జగమే మాయ - సి.హైమాశ్రీనివాస్.

jagame maya

." బాబూ !లేవరా!-ఈపాలూ త్రాగరా!.పాలూ త్రాగితే బలమూ ..వచ్చేనురా! ". [బాబూ లేవరాస్టైల్ ]

"అమ్మా !ఉండవే- ఓ అమ్మా !ఉండవే -అమ్మా నిద్దరే –ఓ!అమ్మా !నిద్దరే.."{బాబూ లేవరాస్టైల్}

"మామంచి బాబువుకదూ ! పాలుత్రాగి మళ్ళా నిద్రపో -". గబగబా పాలుత్రాగి మళ్ళా దుప్పట్లో దూరాడు .కమలా , కరుణా కర్ల ఏకైక , ముద్దుల సంతానం ,లేకలేక కల్గినందున వాడ్ని అబ్బరంగా పెంచుకొస్తున్నారు.ఏడేళ్ళైనా , స్కూల్ మొగమెరు గడు. అందరూ ఎగతాళి చేస్తున్నారని , ఓరోజున వాడ్ని స్కూల్లో వేశారు.తల్లే చదువుకోను వెళ్తున్నట్లు రోజూ వాడితో వెళ్ళి, స్కూల్లో సాయంకాలం దాకా ఉండి వాడితోనే వస్తుంటుంది కమల ,' అలా పిల్ల వాడితో అంతసేపు ఉండరా 'దని టీచర్స్ చెప్పి నా వినక. అక్కడ వాడిముక్కు తుడవడం , దాహమేస్తే నోటికి నీరు అందివ్వడం , అన్నం నోట్లో పెట్టడం, సంచీ సర్దడం అన్నీ ఆమే చేసేది.స్కూల్ పిల్లలకంతా అదో ' ఫన్ ' గా ఉండేది. అందరూ వాడ్ని 'అమ్మ కూచి వస్తూన్నాడని ' ఎగతాళిచేసేవారు. ఓరోజున స్కూల్ ఇన్స్ పెక్టర్ వచ్చి " అమ్మా! మీరు ఇంతసేపు తరగతిలో ఉండరాదు. మీబాబును వదలి వెళ్తుండండి." అని ఆదేసించిన మీదట కమల వాడ్ని వదలి రాసాగింది. వాడు ఇంటికి రాగానే ఏడ్చేవాడు.

" ఎందుకూ ఏడుపూ ..ఏమాయె నీకూ - టీచరూ కొట్టెనా ? స్నేహితులు నవ్విరా! ? చెప్పరా ఓతండ్రి ! అడుగుతా నేవెళ్ళి.[కలవారికోడలూ కలికికామాక్షి స్టైల్} .

" అమ్మా! నిన్నింత సేపు చూడకుండా ఉఒడలేనే.." అని అమ్మ మెడవాటేసుకుని గట్టిగా ఏడ్చేవాడు. 'చూడాలని ఉందే అమ్మా ! చూడాలని ఉందే !

గంటల తరబడి ఉండలేనే !చూడాల ని ఉందే!

చెవులకు పాఠం పోనేపోదే !కంటికి బోర్డు కననే కనదే !-- !--[ చూడలని ఉంది అమ్మను చూడలనిఉంది స్టైల్] అని వాడు కమల స్లూల్ కు వెళ్ళడం మానాక గొడవచేసేవాడు. కమల వాడికి తన మీదున్న ప్రేమకు పొంగి పోయేది. తల్లి బిడ్డల ప్రేమ చూసి కరుణాకర్ కూడాఎంతో సంతోషించేవాడు. ఓరోజు స్కూల్ నుండి వస్తూనే ." పక్కింటి పిల్ల వాడ్నిచూశారా ! -వాళ్ళ నాన్న కొన్నా క్రికెట్ బ్యాటూ కాంచారా ?! " [పొరుగింటి మీనాక్షమ్మను..స్టైల్} " పక్కింటి వాళ్ళ బాబు పెద్దవాడు రా ! .వారి పిల్లడి తోటీ పోటీ మనకు వద్దేవద్దురా.." .తల్లి ఎంతగానో చెప్పి చూసినా , వాడు తన పట్టు వదలలేదు చివరకు ,తండ్రి కరుణాకర్ వాడికి క్రికెట్ బ్యాట్ కొని తెచ్చాకే వాడు తల్లి తిని పించే బువ్వ తిన సాగాడు. తల్లి వాడ్ని ముద్దులతో ముంచెత్తేది.

ఈవిధంగా ఆ 'అమ్మ కూచి' , ఐదోక్లాస్ పూర్తిచేసి ,హైస్కుల్ దాకా వెళ్ళాడు. అక్కడ క్లాస్ లో టీచర్స్ నోట్స్ చెప్పేప్పుడు ' వ్రాయలే 'నంటే, కమల వెళ్ళి వారిని రిక్వెస్ట్ చేసి , తోటి పిల్లల నోట్స్ తెచ్చి రాత్రంతా కూర్చుని వ్రాసి తెల్లవారి ,వారి నోట్ బుక్స్ తిరిగి ఇచ్చేసేది. మరో రోజున వాడు ఇంటికి రాగానే మూడంకేసి పడుకోగా , తల్లి--' నాబిడ్డ సంతసం -నా కెంతొ ఆనందం - 'నాబిడ్డ కోసమూ - ఏమైనా చేయనా? '--[అన్నయ్య సన్నిధి-నాకదే పెన్నిధీ స్టైల్]. --అని వాడ్ని ఎంతో అడగ్గా , అడగ్గా -- ' ఏమే తల్లీ! ఏమని చెప్పుదునే నా జననీ! నాకుంకొంత సిగ్గాయనే! అందరి గృహములనుండ మనింట లేకన్ పోవుట బిడియంబుగాదే!

ఎంతవమానమో ఊహించ నాతరమా! నీతరమా!ఈ ఊరన్ మనకు, - కొనరే రంగుల దూరదర్శన్ ని ఒకదానిని మన మర్యాదన్ పెంపొందగా-[కారే రాజులు? రాజ్యముల్‌ కలుగవే? వరుస] అని తినక, తాగక, నిద్రించక సతాయించగా .. కమలమ్మ , కరుణాకరుకు నచ్చ చెప్పి , కలర్ టి.వి. అప్పు చేసి తెమ్మంది . కరుణాకర్ --' అప్పు చేసి కలర్ టి.వి వద్దే కమలా! ఇది మంచిపని కాదు మరి వినవే కమలా [ అప్పు చేసి పప్పు కూడు- స్టైల్] -ముద్దుల బిడ్డడికోసం కమల భర్తమాట వినలేదు..

చివరకు కరుణాకర్ కలర్ టి.వి. అప్పుచేసి తెచ్చాడు.అమ్మకూచి , అమ్మకొంగు పట్టి గిరగిరా తిరుగుతూ-- ' కలనిజ మాయెగా -కలర్.టివి. వచ్చెగా , సాటివారి లోననేనూ సాదరంగా ఉంటా గా-- [ కలనిజ మాయెగా--స్టైల్]. కలర్.టి.వి--కొని తెచ్చాకే వాడు తల్లి చదివే పాఠాలు వినసాగాడు. ఆవిధం బెట్టి దనిన.. - పరిక్షలప్పుడేకాక , ప్రతిరోజూ కమలే పాఠాలు చదువుతుంటే వాడు పడుకుని వింటూ ఉండేవాడు. ఒక్కో సారిపాపం వాడు వింటూనే వున్నాడని ,ఆమె వాడు నిద్ర పోడం గమనించక ,చదువు తూనేవుండేది.

అందుకే వాడి హైస్కూల్ పాఠాలన్నీఆమె కు కంఠో పాఠాలయ్యాయి. అలా వాడి హైస్కూల్ చదువు పూర్తయింది. ' అమ్మ కూచి ' అనే పేరూ స్థిరమైంది. అమ్మా నాన్నలు పెట్టిన పేరు ఎవ్వరికీ తెలీనే తెలీదు. ఇహ కాలేజ్ లో చేరాల్సిన సమయం ఆసన్నమైంది." నిను చూడక నేనుండలేనూ -నను చూడక నీవుండలేవు- ఈ బాధ లు ఎందుకు తల్లీ ?-ఇహ చదువులు వద్దే వద్దు.."[పాట] -అని తల్లిని వదలి ఉండలేనని చెప్పేశాడు ,అమ్మ కూచి గాడు. తండ్రి కరుణాకర్ -

" ఒరే !బాబూ ! ఈ హైస్కూల్ చదువుకు ఉద్యోగాలేం వస్తాయి చెప్పు.కొచం కష్టపడి ఎలాగో డిగ్రీ చెయ్యి . ఏ బ్యాంక్ లోనో ఉద్యోగం సంపాదించవచ్చు. ఆతర్వాత ఓ మంచి పిల్లను తెచ్చి పెళ్ళిచేసేస్తాం " అని ఎంతగానో నచ్చ చెప్పాడు. దానికివాడు " చదువు లన్ని చదివి చావంగ నేటికి ? చావు లేని చదువు చదువ వలయు..'నాయనగారూ ! మీరేం బాధ పడకండి.అమ్మ చదువు తుండగావిని నేను భారత ,భాగవత పురాణాలన్ని పుక్కిట పడతాను. పురాణపురుషుడ్నిఅవు తా ను.పెళ్ళంటారా! మనదేశంలో మగాడై తే చాలటగా పిల్లనిచ్చేవాళ్ళు వెంటపడతారనిమాస్నేహితులు చెప్పుకుంటుంటే విన్నాను." అని చెప్పాడు.

దానికి తండ్రి" ఆరోజులు పోయాయ్ నాయనా! ఇప్పుడు మగపిల్లాడే ఆదపిల్లను వెతుక్కుంటూ దొరికిందే చాలని కట్టేసుకోవాల్సి వస్తున్నది. నామాట వినుబాబూ!"అని ఎంత బ్రతిమాలినా ఊహూ వింటేగా, తండ్రి ఏమీ అన లేక " నుదుటన్ వ్రాసిన వ్రాతకన్న కలదే నూరేళ్ళు చింతించినన్..--నీఇష్టం నాయనా!" అని ,పురాణ గ్రంధాలన్నీ కొనితెచ్చి చ్చాడు. తల్లి మాత్రం ఆదేవుని మనస్సులో ప్రార్ధిస్తూనే --పురాణ కాలక్షేపం చేయసాగింది వాడొక్కడితోనే . తల్లిబాధచూడలేకవాడూనూ-‘తల్లి బాధ చూడలేను- నాన్నమనసు కాదన లేను - బాధలేవొ నేనేపడతా - భగవాన్ సీటి ప్పించు- అమ్మనాన్న ఋణం తీర్చి - అమ్మకొడుకు ననిపిస్తా-[పాట] కాలేజ్ చదువు చదివే అవకాశం కల్పించమని మొక్కాడు.అమ్మకూచి ప్రార్ధన ఆ దేవుడు విన్నాడు..ఉన్న ఊరిలో నే కాలేజీ వెలసింది . 'ఎంత గొప్ప ప్రార్ధనో -విన్న దేముడాల కించె - ఉన్న ఊరిలో ననే - కాలెజొకటి వెలసెనూ..[ఎంతఘాటు ప్రేమయో -స్టైల్ ] కమల, కరుణాకర్ల ఆనందం అంతా ఇంతాకాదు. ' ఆ నంద మానంద మాయెనే .. మాబిడ్డ కాలేజ్లొ చేరెనే..'-అని పాడుకున్నారు. అలా ' అమ్మకూచి ' కాలేజ్ లో అడుగు పెట్ట డం ఓగొప్ప చిత్రంగా జరిగింది.పురాణ శ్రవణ పుణ్యఫలం వల్లనే ఈ చిత్రం జరిగిందని వారినమ్మకం .కాలేజ్ లో చేరినరోజే ఎలా తెల్సిందో గానీ , అందరికీ ' అమ్మ కూచి ' విషయం తెల్సి పోయింది.అందరూ వాడ్ని ఆ నిక్ నేం తో నే పిలిచేవారు.-

పిలిస్తే పిల్చుకొ పోండి -లెక్కేచేయను- పోండి ..పోండోయ్ ..పోండోయ్ పోండి..[ పోండిరా పోండి కాలం ఖర్మంకలిసొస్తేనే --స్టైల్ ] - అని తన పని తాను చేసుకో సాగాడు.యధాప్రకారం తల్లి నోట్సులన్నీ వ్రాసి ఇచ్చేది. ఇంటర్ పూర్తయ్ ..' ఇంతింతై వటుడింతై ..' అన్నట్లు మన ' అమ్మకూచి ' ,బి.ఏ .లో అడుగు పెట్టాడు. వాడి చదువేమో కాని, కమలమ్మకు పరిజ్ఞానం పెరి గింది.ఎరిగిన వారంతా ,ఆమెను ప్రోత్సహించగా,ఆమె ప్రైవేటుగా అప్లయ్ చేసి ,తానూ తన బిడ్డతోపాటుగా బి.ఏ. చదవసాగింది. కొడుకు కోసం టెక్స్ట్ బుక్సన్నీ చదివి చక్కనినోట్సు ప్రిపేర్ చేసేది కమలమ్మ , ఆనోట్స్ ఆమె చదివితే పడుకోని వినేవాడు ఆ గారాల బిడ్డ. శయనించు మాబాబు! శయనించవయ్యా !- శయనించి పాఠాలు శ్రవణించ వయ్యా !- నిదుర మాత్రము పోక -ఆలకించయ్యా!- నీ కొరకు పాఠాలు - నే చదువుతానూ!- [శేష శైలా వాస శ్రీవేంకటేశ -స్టైల్-] , పరీక్షలకు మాత్రం ఇద్దరూ ఒద్దికగా వెళ్ళేవారు. అమ్మతోపాటుగా , వాడికీ ఫస్ట్ క్లాస్ మార్కులు వస్తాయని అంతా అనుకున్నారు.కానీ పాపం వాడికి ఎప్పుడూ వ్రాయడమే అలవాటు లేనందున అత్తెసరు మార్కులతో భ్.ఆ అయ్యాననిపించాడు.

కరుణాకర్ -- 'అయ్యో బిడ్డ డా! ఓరయ్యో బిడ్డడా! -ఫస్టు క్లాసులో పాసవుతావని -ఎంతో తలచితిరా! నేనెంతో నమ్మితిరా! --[పాట ]-అని బాధపడగా-, బిడ్డడు-- ' వగచకు వగచకు ఓనాన్న ! వద్దేవద్దయ్యా ! బాధొద్దే వద్దయ్యా !' [పాట ]-అని ఇంకా-- క్లాసు లో ఏముందిలే -మార్కులే నే తిందునా! --[పాట -]-అని తండ్రిని ఓదార్చాడు. కమలమ్మకు ఫస్ట్ క్లాస్ వచ్చి నందుకు కరుణకర్ కేమీ ఆనందం లేకపోగా , బిడ్డడి అత్తెసరు మార్కులతో,ఏం ఉద్యోగం వస్తుం దాని ఆలోచించ సాగాడు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా ఏమీ ఫలితం కానరాక , ఒక్కగానొక్క బిడ్డడికీ ఉద్యోగం ,వివాహం చేసేస్తే , హాయిగా కాలుమీద కాలసుకుని , బిడ్డకు పుట్టిన బిడ్డలతో గడపవచ్చని తలంచారు , కరుణాకర్ దంపతులు.చివరకు --ఓఅర్ధరాత్రి -వారికి-- - 'తోచిందీ ఊపాయం ఒక్కటీ - కానిద్దాం ఆలస్యం ఎందుకూ -

మన బిడ్డకు బ్రతుకు తెరువు మహ బాగా దొరుకుతుంది - మన జీవిత మికమీద -మహజోరుగ సాగుతుంది -- [ పాట ]-అని తెగ మురిసి తెల్లవారగానే , తమ ఆలోచన అమలు పరచను ,కరుణాకర్ త్వరగా తన ఆఫీసుకు బయల్దేరాడు,రోజూ కంటే ముందుగానే.ఎలాగో తన ఆఫీసర్ను ఒప్పించి , కరుణా కర్ -'వాలెంటరీ ' రిటైర్మెంటు తీసుకుని , తన ముద్దుల బిడ్డకు -తన బదులు ఆ అఫీసులో ఉద్యోగం వేయించాడు,నానా తంటా లు పడీ , పడీ.. కరుణాకర్ నిజాయితీ ఎన్నో ఏళ్ళబట్టీ చూస్తున్న ,ఆ ఆఫీసర్ ' పెద్దవాడు మరో 3,4, ఏళ్ళలో ఎటూ రిటైరై పోతా 'డని కరుణాకర్ కోరినట్లే -అదే ఊర్లో అదే ఆఫీసులో ఉద్యోగం ఇస్తున్నట్లు ఆర్డర్స్ వేసి ఇచ్చారు.కరుణాకర్ మహదా నం దంగా--' జీవితమే సఫలమూ - ప్రేమసుధా భరితమూ - రాగ సుధానిలయమూ -' అనిపాడుకుంటూ ఇంటికి వచ్చి , భార్యా బిడ్డలకు ,తాను సాధించిన ఘనకార్యం చూపించాడు.-పాపం తమకు ముందున్నది ముసళ్ళపండుగని తెల్సుకోలేకపోయాడు.

తండ్రి చూపించిన ఉద్యోగపుటుత్తర్వులు చూడగానే హనుమంతునిలా ఎగిరిగంతేసి , తానూ ఉద్యోగం చేసి- 'మగ ధీర '- ననిపిం చు కో బోతున్నందుకు -రాత్రంతా --'కన్నుమూత లేనెలేదు –కలలు ఏవి రానెరావు -ఎందుకింకారాత్రి ఉంది - తెల్లవారదేమి వింత- [నీవురావు ..నిదురరాదు- స్టైల్-- అనిపాడుకుంటూ , ఎలాగో తెల్లారి లేచి త్వరగా తయారై , తండ్రితో కలసి శుభ ఘడి యల్లో ఆఫీసులో అడుగు పెట్టి , రిజిస్టర్లో సంతకంపెట్టి ,ఉద్యోగినని పించు కున్నా డు.సాయంకాలం దాకా ఫైల్స్ తిరగేసి ,ఐదు కాగానే ఇంటిముఖం పట్టాడు.'ఇంటికిపోదాం ..అమ్మను చూద్దాం- గబాగబా , విషయాల్ చెబుదాం ..చకాచకా -[పల్లెకు పో దాం. .పారును-స్టైల్] అని మనస్సులో పాడుకుంటూ ఇల్లుచేరి ,ఉద్యోగంలో మొదటిరోజు విశేషాలు గబగబా చెప్పేశాడు. ' ఎంత మధుర క్షణములో ..ఇంత శాంతి ఎరుగమాయె '- అనిపాడుకుంటూ కమల, కరుణాకర్లు ఉంటుండగా -నావుడు కధ జరిగిన విధం బెట్టిదనిన -- అదే ఆఫీసులో పనిచేసే ఓరంభలాంటి రాధను చూశాడు , మన-' అమ్మకూచీ, చూడగానే మనసు పారేసు కున్నాడు.అంతర్మధనంతో , చిక్కి పోసాగాడు.వంచిన తల ఎత్తని ' అమ్మకూచి ' తనవేపు ఎగా దిగా చూస్తుండటం గమనించనట్లే గమనించిన రాధ , తన తండ్రితో చెప్పింది ,

తనకూ ఇష్టమే అని.ఎందుకంటె అమన అమ్మకూచి మన్మధసమా నుడు అందంలో ఆరడుగుల ఆజాను బాహుడు, ఎర్ర గులాబీ వర్ణపువాదు, ఎందుకునచ్చడూ!రాధతండ్రి , కరుణాకర్ను కలసి విషయం ఎత్తగా,ఆయన తటపటాఇంచగా ,ముద్దులబిడ్డ,'చేసుకుంటే ఆరంభనే చేసుకుంటా..లేకుంటే ..భీష్ముడినవుతా ..'అని చెప్పడంతో తల్లీ తండ్రీ అంగీకరించారు.ఎర్రని షామ్యానాలో ..ఎత్తైన స్టేజ్ మీద ,రాధామనోహర్ల వివాహ మైంది.అన్నట్లు మనం' అమ్మకూచి ' పేరు మనోహర్. ఇద్దరు ఒద్దికగా ఆఫీసుకు వెళ్ళిరాసాగారు.ఆఫీసులో - పనిచేసేప్పుడు తనవేపు చూస్తే '-చూడ కుమా- కానకుమా -ఆఫీసు..లోనా నావంకా- తప్పులు పోతాయే రంభా.. -[పిలువకురా--స్టైల్] -అని లోలోన పాడుకుంటూ ఉండేవాడు. పెళ్ళైనప్పట్లుంచీ గమనిస్తూనే ఉంది రాధ , అన్నింటికీ" - అమ్మా.!. అమ్మా ! " అంటున్న మగడ్ని. ఎలాగైనా ఈ అలవా టు తప్పించాలని , రాధారాధా ' అనిపించాలనీ ఆలోచిస్తూనే నెలతప్పింది.వేవిళ్ళని పుట్టింటి కెళ్ళింది.ఆఫీసునుండీ మగడు మనోహర్ నూ తన ఇంటికే తీసుకెళ్లసాగింది.అలా అలా అతగాడ్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుంది.పదోనెలలో ,పండంటి మగపిల్ల వాడ్నికనింది.కరుణాకర్, కమలమ్మల అనందానికి అంతేలేదు.ఆనందం అంతమైందని వారికి తెలీనేలేదు...పాపం. పురిటి స్నానం కాగానే ..ఇంటికి తీసుకురమ్మని కొడుకుతో చెప్పారు.కుదరదంది రాధ.పిల్లవాడ్ని చూసుకుంటూ ,ఉద్యోగం చేయలేనంది. కరుణాకర్ దంపతులు-' మేముండగ నీకేలబాధ? ..బిడ్డను చూడగలేమా ? ముద్దులు ఆడగ వలదా! మన మడి కోసం పడిచూశామే -ఎత్తుకు తిరగగలేమా మేమూ.'-[పాట]అని చెప్పగా రాధ నా వల్లకానేకాదంది. అలా మరికొన్ని నెల లు గడిచాయి. మనోహర్ "ఇంటికిపోదాం, అమ్మనాన్నలతో కలసిఉందాం చాలా బావుంటుంది." అని అడిగాడు రాధను. " ఇదిమాత్రం మన ఇల్లుకాదా ? " - " కాదనికాదు..

అమ్మ,నాన్నల వద్దనేఉందాం.." "ఇక్కడా మా అమ్మానాన్నలుఉన్నారు గా? ", " నాకోసం వారెంతో కష్టపడ్డారు ". " నాకోసమూ మా అమ్మానాన్నలు చాలాకష్టాలే పడ్డారు"

,"మానాన్న నాకోసం తన ఉద్యోగం వదులుకుని నాభవిష్యత్తు తీర్చి దిద్దాడు.అమ్మ నాకోసం తన జీవిత మంతా కష్టపడింది." -" మా అమ్మానాన్న లూ అంతే" "నామాటవిను రాధా! మనింటికిపోదా."

-"మీరూ నామాటవినండి మేమిద్దరం మీకు కావాలంటే ఇక్కడేఉందాం."

"నాకోరిక మేరకు నిన్ను చేసుకోను వారు అంగీకరించారు."- " మావారూ నాకోరిక మేరకుమీ తోపెళ్ళి కి ఇష్టపడ్డారు."

" నామాటవినవా? "-

"మీరూనామాటవినండి." విసిగి పోయిన మనోహర్ --' ఇంతేనా నీ మాటింతేనా !- లేదా వేరే మాటా! కన్నవారినే వదలాలా! కమ్మని ప్రేమ ఇదేనా -{పాట] అనిపాడుకొంటూ రాత్రంతాగడిపాడు.ఉదయాన్నే వెళ్ళి తల్లి, తండ్రులకీ మాటచెప్పాడు. --' భార్య ర్యకోసమై అమ్మను వదలెనె అమ్మకూచిగాడు - అయ్యో ..అమ్మకూచిగాడు ,భార్యమాటలే ..భారం బైనా. .వినక . తప్పదాయె , వానికి వినక తప్పదాయె ..తండ్రిప్రేమనే త్యాగంచేసి ..తలను వంచెనంత ' అమ్మ కూచియే . పెళ్ళాం కూచిగ మారిపోయెనంత ' అని బుర్రకధ స్టైల్ లో వారు పాడుకుంటుండగా ,అమ్మకూచి , రాధ కూచియై, 'జగమే మాయ బ్రతుకే మాయ -భార్యలతో భారమింతేనయా ఇదీ ఇంతేనయా ----రేపూ నా..గతింతేనయా --' అనుకుంటూ వెళ్ళాడు పెళ్ళాం బిడ్డల కోసం.

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు