పాపం చుక్కమ్మ - బొందల నాగేశ్వరరావు

papam chukkamma

అది రైలు స్టేషన్ నుంచి బస్టాండుకు వెళ్ళే దారి. ఆ దారి రైళ్ళు వచ్చి వెళ్ళే వేళల్లో రద్దీగా వుంటుంది . స్టేషన్ నుంచి వెళుతున్నప్పుడు ఎడమ వైపు ఓ మర్రి చెట్టు వుంది. ఆ మర్రి చెట్టు క్రింద భిక్షాటన చేసుకుని బ్రతికే భిక్షగాళ్ళ కాపురాలున్నాయి. ఆ కాపురాల్లో ఒకటి అవిటి వాడు ముసలయ్యది.ముసలయ్యకు ఇద్దరు పిల్లలు. కొడుకు, కూతురు. కొడుకు పేరు అప్పయ్య. కూతురి పేరులక్ష్మి. పాపం...లక్ష్మి సంవత్సరం క్రితం ఓ లారీ ప్రమాదంలో అక్కడే పోయింది. ఇక మిగిలి వున్నదిఆ తండ్రీ కోడుకులే! వాళ్ళకు భుక్తి ఆ మోస్తారైన వూరిలో భిక్షాటనే. కొన్ని సందర్భాల్లో ఆ వూరిలో ఏ మూలన్నా పెళ్ళిళ్ళు, పురుడ్లు, వేడుకలు, దేవుడి ఉత్సవాలంటూ జరిగితే ఆ తండ్రీ కొడుకులకు పండగే! అలాంటప్పుడు వాళ్ళు ప్రతి వీధి తిరిగి తిరిగి అడుక్కు తిన వలసిన అవసరం వుండదు.

ఇక తతిమ్మా కాపురాల్లో మరొకటి అనాధ చుక్కమ్మది. ఆమె వృత్తి ఆరైలు స్టేషను లోనే చివరి ప్లాట్ ఫారానికి అర్థ కిలో మీటరు దూరంలోని సిక్కు లైనులో ఆగి వున్న ఓ బోగీలో పక్కలు వేయడం పొట్ట పోసుకోవడం .

చట్ట రీత్యా, మానవత్వపు దృష్ట్యా చుక్కమ్మ చేసేది నేరమే! ఆ సంగతి ఆమెకూ తెలుసు. అయినా గత్యంతరం లేక ఆమెకు ఆ పనే సులువైదనుకొంది పొట్ట కూటికి.

చుక్కమ్మ తన వద్దకు అలవాటుగా వచ్చి వెళ్ళే వాళ్ళ కళ్ళకు ధగ ధగ మెరిసిపోతూ రంభలా కనబడుతుందేమో కాని, వాస్తవానికి చుక్కమ్మ బక్క చిక్కి నల్లగా పొట్టిగా వుంటుంది పాపం.

ఆ రోజు...

"ఒరేయ్ అప్పన్నా! సిల్లర ఎంతొచ్చినాదో సూడూ!"అప్పటి వరకూ భిక్షాటనలో సంపాదించిన చిల్లరను జొలె నుంచి తీసి బల్ల లాంటి బండ మీద పోసి ప్రక్కనే కూర్చొని కొడుకునడిగాడు ముసలయ్య.

తండ్రికి ఎదరే కూర్చొన్న అప్పయ్య వేటికవి వేరు వేరుగా రూపాయి, రెండు రూపాయలు, అయిదు రూపాయలంటూ లెక్క పెట్టి ఓ లక్షకు మించి పోయిన లక్షాధికారి ఠీవితో"అయ్యా!నాలుగు వందల తొంభై"అన్నాడు.

అప్పుడు ఇద్దరి ముఖాల్లో వెయ్యి జ్యోతులు వెలిగాయి. ఆ డబ్బు మొత్తాన్ని జొలె సంచిలో వేసుకొసుకొన్నాడు ముసలయ్య.

పొద్దుట్నుంచి తండ్రితో పాటు తిరిగి తిరిగి అలసి పోయిన అప్పయ్య తన చంకలో వున్న ప్లాస్టిక్ సీసా లోని నీళ్ళు తాగి సగం కాల్చి వుంచుకొన్న బీడీ ముక్కను చెవి లోంచి తీసి ముట్టించుకున్నాడు.

"ఏరా...అప్పన్నా! మరిక ఎల్దామా?"అన్నాడు ముసలయ్య ఆకలికి కడుపు లోని ప్రేవులు అరుస్తుంటే.

"గంట ఒకటయినాది. అన్నానికేగా...పద" అని మళ్ళీ “మరి మందయ్యా!"అడిగాడు అప్పయ్య.

"మందు లేకుండానా!? వుందిలేరా...పద"అంటూ అక్కడ్నుంచి లేచాడు ముసలయ్య.

తండ్రీ కొడుకులిద్దరూ పెద్ద బజారు బ్రాందీ షాపులో బాగా మందు తాగి పక్కనే వున్న మిలిటరీ హోటల్లో మటన్ బిరియాని మెక్కేసి మరో లోకంలో విహరిస్తూ మర్రి చెట్టు వద్దకు దారి తీశారు.

సహజంగా మనిషికి ఏ లోటు లేకుండా అన్ని సుఖ భోగాలతో జీవితం సాఫిగా సాగుతుంటే దేవుడొకడున్నాడన్న సంగతే మరచి పోతాడట. అలాంటప్పుడు భిక్షాటనతో జీవితం సాగించే ఈ తండ్రీ కొడుకులు ఇవాళ పీకల వరకూ తాగి వొళ్ళు కొవ్వెక్కి వాళ్ళ స్థితి గతులను సైతం మరచి పోయి మరో లోకంలో విహరిస్తున్నారంటే వాళ్ళకిక దేవుడితో పనేముంది? కనుకనే కన్ను మిన్ను తెలియకుండా పొగరుతో వూగి పోతున్న అప్పయ్యకు అప్పుడు చుక్కమ్మ గుర్తుకొచ్చింది. ఆమె నల్లగా పొట్టిగా వున్నా తాగిన మత్తులో వున్న తనకు అందంగా కనబడిందేమో మరి వెంటనే ఆమె కౌగిట్లో చేరి పోవాలన్న వుద్యేశ్యంతో"అయ్యా! నువ్వు ఇంటికి పో! నేనలా ఎళ్ళొత్తా"అంటూ చక చకా నడిచాడు చివరి ప్లాట్ ఫాం దాటి సిక్కు లైనుకు అప్పయ్య.

"చుక్కా! ఇందా వంద రూపాయలు. తీసుకోని లోనికి పద" ఎదరే నిలబడి తూలుతూ అన్నాడు అప్పయ్య.

ఒక్క నిముషం చలించి పోయింది చుక్కమ్మ. 'అప్పన్న తన కోసం వచ్చాడా?!' భయాందోళనలతో కూడుకున్న ఆశ్చర్యం తనలో చోటు చేసుకోగా, తన కళ్ళను తనే నమ్మ లేక పోయింది.

"అప్పన్నా...నువ్వూ...!"ధైర్యాన్ని కూడ దీసుకొని అడిగింది చుక్కమ్మ.

"ఆఁ..నేనే"నాగు పాములా బుస కొడుతూ ఆకలితో వేచివున్న బావురు పిల్లిలా అంగలార్చుతున్నాడు అప్పయ్య. అప్పుడు అతనిలో కామ వాంఛ తప్ప మరేమీ కన బడ లేదు చుక్కమ్మకు.

"ఏందే...చుక్కా! అట్టా సూత్తూ నిలబడ్డావ్! పైసలిత్తున్నానుగా...కావాలంటే ముందే తీసుకో! పద...లోనికి!" అంటూ చేతిలో నలిగి వున్న వంద రూపాయల నోటుని తీసి చుక్కమ్మ చేతిలో వుంచాడు అప్పయ్య.

'ఛీ! వీడెంతటి నీచుడో! ఇంతటి నీచమైన కోరిక వీడికీ పుట్టిందంటే' అని మనసులో అనుకొంటూ అప్పయ్యకు ఏదో చెప్పాలనుకొని చెప్పలేక

"అప్పన్నా! నా మీద నీకూ ఆశ కలిగిందా?"అని మాత్రం అనగలిగింది చుక్కమ్మ.

"ఏం...నేను మగాడిని కాదా?...నాకా ఆశ రాకూడదా?" అడిగాడు అప్పయ్య.

పిచ్చిగా నవ్వింది చుక్కమ్మ. అప్పయ్య కళ్ళ లోకి సూటిగా చూస్తూ "నువ్వు మగాడివే! అందుకేగా కడుపు నిండే సరికి వొళ్ళు తెలియని పరిస్థితిలో నన్నాశపడి ఇందాకా రాగలిగావు. నిజం గానే... అప్పయ్య నా సొంత అన్నయ్య లాంటి వాడని నిత్యం అనుకొంటున్న నాకు ' అన్న' అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నావ్! నీ మీద నాకున్న అభిమానానికి, గౌరవానికి మనిద్దరి మధ్య నేననుకొనే అన్నా చెల్లి అనుబంధానికి భంగం కలిగిస్తున్నావ్! అయినా ఈ బక్క చిక్కిన శరీరంలో నీకేం సుఖం దొరుకుతుందని?. చూడూ! ఈ ఎముకల గూడు ఇంకొంత కాలం బ్రతకాలని, ఆ బ్రతికే కొద్ది కాలం ఈ దేహంలో ఊపిరుండాలని, అందుకు కడుపుకు తిండి అవసరమని, దాన్ని సంపాయించుకునేందుకు ఖర్మ కొద్ది చీమూ నెత్తురు లేని మనిషిగా తయారై ఈ పాడు పని చేస్తున్నాను. తద్వారా ఈ మనుష్యుల్లో మృగాల్ని చూస్తున్నాను . ఓ తల్లి కడుపున పుట్టక పోయినా ఆ మర్రి చెట్టు క్రింద తోడైన నిన్ను నా సొంత అన్నగా భావించుకొని మీతో కలిసి మెలిసి బ్రతుకుతున్నాను. కానీ...ఇవాళ నిన్నూ నా కస్టమర్లలో ఒకనిగా చూసుకోమంటున్నావు. అయితే రా" అంటూ అప్పయ్య చేతిని పట్టుకొని బరబరా బోగీ లోని టాయ్ లెట్ లోకి లాక్కెళ్ళి బొడ్లో దోపుకొన్న పమిటను తొలగించి ఎదరే నిలబడి "రారా...అప్పన్నా! నీలో సెలరేగి సెగలు కక్కుతున్న ఆ కామ దాహాన్ని తీర్చుకో"అంటూ స్థానువుగా నిలుచుండి పోయింది చుక్కమ్మ.

చుక్కమ్మ మాటలు చెంప చెల్లుమనిపించినట్లయయ్యింది అప్పయ్యకు. ఆ దెబ్బతో క్షణాల మీద కైపు దిగిపోయింది. నిద్రనుంచి దిగ్గున లేచిన వాడిలా కళ్ళు నులుపుకొని చుక్కమ్మ లోకి సూటిగా చూశాడు. అప్పుడు అప్పయ్యకు సంవత్సరం క్రితం అక్కడే లారీ ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకొని అర్థనగ్నంగా, అనాధ శవంగా రోడ్డు మీద పడి వున్న తన చెల్లెలు లక్ష్మీ యెద మీది పమిటను తను సర్ది కప్పిన దృశ్యం తన కళ్ళ ముందు కదలాడింది. ఇంకేం మాట్లాడకుండ చుక్కమ్మ పమిటను ఆమె ఎదపై కప్పి అప్పటికే తన కళ్ళనుంచి కారి పోతున్నకన్నీళ్ళను తుడుచు కొంటూ టాయ్ లెట్ డోరు తెరచుకొని గబగబా నడుచుకొంటూ వెళ్ళి పోతుంటే...పమిటను బాగా సర్దుకొని బోగీ లోంచి బయటి కొచ్చి అప్పయ్య వేపే చూస్తూ నిలబడ్డ చుక్కమ్మకు కళ్ళమ్మట కన్నీళ్ళు కారిపోతుంటే తుడుచుకొంటూ అడుగు తీసి ముందుకు వేయబోయింది.

అంతలో...

"ఏయ్ చుక్కా! తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా!...అదేం కుదరదు. నా మామూలు నాకిచ్చీ మరీ వెళ్ళు “అంటూ కాబూలి వాలా మాటల ధోరణి తో చేయి చాచి నిల బడ్డాడు పోలీసు రాములు.

"ఇందా తీసుకో “అంటూ అలవాటు ప్రకారం యాంత్రికంగా ఓ నలిగిన ఇరవై రూపాయల నోటును బొడ్లో నుంచి తీసి పోలీసు రాములు చేతిలో వుంచింది చుక్కమ్మ.

కానీ,తన మనసేమో...

మనిషిని మనిషిగా చూడలేని, జాలి, దయలకు అర్థం తెలియని, పడుపు వృత్తితో పొట్ట పోసుకొంటున్న తన వద్ద పావలా డబ్బుకు కక్కుర్తి పడే ఈ నిర్థాక్షీణ్యపు పోలీసు రాములుతో---

అంతకు ముందే ఆమె ద్వారా కనువిప్పు కలిగి తల్లి చెల్లి అన్న పదాలకు అర్థం తెలుసుకొని మహా మనీషిగా మారి పోయిన అప్పయ్యను పోల్చుకొని పిచ్చిగా నవ్వుకొంటూ మర్రిచెట్టు వద్దకు నడిచింది చుక్కమ్మ…

మరిన్ని కథలు

Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని
Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు