పాండూకి తొమ్మిది మంది అమ్మాయిలతో పెళ్ళిచూపులు ఫేయిల్యూర్ అయిన తరువాత ఈ రోజు పదవ అమ్మాయితో పెళ్ళిచూపులను ఏర్పాటుచేసుకున్నాడు.
అందుకే సదరు పాండు చెప్పలేనంత సంతోషం తో ఊహాలోకం లో విహరిస్తున్నాడు. కారణం ఇవాళ చూడబోయే అమ్మాయి కచ్చితంగా ఫిక్సు అవుతుందని పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు. అందుకే తన ఈ పెళ్ళిచూపులకు మామూలుగా ఎప్పుడూ తనతో తీసుకువెళ్ళే వాళ్ళాఫిసులోని ప్రాణమితృడు ప్రభు, తండ్రి లాంటి జ్ఞానమూర్తితో షేర్ ఆటోలో బయలుదేరి పెద్ద బజారు గుడిలో అమ్మవారికి దణ్డం పెట్టుకుని పిల్లవాళ్ళింటి ముందు దిగాడు పాండు.
వాళ్ళను చూస్తూనే పిల్ల తల్లితండ్రులు సాదరంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టి ఫ్యాను లేని ఆ గదిలో టేబుల్ ఫ్యానుంచి ఆన్ చేసి యాభై సంవత్సరాలకు పై బడ్డ జ్ఞానమూర్తి ని పక్కనుంచి పాండుని, ప్రభు ని మార్చి మార్చి చూశారు వాళ్ళలో పెళ్ళికొడుకెవరోనన్న సందేహం తో! కారణం వాళ్ళతో పాటు పెళ్ళి చూపులు ఏర్పాటు చేసిన ఆ పెళ్ళిళ్ళ పేరయ్య రాకపోవడమే!
ఇక పిల్లను తయారు చేసే నిమిత్తం పిల్ల తల్లి ఆమె స్నేహితురాళ్ళు పిల్ల వున్న గది లోకి వెళ్ళిపోయారు. ఈ లోపు బజ్జీలు జిలేబీలున్న రెండు ప్లేట్లను తెచ్చి టీపాయి మీదుంచి లాగించమన్నట్టు తలూపి వెళ్ళిపోయింది ఆ ఇంటి పనిమనిషి. పని మనిషితో పలహారాలను అందించటం వాళ్ళ పద్దతట. పనిమనిషి అటు వెళ్ళడమే తడవుగా లంకనాలు చేసిన వాడిలా రెండేసి బజ్జీలను, జిలేబీలను ఆవురావురంటూ "ఆం..ఆం..." అని తిని టీపాయి మీదుంచిన మంచి నీళ్ళను గటగట తాగేశాడు పాండు. కాసేపయ్యాక కడుపులో ఓ విధమైన వికారంతో కూడుకొన్న గుడగుడలు మొదలవగా పనిమనిషి నడిగి పెరట్లో వున్న టాయ్ లెట్టు లోకెళ్ళి తలుపేసుకున్నాడు. పది నిముషాల తరువాత బయటికొచ్చిన పాండు హాంకీ తో తన జిడ్డుముఖాన్ని తుడుచుకుని క్రీకంట పెళ్ళికూతురున్న గది వేపు చూస్తూ పెరట్లోని దండెం తట్టుకొని క్రింద పడి వెంటనే లేచి కుంటుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. బహుషా పెరట్లో ఏదేని పురుగు తన పైన పడిందేమో పాండూ వీపుకు విపరీతమైన జిల అంటుకుంటుంది. పాండు ఆ జిలకు తట్టుకోలేక లేచి వెళ్ళి గోడకు వీపునేసి పరపర గీక్కొంటున్నాడు. అది గమనించిన మిత్రుడు ప్రభు ఒరేయ్! ఆ పరపరనిక ఆపరా! ఎవరైనా చూడగలరు" అని మెల్లగా అంటే "నో..ఇది నా ఒల్లు... నా వీపు.. నా..
అది పోవటానికి నేనిలాగే చేస్తా .! "అన్నాడు పాండు తన్నెవరూ చూసుండరన్న భావనతో! అయితే ఆ తతంగాన్నంతా లోపలి నుంచి గమనిస్తూ పెళ్ళి చూపులకు తయారవుతున్న పిల్ల కిసుక్కున నవ్వి కింద పడిపోయింది.
"ఏమిటమ్మా! ఏమైంది?" ఆదుర్దాతో తల్లి పిల్లను అడగ్గా కిటికీలోంచి వీపును గోడకేసి గీక్కొంటున్న పాండును చూసింది ప్రక్కనున్న తన ఫ్రెండు ప్రభుకు ఓ చూపు విసురుతూ. ఆమె చూపులకు బిత్తరపోయి కళ్ళు మూసుకున్నాడు ప్రభు. ఇక గీక్కోవడం ఆపి వచ్చి సోఫాలో కూర్చున్నాడు పాండు. అప్పటివరకూ పాండూ చేసిన పిచ్చిపనులను ఊహించుకుని సహించలేక కొద్దిగా గొంతు పెంచి "ఓకే ! అమ్మాయిని పిలిపించండి" అన్నాడు పెద్దమనిషి జ్ఞానమూర్తి .
"ఇదిగో తీసుకువస్తున్నామండీ" అన్న మాట అవతలి నుంచి వినబడ్డంతో అప్సరస లాంటి అమ్మాయిని చూడబోతున్నాడన్న ఆనందంతో తాగుతున్న వేడి కాఫీని షర్టు ప్యాంటు మీద ఒలకబోసుకుని కాలుతున్న నోటిని "వుఫ్" ని మూసుకుని హాంకీతో తుడుచుకుని ఆత్రుతగా అటు చూశాడు పాండు. అప్పుడు పాండు మూతి తాటిముట్టెలా అయ్యింది.
అమ్మాయి హాళ్ళోకొచ్చింది. అక్కడున్న అందరికి చక్కగా నమస్కరించి పాండు ఎదురుగా వున్న కుర్చీలో కాలుమీద కాలేసుకుని కూర్చుంది. అమ్మాయిని చూసిన పాండూకి నోటి వెంట మాట రాలేదు సరి కదా సొల్లు కారిపోయింది. అప్పుడు పిల్లకు ?ఇతను అమాంతం తన్ను కొరికి తినేలా వున్నాడే" అన్న భయం ఆవరించగా తను కూర్చున్న కుర్చీలో మరీ ఒదిగి కూర్చుంది.
నిజం చెప్పాలంటే ఆమె అందగత్తే! అందుకే అక్కడున్న వాళ్ళు ఇద్దర్నీ చూసి "ప్చ్" కాకి ముక్కుకు దొండపండు అనుకున్నారు. అది నిజమవ్వాలంటే తప్పనిసరిగా పిల్ల ఒప్పుకోవాలిగా! ఏమో... ఒప్పుకుంటుందేమో!
అయిదు నిముషాల తరువాత అమ్మాయి లోనికెళ్ళిపోయింది వాళ్ళ నాన్నను లోనికి రమ్మన్నట్టు సైగ చేసి లోనికెళ్ళిన పిల్ల తండ్రి మరో అయిదు నుముషాల తరువాత బయటికొచ్చాడు. పరీక్షల రిజల్టు కోసం ఎదురుచూస్తున్న వాళ్ళలా అందరూ ఆయన ముఖం లోకి చూశారు. మరి ముఖ్యంగా పాండు.
"సార్" అంటూ పిల్ల తండ్రి జ్ఞానమూర్తి దగ్గరకొచ్చి "అమ్మాయి పాండుని ఇష్టపడ్డం లేదట. ప్రక్కనున్న అతని ఫ్రెండు ప్రభుని ఇష్టపడుతోందట" అని అసలు విషయాన్ని చెప్పాడు. షాక్ తిన్నాడు పాండు శూన్యం లోకి వెళ్ళిపోయినట్టు. అంతే ఇంకేమీ అంతే ! ఇంకేమీ మాట్లాడకుండా బయటికి నడిచారు ముగ్గురు.
"సార్ ! టైమైంది. నేనిటే ఆఫీసుకెళుతున్నాను. మీరు మెల్లగా రండి. విషయాలేమైనా వుంటే ఆఫీసులో మాట్లాడుకుందాం" అంటూ సీరియస్సుగా వెళ్ళిపోయాడు పాండు అటే వస్తున్న షేర్ ఆటో యెక్కి ఆగమన్నా ఆగకుండా.
అప్పుడు ప్రభు " బాబాయ్! ఏమిటిది? అమ్మాయి అంతటి దారుణమైన నిర్ణయం తీసుకుంది" అని జ్ఞానమూర్తి నడగ్గా" ఆ పిల్ల పాండూని రెఫ్యూజ్ చేయడానికి కారణం నాకర్ధమైందిరా. చెపుతాలే పద " అన్నాడు జ్ఞానమూర్తి ఓ నేరస్తుణ్ణి చూస్తున్నట్టు ప్రభు ముఖం లోకి చూసి.
"అదేమిటో యిప్పుడే చెప్పండి. నాకు వెంటనే తెలియాలి" అంటూ భీష్మించుకున్నాడు ప్రభు.
"నీ నుంచేరా!" మళ్ళీ ముఖం లోకి చూస్తూ కుండ బద్దలు కొట్టినట్టు అన్నాడు జ్ఞానమూర్తి .
నేనా !" ఆశ్చర్యాన్ని కనబరచాడు ప్రభు.
"అవును. చెపుతాను విను సహజంగా ఇద్దరు అకాచెల్లెళ్ళు వున్న ఇంట్లో పెద్దది అందగత్తైతే చిన్న పిల్ల అందంగా వున్నా లేకపోయినా అక్కకు పెళ్ళిచూపులప్పుడు ఆమెతో పాటు చెల్లిని కూడా ప్రక్కనుంచుతారు. కాని అక్కచెల్లెల్లిద్దరిలో చిన్న పిల్ల అందగత్తైతే ఆమెను ఆ పరిసరాల్లో కనబడకుండా దాచేయడమో లేక దగ్గరి బంధువులిల్లకు పంపడమో లాంటి సంఘటనలు కొన్ని కుటుంబాల్లో జరుగుతుంటాయి. అంటే పెళ్ళిచూపులకొచ్చిన పిల్లాడు ఎక్కడ చిన్నపిల్లను కోరుకుంటాడోనన్నది వాళ్ళ భయం. అదే పాండూ గాడి విషయం లో రివర్సుగా జరిగింది. అంటే అక్కడ ఆడపిల్ల . ఇక్కడ మగపిల్లాడు" అన్నాడు.
"అర్ధం కాలేదు బాబై!" తల పీక్కున్నాడు ప్రభు.
"అదేరా! నువ్వు ఎర్రగా బుర్రగా ఎత్తుగా అందంగా వున్నావ్. వాడేమో నల్లగా లావుగా పొట్టిగా జముడు కాకిలా వున్నాడు. ఇక వాడి కోసమని మనం చూసిన ప్రతి అమ్మాయి వాడితో నిన్ను పోల్చుకుని చూసి నిన్నే ఇష్టపడుతూ వచ్చారన్నది నా భావన. అందుకే ఏ సంబంధం కుదరలేదు. కాకపోతే మనం యింతవరకూ పెళ్ళిచూపులకెళ్ళి చూసిన ఏ అమ్మాయి నోరు విప్పి చెప్పలేదు. ఈ పిల్ల కాస్త డేర్ గర్ల్ కనుక ధైర్యం గా చెప్పింది అంతే!" పూర్తి చేశాడు అసలు విషయాన్ని బయటపెట్టి.
విషయాన్ని అప్పుడు అర్ధం చేసుకున్న ప్రభు కాస్త బాధపడ్డాడు. తన వల్లే అన్ని సంబంధాలు పోయినందుకు పాండుని క్షమించమని అడగాలనుకున్నాడు. రాబోయే ఆదివారం వెళ్ళబోయే మరో సంబంధానికి పాండుతో పాటు తను వెళ్ళకూడదన్న నిర్ణయానికొచ్చి "బాబాయ్! వాడికోసం ఆదివారం నాడు వెళ్ళే ఆ సంబంధానికి నేను రాను" అని అంటుండగా జ్ఞానమూర్తి ఫోన్ మోగింది. ఆ ఫోన్ గంటకు ముందు పెళ్ళిచూపులకొచ్చిన పిల్ల తండ్రి వద్ద నుంచి వచ్చింది. జ్ఞానమూర్తి ఫోన్ బట్టన్ నొక్కి
"యస్...ఓకే..యస్..ఓకే" అని ఫోన్ కట్టేసి హి...హి...హి.. అని నవ్వాడు.
"ఏమైంది బాబాయ్! ఫోన్ లో ఎవరూ?" అడిగాడు ప్రభు. "ఫోన్ లో మాట్లాడింది మనం ఇప్పుడు చూసి వచ్చామే ఆ అమ్మాయి తండ్రిరా!
వాళ్ళకు అందం లేకపోయినా ప్రభుత్వపు ఉద్యోగం లో వున్న కల్లకపటమెరుగని మంచివాడు, గుణవంతుడయిన మన పాండూ నచ్చాడట. త్వరలో ముహూర్తం పెట్టుకోమన్నారు. మనిక ఏ పెళ్ళిచూపులకు వెళ్ళనక్కర్లేదు" అన్నాడు జ్ఞానమూర్తి . ఆ మాటవిన్న ప్రభు ఎగిరిగంతేసి జ్ఞానమూర్తి ని ముద్దుపెట్టుకుని పాండుకు విషయం చెప్పడానికి తన సెల్ ఫోన్ చేతికి తీసుకున్నాడు.