మూఢ నమ్మకం - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

mooda namakam telugu story

వాడిని చూస్తే రజనీ కడుపు తరుక్కు పోతోంది. మంచానికి అతుక్కు పోయి మగతలో వున్నాడు.

రెండు వారాల నుండి స్కూల్ కి వెళ్ళడం లేదు. డాక్టర్లు... మందులు ఇదే వాడి జీవితమైంది. ఇంతవరకు వాడికేమైందో ఎందుకలా అయిపోతున్నాడో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

బాబు పక్కనే కుర్చీలో కూర్చుని కునికి పాట్లు పడుతున్నాడు రఘు. ఆఫీసుకి అప్పుడప్పుడూ వెళ్ళి వస్తున్నాడు. పండు లాంటి కొడుకు. నిన్న మొన్నటి దాకా ముద్దులు మూటకడుతూ చిన్ని కృష్ణుడిలా ఇల్లంతా కలయ తిరిగి అల్లరి చేసిన వాడు... ఈరోజు ఇలా మంచం మీద పడుకునుంటే పనెలా చేయ బుద్ధవుతుంది? మూడు రోజులు హాస్పిటల్లో అడ్మిట్ కూడా చేశారు... కానీ ఏమీ లాభం లేకపోయింది. డాక్టర్ వాళ్ళ దగ్గరకొచ్చి "మీ అబ్బాయికి ప్రాబ్లం ఏమిటో అంతు బట్టడం లేదు. ఇక్కడ హాస్పిటల్లో ఎక్కువ కాలం వుంచడం వల్ల ఉపయోగం వుంటుందని నేను అనుకోవడం లేదు. పైగా ఖర్చులు. మీరు వాడిని ఇంటికి తీసుకుపోండి." అన్నాడు. పదునైన బాణం గుండెని తాకినట్టయింది. విల విల్లాడారు... బాబుని ఇంటికి తీసుకొచ్చేశారు. అప్పటినుండి ఇద్దరికీ జీవితం మీద అనాసక్తత. బ్రతకడానికింత తినడం... వాడిపక్కన భారమైన హృదయాలతో కూర్చోడం. చుట్టాలు... తెలిసిన వాళ్ళు వచ్చి... వాడి పరిస్థితికి జాలిపడడం పరామర్శించడం... ఇదే రొటీనయింది.

అలా రోజులు గడుస్తుంటే వచ్చింది ఆదెమ్మ. ఆదెమ్మ అంటే ఒకప్పటి వాళ్ళ పనిమనిషి. పెద్దావిడ... వాళ్ళకు మంచి చెడూ చెప్పేది. ఒకసారి అత్యవసర పనిమీద ఊరెళ్ళాలని చెప్పి తనకు రావలసింది తీసుకుని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడే రావడం. ఆవిడ్ని చూడగానే రజనీకి ప్రాణం లేచివచ్చింది. ఆవిడ్ని హత్తుకుని... వాడ్ని చూపిస్తూ హృదయ విదారకంగా రోదిస్తూ... జరిగిందంతా చెప్పింది. ఆవిడ సీరియస్ గా విని, "నాకు తెలిసి ఇది మందులకి లొంగదు. వాడు ఏదో తొక్కో... దాటో వుంటాడు. అందుకే అలా వున్నాడు." అంది.

"అంటే?"

"రోడ్డు మీద దిగదుడుపులుంటాయి... యధాపలంగా వాటిని తొక్కడమో... లేదా దాటడమో చేస్తే ఆ చెడు వాళ్ళ నుండి మనకి వస్తుంది." అంది.

"మరి... మరి... దీనికి విరుగుడు లేదా?" ఆశ ఆత్రుతగా అడిగించింది.

"ఎందుకులేదు..." అని ఆగి "ఆదివారం అర్ధరాత్రి జిల్లేడు ఆకుల్లో కాస్త అన్నం, పసుపు, సున్నం, ఎండు మిరపకాయలు, నిమ్మకాయలు, బొగ్గు ముక్కలు అన్నీ కలిపి బాబుకి దిష్టి తీసి నాలుగు రోడ్లు కలిసేచోట పడేసి వెనక్కి చూడకుండా రావాలి. అంతే నీ కొడుకు మామూలు పిల్లాడయిపోతాడు." లోగొంతుకతో చెప్పింది.

"అయితే రేపే ఆదివారం నువ్వు చెప్పినట్టే చేస్తాను. మా బాబు నాకు దక్కితే నీకు పట్టుచీరతో పాటు మంచి కానుక ఇస్తాను" అంది ఉద్విజ్ఞతతో.

ఆదివారం అర్ధరాత్రి.

రజని ఆదెమ్మ పర్యవేక్షణలో అన్నీ జిల్లేడు ఆకులతో సిద్ధం చేసుకుని భర్తతో స్కూటర్ మీద వెళ్ళి నాలుగు రోడ్ల కూడలిలో దాన్ని జాగ్రత్తగా ఎవరూ చూడకుండా జారవిడిచి ఇంటికొచ్చి స్నానం చేశారు.

**** **** **** ****

బాబు కోలుకున్నాడు. ముఖంలో మృత్యుకళ పోయి జీవం ఉట్టిపడుతోంది.

ఆ భార్యాభర్తల ఆనందానికి అవధిలేదు. పిళ్ళాడు దక్కడేమో అనుకున్నారు అలాంటిది మళ్ళీ పునర్జన్మలా కోలుకోవడం కలగా వుంది.

"ఆదెమ్మా! నువ్వు రాకపోతే మేము అన్యాయమైపోయే వాళ్ళం. నీ ఋణం తీర్చుకోలేము. ఆవిడకి మంచి చీరపెట్టి ఖరీదైన కానుకలతో సత్కరించారు.

"నేను మా చుట్టాలింటికి పెళ్ళికిక్కడికి వచ్చి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. నేను రావడం చాలా మంచిదయింది. ఇగ నే పోతా" అని వెళ్ళిపోయింది.

రోజులు ఆనందంగా కదిలిపోతున్నాయి.

ఒకరోజు -

"ఏవండీ! పార్వతి గారూ రోజూ సంచీలో ఏదో సర్దుకుని ఎక్కడికండి వెళుతున్నారు... బాగా ఆందోళనగా వుంటున్నారు కూడా" అంది రజని రెండిళ్ళవతల వుండే పార్వతిని పలకరిస్తూ.

"నా స్నేహితురాలి పిల్లాడికి బాగా లేదండి... లాస్ట్ టైం మీ బాబుకి వచ్చినట్టే హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఎన్ని హాస్పిటల్స్ తిప్పినా ఎంతమంది డాక్టర్లకి చూపించినా నయం కావడం లేదు. నేను వాళ్ళకి మీ అబ్బాయి పడిన బాధ గురించి చెప్పాను... తను మిమ్మల్ని ఏదన్నా సలహా అడగమంది. నేనే ఈ హడావుడిలో మర్చిపోయాను. వాళ్ళకే వండినవి తీసుకెళుతున్నాను. నేను కాస్త పెడితే తప్ప ఏవీ తినడం లేదు వాళ్ళు" అంది బాధగా.

"అయ్యో పిల్లాడికి ఒంట్లో బాగాలేదా... ఉండండి నేనూ వస్తాను." అని గబ గబ తయారయి పార్వతితో బయలు దేరింది. ఆటోలో ఆ ప్రదేశానికి వెళుతుంటే రజనీకి శరీరం లోని రక్తం ఇంకిపోయినట్టుగా అనిపించింది. అది ఆమె జిల్లేడు ఆకులు జారవిడిచిన నాలుగు రోడ్ల కూడలి ప్రదేశం.

దానికి కొద్ది దూరంలోనే వాళ్ళుంటున్నారు.

రజనీకి పూర్తిగా అర్ధమైపోయింది.

వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది. తమ బాబు లానే వాడు కూడా ఒళ్ళు తెలియని జ్వరంతో బాధ పడుతున్నాడు. "పాపం ఆడుతూ... ఆడుతూ వాడు దానిని దాటడమో... తొక్కడమో చేసుంటాడు. ఇప్పుడు భయంకరమైన బాధ అనుభవిస్తున్నాడు. "రజనీకి కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి. ఆ భార్యాభర్తలు వచ్చిన వాళ్లకి తమ బిడ్డని చూపిస్తూ తల్లడిల్లి పోతున్నారు.

'తనెంత తప్పు చేసింది? తన కన్నపేగుని కాపాడుకోవాలనుకుంది కాని మరో తల్లి కడుపు శోకానికి కారకులవుతోందనుకోలేదు' ఇప్పుడేం చేయాలి?. సమయానికి ఆదెమ్మ కూడా లేదు. ఎక్కడుందో తెలియదు. అయినా దానిమొహం దానికి ఇంకొకళ్ళకి అంటించడం తెలుసుగాని... వదిలించడం తెలుస్తుందనుకోను. "శ్రీ వెంకటేశ్వరా... నువ్వు ఈ పిల్లాడిని కాపాడితే నీకు నిలువుదోపిడీ సమర్పించుకుంటా... ఆ తల్లి తండ్రుల శోకాన్ని తీర్చగలవాడివి నువ్వే!" అని అప్పటి నుండి పశ్చాత్తాపంతో వాళ్ళ దగ్గిరే వుండి సహాయం చేసింది. తన భర్తకి కూడా విషయం చెప్పి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వాళ్ళకి పరిపూర్ణంగా సహకరించాలని కోరింది.

కొద్ది కాలంలోనే బాబు కోలుకోవడం చూసి వాడి తల్లితండ్రుల కన్నా తామే ఎక్కువగా మురిసిపోయారు. ఆ పిల్లాడు నిజంగా దాన్ని తొక్కడమో... దాటడమో చేసుంటే ఎలా మృత్యుముఖం నుండి బయటపడ్డాడు? అంటే అవన్నీ అభూత కల్పనలన్నమాట... మానసిక బలహీనతలన్నమాట. ఆదెమ్మ లాంటి వాళ్ళు ఇక్కడే తమ వశం చేసుకుంటారు. చదువుకున్న వాళ్లైన తామే ఈ ట్రాఫ్ లో పడిపోతే ఇంక ఊళ్లలో, మారుమూల గ్రామాల్లో వుండే నిరక్షరాస్యులు గుడ్డిగా నమ్మడంలో వింతేముంది? తమ పిల్లాడి అనారోగ్యానికి కారణం తెలియనంత మాత్రాన మూఢ నమ్మకాలవైపు మొగ్గడమేనా? ఎంత చదువుకున్నా దిష్టులు తీయడం, తాయెత్తులు కట్టించడం, బాబాలని నమ్మడం ఏమిటిదంతా?... ఇప్పటికీ ఆ బలహీన క్షణంలో తామెలా తప్పుదోవపట్టిందీ తలుచుకుని 'చదువు సంస్కారం వున్న తాము చేయదగ్గ పనేనా?' అనుకుంటారు. విజ్ఞానం ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో మూఢనమ్మకాలతో ఎంతగా దిగజారిపోయిందీ గుర్తుకొస్తుంటే సిగ్గుతో కుంచించుకు పోతారు.

**** **** **** ****

('తాము పచ్చగా వుంటే చాలు ఎవరేమయిపోతేనేం' అనే మనస్తత్వంతో మూఢాచారాలని నమ్మి మూర్ఖంగా నాలుగు రోడ్ల కూడళ్ళలో పెట్టుబడివుండే పదార్ధాలని చూసినప్పుడల్లా మనస్సు కలుక్కుమంటుంది. వాళ్ళ అజ్ఞానానికి, కుహనా సంస్కారానికీ ఓ మనిషిగా సిగ్గుపడుతూ రాసిన కథ ఇది)

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు