికి, గురువు గారి ఇంటికీ మధ్య అయిదు ఆరు ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఆయన ఇంటికి మూడో ఇంట్లో మురళి ఉంటున్నాడు. అతను కూడా మంచి మిత్రుడు . అతని ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి, సిట్ అవుట్ లో మురళి కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. ఈయన అక్కడికి రాగానే, మురళి నాలుగేళ్ల కొడుకు పరుగెత్తుకుని వచ్చి తండ్రి ఒళ్ళోకి ఎక్కాడు. అతను చిరాగ్గా అతన్ని దింపి లోపలి పొమ్మన్నాడు. ఒక్క క్షణం ఆగి మూర్తి రాజు గారు అది గమనించారు. "ఏమనుకోకు మురళీ. వాడిని అలా విదిలించకు. మహా అయితే ఇంకో రెండు మూడేళ్లు మాత్రమే వాడి ఆలింగన పరిశ్వంగం ఆనందించ గలవు. వాడు కొంచెం పెద్ద అయితే కావాలన్నా అది కుదరదు." అన్నారు నవ్వుతూ. ఏమనుకున్నాడో, మురళీ వెంఠనే కొడుకుని దగ్గరకి తీసుకుని వొళ్లో కూర్చోపెట్టుకున్నాడు.

ఆ వేళ సత్సంగం అయిన తరువాత అందరూ వెళ్ళిపోయిన తరువాత గురువు గారి దగ్గరే కూర్చుంది పోయారు మూర్తి రాజు గారు. రాందాసు గురువుగారు కొంచేము సేపు లోపలి వెళ్లి మెయిల్స్ అవీ చూసుకుని మళ్ళీ వచ్చి కూర్చున్నారు.

" ఎలా ఉంది మీ భాగవతం పఠనం ? ధ్యానం కొంచెం సేపు అయినా చేస్తున్నారా? ఆలోచనలు ఏమయినా బాధిస్తున్నాయా ?" అన్నారు మూర్తి రాజు గారి కేసి చూసి

" రాజా ఆలోచనలే ఎక్కువ గా వస్తూ ఉంటాయి. ఈ మధ్యన బొత్తిగా ఫోన్ చేయడం మానేశాడు. తల్లి తండ్రుల గురించి ఆలోచించకుండా, పట్టించుకోకుండా ఎలా ఉంటారో ఆశ్చర్యం గా ఉంది" అన్నారు నిష్టూరంగా'

గురువుగారు నవ్వుతూ " మూర్తి రాజు గారూ నాకు అనిపించే దేమిటంటే, అది మీరు విచారించ తగ్గ విషయం కాదేమో అనిపిస్తోంది. సరిగా ఆలోచించండి. మీరు వాడికి చిన్నప్పటినుంచీ ఏమి చేసినా మీ తృప్తి కోసం చేశారు. ఆలా చేయకుండా మీరు ఉండలేరు కాబట్టి చేశారు. ఇప్పుడు వాడు వాడి ప్రపంచంలో ఉన్నప్పుడు, మీరు చేసినవన్నీ మరిచిపోయి వాడు నిర్లక్ష్యం చేస్తున్నాడు అనుకుంటున్నావారు. అది ఒక సహజ పరిణామం ఎందుకు అనుకోరు? ఇప్పుడు వాడు మీకంటే వాడి కూతురు గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. దానివల్ల మీ గురించి ఆలోచనలు తగ్గవచ్చు. మీ నాన్నగారి గురించి మీరు ఎంత సేపు ఇప్పుడు ఆలోచిస్తున్నారు? మీకు వయసు వచ్చిన కొద్దీ అది తగ్గింది కదా? ఏ తల్లి తండ్రులకయినా పిల్లలు అంనందం గా ఉంటె చాలుననుకుంటారు కదా?. ఇప్పుడు వాడు ఆనందం గా ఉన్నాడు కాబట్టి మీరు అసలు విచారించవలసిన అవసరం లేదు కదా?

" అవును నిజమే" అన్నారు మూర్తి రాజు గారు కొంచెం ఆలోచనలో పడి.

"మీకో రహస్యం చెబుతున్నాను. మీరు అనుకున్న దాని కంటే మీ గురించి ఎక్కవ శ్రద్ధ రాజాకి మీ పట్ల ఉంది. మీరు ఆధ్యాత్మికం లో ఎక్కువ సేపు గడపాలని అతను కిందట మాటు వచ్చినప్పుడు నాతో చర్చించాడు. మీరు అమీర్ పేట నుంచి ఇక్కడికి మారడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఉంటున్న ఇల్లు అద్దెది కాదు. అతను మీకోసం కొన్నది. సమయం వచ్చినప్పుడు చెప్పమన్నాడు. అతను కాంటాక్ట్ తగ్గించడం నా సలహా మేరకే. మీకు ఆద్యాత్మికం గా నేను అనుకున్న దానికంటే అది ఎక్కువ సమస్య అయింది కాబట్టి చెబుతున్నాను. మీరు అన్నీ వదిలేసి దైవ చింతన ఎక్కువ చేస్తే మీ రాజా, అతని భార్యా, మీ భార్యా అందరూ సంతోషిస్తారు.వాళ్లందరికీ ఇది తెలుసు" అన్నారు నవ్వుతూ

ఆ రోజు న సత్సంగం నుంచి చాలా హుషారుగా మూర్తి రాజు గారు ఆనందంగా తిరిగి రావడం గమనించిన శారదాంబ గారు, గురువు గారు ఏమి చెప్పారో ఊహించారు

సమాప్తం

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు