వైవిధ్యం - మౌద్గల్య

vaividyam telugu story

అప్పుడే సినిమా సక్సెస్ మీట్ పూర్తయింది. దర్శకుడు సునీల్ కార్యక్రమం పూర్తికాగానే తన కోసం ప్రత్యేకంగా ఎదురుచూస్తున్న విలేకరి దగ్గర ఆగాడు.

అతనేదో ప్రశ్న వేశాడు. సునీల్ కి అదేమిటో అర్థం కాక మరోసారి అడగమని కోరాడు.

‘‘సర్... మీ చిత్రం వైవిధ్యంగా నిర్మించామని చెప్పారు. ప్రారంభోత్సవానికి ముందూ, ఆ తర్వాత కూడా... కానీ మీ సినిమాలో కొత్తదనం లేదు. ఒక్క బలమయిన సన్నివేశం లేదు. ఐదు పాటలు, మూడు ఫైట్లతో రొటీన్ ఫార్ములా సినిమా తీశారు. పోనీ, పాటలు, బ్యాగ్రౌండ్ సంగీతం ఏమయినా ఆకట్టుకుందా అంటే అదీ లేదు. ప్రేక్షకుల్ని కట్టిపడేద్దామన్న ఆలోచన లేకుండా రీళ్లు చుట్టిపడేసారనిపిస్తోంది.’’

తను చెబుతున్నది దర్శకుడు సీరియస్ గా వింటున్న భావం కలిగింది అతనికి... మళ్లీ చెప్పటం కొనసాగించాడు.

‘‘మొదటి రోజు ఉదయం ఆట నుంచి జనం లేరు. వారం తర్వాత థియేటర్లలో ఈ సినిమా ఉంటుందన్న నమ్మకం కుదరటం లేదు... మీరేమో సినిమా విజయోత్సవ సభ నిర్వహించి... ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని అంటున్నారు. మీతో పాటు చిత్ర నిర్మాత, దర్శకుడు, చివరకు హీరోయిన్ కూడా వంత పాడారు. ఏమిటిదంతా...’’ ఆవేశంగా అడిగాడు.

ఆ కుర్రాడి ఉత్సాహం చూసి సునీల్ కి ముచ్చటేసింది.

ఇంతకు ముందు అతను చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో జయాపజయాలు రెండూ ఉన్నాయి. అయితే... మునుపు ఎవరూ తనను ఇంత సూటిగా ప్రశ్నించింది లేదు.

‘‘సినిమా విలేకరిగా కొత్తగా ఉద్యోగంలో చేరావా?’’ అడిగాడు.

‘‘అవును’’... తలూపుతూ అతను చెప్పాడు.

సునీల్ కూల్ గా సమాధానం చెప్పటం మొదలుపెట్టాడు.

‘‘ప్రతి సినిమా ప్రారంభానికి ముందు మేం ఇదే చెబుతాం. ప్రతిష్ఠాత్మక చిత్రం తీస్తున్నామని ప్రకటిస్తాం... ఇంతకు ముందెప్పుడు తెలుగు తెరపైన చూడని చిత్రం. స్క్రి ప్టు పైన రచయితలు ఏడాదిపైగా కూర్చుని తయారు చేశారంటాం. నిర్మాత మనసు ఉప్పొంగుతుంది. ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరుగుతుంది.’’

మధ్యమధ్యలో తలాడిస్తూ దర్శకుడు చెప్పేది శ్రద్దగా వినసాగాడు అతను.

‘‘సినిమా నిర్మాణ సమయంలోనూ హీరోహీరోయిన్లచేత ఇవే చిలకపలుకులు పలికిస్తాం. బయ్యర్లలో పోటీ పెరుగుతుంది. సంగీతానికి మంచి బ్రేక్ వచ్చిందని, ఇబ్బడిముబ్బడిగా క్యాసెట్లు అమ్ముడయ్యాయని చెబుతాం... నిర్మాత ఖర్చుకు అంగీకరిస్తే మరో కార్యక్రమం కూడా పెడతాం... పేరున్న దర్శక, నిర్మాతలను పిలిపించి పొగిడిస్తాం. పోస్టర్లలోనూ, ప్రచారంలోనూ ఆడవాళ్లను, యూత్ ని ఆకర్షించేందుకు చూస్తాం."

విలేకరికి ఇదంతా అర్ధమయి, కానట్టుగా ఉంది.

...ఇదంతా దేనికి? లక్షలు ఖర్చు పెట్టిన నిర్మాతకి, సినిమా కొనుక్కున్న బయ్యర్లకి నాలుగు రాళ్లు మిగల్చటానికే’’ అరటిపండు వలిచిపెట్టినట్టు చెప్పి...

ఆ తర్వాత విలేకరి భుజం తట్టి ‘‘డిన్నర్ చేసి వెళ్లటం మరిచిపోకు’’ అని నవ్వుకంటూ వెళ్లిపోయాడు.

దర్శకుడు అటు వెళ్లగానే అతను...

మిగిలిన వాళ్లందరితో కలసి సుష్టుగా భోజనం చేశాడు. ఫుల్ గా మందు కొట్టాడు.

ఆ తర్వాత సినిమా నిర్మాతల తరఫు వారందించిన కవరు సంతోషంగా అందుకున్నాడు. అందులో తళతళమెరుస్తున్న వెయ్యి నోట్లు ఊరిస్తూ కనిపించాయి.

కార్యక్రమం నుంచి తిరిగి రాగానే...

‘‘వైవిధ్యమయిన కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నిర్మాత, దర్శకులు పూర్తిగా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు... అంటూ మొదలుపెట్టి... చిత్రాన్ని పొగుడుతూ పత్రికకి కథనం పంపాడు.

మరుసటి రోజు అది రంగుల చిత్రాలతో అందంగా అచ్చయింది.

దర్శక, నిర్మాత లిద్దరూ ఫోన్ చేసి విలేకరిని అభినందించారు. ఉబ్బితబ్బిబ్బయిపోయాడతను.

**** **** **** ****

మరో నాల్రోజులకి ఆ చిత్రం నగరంలోని ఏ థియేటర్లలోనూ కనిపించలేదు. భారీ నష్టాలొచ్చాయి.

అప్పుడు గుర్తొ చ్చాడు ఆ విలేకరి సునీల్ కి.

ఆ రోజు అతను వేసిన ప్రశ్నలకు తెలివిగా సమాధానం చెప్పాననుకున్నాడే గానీ... అందులోని వాస్తవాన్ని తను గ్రహించలేదు.

‘‘ప్రేక్షకులు చాలా తెలివయిన వారు. దర్శక నిర్మాతలు చెప్పే కాకమ్మ కథల్ని ఎంత మాత్రం నమ్మరు. వారి మాటల్లో చిత్తశుద్ది లేకపోతే... అదే చిత్రంలో వైవిధ్యం లేకపోతే... ఇట్టే గ్రహిస్తారు. చిత్రాన్ని థియేటర్ల నుంచి తరిమికొడతారు’’

భారంగా నిట్టూరుస్తూ అనుకున్నాడు దర్శకుడు సునీల్.

మరిన్ని కథలు

Chadastam
చాదస్తం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Akrandana
ఆక్రందన
- జి.ఆర్.భాస్కర బాబు
Eeroju pandaga
ఈ రోజు పండగ
- Sreerekha Bakaraju
Ide naa Ugadhi
ఇదే నాఉగాది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Amma nerpina sadgunam
అమ్మ నేర్పిన సద్గుణం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kaay kaay
కాయ్.. కాయ్ ( కథ )
- హరి వెంకట రమణ
Tana daakaa vaste
తనదాకా వస్తే..!
- - బోగా పురుషోత్తం
Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati