ఫేస్ బుక్ (డ్) స్టేటస్ - మత్తుర్తి వెంకట నాగ రామ్ కుమార్.

facebook (d) status

“సార్ మేనేజర్ గారు పిలుస్తున్నారు మిమ్మల్ని”.

సీరియస్ గా పనిచేస్తునట్టు నటిస్తు ఒక చేత్తో కంప్యూటర్ కీ బోర్డు ఇంకో చేత్తో కొత్తగా కొన్న ఫోన్ లో ఫేస్ బుక్, వాట్స్అప్ అప్ డేట్స్ చూసుకుంటున్న నాకు ఆఫీస్ బాయ్ పిలుపు పిడుగు పడినట్టుగా అనిపించింది.

అసలే పిడుగు ఫీలింగ్ లో ఉన్న నేను నా కొలీగ్స్ చూస్తున్న చూపులకి తుఫాన్ లో చిక్కుకున్నట్టు వణికిపోయాను. పిలిచింది మేనేజరే గా అని మీకు అనిపించవచ్చు కాని ఆ మేనేజర్ చండశాసనుడు అందునా చాదస్తపు చండశాసనుడు ఐతే పరిస్తితి ఎంత దారుణమో అలాంటి చాదస్తపు చండశాసనుడు ఉన్న మీలో చాలా మందికి అనుభవమే అనుకుంటున్నా.

మా మేనేజర్ ఎంత చాదస్తపు చండశాసనుడు అంటే కొలీగ్ రమేష్ కడుపు నొప్పని శెలవు పెట్టేడు. నిజంగా కడుపు నొప్పి కాక పోయినా . మరుసటి రోజు రమేష్ ని కడుపు నొప్పికి వాడినా టాబ్లెట్ ని తీసుకురమ్మనాడు. మావాడు చాదస్తపు చండశాసనుడు ని సరిగ్గా అంచనా వెయ్యలేక ఏదో టాబ్లెట్స్ తెచ్చి చూపించాడు. మా చాదస్తపు చండశాసనుడు ఆ టాబ్లెట్స్ కడుపునొప్పివి కాదని తలనొప్పి టాబ్లెట్స్ అని ల్యాబ్ రిపోర్ట్స్ తో సహా నిరూపింఛి అబద్దం చెప్పి శెలవు తీసుకున్న రమేష్ కి సిక్ లీవ్ తో పాటు ఇంకో రెండు లీవ్స్ కలిపే సరికి మా రమేష్ కి మలేరియా వచ్చినా ఆఫీస్ కి రావడం మానలేదు. అప్పటి నుండి శెలవు అడగడానికి ఎంతో ఆలోచన చెయ్యాల్సి వచ్చేది మాకు.

మాచాదస్తపు చండశాసనుడు మేనేజర్ ఎవరైనా తప్పు చేస్తే వెంటనే కాకుండా మరుసటి రోజు ఉదయం తన కేబిన్ కి పిలిపించుకొని క్లాసు పీకుతాడు. అప్పుడే చెప్తే త్వరగా మర్చిపోతారని అదే మరుసటి రోజు ఉదయం ఐతే బాగా గుర్తుంచుకుంటారని ఆయన విచిత్రమైన ఫీలింగ్.

ఆయన కేబిన్ లోకి వెళ్లి రావడమంటే బోను లోకి వెళ్లినట్లే. అక్కడ పులి చంపి తింటుంది. ఇక్కడ అవమాన భారంతో చచ్చేలా ఈయన తింటాడు. స్క్రాచ్ చేస్తే గిఫ్ట్ కంపల్సరి లాగ ఉదయం పిలుపు వచ్చిన వాళ్ళకి పనిష్ మెంట్ కంపల్సరి. అలా జూనియర్స్ కి పనిష్ మెంట్స్ ఇస్తూ కంపెనీ కి ఎంత మిగులుస్తున్నాడో ఎప్పటికప్పుడు మేనేజ్ మెంట్ కి రిపోర్ట్స్ చేస్తూ పేరు తెచ్చుకుంటాడని ఆఫీస్ లో టాక్.

“మేనేజర్ గారు త్వరగా రమ్మంటున్నారు సార్ మిమ్మల్ని.”

మళ్ళీ వచ్చి పిలిచిన ఆఫీస్ బాయ్ పిలుపు ఈ సారి పిడిగులతో పాటు మెరుపుల్ని తీసువచ్చినట్టు అనిపించింది నాకు. ఇంకా లేట్ చేస్తే ఎక్కడ సునామీ వస్తుందో అని భయంతో నా ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ కేబిన్ కి బయలుదేరాను.

నేను కేబిన్ చేరే సరికి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాడు మా చాదస్తపు చండశాసనుడు . నన్ను చూసి ఫైవ్ మినిట్స్ వెయిట్ చెయ్యమన్నట్టుగా సైగా చేసాడు. నేను పర్లేదు సార్ అని నవ్వుతు సైగా చేసి కేబిన్ బయట నుంచున్నాను.

ఫోన్ మాట్లాడుతూ నన్ను చూస్తున్నప్పుడు నేను నవ్వుతు ఉన్నాను కాని భయం వల్ల పాదాలు కుడా చెమట పట్టి చల్లగా అయ్యాయి. సీనియర్ గా ఒక మోస్తారు కంపెని లో అనుభవం గడించి జూనియర్ మేనేజర్ గా కొత్త యం.యన్.సి లో జాయిన్ ఐన నేను ఇంత తొందరగా పులి బోను లోకి అదే మేనేజర్ కేబిన్ కి ఉదయం వెళ్ళడం చాల అవమానంగా ఉంది నాకు.ఇప్పటి వరకు ఏ తప్పు చెయ్యలేదు నేను. మరి ఎందుకు పిలిచాడో ఏంటో. తల పైకెత్తి చూసినా నాకు కార్పోరేట్ గణపతి పెయింటింగ్ నన్ను చూస్తూ నవ్వుతున్నట్టు అనిపించింది. నాకు తెలియకుండానే కార్పోరేట్ గణపతి తో మాట్లాడసాగాను.

“ఏంటి దేవుడా ఇలా చేసేవు. నెట్ లో వెతికిమరి నీ స్తోస్త్రాలు చదువుతున్నానే, ఫేస్ బుక్, వాట్స్అప్ లో ఎవరైనా నీ ఫోటో 10 మందికి షేర్ చెయ్యమంటే 11 మందికి షేర్ చేస్తున్నానే, రోజు నైవేద్యం లోకి అందరిలా పటికబెల్లం కాకుండా ,బాదంపప్పు, పిస్తాపప్పు పెడుతున్నానే. ప్యురిట్ వాటర్ తోటే ప్రసాదం తయారు చెయ్స్తునాన్నే మరి అలాంటి నా మీదా నీ కన్ను ఎలా తప్పింది దేవుడా? ఏ పనిష్మెంట్ లేకుండా నేను ఇక్కడ నుంచి వెళితే నీ ఫోటో 50 మందికి పోస్ట్ చేసి ఆ 50 మందిని ఇంకో 50 మందికి షేర్ చెయ్యమని ఫేస్ బుక్, వాట్స్అప్ లో రిక్వెస్ట్ చేస్తానని” మొక్కుకున్నాను.

ఇంతలోనే ఆయన ఫోన్ పెట్టయడంతో “మే ఐ కమిన్ సార్” అంటు కాబిన్ లోకి అడుగుపెట్టాను.

“ఎస్..కమిన్ మిస్టర్ సుధాకర్, టేక్ యువర్ సీట్.”. పైకి నవ్వుతూ అంటున్నా మా మేనేజర్ చత్వారం కళ్ళద్దాల చాటున కళ్ళలో భావం మనసులో మర్మం అర్డం కావడం లేదు నాకు.

“థాంక్స్ సార్. పర్లేదండి పిలిచారు” నుంచోనే ఉన్నాను నేను.“ఏం లేదు..మీ చిన్న మామగారి సంవత్సరికం ఎలా జరిగింది.?” కంప్యూటర్
వైపు చూస్తూనే

“ఏవరు .ఏవరి చిన్న మామగారు సార్.? తడబడుతు.

“అదేనయ్య మీ చిన్న మామగారి సంవత్సరికం అని రెండు రోజుల క్రితం లీవ్ తీసుకున్నావు కదా”

అవునుకదా మర్చిపోయాను నేను. రెండు రోజుల క్రితం నేను చిన్న మామగారి సంవత్సరికం అని శెలవు తీసుకున్నాను. అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. కాని దాని వల్ల ఏవరికి ప్రాబ్లెం లేదే. అయినా ఇప్పుడు ఆ ఫంక్షన్ తో ఏం పనోచ్చింది? నా అనుమానాల్ని ముఖం పైకి కనిపించకుండా నవ్వుతూనే..

“బానే జరిగింది సార్. పాపం చాల మంచి వారండి. ఎవరికి కష్టమొచ్చిన్న ముందుండే వారు సార్”. అసలు లేని మనిషి గురించి ఎలా చెప్పాలో , ఏం చెప్పాలో అర్ధం కాక.

“అలాగా.. అవును ఫంక్షన్ ఎక్కడ జరిగింది?”. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫోజ్ లో మేనేజర్.

“ఎక్కడంటే.. ఎక్కడంటే వాళ్ళ ఇంటి దగ్గరే సార్”. భగవంతుడా ఇంకా ఎన్ని అబద్దాలు చెప్పాలో ఇవ్వాళ అని మనసులో అనుకుంటూ
చెప్పాను.

“అలాగా ఇల్లు ఎక్కడా?” .మళ్ళి కంప్యూటర్ వైపు చూస్తూ.

ఇదేంటి దేవుడా ఇవాళ ఇలా బుక్ చేసావు నన్ను లేని అడ్రస్ ఎలా చెప్పాలి అని మనసులో నే అనుకుంటూ అది.అది. అని ఏదో చెప్పబోతుంటే ఆయనే..వు.. ఫీలింగ్ ఎంజాయింగ్ అని ట్యాగ్ కుడా చేసావు. పైగా మన ఆఫీస్ డ్రెస్ లో ఉన్నావు.కామెంట్స్ కుడా బాగా వచ్చాయి”. అంటు మోనిటర్ ని నా వైపు తిప్పి చూపించారు.

ఇలా దొరికిపోయాను ఏన్టి దేవుడా. ఆ రోజు మా పిల్లలకి సర్ ప్రైజ్ గా ఉంటుందని గుడికని చెప్పి నెహ్రు జూ కి తీసుకువెళ్ళాను. ఆఫీస్ డ్రెస్ లో ఉండడంతో మా వాళ్ళకి అనుమానం రాలేదు. జూ కి తీసుకువెళ్ళేసరికి శ్రీమతి, పిల్లలు చాల సర్ ప్రైజ్ అయ్యారు. చాల బాగా ఎంజాయ్ కుడా చేసారు. ఆఫీసులో మాత్రం చిన్న మామగారి సంవత్సరికం అని చెప్పి శెలవు తీసుకున్నాను. నా సంతోషం అందరితో పంచుకుందామని పిక్ ఫేస్ బుక్ లో పెట్టాను. కాని అదే పిక్ నన్ను ఇలా దోషి గా చేస్తుందని అనుకోలేదు.

కానీ ఈ విషయంలో అంతగా ఆబ్జెక్ట్ చెయ్యడానికి ఏముంది? బహుశా నేను అబద్దం చెప్పినందుకా లేకా డ్రెస్ కోడ్ పాటించనందుకా? నా ఆలోచనలలో నేను ఉన్నాను.

“వాట్ మిస్టర్ సుధాకర్ ఏంటి నువ్వు చేసిన పని. లీవ్ కావాలంటే అబద్దం చెప్పడం, ఆఫీస్ డ్రెస్ లో హాలిడే ని ఎంజాయ్ చెయ్యడం. వాట్ ఇస్ థిస్ నాన్సెన్స్. నీ లెవెల్ కి చెయ్యదగ్గ పనులేనా ఇవి? ఏవరైన నోటీస్ చేస్తే కంపెని పరువేం కావాలి? ఆ కామెంట్స్ చూసావా? ఎవరు రేస్పాన్స్ వహిస్తారు? ఆగకుండా ఉపన్యాసం సాగిపోతుంది.

“అది కాదు సార్. అది నా వ్యక్తిగతం..ఐనా కామెంట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి కదా సార్”..వాక్ ప్రవాహానికి అడ్డు పడుతూ అన్నాను,

“నో మోర్ వర్డ్స్ సుధాకర్. నీకు వచ్చిన కామెంట్స్ చూసావా ? సూపర్ కంపెని. కూల్ కంపెనీ. . అందుకు మళ్ళి నీ రిప్లై. థాంక్స్ టు గాడ్ ఫర్ థిస్ కంపెనీ అవి నీకు వచ్చిన కామెంట్స్ కాదు కంపెని కి వచ్చిన కామెంట్స్ లా ఉన్నాయి. ఎవరైనా ఫై వాళ్ళు చుస్తే ఏమనుకుంటారు. నీకు లీవ్ ఇచ్చినందుకు నన్ను అంటారు”. కోపం బాధ కలిపినా ఫీలింగ్ తో . నేను చేసిన పని వల్ల నిజంగా నా జాబ్ ఆయన జాబ్ కుడా డేంజర్ లో పడ్డాయేమో అన్నట్టుగా ఉంది ఆయన వాలకం చూస్తుంటే. నా ఫీలింగ్ కుడా ఇంచుమించు అదే.

“నువ్వు చేసిన పనికి పనిష్ మెంట్ ఏమిటో తెలుసా సుధాకర్. అని తన నిర్ణయం చెప్పేలోపు ఆయన టేబుల్ మీద ఫోన్ రింగ్ అయింది. డిస్ ప్లే లో నెంబర్ చూసి ఒక సారిగా అటెన్షన్ ఫోజ్ లో కి మారిపోయాడు.

“హల్లో గుడ్ మార్నింగ్ సార్..నేనే సార్ మాట్లాడుతుంది. అవును సార్. సుధాకర్ నా సబర్దినట్ సార్. నేనే లీవ్ ఇచ్చాను సార్. ఇక్కడే ఉన్నాడు సార్. ఎక్ష్ ప్లనేషన్ తీసుకుంటున్నాను సార్..

ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆ ఫోన్ హెడ్ ఆఫీస్ నుంచి అని అది నా గురించే అని అర్ధం అయింది. విషయం ఎక్కడి నుంచి ఎక్కడి కి పోతుందో అర్దం కావడం లేదు నాకు. నిజంగా నేను తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేసింది నాకు.

“ఏంటి సార్..ఇప్పుడే స్పీకర్ ఆన్ చేస్తున్నా సార్.” స్పీకర్ ఆన్ చేసి చైర్మెన్ గారు లైన్ లో అంటు అగ్ని గోళాల ఉన్న కళ్ళ తో చూస్తూ నా వైపుకి జరిపారు ఫోన్ ని.

“మిస్టర్ సుధాకర్ “గంభీరంగా వినిపించింది చైర్మెన్ గారి వాయిస్.

“ఎస్ సార్..నన్ను క్షమించండి సార్.. ఇంకెప్పుడు ఇలా చెయ్యను సార్”.. ప్రాదేయపడసాగాను చైర్మెన్ గారిని. నా కళ్ళలో సన్నటి నీటి పొర

“ఇట్స్ ఒకే సుధాకర్..నీకు వచ్చిన కామెంట్స్ చూసాను. మన కంపెనీ గురించి కామెంట్స్ అందుకు నీ రిప్లయ్స్ చూసి ఐ అమ్ ఇంప్రెసేడ్. నీ లాగే అందరు కంపెని గురించి పాజిటివ్ గా సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తే మన బ్రాండ్ వేల్యూ పెరుగుతుంది.”

చైర్మెన్ గారి మాటలు నాకు చివరి నిమిషంలో ఉరిశిక్ష నుంచి తప్పించిన తీర్పు లా అనిపించింది.

“నౌ యు కెన్ గో టు యువర్ సీట్. మిస్టర్ రామం..ఈ ఇష్యూ ని ఇక్కడి తో వదిలేసి నేను అడిగిన రిపోర్ట్ త్వరగా పంపండి.” లైన్ కట్ అయింది.

నాకు చాల రిలీఫ్ గా అనిపించింది. కాని మా చాదస్తపు చండశాసనుడు ముఖం మాత్రం వేట మిస్ ఐన పులిలా గాండ్రిస్తూ ఉంది.

“సార్ షెల్ ఐ గో సార్”..నెమ్మది గా అడిగాను.

“ఊ.”. అదే గాండ్రిస్తున్న పులిలా.

“హమ్మయ్య” అనుకుంటూ బయటకు వచ్చి గబ గబ ఫోన్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇందాక గణపతి కి మొక్కుకున్న మొక్కు తీర్చుకోవడానికి.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు