అమ్మాయిని అత్తారింటికి పంపి ,అప్పగింతలు చేయాల్సిన సమయం రానే వచ్చింది.ఇంకో పది నిమిషాల్లో ఆ తంతు ప్రారంభం కానుంది.సుజాతమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. చిన్నపుడు , స్కూలుకి దిగబెడితే ,నేను విండో దగ్గర కూర్చుంటాను.
నువ్వు నాకు కనబడాలి మమ్మీ . స్కూలు అయిపోయాక ఇద్దరం కలిసి ఇంటికెళ్లిపోదాం. అలా అయితేనే నేను స్కూలుకు వెళతా అని మారాం చేసే అమ్మాయి. కాలేజీకి కూడా తల్లిని స్కూటీపై డ్రాప్ చేయమని గారం పోయే అమ్మాయి. తనకి ఏం కావాలన్నా, తల్లి కొంగుని చూపుడు వేలుకి చుట్టుకుంటూ గారం పోతూ అడిగే అమ్మాయి, ఇప్పటి నుండి అమ్మ లేకుండా ఎలా ఉండగలదు అనే ఆలోచన ఒక వైపు వేదిస్తుండగానే ,ఇందాక ఆ డిటెక్టివ్ ఆఫీసు నుండి వచ్చిన ఫోన్ కాల్ ఆమె మనసుని మరింత ఆందోళన పెట్టింది. కాబోయే అల్లుడు ఎలాంటివాడు ,అతని కుటుంబం ఎలాంటిది అని మామూలు ఎంక్వయిరీలు చేసే కంటే ఒక ప్రోఫిషినల్ డిటెక్టివ్ ఏజెన్సీ వారికి ఇస్తే పక్కా సమాచారం ఇస్తారు.అమ్మాయి గురించి భవిష్యత్తులో బెంగపడే అవకాశం ఉండదని భావించింది. అందుకే ఆమె ఎవరికీ తెలియకుండా డిటెక్టివ్ ఏజెన్సీని ఆశ్రయించింది. అలానే ఆ డిటెక్టివ్ ఏజెన్సీ వారు, అబ్బాయి,వాళ్ళ తల్లి దండ్రులు మంచి వారనీ ,వారిది మంచి కుటుంబం అనీ రిపోర్టు ఇచ్చారు. దాంతో ఆమె, పెళ్లి దూం ,దాం అని చేసేసింది. కానీ ఇలా ఇప్పుడు ఈ అప్పగింతల సమయంలో మళ్ళీ ఆ డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పిన ఓ విషయం ఆమె సంతోషాన్ని తల క్రిందులు చేసింది.
ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే , పెళ్లి కొడుకు, ఓ రెండు సంవత్సరాల క్రితం, మూడు నెలలు మానసిక ఆసుపత్రిలో పేషెంట్ గా ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నాడట . ఆలస్యంగా చెప్పినందుకు క్షమించమంటూనే చెప్పారు. ఆ మాటలు విన్న ఆమె గుండె తల్లడిల్లిపోయింది. మూడు నెలలు మానసిక ఆసుపత్రిలో ఎందుకుంటారు.? ప్రేమ వికటించి మతిస్తిమితం తప్పడం లాంటిదేమైనా జరిగుంటుందా. అది మళ్ళీ భావిష్యత్తులో వస్తే?. కానీ ఇప్పుడు ఏం చేయాలి.అబ్బాయి ప్రస్తుతం లక్షణంగానే కనిపిస్తున్నాడు. ఇల్లంతా నవ్వులు ,సంతోషంతో పండుగలా ఉంది.కానీ నా పరువు కోసం అమ్మాయిని బరువనుకోలేను. తన జీవితాన్ని తాకట్టు పెట్టలేను అనుకుంటూ కూతురు శరణ్యని తన బెడ్రూంకి రమ్మనమని పనమ్మాయితో కబురుపెట్టింది. ఆమె ఆలోచిస్తున్నపుడే, అమ్మా ఎలా ఉంది నా చీర . నేనే కట్టుకున్నాను. చెప్పింది తల్లికి ఎదురుగా నిలబడి. కూతురిని కళ్ళనిండుగా చూస్తూ,నీకెంట్రా .నువ్వు నా బంగారం. లక్ష్మి దేవిల ఉన్నావు. అందామే తలపై చేయి వేస్తూ.
తల్లి కళ్ళలో బాధనీ, భారాన్నీ అర్దం చేసుకున్నట్టుగా , ఆమెని వాటేసుకుంటూ, ఏమైందమ్మా ? మనం తల్లి ,కూతుళ్లలా కాక ఫ్రెండ్సులా ఉంటాం కదా మరి. చెప్పమ్మ అడిగింది తల్లి కళ్లలోకి పరిశీలనగా చూస్తూ. చెప్తాను. కానీ నువ్వు గాబరా పడకూడదు. నీ నిర్ణయం స్పష్టంగా చెప్పాలి. సరేనా అడిగింది తల్లి, గడ్డం పట్టుకుని. అలాగే అమ్మా.చెప్పింది శరణ్య.
ఆమె , కొంచెం భారంగానే జరిగినదంతా చెప్పి, కళ్ళు తుడుచుకుందామే.
ఆ మాటలు విన్న శరణ్య, ఓ క్షణం తల్లి వంక సూటిగా చూసి,ఆమె కన్నీరు తుడిచి,చిన్నగా నవ్వుతూ, అదా నీ భయం. ఈ విషయం అయితే నాకు ఎప్పుడో తెలుసు. మా నిచ్చిత్తార్దం తర్వాత , ఓ సారి ఆయన ,నేను గుళ్ళో కలిసినపుడు ,ఈ విషయం చెప్పారు.
అవునా !ఏమని చెప్పాడబ్బాయి.మరి తెల్సి కూడా ఈ సంబంధం ఎందుకు ఒప్పుకున్నట్టు ?కనీసం నాకు కూడా తెలియకుండా ఈ విషయాన్ని ఎందుకోసం దాచినట్టు.అని ఆమె ఆవేశంగా, ఆవేదనగా మరో మాట అనేలోపు –
అమ్మా ,నీతో ఇదే ఇబ్బంది .ఏదీ పూర్తిగా వినవు కదా.అసలే నీకు రక్తపోటు. అసలు జరిగిందేవిటంటే ,ఆయన పి.జి చదువుతున్నపుడు ,సినిమాలపై మోజుతో ఓ సారి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న అతని ఫ్రెండ్ ఒక సినిమాలో అవకాశం ఉంది రమ్మని పిలిస్తే ,ఇంట్లో చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వెళ్లారట.కానీ దురదృష్టం ఏమిటంటే ,అలా కష్టపడి వెళ్ళి నటించిన ఆ సినిమా రిలీస్ కాలేదట.తర్వాత ఆ హైదరాబాద్లో ఉండలేక ,చేతిలో డబ్బుల్లేక తిరిగి ఇంటికి వచ్చేశారట. కానీ ఆయన పి.జి పరీక్షలు రాయడానికి గాను ఓ మూడు నెలలు అటెండెన్సు షార్టేజీ వచ్చిందట. దాంతో ఆ సంవత్సరం అలా వృధాగా పోకూడదని ,వాళ్ళ నాన్నగారికి తెల్సిన ఓ సైకియాట్రిస్టు డాక్టర్ ఉంటే ,ఆ మూడు నెలలకీ ఒక మెడికల్ సర్టిఫికేట్ సృష్టించారట .ఏ ఫిజిషియనో ,అర్థోపెడిక్ డాక్టర్ సర్టిఫికేట్టో సబ్ మిట్ చేస్తే, ఎక్సరేలో ,రిపోర్ట్ లో అడిగితే ఇబ్బందని , డిప్రెషన్ అని ,కౌన్సిల్లింగ్ తీసుకున్నారని సర్టిఫికేట్ సబ్ మిట్ చేసి పి,జి పరీక్షలు రాసి ఆ సంవత్సరం వృదాగా పోకుండా కాపాడుకున్నారట. అది అసలు సంగతి. కనుక నువ్వు దిగులుని నీ గుండె గదుల్లోంచి ఖాళీ చేయించి ,అందులో సంతోషాన్ని నింపు .సరేనా.అంటూ శరణ్య హాయిగా నవ్వుతూ చెప్పడంతో ,సుజాతమ్మగారు కూడా నిదానంగా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ,శరణ్య ఓ కథా రచయిత్రి అనే విషయం అప్పుడు సుజాతమ్మ గారికి గుర్తు రాలేదు మరి.ఇంతలో ఎవరో శరణ్యా అని పిలవడంతో ,వస్తున్నా అంటూ తల్లిని ముద్దాడి అక్కడ్నుండి కదిలిందామె. అడుగులు ముందుకు వేస్తున్నా ,ఆమె ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్లసాగాయి. ఆరోజు అమ్మ పుట్టినరోజు.అది జరుపుకోవడానికి ఆ స్థాయి వ్యక్తులు ఫైవ్ స్టార్ హోటెల్సు కి పరుగులు పెడతారు.కానీ అమ్మ మాత్రం అనాధ శరణాలయాల్లోనే పిల్లల మధ్య జరుపుకునేది .అలా ఓ శరణాలయంలో నన్ను చూసింది. అప్పుడు నా వయసు నాలుగేళ్ళు.ఈ పాప భలే ముద్దుగా ఉందే అంటూ నా దగ్గరకి రాబోతుండగా ,అక్కడ ఓ ఆయా ,అమ్మగారూ ఆ పాప స్నానం చేయలేదు. శుభ్రంగా ఉండదు అని చెప్తుండగానే, షటప్ అని ఆ ఆయా వైపు ఉరిమి చూసి,నన్ను అలానే ఎత్తుకుంది, నెత్తిన పెట్టుకుంది ,కూతురంది. ఆమె భర్త వద్దన్నా నన్నే కావాలనుకుంది. టెస్టు ట్యూబు బేబీ అన్నా వద్దంది. ఆమె భర్త పోయాక నన్నే ప్రపంచం అనుకుంది. ఓ పక్క బిజినెస్ లావాదేవీలు చూసుకుంటూనే ,మరో పక్క నన్ను కంటికి రెప్పలా చూస్తూ పెంచి పెద్ద చేసింది.నా సంతోషమే తన సంతోషం అనుకునేది అమ్మ.అలాంటి అమ్మ నిర్ణయం ,నా విషయంలో తప్పు అయిందని ఆమె భాధ పడకూడదు. ఆమె తట్టుకోలేదు.అందుకే మా అమ్మ ఏం చేసినా అది నాకు బంగారు బాట అవుతుందని ఆమె భావించాలే కానీ భాధ పడకూడదు.అందుకే నేను ఈ కట్టు కధ చెప్పాను.ఇది కూడా నా మంచికే దారితీయగలదని నా నమ్మకం.ఎందుకంటే మా అమ్మకీ , ఆమె నిర్ణయానికీ ఓటమి లేదు.కారణం, ఆమె మంచి మనసు. మంచి మనసున్న మనుషులకి అంతా మంచే జరుగుతుంది .నా ఆలోచన తప్పో కాదో నాకు తెలీదు .కానీ ,మా అమ్మ చల్లని మనసు ,ఆమె దీవెనలూ ఉన్నంత వరకు నా జీవితం పచ్చగా ఉంటుందనేది నా నమ్మకం. అనుకుంది శరణ్య మనసులో.
తర్వాత కొద్దిసేపటికే అప్పగింతలూ అవీ పూర్తయ్యాయి. భర్తతో కారులో బయలుదేరింది శరణ్య.కారు వెళ్తూ,వెళ్తూ రైల్వే క్రాసింగ్ వద్ధ ఆగింది.భర్త మధు, శరణ్య చేయి పట్టుకుని ,ఇలాంటి రైల్వే క్రాస్సింగ్ వద్దే ఓ సారి సూసైడ్ చూసి బాగా భయపడిపోయాను. కొంచెం డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.దాంతో ఓ మూడు రోజులు హాస్పిటల్ లో ఇన్పేషెంట్ గా ఉన్నాను. అయితే ఇక్కడ జోక్ ఏవిటంటే ,నాతో పాటు అదే రోజు ఇంకో పేషెంట్, మూడు నెలల తరవాత డిశ్చార్జు అయ్యాడు.వాడి పేరు కూడా మధూనే . దాంతో వాడు మూడు రోజులు ఉన్నట్టూ, నేను మూడు నెలలు ఉన్నట్టూ డిశ్చార్జింగ్ ఫామ్ లో తప్పుగా రాశారు.ఇంకా నయం, బిల్ కూడా మూడు నెలలకి వేయలేదు .అని అతను చెప్తున్నా శరణ్య యాంత్రికంగా విఒటోంది.ఇప్పుడు ఆమె మనసంతా తల్లి గురించే ఆలోచిస్తోంది.నా పెళ్లి గురించి అమ్మ ఎన్నో కలలు కంది .కానీ నా పెళ్లి చేసి తను ఒంటరైపోయింది.అంత పెద్ద ఇంట్లో అమ్మ ఒక్కతే ,అంటూ బోరున ఏడ్చేసింది .ఆమెని అర్దం చేసుకున్నవాడిలా ,డోంట్ వర్రీ.నాకర్దమయింది.అత్తయగారు కూడా ఓ వారం రోజుల్లో మనం ఉండబోయే ఫ్లాట్ కి ఎదురు ఫ్లాట్ లోనే దిగి ఉండబోతున్నారు.నేనే ఒప్పించాను .నిన్ను సర్ ప్రైస్ చేద్దామనుకున్నాను.కానీ ఇలా చెప్పాల్సి వచ్చింది. అని మధు చెప్తుండగానే శరణ్య మనసు నిశ్చలమైన నదిలా ప్రశాంతంగా మారింది. కొద్ది సేపటి క్రితం మధు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయామెకి. అవును,నాకు తెలుసు అమ్మ ఓడిపోదని .అని మనసులో అనుకుంటూ, మధుని గట్టిగా వాటేసుకుంది.గేటు తెరుచుకుంది.కారు నెమ్మదిగా ముందుకు కదిలింది.