తన తాతగారు కట్టించిన పాత పెంకుటిల్లు తన తండ్రి హయాంలో ఆర్ సి సి ఇంటిగా మారితే, భైరవమూర్తి దాన్ని ఇంకాస్త ముందుకు పెంచి, పైన ఓ పోర్షన్ వేసి,ఇంకొన్ని హంగులు అమర్చుకుని, పాడుపడిన కాంపౌండ్ వాల్ మళ్ళీ కట్టించి అందమైన రంగులు వేయించాడు ఓ ఆర్నెల్ల క్రితం. అంతకుముందు ఆ ఇంటిమీద అంత శ్రద్ధ పెట్టకపోయినా, ఇప్పుడు మంచి అందంగా ఇల్లు కనబడుతుండడంతో రోజూ ఆ ఇంటి సంస్కరణ బాధ్యత నెత్తినేసుకున్నాడు. కాంపౌండ్ వాల్ బయట “ఇచ్చట నోటీసులు, సినిమా పోస్టర్లు అంటించరాదు, ప్రకటనలు వ్రాయరాదు. నో పార్కింగ్” అని వ్రాయించాడు. అయితే రోజూ ఎవరో ఒకరు తన గోడ నానుకున్న డ్రైనేజి లోనికి మూత్రవిసర్జన చేస్తుంటే వాళ్ళ మీద అరిచేవాడు. వాళ్ళు కాస్త సిగ్గు పడి సారీ చెప్పి వెళ్లిపోయేవారు. గతంలో కూడా అలానే జరుగుతున్నా, తన ఇల్లు రీమోడల్ చేయించక ముందు బయట వాతావరణం కూడా అంత బాగుండక పోవడంతో భైరవమూర్తికి ఇప్పుడు కలిగినంత శ్రద్ధగా గమనించే అవసరం రాలేదు. ఇంకొకరోజు కూడా ఎవరో ఆ పనే చేస్తుంటే చూసి అలానే అరిచాడు.
“ఏం సార్! ఇదేమన్నా మీ ఇల్లా!? మున్సిపల్ డ్రైనేజి. అందులో పోస్తే మీకేంటి? అయినా ఏళ్ల తరబడి అందరూ ఇలా రోడ్ పక్కనే పోస్తున్నారు. ఇవాళ కొత్తగా అడుగుతారేం?”అని పోస్తూ పోస్తూనే భైరవమూర్తి వేపు తిరిగి మరీ తిరగబడ్డాడు అతను. “ఛీ!ఛీ!! సిగ్గులేకపోతే సరి. అసహ్యంగా నావేపు తిరుగుతావేంటీ? పైగా ఆ తలపొగరు సమాధానం ఒకటి! ... డ్రైనేజి లో పోస్తే!? అది మా ఇంటిముందే కదా ఉన్నది. ఆ కంపు భరించేది మేమే కదా?” అని ఇంకొంచెం గట్టిగా అరిచాడు భైరవమూర్తి
“అది నాకనవసరం. నా కర్జెంటయింది. మీ ఇంట్లోకొచ్చి పోయలేదుకదా!?ఇది ఓపెన్ డ్రైనేజి. నా ఇష్టం. మీరేం చేస్కుంటారో చేస్కొండి. నాకు తిక్కరేగితే రోజూ ఇక్కడికేవచ్చి పోసి పోతా. ఈ వార్డ్ కార్పొరేటర్ నా బాబాయే. అతనితోచెప్తే అసలు మీ కాంపౌండ్ వాల్ ఈడ్రైనేజిని కొంత కబ్జాచేసికట్టారని దీన్ని కొట్టించేసినా ఎవడడిగేవాడుండడు!!” అని ఇంకొంచెం రెచ్చిపోయాడు అతగాడు సిన్మాల్లో అసిస్టెంట్ విలన్లా.
ఊహించని ఈ ఎదురుదాడికి బిత్తరపోయిన భైరవమూర్తి, ఏదో అనబోయేలోగా, అతను ఆ ఇంటిగోడని ఓసారి పరిశీలనగా చూసి, నవ్వుతూ ‘అయినా ఇక్కడ మీరు నోటీసులు, సినిమా పోస్టర్లు అంటించరాదు, నో పార్కింగ్ అని వ్రాశారు గానీ “మూత్ర విసర్జన చేయరాదు” అని వ్రాయలేదు కదా? అంచేత నా తప్పేంలేదు’ అని చక్కా పోయాడు.
వార్నీ..ఇన్ని వ్రాసినా ఇంకా అలా వ్రాయలేదని ఇలా చేసిపోతారా? అని నెత్తి బాదుకుని, మళ్ళీ పెయింటర్ని పిలిపించి “ఇచ్చట మూత్రవిసర్జన చేయరాదు” అని వ్రాయించాడు భైరవమూర్తి.
===========
అయినా పరిస్థితిలో మార్పులేదు. చట్టం తనపని తాను చేసుకుపోతుంది అని నాయకులు చెప్పేరీతిని, ఎంతమంది లంచగొండులు ఎసిబికి దొరికినా ఏమీ తగ్గని లంచగొండితనంలా, జనాలు యధేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చేసిపోతున్నారు. ఎందుకిలా ఎవరూ లెక్కచెయ్యడం లేదని చూస్తే.. ఎవరో ఆకతాయి పని చేసినట్టున్నారు, ఆ ప్రకటనలోని చివరిపదం “చేయరాదు లో ‘దు’ ని చెరిపేశారు. లబో దిబో మని ఆ అక్షరాన్ని తానే మళ్ళీ జాగ్రత్తగా వ్రాశాడు భైరవమూర్తి
ఓ రెండ్రోజులు బాగానే గడిచిపోయాయి. భైరవమూర్తి చూస్తుండగా ఎవరూ ఆ పని చేయలేదు. హమ్మయ్య అనుకునేలోగా ఇంకొకాయన తన కుక్కని తీసుకొచ్చి తన ఇంటిగేటు దగ్గర దానిచేత రెండు పన్లూ చేయిస్తుండగా చూసి పట్టుకున్నాడు. “ఏం చెయ్యను సార్. దీనికి మలబద్ధకమో ఏమో గానీ, రెండ్రోజులై ఊరంతా తిప్పుతున్నా దాని కడుపు కదలలేదు. ఈరోజు మీ గేటు వాసనచూశాక దానికి కడుపు ఖాళీ అయిపోయింది. కొత్త పెయింటా? సూపరుంది. దీనికీ బాగా నచ్చినట్టుంది. ఏ కంపెనీ పెయింటండీ?నేను ఇదే మా ఇంటిగేటుకి వేయించేస్తా! ఇంక నాకు వీధి వీధీ, ఇల్లిల్లూ ఇలా దీన్ని పట్టుకుతిరిగే బాధ తప్పుతుంది. “ అంటూ ఏక బిగిన భైరవమూర్తి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, అతన్ని పొగుడుతున్నాడో, తనపనిని సమర్ధించుకున్నాడో తెలీనిరీతిలో సమాధానం ఇచ్చాడు ఆ పెట్ డాగీశుడు. ఏమనాలో తెలీక బుర్ర గోక్కుని, “సర్సర్లెండి. మరీ ఇలా గేటుమీంచి పోయించకండి!” అని అతన్ని పంపేసాడు. ఎందుకేనా మంచిదని గోడమీద “మూత్ర విసర్జన చేయరాదు” అన్న వాక్యం పక్కనే..”చేయించ రాదు” అని అదనం గా వ్రాయించాడు.
==========
మర్నాడు ఒకాయన తన పిల్లాడ్ని ఆ డ్రైనేజి ఒడ్డుని కూర్చోబెట్టడం చూసి ఆయనమీదికి జువ్వలా దూసుకెళ్లాడు, ” ఏమయ్యా! బుద్ధి లేదూ? ఓ పక్క స్వచ్చ భారత్ అని ప్రభుత్వం మొత్తుకుంటూంటే, నువ్వేంటి మీ పిల్లాడ్ని ఇలా కాలవలోకి కూర్చోబెట్టావు?” అని.
“అయ్యా! మాదీవూరు కాదు. తెల్లారి బస్ దిగి ఇలా పోతున్నాం. ఈలోగా ఈ పిలగాడు అర్జంటంటే ఇక తప్పక, ఇక్కడ కూర్చోపెట్టాను. రోజూవచ్చి ఇక్కడే పని కానిచ్చేస్తున్నట్టు అలా కసురుకుంటారేం? అయినా డ్రైనేజి లోకే కదా పోయేది. అదేదో మీ ఇంట్లోకొచ్చినట్టు అరుస్తారేం?” అని ఎదురుదాడికి దిగాడు ఆ ఆసామీ. “ఇదే మీ వూర్లో,మీ ఇంటి దగ్గర ఇలా ఎవరైనా చేస్తే ఊరుకుంటావా? అని వదిలిపెట్టకుండా లా పాయింట్ లాగినట్టు అడిగాడు భైరవమూర్తి.
తన బేగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి, పిల్లాడిని కడిగేస్తూ “ఎందుకూరుకుంటాం సార్? ఊరుకోం! మీలానే నిలదీసి అడుగుతాం. వాళ్ళూ నాలానే పనైపోయాక సారీ! ఇంకెప్పుడూ ఇలా చెయ్యం, ఇంకోలా చేస్తాం! అని సారీ చెప్పి అక్కడనుండి జారుకుంటారు” అని చెప్తూనే కొడుకుని తీసుకు చక్కా జారుకున్నాడతను.
=============
మళ్ళీ ఏం చెయ్యాలో తోచక జుట్టు పీక్కున్నాడు భైరవమూర్తి. ఇంతకీ ఈఇబ్బంది తనకొక్కడికేనా, మిగతా వాళ్ళక్కూడానా? అననుకుంటూ, తన వీధిలోని ఇతర ఇళ్లు చూశాడు. ఆ వీధిలో చాలా వరకు అపార్ట్మెంట్లు, వాటికి వాచ్ మన్ ఉండడంతో ఎవరూ ఆ ఇళ్ల ఛాయలకి పోవడం లేదు. రెండు మూడిళ్లు ఇండిపెండెంట్ వి అయినా, అవి ఒకప్పటి తన పాత ఇల్లు లాగా ఉండడంతో వాటి బయట ఎవరేం చేసినా పట్టించుకోవడం మానేశారు వాళ్ళు.
స్నేహితులని సలహా అడిగాడు, ‘మీరైతే ఏం చేస్తున్నార్రా!?’ అని. వాళ్ళలో చాలా మంది అపార్ట్ మెంట్ వాసులవడం వల్ల ఆ సమస్యే లేదు వాళ్ళకి. ఏమున్నా వాచ్ మన్ చూసుకుంటున్నాడు. ఇంకొంతమంది “దీనికింత వర్రీ దేనికిరా? మొన్నమొన్నటి దాకా మనం ఇలానే చేసేవాళ్లం కదా. ఇప్పటికీ ఎక్కడికో వెళ్ళివచ్చేటప్పుడు, అక్కడ అవకాశం లేకపోతే మనమూ ఇలా రోడ్ సైడ్ నే కానిచ్చేస్తున్నాం కదా?” అని ఇది అష్టావధానం లో అప్రస్తుత ప్రశంస లాంటిదన్నట్టు సమాధానాలు చెప్పారు. “పోనీ సి సి కెమెరాలు పెట్టించు” అని ఉచిత సలహా పారేశాడు ఓ స్నేహితుడు. “ఆ!!.. మళ్ళీ అదో దండగమారి ఖర్చు. పైగా ఎవడు పోస్తున్నాడో వాడ్నిచూస్తూ కూర్చుంటాడా వీడు అసహ్యంగా!” అని ఓ సందేహాన్ని కూడా లేవనెత్తాడు ఇంకో మిత్రుడు. పోనీ అవి ఉన్నట్టు “ఈ ప్రాంగణం సిసికెమెరాల పర్యవేక్షణలో ఉన్నది” అని ఉత్తినే బోర్డ్ పెట్టు అని ఇంకో ఉచితం పారేశాడు ఇందాకటాయన.
“సర్లే! అది ఇంకా డేంజర్. మొన్న మా బామ్మర్ది ఇలానే తనింట్లో కుక్క లేకపోయినా, ‘కుక్క ఉన్నది జాగ్రత్త!’ అని బోర్డ్ పెట్టాడు. అది చూసి దొంగవెధవలు, వీడిదగ్గరెంత డబ్బు,బంగారం లేకపోతే కుక్కని పెంచుకుంటాడు? అని అనుకుని, ఓ రాత్రి మత్తుమందు జల్లిన కుక్కబిస్కట్లు పట్టుకొచ్చి ఇంటి ఆవరణ అంతా జల్లారు. కానీ, ఎక్కడా కుక్క జాడ లేకపోయేసరికి, యధేచ్చగా ఇల్లు మొత్తం దోచుకుపోయారు. ఇప్పుడు కూడా సిసి కెమెరాలు ఉన్నాయన్న బోర్డ్ చూసి, వీడెవడో బాగా బలిసినవాడు కాబోలు అని ఏదో ఓరోజు ఏ దోపిడీ ముఠానో దిగిపోగల్దు. అలాంటి పిచ్చిపని చెయ్యకు. ఎందుకొచ్చిన గొడవరా. పోసే వాళ్ళు పోసుకు పోనీ. లేదా ఓ పని చెయ్యి. కాంపౌండ్ వాల్ కి బయటవేపు దేవుళ్ళ బొమ్మలు అతికించు. అది చూసి ఎవరైనా దేవుడి మీది భయభక్తులతోనైనా ఆ పని మానుకుంటారు.” అని చివరాఖరికి ఓ తరుణోపాయం చెప్పాడు ఇంకో ప్రాణ స్నేహితుడు.
=============
ఇదేదో బాగుంది అని వెంటనే కొన్ని దేవుళ్ళ బొమ్మలున్న టైల్స్ తెప్పించి అక్కడక్కడ అతికింపించాడు భైరవమూర్తి. ఆ ప్రక్రియ బానే పని చేయడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఓ పదిరోజులు గడిచాయో లేదో, ఓ రోజూదయాన్నే హఠాత్తు గా ఓ అయిదుగురు ఫలానా ధార్మిక సంఘం నేతలమని చెప్పుకుంటూ భైరవమూర్తి ఇంటికి వచ్చి” అలా దేవుళ్ళ బొమ్మలు వీధి కాంపౌండ్ కి అతికించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తను ఆ పని చేసిన కారణం చెప్పాక వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. “ఇంత వయసొచ్చింది, కానీ బుధ్ధి వచ్చినట్లులేదు మీకు. అవి అక్కడ అతికించిన తర్వాత మీ సమస్య తీరిపోయిందనుకుంటున్నారా? ఇప్పుడు మీ ఇంటికొస్తుంటే ఒక చిన్న పిల్లాడు అక్కడే పాస్ పోస్తూండడం చూశాం. ఆ పాపం మీదే. రోజూ ఆయా దేవుళ్ళకి మీరిచ్చే ధూపం ఆ కాలువ మురికి కంపా? అందులో కొట్టుకువచ్చే చెత్త నైవేద్యమా? వెంటనే ఆ దేవుళ్ళ బొమ్మలు తీసివేయకపోతే మీకు రౌరవాది నరకాలు ప్రాప్తిస్తాయి.” అని డెవోషనల్ మెయిలింగ్ చేసి అతన్ని భయపెట్టి వెళ్లారు. దాంతో హడిలిపోయి, వాటిని వెంటనే తీసివేశాడు. ఇంక వాళ్ళని, వీళ్లని అడిగిప్రయోజనం లేదు, నేనే ఏదో ఒకటి చెయ్యాలి అని బాగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు భైరవమూర్తి
=============
“ఒరేయ్ సుద్దూ! గుడ్ న్యూస్!! నాన్నగారికి రాష్ట్రప్రభుత్వం వారు సన్మానం చేస్తారటరోయ్!” అని సుద్దూ అనబడే సుధీర్ చెవి కన్నంపడేలా ఫోన్లోనే సైరన్లా ఓగావుకేక పెట్టింది సైరంధ్రినీబాయి అనబడే భైరవమూర్తి ధర్మపత్ని
“అబ్బా! నీ పేరుకు తగ్గట్టు ఎప్పుడుమాట్లాడినా సైరన్ మోత లాగే ఉంటుందమ్మా నీ గొంతు. కాస్త మెల్లగా చెప్పొచ్చుగా ఏదైనా!? ఇంతకీ నాన్నకి సన్మానమేమిటమ్మా?ఆయనగారేమంత ఘనకార్యం చేసారూ? ఓ రచయితా, నటుడూ కాదు. సంఘ సంస్కర్తా కాదు. స్పోర్ట్స్ మన్ అసలే కాదు పైగా స్పోర్టివ్ నెస్ లేనేలేదు. ఎప్పుడూ అందరి మీదా చిర్రు బుర్రు లాడుతూ ఉంటారు. అందుకని ‘చిరాకుశ్రీ’ అన్న బిరుదుతో గాని ఈయనకి సన్మానం చేస్తారా ఏం? నేన్నమ్మను” గుక్క తిప్పుకోకుండా వరస ప్రశ్నలు సంధించాడు సుధీర్.
“ఒరే! ఇది పాత అయిదొందలు, వెయ్యినోట్లు చెల్లవన్నంత అన్నంత నిజం. రాహుల్ గాంధీకి ఇంకా పెళ్లికాలేదన్నంత నిజం. ఇంకేం మాట్లాడకుండా నువ్వు వచ్చే ఆదివారం సెలవు పెట్టుకురా! అవాళే మీ నాన్నగారికి సన్మానం.”
“ అబ్బా! నాన్నకి సన్మానం అనగానే నీకు మతి పోయినట్టుంది. ఆదివారం సెలవు పెట్టుకోవడం ఏమిటి.? ఆ రోజు సెలవేగా అందరికీ!” అన్నాడు
“ నాకు కాదు నీకే మతి పోయింది. ఎప్పుడూ శనాదివారాలు రమ్మన్నా, “కుదరదమ్మా, ఈ శనాదివారాలు ఆఫీసులో చాలాపని ఉంది. మా బాస్ కూడా ఆఫీసుకి వస్తున్నాడు. ఇంకోసారి చూద్దాంలే!” అనంటుంటావుగా?
అందుకే ఆదివారం అయినా సెలవు పెట్టి రమ్మంది.” అని ఛాన్స్ దొరికింది కదాని సుధీర్ ని దొరకపుచ్చుకుంది సైరంద్రినీ బాయి. అసెంబ్లీ లో పొరపాట్న ప్రతిపక్షానికి దొరికిపోయిన పాలక పక్ష మంత్రి గారిలా, క్షమార్పణ చెప్పీ చెప్పకుండా దాటవేస్తూ, “ఓకే ఓకే ఇంతకీ సన్మానం దేనికో చెప్పలేదు నువ్వు.” అనడిగాడు సుధీర్.
“అది సస్పెన్స్ రా. ఇక్కడికొస్తేనే నీకు తెలిసేది. నువు రావాల్సిందే!” అని సుధీర్ ఇంకేం మాట్లాడానికి అవకాశం ఇవ్వకుండాఫోన్ కట్ చేసేసింది సైరంధ్రినీబాయి.
=============
అనుకున్న ఆ ఆదివారం నాడు సుధీర్ నాన్న అయిన భైరవమూర్తి కి ప్రభుత్వంతరపున ఆ నగర పాలక సంస్థ వారు ఇంకా కొందరు ఇతర సంఘసంస్కర్తల తో పాటు ఘనసన్మానం చేసి, వాళ్ళు చేసిన ఘనకార్యాలని ముక్తసరిగా, మొక్కుబడిగా పొగిడి, ఒక చెక్కు ముక్కా(నగదు), ఒక చెక్క ముక్కా(మొమెంటో), ఒక గుడ్డ ముక్కా (షాల్) తో ఇంటికి సాగనంపారు.
కష్టపడి ఆ ఆదివారం “సెలవు” పెట్టుకు వచ్చిన సుధీర్ ఆ సన్మాన కార్యక్రమం చూసినా అతనికి అదంతా ఒక కల లాగా ఉంది. కానీ నాన్న కట్టించిన ఆ మరుగు దొడ్డి ఇంటి కాంపౌండ్ వాల్ నానుకుని ఎదురుగా కనబడుతుంటే. నిజమని నమ్మక తప్పలేదు. దీనికే అంత సన్మానామా!? అని ఆశ్చర్యపోతూ, “ఇంతకీ ఆ మరుగుదొడ్డి సన్మానం మరుగున ఉన్న కధేంటి నాన్నా!” అని ఆరా తీశాడు కుతూహలం గా. పైగా రేపు తన ఆఫీస్ లో వాళ్ళ బాస్ కి చెప్పాలి గా. ఈ నెపం మీదే ఆ ఆదివారం వచ్చాడు మరి.
జీవితంలో మొదటిసారిగా తనకు జరిగిన ఆ సన్మానం తాలూకు అనుభూతి నుండి ఇంకా బయటికి రాని భైరవమూర్తి వేసవికాలపు ఉక్క లోపల చంపేస్తున్నా తన భుజమ్మీది సన్మాన శాలువా ఇంకా తియ్యనే లేదు.. దాన్ని సవరించుకుంటూ సుధీర్ కి తమ ఇంటి కాంపౌండ్ వాల్ దగ్గర ఊరి జనాల కార్యక్రమాలన్నీ చెప్పి.. “ఇంక వాళ్ళతో విసిగిపోయి వాళ్ళ అవసరాలకి నేనే ఒక మరుగుదొడ్డి కట్టించేస్తే మంచిదని ఆ పనిచేసాన్రా. అది వాళ్ళకి బాగా అర్ధమవాలని “ఇది సులబ్ కాంప్లెక్స్ కాదు. కానీ మీరు మీ అత్యవసర కాలకృత్యాల కొరకు ఈ ఉచిత మరుగుదొడ్డిని ఉపయోగించవచ్చును. దయచేసి దీనిని పరిశుభ్రంగా ఉంచండి. స్వచ్చభారత్ వైపు ఓ అడుగు ముందుకెయ్యండి!” అని కూడా వ్రాయించా. అది ఆ నోటా ఈ నోటా పాకి మన వూరి మేయర్ గారి దృష్టి కెళ్లింది. ఆయనోరోజు నన్ను పిలిపించి, ఆ పని ఎందుకుచేశానో తెలుసుకుని, నన్ను కాసేపు పొగిడి, ఈ మరుగుదొడ్డిని తన పురపాలక సంఘ ఖాతాలో వేసుకుంటామని, ప్రతిగా నాకు సన్మానం చేయిస్తామని మెలిక పెట్టాడు. పెద్దవాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో ఏమో నని సరేనన్నాను.”అని చెప్పాడు భైరవమూర్తి తన మరుగు దొడ్డి కధ.
“ఇదేదో బావుంది నాన్నా. నేనూ మా బాస్ తో చెప్పి మా కంపెనీ తరఫున సిటీ లో ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కొన్ని పబ్లిక్ టాయిలెట్స్ ఇలా కట్టిస్తే కంపెనీకి మంచి పేరొస్తుందని చెప్పి ఒప్పిస్తా. తద్వారా నాకు ప్రొమోషన్ ఇఛ్చినా ఇస్తారు.” అని ఆనందపడ్డాడు సుధీర్.
=============
ఓ రెండ్రోజుల తర్వాత, ఓనాడు మార్నింగ్ వాక్ కనీ బయటికొచ్చిన భైరవమూర్తికి మళ్ళీ ఎవడో ఆ టాయిలెట్ గోడని బయటనుండే తడిపేస్తూండడంతో నిర్ఘాంతపోయి,‘ఒరే! చచ్చీ చెడీ మీలాంటి వాళ్ళకోసమే ఇది కట్టిస్తే మళ్ళీ మొదటికొచ్చారేం రా మీరు!?’ అని అతనిమీద అరిచాడు. ఈసారి సైరంధ్రినీ బాయి కూడా తన సైరన్ మోగించింది తోడుగా.
“సారీ సార్. చాలా అర్జంటైంది. తలుపు తీసుకు లోపలికెళ్లే టైం లేక ఇలా...” అని సమాధానమిచ్చాడు అతను... తీరుబడిగా తన పనికానిస్తూ. “అయ్యో!! ఇలాంటి వాళ్ళున్న ఈ దేశం స్వచ్ఛభారతంగా ఎప్పటికయ్యేను దేవుడా!!?” అని టాయిలెట్ గోడ కేసి తల బాదుకున్నాడు భైరవమూర్తి నిస్సహాయం గా.