దయ్యం వలచిన రాత్రి - తిరుమలశ్రీ

dayyam valachina raathri telugu story

రాత్రి పది గంటలవుతుంది... అమావాస్య చీకటి కాటుకలా చిక్కగా, దుష్టుడి మనసులా నల్లగా అలముకుంది. శీతాకాలమేమో, గ్రామం సందకడనే చీకటి దుప్పటి కప్పేసుకోవడంతో గ్రామస్థులంతా చలికి ముసుగులుదన్ని నిద్రాదేవి ఒళ్ళో వెచ్చగా ఒరిగిపోయారు.

ఊరికి ఉత్తరాన ఉన్న చింతతోపులో చెట్లు దయ్యాలలా తలలు విరబోసుకుని గాలికి భయంకరంగా ఊగుతున్నాయి. దట్టంగా నిండుకున్న చీకట్లో కీచురాళ్ళ ధ్వనులు, తీతువు పిట్టల కూతలు, గాలి వేసే ఊళలు, ఏవేవో వింత శబ్దాలు, స్వైరవిహారం చేస్తూన్న మిణుగురు పురుగుల మెరపు కాంతులూ తప్ప గుండెలు అవిసే నిశ్శబ్దం ఆవహించుకుంది. వాచ్ టవర్స్ నుండి కనిపెడుతూన్న పహరాగాళ్ళలా చెట్లమీదున్న గుడ్లగూబల కళ్ళు టార్చ్ లైట్సులా చీకట్లో వెలుగుతున్నాయి.

అదే సమయంలో - తెల్లటి చీరలో ఉన్న ఓ స్త్రీ ఆకారం ఆ చింతతోపులో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒంటరిగా తిరుగాడుతోంది. ఆమెను చూసి కాబోలు, ఓ చెట్టు మొదట్లో మూడంకె వేసుకుని పడుకున్న కుక్క ఒకటి మొరిగింది. తరువాత ఎవరో పోయినట్టు మోర పైకెత్తి ఏడ్పు లంకించుకుంది. చెట్ల మీద ప్రశాంతంగా నిద్రిస్తూన్న పక్షులలో ఓ క్షణం కలకలం రేగింది. కుక్క పడుకున్న చోటు నుండి కదలకుండా ఏడుస్తూనే ఉంది.

హఠాత్తుగా నిల్చుండిపోయింది ఆ స్త్రీ. కట్టెదుట ప్రత్యక్షమైన ఆకారాన్ని చూడడంతో ’కెవ్వు’న అరచి తెలివితప్పి దబ్బున నేలపైన పడిపోయింది...

**** **** **** ****

"దయ్యాలు, భూతాలు... నాన్సెన్స్! అదంతా మన చిత్తభ్రమ. మన మనసులోని భయాలే దయ్యాలై మనల్ని భయపెడుతూంటాయి," అన్నాడు నాయుడు గారి బుల్లెబ్బాయి. "లోకంలో మనిషిని మించిన దయ్యం ఎక్కడుంటుంది!"

బుల్లెబ్బాయికి ఇరవయ్యేళ్ళుంటాయి. హ్యాండ్సమ్ గా ఉంటాడు. పల్లెలో పుట్టి పల్లెలో పెరిగిన పదహారణాల రైతు బిడ్డ. కాని, పల్లె ప్రజలలో ఉండే మూఢనమ్మకాలకు దూరం. చిన్నప్పట్నుంచీ దయ్యాల కబుర్లు, కథలూ వింటూ పెరిగినా... వాటి మీద నమ్మకంలేదు అతనికి.

"ఒకవేళ నిజంగానే నీకు దయ్యం ఎదురైతే ఏం చేస్తావ్?" అడిగాడు కృష్ణ.

"దాని పుట్టుపూర్వోత్తరాలు కనుక్కుంటాను" అన్నాడు బుల్లెబ్బాయి.

"అంత మొనగాడివా?" వెటకారంగా అడిగాడు ఎర్రియ్య.

"దయ్యమనేదే ఉంటే, పంపించి చూడు. దానితో ఆడుకుని నేనెంతటి మొనగాణ్ణో దానికే చూపిస్తాను" నవ్వాడు బుల్లెబ్బాయి. "ఐతే నీకు దయ్యాలంటే అసలు భయం లేదంటావ్?" రెట్టించాడు రాములు.

"దయ్యాలంటే భయమే కాదు, వాటి ఉనికి మీద నాకు నమ్మకం కూడా లేదు" దృఢంగా అన్నాడు బుల్లెబ్బాయి.

ముఖాలు చూసుకున్నారు మిత్రులు ముగ్గురూ. ఆ నలుగురూ ఇంచుమించు ఒకే వయసువాళ్ళే. చిన్నప్పట్నుంచీ ఆడుతూ పాడుతూ కలసి పెరిగినవాళ్ళే. గ్రామంలో ఉన్న బళ్ళో పదో తరగతి వరకు చదువుకుని, పై చదువులు చదివితే మాత్రం ఉద్యోగాలు దొరుకుతున్నాయా ఏమిటీ అనుకుని, తండ్రుల వ్యవసాయంలో సాయం చేయసాగారు.

ఇంతకూ వారి దయ్యాల సంభాషణకు మూలం ఏమిటంటే...

కాలక్షేపం కోసం కథల పుస్తకాలు చదవడం అలవాటు ఆ మిత్రులకు. క్రైమ్ కథలంటే మరీ ఇష్టం. సమీపంలోని టౌన్ కు వెళ్ళినప్పుడల్లా ఎవరికి కనిపించిన పత్రికలు వారు తీసుకొస్తూంటారు. వాటిని తమ మధ్య సర్క్యులేట్ చేసుకుంటూంటారు.

రెండు రోజుల క్రితం ఎరువులు కొనడానికి టౌన్ కు వెళ్ళిన ఎర్రియ్య స్టాండ్స్ లో ఓ కొత్త పత్రికను చూడడం జరిగింది. ఓసారి దాన్ని తిరగేసి చూసి వెంటనే కొనేసాడు... అందులోని కథలు, బొమ్మలు ఆకట్టుకోవడంతో రెండు రోజుల్లోనే దాన్ని చదవడం పూర్తిచేసేసారు ఎర్రియ్య, కృష్ణుడు, రాములూను. తరువాత వాళ్ళు దాని గురించే చర్చించుకుంటూంటే బుల్లెబ్బాయి అక్కడకు రావడం జరిగింది.

"దీని మీద భయానక మాసపత్రిక అని రాసుంది. అంత భయానకంగా ఉంటుందా?" సాశ్చర్యంగా అడిగాడు బుల్లెబ్బాయి.

"చదివి చూడు" అన్నాడు ఎర్రియ్య.

బుల్లెబ్బాయి పత్రిక తిరగేసి, "దీన్నిండా దయ్యాలు భూతాలే కనిపిస్తున్నాయి!" అన్నాడు నవ్వుతూ.

"నేరాలు ఘోరాలు కూడాను" అన్నాడు రాములు.

ఆ విధంగా మిత్రుల సంభాషణ ’అసలు దయ్యాలనేవి ఉన్నాయా లేవా?’ అన్న విషయంపైకి దారి తీసింది. పత్రిక చదువు. నీకే తెలుస్తుంది" అన్నారు వాళ్ళు. కథలు వేరు, కఠిన సత్యాలు వేరూనన్నాడు అతను. చినికి చినికి గాలివాన ఐనట్టు, వారి వాదం పందాల వరకు దారి తీసింది.

"మన ఊరి బైటున్న చింతతోపులో దయ్యాలు తిరుగుతున్నాయంటారు. అప్పుడప్పుడు రాత్రులు మన గ్రామంలో ఎందరికో అవి కనిపించిన దాఖలాలు ఉన్నాయి" అన్నాడు కృష్ణ.

"అవన్నీ నీడల్ని చూసి జడుసుకునే కేసులు. నేను నమ్మను" అంటూ కొట్టిపారేసాడు బుల్లెబ్బాయి.

"సరే. మనం ఓ పందెం వేసుకుందాం... రాబోయే అమావాస్యనాటి రాత్రంతా చింతతోపులో ఒంటరిగా గడపాలి నువ్వు. అప్పుడే నీకు నిజంగానే దయ్యాలంటే భయం లేదని నమ్ముతాం" అంటూ సవాలు విసిరాడు రాములు.

"తప్పకుండా. దయ్యం కనిపించాలే కాని, దానితో ఓ ఆటాడుకోనూ?" అన్నాడు బుల్లెబ్బాయి నవ్వుతూ.

"పరిహాసానికి పోయి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దురా, బుల్లెబ్బాయ్!" హెచ్చరించాడు ఎర్రియ్య.

"నో ప్రోబ్లెమ్. పందెం ఏమిటో చెప్పండి" అన్నాడు బుల్లెబ్బాయి.

"నువ్వు నిజంగానే అమావాస్యనాటి రాత్రంతా చింతతోపులో గడిపి వచ్చావంటే... ’మగధీర’ బిరుదుతో నిన్ను సత్కరిస్తాం" అన్నాడు ఎర్రియ్య.

"నాకు బిరుదులొద్దు. పందెంలో నేను గెలిస్తే మీరు ముగ్గురూ మా పొలంలో వారమేసి రోజులు పనిచేయాలి. మీరు గెలిస్తే నేను మీ పొలాలలో పనిచేస్తాను" చెప్పాడు బుల్లెబ్బాయి.

మిగతావారు ముఖాలు చూసుకుని, ’సరే’ నన్నారు.

**** **** **** ****

ఆ రోజు ఆదివారం. బహుళ అమావాస్య. చీకటికి భయపడి కాబోలు చంద్రుడు అంబరంలో అడుగుపెట్టలేదు. నెలరేడును కానక బిక్కు బిక్కు మంటున్నాయి నక్షత్రాలు.

చింతతోపు చీకట్లో జలకాలాడుతోంది. దూరంగా ఉన్న గోదావరి మీంచి వీస్తూన్న గాలి హోరు జోరు పెరగడంతో దయ్యాల్లా నిల్చున్న చింత చెట్లు పూనకం వచ్చినట్టు తలలు ఊపుతున్నాయి. కీచురాళ్ళు సంగీతం పాడుతూంటే... లయగా గాలి ఈల వేస్తూంటే... మిణుగురు పురుగులు ఫ్లయింగ్ సాసర్స్ లా ఎగురుతూ చీకటికి వెలుగు చూపడానికి వృథా ప్రయాస పడుతూంటే... నిశ్శబ్దం తోపును ఏలుతూంటే... చెట్ల మీది గుడ్లగూబలు టార్చ్ లైట్స్ లాంటి కనుగ్రుడ్లతో చూస్తూ ఉండి ఉండి అరుస్తూంటే... అక్కడి వాతావరణం భయానకంగా ఎంతటి ధైర్యవంతుడికైనా గుండెలు అవిసేలా ఉంది.

రాత్రి పది గంటలకు - ఆ చింతతోపులో అడుగుపెట్టాడు బుల్లెబ్బాయి. చేతిలో పెన్ టార్చ్ ఉంది. ఆ వాతావణం చూస్తే ఓ క్షణం ఏదో భీతి కలిగింది అతనికి... పెన్ టార్చ్ గ్రుడ్డి వెల్తురులో తోపంతా తిరిగివచ్చాడు.

ఓ చింతచెట్టు క్రింద కూర్చూంటూంటే, ఆ సాయంత్రం ఎర్రియ్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి -'ఒరేయ్! దయ్యాలు చింతచెట్ల మీదే ఉంటాయి. నువ్వు వెళ్తున్నది చింతతోపుకు. ఎందుకైనా మంచిది, ఇంకోసారి ఆలోచించుకోరా’ అన్నాడు... చిన్నగా నవ్వుకున్నాడు.

అంతలో ఎక్కణ్ణుంచో కుక్క మొరుగుడు, ఆ తరువాత ఏడ్పూ, పక్షుల కలవరం వినవచ్చాయి.

ఉన్నట్టుండి ’కెవ్వు’మన్న స్త్రీ కేక వినిపించడంతో అదరిపడ్డాడు బుల్లెబ్బాయి. చటుక్కున లేచి నిల్చున్నాడు. కేక పెట్టింది ఎవరో, ఎటువైపునుండి వచ్చిందో తెలియలేదు. "ఎవరదీ? ఏమయింది?" అంటూ తోచిన దిశగా అడుగులు వేసాడు. నాలుగు అడుగులు వేసేసరికి ఎవరో కొట్టినట్టు చేతిలోని పెన్ టార్చ్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. దాంతో ఆ గ్రుడ్డి వెలుతురు కూడా లేకుండాపోయింది.

కాసేపు ఆ చీకట్లో గ్రుడ్డివాడిలా తడుముకుంటూ దిరిగాడు. ఎవరూ కనిపించలేదు…

ఈరీ సౌండ్స్ కు తోడు, కుక్క ఆగి ఆగి ఏడుస్తోంది.

అదే సమయంలో - ఎక్కడినుండో అడుగుల శబ్దం వినవచ్చింది.

ఆగి, చెవులు రిక్కించాడు. చప్పుడు ఆగిపోయింది.

మళ్ళీ ముందుకు సాగాడు. రెండడుగులు వేసాడో లేదో, పాదాల చప్పుడు మళ్ళీ వినవచ్చింది.

తన నెవరో వెంబడిస్తున్నారనిపించింది. నిశ్శబ్దంగా అటువైపు నడిచాడు. కొన్ని అడుగుల దూరం వెళ్ళేసరికి తెల్లటి ఆకారం ఒకటి చీకట్లో కదలుతున్నట్లనిపించింది.

"ఎవరదీ?" అంటూ అటువైపు వెళ్ళాడు. ఆకారం ఓ చెట్టు వెనుక అదృశ్యమైపోయింది.

కళ్ళు చించుకుని చుట్టూ పరికించాడు. ఎవరూ కనిపించలేదు.

అంతలో చేరువలో ఉన్న పొద దగ్గర చప్పుడయింది. అటువైపు గెంతాడు. ఎవరూ కనిపించలేదు కాని... చప్పుడునుబట్టి పెద్ద సర్పం ఒకటి తన కాళ్ళ దగ్గర నుండి జరజరా ప్రాక్కుంటూ వెళ్ళిపోతున్నట్టు గ్రహించాడు. ఒళ్ళు జలదరించింది. ఓ క్షణం అక్కడే నిలబడిపోయి, తిరుగు ముఖం పట్టాడు.

అదిగో, అప్పుడే... అల్లంత దూరంలో ప్రత్యక్షమయింది తెల్లటి ఆకారం.

ఈసారి నిశ్శబ్దంగా అటువైపు నడిచాడు. ఆకారాన్ని సమీపించాక, అది తెల్ల చీరలో ఉన్న స్త్రీగా గ్రహించాడు. ’ఆ వేళప్పుడు ఆ నిర్జన ప్రదేశంలో ఆడమనిషి ఎలా వచ్చింది!? ఆమె మనిషేనా? లేక, అందరూ చెబుతూన్న దయ్యమా??’ అన్న తలంపు కలగడంతో... తెలియకుండానే అతని గుండె ఓ బీట్ ని మిస్ చేసింది.

ఆమె అతన్ని చూసినట్టు లేదు. మెల్లగా నడచుకుంటూ వెళ్తోంది. చప్పుడు చేయకుండా అనుసరించాడు... చెట్టు పక్కగా వెళ్ళి నిల్చుంది ఆమె.

వెనుకగా వెళ్ళి నిల్చున్నాడు బుల్లెబ్బాయి. సెంటు వాసన అతని ముక్కుపుటాలను సోకింది. "ఎవరు నువ్వు?" అన్నాడు. ఉలికిపడి గిర్రున అతని వైపు తిరిగింది ఆమె.

చీకట్లో ముఖం స్పష్టంగా కనిపించడంలేదు. "ఎవరు నువ్వు?" సాశ్చర్యంగా అడిగాడు మళ్ళీ.

సమాధానంగా మంజులహాసం ఒకటి సన్నగా వినిపించింది. గిర్రున వెనుదిరిగి ముందుకు నడచిందామె. అతను విస్తుపోతూ అనుసరించాడు. దట్టంగా ఉన్న ఓ పొదరింటి వద్ద హఠాత్తుగా ఆగింది. చటుక్కున అతని వైపు తిరిగి గాఢంగా కౌగలించుకుంది.

బుల్లెబ్బాయి తెల్లబోయాడు. ఆమె లతలా తనకు అల్లుకుపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆమె ఒంటి నుండి వస్తూన్న సుగంధాలు మదికి ఆహ్లాదం కలిగిస్తూంటే... ఆమె మృదు స్పర్శ, బిగి కౌగిలి, వేడి చుంబనాలు మత్తుకు గురిచేసాయి. ఆమె పరువాలు తనను ఆర్తిగా హత్తుకుంటూంటే, వేడిగా కాలిపోతూన్న ఆమె దేహం... అతని శరీరంలో విద్యుత్ షాక్ ను కలిగించింది. అతనిలో కోర్కె కోడెనాగులా చివాలున తల ఎత్తింది.

'ఎవరీమె? మనిషా, తన మిత్రులు చెప్పిన మోహినీపిశాచా?...’ అతని సందేహాలకు జవాబులు లేవు. మెత్తగా ఒత్తుకుంటూన్న ఆమె మేని స్పర్శతో రగిలిన మొగలిపొదలా అతని యవ్వనం బుసలు కొట్టింది.

క్షణ క్షణానికీ ఉధృతమౌతూన్న కాంక్షతో ఆమెను తన బిగి కౌగిట్లో బిగించి ఆమె ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు. ఆమె అధరాలను తన అధరాలతో పరామర్శించాడు. ఆమె కంఠాన్ని వెచ్చటి పెదవులతో రాస్తూ ఆమెలో అగ్ని రగిలించాడు. తమకంతో అతని వక్షానికి హత్తుకుపోయిందామె...

మృదువుగా ఆమెను నేలపైన పూదీవెలలో పరుండబెట్టాడు. ఆ తరువాత వారి నడుమ కాలం స్థంభించిపోయింది!

**** **** **** ****

బాలభానుడు లేత కిరణాలతో గ్రామానికి మేలుకొలుపు పలుకుతున్నాడు...

మిత్రులు వచ్చి లేపేంతవరకు బుల్లెబ్బాయికి మెలకువ రానేలేదు. రాత్రి ఎక్కడ పడుకున్నాడో అక్కడే తీగలపైన పడుకునియున్నాడు ఒంటరిగా.

బుల్లెబ్బాయిని ప్రాణాలతో చూడడంతో మిత్రబృందానికి ప్రాణాలు కుదుటబడ్డాయి.

"నేనెక్కడున్నాను?" అడిగాడు బుల్లెబ్బాయి కన్నులు నులుముకుని చూస్తూ.

"చింతతోపులో" అని జవాబిచ్చారు.

ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ, "ఆమె ఎక్కడా?" అనడిగాడు.

"ఎవరూ?" సాశ్చర్యంగా అడిగింది మిత్రబృందం.

"రాత్రి నాతో గడిపిన యువతి" చెప్పాడు బుల్లెబ్బాయి, మెరిసే కళ్ళతో.

"నీకు...దయ్యం కనిపించిందా!?" ముగ్గురూ ఒకేసారి అడిగారు ఉత్కంఠతో.

"దయ్యమా? లేదే!" "మరి, యువతి ఎవరు?" "ఆమె...ఓ శృంగార దేవత!"

"దాన్నే దయ్యాల భాషలో మోహినీపిశాచి అంటారు బాబూ!" అన్నాడు రాములు.

"చ ఛఁ, రాత్రంతా నాకు స్వర్గ సౌఖ్యాలను చవిచూపిన ఆ యువతిని దయ్యం అనడానికి మీకు నోరెలా వచ్చిందిరా? ఆమే మనలాగే మనిషి!" అన్నాడు బుల్లెబ్బాయి. ముఖాలు చూసుకున్నారు వాళ్ళు... రాత్రి తన అనుభవం గూర్చి విపులంగా చెప్పాడు బుల్లెబ్బాయి. ఆశ్చర్యపోయారంతా.

ఎర్రియ్య సైగ నందుకున్న కృష్ణ వెళ్ళి, చెట్టు చాటున నిల్చున్న ఓ యువతిని వెంటబెట్టుకొచ్చాడు. తెల్లగా, పొట్టిగా ఉందామె. కొంచెం ఒళ్ళుంది. తెల్ల చీర కట్టుకుంది.

"రాత్రి నీతో గడిపిన యువతి ఈమేనా?" అడిగాడు ఎర్రియ్య.

బుల్లెబ్బాయి ఆమె వంక ఎగాదిగా చూసి తల అడ్డుగా త్రిప్పాడు. "ఆమె స్లిమ్ గా, పొడవుగా, నాజూకుగా ఉంటుంది" అన్నాడు. "ఈమె ఎవరు?" మిత్రులు చెప్పింది ఆలకించి మిక్కిలి ఆశ్చర్యపోయాడతను...

’బుల్లెబ్బాయి గుండె ధైర్యాన్ని బాగా ఎరుగుదురు అతని మిత్రులు. పందెంలో అతను గెలిచినట్లైతే తామంతా అతని పొలంలో పనిచేయాల్సి ఉంటుంది. చింతతోపులోని దయ్యం ఎప్పుడు పడితే అప్పుడు కనిపించకపోవచ్చును. ఒకవేళ ఆరోజు బుల్లెబ్బాయికి దయ్యం కనిపించకపోతే అతను పందెం గెలవడం ఖాయం. అందుకే ఎందుకైనా మంచిదని, పక్క ఊరి నుంచి నాటకాలు వేసే శకుంతలను తీసుకువచ్చారు దయ్యం వేషం వేయడానికి! ఆ వేళప్పుడు చింతతోపులోకి వెళ్ళడానికి మొదట ఆమె ఒప్పుకోలేదు. తాము ఆమె వెనుకే నీడలా ఉంటామని హామీ ఇవ్వడంతో, దయ్యం వేషంలో ఓ గంటసేపు చింతతోపులో తిరగడానికి ఒప్పుకుంది... కాసేపటికే ఆమెకు నిజం దయ్యం కనపడడంతో భయంతో వెర్రికేక పెట్టి స్పృహతప్పి పడిపోయింది. ఆమె కేకతో జడుసుకున్న మిత్రత్రయం అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించింది... తెల్లవారాక వచ్చి చూస్తే, పడున్న శకుంతల కనిపించింది. ఆమెను లేపి విషయం అడిగితే, రాత్రి తనకు దయ్యం ఎదురయిందని చెప్పింది...’

"నేను చూసిన దయ్యం అచ్చు మీరు వర్ణించినట్టే ఉంది" అంది శకుంతల బుల్లెబ్బాయితో, భయంతో గుండెలపైన చేయి వేసుకుంటూ.

"అంటే...రాత్రి నాతో గడిపింది...?!" తెల్లబోయాడు అతను. అతని మదిలో ’ఆమె’ రూపం మెదిలింది... తెల్ల చీర, విరబోసుకున్న కురులు, అడుగులో అడుగు వేసుకుంటూ ఆ నడక... తపనతో తనను కౌగలించుకున్న తీరు...! ఆ వేళప్పుడు అటువంటి నిర్జన ప్రదేశంలో ఏ సామాన్య స్త్రీ ఐనా ఒంటరిగా తిరుగాడుతుందా!?

అతని శరీరం భయంతో సన్నటి కంపనకు గురయింది. "ఐతే, అది... దయ్యమేనంటారా?" అన్నాడు.

"నిస్సందేహంగా! వయసులో ఉన్నవాళ్ళు ఒంటరిగా కనపడితే మోహినీపిశాచాలు వెంటపడతాయట. మానవకాంతలుగా మారి తమ కోర్కెలను తీర్చుకుంటాయట" అన్నాడు ఎర్రియ్య.

"నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇంకా ప్రాణాలతో ఉన్నావు. సాధారణంగా దయ్యాలతో రమించిన వారెవరూ బ్రతికుండరని విన్నాను" అన్నాడు కృష్ణ రిలీఫ్ గా.

అంతటి ధైర్యవంతుడికీ గుండె ఝళ్ళుమంది బుల్లెబ్బాయికి.

"ఇప్పటికైనా ఒప్పుకుంటావా దయ్యాలున్నాయని?" నవ్వాడు రాములు.

"ఒప్పుకోవాలనే ఉంది. కాని, ఎందుకో ఆమె మనిషి కాదంటే నా మనసు అంగీకరించడంలేదురా" అన్నాడు బుల్లెబ్బాయి సాలోచనగా.

"పందెం ఎగ్గొట్టడానికి నాటకమాడకురోయ్!" అన్నాడు కృష్ణ.

"ఛ్, అదేం కాదురా. నిజంగానే ఎటూ డిసైడ్ కాలేకపోతున్నాను" నిజాయితీగా అన్నాడు బుల్లెబ్బాయి.

"ఒప్పుకోండి సార్. అది దయ్యమేననడానికి నేనే సాక్ష్యం కదా!" అంది శకుంతల నవ్వుతూ.

భుజాలు ఎగరవేసాడు అతను.

**** **** **** ****

నాయుడుగారి బుల్లెబ్బాయికి చింతతోపులో మోహినీపిశాచి కనిపించిందన్న వార్త మంత్రగాడు వేసిన సాంబ్రాణి ధూపంలా గ్రామ మంతటా గుప్పుమంది. అనవసరపు పందాలకుపోయి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకున్నందుకు కొడుకును తల వాచేలా చీవాట్లు పెట్టాడు నాయుడు.

అరవయ్యేళ్ళ ఆ ఊరి కరణం గారి పాతికేళ్ళ రెండో భార్య శేషారత్నం ఎర్రగా బుర్రగా నాజూకుగా ఉంటుంది. సోకులు చేస్తుంది. కరణం గారు పట్నం నుండి తెప్పించే ’పాయిజన్’ సెంటును వాడుతుంది.

బుల్లెబ్బాయికి మోహినీపిశాచి కనిపించిందన్న వార్త ఆలకించి గుంభనంగా నవ్వుకుంది శేషారత్నం.

’కోడె వయసుతో... కండలు తిరిగిన దండలతో... ఎన్నాళ్ళు ఊరించావురా కుర్రోడా! ఆ రోజు మీ మిత్రుల పందెం, నీలాటి రేవు నుండి వస్తూన్న నా చెవిన పడబట్టి కాని, లేకుంటే చిటారు కొమ్మను మిఠాయి పొట్లం లాగే మిగిలిపోయేవాడివి కదురా!... రాత్రి నా ఒళ్ళంతా హూనం చేసి మగాడి వనిపించుకున్నావు... ఆ మధురానుభూతినే తలచుకుంటూ మా ముసలాడితో జీవితమంతా గడిపేస్తాను...’ చెక్కిలిపైన చేయి వేసుకుని అద్దంలో చూసుకుంటూ తన్మయత్వంతో అనుకుంది ఆమె.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు