కన్నీటి కాంతులు - రాచమళ్ళ ఉపేందర్

kanneeti kantulu

రాయి తగిలిన నీళ్ళలాగుంది మల్లేష్ మనసు. నిండు గర్భిణిలా మారిన కళ్ళు ఏ క్షణమైనా కన్నీటిని ఈనేందుకు సిద్ధంగా ఉన్నాయి. తన భార్య ఎప్పుడొస్తుందో? తెలియక సతమతమవుతూ... గతంలోకి మునిగాడు.

- - -

మల్లేష్ పుట్టగానే తల్లి చనిపోయింది. తండ్రి మరో పెళ్ళి చేసుకోలేదు. కష్టపడి కొడుకును చదివించసాగాడు. అవన్నీ బూడిదలో పోసిన పన్నీరైనాయి. మల్లేష్ పది తప్పాడు. మళ్ళీ రాయమని, కష్టపడి చదవమని ఎంతగానో చెప్పాడు. అయినా తండ్రి మాటను పెడచెవిన పెట్టాడు. పైగా ఇంటి పట్టున ఉండకుండా తిరుగుళ్ళు మొదలు పెట్టాడు. కొడుకు గురించి నలుగురు నానా రకాలుగా అనుకుంటుంటే తప్పనిసరి పరిస్థితుల్లో తనతో పాటు గ్రానైట్ ఫ్యాక్టరీలో పనికి తీసుకెళ్ళసాగాడు.

ఒక రోజు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న మల్లేష్ తండ్రి ప్రమాదవశాత్తు కరెంట్ వైర్లకు తగిలి, షాక్తో గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. మల్లేష్ తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం దూర ప్రాంతం నుండి వచ్చారు. పని చేసుకుంటూ ఇక్కడే జీవించసాగారు. తినీ, తినకా రెండు గదులు పెంకుటిల్లు కూడా కట్టుకున్నారు. కానీ మల్లేష్ని అనాధను చేసి ఇద్దరూ వెళ్ళిపోయారు. నా అన్నవారు లేకపోవడంతో అదే ఫ్యాక్టరీలో పని చేస్తూ, ఒంటరిగా కాలం వెళ్ళదీస్తున్నాడు మల్లేష్.

తను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో ఆఫీసు శుభ్రం చేసి, టీ తీసుకురావటానికి కొత్తగా పనిలో చేరింది రాణి. ఆమెను చూడగానే మల్లేష్ మనసులో ప్రేమ చిగురించింది. మెల్లగా పరిచయం చేసుకున్నాడు. కొద్ది కాలంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. ఆమె కూడా అనాథే అని చెప్పింది. అయినా సంతోషంగా పెళ్ళి చేసుకున్నాడు.

మూడేళ్ళు గడిచాయి. ఇద్దరు పిల్లలూ పుట్టారు. ఖర్చులూ పెరిగాయి. రాణి ఎప్పటిలాగానే ఐదు గంటకు ఇంటికొస్తుంది. మల్లేష్ మాత్రం రాత్రి పదకొండు వరకు ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తున్నాడు. ఆలుమగలిద్దరూ కష్టపడ్తూ సంసారాన్ని సమర్ధవంతంగా నెట్టుకొస్తున్నారు.

రోజు లాగానే రాత్రి పదకొండు దాటినా డ్యూటీ చేస్తున్నాడు. కళ్ళ మీద పక్కేసుకుంటున్న నిద్రను నీళ్ళతో తరిమేస్తున్నాడు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నిద్ర నిక్కచ్చిగా తన సమయ పాలన పాటిస్తుంది. ఈసారి ఉప్పెనలా మల్లేష్ కళ్ళను కమ్ముకుంది. అంతే! పని చేస్తూ చేస్తూ కునుకుపాటుతో ఒక్కసారిగా ముందుకు ఒరిగాడు. రెండు చేతులు కటింగ్ మిషన్లో పడటం, మోచేతుల వరకు కట్ కావడం క్షణాల్లో జరిగింది. బాధతో విలవిల్లాడుతూ ఎలుగెత్తి ఏడ్చాడు.

మల్లేష్ ఇంటి నిండా విషాదం. రెండ్రోజులుగా పొయ్యిలో పిల్లి లేవలేదు. ఇరుగు పొరుగు వారు పిల్లలకు అదో ఇదో పెడ్తున్నారు. కృంగిపోయిన భర్తను ఓదార్చింది రాణి. అయినా మల్లేష్ మనసు కుదుటపడటం లేదు. ‘‘పిల్లలకు పెద్ద చదువులు, మంచి ఇల్లు, ఎన్ని కలలు, అన్నీ నీటి మీద రాతలైనాయి. నేనేం చేయాలి రాణి? చేతకాని వాణ్ణి, చేతులు లేని వాణ్ణి అయిపోయాను’ మొండి చేతులు ఊపుతూ గుమ్మానికి తల గుద్దుకుంటూ భోరు భోరున ఏడ్వసాగాడు.

‘‘బాధపడకయ్యా! పని చేస్తుండగానే ఈ ఘోరం జరిగింది కాబట్టి ఎంతో, కొంత నష్టపరిహారం అడుగుదాం’’ ధైర్యం చెప్పింది.

వారం గడిచింది. నొప్పి నుంచి తేరుకున్నాడు. రాణితో కలిసి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. సమయానికి ఓనరు లేడు. రెండు గంటలు కూర్చున్నారు. తరువాత వచ్చిన ఓనర్ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ‘‘మావి పేద బతుకులు. రెక్కాడితేనే డొక్కాడుతుందనే విషయం మీకు తెలియంది కాదు. కొంత డబ్బు ఇవ్వండి’’ ప్రాధేయపడ్డారిద్దరూ.

‘‘మీ నాన్నంటే ప్రమాదవశాత్తూ చనిపోయాడు. కాబట్టి యాభై వేలిచ్చాము. నీది అలా కాదుగా! ఓ.టి. లు చేయవద్దని, చేసినా మిషన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండమని లక్ష సార్లు చెప్పాను. నువ్వు వినలేదు. నీ పరిస్థితి నాకు తెలుసు కాబట్టి ఈ పది వేలుంచు. అంతకు మించి నేనేం చేయలేను. కాకపోతే రాణిని ఎప్పటిలా పనికి పంపించు. జీతం ఎక్కువిస్తాను’’ అన్నాడు. ఓనర్ పులుకుబడి ఉన్నోడు కావడంలో మారు మాట్లాడకుండా వెనక్కి తిరిగారు.

రాణి రోజూ పనికి వెళ్తుంది. అందగత్తెం కాదు కానీ ఆకర్షణీయంగా ఉంటుంది. ఓనర్ మనసు మారింది. మొదట్లో చూపులతో వేధించాడు. పోను పోను ఒంటిపై చేతులేయడం, జీతం డబుల్ చేస్తానని, మల్లేష్కో కిరాణం కొట్టు పెట్టిస్తానని ఆశ చూపిస్తూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించసాగాడు. కళ్ళ ముందు కోటి ఆశలు రేపాడు.

ఓనర్ అసలు రూపం బయటపడటంతో పని మానేసింది. జరిగిందంతా మల్లేష్కు చెప్పి కుండపోతగా ఏడ్చింది. అగ్గిమీద గుగ్గిలమయ్యాడు మల్లేష్. ‘‘వాడంతు చూస్తానని’’ ఎగిరెగిరి పడ్డాడు.

‘‘చెత్త వెధవ! వాడితో మనకెందుకు’’ అంటూ శాంతపర్చింది. కొద్ది రోజుల్లోనే బట్టల షాపులో గుమస్తాగా చేరింది రాణి. ఒక్కతే పని చేయాల్సి రావడంతో బతుకుబండి ఒడిదుడుకులతో సాగుతోంది.

- - -

పంటకు పురుగు, మనిషికి రోగం సహజం. పిల్లాడికి డెంగ్యూ జ్వరం వచ్చింది. రక్త కణాలు బాగా తగ్గాయి. కోలుకునేసరికి యాభై వేలు అప్పు అయింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా బాధతో నలిగిపోయారు.

‘‘రాణీ! ఒకదానెంట ఒకటి మనకెందుకీ కష్టాలు. నాకైతే బతకాలనిపించడం లేదు. మనసంతా కారం చల్లినట్లే ఉంది. నేను పనికిరాని వాడనయ్యాను. మీకే కాదు నాకు నేను కూడా పను చేసుకోలేని దౌర్భాగ్యం పట్టింది.’’ మల్లేష్ గుండెల్లోని బాధ కన్నీళ్లుగా ఊరటం మొదలైంది.

జీవితం ఇంతగా దిగజారుతుందని రాణి కూడా ఏనాడు ఊహించలేదు. మల్లేష్ను అలా చూస్తూ తల్లడిల్లిపోయింది.
మానసిక సంఘర్షణకు లోనైంది. గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్ చెప్పిన మాటలు ‘‘కిరాణం షాపు పెట్టిస్తా’’జ్ఞాపకానికి వచ్చింది. ‘నేను ఒక్కదాన్నే ఎన్ని రోజులు పని చేసినా ఎదుగుబొదుగుండదు. ఓనర్న్ కలిస్తే కష్టాన్నీ గట్టెక్కుతాయి కదా!’ ఆ ఊహ మదిలో మెసిలిందో లేదో భయంతో వణికిపోయింది. ఏదో తిన్నాం అనిపించి పడుకున్నారంతా. రాణి మాత్రం రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది. ‘సరుకు కొనడానికి, ఈ ఏరియా వాళ్ళంతా టౌన్ లోపలికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఒక్క షాపు కూడా లేదు. కిరాణం పెడితే బాగా నడుస్తుంది. కానీ దీని కంటే ముందు ఒక పని చేయాలి’ అనుకుంటూ నిద్రపోయింది.

ఎప్పటిలాగానే బట్టలషాపుకు వెళ్ళింది కానీ సాయంత్రం ఇంటికి రాలేదు. సూర్యుడు పడమర అస్తమిస్తుంటే, మల్లేష్ మనసులో ఆందోళన ఆవిర్భవించింది. ‘ఇంకా రాలేదేంటి?’ పదే పదే అనుకుంటూ వీధిలోకి, ఇంట్లోకి తిరుగుతున్నాడు. ‘ఛ...! అనవసరంగా నిన్న ఏదేదో మాట్లాడాను. ఏమనుకుందో ఏమో? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏం జరిగిందో?’ కుర్చీలో కూర్చొని మథనపడసాగాడు.

‘‘అమ్మ ఇంకా రాలేదేంటి నాన్నా?’’ పిల్లల్లో కంగారు.

‘‘వస్తుందిరా! మన దగ్గరకు వచ్చే ఆటోలు మిస్సై ఉంటాయి. అందుకే ఆలశ్యమైంది కాబోలు. వస్తుందిలే! కాసేపు ఆడుకోండి’’ అన్నాడు.

ఉన్నట్లుండి ఠక్కున ఏదో గుర్తొచ్చింది. ‘‘ఇక్కడి దాకా వెళ్ళొస్తానని’’పిల్లలకు చెప్పి, వేగంగా నడుస్తూ పావు గంటలో ఫ్యాక్టరీ చేరుకున్నాడు.

‘‘ఒరేయ్ రవి రాణి ఇటేమైనా వచ్చిందారా?’’ మ్లెల్లగా అడిగాడు.

‘‘రాలేదురా! ఎందుకు?’’

‘‘ఏమీ లేదురా! డబ్బులు అవసరం పడ్డాయి. ఓనర్ గారిని అడుగుదామంది. తనేమైనా నాకంటే ముందొచ్చిందేమోనని. అవును ఈ రోజు ఓనర్ గారు వచ్చారా?’’ ఇంకా మెల్లగా అడిగాడు.

‘‘పొద్దుటే వచ్చాడు. హడావిడిగా వెళ్ళిపోయాడు’’

‘‘అ...వు..నా....’’ మల్లేష్ మాట తడబడిరది.

‘‘సరే! రేపొస్తారా!’’ దిగులుతో ఇంటికి చేరాడు. బాగా రాత్రయింది. రాణి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ‘తను పని చేసే షాపు కూడా నాకు తెలియదు. రాణి కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఎవర్ని అడగాలి?’ అనుకుంటూ పెద్దగా ఏడ్వసాగాడు. భయంతో బిక్కుబిక్కుమంటూ సగం నిద్రపోతున్న పిల్లలు దిగ్గున లేచారు. ‘‘ఏమైంది నాన్నా! ఎందుకేడుస్తున్నావ్?’’ అంటూ తండ్రి మీద పడి వాళ్ళూ ఏడ్వసాగారు.

‘‘అరే! ఏం కాలేదు. ఏడ్వమాకండి. మీరు పడుకోండిరా’’ పిల్లలను బుజ్జగించి, ఓదార్చాడు. కాసేపట్లోనే నిద్రబుచ్చాడు. తెల్లవారుజామున కోడికూతతో గతంలోంచి బయటకొచ్చాడు.

- -

తెల్లారింది. పిల్లలు నిద్ర లేచారు. ‘‘అమ్మా? అమ్మా?’’ అడగసాగారు. తల్లి కోసం తల్లడిల్లుతున్న ఆ పసి మనుసును చూసి తట్టుకోలేకపోయాడు. ఏం చెప్పాలో తోచలేదు. ‘‘కాసేపట్లో వస్తుందిలే!’’ అంటుండగానే ఇంటి ముందు ఆటో ఆగింది.

‘‘జాగ్రత్తా...! మెల్లగా...!’’ అంటూ చేయి పట్టి నడిపించుకుంటూ తీసుకొచ్చి మంచంలో కూర్చోబెట్టాడు ఆర్ఎంపి. సంచిని తెరిచి ఏ మందు ఎలా వేసుకోవాలో పెన్నుతో గుర్తు పెట్టి చూపించాడు.

‘‘ఏమైంది రాణికేమైంది? కాలుకి కట్టేమిటి?’’

‘‘రాత్రి బస్టాండ్ ముందు ఆటో గుద్దిందట. సమయానికి పేషంట్ని హాస్పిటల్కు తీసుకెళ్తూ నేను చూసాను. ఆటోవాడే హాస్పిటల్ ఖర్చులన్నీ పెట్టుకొని, వైద్యం చేయించాడు. రాణికి తోడుగా ఎవరు లేరు కాబట్టి రాత్రి అక్కడే వుండి తీసుకొని వచ్చాను.’’ అన్నాడు.

‘‘డాక్టర్ గారు మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. మీ మేలు జన్మలో మర్చిపోలేము.’’ మొండి చేతు జోడించాడు మల్లేష్.

‘గింతదానికే దండాలెందుకు మల్లేష్. రాణికి మందు జాగ్రత్తగా వేయించు’’ వెళ్ళిపోయాడు ఆర్ఎంపి.

- -

‘‘నువ్వెప్పుడూ సాయంత్రమే ఇంటికి వస్తావు కదా? మరి రాత్రి దాకా ఎందుకు ఆగావు?’’

‘‘హాస్పిటల్కు పోయిన అందుకే లేటయింది.’’

‘‘హా...స్పి...ట...లా....? ఎందుకు? ఏమైంది?’’

‘‘నీ గురించే...?’’

‘‘నా గురించా?’’ ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు.

‘‘నీకు చేతు పెట్టిస్తే ఎన్ని డబ్బులవుతాయో తెలుసుకుందామని వెళ్ళాను.’’

‘‘మొన్ననే పిల్లాడికి యాభై వేలు అప్పైంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏందీ పిచ్చి ఆలోచన?’’

‘‘నువ్వు కుమిలిపోతుంటే చూడలేకపోతున్నానయ్యా! ఎట్లా ఉండేటోడివి. ఎలాగైనావు. ఒక్కోసారి నీ బాధ చూస్తుంటే నా బుర్ర పగిలిపోతుంది’’ కంటతడి పెట్టసాగింది.

‘‘ఊర్కో రాణి... ఊర్కో! నువ్వు నా కోసం ఇంత ఆలోచిస్తున్నావనుకోలేదు. కష్టాల్లో పుట్టాల్సింది కన్నీళ్ళు కాదు. కాసింత ధైర్యం. కూసింత ముందడుగు’’ అని నిన్ను చూస్తుంటే అనిపిస్తోంది.

రాత్రి నీ గురించి ఆలోచిస్తుంటే నాకో ఉపాయం తట్టింది. మనకున్న ఈ వంద గజాల స్థంలో యాభై గజాలు అమ్ముదాం. ఎటులేదన్నా రెండు లక్షలపైనే వస్తాయి. అప్పు తీరుద్దాం. మిగిలిన డబ్బుతో అప్పుడొకసారి నువ్వన్నావే కిరాణం షాపు అని, అది కూడా పెట్టుకుందాం. ఏమంటావు?’’

రాణి ముఖంలో వెలుగొచ్చింది. కొత్త జీవితం తాలూకు ఆశలు మనసు నిండా పురివిప్పాయి.

‘‘మంచి మాట చెప్పావయ్యా!’’ అంటూ గుండె లోతుల్లోంచి ఉబుకుతున్న సంతోషాన్ని మల్లేష్ ముఖంపై ముద్దు రూపంలో కురిపించసాగింది.

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు