అమ్మ మనసు - డా: పి. కె. జయలక్ష్మి

amma manasu telugu story

"హాయ్ మధూ ఏం చేస్తున్నావ్?" అంటూ సుడిగాలి లా దూసుకు వచ్చిన మంజులని హాల్లోనే "స్టాప్ స్టాప్!" అంటూ ఆపేశాడు మాధురి భర్త అజయ్.. "క్యా బాత్ హై? మధూ ఇంట్లో లేదా ఏంటి కొంపదీసి?" కనుబొమ్మలు ముడి వేస్తూ అడిగింది మంజు.

"లేకేం? సుజిత్ తో మాట్లాడుతోంది ఫోన్లో. వారం రోజులకి దొరికాడు పుత్రరత్నం. కాసేపు నిరీక్షించక తప్పదు. ఇంతకీ మీ వారెక్కడా?" "ఇదిగో ఇక్కడ, కార్ పార్క్ చేసి వస్తున్నా" వెనకాలే వచ్చిన అవినాష్ చేయి అందుకుంటూ సోఫా లో కూచోబెట్టాడు అజయ్. "ఒక్క నిమిషం జ్యూస్ తెస్తా" అని లోపల్నించి మేంగో జ్యూస్ పట్టుకొచ్చాడు.

దాదాపు పదిహేను నిమిషాలకి మాధురి కొంచెం విచారం, కొంచెం సంతోషం కలగలుపుగా హాల్లోకి వచ్చింది. "హాయ్ మంజూ! చాలాసేపైందా వచ్చి? ఎలా ఉన్నారు? సారీ, వెయిట్ చేయించాను. అన్నట్టు అవినాష్! ఏం తీస్కుంటారు? కాఫీ, జ్యూస్?" అని హడావిడి పడిపోసాగింది. "మర్యాదలన్నీ అయ్యాయిలే గాని సుజిత్ ఏమంటున్నాడు? బాగా అడ్జస్ట్ అయ్యాడట్నా? చదువెలా సాగుతోందట?" కుతూహలం గా అడిగింది మంజుల. మాధురి ముఖం మళ్ళీ చిన్నబోయింది. "ఇప్పట్లో రాడే! ఏదీ ఏడు నెల్లేగా అయింది టెక్సస్ వెళ్లి. ఏం చదువులో ఏంటో? కనీసం ఫోన్ చేయడానికైనా తీరిక ఉండదా? వారం రోజుల్నించి ఫోన్ లేదు. ఎంత బెంగగా అన్పించిందో తెల్సా? అదే మాట్లాడుతున్నా ఇంతసేపూ. రెండ్రోజులకొక్కసారైనా ఫోన్ చేయాల్సిందేనని! వాడేదో చెప్తున్నాడనుకో. మా అక్క కొడుకు పెళ్ళాం, పిల్లాడితో సిడ్నీ వెళ్లి రెండేళ్లవుతోంది. ఉద్యోగం, సంసార జంఝాటం లో పడి పదిహేను రోజులకోమారు ఫోన్ చేస్తాడు. వీడు చూస్తే చదువుకోడానికే గా వెళ్లింది. ఏం వ్యాపకాలుంటాయి చెప్పు? అమ్మానాన్నలకి ఫోన్ చేయటానిక్కూడా తీరిక దొరకదా?" ఆవేదనగా చెప్పుకుపోతోంది మాధురి.

"అంతేనే! విదేశాలకి వెళ్తే ఇక్కడి వాళ్ళు ఏమైపోయినా పట్టదు. చదువు, ఉద్యోగం, సంసారం... ఇలా వాళ్ళ ప్రపంచమే వేరు. ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు అక్కడికెళ్ళాక ఎలా ఉంటారే మొద్దూ? కానీ నేను మాత్రం అలా ఉండను లేవే." అంటూ నవ్వింది మంజు. "నువ్వు అలా ఉండనంటావేంటే? నువ్వంటున్నది ఇక్కడే కదా? ఇండియా వదిలి ఎక్కడికి పోతావే?" వీపు మీద చరుస్తూ నవ్వింది మాధురి. అది చెప్పటానికే నండీ మీ ఫ్రెండ్ వచ్చింది, తను విజిటింగ్ ఫ్రొఫెసర్ గా బల్గేరియా వెళ్తోంది రెండేళ్లపాటు." అన్నాడు అవినాష్ నవ్వుతూ. "వావ్! ఇంత మంచి వార్త ఎంత కూల్ గా చెప్తున్నారో చూడు మధూ! ఎనీ వే కంగ్రాట్స్ మంజూ" అన్నాడు సంతోషంగా అజయ్. మాధురి ఆప్యాయంగా మంజులని కౌగిలించుకుంది. "ఇంతకీ ఎప్పుడు ప్రయాణం? మంజూ తో మీరూ వెళ్తున్నారుగా?" అనుమానంగా అడిగింది మధు. "ఆయనా వస్తున్నారే! నెల ఉండి అన్నీ చూస్కొని వస్తారు. నాక్కాస్త అలవాటవుతుంది ఈలోగా." అంది మంజు. "మళ్ళీ సమ్మర్ లో కోమల్ పరీక్షలయ్యాక ఇద్దరం కలిసి బల్గేరియా వెళ్తాం" అందుకుంటూ చెప్పాడు అవినాష్. "అమ్మో అయితే రెండేళ్ళు కన్పించవా? ఎలాగే మంజు?" అంటూనే మళ్ళీ "పోన్లేవే, ఇంత మంచి ఛాన్స్ ఎంత మందికి దొరుకుతుంది? మన వయసు వాళ్ళు పిల్లలు ఫారిన్ లో ఉంటే వాళ్ళని చూడ్డానికి వెళ్తారు గాని ఇలా తమ మెరిట్ మీద వెల్లగల్గుతున్నది నువ్వేనే నాకు తెలిసి. ఫోన్ చేస్తూ ఉండు. పెద్దవాడు విమల్ ముంభై లో జాబ్ చేస్తున్నాడు. సో, వాడి గురించి బెంగ అక్కర్లేదు. కోమల్ ని వీలైనపుడల్లా మా ఇంటికి రమ్మనమను. అయినా వాడి నంబరు నా దగ్గర ఉందిగా. నేను టచ్ లో ఉంటాలే. ఏం పరవా లేదు." అంది మాధురి మంజు చేయి నిమురుతూ.

"థాంక్సే! వాడు మేనేజ్ చేసుకోగలడు. పర్లేదు. అన్నట్టు రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నా, అమ్మకి, అన్నయ్యా వాళ్లకి నా ప్రయాణం గురించి చెప్పి రెండ్రోజులుండి అమ్మ చెప్పే జాగ్రత్తలు బుద్ధిగా విని వస్తాను" అంటూ వాళ్ళ దగ్గర సెలవు తీసుకొని ఇంటికి బైలుదేరుతోంటే "మంజూ! వెళ్ళేలోగా మళ్ళీ వస్తావు కదా, అందరం కలిసి బైట డిన్నర్ కి వెళ్దాం" అంది మాధురి బొట్టు పెడుతూ.

**** **** **** ****

సాధారణంగా నీ ఈడు తల్లులు పిల్లల్ని పై చదువులకని విదేశాలు పంపిస్తూ వీడ్కోలు చెప్తూ ఉంటారు. కానీ పిల్లల్ని ఇక్కడ వదిలి నువ్వు కెరియర్ పరంగా విదేశాలకి వెళ్తున్నావే" అన్నాడు మంజు అన్నయ్య నవ్వుతూ. వదిన కొసరి కొసరి తిన్పించింది మంజుకి ఇష్టమైన వంటకాలన్నీ అత్తగారి సూచనలతో! గిరిజమ్మ బాగా ఆందోళన పడిపోయింది కూతురి విదేశీ యానం సంగతి విని. మాటిమాటికీ కళ్ళుతుడుచుకుంటూ మంజుని దగ్గరికి తీస్కొని "జాగ్రత్తే మంజూ! దేశం కాని దేశం వెళ్తున్నావు. ఎలా ఉంటావో ఏంటో?" అని బాధపడింది.

"నువ్వు మరీనమ్మా. నేనేమైనా చిన్నపిల్లనా? అయినా నాతో మా ఆయన కూడా వస్తున్నారుగా కొన్నాళ్ళపాటు! భయమేం లేదు." అని సముదాయించింది తల్లిని.

"నీకేంటే ఏమైనా చెప్తావు. దగ్గరాదాపా? సముద్రాలు దాటి వెళ్తున్నావు. వైజాగ్ లో ఉంటే రెన్నేల్లకోసారైనా సెమినారనో, మీటింగనో హైదరాబాద్ వచ్చేదానివి. ఇప్పుడెలాగే నిన్ను చూసేది?" అంటూ బావురుమంది గిరిజమ్మ.

"అయ్యో అత్తమ్మా! కంప్యూటర్ లో చూస్తూ చక్కగా మాట్లాడుకోవచ్చు. అలా బాధపడకండి, శుభమా అని తను వెళ్తోంటే." బుజ్జగించింది కోడలు శాంతి అత్తగారిని. మొత్తమ్మీద తల్లికి ఎలాగో నచ్చచెప్పి వైజాగ్ వెళ్లిపోయింది మంజుల.

**** **** **** ****

కాలేజ్ లో అందరి దగ్గరా సెలవు తీసుకొని ఇంట్లో చిన్న కొడుక్కి బోలెడు జాగ్రత్తలు చెప్పి వంటామెకి, పనిమనిషికి అన్ని అప్పగింతలు పెట్టి ఫ్లాట్స్ లో వాళ్లకి, వాచ్ మెన్ కి పిల్లాడిని కాస్త కనిపెట్టమని అభ్యర్ధించి, భారమైన మనసుతో భర్తతో పాటు బల్గేరియా బైలుదేరింది మంజుల. దాదాపు పన్నెండు గంటల ప్రయాణ మనంతరం సోఫియా చేరారు. విమానాశ్రయం లో దిగుతూనే హిమపాతం, వణికించే చలి వారిని ప్రేమగా స్వాగతించాయి. భారత దౌత్య కార్యాలయ అధికారి, సోఫియా విశ్వవిద్యాలయం భారతీయ విద్యావిభాగం డైరెక్టర్ వారిని రిసీవ్ చేసుకొని క్వార్టర్ లో దింపి వెళ్ళిపోయారు. అత్యాధునిక వసతులతో విశాలమైన ఫ్లాట్ ముచ్చటగా అన్పించింది మంజూ దంపతులకి.


మర్నాడు ఎంబసీ కి వెళ్ళి భారత రాయబారిని కలిసి అభివాదం చేసి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి, యూనివర్సిటీ కి వెళ్ళింది మంజుల. ఇండాలజీ విభాగ అధ్యాపకులు, విద్యార్ధులు ఆమెని పుష్ప గుచ్చాలతో ఆహ్వానించి కేక్ కట్ చేయించారు. భారతీయుల రాజభాషకి బల్గేరియా విశ్వవిద్యాలయం లో ప్రాధాన్యతని చూసి ఆమె ఆనందభరితురాలయ్యింది. ఇండాలజీ విభాగ ప్రొఫెసర్లు బల్గేరియన్సే ఐనా హిందీ లో చక్కగా మాట్లాడ్డం, విద్యార్ధులకి బోధించడం ముచ్చటన్పించింది. మర్నాటి నించి క్లాసులకి రమ్మనమని టైం టేబిల్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు భార్యాభర్తలిద్దరినీ లంచ్ కి తీసుకువెళ్ళారు... తాము తెచ్చిన ఇండియన్ స్వీట్స్ వాళ్ళు ఇష్టంగా మెచ్చుకుంటూ తినడం మంజుల కెంతో నచ్చింది.

రోజూ తప్పనిసరిగా కొడుకులతో మాట్లాడేది మంజుల ఎంత బిజీగా ఉన్నా. విఫ్రో లో ఇంజనీర్ గా చేస్తున్న పెద్దకొడుకు విమల్ ఫ్రెండ్స్ తో ప్లాట్ లో ఉంటున్నాడు. చిన్నవాడు కోమల్ వైజాగ్ లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పిల్లలు పెద్ద వాళ్ళే అయినా దూరంగా ఉండడంతో వాళ్ళెలా ఉన్నారో, ఏం తింటున్నారో అని బెంగ. ఫోన్ చేసినా ఇవే ప్రశ్నలు... "టైమ్ కి తినండిరా, ఆరోగ్యం జాగ్రత్తరా" అంటూ. కొన్నాళ్ళుండి మంజు బాగా అడ్జస్ట్ అయ్యిందన్పించాక అవినాష్ ఇండియా వెళ్ళిపోయాడు. ఇండాలజీ ప్రొఫెసర్ వన్యాసుకోవా సరదాగా, స్నేహం గా ఉండటం తో మంజూ కి బాగా నచ్చేసింది. తను అవివాహిత కావడం వల్ల మంజూ తో కలిసి ఫ్లాట్ లో ఉండడానికి ఒప్పుకోవడంతో కొత్త దేశం లో ఒంటరిగా ఉండాల్సివస్తుందనే బెంగ తప్పింది మంజూకి. ఇద్దరూ కలిసి వండుకోవడం, కాలేజ్ కి వెళ్ళడం., సెలవు రోజుల్లో షాపింగ్, కొలీగ్స్ ఇళ్ళకి, చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్ళడం... ఇలా టైమ్ బాగానే గడిచిపోతోంది.

"వారం నించి కోమల్ ఫోన్ కి దొరకడం లేదు, ఎలా ఉన్నాడు?" ఆదుర్దాగా అడిగింది మంజు స్కైప్ లో వచ్చిన భర్తని. "వాడేదో ప్రాజెక్ట్ వర్క్ హడావిడిలో ఉన్నాడు కంగారుపడకు. ఇంటికి కూడా లేట్ గా వస్తున్నాడు. నేను చెప్తాలే నీకు ఫోన్ చేయమని. వంటావిడ, పనిమనిషి బాగానే వస్తున్నారు నాగాలు పెట్టకుండా" చెప్పాడు అవినాష్ ఆమె మనసులో మాట తెలిసినట్టుగా. మంజు మనసు చివుక్కుమంది. వాడెంత బిజీ అయితే మాత్రం దూరంగా ఉన్న తల్లికి ఫోన్ చేయడా? తనే మన్నా ఇక్కడ ఖాళీగా ఉందా? ఇంకో పక్క ఆ విమల్ షిఫ్ట్ డ్యూటీ అంటూ రాత్రిళ్ళు లేట్ గా వచ్చానంటాడు, ఉదయం లేట్ గా లేచానంటాడు. వాడు సరిగ్గా మాట్లాడడు. అదేంట్రా అంటే "ఏంటమ్మా రోజూ ఏముంటాయి కబుర్లు? ఆఫీసు, ఇల్లు, వండుకోవడం, వీకెండ్స్ లో బట్టలుతుక్కోవడం, ఇంతేగా. నువ్వొచ్చి నాకు ఏం చేసి పెట్టలేవు, తెలుసుకుని బాధ పడ్డం తప్ప. ఫ్రెండ్స్ తో అలా గడిచిపోతోంది" అంటాడు.. నిట్టూర్చింది మంజుల.

రాత్రి ఏడు గంటలకి ఫోన్ వస్తే మంజు ఒక్క ఉదుటున అందుకుంది కోమల్ చేశాడని అనుకుంటూ. "మంజూ తల్లీ ఎలా ఉన్నావే?" అంటూ పలకరించింది ఆప్యాయంగా అవతల్నించి అమ్మ. ఒక్కసారిగా జావగారిపోయింది మంజు. అంటే అక్కడ పదిన్నర అయిందన్న మాట. "ఆ, నేను బాగానే ఉన్నా గాని నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఇంతవరకూ పడుకోకుండా ఏం చేస్తున్నావసలు?" విసుక్కుంది తల్లిని. రెండు దేశాల మధ్య మూడున్నర గంటల తేడా. తనిక్కడ సాయంత్రం ఆరున్నరకి గాని యూనివర్సిటీ నించి ఇల్లు చేరలేదు. అక్కడ అమ్మ రాత్రి ఎనిమిది కల్లా మాత్రలు వేసుకుని పడుకుండిపోతుంది. అందుకే మాట్లాడ్డం కుదరడం లేదు., ఇవాళ పదిన్నర దాకా లేచే ఉందంటే మందులు వేసుకోలేదన్న మాట. మనసులో లెక్క వేసుకుంది. "నువ్వు వెళ్ళాక రెండు సార్లు మాట్లాడావంతే. ఎంత బెంగగా ఉందో తెల్సా తల్లీ? ఒక్కదానివి అక్కడ ఏం తింటున్నావో? ఏమవస్థలు పడుతున్నావో అని ప్రాణం కొట్టుకుపోతోందే!' అంది గిరిజమ్మ వణుకుతున్న స్వరంతో. "అబ్బా! ఏంటమ్మా ఎప్పుడూ ఇదే గోల? నాకేమీ పర్వాలేదు, హాయిగా ఉన్నానే అంటే వినవే? మందులేసుకుని పడుకో ముందు. ఆదివారం మాట్లడతాలే." విసుగ్గా అంది మంజు కి. కోమల్ అనుకోని ఫోన్ తీస్తే అమ్మ మాట్లాడుతోంది. ఈలోపు వాడుగానీ చేస్తే ఎంగేజ్డ్ వస్తుంది. మళ్ళా ఎప్పుడు చేస్తాడో ఏంటో అనుకోని ఫోన్ కట్ చేసింది. మిస్ కాల్స్ లో ఏవో ఉన్నాయి గాని కోమల్ నంబర్ లేదు. ఏమైంది చెప్మా? భర్త చూస్తే కలకత్తా కాంప్ లో ఉన్నాడు. విమల్ కి కాల్ చేస్తే "ఏంటమ్మా నువ్వు? వాడేమైనా చిన్న పిల్లాడా? ఏదో బిజీగా ఉండుంటాడు. తర్వాత కనుక్కుని ఫోన్ చేస్తాలే. ఆఫీస్ లో ఉన్నా, డిస్ట్రబ్ చేయకు" అని పెట్టేశాడు.

మంజుల మనసు చివుక్కుమంది. ఏంటీ పిల్లలు? తను విదేశం వచ్చినా ఎంత బిజీగా ఉన్నా పిల్లల కోసం ఎంతగా ఆలోచిస్తోంది? ఆరోజు మధు ఏమంది? విదేశాలకి వెళ్తే పిల్లలంతే, ఫోన్ కి కూడా దొరకరు అని కదా! కానీ వాళ్ళు స్వదేశం లోనే గా ఉన్నారు!
మరెందుకు పట్టించుకోవడం లేదు? కనీసం ఫోన్ కి కూడా అందుబాటులో ఎందుకుండడం లేదు? అంటే విదేశాలు వెళ్ళడం వల్లో, పెళ్ళాం పిల్లల వల్లో ఈ మార్పు రావడం లేదు. తన పిల్లలు విదేశాల్లో లేరు, పెళ్ళయిన వాళ్ళు కారు. అయినా తల్లికి సమయం కేటాయించలేనంత బిజీగా ఉన్నారు. ఒక్కసారిగా బాధ ఆవరించింది ఆమెని.

**** **** **** ****

"ఇవాళ సోఫియా మాల్ కి వెళ్దామా మంజూ" ఆదివారం ఉదయం లేస్తూనే అడిగింది వన్యా. "ఓకే పిల్లలకి షర్ట్స్ కొనాలనుకుంటున్నా ఎలాగూ, లంచ్ చేసి వెళ్దాం" అంది ఉత్సాహంగా మంజు. సాయంత్రం వరకు షాపింగ్ చేసి మాల్ లోనే ఏదో తినేసి ఫ్లాట్ కి తిరిగి వచ్చారిద్దరు. రాత్రి ఏడవుతోంటే కోమల్ దగ్గర్నుంచి ఫోన్... కొడుకు గొంతు విని. "నాన్నా, ఎలా ఉన్నావురా?. ఫోన్ కనీసం ఎత్తనైనా ఎత్తవు కదా? ఎన్ని రోజులైందిరా నీతో మాట్లాడి" అంటూ మంజు పొంగిపోయింది. "పోమ్మా, కొత్త సిమ్ నించి ఎన్నిసార్లు ట్రై చేశానో? నువ్వొక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు." ఆరోపణగా అన్నాడు కోమల్. ఆశ్చర్యం గా నంబర్ చూసింది మంజు. నిజమే, కొత్త నంబరు. ఎవరిదో అనుకోని పట్టించుకోలేదు. "నా సెల్ పోయిందమ్మా, అందుకే కొత్తది తీస్కున్నా. నువ్వు పాత నంబర్ కి చేస్తుంటావని చాలాసార్లు ట్రై చేస్తే లక్కీగా ఇవాళ దొరికావు." చెప్పాడు కోమల్. "సారీ నాన్నా, నువ్వు ఫోన్ చేయలేదని ఎంత బెంగ పడ్డానో? వేళకి తింటున్నావా? అసలే చలికాలం. బైట మంచులో ఎక్కువసేపు తిరగకు. స్వెట్టర్ వేస్కో. చెవులు కవర్ చేసుకో. లేకపోతే దగ్గు, జలుబుతో బాధపడాలి." జాగ్రత్తలు చెప్తోంటే "ఆపమ్మా బాబూ ఇది వైజాగ్, బల్గేరియా కాదు. చలి, మంచు జాంతానై. ఫ్రెండ్స్ వచ్చారు, మూవీకి వెళ్తున్నా, బై" అంటూ ఫోన్ కట్ చేశాడు కోమల్. నివ్వెరపోయింది మంజు.

హాల్లో సిస్టమ్ దగ్గర మెయిల్ చూస్తున్న వెన్యా "మంజూ, మీ అన్నయ్య స్కైప్ లో వచ్చారు" అని అరవగానే "ఇదిగో వస్తున్నా" అంటూ కంప్యూటర్ ముందు కూచుని బాధ వెళ్లబోసుకుంది. "చూడన్నయ్యా! విమల్, కోమల్ ఎంత ఆరిందాల్లా మాట్లాడుతున్నారో? ఫోన్ కి దొరకరు, ఎప్పుడూ బిజీయే! వాళ్ళ గురించి నేనెంత ఆరాటపడుతున్నానో అర్ధం చేసుకోవడం లేదు. స్వెట్టర్ వేసుకోమంటే చిన్నాడు కొట్టిపారేశాడు. ఆ పెద్దాడికి చూడబోతే టాన్సిల్స్! కూల్ డ్రింకులు, ఐసుక్రీములు తినద్దంటే నాకు తెల్సులే అమ్మా, తినకుండా ఎలా? తినేశాక మాత్రలేసుకుంటాలే అంటున్నాడు. తల్లంటే అస్సలు లెక్కలేదు." అంటూండగానే అన్నయ్య నవ్వుతూ "మంజూ అమ్మతో ఒకసారి మాట్లాడు" అని వెబ్ కామ్ తల్లి వైపు తిప్పాడు. "అమ్మా! ఏంటి ఇంకా పడుకోకుండా...?" మాట పూర్తవకుండానే "ఏమే మంజూ ఆదివారం ఫోన్ చేస్తానన్నావు? పగలంతా చూసి చూసి ఇంకా ఉండబట్టలేక నేనే అన్నయ్యని చేయమన్నాను..." చటుక్కున గుర్తొచ్చింది మంజూ కి క్రితం సారి అమ్మతో మాట్లాడుతూ ఆదివారం ఫోన్ చేస్తానన్న సంగతి. కోమల్ గాడి హడావిడి లో పడి మర్చేపోయింది. అవతల్నించి అమ్మ "ఏంటీ తల్లీ అక్కడ చల్లగా ఉంటుందన్నావు. శాలువా అయినా కప్పుకోకుండా కూచున్నావు?" అంటోంది.

"అబ్బా ఇక్కడ హీటర్లు ఉంటాయే ఇంట్లో చల్లగా ఏమీ ఉండదు, నాకేం కాదు గాని నువ్వెలా ఉన్నావు? వదిన, పిల్లలు ఎలా ఉన్నారు?" "అంతా బాగానే ఉన్నాం. నీకసలే సైనస్. మందులేసుకుంటే సరిపోదు. వేళపట్టున వేడిగా తినడం, వేడి నీళ్ళుతాగడం చేస్తున్నావా, లేదా? ఇంట్లో కూడా చెప్పులేసుకో. లేకపోతే నెమ్ము చేస్తుంది. తొందరగా పడుకో" అంటూ జాగ్రత్తలు చెప్తోంటే చిర్రెత్తింది మంజూకి. "అలాగే లేవే అమ్మా. నేనేమైనా చిన్నపిల్లనా? నా గురించి నాకు తెలియదా ఏంటీ?" "నీ మొహం? నీకేం తెలుసు? ఏదో పెద్ద చదువులు చదివేసి పై దేశంలో ఉద్యోగం వెలగబెడుతున్నంత మాత్రాన పెద్దదాన్ని అయిపొయాననుకుంటున్నావో ఏమో తల్లీ? చెప్పిన మాట విను కాస్త. ఫోన్ చేస్తూ ఉండు, పడుకుంటా ఇంక" అని లేచి వెళ్ళిపోయింది గిరిజమ్మ.

"విన్నావా అన్నయ్యా అమ్మ మాటలు? నాకేమీ తెలియదట. ఇరవయ్యేళ్ళ వయసు పిల్లలున్నారు నాకు. ఇంకా చిన్నపిల్లలకి చెప్పినట్టు ఎలా జాగ్రత్తలు చెప్తోందో చూడు నిద్ర పోకుండా." అన్నగారికి ఫిర్యాదు చేసింది మంజు. "అమ్మ ప్రేమంటే అదేనే మరి. పిల్లలెంత పెద్దయినా తల్లికెప్పుడూ చిన్నగానే అనిపిస్తారు. అంతెందుకు? నా ఆఫీసు మనింటికి రెండు వీధులవతల. అయినా రోజూ ఆఫీసుకి వెళ్తుంటే "నాన్నా, రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తరా. అటూ ఇటూ చూసుకొని రోడ్డు దాటు." అని జాగ్రత్తలు చెప్తుంది. సాయంత్రం ఇంటికి రావడం కాస్త లేట్ గాని అయితే ఒకటే గాబరా పడిపోయి అందర్నీ కంగారు పెట్టేస్తుంది. పెద్దయ్యే కొద్దీ చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తారే వీళ్ళు."

"ఎన్నయినా చెప్పు వీలయినప్పుడల్లా ఫోన్ చేస్తా కదా. రాత్రి పదిన్నర వరకు పడుకోకుండా ఫోన్ లో నాకు జాగ్రత్తలు చెప్పాల్సిన పనేంటి? తన హెల్త్ గురించి ఎందుకు ఆలోచించదసలు?"

"ఆహా అలాగా తల్లి? ఆ మధ్య కోమల్ తెల్లవారుఝాము 5 గంటలకి డిల్లీ వెళ్తోంటే నువ్వక్కడ అర్ధరాత్రి ఒంటిగంట దాకా పడుకోకుండా ఎందుకు వాడికి జాగ్రత్తలు చెప్పావు? బంగాళా దుంపల వేపుడు తింటుంటే పిల్లలు గుర్తొచ్చి బెంగపడ్డానంటావు. ఇక్కడ అమ్మ కూడా దోసకాయ పప్పు, గోంగూర పచ్చడి తింటూ ఇవి మంజు తల్లికి ఎంతిష్టమో అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. అదేనమ్మా అమ్మ మనసు....

నీకు నీ పిల్లలు ఎంత ప్రాణమో అమ్మకి కూడా మనమంటే అంతే ప్రాణం. కానీ మనం మన పిల్లల గురించి ఆలొచించినట్టు అమ్మానాన్న ల గురించి ఆలోచించం. ఎప్పుడూ పిల్లల కోసం ఆరాటపడుతూ ఉంటాం. వాళ్ళేమో తమ ఫ్రెండ్స్, తమ వ్యాపకాల్లో బిజీగా ఉండి ఏదైనా కావాలన్పిస్తే ఫోన్ చేస్తారు. మనకేమో ఆదుర్దాగా ఉంటుంది వాళ్ళెలా ఉన్నారోనని పిల్లలు రెండు రోజులు ఫోన్లో మాట్లాడకపోతే ఎంత తల్లడిల్లపోయావు? నువ్వు చెప్పిన టైమ్ కి ఫోన్ చెయ్యకపోతే ఇక్కడ అమ్మ కూడా అంతే! నీకోసం పదయినా పడుకోకుండా కూచుంటుంది. నీతో ఫోన్లో మాట్లాడితే తృప్తిగా నిద్ర పడుతుంది ఆవిడకి." అన్నయ్య చెప్పుకుపోతున్నాడు.

మంజుల కళ్ళ నిండా నీళ్ళు. నిజమే కదా ఎంత బిజీగా ఉన్నా కాస్త టైమ్ చిక్కితే పిల్లలకే కేటాయించా గాని తల్లి కోసం కాదు. పిల్లలు సరిగ్గా మాట్లాడకపోయినా కనీసం వాళ్ళ గొంతు వింటే చాలని తెగ తాపత్రయ పడుతూ ఉంటా. వాళ్ళకిష్టమైన వస్తువులు కన్పించినా, వంటకాలు తింటున్నా ఇక ఆరోజు మరీనూ! మరి అమ్మ క్కూడాఅలాగే ఉంటుందని ఎందుకు అనుకోలేకపోయాను? మనిషి సైకాలజీ ఎంత చిత్రం గా ఉంటుందో కదా? ఎవరైతే తమ గురించి ఎక్కువ కేర్ తీసుకుంటారో, ఆలోచిస్తారో వాళ్లకి అందరి కంటే తక్కువ ప్రాధాన్యతనిస్తారు. తను అమ్మని పట్టించుకోనట్లే తన పిల్లలు కూడా తనకి సమయం కేటాయించడం లేదు.

అవతల్నుంచి అన్నయ్య అంటున్నాడు... "అమ్మ ప్రేమించినట్టు ఎవరూ ప్రేమించరే మంజూ! ఈ టెక్నాలజీ పుణ్యమా అని దూరాలు దగ్గరవుతున్నాయి. చాదస్తం అని తీసిపారేయకుండా నీ పిల్లల్లాగానే అమ్మని కూడా చిన్న పిల్ల అనుకోని కాస్త టైమ్ కేటాయించు. ఆవిడేం చెప్పినా విసుక్కోకుండా ఓపిగ్గా విను."

అన్నయ్య మాటలు అ ప్రశాంత నిశీధి లో హిమపాతం లాగా ఆమె హృదయాన్ని చల్లగా తాకుతుంటే స్కైప్ లో కన్పిస్తున్న తల్లి ఫోటోని ప్రేమగా చూస్తూ ఉండిపోయింది అమ్మ మనసు తెలిసిన మంజుల.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ