తెలుగు బిడ్డ - కొయిలాడ బాబు (నవజీవన్)

telugubidda

"దేశభాషలందు తెలుగు లెస్స" ఒక్కొక్కక్షరం కూడబలుక్కుంటూ మొత్తం వాక్యాన్ని చదివిన శార్వరి తనలో తానే ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు.

తనకున్న పరిధిలోని తెలుగు సాహితీ సంఘాలకు శార్వరి అంటే ఒకింత గౌరవం. అయితే వ్యక్తిగతంగా తెలుగు సాహిత్యానికి, అతనికి ఉన్న సంబంధం చాలా తక్కువ.

అమెరికాలోని పేరెన్నిక గలిగిన వైద్యుల్లో ఒకరైన డాక్టర్ శార్వరిని తెలుగు భాషా సంఘాలు గుర్తుపెట్టువడానికి కారణం అతని తండ్రి తెలుగు సాహితీ రంగం గుర్తుపెట్టుకోదగ్గ గొప్ప రచయిత కావడమే. "తెలుగు బిడ్డ" అనే కలం పేరుతో అతను చేసిన రచనలు అతనికి తెలుగు సాహితీ రంగంలో ఒక స్థానాన్ని సుస్థిరం చేశాయి. అంతా తన తండ్రి గొప్పదనమే తప్ప, శార్వరి తెలుగు భాష వికాసానికి చేసింది ఏమి లేదు. ఆ విషయం అతనికి కూడా తెలుసు.

తన తండ్రి జయంతోత్సవాలను పురస్కరించుకుని ఒక ప్రవాస భారతీయ సంఘం పంపిన ఆహ్వానం మేరకు ఆ సభకు వచ్చిన శార్వరి, దూరంగా ఉన్న తన తండ్రి ఛాయాచిత్రాన్ని చూస్తూ ఒకసారి తన గత జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు.

చిన్నప్పటి నుండి తనకు, తన తండ్రికి వ్యక్తిగతంగా ఉన్న అనుబంధం చాలా తక్కువ. తాను ఎప్పుడూ తల్లి చాటు బిడ్డే. తన తండ్రి గొప్ప రచయిత అయినప్పటికీ, ఆయన రచనల గురించి గానీ, వాటి ఆవశ్యకత గురించి గానీ తెలుసుకోవాల్సిన అవసరం తనకు ఎప్పుడూ కలగలేదు.

చిన్నప్పటి నుండి తన తల్లిదండ్రులకు దూరంగా, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగిన శార్వరికి జీవిత లక్ష్యాలు వేరే ఉండేవి. అతనికి ఆదర్శమూర్తి తన మామయ్య. ఆయన అప్పటికే అమెరికాలో పేరెన్నిక గల వైద్యుడు కావడం వలన, అతని తోటి డాక్టర్లు కూడా అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవారు. ఇంట్లో వైద్య వృత్తికి సంబంధించిన చర్చలు ఎక్కువగా జరగడం, వాటికి సంబంధించిన వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల శార్వరి కూడా ఆ విషయాలు ఆసక్తిగా వినేవాడు. కొన్నాళ్ళకు తనకు కూడా మంచి డాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఏర్పడింది.

శార్వరి ఆసక్తిని గమనించిన అతని మామయ్య తనను ఆ దిశగా ప్రోత్సహించి, మెడిసిన్ చదివించాడు. కొంతకాలానికి శార్వరి కూడా మంచి డాక్టరుగా పేరు తెచ్చుకున్నాడు.

ఆమెరికాలో ఉంటున్నప్పుడు, భారతదేశంలో ఉన్న తన తండ్రితో ఎప్పుడో ముక్తసరిగా మాట్లాడడం తప్పితే, అంతకు మించి వారి మధ్య ఉన్న బాంధవ్యాలు కూడా అంతంత మాత్రమే. అయినా సరే తన తండ్రి అంటే అతనికి ఏదో తెలియని ప్రేమ, గౌరవం. ఆయన గురించి వచ్చే వార్తలు, వచ్చిన పురస్కారాల గురించి తప్పకుండా తెలుసుకునేవాడు.

అయినా ఏదో తెలియని లోపం.. చిన్నప్పటి నుండి తనకు ఆంగ్లమే పరమావధి అయిపోయిన క్రమంలో.. తెలుగు రాసే అలవాటే పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం తెలుగులో ఒక వాక్యం పూర్తిగా చదవాలన్నా ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. అలాంటి తనను తన తండ్రి అభిమానులు ఏదో ఒక సందర్భంలో గుర్తుచేసుకుంటూనే ఉంటారు. అందుకు కారణం కూడా తన తండ్రే.

శార్వరి తండ్రి తాను రాసిన వీలునామాలో అతని రచనలకు సంబంధించిన సర్వహక్కులూ తన కుమారుని పేరు మీదే ఉండేలా చేయడంతో ఒక బృహత్తర బాధ్యత భుజాలపై పడింది. ఆ బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించగలనా లేదా? అన్నది మరో మీమాంస. అయినా తనకు తోచింది ఏదో చేస్తున్నాడు. లాభం వచ్చినా, నష్టం వచ్చినా తన తండ్రి రచనలను ముద్రించి జనాల్లోకి తీసుకెళ్లే బాధ్యత తానే మోస్తున్నాడు తప్పితే.. బయట ప్రచురణకర్తలకు ఎలాంటి హక్కులూ ఇవ్వలేదు. అదే తన తండ్రి అభిమానులను తనకు దగ్గర చేసింది.

తాను తన పనుల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా.. అనుకోకుండానే తన తండ్రి అభిమానులతో, తెలుగు సాహిత్య సంఘాలతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు.

అయినా ఏదో తెలియని వెలితి. తన తండ్రి గొప్ప తెలుగు రచయిత అయినప్పటికీ, కనీసం తనకు తెలుగు సరిగ్గా మాట్లాడడం లేదా రాయడం రాదని చింతిస్తుండేవాడు. తాను ఒక నాలుగు వాక్యాలు మాట్లాడితే అందులో కనీసం మూడు వాక్యాలు ఆంగ్లంలోనే ఉండేవి.

అచ్చమైన తెలుగు తాను మాట్లాడగలనా?లేదా అన్న అభద్రతాభావం శార్వరిలో రోజు రోజుకూ పెరిగిపోసాగింది.

"నేను తెలుగువాడిని. నేను తెలుగులో వంద శాతం మాట్లాడడమే కాకుండా.. రాయడం, చదవడం కూడా పూర్తిగా నేర్చుకోవాలి. దీనిని ఒక లక్ష్యంగా మార్చుకోవాలి" ఇలా ఎన్ని సార్లు అనుకున్నా, వృత్తే తన ప్రధమ దైవం అయినంత కాలం, ఈ కోరిక తనకు మూడు నాళ్ళ ముచ్చటే అవ్వసాగింది.

ఇలా గతాన్ని ఒక సారి నెమరువేసుకుంటున్న శార్వరి తన స్నేహితుడు భుజం మీద చేయి వేయడంతో ఈ లోకం లోకి వచ్చాడు. మెడికల్ కాలేజీలో తన సహాధ్యాయి అయిన ఆ స్నేహితుడు తెలుగు భాషాభిమాని కూడా కావడంతో తనతో పాటు ఇలాంటి సభలకు తనను తోడు తీసుకురావడం అలవాటు చేసుకున్నాడు శార్వరి.

ఆ స్నేహితుడు కుర్చీలో కూర్చొని ఆ సభ ఆహ్వాన పత్రాన్ని బయటకు తీసి చదువుతూ "శభాష్ మిత్రమా.. మీ తండ్రి గారి జయంతి సందర్బంగా ఆయన రచనల మీద మీరు ప్రసంగించబోతున్నారని నాకు చెప్పనే లేదు" అనడంతో గొంతులో వెలక్కాయ పడింది శార్వరికి.

అసలు వక్తగా తన పేరు ఆహ్వాన పత్రికలో వేసారనే విషయమే ఇప్పటి వరకు తనకు తెలీదు. ఇప్పుడు పేరు ప్రచురించాక మాట్లాడక పోతే మర్యాదగా ఉండదు. "మరెలా?" సంశయంలో పడ్డాడు. సభా నిర్వాహకులకు ఇప్పుడు ఈ విషయం చెప్పడం కూడా బాగుండదు. మరేం చేయాలి?

సభ జరుగుతున్నంతసేపు ఏదో తెలియని వెలితి మనసును పీడిస్తూనే ఉంది. అందరినీ నవ్వుతూ పలకరిస్తున్నాడు గానీ, తనకున్న తెలుగు ప్రావీణ్యం ఎక్కడ బట్ట బయలవుతుందేమోనని చిన్న టెన్షన్.

చివరకు బల ప్రదర్శన చేసే సమయం రానే వచ్చింది. ఒక క్షణం ఆలోచించి, ఒక చిన్న కాగితం మీద ఏదో రాసి పక్కనున్న వ్యక్తికి అందించి, సభా నిర్వాహకునికి ఇవ్వమని చెప్పాడు. ఓ రెండు నిముషాల్లోనే మైకులో ప్రకటన వచ్చింది. గొంతుకు ఇన్ఫెక్షన్ రావడం వలన శార్వరి గారు ప్రసంగించలేక పోతున్నారని. కాసేపు ఊపిరి పీల్చుకున్నాడు శార్వరి.

******

మరుసటి రోజు ఉదయం.. 6:30 గంటలు. అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక చిన్న ఇల్లు. వరండాలో ఒక నల్లని బోర్డు దర్శనమిచ్చింది. ఆ బల్లకెదురుగా ఉన్న కుర్చీలో శార్వరి కూర్చొని ఉన్నాడు. ఆయనకు ఎదురుగా ఓ ఏడు పదుల వయసున్న వృద్ధుడు ఉన్నాడు. "మీరు నా గురువుగా దొరకడం నా అదృష్టం. మీ శిష్యరికం నన్ను పరిపూర్ణంగా తెలుగు నేర్చుకొనేలా చేస్తుందని కచ్చితంగా నమ్ముతున్నాను అన్నాడు. చిరుమందహాసం చేసాడు ఆ వృద్ధుడు. అతని చేతిలో ఉన్న పుస్తకం పై "తెలుగు భాష విద్యార్థులకు ప్రాథమిక అంశాలు" అనే పదాలు రాసి ఉన్నాయి. దాని క్రింద రచన- తెలుగుబిడ్డ అనే పదాలు బంగారు వర్ణంలో దేదీప్యమానంగా మెరిసిపోసాగాయి.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు